About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సాయికి భక్తిపూజ _ బాబాలకు భజనపూజ


నాడు సాయిపథం _ నేడు బాబాలపథం

సాయికి భక్తిపూజ _ బాబాలకు భజనపూజ
  
   నన్ను చూడాలని నా మీద భక్తి పెంచుకున్న భక్తులు ఎంత దూరంలో ఉన్నా పిచ్చుక కాళ్ళకు దారం కట్టి లాగినట్టు నా దగ్గరకు లాక్కుంటాను అన్నారు బాబా! పుణ్య కార్యాలను చెయ్యాలని తలపెట్టి ఆ కోరిక బలీయంగా ఉన్నప్పుడు దాన్ని జరిపించే భారం భగవంతుడే తీసుకుంటాడు.
   “బాబా దర్శనానికి వెళ్ళి ఏనాడూ ఏమీ కోరలేదు. బాబా దయ మా మీద ఉండాలని మాత్రమే ఆశించాము!” అన్నారు ఆనాటి భక్తులు. నన్నే భగవంతుడిగా కొలుస్తూ...నా మీదే ధ్యాస పెట్టుకుని నాతోనే గడపాలనుకుంటున్న నా భక్తుల అవసరాలేమిటో నేను గుర్తించలేనా?” అన్నారు బాబా.
    భగవంతుడికి కులమతాలు ఉండవు. ఎవరు ఏ రూపంలో కొలుస్తే భక్తి ఏర్పడుతుందో ఆ రూపంలో కొలుస్తారు. ఎవరి దేవుణ్ణి ఎలా పూజించాలని భావిస్తారో ఆ దేవుడి రూపాన్ని బాబాలో చూసుకుని అదే విధంగా పూజించేవారు.
   ఎవరు ఎలా పూజించినా భక్తులు తనను ఏ రూపంలో చూడాలనుకుంటున్నారో అదే రూపంలో దర్శనమిచ్చి సద్గురువుగా నిరూపించుకున్నారు.
   శిష్యులు ఎప్పుడూ శిష్యులుగానే ఉండిపోకూడదు. వాళ్ళు కూడా గురువులుగా ఎదగాలి. ప్రతి గురువుకూ కనీసం ఒక్కడైనా శిష్యుడు ఉండాలి. జ్ఞాన సంపాదనకు ముగింపు లేదు. గురువు నేర్చుకోవలసిన విషయాలు కూడా చాలా ఉంటాయన్నారు.
   భజన సమాజంలో ఉండేవారు గాని, దాన్ని నడిపేవారు గానీ భక్తులే అయి ఉంటారని భావించవద్దు. భక్తిని ప్రదర్శిస్తూ భుక్తి కోసము, ప్రదర్శన కోసమూ కూడా భజనలు చేసే వారు ఉన్నారు.
   అది ఏ రూపంగా జరిగినా భగవంతుణ్ణి ఉద్దేశించే కనుక అక్కడికి చేరిన వాళ్ళల్లో భక్తుల్ని భగవంతుడే చూస్తాడు.
   గురువును నమ్మిన శిష్యుడికి ఎప్పుడూ చెడు జరగదు. శిష్యులున్నంత మాత్రాన గురువు సద్గురువు కాలేడు. ఎప్పటికయినా శిష్యులు ఆ విషయాన్ని తెలుసుకో గలుగుతారు అన్నారు శ్రీసాయినాథుడు.                                                                                           
                                                                     ********
   పిచ్చుకలతోనూ, దారాలతోనూ పనిలేదు. బుల్లి డబ్బాలు, పెద్ద డబ్బాలు, నలుపు తెలుపు, రంగురంగులవి, గోడకి అతికీంచేవి దేన్నయినా ఉపయోగించగలరు ఈనాటి  బాబాలు.
   తీగలుంటే చాలు, ప్రపంచంలో డొంకంతా కదులుతుంది. కాబట్టి భక్తుల్ని లాక్కోడం ఈనాటి బాబాలకి కష్టమైన పని కాదు.
   తలపెట్టిన కార్యం ఎలాంటిది అనే విషయం పక్కన పెడితే.. నిర్దేశించింది, ఉద్దేశించింది ఎవరి కోసమో వారే మార్గాన్ని కూడా సర్దేసి ఉంచుతారు. ఏనాడయినా భక్తులకు ఉండాల్సింది బాబాల దయే కదా!
  దయ చూపించమని అర్ధంతో కలిపి అర్ధిస్తే ఏ బాబా మాత్రం తన భక్తుల్ని కరుణించకుండా ఉంటాడు?
   బాబా ఏ రూపంలో ఉన్నా భక్తులకి అభ్యంతరం లేదు కాబట్టి పూజించే విధానంలోనూ, పెట్టే ప్రసాదాల్లోను అవసరాన్ని బట్టిఎక్కువ తక్కువలుంటాయేమో గాని, చేసే పూజలోగాని, భజనలో గాని లోటుండదు.
   ఎవరి అవసరాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకుని ప్రతి మేటి భక్తుడికి శిష్య భక్తలుండేలా చూసుకుంటారు. కాలాన్ని బట్టి, అవసరాన్ని బట్టి పెరుగుతున్న బాబాలకి అనుగుణంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ  మేటి భక్తులూ...వారి నుంచి శిష్య భక్తులూ ఎప్పటికప్పుడు కొత్త జ్ఞాన సముపార్జనలోనే ఉంటారు.
   భజన సమాజంలో ఉండేవారుగాని, దాన్ని నడిపేవారుగాని, భక్తులే ఉండాలని లేదు. సమాజం ముఖ్యం. దాన్ని నడిపించడం అంతకంటే ముఖ్యం.
   రెండూ ఉన్నప్పుడు భజనలు  చేసే భక్తులకు లోటుండదు. భక్తి విషయానికొస్తే ఎవరి భగవంతుడి మీద ఎవరికెంత భక్తి ఉండాలో అంతే ఉంటుంది.
  వారి భక్తి కొలత వారి భగవంతుడే చూసుకుంటాడు. అవసరమైతే తనకి అనుగుణంగా పెంచుకుంటాడు కూడా.

   ఈనాటి బాబాలని నమ్మిన మేటి భక్తులకి ఎప్పటికీ చెడు జరగదని...మేటి భక్తులు లేని బాబాలకు స్వయంప్రకాశం ఉండదనీ...ఎప్పటికయినా బాబాలకు మేటి శిష్యులే గురువులనీ...శిష్య భక్తులకి కూలంకషంగా తెలుసు!!

No comments:

Post a Comment