About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సుందరమైన కథలు-క్రోధస్వభావము

క్రోధ స్వభావము
కౌశికుడు కథ
   ఒకరోజు మార్కండేయ మహాముని పాండవుల ఆశ్రమానికి వచ్చాడు. పాండవులు ఆయన్ని ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో పూజించారు. ఆయన స్త్రీ పురుషులకి అవసరమయిన ముఖ్య ధర్మాల గురించి, క్రోధ స్వభావం మనిషి వివేకాన్ని పోగొడుతుందని చెప్తూ పాండవులకి ఒక కథ చెప్పాడు.
   పూర్వం కౌశికుడు అనే పేరుగల బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు గొప్ప తపసంపన్నుడు. కాని, కోపం చాలా ఎక్కువ. తపస్సు వల్ల ఎంత గొప్ప ఫలితాన్ని పొందినా, అతడి కోపం ఆ  ఫలితానికి తగిన ప్రయోజనం లేకుండా చేస్తోంది.
   కౌశికుడు ఒకరోజు తన గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని వేదాధ్యయనం చేసుకుంటున్నాడు. ఆ చెట్టుకొమ్మ మీద కూర్చున్న ఒక కొక్కెర (కొంగ) అతడి మీద రెట్ట వేసింది. అతడు కోపంగా పైకి చూశాడు. అతడి కోప తీవ్రతకి కొక్కెర బూడిదై నేల మీద పడింది.
   అంత కోప స్వభావం కలిగినా కూడా  కౌశికుడు చచ్చి కింద పడిన కొక్కెరని చూసి తను అలా చూడకుండా ఉండవలసింది అని మనస్సులో చాలా బాధ పడ్డాడు.
   మధ్యాహ్నం అవడంతో భిక్షకి బయలు దేరాడు. వికలమైన మనస్సుతోనే తిరుగుతూ ఒక ఇంటి దగ్గర నిలబడి భిక్షాందేహి అని అడిగాడు.
   ఇంటి లోపల ఉన్న ఇల్లాలు అతడికి భిక్ష వెయ్యడానికి సిద్ధం చేస్తోంది. అదే సమయంలో ఆమె భర్త భోజనం పెట్టమని అడిగాడు. అతడికి భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి, అతడు పడుకున్నాక కాళ్ళు ఒత్తుతూ కూర్చుంది.
  బయట భిక్షకోసం బ్రాహ్మణుడు ఎదురు చూస్తున్నాడన్న విషయం అమెకి అప్పటికి  గుర్తొచ్చింది. భర్త నిద్రపోతున్నాడని నిశ్చయించుకుని అతణ్ణి వదిలి భిక్ష తీసుకుని బయటకి వచ్చింది.
   ఆమెని చూసిన కౌశికుడు కోపంతో మండిపడుతూ అడిగిన వెంటనే పెట్టి ఉంటే ఇప్పటికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా? నన్ను ఇంతసేపు ఎందుకు నిలబెట్టావు? ఎందుకు  అవమాన పరిచావు? అని కోపంగా అరిచాడు.
   ఆ ఇల్లాలు శాంతంగా జవాబిచ్చింది అయ్యా! మీకు భిక్ష వేద్దామని తీసుకుని వస్తుంటే నా భర్త ఆకలితో వచ్చాడు. అతడికి భోజనం పెట్టి, అవసరమయిన పనులు పూర్తి చెయ్యడంలో పడి మీ మాట మర్చిపోయాను నన్ను క్షమించండి అని ప్రాధేయపడింది.
   ఆమె మాటలు విని కౌశికుడు నాకంటే నీకు నీ భర్త ఎక్కువయ్యాడా? భిక్ష వేస్తున్నాననే అహంకారంతో నన్ను ఇంత సేపు నిలబెట్టి అవమాన పరిచావు. అసలే కోపంతో ఉన్న నా కోపాన్ని ఇంకా పెంచావు అన్నాడు గట్టిగా.
   అమె చిరునవ్వు నవ్వుతూ నువ్వు కోపంగా చూడగానే కాలి బూడిదవడానికి నేను చెట్టు మీద ఉన్న కొక్కెరని కాదు. నేను మహా పతివ్రతని. నా దగ్గర నీ కోపతాపాలు పనిచెయ్యవుఅని చెప్పింది.
   ఆమె మాటలు విని కౌశికుడు ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె దివ్యదృష్టికి కారణం పాతివ్రత్యమే అని తెలుసుకున్నాడు. తన అవివేకానికి సిగ్గుపడ్డాడు.
   అమెకి రెండు చేతులు జోడించి నమస్కరించి తల్లీ! నీ పాతివ్రత్యం అమోఘమైంది. దయచేసి నాకు ధర్మాన్ని ఉపదేశించు! అని ప్రార్ధించాడు.
   అతడి ప్రార్ధన విని ఆమె అయ్యా! నాకు పతిసేవ చెయ్యడమే తెలుసు. నువ్వు వేదాలు అధ్యయనం చేశావు. కాని, నీకు ధర్మసూక్ష్మాలు తెలియవు.
   మిథిలానగరంలో ఇంద్రియాల్ని జయించినవాడు, ఎప్పుడూ సత్యాన్నే పలికేవాడు, తల్లితండ్రులయందు భక్తి కలిగినవాడు ధర్మాత్ముడు అనే పేరుగల కిరాతుడు ఉంటాడు. అతణ్ణి ఆశ్రయిస్తే నీకు అన్ని ధర్మాలు తెలియ చేస్తాడు అని పతివ్రత అతడికి కొన్ని ధర్మ సూక్ష్మాల్ని బోధించి పంపించింది.
    కౌశికుడు పతివ్రత దివ్యదృష్టికి ఆశ్చర్యపడుతూ, తన ప్రవర్తనకి సిగ్గుపడుతూ ఆమె చెప్పినట్టు అనేక నగరాలు, గ్రామాలు దాటి మిథిలా నగరానికి చేరుకున్నాడు. రాజమార్గంలో వెడుతూ కనిపించిన వాళ్ళని ధర్మవ్యాధుడు ఎక్కడ ఉంటాడో అడిగి తెలుసుకుంటున్నాడు. చివరికి అతడు ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు.
  అతడు కూర్చుని ఉన్నదుకాణాన్ని చూశాడు. అతడు అమ్ముతున్న మాంసాన్ని, అంగడి చుట్టూ మూగి ఉన్న జనాన్ని చూసి అసహ్యంతో దూరంగా నిలబడి పోయాడు .
   కౌశికుడు రావడాన్ని చూసిన ధర్మవ్యాధుడు అంగడి నుంచి బయటకి వచ్చి కౌశికుణ్ణి బ్రాహ్మణోత్తమా! నువ్వు కౌశికుడివి కదా? మహాపతివ్రత పంపించడం వల్ల ధర్మోపదేశం పొందడానికి నా దగ్గరికి వచ్చావు. ఆలస్యంగా భిక్ష వేసినందుకు ఆమె మీద కోపగించినట్టే,  నువ్వు వచ్చిన వెంటనే ఆదరించ లేదని నామీద కూడా ఆగ్రహిస్తావేమో? అందుకే అంగడి విడిచిపెట్టి నేనే నీ దగ్గరికి వచ్చాను అన్నాడు.
   అతడి మాటలు విని పతివ్రత ప్రభావమే ఆశ్చర్యంగా ఉంది అనుకుంటే, ఈ ధర్మవ్యాధుడి ప్రభావం ఇంకా ఆశ్చర్యంగా ఉంది అనుకున్నాడు కౌశికుడు. మహాత్మా! నువ్వు కిరాత వంశంలో జన్మించావు. మాంసాన్ని అమ్ముకుంటున్నావు. నీకు దివ్యదృష్టి ఎలా అబ్బింది? నిన్ను చూశాక నా జన్మ ధన్యమయింది. నువ్వు ఉపదేశించే ధర్మసూక్ష్మాల వల్ల నాకు జన్మ సార్ధకత కలుగుతుంది అన్నాడు.
   ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. కౌశికుడు చండాలుడి ఇల్లు అని సంశయించకుండా భక్తితో అతడి వెంట వెళ్ళాడు.
   ధర్మవ్యాధుడు కౌశికుడికి అనేక ధర్మ సూక్ష్మాలు బోధించాడు. అతడి బోధనల వల్ల కోపాన్ని విడిచిపెట్టి, అజ్ఞానం పోగొట్టుకుని కౌశికుడు గొప్ప వివేకవంతుడయ్యాడు.
   తరువాత ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తన ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళాడు. ఆభరణాలు ధరించి, ఇష్టమైన ఆహారం తింటూ, అనువైన ఆసనాల మీద కూర్చుని ముసలితనంతో వాడి ఉన్న దంపతుల్ని చూపించి కౌశికా ! వీళ్ళు నా తల్లితండ్రులు. వీళ్ళకి సేవ చెయ్యడం వల్లనే నాకు ఇంత గొప్ప దివ్యజ్ఞానం కలిగింది.
   నా సంగతి సరే, మరి నీ సంగతి ఏమిటి? నువ్వు నీ తల్లితండ్రులకి ఒకడే కొడుకునని చెప్పావు. వాళ్ళ అనుమతి తీసుకోకుండా తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నావు. ఇప్పుడు వాళ్ళు ముసలితనంతో బాధ పడుతూ ఉండి ఉంటారు.
   పాపం వాళ్ళు నీ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో, ఎంత ఆవేదన అనుభవిస్తున్నారో. నీ తల్లితండ్రులకి కొడుకుగా నువ్వు తప్ప ఇంకెవరు సేవ చేస్తారు? ఇప్పటికైనా నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళి నీ తల్లి తండ్రుల సేవచేసి తరించు. వాళ్లకి ఇష్టంగా నడుచుకుంటే నువ్వు కృతార్ధుడివి అవుతావు అని చెప్పాడు ధర్మవ్యాధుడు.
   ఈ కథ ద్వారా మార్కండేయ మహర్షి  స్త్రీలకి కుటుంబ క్షేమము, పురుషులకి తల్లితండ్రుల సేవ ముఖ్యమని, కోపస్వభావం అనర్ధాలకి దారితీస్తుందని  తెలియచేశాడు.

కోపస్వభావం వల్ల మనిషి  వివేకాన్నికోల్పోతాడు!!

No comments:

Post a Comment