About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

వసంతకేళి హోలి
   హోలీ పండుగని  రంగుల పండుగ అని కూడా అంటారు.  ఈ పండుగను భారత దేశంలోనే కాకుండానేపాల్బంగ్లాదేశ్, ప్రవాస భారతీయులు కూడా జరుపుకుంటారు. భారత దేశంలోని పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్‌లలో దీన్ని దోల్‌యాత్రా(దోల్ జాత్రా ) లేదా బసంత-ఉత్సబ్ ("వసంతోత్సవ పండుగ") అని అంటారు. హోళీ పండుగని బ్రాజ్ ప్రాంతంలో  కృష్ణుడికి సంబంధించిన మథురబృందావనం, నందగావ్, బర్సానా ప్రాంతాల్లో ఘనంగా జరుపుకుంటారు.
   హోలీ రోజు ఒక్క రంగులకే పరిమితం కాకుండా స్నేహితులతో, బంధువులతో రోజంతా ఆనందంగా గడిపేస్తారు. పంటలు బాగా పండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, తామంతా సంతోషంగా పిల్లాపాపలతో సుఖంగా ఉండాలని కోరుకుంటూ జరుపుకునే హోలీని వసంతోత్సవం, కాముని పున్నమి అని కూడా పిలుస్తారు.
   హోలీకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. తెలిసిన వాళ్లమీద, సన్నిహితుల మీదే కాకుండా తెలియనివాళ్ల మీద కూడా రంగులు చల్లి కొత్త బంధుత్వాలు, బాంధవ్యాల్ని కల్పించుకుంటారు. ఈరోజు శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతుంటారు. రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకచోట చేర్చేదే హోలీ అని చెప్పుకోవచ్చు.
  దుల్‌‌‌హేతిధులండి మరియు ధులెండి అనే పేరుతో ప్రజలు రంగుల పొడిని, రంగు నీళ్ళని ఒకరిపై ఒకరు జల్లుకుంటూ ఘనంగా జరుపుకుంటారు. ఫాల్గుణ పౌర్ణమి రోజున మొదలుపెట్టి ఫాల్గుణ బహుళ పంచమి (పౌర్ణమికి ఐదవ రోజు) న పండుగ ముగింపుగా రంగులతో రంగ పంచమి ఉత్సవాన్ని కూడా జరుపుకుంటారు.
హోలీ కథ
   రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు, చాలా కాలం తపస్సు చేసి, "పగలు-రాత్రిగాని,ఇంటి లోపల-బయటగాని, భూమిపైన-  ఆకాశంలోగాని, మనుషులు-జంతువులతోగాని, అస్త్రాలు-శస్త్రాలతోగాని చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి, స్వర్గం మీద, భూమి మీద దాడి చేసి దేవుళ్ళని పూజించవద్దని తననే  పూజించాలని ఆజ్ఞాపించాడు  
   కాని, హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు గొప్ప  విష్ణు భక్తుడు. తండ్రి ఎన్నిసార్లు బెదిరించినా ప్రహ్లాదుడు విష్ణువుని ప్రార్థించడం మానలేదు. హిరణ్యకశ్యపుడు తన కొడుకును చంపాలని ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడయ్యాడు.
   చివరిగా, ప్రహ్లాదుడిని మంటల నుంచి రక్షించే శాలువాని ధరించిన తన సోదరి హోలిక ఒడిలో చితిలో కూర్చోవాలని ఆజ్ఞాపించాడు, ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి, తనను రక్షించమని విష్ణువుని వేడుకున్నాడు. మంటలు మొదలవగానే అందరూ చూస్తుండగా హోలిక శాలువా ఎగిరి పోయి ప్రహ్లాదుడి మీద పడి అతడిని రక్షించింది. హోలిక మంటల్లో దహనం అయిపోయింది. అప్పటి నుంచి హోలీ పండుగని జరుపుకుంటున్నారు.

హోలీ భోగి మంటలు

  హిరణ్యకశిపుడి చెల్లెలైన హోలిక అనే రాక్షసి దహనానికి సంకేతంగా హోలీ భోగిమంటలని వేస్తారు.   విజయదశమి రోజున రావణుడిని ప్రతిమని దహనం చేసినట్లే ఈ పండుగ రోజు కూడా ప్రతిమను దహనం చేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో రాక్షసుల పరాక్రమం హోలిక దహనంతో అంతం అయిందని దీని అర్థం. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో కర్రలను కుప్పగా పోగు చేసి ప్రజలు ఎక్కువగా తిరిగే కూడళ్ళలో లేదా వీధి చివరలో ప్రతిమలను దహనం చేస్తున్నారు. సంప్రదాయ పరమైన పూజలు పూర్తిచేసిన తరువాత మంటలకు ప్రదక్షిణలు చేస్తారు.

దుల్‍‌హెండి

  ముఖ్యంగా సంబరాలను అబీర్, గులాల్‌ అనే అన్ని రంగులతో జరుపుకొంటారు. తరువాత రంగు నీటిని చిమ్మే గొట్టాల ద్వారా ఒకరిపై ఒకరు జల్లుకొంటారు. ఈ రంగు నీటిని తెసు పుష్పాన్ని ఉపయోగించి తయారు చేస్తారు, దీనిని మొదటగా చెట్టు నుంచి సేకరించి ఎండలో ఎండబెడతారు. తరువాత వాటిని నూరి నారింజ-పసుపు రంగులోకి మారడానికి నీళ్లని కలుపుతారు. ఆధునిక కాలంలో రంగు పొడితో ఉన్న గోళాకార వస్తువును విసురుతున్నారు. తగిలిన వెంటనే అది పగిలి, వాళ్ల మీద పొడి రాలుతుంది.

ప్రాంతీయ ఆచారాలు, ఉత్సవాలు

దోల్-పూర్ణిమ (రంగ్ పంచమి) రోజు, ప్రజలు తెల్లని దుస్తులను ధరిస్తారు. ఏ ప్రదేశంలో ఆడాలనుకుంటున్నారో ఆ ప్రదేశంలోకి అందరూ వచ్చి విందులతో ఉల్లాసంగా గడుపుతారు.
  ''హోలి హోలి రంగ హోలి చెమ్మ కేళిల హోలి అంటూ పాడుతూ, డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా జరుపుకుంటారు.   ప్రకృతిలో కనిపించే వర్ణాలన్నీ నర్తిస్తూ ఆవరణంతా రంగుల హరివిల్లవుతుంది. వయో, లింగ భేదాలను పక్కన బెట్టి అందరూ ఒకటిగా మారి జరుపుకునే హోలీ ఎంత అందమైనదో అంత ప్రాచీనమైంది. ఎంత సమష్టితత్వాన్ని కలిగి ఉందో అంత వైవిధ్యాన్నీ చూపెడుతుంది. కనీసం ఒక్క రోజైనా కష్టాలను రంగుల మాటున దాచి నవ్వుల పూవులు వెలయించుకోవడానికి సగటు మనిషికి ఒక అద్భుత అవకాశం ఇస్తోంది.
వసంతకేళి హోలి
  వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త సొగసు కూడా తెస్తుంది. ఎండిన చెట్లు చిగురించి, పూలు పూస్తాయి. కోయిలలు తమ కమ్మని కంఠంతో వీనుల విందు చేస్తాయి. మల్లెలు సువాసనలు వెదజల్లుతూ గుబాళిస్తాయి.
   ప్రకృతిలోని అందాలన్నీ ఆవిష్కరించే వసంతఋతువు ప్రవేశించిన తర్వాత జరుపుకునే తొలి వేడుక
హోలీ పండుగ. ద్వాపర యుగం నుంచే ఉందని చెబుతారు. తన నెచ్చెలి రాధ తనకంటే తెల్లగా ఉంటుందని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద రాధ శరీరం నిండా రంగులు పూయమని కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. తల్లి సలహా మేరకు ఆ వెన్నదొంగ రాధను పట్టుకుని ఆమెమీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటినుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయింది.
కాముడి-పున్నమి-దహనం  -
     సతీ వియోగంతో తపస్సులోవున్న శివుడికి, హిమవంతుడి కుమార్తె పార్వతినిచ్చి దేవతలు వివాహం చెయ్యాలని అనుకుని శివుడికి తపోభంగం కలిగించడానికి మన్మథుడ్ని  పంపించారు. మన్మథుడు పూలబాణంతో శివుడి మనసుని పెళ్లివైపు మరల్చాడు. తపోభంగం కలిగించిన మన్మథుడ్ని తన మూడవ నేత్రంతో భస్మంచేస్తాడు శివుడు.పతీ వియోగభారంతో మన్మథుడి భార్య రతీదేవి ప్రార్థన విని శివుడు అనుగ్రహించి మమథుడికి ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజున శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరాన్ని ప్రసాదిస్తాడు.కాముడు తిరిగి బ్రతికిన రోజు కనుక కాముడి పున్నమి అని కాముడి దహనం అని పిలుస్తారు.
డోలికోత్సవము -
      పాల్గుణ శుద్ద పౌర్ణమి నాడే వెన్నదొంగ అయిన కృష్ణుడ్ని ఊయలలో (డోలికలో) వేసారట.అందుకే దీనిని డోలికోత్సవం అని పిలుస్తారు.ఈ పండుగను శ్రీకృష్ణుడి నగరమైన మధురలో 16 రోజులు పాటు ఎంతో వైభవంగా నిర్వహించారు అని అంటారు.
రంగుల ఎంపిక- జాగ్రత్తలు
   పూర్వం ఈ పండుగకు ఉపయోగించే రంగులను సంప్రదాయబద్ధంగా తయారుచేసేవారు. ఇవి కళ్ళలోకి పోయినా పెద్దగా హాని కలిగించేవి కావు. అయితే ఇప్పుడు లభించే రంగుల్లో హానికరమైన రసాయనాలు, విషపూరితమైన పదార్థాలు కలుపుతున్నారు. ఇవి శరీరం మీద పడి వెంటనే చర్మం ఎర్రబారడం, దద్దుర్లు రావడం, తిమ్మిరి తదితర బాధలు కలుగుతున్నాయి. ఈ రంగులు కళ్ళలో పడితే పాక్షికంగా లేదా శాశ్వతంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. అందుకే రంగుల ఎంపిక విషయంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాలి.
   ఆనందానికి ప్రతీకగా జరుపుకునే హోలీ విషాదం కాకుండా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. రంగులు చల్లుకుంటూ వాహనాలమీద స్పీడుగా వెళ్ళడం మంచిది కాదు. అదేవిధంగా రోడ్డుమీద కనిపించే అపరిచితులపై కూడా రంగులు చల్లకూడదు. రంగులు పూయించుకోవడం అంటే కొందరు ఇష్టపడరు. అలాంటి వారి జోలికి వెళ్ళకూడదు. వారికి బలవంతంగా రంగులు పూసే కార్యక్రమానికి స్వస్తి పలకండి. వయోవృద్ధులు, పేషంట్ల మీద రంగులు చల్లడానికి ప్రయత్నించకండి. అలాగే ఐదు సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పిల్లల మీద కూడా రంగులు చల్లకూడదు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో హోలీ వేడుకలు
  ఒరిస్సాలోని జగన్నాథ, పూరీ ఆలయాలలో కృష్ణుడు, రాధ విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు. గుజరాత్ లో ఈ పండగను అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటారు. మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఆనందిస్తారు. అందరూ పెద్ద మైదానం లాంటి ప్రదేశం వద్ద గుమికూడి   ఇంట్లో ఉన్న పాత చెక్కసామానులన్నీ తీసుకొచ్చి మంటలు వేస్తారు.
   మహారాష్ట్రలో హోలీక దిష్టిబొమ్మను దహనం చేస్తారు. హోలీ  వేడుకకి ఒక వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం దాకా మండుతూనే ఉంటాయి. అంత పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.
  మణిపూర్లో మగపిల్లలు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వాళ్ల మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాశ్మీర్లో  సైనికుల పహారాలో సైనికులతో సహా అందరూ హోళీ ఉత్సవాలలో పాల్గొంటారు.
   పండుగలు ఏవైనా అందరిలో ఉత్సాహన్ని అనందాన్ని నింపేవే. కొన్ని జగ్రత్తలు తీసుకుంటూ అందరినీ కలుపుకుంటూ ఆనందంగా గడపాలి. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు!

                                                                                                       
         

No comments:

Post a Comment