About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

గుడి కథలు- “ఇది ఏ గుడి?” http://bhamidipatibalatripurasundari.blogspot.in/

గుడి కథలు-
ఇది ఏ గుడి?

   అమ్మా! పక్కవాళ్ళింట్లో అంత హడావిడిగా ఉందేమిటి? ఆ హాడావిడి పది రోజుల్నుంచి అలాగే ఉంది! ఎందుకు?
వాళ్ళు తీర్థయాత్రలకి వెడుతున్నారు,పది రోజులు! ఎవరూ? ఆంటీ అంకులా? ఎంచక్కా మనం కూడా వెళ్ళచ్చుగా?”
వెళ్ళాల్సిందే! మనం వెడితే నీ చదువు ఎవరు చదువుతారు? అయినా వెడుతున్నది ఆంటీ అంకులు కాదు. తాతయ్యగారు, అమ్మమ్మగారు, ఇంకా కొంత మంది కలిసి వెడుతున్నారు!
   దాని కోసం అంత హడావిడి,వాదనలు,అరుచుకోడాలు,ఇవన్నీ ఎందుకు? ఎందుకేవిటే? వెళ్ళే వాళ్ళకి కావలసినవన్ని అమర్చి పంపాలిగా..! ఇంతకీ ఎందులో వెడుతున్నారు?
   ఎన్ని ప్రశ్నలు వేస్తున్నావే? వాళ్ళు వెళ్ళేది బస్సులో! బస్సువాళ్ళు అందర్నీ పోగేసుకుని సీటుకి ఇంత అని కట్టించుకుంటారు. ఎన్ని రోజులు ప్రయాణమో దానికి తగ్గట్టు ప్రయాణానికి,భోజనానికి కలిపి వేలు కట్టాలి. పెద్దవాళ్ళు, ఒకళ్ళమీద ఆధార పడ్డవాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలేరు. అవసరాలకు అవి కావాలి, ఇవి కావాలి అని అడగలేరు. పంపించేవాళ్ళు కూడా బస్సుకి డబ్బులు కట్టాము కదా...ఇంకా ఖర్చులు ఏముంటాయి? అంటారు. ఎవో ఖర్చులు ఊంటూనే ఉంటాయిగా! అక్కడే వస్తాయి గొడవలు!
  ప్రయాణానికి భోజనానికి కాకుండా ఇంకా ఏం ఖర్చులు ఉంటాయమ్మా?
   అదేమిటే? అలా అడుగుతావు? వాళ్ళు పెట్టిన భోజనం ఒక రోజు బాగుండచ్చు..ఒకరోజు బాగుండక పోవచ్చు.ఎక్కడేనా దైవ దర్శనం ఆలస్యమయి ఆకలయితే ఏమన్నా తినాలని అనిపించవచ్చు! నలతగా ఉండి ఏ మందు బిళ్ళలో కొనుక్కోవలసి రావచ్చు. నీళ్ళు దొరక్క పోతే మంచినీళ్ళ సీసాలు అవసరమవచ్చు! ఏదో ఒక అవసరం ఉండే తీరుతుంది!
   అవును నువ్వు చెప్పింది నిజమే అమ్మా! ఎవరూ లేని ఊళ్ళల్లో తిరుగుతున్నప్పుడు చేతిలో ఖర్చుకి పైకం ఉండాలి! నాకు ఈ ఆలోచన రాలేదు. పంపించే వాళ్ళు ఎక్కువ డబ్బులు ఇచ్చి పంపించాలి. లేకపోతే ఇబ్బంది పడతారు పాపం!
                                                               *******
   అందరూ బస్సెక్కేశారా...ఇంకా ఎవరేనా రావాలా..? బస్సుకి కట్టిన బ్యానరు గట్టిగా ఉందా? ఆ కొబ్బరికాయ తీసి బస్సు ఎదురుగా నిలబడి దేవుడికి దణ్ణం పెట్టుకుని కొట్టు! అయిందా...వచ్చి బస్సెక్కి తలుపు వేసెయ్యి. బస్సులో కూర్చున్నవాళ్ళందరూ ఒకసారి భగవంతుడికి నమస్కారం చేసుకోండి...అన్ని దేవాలయలూ చూసి ఆరోగ్యంగా తిరిగి రావాలని. ఓ.కె. రైట్!
   తెల్లవారి పోయింది. ఏ ఊరొచ్చిందో...?  అటూ ఇటూ చూడకండి...అదిగో సత్రం అక్కడ స్నానాలు ముగించుకుని తయారయి రండి. టిఫిను సంగతి తరవాత. అరగంటలో గుడికి వెళ్ళకపోతే మళ్ళీ దర్శనం లేటవుతుంది. మీరు వచ్చేసరికి ఏకంగా భోజనాలు రడీగా ఉంటాయి. తినగానే మళ్ళీ బయల్దేరిపోదాం.ఒరేయ్! సామాను దించండిరా! కెమేరాలు,సెల్ ఫోన్లు మీతో తీసికెళ్ళకండి.అందరూ కలిసి ఉండండి...దారితప్పితే మళ్ళీ వెనక్కి రాలేరు.
   ఎంత సేపటికి లైను తరగడం లేదండీ. జనాలు మధ్య మధ్యలో వచ్చి చేరిపోతున్నారు. టిక్కెట్టు కొనుక్కున్న ఫలితం కనిపించట్లేదు. పదికి పరక్కి కక్కుర్తి పడి, లైను మధ్యలో జనాల్ని కలిపేస్తే ఉదయం నుండి కాఫీ కూడ తాగకుండా నిలబడ్డవాళ్ళం ఏమవ్వాలి?
   ఊరుకోవే! తీర్థయాత్రలంటే అలాగే ఉంటుంది. కాఫీలు పలహారాలు చూసుకుంటే దైవ దర్శనం ఎలా జరుగుతుంది. భగవంతుణ్ణి స్మరిస్తూ ముందుకి నడు. హమ్మయ్య! చివరికి బయటపడ్డాం!
   అందరూ వచ్చేశారా? బస్సెక్కండి. ఖాళీ సీట్లు ఎవరు రాలేదో చూసుకోండి. అదిగో అ కనిపించే చెట్ల దగ్గర భోజనం చేసి బయల్దేరదాం!   వచ్చేశాం గాని, పొద్దుట్నుంచీ కాఫీ కాదుకదా ..మంచినీళ్ళు కూడా తాగలేదు. తొందరగా పెట్టు నాయనా! తినండి! రండి గబగబా...! అందరూ తినడం అయిపోయిందా? ఆ గిన్నెలన్నీ సర్దేసి బస్సులో పడెయ్యరా! ఓ.కే. రైట్!
   ఏమండీ! మనకి చెప్పినప్పుడు కుషన్ సీట్లు ఉంటాయి...సీట్ల మధ్య కాళ్ళు చాపుకునేందుకు జాగా ఉంటుంది...హాయిగా వెనక్కి వాలి కూర్చోచ్చు...మీకు అసలు శ్రమే ఉండదు! అన్నారు కదా? ఈ బస్సేమిటీ ఎక్కడ పడితే అక్కడ మొరాయిస్తోంది.సీట్లు కొంచెం కూడా వెనక్కి వంగట్లేదు. ముందు సీట్లు తగిలి మోకాళ్ళు పగిలిపోతున్నాయి. ఒకటే నడుము నెప్పి. కొంచెంసేపు నిలబడదామంటే అటు వైపు సీట్లకి, ఇటు వైపు సీట్లకి మధ్య కూడా జాగా లేదు. అడిగితే తీర్థయాత్రలకి వెళ్ళేవాళ్ళు ఎక్కువయ్యారు..బస్సులు ఖాళీ లేక ఇది తీసుకొచ్చాము..ఎదేనా దొరికితే మధ్యలో మారుస్తాము! అన్నారు కానీ అదేం కనిపించట్లేదు.
   తీర్థ యాత్రలంటే అంతేనే! ఇంత దూరం వచ్చి భగవంతుణ్ణి చూడాలంటే కొన్ని కష్టాలు సహించక తప్పదు. ఏదో మన అదృష్టం బాగుండి ఇంత దూరం వచ్చి ఇన్ని దేవాలయాలు చూస్తున్నాం. ఇన్నినదుల్లో స్నానం చేసే అదృష్టం కలిగింది. ఏమంటావు? ఇంత పుణ్యం ఎంత మందికి దక్కుతుంది? అంతా పైవాడి దయ. చెంపలు వాయించుకుని దణ్ణం పెట్టుకో!
                                                                                 ********
   అందరు దిగండి! ఇది చాలా చారిత్రాత్మకమైన గుడి. దీన్ని చూడాలంటే పూర్వ జన్మ సుకృతం ఉండాలి.  రండి!రండి!చెప్పులు బస్సులో వదిలెయ్యండి ఒక రెండు ఫర్లాంగులు నడిస్తే సరిపోతుంది. హాయిగా మనం తినే టిఫిన్లు దొరుకుతాయి రుచిగా తిని రండి! ఈలోగా మేం కూడా  కూరలు, పెరుగు వెతుక్కుని వంట చేసుకుంటాం. మీతో ఒక కుర్రాడు వస్తాడు. వాడికి కూడా టిక్కెట్టు తీసుకోండి. దారి తప్పి పోకుండా మీతోనే ఉంటాడు.
    ఏం దిగుతాం..? కాళ్ళు నడుము కదలట్లేదు. ఒక్క రాత్రి కూడా సుఖంగా ఎక్కడా పడుక్కోనివ్వలేదు. ఎక్కడ బాత్రూములు దొరికితే అక్కడ స్నానమన్నాడు. ఏ గుడి అరుగు మీదో దుప్పటి పరుచుకుని పడుక్కోమన్నాడు. ఒక్కనాడు టిఫిను పెట్టలేదు,కాఫీ ఇవ్వలేదు. పోనీ సీట్లకి ఆనుకుని నిద్రపోదామంటే అవి కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి!
  యాత్ర అంటే అంతేనమ్మా! దిగండి! మళ్ళీ ఇంత దూరం వచ్చి చూడలేరు. అన్నీ అయిపోయాయి కదా..? రాత్రికి ఉండిపోయిన ఒక్క గుడీ చూసుకుంటే పూర్తయినట్టే. అది చూసుకుని వెనక్కి ప్రయాణం. దార్లో ఏదో చిన్న, చితకా గుళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతాం. దిగండి! ఇక్కడ ఆలస్యమయితే రాత్రి మిగిలిన గుడిని చేరుకోలేము!
   ఇంతకీ మనం వెడుతున్న గుడి ఏం గుడండీ..? ఏమోనే..దేవుడి పేరు ఏదయితేనేం...దేవుడు ఒక్కడే కదా...నెమ్మదిగా దిగు! చెప్పులు లేకుండా నడిచి కాళ్ళు పగిలి పోతున్నాయి. అదేమిటండీ! మీ పాదాలు పుళ్ళు పడి అలా వాచిపోయాయి? ఎలా నడుస్తారు. పోన్లే బస్సులోనే కూర్చోండి వెళ్ళద్దులెండి! వెనక్కి బోల్డంత ప్రయాణం చెయ్యాలి. లేకపోతే చెప్పులు వేసుకుని రండి. పోతే పోయాయి. కొత్తవి కొనుక్కోచ్చు! బస్సుని ఆనుకుని ఒక నిముషం నుంచోండి, శరీరం సర్దుకుంటుంది.”
                                                               ********      
   అమ్మా! పక్కింట్లో అమ్మమ్మగారూ తాతయ్యగారూ వచ్చేశారా? గొడవ గొడవగా ఉంది!
   వచ్చి వారమయింది. ఇవాళ అడుగుతున్నావేమిటే? ఇన్నాళ్ళూ నిశ్శబ్దంగానే ఉంది. ఈ రోజే గోడవగా ఉంది!
   నువ్వు బడికి వెళ్ళి పోతున్నావుగా? నీకు తెలియట్లేదు. అయినా వాళ్ళు తిరిగి వచ్చాక మంచం మీద నుంచి లేవనే లేదు. పాపం! ఒళ్ళంతా హూనమయిందట! నడిచి, నడిచి కాళ్ళు పుళ్ళు పడి నడుము నొప్పితో బాధపడుతున్నారు.
   “మరి అంకులెందుకు అంత గట్టిగా అరుస్తున్నారు?
   తప్పు అరుస్తున్నారు అనకూడదు పెద్దవాళ్ళని! వాళ్ళకి ఇచ్చిన డబ్బులు సరిపోలేదుట.ఇకెవరి దగ్గరో కొంత బదులు తీసుకుని వాడుకున్నారుట.  గుడికి వెడితే దర్శనం టిక్కెట్లు,,పూజలు ఆభిషేకాలు,ప్రసాదాలు,అన్నదానాలు పూలు,కొబ్బరి కాయలు వంటి అనేక ఖర్చులు కంటికి కనిపించవు. ఇంత దూరం వచ్చాక ఎవరికేనా ఏదేనా కొనాలికదా...ఏం తెచ్చావు? అని అడిగేవాళ్ళుంటారు. వాళ్ళు పెట్టే తిండి చాలదు. ఏ కాఫీయో టీయో తాగాలనిపించవచ్చు. నడిచి నడిచి ఉంటారు కదా..దాహంతో మంచి నీళ్ళ సీసాలకి కూడ చాలా ఖర్చు అవుతుంది.
   ఇదంతా ఎలా ఉన్నా  వాళ్ళు ఏగుడి చూశారో కూడా చెప్పలేక పోతున్నారు. పదిరోజుల్లో దేశమంతా తిప్పెస్తే ఏ గుడికి వెళ్ళారో...ఏ గుళ్ళో ఏ దేవుణ్ణి చూశారో ఏం గుర్తుంటుంది? అన్ని వేలు ఖర్చు పెట్టి అవన్నీ తిరగి ఆరోగ్య పాడుచేసుకోవడం కంటే ఉన్న ఊళ్ళోనే సాయంత్రం కాసేపు గుడికి వెళ్ళి అక్కడ జరిగే కార్యక్రమాలు చూసి వస్తుంటే భక్తికి భక్తి! ఆరోగ్యానికి ఆరోగ్యం! పెద్దవాళ్ళకి కావలసింది తీర్థయాత్ర కాదు, ఆరోగ్యం, ప్రశాంతత!  అదే చెప్తున్నారు అంకులు. పెద్దవాళ్ళ బాధ చూడలేక కాస్త గట్టిగా చెప్తున్నారు అంతే!

2 comments:

  1. chala baga rasaru tourist bus vallu chese mosalu vunnadi vunnatlu hasyam jodinchi chepparu manchi kadha rachayitriki abhinanadanalu
    ReplyDelete
  2. chala baga rasaru tourist bus vallu chese mosalu vunnadi vunnatlu hasyam jodinchi chepparu manchi kadha rachayitriki abhinanadanalu
    ReplyDelete