About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సుందరమైనకథలు-విలాసజీవితం

విలాసజీవితం
అంగారపర్ణుడు కథ
       పాండవులు బ్రాహ్మణ వేషాల్లో ఏకచక్రపురంలో నివసిస్తున్నారు. ఆ సమయంలో ద్రౌపదీ స్వయంవరం జరుగుతోందని, బ్రాహ్మణులకి దక్షిణలు బాగా ఇస్తున్నారని వేదపండితులు చెప్పుకుంటున్నారు.
   ఎక్కడకి వెళ్ళినా అదే మాట వినబడుతోంది. అందరూ పాంచాల దేశానికి రాజధాని అయిన కాంపిల్య నగరానికి వెళ్ళిపోతున్నారు. పాండవులకి కూడా ఆ స్వయంవరం చూడాలని ఉత్సాహం కలిగింది.
   కుంతీదేవి తన పిల్లల మనస్సు గ్రహించింది. కొడుకుల్ని పిలిచి నాయనలారా! ఇక్కడ ఇంకెంత కాలం ఇక్కడ ఉంటాము. పాంచలరాజు ధర్మప్రర్తన కలవాడని, బ్రాహ్మణులకి అడక్కుండానే దక్షిణలు ఎక్కువగా  ఇస్తున్నాడని చెప్పుకుంటున్నారు. అందరూ అక్కడికి వెడుతున్నారు. మనం కూడా పాంచాలదేశం వెళ్ళి కొంతకాలం అక్కడే గడుపుదాం! అంది. పాండవులు అందుకు సంతోషంగా అంగీకరించారు.
   పాండవులు అయిదుగురు తల్లి కుంతీదేవితో కలిసి ద్రౌపది స్వయంవరం చూడాలని వ్యాసమహర్షి ఆశీర్వాదం తీసుకుని బయల్దేరారు. రాత్రి పగలు కూడా ప్రయాణం చేస్తూ శ్రమ అనుకోకుండా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ వెడుతున్నారు.
   వెళ్ళేటప్పుడు దార్లో సోమశ్రవం అనే పేరుతో ప్రవహిస్తున్న గంగా నదిలో స్నానం చేసి వెళ్ళాలని అనుకున్నారు. కొంతదూరం ప్రయాణం చేసేసరికి బాగా చీకటిపడింది. దారి సరిగ్గా కనిపించక నడవడం కష్టమైపోయింది.
   ఆందరికీ దారి కనిపించడం కోసం మండుతున్న కొరివిని పట్టుకుని అర్జునుడు ముందు నడుస్తున్నాడు. ఆ వెలుగులో దారి చూసుకుంటూ అతడి వెనకాల మిగిలినవాళ్ళు వెడుతున్నారు. స్నానం చెయ్యాలనుకున్న ప్రదేశం చేరడం కోసం గంగానది ఒడ్డునే ప్రయాణం సాగిస్తున్నారు.
   ఆ సమయంలో అంగారపర్ణుడు అనే పేరుగల గంధర్వుడు తన భార్యతో కలిసి గంగానదిలో స్నానం చేస్తున్నాడు. పాండవులు నడుస్తున్నప్పుడు వస్తున్న  శబ్దాన్ని విన్నాడు అంగారపర్ణుడు. వెంటనే బాణాలు తీసుకుని వస్తున్న వాళ్ళకి అడ్డుగ నిలబడ్డాడు.
   అతణ్ణి చూసి ముందు నడుస్తున్న అర్జునుడు ఆగిపోయాడు. అతడు ఆగిపోగానే వెనుక నడుస్తున్న కుంతి, మిగిలిన పాండవులు కూడా ఏం జరిగిందోనని నడవడం ఆపి నిలబడిపోయారు.
   అలా నిలబడిన పాండవుల్ని చూసి అంగారపర్ణుడు సంధ్యాసమయం, అర్ధరాత్రి సమయం భూతాలు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు తిరిగే సమయం. ఈ రెండు వేళల్లోను ఎంత బలవంతులైనా, రాజులైనా సరే ఈ ప్రాంతంలో సంచరించ కూడదు.
   పైగా ఇదంతా నేను సంచరించే ప్రదేశం. నేను గంధర్వుణ్ణి. నా పేరు అంగారపర్ణుడు. కుబేరుడికి స్నేహితుణ్ణి. ఈ ప్రదేశంలో ప్రవహిస్తున్న గంగానది కూడా అంగారపర్ణ అనే పేరుతోనే పిలవబడుతోంది. నా గురించి మీకు తెలియదనుకుంటాను. అందుకే ఇక్కడికి వచ్చారు. తెలిసి ఉంటే ఇటువైపు కన్నెత్తి కూడా చూసి ఉండేవాళ్ళు కాదు. అసలు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చారు? అని అడిగాడు గంభీరంగా.
   అంగారపర్ణుడు మాటలకి అర్జునుడు నవ్వి గంధర్వుడా! సంధ్యా సమయం, అర్ధరాత్రి సమయం అనేవి శక్తిలేని వాళ్లకి గాని మా వంటి బలవంతులకి కాదు. మేం దేనికీ భయపడం. ఏ సమయంలో అయినా ఎక్కడికైనా సరే స్వేచ్ఛగా వెళ్ళిపోగలం.
  ఈ పుణ్య పావని గంగానదిని అందరూ సేవించుకోవచ్చు. ఇది నీ ఒక్కడి సొమ్మూ కాదు. నేను నా తల్లితోను, సోదరులతోను కలిసి ఈ పవిత్ర గంగా జలంలో స్నానం చెయ్యాలని వచ్చాను. నీ జల క్రీడలకి అడ్డు వద్దామని కాదు. నువ్వు వద్దు వెళ్ళిపొమ్మన్నా మేము ఏ పని మీద వచ్చామో అది పూర్తి చేసుకునే వెడతాం. నీకు భయపడి తిరిగి వెళ్ళిపోతామని అనుకోకు! అన్నాడు అంతకంటే గంభీరంగా.
   కోపంతో మండిపడ్డాడు అంగారపర్ణుడు. ఎక్కడినుంచో వచ్చినవాడివి నాతోనే వాదిస్తావా? ఇక్కడ స్నానం ఎలా చేస్తావో నేనూ చూస్తాను అంటూ అర్జునుడి మీద బాణవర్షం కురిపించాడు. అర్జునుడు తను పట్టుకుని ఉన్న కొరివితోనే అతడు వేస్తున్న బాణల్ని తన మీద, తన సోదరుల మీద పడకుండా తప్పిస్తున్నాడు. అంగారపర్ణుడు ఎంతకీ ఆపకుండా బాణాలు వేస్తూనే ఉన్నాడు.
   అర్జునుడు కూడా కోపంతో విజృంభించి అగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం భయంకరమైన మంటలు కక్కుతూ వెళ్ళి అంగారపర్ణుడి రథం మీద పడింది. ఆ మంటలకి అతడి రథం కాలి బూడిదయింది. అంగారపర్ణుడు కిందపడి మూర్ఛపోయాడు.
   నేల మీద పడి మూర్ఛపోయిన అంగారపర్ణుణ్ణి జుట్టుపట్టుకుని ఈడ్చుకుని వెళ్ళి ధర్మరాజు కాళ్ళదగ్గర పడేశాడు అర్జునుడు.
   గంధర్వుడి భార్య కుంభీనస భర్త స్థితి చూసి ఏడుస్తూ పరుగెత్తుకుంటూ వచ్చింది. ధర్మరాజు కాళ్ళమీద పడి తన భర్తని బ్రతికించమని వేడుకుంది. కుంతీదేవి, పాండవులు కుంభీనసని ఓదార్చి అంగాపర్ణుణ్ణి విడిచి పెట్టారు.
     అర్జునుడి చేతిలో ఓడిపోయిన అంగారపర్ణుడు రెండు చేతులు జోడించి అర్జునా! ఈ అర్ధరాత్రి సమయంలో ఎవరైనా మరొకడైతే  నా చేతిలో చచ్చి ఉండేవాడు. నువ్వు బ్రహ్మచర్య  వ్రత దీక్షలో ఉండి క్రమశిక్షణతో ప్రజల్ని రక్షించడం కోసం  నీ జీవితాన్ని గడుపుతున్నావు. నేను అర్ధరాత్రి కూడా వినోదాలతో స్త్రీలోలుణ్ణై ఎవరికీ ప్రయోజనం లేని స్వేచ్ఛాజీవితాన్ని గడుపుతున్నాను.
  కాబట్టే, నువ్వు బలవంతుడివయ్యావు, నేను బలహీనుణ్ణై నీ చేతిలో ఓడిపోయాను! కాబట్టి, ఈ రోజు నుంచి నా అంగారపర్ణత్వాన్ని విడిచి పెడుతున్నాను. ఇప్పటి నుంచి చిత్రరథుడు అనే పేరుతో జీవిస్తానుఅన్నాడు.
క్రమశిక్షణ జీవితాన్ని మంచి మార్గం వైపు నడిపిస్తుంది!!

  

   

No comments:

Post a Comment