About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

 

నాన్నమ్మ చెప్పిన చెట్టుతల్లి కథ

   ఒక చిన్న గ్రామంలో శ్రీను అనే ఒక అబ్బాయి నివసిస్తూ ఉండేవాడు. శ్రీనుకి తల్లితండ్రులుగాని, బంధువులుగాని లేరు. ఒక్కడే ఒక చెట్టుకింద బతికేవాడు.

   అప్పుడప్పుడు తినడానికి ఏదీ దొరికేది కాదు. అప్పుడు ఆ చెట్టే శ్రీనుకి తినడానికి తియ్యటి పళ్లు ఇచ్చేది. ఏడవద్దని చెప్తూ చల్లటి గాలిని పంపించి నిద్రపుచ్చేది.

   వర్షం పడితే ఎక్కడికీ పనికి వెళ్లడానికి లేక ఆ చెట్టుకిందే ఉండిపోయేవాడు. వర్షం శ్రీను మీద పడకుండా ఆ చెట్టే చూసుకునేది. ఆ చెట్టే శ్రీనుకి ఇల్లన్నమాట!

   అవసరమైనవన్నీ ఇస్తున్న ఆ చెట్టంటే శ్రీనుకి అమ్మ మీద ఉన్నంత ప్రేమ ఉండేది. తనకి ఏ కష్టమొచ్చినా దానికే చెప్పుకునేవాడు.

   శ్రీను అ చెట్టు కిందే పెరిగిపెద్దవాడయ్యాడు. ఇప్పుడు పళ్లు తిని బతకడం, చెట్తు కింద నిద్రపొవడం బాగుండలేదనుకున్నాడు. తను మరీ సోమరిగా తయరవుతున్నాడు. ఎక్కువ మంది జనల మధ్య ఉంటే బాగుంటుందనుకున్నాడు.

   ఏదయినా పని చేసుకుని బతుకుదామని నిర్ణయించుకున్నాడు. ఎఅయినా పని చేసుకుని బతికితే బాగుంటుందని తనకున్న సామాను పట్టుకుని బయలుదేరాడు.

   పనికోసం వెతుక్కుంటూ వేరే గ్రామానికి వెళ్లాడు. అందర్నీ తనకి పని ఇప్పించమని అడుగుతూ తిరిగాడు.

   చివరికి ఒక పని దొరికింది. అక్కడ శ్రీనుకి చాలమందితో పరిచయం ఏర్పడింది. అందరూ శ్రీనుతో స్నేహంగా ఉంటున్నారు.

   శ్రీను చెట్టు సంగతే మర్చిపోయాడు. ఇప్పుడు తను చేస్తున్న పని తనకి ఎంతో సంతృప్తిని ఇస్తోంది. స్నేహితులతో కలిసి పనిచేస్తూ సంతోషంగా కాలం గడుపుతున్నాడు.

   శ్రీను పని చేసే చోట పెద్ద పెద్ద చెట్లు నరికి, ఆ కలప తెచ్చి పడేస్తుండేవాళ్లు. వాటిని పద్ధతిలో నరికి అమ్ముతుండేవాళ్లు. కొంత కలపని వేరే ప్రదేశాలకి పంపిస్తూ ఉండేవాళ్లు.

   ఒకరోజు అక్కడికి వచ్చిన కలపలో తనను పెంచిన చెట్టు కూడా ఉండడం గుర్తించాడు. తన చిన్ననాటి విషయాలన్నీ గుర్తొచ్చాయి.

   ఆ చెట్టెక్కి ఆడుకోవడం; దాని ఆకులు కోసి విస్తళ్లుగా కుట్టడం, దాని మీద వాలిన పక్షుల కూతలన్నీ నేర్చుకుని వాటిని అనుకరించడం; చెట్టు మీదకి ఎక్కిన కోతుల్ని రాళ్లతో కొడుతుంటే అవి తిరిగి తనని వెక్కిరించడం అన్నీ ఒక్కక్కటిగా గుర్తొస్తున్నాయి.

   అంతేకాదు, ఆ చెట్టు తనని తల్లిలా ఆదరించింది. నిద్రవచ్చినా, ఆకలేసిన వర్షమొచ్చినా, ఎండకాచినా తనకు బాధ కలగకుండా ఆదరించింది. ఎన్నో విధాలుగా తల్లి లేని తనని తల్లిలా కాపాడింది.

   ఆ చెట్టుని నరికేశారని శ్రీను చాలా బాధపడ్డాడు. తన చెట్టుతల్లికి అన్యాయం జరిగినందుకు దుఃఖపడ్డాడు. చెట్లు మనుషులకి ఎన్ని విధాలుగా రక్షణ కలిగిస్తాయో అనుభవంతో పూర్తిగా తెలిసినా చెట్లు నరకడాన్ని తను కూడా ప్రోత్సహిస్తున్నట్లుగా అనిపించింది.

  వెంటనే అక్కడ పని చెయ్యడం మానేశాడు. స్నేహితులు ఎని విధాలుగా చెప్పినా వినలేదు. అప్పటి నుంచి అక్కడే కాదు, చెట్లు నరికేచోట, కలప ఎగుమతి చేసేచోట పనిచెయ్యడం మానేశాడు అని   నాన్నమ్మ కథ పూర్తి చేసింది.

   “అన్నట్టు మర్చిపోయనురా! మీరు మొక్కలు నాటారు కదా? వాటికి నీళ్లు పోస్తున్నారా.. లేదా? భడవల్లారా! వాటిని ఎక్కడి నుంచో తెచ్చి, ఇక్కడ పాతిపెట్టి చంపేస్తారా?

   ఎప్పుడూ ఆటలాడుదామనే కాని ఒక్క మంచి పని కూడా చెయ్యరుకదా! మీరు మాత్రం ముప్పొద్దులా తింటారు.. వాటికి నీళ్లు పొయ్యలేరు. అసలు ఒక పూట మీకు తిండి పెట్టకుండ ఉంటే అప్పుడు తెలుస్తుంది ఆ మొక్కలు పడే బాధేంటో.

   సరే! ఈ రోజుకి వదిలేస్తున్నాను రేపట్నుంచి వాటికి నీళ్లు పొయ్యకపోతే మీ సంగతి చెప్తాను. ఇంక పడుక్కోండి కథ కంచికి.. మనం రేపు తోట పనికి! అని చెప్పి నాన్నమ్మ నిద్ర పోయింది.

   పిల్లలందరూ రేపు ఏమైనాసరే మనం మొక్కలకి నీళ్లు పోసి, వాటి మధ్యలో పెరిగే కలుపు మొక్కల్ని పీకేసి శుభ్రం చెద్దాం!అని చెప్పుకుని నిద్రపోయారు.

పన్నెండు పున్నములు

ఆషాడమాసం

వ్యాసపౌర్ణిమ

వ్యాసస్తుతి

వ్యాసం వసిష్ఠ నప్తారం, శక్తేః పౌత్ర మకల్మషం

పరాశరాత్మజం వందే శుకతాతమ్ తపోనిధిమ్

   ఆషాఢ శుద్ధపౌర్ణమిని 'గురు పౌర్ణమి' లేదా 'వ్యాస పౌర్ణమి' అని అంటారు. ఇదే రోజు వ్యాసమహర్షి జన్మతిథి కనుక, మహాపర్వదినంగా అనాది కాలం నుంచీ ఈ పౌర్ణమి రోజు గురుభగవానుడు వ్యాసమహర్షిని పూజించి అష్టైశ్వర్యాలు పొందుతున్నారు..

గురువందనం!

'గురుర్బ్రహ్మ గురుర్విష్ణర్ గురుర్దేవో మహేశ్వరః

గురుసాక్షాత్పరబ్రహ్మ తస్త్మై శ్రీ గురువే నమః   

   వ్యాసమహర్షి యమునా నదీతీరంలో పుట్టాడు. కనుక కృష్ణద్వైపాయనుడు అని, వేదాలని విభజించినవాడు కనుక వేదవ్యాసుడని, పరాశరుడి కుమారుడుగా పారాశర్యుడని, సత్యవతీ పుత్రుడుగా సాత్యవతేయుడని పేర్లున్నాయి. 

  గురుపూజకు శ్రేష్టమైన గురు పౌర్ణమి విశిష్ఠత గురించిన కథ ఒకటి తెలుసుకుందాం...

    పూర్వం వారణాశిలో కడు పేదబ్రాహ్మణ దంపతులు ఉండేవారట. ఆ బ్రాహ్మణుని పేరు 'వేదనిధి'. ఆయన భార్య  పేరు 'వేదవతి'. వీళ్లిద్దరు ఎప్పుడూ చక్కని ఆధ్యాత్మిక భావంతో భక్తి జ్ఞానాలు కలిగి జీవించేవాళ్లు.

   ఆ దంపతులకి సంతానం కలగలేదు. ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా ఫలితం లేకపోయింది. 

   ప్రతిరోజూ మధ్యాహ్న సమయంలో స్నానం కోసం వ్యాసభగవానులు రహస్యంగా గంగానదికి వస్తూ ఉంటారని వేదనిధికి తెలిసింది. ఎలాగైనా సరే వ్యాసమహర్షిని దర్శించాలని ప్రతిరోజు వేయికళ్ళతో ఎదురు చూసేవాడు. ఒకరోజు భిక్షువు రూపంలో ఉన్న దండధారుడైన ఒక వ్యక్తి వేదనిధికి కనిపించాడు. 

  వెంటనే వేదనిధి వారి పాదాలకి నమస్కారం చేశాడు. ఆ భిక్షువు వేదనిధని చీదరించుకుని కసురుకున్నాడు. అయినా సరే పట్టిన పాదాల్ని మాత్రం విడిచిపెట్టలేదు వేదనిధి. భిక్షుకుడితో “ మహానుభావా! తమరు సాక్షాత్తు వ్యాసభగవానులని నేను గ్రహించాను. అందుకే మీ పాదాల్ని ఆశ్రయించాను” అన్నాడు.

   ఆ మాటలు విన్న  భిక్షువు గంగానది ఒడ్డుమీద అన్నివైపులకి ఒకసారి పరికించి చూస్తూ నిలబడిపోయాడు. తనను ఎవరూ చూడట్లేదని నిర్ణయించుకుని వేదనిధితో ఆప్యాయంగా మాట్లాడి ఏం కావాలో అడగమన్నాడు.

   వేదనిధి “ అయ్యా! రేపు నా తండ్రిగారి ఆబ్దీకం. దానికి మీరు బ్రాహ్మణార్థమై భోజనానికి మా ఇంటికి తప్పకుండా రావాలి” అని వేడుకున్నాడు. వ్యాసభగవానుడు వేదనిధి ఆహ్వానాన్ని అంగీకరించాడు.

   వేదనిధి ఎంతో సంతోషంగా ఇంటికి చేరుకుని తన భార్యకి గంగానదీతీరంలో జరిగిన వృత్తాంతమంతా వివరించాడు. మరుసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకారం వ్యాసమహర్షి వేదనిధి ఇంటికి వచ్చాడు.

   ఆ దంపతులు వ్యాసమహర్షిని సాదరంగా ఇంట్లోకి ఆహ్వానించి అతిథి సత్కారం చేసి పూజించారు. అనంతరం దేవతార్చనకు తులసీదళాల్ని, పువ్వుల్ని సిద్ధం చేశారు. 

     పూజ పూర్తయ్యాక ఎంతో శుచిగా వంటకాలని సిద్ధం చేసుకుని శ్రాద్ధవిధులని విధి విధానంగా నిర్వహించారు. అంతా పూర్తయ్యాక ఆ దంపతులు  వ్యాసభగవానుడికి సాష్టాంగ నమస్కారం చేశారు.

   వారి ఆతిథ్యానికి ఎంతో సంతుష్ఠుడైన ఆ ముని శ్రేష్ఠుడు “ ఓ పుణ్య దంపతులారా.. మీకు ఏం వరం కావాలో కోరుకోండి” అన్నాడు. 

   ఆయన మాటలకి వేదనిధి దంపతులు “మహానుభావా! ఎన్ని నోములు, వ్రతాలు చేసినా మాకు సంతానభాగ్యం మాత్రం కలుగలేదు. దయచేసి మాకు సంతానం ప్రసాదించు!” అని వేడుకున్నారు.

   అది విని వ్యాసభగవానుడు “ త్వరలోనే మీకు తేజోవంతులు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రులు కలుగుతారు” అని ఆశీర్వదించాడు.

    వేదనిధి, వేదవతి దంపతులు వ్యాసభగవానుడి అనుగ్రహంతో సంతానం పొంది సుఖసంతోషాలతో జీవించి, చివరికి విష్ణుసాయుజ్యాన్ని పొందగలిగారు.

   వ్యాసపూర్ణిమ రోజున వ్యాస దేవుని పూజించాలి. గురుపూజ చెయ్యాలి. నిజానికి గురుపూజ చెయ్యవలసిన రోజు వ్యాసపౌర్ణిమ. చదువులు చెప్పే గురువును, మంత్రోపదేశం చేసిన గురువును యథోచితంగా సత్కరించి అర్చించాలి. గురువులోనే వ్యాసదేవులున్నారని భావించి ఆరాధించాలని పెద్దల మాట!

   చాతుర్మాసం ద్విమాసం వా సదైకత్రైవ సంవసేత్  అని శాస్త్రాలు చెబుతున్నాయి.  దీని ప్రకారం శ్రీకృష్ణుడిని, వ్యాసుడినే కాకుండా జైమిని, సుమంత, వైశంపాయన, పైలుడు మొదలైన వ్యాసశిష్యుల్ని కూడా పూజించాలి.

   ఈ రోజునే సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం, దక్షిణాయనం ప్రారంభం కావడం జరుగుతుంది. కనుక, విష్ణుపూజ, దానాలు, విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యడం, వ్యాసమహర్షి రాసిన గ్రంథాల్ని చదవడం వల్ల సుఖసంతోషాలు, సకల సంపదలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు.

   పరాశరుడు. వేదాలను నాలుగు భాగాలుగా విభజించి పైలుడనే శిష్యుడికి ఋగ్వేదాన్ని, వైశంపాయనుడికి యజుర్వేదాన్ని, జైమిని  అనే శిష్యుడికి సామవేదాన్ని, సుమంతుడనే శిష్యుడికి అధర్వణ వేదాన్నిబోధించి లోకంలో వేదాల్ని వ్యాప్తి చేయించాడు.

   చతుర్వేదాలు, అష్టాదశపురాణాలు, చతుర్దశ విద్యలు అన్నీ అభ్యసించి వాటిని బ్రహ్మర్షులు, దేవర్షులు, రాజర్షులు
అందరికీ బోధించాడు. వాళ్లు వాళ్ల శిష్యులకి, శిష్యులు ప్రశిష్యులకి బోధించడం వల్ల లోకంలో వేదాలు వ్యాప్తిలోకి వచ్చాయి.

    వ్యాసమహర్షి రచించిన వ్యాససంహిత’, వ్యాసస్మృతి అనే గ్రంథాల్లో నిత్య కర్మల గురించి అనేక విషయాలు వివరించబడ్డాయి. వేద వ్యాసులవారు విశ్వంలోని మొట్టమొదటి ఆర్ష గ్రంథమయిన బ్రహ్మసూత్రాలు' అనే గ్రంథాన్ని రాయడం వ్యాసపౌర్ణమి రోజునే పూర్తయ్యింది. `

   వ్యాసపౌర్ణిమ రోజున ఏ సాధకుడైతే ఆచార్యుడిని ఉపాసన చేసి తన ఆథ్యాత్మిక మార్గాన్ని నిర్ణయించుకొంటాడో అతడికి  సంవత్సరంలో వచ్చే అన్ని ఆధ్యాత్మిక పండుగలు  జరుపుకొన్నంత ఫలితం కలుగుతుంని దేవతలే చెప్పారు.

   వ్యాసపూర్ణిమ నాడు నిమ్మకాయలతో గురుమండలాన్ని వేసి పుజిస్తారు. వ్యాసుమహర్షిని ప్రతినిధిగా పరంపరలో ప్రస్తుతం ఉన్న గురువులని పూజిస్తారు.

  అలా గురువులని పూజించటం వల్లే వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమగా చెప్పబడుతోంది.  ఏ గురువుని పూజించినా వ్యాస భగవానుడిని ప్రతినిధిగా పూజించడమే అవుతుంది. ఆ పూజ స్వయంగా వ్యాసభగవానుడికే చెందుతుంది.

వ్యాసపుర్ణిమ నాడు చేయవలసింది...
   వ్యాసమహర్షిని మనస్సులో తలచుకోవడం, గురుపూజ, గురు పాదసేవ, గురు పాదుకాపూజ, అలా చెయ్యలేకపోతే గురువుగారిని కలిసి కనీసం పాదాభివందనం చేయడం, ఒకవేళ ఆయన దగ్గరికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉంటే గురుసమానులు ఎవరినైనా కలిసి గౌరవించడం చెయ్యాలి.

 ఈ శ్లోకం గురుపరంపరే కాకుండా వ్యాసమహర్షి వంశ స్తుతి కూడా..
వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం| పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం!!

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే| నమోవై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమోనమః!!

   శ్రీమన్నారాయణుని 21 అవతారాల్లో పదిహేడో అవతారం వ్యాసుడని భాగవతం తెలియచేస్తోంది.

   గురుపౌర్ణిమ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

  దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

   ఆదిగురువు వేదవ్యాసులవారు. వ్యాసులవారు పుట్టినరోజునే గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమ, అంటారు

నారాయణమూర్తి స్వరూపమే వేదవ్యాసులవారు. అందుకే ఆయన్ని అపర నారాయణుడని పిలుస్తారు. వేదవిభజన చేసిన మహానుభావుడాయన. ఆయనవల్లనే మనకు అష్టాదశ పురాణాలు ఏర్పడ్డాయి. భారత భాగవతాలని అందించినవారే వ్యాసులవారు.

నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే| పుల్లార విన్దాయత పత్రనేత్ర |
యేన త్వయా భారత తైలపూర్ణ| ప్రజ్వాలిలో జ్ఞానమయ: ప్రదీపః ||

   విశాల బుద్ధిగల వ్యాస మహర్షీ! వికసించిన పద్మ దళముల వంటి నేత్రములుగల వాడా! మహాభారతమనే తైలముతో నింపబడిన జ్ఞానదీపము వెలిగించినవాడా! నీకు నా నమస్కారము!

గురు సందేశము :

   వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకి ఎత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏమిటంటే- 'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది! 

   దత్త్తాత్రయులు వారు మనకు 24 మంది గురువులువున్నారు అని చెప్పారు.  మనకు వరసగా తన గురువులు గురించి చెప్పారు.   

భూమి, వాయువు,  అగ్ని, ఆకాశము, సూర్యుడు పావురము, కొండచిలువ, సముద్రము, మిడత, ఏనుగు,

 చీమ, చేప, పింగళ అనే వేశ్య, శరకారుడు, ఒక బాలుడు, చంద్రుడు, తేనెటీగ, లేడి, గ్రద్ద, కన్య, సర్పము, సాలెపురుగు, భ్రమరకీటకము, జలము అని తన గురువుల గురించి చెప్పారు. అంతే కాదు మనకు ప్రతి జీవీ ఒక గురువే అని చెప్పారు. కనుక, అన్ని జీవుల్లోనూ భగవంతుడు ఉన్నాడని గ్రహించి దయాగుణంతో మెలుగుదాం!

వ్యాస పూర్ణిమ రోజున ఆ మహర్షిని ప్రార్థించి ఆయన అనుగ్రహము పొందుదాం..!

భమిడిపాటి బాలాత్రిపురసుందరి, సెల్ నం. 94401747


నాన్నమ్మ చెప్పిన కథలు

 

నాన్నమ్మ చెప్పిన అమ్మప్రేమ కథ

   నందూకి వాళ్లమ్మంటే చాలా ఇష్టం. కాని, వాళ్లమ్మ మాత్రం ఎక్కువగా అక్కతోనే మాట్లాడుతుంది. నన్నూ, అక్కని చక్కగా తయారు చేస్తుంది.

   నోట్లో పెట్టి ఇద్దరికీ అన్నం తినిపిస్తుంది. పుస్తకాల సంచి, టిఫిన్ బాక్సు ఇద్దరికీ ఇస్తుంది. నన్ను బస్సులో బడికి పంపిస్తుంది. అక్కని మాత్రం తనే బడికి తీసుకుని వెళ్లి దింపివస్తుంది.

   బడి అయిపోయాక తను చేస్తున్న పనులన్నీ వదిలేసి బడికి వెళ్లి దగ్గరుండి అక్కని తనే స్వయంగా తీసుకుని వస్తుంది. నేనేమో బస్సులోనే వస్తాను.

  ఇంటికి వచ్చాక ఇద్దరికీ స్నానం చేయించి, తినిపించి హోం వర్కు దగ్గర కూర్చోబెడుతుంది. అక్కకి మాత్రం చదువుకునేప్పుడు తనే దగ్గర కూర్చుని అన్నీ నేర్పిస్తుంది.

   నందూకి అమ్మ ఎప్పుడూ తనతోనే మాట్లాడాలని, తను అమ్మ కలిసి ఆడుకోవాలనీ ఉండేది. అమ్మకి ఎప్పుడూ పనితోనే సరిపోయేది.

  అక్కని బడికి పంపించి, ఇంట్లో అందరికీ కావలసిన అవసరాలు చూడడం అమ్మపనే. నాన్నగార్ని ఆఫీసుకి పంపించేవరకు అన్నీ అందించేది.

  తర్వాత మిగిలిన పనులు, మేము పడేసినవన్నీ సర్దుకోడం. మళ్లీ వండుకోడం. ఇంట్లో ఉండే నాన్నమ్మకి కావలసినవి అందించేది.

   మళ్లీ సాయంత్రం అమ్మ పనులు మామూలే. అమ్మ పనులన్నీ పూర్తయ్యి వంటగది సర్దుకుని వచ్చేటప్పటికి బాగా రాత్రయిపోయేది. అప్పటికి నందూకి నిద్ర వచ్చేసేది.

   అందుకే నందూటూ ఎప్పుడూ అమ్మకి తనంటే ఇష్టం లేదనే ఆలోచనలతో సతమతమయ్యేవాడు. అసలు నేనంటే అమ్మకి ఇష్టం లేదు. అక్కంటేనే అమ్మకి చాలా ఇష్టం అనుకునేవాడు.

   నందూ ఆలోచనలు నందూ అమ్మకి తెలియదు. కాని, నందూ భావాలు వాళ్ల  నాన్నమ్మకి బాగా అర్థమయ్యేవి. అమ్మకి నందూ మీద కూడా చాలా ప్రేమ ఉందని వాడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంది.

   ఒకరోజు నందూని పిలిచి నందూ! అమ్మకి నీ మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవాలని ఉందా?” అని అడిగింది.

   నందూ నాన్నమ్మ మాటలకి మూతి ముడుచుకుని “నాకు తెలుసులే! అమ్మకి నా మీద అసలు ప్రేమ లేనేలేదు” అన్నాడు బాధగా.

   నాన్నమ్మ వాడిని దగ్గర కూర్చోబెట్టుకుంది. వాడితో నెమ్మదిగా చెప్పింది. నేనొక ఉపాయం చెప్తాను. నువ్వు అలా చెయ్యి. నువ్వంటే అమ్మకి ప్రేమ ఉందో లేదో.. నీకే తెలుస్తుంది అని చెప్పింది.

   వెంటనే నందూ నాన్నమ్మ చెప్పినట్టే చేస్తానని చెప్పాడు. నాన్నమ్మ నందూతో నువ్వు అమ్మ ఒళ్లో కూర్చుని అమ్మ కళ్లల్లోకి చూడు. ఎవరు కనిపిస్తారో వాళ్ల మీద అమ్మకి ప్రేమ ఉన్నట్లు!

   నీకు అమ్మ కళ్లల్లో అక్క కనిపిస్తోందా.. నేను కనిపిస్తున్ననా.. నాన్న కనిపిస్తున్నారా.. నువ్వు కనిపిస్తున్నావా.. బాగా చూడు అని చెప్పింది.

   వెంటనె నందూ పరుగెత్తుకుంటూ వెళ్లి అమ్మ ఒళ్లో కూర్చున్నాడు. అమ్మ మొహం తనవైపు తిప్పుకున్నాడు.

   అమ్మ కళ్లల్లోకి చూశాడు. అమ్మ కళ్లల్లో తనే కనిపించాడు. ఒక కన్ను తరువాత ఒక కన్నులోకి చూసాడు. రెండు కళ్లల్లోనూ తనొక్కడే ఉన్నాడు.

   ఒక్క కంట్లో కూడా అక్క కనిపించలేదు. నాన్న, నాన్నమ్మ, తాత ఎవరూ కనిపించలేదు. ఒక్కసారి కూడా అమ్మ కళ్లల్లో అక్క కనిపించలేదు.

   అంటే, అమ్మకి తనంటేనే చాలా ఇష్టం. పరుగెత్తుకుంటూ వెళ్లి నాన్నమ్మకి చెప్పేశాడు. తనంటేనే అమ్మకి ఇష్టమని తెలుసుకుని సంతోషంగా ఇల్లంతా తిరిగేస్తున్న నందూని  చూసి నాన్నమ్మ సంతోషపడింది.

   నందూకి ఇంకెప్పుడూ అమ్మకి తనంటే ఇష్టం లేదన్న సంగతి గుర్తు రాలేదు. ఆ రోజు రాత్రి నాన్నమ్మని కథ చెప్పమని అడగడం కూడా మర్చిపోయి ఆనందంగా నిద్రపోయాడు.

   నాన్నమ్మ అనుకుంది పని హడావిడిలో పిల్లల్ని కొంత నిర్లక్ష్యం చేస్తుందేమోగాని, తల్లి తన పిల్లలు ఒకళ్లైనా, పదిమందైనా సరే అందర్నీ ఒకే ప్రేమతో చూస్తుంది. ఆడపిల్లల్ని ఒక్క ప్రేమతోనే కాదు జాగ్రత్తగా కూడా చూసుకోవాలి. అది నందులాంటి పిల్లలు తెలుసుకోలేరు అనుకుని నాన్నమ్మ తను కూడా సుఖంగా నిద్రపోయింది.

     

ఉపనిషత్తు కథలు (వే్దాలసారమే ఉపనిషత్తులు)

 

ఓం

ఆనందమే బ్రహ్మం

      అది ప్రాత:కాల సమయం. గలగలా ప్రవహిస్తున్న గంగానది అలలు చేస్తున్న ధ్వని వినడానికి ఇంపుగా ఉంది. నది మీదనుంచి వచ్చే చల్లటి గాలులు శరీరాన్ని తాకి మనస్సుని చల్లబరిచి వెడుతున్నాయి.

   తూర్పు దిక్కున ఉదయిస్తున్న సూర్యుడి అరుణ కిరణాలు సూర్యుడి కంటే ముందే  ప్రవేశించి  ఆకాశాన్ని ఎర్రటి కాంతితో నింపేశాయి. కొంచెంసేపటికే అన్ని వైపులా వ్యాపించిన కిరణాలతో అందాలు సంతరించుకున్న ఆకాశాన్ని చూస్తూ చల్లటి వాతావరణంలో కూర్చున్న భృగువు  మనస్సు ఉల్లాసంగా ఉంది.

   ప్రకృతిలో ఉన్న అందాన్ని అనుభవిస్తున్నభృగువుకి ఒక సందేహం కలిగింది. ఆ సందేహం తీర్చుకోవాలన్న కోరిక కూడా క్షణక్షణానికి పెరిగి పెద్దదవుతోంది. తన కోరికని తండ్రికి చెప్పి అదేమిటో తెలుసుకోవాలని అనుకున్నాడు.

   వరుణ మహర్షి కుమారుడు భృగువు. అతడు తండ్రి వరుణ మహర్షిని సమీపించి భగవన్! బ్రహ్మం అని దేన్ని అంటారు? దాని స్వరూపం ఎలా ఉంటుందో దయచేసి నాకు వివరించి నాకు కలిగిన సందేహాన్ని తీర్చు! అని అడిగాడు.

   తన కుమారుడు తన దగ్గరికి వచ్చి వినయంగా అడిగిన ప్రశ్నవిని చాలా సంతోష పడ్డాడు వరుణ మహర్షి. కుమారుడు అడిగిన ప్రశ్నకి సరయిన సమాధానం తను చెప్పగలడు.

   అయినా చెప్పదలచుకోలేదు. ఆ విధంగా వివరించడం ఆయనకి ఇష్టం లేదు. అడిగిన దానికి వెంటనే సమాధానం చెప్పేస్తే విద్యార్ధి బుద్ధి వికసించదని ఆయన అభిప్రాయం.

   అంతేకాకుండా అలా వివరించి చెప్పేస్తే విద్యార్ధి సోమరిగాను, ఇతరుల మీద ఆధారపడే విధంగానూ మారిపోతాడు.

   కాబట్టి విద్యార్ధి బుద్ధికి పని చెప్పి అతడి ప్రశ్నకి అతడితోనే జవాబు చెప్పించాలన్నది ఆయన సిద్ధాంతం. దానికి అవసరమయిన సహాయాన్ని మాత్రం గురువుగారు అందించాలి. విద్యార్థి స్వయంగా ఆలోచించి తెలుసుకోడం వల్ల అన్ని విధాలుగా అతడి బుద్ధి వికసిస్తుందని అనుకున్నారు.

   వరుణ మహర్షి కుమారుడి ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పలేదు. బ్రహ్మాన్ని అతడికి అర్ధమయ్యేలా వర్ణించి చెప్పకుండా దానికి ఉన్న లక్షణాన్ని ఈ విధంగా చెప్పాడు.

   ఆహారం, ప్రాణం, కన్ను, చెవి, మనస్సు, వాక్కు- ఇవే భగవంతుడు" అన్నాడు.

   కాని, అది విన్న భృగువుకి ఏమీ అర్ధం కాలేదు. ఆహారం ప్రాణం భగవంతుడే అవడం ఏమిటి? తనకు కలిగిన సందేహం మరికొంచెం పెరిగింది అనుకున్నాడు. అదంతా గందరగోళంగా అనిపించింది.

   అతడి పరిస్థితిని చూసి వరుణ మహర్షి మళ్లీ చెప్పాడు. ఈ సమస్త సృష్టి దేని నుంచి పుడుతోందో...దేని ఆధారం మీద నిలబడి ఉంటోందో, దేనివల్ల జీవిస్తోందో...చివరికి అది దేనిలో లీనమవుతోందో దానికి సంబంధించిన తత్త్వమే బ్రహ్మం. దాని గురించి నువ్వు ఆలోచించి తెలుసుకో! అన్నాడు.

   తండ్రి ఉపదేశం చేసిన దాన్ని ఆధారంగా తీసుకుని ఆయన ఆజ్ఞని శిరసా వహిస్తూ భృగువు తపస్సు చేశాడు. ఏకాంతంలో కూర్చుని ఇతర విషయాల మీదకి తన ఆలోచనల్ని పోనీయకుండా తండ్రి చెప్పిన విషయాన్ని మాత్రమే ఆలోచించాడు.

   మళ్లీ మళ్లీ గుర్తుకు తెచ్చుకున్నాడు. చివరికి ఆహారమే భగవంతుడు, అదే మూలతత్త్వమని అర్థం చేసుకున్నాడు.

   ఎందుకంటే, ప్రాణికోటి అన్నం నుంచే పుడుతోంది, అన్నం తినే జీవిస్తోంది, అన్నంలోనే లీనమవుతోంది. నడుస్తున్న కర్మలన్నీ కూడా అన్నం మీదే ఆధారపడి ఉన్నాయి.

   కాబట్టి తండ్రి చెప్పిన మూలతత్త్వం లేదా బ్రహ్మం అన్నమే అయి ఉంటుంది అనే నిర్ధారణకి వచ్చాడు.

   భృగువు ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ఆ విషయాన్ని తండ్రికి చెప్పాలని వరుణ మహర్షి దగ్గరికి వెళ్లాడు. తండ్రీ! మీరు చెప్పినట్టే తపస్సు చేసి, విచారణ చేసి నేను అన్నమే పరబ్రహ్మం అనే నిర్ణయానికి వచ్చాను. నేను అనుకుంటున్నది నిజమేనా? అని అడిగాడు.

   భృగువు మాటలు విని వరుణ మహర్షి నాయనా! తపస్సే భగవంతుడు. తపస్సు చేసి ఆ భగవంతుణ్ని తెలుసుకో అన్నాడు.

   భృగువు మళ్లీ తపస్సు ప్రారంభించాడు. తండ్రి చెప్పినదాన్ని గురించి ఆలోచిస్తున్నాడు.

   అన్నమే భగవంతుడు (అన్నమంటే ఇక్కడ పంచభూతాలతో ఏర్పడిన పదార్ధం అని అర్ధం). అన్నం వల్లే ప్రాణికోటి పుడుతోంది. అది లేకపోతే లోకంలో నడుస్తున్న పనులన్నీ ఆగిపోతాయి.

   కాని, అసలు ప్రాణమే లేకపోతే అన్నంతో ఉపయోగం ఏముంటుంది? పుడుతున్న జీవులన్నీ ప్రాణం వల్లే జీవిస్తున్నాయి. ప్రాణం లేకపోతే జీవులు అన్నం కూడా తినలేవు కదా. అప్పుడు ఆ అన్నం శవాన్ని బ్రతికించలేదు.

   ఎలాగైనా తినిపిద్దామని అన్నాన్ని బలవంతంగా ప్రాణం లేని జీవి నోటిలోకి పెట్టినా ఉపయోగం ఉండదు. అది లోపలికి వెళ్లదు. వెళ్లినా ఆ శరీరానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్రాణం శరీరంలో ఉన్నంతవరకే ఆ శరీరానికి అన్నం వల్ల ఉపయోగం ఉంటుంది.

   ప్రపంచాన్ని చూడాలన్నా, ప్రపంచంలో జీవించాలన్నా, అన్నాన్ని లోపలికి గ్రహించాలన్నా ప్రాణమే ముఖ్యం అనే నిర్ణయానికి వచ్చి ప్రాణమే బ్రహ్మం అనుకున్నాడు. ఆ విషయాన్నే తండ్రికి చెప్పాడు.

   వరుణ మహర్షి కుమారా! తపస్సు చేసి బ్రహ్మం గురించి తెలుసుకో. తపస్సే బ్రహ్మం. తపస్సు వల్లే బ్రహ్మాన్ని తెలుసుకోగలవు అని చెప్పాడు.

   ఆయన చెప్పింది విన్న భృగువు ఇప్పటి వరకు నేను తెలుసుకున్నది పూర్తిగా సరయింది కాదు. అందుకే నేను చెప్పిన  దాన్ని విని కూడా మళ్లీ తపస్సు చెయ్యమని చెప్పారు.

   ఆయన చెప్పినట్టు మళ్లీ చేస్తాను అనుకుని ఏకాంత ప్రదేశంలో కూర్చుని తపస్సు చెయ్యడం ప్రారంభించాడు.

   తపస్సు పూర్తయ్యాక జీవులన్నీ ప్రాణాల మీద ఆధరపడి జీవిస్తున్నా వాళ్లు చేస్తున్న పనులు మాత్రం వాళ్ల మనస్సుల మీద ఆధారపడి ఉన్నాయి. మనిషిలో లేదా ప్రాణిలో మనస్సే గనుక లేకపోతే మట్టిబొమ్మతో సమానుడవుతాడు.  మనస్సే భగవంతుడు.

   మనస్సు నుంచే జీవులు ఉద్భవించి, జీవిస్తున్నాయి. మరణించిన తరువాత మనస్సులోనే లీనమవుతున్నాయి. మనస్సు ఒక గొప్ప సూక్ష్మంగా కనిపిస్తున్న ఒక శక్తి. పరమేశ్వరుడికి కలిగిన సంకల్పమే ఈ సృష్టికి కారణమైంది.

   సూక్ష్మమైన మనస్సు అంతటా నిండి ఉంది. సృష్టి సంకల్పం లేకపోతే ఉనికి, లయం అనే ప్రశ్నే ఉండదు. కనుక, ప్రాణం కంటే మనస్సే గొప్పది. మనస్సు వల్లే ఈ జగత్తు మొత్తం పుడుతోంది. దాని వల్లే వృద్ధి చెందుతోంది, దానిలోనే లయమవుతోంది.

   ఈ విధంగా ఆలోచించి మనస్సే మూలతత్త్వమైన బ్రహ్మం అనే నిర్ణయానికి వచ్చాడు భృగువు. తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రీ! మనస్సే బ్రహ్మం అని చెప్పాడు.

   కొడుకు చెప్పింది విని వరుణ మహర్షి నాయనా! తపస్సే బ్రహ్మం. తపస్సు చేసి బ్రహ్మాన్ని తెలుసుకో! అని మళ్లీ పంపించాడు.

   భృగువు మళ్లీ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. మనస్సు యొక్క చలనం వాయువు యొక్క చలనంలా ఉంది. వాయువు ఎవరి అధీనంలోనూ ఉండదు. కాని, ప్రాణిలోను, మానవుడిలోను మనస్సుని అధీనంలో ఉంచుకోగలిగే శక్తి ఒకటి ఉంది. ఆ శక్తే బుద్ధి.

   ఇది మనస్సుకంటే సూక్ష్మమైంది. సందేహం లేకుండా బుద్ధే బ్రహ్మ అని నిర్ణయించుకుని తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రీ! విజ్ఞానమే బ్రహ్మం అన్నది నా ఉద్దేశ్యం బ్రహ్మం అంటే ఎవరో మీరే నాకు ఉపదేశించండి! అని అడిగాడు.

   అంతా విని వరుణ మహర్షి తపస్సు వల్లనే బ్రహ్మాన్ని తెలుసుకో. తపస్సే బ్రహ్మం! అన్నాడు.

   వరుణ మహర్షి ఉద్దేశ్యం ఏమిటి? భృగువు ఎన్ని సార్లు వచ్చి చెప్పినా మళ్లీ మళ్లీ అదే చెప్తున్నాడు. తపస్సే బ్రహ్మం. తపస్సుతో బ్రహ్మాన్ని తెలుసుకో అంటున్నాడు.

   ఆయన అన్నిసార్లు భృగువుని తిప్పేకంటే తనే ఆ బ్రహ్మం గురించి చెప్పెయ్యచ్చు కదా? ఇలా ఆలోచించడం మన పొరపాటు అవుతుంది.   

   పూర్వీకుల నుంచి మనం నేర్చుకోవలసింది ఇక్కడే ఉంది. పూర్వం గురువులు శిష్యులకి విద్య బోధించిన విధానం, గురుశిష్య సంబంధం గురించి ఒకసారి ఆలోచించండి. 

   ఈ ప్రశ్న మనని మనం వేసుకుంటే ఇప్పటి విద్యార్ధుల విషయంలో ఇది తప్పకుండా మనం వేసుకోవలసిన ప్రశ్నే. ఇప్పటి విద్యార్ధుల పరిస్థితి చూస్తే స్వయంగా ఆలోచించి తెలుసుకునే స్థితి లేనేలేదు.

   నోట్సులు, గైడులు చదివించి బట్టీ పట్టించి విద్యార్ధులకు ఉన్న బుద్ధిని వికసించనీయకుండా అణిచి వేస్తున్నారు. అందువల్లే విద్యార్ధులు మంచి చెడులు తెలుసుకో లేక పైకి కనిపించే మెరుగులు చూసి మురిసిపోతూ వాటిని గుడ్డిగా అనుకరిస్తూ వాటికి దాసోహం అంటున్నారు. సంస్కృతీ సంప్రదాయాల్ని మర్చిపోతున్నారు.

   కాని, మన పూర్వీకులు అలా కాదు. గురువు ఎప్పుడూ శిష్యుడు అభివృద్ధిలోకి రావాలని కోరేవాడు. ఆ ఉన్నతికి తగిన పరిశ్రమ స్వయంగా విద్యార్ధితోనే చేయించేవాడు. అతడి బుద్ధి వికసించడానికి, సామర్ధ్యం కలిగి ఉండడానికి తగినట్టుగా చేయూతనిచ్చేవాడు.

   కేవలం పుస్తకంలో ఉన్నవి మాత్రమే నేర్పించి వదిలెయ్యకుండా, చదువు పూర్తయ్యాక సమాజంలో జీవించడానికి అవసరమయిన విషయాలు కూడా తెలియపరిచేవాళ్లు. శిష్యుణ్ని సుగుణవంతుడు, సంస్కారవంతుడుగా తీర్చిదిద్దేవాళ్లు. విద్యార్ధి సంస్కారవంతుడుగా ఎదగడానికి తగిన పునాది వెయ్యడం కూడా బాధ్యతగా స్వీకరించేవాళ్లు.

   శిష్యులు గురువు చెప్పిన విధంగా ఎదిగి దానికి అనుగుణంగా నడుచుకునేవాళ్లు. జీవితాన్ని అతి పవిత్రంగాను, నడవడికని ఆదర్శవంతంగాను ఉంచుకున్న గురువుకి ఎదురు చెప్పగల శిష్యుడు ఉండనే ఉండడు.

   అంటే, అప్పటి గురువులు మొదట తాము ఆచరించి శిష్యులకి చెప్పేవాళ్లు. కనుకనే శిష్యులు కూడా భక్తి శ్రద్ధలతో గురువు మాట జవదాటక అదే మార్గంలో నడుచుకునేవాళ్లు.

   గురువు స్థానంలో ఉన్న వరుణ మహర్షి తన కుమారుడికి సాధనలో వదలని దీక్ష, శ్రద్ధ, ఆసక్తి కలిగేటట్టు చేసి, సాధనతో బుద్ధిని వికసింపచేసి తనకు తానుగా శ్రమించి దానిద్వారా ఫలితాన్ని పొందేలా చెయ్యాలన్న సంకల్పంతో మళ్లీ మళ్లీ తపస్సుకు పంపిస్తున్నాడు.

   తండ్రి తపస్సు చెయ్యమని పంపించినప్పుడల్లా ఆలోచనాశక్తి, పట్టుదల, దీక్ష పెరిగాయే కాని భృగువు మనస్సులో కూడా ఎటువంటి విసుగు కలగలేదు.

   భృగువు మళ్లీ తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. ఏకాంతంలో కూర్చుని ఆలోచిస్తున్నాడు. అన్నం, ప్రాణం, మనస్సు, బుద్ధి యొక్క తత్త్వాలు ఒకదానికంటే ఒకటి ఉన్నతమైన తత్త్వాలు. జీవులకి ఇవన్నీ అవసరమే.

   అసలు వీటి అవసరం ఎందుకు? అన్నం వలన ఉపయోగం ఏమిటి? ప్రాణం ఉండడం ఎందుకు? మనస్సుద్వారా చేసే పనులు, బుద్ధికి కలిగే జ్ఞానం దేనికోసం? అని ఇంతకు ముందు దేన్ని బ్రహ్మం అనుకున్నాడో అన్నీంటి గురించి మళ్లీ ఆలోచించాడు.

   ఏకాంతంగా కూర్చుని ఇదే విషయాన్ని పదే పదే ఆలోచిస్తూ ఉండగా భృగువు మనస్సులో  ఆనందంకోసంఅని తెలిసింది. ప్రాణియొక్క అసలైన స్వరూపం ఆనందం. భృగువు మనస్సులో ఆలోచించి  చివరకి ఒక నిర్ణయానికి వచ్చాడు.

   ఆనందమే బ్రహ్మం. ఎందుకంటే ఆనందం నుంచే జీవులు ఉద్భవిస్తున్నాయి. ఉద్భవించిన జీవులు ఆనందం వల్లే జీవిస్తున్నాయి. మరణించిన తరువాత అనందంలోనే లీనం అవుతున్నాయి.

   ఆనందం గురించి ఆలోచించిన కొద్దీ అతడి బుద్ధి, తపస్సు అనబడే అగ్నిచేత సంస్కరించబడి పరిశుద్ధుడై ఆత్మ నిష్ఠలో లీనమయ్యాడు.

   తరువాత ఆనందమే బ్రహ్మమనీ అదే తన ఆత్మ స్వరూపమని ఆత్మానుభవం వల్ల తెలుసుకున్నాడు. ఇంక తండ్రిని ప్రశ్నించే అవసరం అతడికి లేదు.

    తపస్సు చేత కలిగిన ఆ అనుభూతినే ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందా ద్ధ్యేవ ఖల్వి మాని భూతాని జాయన్తే! ఆనందేన జాతని జీవన్తి ఆనందం ప్రయన్త్యభి సంవిశన్తీతి! ఆనందం వల్లే ప్రాణులు పుడుతున్నాయి  జీవిస్తున్నాయి. దానిలోనే లీనమవుతున్నాయి.

   ఆనందమే బ్రహ్మం అని ఈ ఉపనిషత్మంత్రం చెప్తోంది కనుక మనం అందరంకూడా భృగువు చేసినట్టే పట్టుదలతో సాధన చేసి తపస్సు అనబడే అగ్నితో పవిత్రతని పొంది, జ్ఞానం కలిగి ఆనందరూపమైన బ్రహ్మాన్నిగురించి  తెలుసుకుందాం.

(తైత్తరీయోపనిషత్తు అధారంగా)