About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

చిట్టి కథలు, “అమ్మనాన్నల్ని ఆదరిస్తాం...!! “ http://bhamidipatibalatripurasundari.blogspot.in/


చిట్టి కథలు,
అమ్మనాన్నల్ని ఆదరిస్తాం...!!

   అమ్మా! అమ్మా! గట్టిగా అరిచింది అరుణ.
   ఏమిటో చెప్పు ! ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు ? విసుగ్గా అంది అరుణ తల్లి పార్వతి.
   అమ్మమ్మొచ్చింది ! అంటూ గబగబా ఎదురెళ్ళి రా! అమ్మమ్మా! ఎన్నాళ్ళయిందో నిన్ను చూసి అంటూ అభిమానంగా ఆవిడ చేతి నుంచి పెట్టె అందుకుంది అరుణ.
   అమ్మమ్మొచ్చిందా...ఏది..? అంటూ చేస్తున్న పని ఆపేసి ఆత్రంగా బయటకొచ్చింది పార్వతి. తల్లిని చూసిన ఆనందం ఆమె మొహంలో స్పష్టంగా కనిపిస్తోంది. అరుణ వాళ్ళిద్దరి వైపు మార్చి మార్చి చూస్తోంది. అమ్మమ్మ అమ్మ భుజం మీద చెయ్యేసి ఏమ్మా..! బాగున్నావా తల్లీ...చూసి చాలా రోజులయింది. నీకేమో తీరదు. ఆగలేక నేనే వచ్చేశాను అంది.
   మంచి పని చేశావు. నాకూ నిన్ను చూడాలనే ఉంది. కాని, సంసారం వదిలి రావాలంటే తీరదు. లోపలికి రా...ప్రయాణం చేసి వచ్చావు. ఏమన్నా తిందువుగాని. నేను నిన్ను చూడ్డానికి రావలసింది పోయి పెద్ద దానివి నిన్నేరప్పించాను. పోన్లే ఈ రకంగా అయినా నిన్ను చూసే అదృష్టం కలిగింది ! అంటూ ప్రేమగా తల్లి భుజం చుట్టూ చెయ్యేసి లోపలికి తీసికెళ్ళింది పార్వతి.
   అప్పటిదాక వాళ్ళిద్దర్నే మార్చి మార్చి చూస్తున్న అరుణకి కోపం వచ్చింది. ముందుగా ఎదురొచ్చి బరువు తగ్గించిందేమో తను. వాళ్ళిద్దరే మాట్లాడేసుకుంటున్నారు. ఉక్రోషంతో అరిచింది నేను కూడా ఉన్నానిక్కడ ! అని.
   అయ్యో   ! చిట్టి తల్లికి కోపం వచ్చిందా...లోపలికి వెళ్ళాక మనిద్దరమే మాట్లాడుకుందాంలే...అయినా నేను పెద్దదాన్ని. నాతో మాట్లాడే మాటలు ఏముంటాయి ? నీ తరానికి నా తరానికి మధ్య మరో తరముందిగా..? అంది అమ్మమ్మ.
   అరుణ కోపం అంతలోనే తగ్గిపోయింది. తరాల అంతరాలు మన మధ్య ఎందుకుంటాయి ? నువ్వు నాకు అమ్మమ్మవి. నువ్వంటే నాకు చాలా ఇష్టం ! అంది.
   మరి నీ కాలేజీ సంగతేమిటి? నువ్విప్పుడు కాలేజీకి వెళ్ళిపోవాలి కదా...! అంది అమ్మమ్మ పార్వతి ఇచ్చిన కాఫీ తాగుతూ. ఈ రోజు అన్నీ బందే...నీతో కబుర్లు చెప్పుకోవడమే నా పని...సరేనా? అంది అమ్మమ్మ ఎదురుగా సర్దుకుని కూర్చుంటూ.
   అమ్మమ్మ, మనవరాలు కబుర్లల్లో పడిపోయారు. అమ్మమ్మ తన చిన్నప్పటి సంగతులు చెప్తుంటే పడీపడీ నవ్వుతోంది అరుణ. ఒక్కోసారి అయ్యో ! అదేంటి అమ్మామ్మా! అంటోంది. నువ్వు కూడా చిన్నప్పుడు అల్లరి పిల్లవేనన్నమాట! అంటూ అమ్మమ్మ బుజం తడుతోంది. వీళ్ళిద్దరూ కబుర్లల్లో పడిపోయారు. ఇంకెవరూ గుర్తురారు వీళ్ళకి. అరుణకి అమ్మమ్మంటే ప్రాణం! మురిపెంగా వాళ్ళిద్దర్నీ చూసుకుని తన పనిలో పడింది పార్వతి.
   అరుణ చకచకా తయారయ్యి అమ్మమ్మని బయటకు తీసుకెడతాను రమ్మని గొడవ చేస్తోంది. ఇప్పుడే కదే వచ్చాను...సాయంకాలం వెడదాం..! అంటోంది అమ్మమ్మ. ఎంత చెప్పినా వినిపించుకోకుండా వెంట పెట్టుకుని బయటకి బయల్దేరింది. ఇప్పుడెక్కడికే..? పార్వతి పిలుస్తున్నా వినిపించుకోలేదు అరుణ.
   బయటకొచ్చి ఆటో కోసం నిలబడ్డారు. అందరూ ఆఫీసులకి, కాలేజీలకి వెళ్ళే సమయం కావడం చేత రోడ్లన్నీ పూర్తిగా రద్దీతో నిండి పోయాయి. చెవిలో సెల్ ఫోను పెట్టుకుని మాట్లాడుతూ తోసుకుంటూ తమ పక్కనుంచే వెళ్ళిపోయింది ఒక అమ్మాయి. ఇదేం చోద్యమే కళ్ళతో వింటోందా...చెవులతో వింటోందా...గుడ్డిదాన్లా అలా తోసుకుంటూ వెళ్ళిపోతోంది..? మనిషిని కాబట్టి సరిపోయింది. ఇదే ఏ స్కూటరో అయితే..? అంది అమ్మమ్మ.
   ఊరుకో అమ్మమ్మా...సెల్ ఫోన్లో మాట్లాడుతోందిగా...చూసుకుని ఉండదులే..! చిన్నగా అంది అరుణ.
   ఆ పిల్లెవరే అలా ఆ పిల్లాడి చెయ్యి పట్టుకుని వెళ్ళిపోతోంది !  వీపు మీద పెద్దపెద్ద మూటల్లా సంచీలున్నాయి. వాళ్ళిద్దరూ కాలేజీకే వెడుతున్నారంటావా...అయినా ఈ చెయ్యి ఎంత దూరం పట్టుకుంటాడంటావు..? రోడ్డు మీద వచ్చిపోతున్న వాహనాలు పట్టించుకోవడం లేదు. ఏమన్నా అయితే వాళ్ళ అమ్మానాన్నా ఏడవరూ...? అమ్మమ్మ తల్లి హృదయం బాధ పడింది.
   అయ్యో...అమ్మామ్మా...కాలేజీ పిల్లకి ఇవన్నీ మామూలే ! అలా వెళ్ళడమే ఫ్యాషను. ఒక్కళ్ళు ఒంటరిగా వెడితే అదోలా చూస్తారు. అవన్నీ పట్టించుకోకు. కొంచెం ముందుకి వెళ్ళి ఎక్కుదాం ఆటో ! అరుణ అమ్మమ్మ చెయ్యి పట్టుకుని నడుస్తోంది. అమ్మమ్మ ఏదో గొణుక్కుంటోంది. ఈలోగా ధభీమని చప్పుడు వినిపించింది. ఆగి చూశారు. ఏదో బైక్ పడిపోయింది. దాన్ని నడుపుతున్నవాడు దాని కింద పడ్డాడు.
అమ్మమ్మ కంగారు పడింది. గొణుక్కుంటున్నాను అన్నావు. చూడు...ఏమయిందో? దాని ఫ్యాషను మండ. మీద వేసుకున్న ఆ గుడ్డ ఉండవలసిన చోట ఉండక పోవడం వల్ల గాలికి ఎగిరి వాడి మొహం మీద పడింది. పాపం కళ్ళు కనిపించక ఎటు వెడుతున్నాడో తెలియక కింద పడ్డాడు.  పెద్దవాడే...పిల్లగల వాడై ఉంటాడు. అతనికి ఏమయినా అయితే ఆ కుటుంబం ఏం కావాలీ? ఎవరి గోల వాళ్ళదే గాని, ఒక పద్ధతీ పాడూ లేదు. ఇవన్నీ చూస్తే నాకు దడ వస్తోంది...ఇక్కడ నిలబడదాం...అంటూ నడవడం ఆపేసింది అమ్మమ్మ.
   దగ్గర్లో కాలేజీ ఉందేమో... అంతా హడావిడిగ  బస్సుల్లోంచి దిగుతున్నారు ఆడపిల్లలు. వాళ్ళ వస్త్రధారణ చూస్తూ...కాస్సేపు ఇక్కడే  నిలబడితే నాకే సిగ్గేసేలా ఉంది అనుకుంటూ ముడుచుకుని నిలబడింది అమ్మమ్మ. ఆవిడ ఆలోచనలు తమ కాలంలోకి నడిచాయి. మా కాలంలో అయిదో క్లాసు చదువుకోవడమే గగనమయి పోయేది. చదువుకోవాలన్న ఆశ ఉన్నా..తెలివితేటలు ఉన్నా నూటికి ఒక్కళ్ళకి కూడా  ఆ అవకాశం దక్కేది కాదు. వీళ్ళకి ధ్యాస చదువు మీదో అలంకరణ మీదో తెలియట్లేదు. కవి కలంలోంచి జాలువారిన త్రాచు పాములాంటి జడలు...సంస్కృతీ సంప్రదాయాల్ని ప్రతిబింబించే వస్త్రధారణ.. పలకరించగానే జవాబు చెప్పడానికి నును సిగ్గుతో ఎర్రబడే ఆ మొహంలో అందం...అన్నీ పోయి వీళ్ళని చూసి మేమే సిగ్గుపడే పరిస్థితి వచ్చింది.
   అమ్మమ్మా! గట్టిగా పట్టుకుని కుదుపుతోంది అరుణ.
   ఉండవే! ఆడపిల్లలు వంటింట్లో మగ్గిపోకూడదని...ఎనిమిదేళ్ళకే పెళ్ళి చేసి, ఆ ముసలాడు కాస్తా హరీమంటే మిగిలిన జీవితమంతా మూల పడకూడదని...మొగుడు అత్తమామలు,ఆడపడుచులు ఆరడి పెడుతుంటే కుళ్ళి కుళ్ళి ఏడవకుండా బ్రతకడం నేర్చుకోవాలని... చదువుకునే స్వేచ్ఛని కల్పించాలని...వితంతు వివాహా చేసి వాళ్ళ జీవితాలు ఉద్ధరించాలని...ఎన్నెన్నో ఉద్యమాలు జరిపారు. వాటిని సాధిండమే కాదు ఏ ఇబ్బందులూ లేకుండా చదువుకోడానికి ఆడపిల్లలకి ప్రత్యేక పాఠశాలలు, కళాశాలలు కట్టించారు.
   నాకంటే మెరుగైన జీవితం నా చిన్నారతల్లికి ఉండాలనుకుని నా వంటి తల్లులు ముందుకొచ్చి ఎంతో కొంతయినా చదివించాం. ఇప్పుడయితే తల్లి తండ్రి ఇద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదన మొత్తం పిల్లల చదువులకే ధారపోస్తున్నారు. పెద్ద చదువులకోసం విదేశాలకు పంపించడానికి అయ్యే ఖర్చు కూడా స్తోమత ఉన్నా లేకపోయినా సంతోషంగా భరిస్తున్నారు. ఇంత కష్టపడుతున్న తల్లితండ్రులు, పిల్లల నాగరికత వెర్రితలలు వేస్తుంటే మాత్రం అడ్డుకోలేక పోతున్నారు.ఇచ్చిన స్వేచ్ఛని దుర్వినియోగం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారు. అమ్మ భాషని, సంస్కృతీ సంప్రదాయాల్ని నేల రాస్తుంటే తెలియనట్టు ఉంటున్నారు.
   పిల్లలు స్థిరపడ్డాక తల్లితండ్రులు వృద్ధాశ్రమాలకి తరలి వెళ్ళిపోతున్నారు. కష్టపడి సంపాదించిన ధనాన్ని, శక్తిని, కాలాన్ని వెచ్చించి ప్రయోజకుల్ని చేసిన తల్లితండ్రులకి పిల్లల్ని మందలించే అధికారం లేదా..? భయపడుతున్నారా...చదివించడం ఒక్కటే తమ వంతు బాధ్యతగా అనుకుంటున్నారా...పెద్ద చదువులు చదివిన తమ పిల్లల్ని మందలించే అర్హతని కోల్పోతున్నారా...తల్లితండ్రులు అసలు ఏమాలోచిస్తున్నారు..?
   అంత పెద్ద చదువులు చదువిన పిల్లలు మాత్రం ఏం సాధిస్తున్నారు...పాశ్చాత్య నాగరికతను అనుకరించడమే తాము సాధించిన అభివృద్ధి అనుకుంటున్నారా...తమ అమ్మ ప్రేమ కంటే, పక్క ఊరి అమ్మ ప్రేమే గొప్పదనుకుని అమ్మ ప్రేమనే శంకింస్తున్నారా...చదువు ధన సంపాదనకే అనుకుంటున్నారా...తమ స్వేచ్ఛకి తల్లితండ్రులు అడ్డుగా ఉన్నారని భావిస్తున్నారా...రాబోయే కాలానికి తాము కూడా కాబోయే తల్లి తండ్రులమనే సంగతిని విస్మరిస్తున్నారు.
   పెద్దలు ఉద్యమించింది ఎందుకు..? ఆడపిల్లల్ని అంగడి బొమ్మగా మార్చడానికా...యువతను విదేశాలకి, వృద్ధుల్ని ఆశ్రమాలకి తరలించడానికా...వ్యక్తి స్వాతంత్ర్యం, దేశ స్వాతంత్ర్యం అంటూ స్త్రీలు-పురుషులు, పిన్నలు-పెద్దలు తమ ప్రాణాల్ని అర్పించి సాధించుకున్న దేశ స్వేచ్ఛని ఎటు తీసుకు పోతోంది నేటి యువతరం...? అమ్మమ్మ కన్నీరు కారుస్తోంది.
   ఒక్కసారిగా చప్పట్లు వినిపించాయి. ఈ లోకంలోకి వచ్చిన అమ్మమ్మ చుట్టూ చూసింది. కాలేజీ పిల్లలందరూ అక్కడ చేరిపోయి తను చెప్పింది విని ఆపకుండా చప్పట్లు కొడుతున్నారు. తనను అవహేళన చేస్తున్నారనుకుని అయ్యో..క్షమించండి!ఆవేశంతో ఏదేదో మాట్లాడి మీ కాలాన్ని వృధా చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను! అంటూ రెండు చేతులూ జోడించింది అమ్మమ్మ.
   అక్కడికి చేరిన విద్యార్థులు, తల్లితండ్రులు, నగర పౌరులు అమ్మమ్మా! వ్యక్తిగా వికసించడమంటే ఏమిటో తెలుసుకున్నాం. పాశ్చాత్య నాగరికత వైపు మళ్ళుతున్నందుకు సిగ్గు పడుతున్నాం! అమ్మనాన్నల్ని ఆదరిస్తాం..అమ్మ భాషని గౌరవిస్తాం..దేశ సంస్కృతి సంప్రదాయాల్ని కాపాడతాం! అన్నారు ముక్త కంఠంతో! అమ్మమ్మ వాళ్ళవైపు ఆనందంగాను, ప్రేమగానూ చూసింది. ఆవిడ పక్కనే నిలబడ్డ అరుణ అమ్మమ్మ బుజం మీద చెయ్యేసి నిలబడి అందరివైపు గర్వంగా చూసింది!!


No comments:

Post a Comment