About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

గుడి కథలు- “కదిలే గుడి” http://bhamidipatibalatripurasundari.blogspot.in/


గుడి కథలు-
కదిలే గుడి

  
    అజయ్ ! రేపు మా కాలనీకి గుడి వస్తోందిరా...!  నువ్వు కూడా వస్తావా ? ఎంచక్కా చూడచ్చు! అడిగాడి ఉదయ్.
   గుడి రావడమేమిట్రా...వీడికేదో పిచ్చెక్కినట్టుంది. ఒరే చూడండిరా ! గుడి వీడి కాలనీకి వస్తోందిట !పడి పడి నవ్వుతున్నాడు అజయ్.
"ఎందుకురా నవ్వుతున్నావు ? నిజంగానే వస్తోంది. మేం రమ్మంటే మా ఇంటికి కూడా వస్తుందిరా ! ఉక్రోషంగా అన్నాడు ఉదయ్.
"మీ ఇంటికి కూడ వస్తుందా...ఒరేయ్ ! గుడికి మనం వెళ్ళాలి కాని, గుడి మన దగ్గరికి రాదు నాయనా ! ఎవరో నిన్ను ఆట పట్టించారు తెలుసా ?" అన్నాడు అజయ్.
"అదేం కాదు, నిజంగానే గుడి మా కాలనీకి వస్తోంది. చూడాలనుకుంటే రేపు మా ఇంటికి రా...నేను నీకు చూపిస్తాను. అప్పుడు నిన్ను చూసి నేనే నవ్వుతాను ! అన్నాడు ఉదయ్ ఉక్రోషంగా.
   ఏమయిందిరా మీ ఇద్దరికీ ? గొడవ పడుతున్నారు ? ఆడిగాడు విజయ్. చూడరా...వాడి కాలనీకి రేపు గుడి వస్తుందిట. మనల్ని కూడా చూడ్డానికి రమ్మంటున్నాడు. అంటే అది మొబైల్ గుడి అన్నమాట! ఎక్కాడేనా గుడి కాలనీలకి తిరుగుతుందా...మనం గుడికి వెడతామా...వీడికెవరో బాగా పెచ్చెక్కించారు !అన్నాడు వెటకారంగా అజయ్.
  పోన్లేరా, పాపం వాడికి ఎవరో చెప్పి ఉంటారు. నిజమనుకున్నాడు. రేపు వాడికే తెలుస్తుందిగా...దానికి నువ్వు నవ్వడం ఎందుకు... వాడికి కోపం తెప్పించడం ఎందుకు ?అన్నాడు అప్పుడే వచ్చిన వినయ్. వాళ్ళందరూ తలో విధంగా మాట్లాడుతుంటే కోపం వచ్చేస్తోంది ఉదయ్ కి. వాళ్ళకి తెలియదు, చెపితే వినరు. పైగా వెటకారం ఒకటి. రేపు తన కాలనీకి తీసికెళ్ళి చూపిస్తే సరి. అర్ధమవుతుంది. గుడి కదులుతుందో లేదో ? గుడి కదలదు మనమే గుడి దగ్గరకి కదలాలి అని కదా వాళ్ళు చెప్పేది. ఒకసారి చూస్తే జన్మలో ఈ మాట అనరు తనలో తను మాట్లాడుకుంటున్నాడు ఉదయ్.
  అరే ఉదయ్ ! వాళ్ళ మాటలు పట్టించుకోకురా...రేపు మేము అందరం మీ కాలనీకి వచ్చి నువ్వు చెప్పిన గుడి చూసే వెడతాం. ఎలాగూ రేపు మనకు సెలవేగా ! అనునయించాడు వినయ్. నువ్వు మంచివాడివిరా...కనీసం నన్ను అర్ధం చేసుకున్నావు. అయినా వచ్చి చూసి నేను చెప్పింది సరయింది కాకపోతే కదా నవ్వాలి ? వీళ్ళు ముందే నవ్వేస్తున్నారు. రేపు నాక్కూడా వస్తుందిలే నవ్వే ఛాన్సు ! అనుకుంటూ పుస్తకాల సంచీ తీసుకుని వస్తారా వినయ్ ! రేపు కలుద్దాంలే! అంటూ వెళ్ళిపోయాడు. పదండిరా రేపు ఉదయ్ వాళ్ళ కాలనీకి వచ్చెయ్యండి. ఆ వచ్చే గుడేదో మనం కూడా చూద్దాం. అందరు ఎవరి పుస్తకాల సంచి వాళ్ళు తీసుకుని ఇళ్ళకి వెళ్ళి పోయారు
             
                                                                 ********    

   "ఉదయ్ ! ఇంత ఆలస్యంగా వచ్చావేం? ఆ ముఖమేమిట్రా అంత ఎర్రబడి పోయింది? ఎవరితోనయినా పోట్లాడావా ఏంటి? రోజూ ఎవరితోనో ఒకళ్ళతో గొడవ పెట్టుకోక పోతే కాని, తోచదు నీకు. నీ స్నేహితులందరూ కలిసి మెలిసి ఉంటారుగా. అందరి పేర్లు ఒకేలా ఉండాలని పేర్లు కూడ మార్చేసుకున్నారు. ఇంతకీ గొడవ ఏమిటి ? అడిగింది సులోచన.
  " ఏం లేదులే ! వాళ్ళంతే ! మూర్ఖులు. చెప్తే వినరు. వాళ్ళు చెప్పిందే అందరూ వినాలి. విషయం నిజమైనప్పుడు నమ్మాలిగా ? వాళ్ళ దగ్గరున్నది అదే ! కోపంగా పుస్తకాల సంచీ విసిరేశాడు. సరేలే ! స్నానం చేసి ఆ బట్టలు మార్చి ఏమన్నా తిను. ఆకలి తగ్గిందంటే నీ కోపం కూడా తగ్గుతుంది!అంది సులోచన.
   నాకేం కోపం లేదు ! అంటూ విసవిసా నడుస్తు వెళ్ళిపోయాడు.
   "ఏమిటో వీడికెప్పుడూ కోపమే...వీళ్ళేం స్నేహితులో...వీళ్ళదేం స్నేహమో ? అంతట్లోనే పోట్లాడుకుంటారు, అంతట్లోనే మాట్లాడుకుంటారు. ఉదయ్ స్నానం చేసి వచ్చాడు కాని మొహం మాత్రం ఇంకా ముడుచుకునే ఉంది. సులోచన ఉదయ్ దగ్గర కూర్చుని ఇవిగోరా నీకు ఇష్టమయిన ఛిప్సు తింటూండు ! అని లోపలికి వెళ్ళి మంచినీళ్ళ గ్లాసుతో తిరిగి వచ్చింది. హమ్మయ్య!  ఇప్పుడు చెప్పు నీ కోపానికి కారణమేమిటి పుత్రరత్నమా ! అంది ఉదయ్ ధోరణిలో మార్పు తేవాలని. ఫో అమ్మా! నీ కెప్పుడూ నేనంటే వేళాకోళమే!  ముందు అడుగుతావు...తర్వాత ఇంతేనా ! అంటావు నేను చెప్పను!
   సరదాగా అంటాను అంతేరా! నువ్వంటే నాకు వేళా కోళమేమిటి నీ మొహం. సరే కాని ఏం జరిగిందో చెప్పు. నువ్వు చెప్పింది సరయినదైతే నీ స్నేహితులకి కూడ నేనే సర్ది చెప్తాను సరేనా ? బుజ్జగించింది ఉదయ్ తల్లి సులోచన.
  " ఏమిటీ తల్లీ కొడుకులు అంత ముచ్చటగా మాట్లాడుకుంటున్నారు ? లోపలికి వస్తూ అడిగారు ఉదయ్ తండ్రి సుధాకర్. ఏం లేదండీ మీ కొడుకు స్నేహితుల మీద అలిగాడు. ఎందుకో అని అడుగుతున్నాను. అమ్మకి వద్దులే కాని, నాకు చెప్పరా కన్నా ! కొడుకు పక్కన కూర్చుని తల నిమురుతూ అడిగారు.
   వాళ్ళిద్దరు మాటల్లో పడగానే లోపలికి వెళ్ళి పోయింది సులోచన. ఆశ్చర్యపోతూ గావుకేక పెట్టిన సుధాకర్ అరుపుకి కాఫీ గ్లాసుతో బయటకి వచ్చింది. "ఏమయిందండీ ? వీళ్ళేమన్నా కొట్టుకున్నారా ? అందరూ బాగానే ఉన్నారా ? భయంగా అడిగింది సుధాకర్ చేతిలో కాఫీ గ్లాసు పెడుతూ.
   "అందరూ బాగానే ఉన్నారు. వీడు నాకు మొబైల్ గుడి, కదిలే గుడి, తిరిగే గుడి, ఇంటింటి గుడి గురించి చెప్తుంటే ఆశ్చర్యపోయాను అంతే ! నువ్వు వినలేదా .. రేపు మన కాలనీకి గుడి వస్తుందిట. ఎవరి ఇంటి ముందు ఆపి పూజలు చెయ్యమంటే వాళ్ళ ఇంటి ముందు ఆపి పూజలు చేస్తారుట ! మనం కూడా మన ఇంటికి గుడిని పిలుద్దామా ? అని అడుగుతున్నాడు ! అన్నారు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోని సుధాకర్ కొడుకువైపు అయోమయంగా చూస్తూ.
   అందుకే అన్నాను నేను చెప్పనని ! మీరు కూడా నన్ను వేళాకోళం పట్టిస్తున్నారు. ఆ అజయ్ గాడూ వాళ్ళు కూడా అంతే! నేను చెప్పింది నమ్మకుండా నన్ను ఆట పట్టించారు. మూతి ముడుచుకుని కూర్చున్నాడు ఉదయ్. నిన్ను వేళాకోళం చెయ్యట్లేదురా... మాకే ఆశ్చర్యంగా ఉంది. సంచార గ్రంధాలయాలు విన్నాం...మొబైల్ ఫోన్లు గురించి విన్నాం...ఇంటింటికి వచ్చే గంగిరెద్దులు...ఏదో పళ్ళాలు పట్టుకుని ఒక దేవుడి బొమ్మ పెట్టుకుని వచ్చేవాళ్ళ గురించి విన్నాం కాని కదిలే గుడి గురించి వినలేదురా. అయినా గుడి మొత్తం కదిలి వచ్చేస్తే దాన్ని పెట్టాడానికి చోటు ఎక్కడ ఉంటుంది?  అందుకే ఆశ్చర్యంగా ఉంది అంతే...నీ మాట మీద నమ్మకం లేక కాదు ! అన్నారు ఇంకా అయోమయంలోనే ఉన్న సుధాకర్.
  పోన్లెండి రేపు సెలవేగా...అదేదో మనమూ చూడచ్చు! అంది సులోచన ఇద్దరికీ సర్ది చెప్తూ. రాత్రి భోజనం చేసి పెందరాడే పడుకున్నాడు ఉదయ్. ఏమండీ! వీడు చెప్పింది నిజమేనంటారా ? ఇదేదో వింతగా అనిపించట్లేదూ ? అడిగింది సులోచన. అసలు ఇప్పుడు  జరుగు తున్నవన్నీ వింతలే ! చూడడమే గాని ఆశ్చర్యపోడాలు లేవు సులోచనా! ప్రపంచమే వింతగా నడుస్తోంది. నువ్వు చెప్పినట్టు మిగిలిన విషయాలు రేపు వెండి తెరమీదే! అన్నాడు సుధాకర్.
                                        
                                                                        *********

    తెల్లవారుతూనే భక్తి పాటలతో హోరెత్తిస్తూ బయటంతా హడవిడిగా ఉంది. సెలవే కదా కాస్త నెమ్మదిగా లేద్దాం అనుకుంటూనే ఆ భజనల గోలకి నిద్ర పట్టక లేచి బయటకు వచ్చి చూశారు సుధాకర్. ముందు రోజు ఉదయ్ చెప్పింది గుర్తుకొచ్చింది. కాలనీ వీధిలో ఒక ట్రాక్టరులో దేవుడి బొమ్మ పెట్టి  మైకులో పాటలతో హోరెత్తిస్తున్నారు. ఎవరికి తోచినట్టు వాళ్ళు పాడేస్తున్నారు. ఎవరి భజనలు వాళ్ళు చేసేస్తున్నారు. వీధి మొత్తం ఎవరికి రాకపోకలు లేకుండా చేశారు.
   ఒక్కొక్క ఇంట్లోంచి భక్తులు వచ్చి చేరి పోతున్నారు. స్నానాలయినా చేశారో లేదో తెలియదు కాని, అందరూ భక్తి పారవశ్యంతో ఊగిపోతూ భజనలు చేస్తున్నారు.  కొందరు ఆడవాళ్ళు ఆ దేవుణ్ణి తీసుకుని వచ్చిన వాళ్ళకి అన్నపానాలు చూస్తున్నారు...కొందరు పువ్వులు, కొబ్బరి కాయలు హారతులు ఇస్తున్నారు. దక్షిణలు ఇచ్చేవాళ్ళ పేర్లు మైకులో చెప్తున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి దక్షిణలు ఇస్తున్నారు. ఒక ఇంటి నుంచి ఒకళ్ళు కాదు భార్యభర్తలు కూడ పోటి పడ్తున్నారు. తమ పేరు కాలనీలో అందరికీ వినిపించిందో లేదోనని మళ్ళీ మళ్ళీ చెప్పించుకుంటున్నారు.
   సుధాకర్ కి సులోచనకి ఏమీ అర్ధం కాలేదు. అసలు ఎవర్ని అడిగి వాళ్ళని రప్పించారు...కాలనీ మొత్తం వినిపించేలా భజనలు చేసేస్తుంటే పసిపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధ పడేవాళ్ళు ఏం కావాలి? వీళ్ళందరి ఇంట్లో దేవుడి బొమ్మ లేదా...రోజూ దండం పెట్టుకోట్లేదా ? ఎవరికి తోచినట్లు ఈ విధంగా ఆరున్నొక్క రాగంతో పాడేస్తుంటే వినేవాళ్ళు పిచ్చివాళ్ళా ? దక్షిణలు ఇవ్వడం అయిపోయి ఇంక ఇంట్లో డబ్బులు లేక కూరగాయలు, బియ్యం, సరుకులు కుప్పలు పోస్తున్నారు పిచ్చి ప్రజలు. వాళ్ళందర్నీ ఆశీర్వదించి కాలనీలన్నీ తిరగడం పూర్తయ్యాక వాళ్ళి ఇచ్చిన దక్షిణలతో పెద్ద గుడి కట్టించి ఆ సరుకులతో అన్నదానం చెస్తామని మాటిచ్చారు.
   ఈ హడావిడికి ఉదయ్ కూడా లేచి గబగబా తయారయ్యి బయటకి వెళ్ళిపోయి ఆ జనంలో కల్సిపోయాడు. వాడి స్నేహితులు కూడా వచ్చేశారు. అందరూ ఉదయ్ చెప్పింది నిజమేనని అనుకున్నారు. గుడి దగ్గరికి మనం వెళ్ళక్కర్లేదు...గుడే కదిలి వచ్చేస్తుందిరా! ఇది బాగుంది కదూ ! అనుకుంటున్నారు. రండి బాబూ వచ్చి దండం పెట్టుకోండి. మీకు మంచి చదువు వస్తుంది. మీ తల్లితండ్రులు ఎప్పుడూ మీ మీద కోపం చెయ్యరు. ఏది బాబూ ఆ చేతికి పెట్టుకున్నది హుండీలో వేసెయ్యి దక్షిణ లేకపోయినా ఫరవాలేదు. రండి కుంకం పెట్టుకోండి ! అని చెయ్యి పట్టుకుని పిల్లల్ని లాగి వాళ్ళ దగ్గరున్నవి తీసుకుని హుండీలో వేస్తున్నారు. అమ్మల్లారా ! ఆ మెడలో ఉన్న తాళి బొట్టు కూడా హుండీలో వెయ్యండి ! మీ భర్తలు కలకాలం ఆయురారోగ్యలతో సుఖంగా ఉంటారు! మైకులో అరిచి చెప్తున్నారు.
   సుధాకర్ కి కోపం ఆగలేదు. పోలీసులకి ఫోను చేశాడు. కోపంగా ట్రాక్టరు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని రెక్కలు పట్టుకుని లాక్కొచ్చాడు. ఏరా..! మీకు కూడా పిచ్చి పట్టిందా ? కదిలే గుడి. మొబైల్ గుడి అంటు పరుగెట్టారు. మీకు కళాశాలకి వెళ్ళకుండా డిగ్రీలు వచ్చెయ్యాలి, గుడికి వెళ్ళకుండా దేవుడే ఇంటికి వచ్చెయ్యాలి, ఆడుకునేందుకు బయటకు వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చుని కంప్యూటర్లో ఆడేసుకోవాలి...ఇంక మీరు చేసేదేమిట్రా..? వండిపెడితే తిని పెడాతారా ? బయటకి వెళ్ళారంటే చంపేస్తాను! కదలకుండా కూర్చోండి! ఉదయ్ ! నీ చేతి వాచీ కూడ వాడికి పడేశావా? మీ ఇళ్ళల్లో దేముడు లేడా ? ఏనాడయినా స్నానం చేసి ఒక్క నమస్కారం చేసార్రా? ఇవన్నీ అబద్ధాలురా! వీటిని నమ్మకండి. బుద్ధిగా చదువుకోండి..హాయిగా ఆడుకోండి. మి తల్లి తండ్రులు మీ మంచి కోసమే కేకలేస్తారు సుధాకర్ చెపుతుండగానే పోలీసు వ్యాను వచ్చేసింది. కదిలే గుడిలో ఉన్న వస్తువులన్నీ పోలీసులకి దొరక్కుండా దాచేసుకుని గుడే కదిలి వెళ్ళిపోయింది.
   ఉదయ్ తో పాటు స్నేహితులందరు కదిలే గుడి, దాన్లో పారిపోతున్న దేవుణ్ణి చూస్తూ నోళ్ళు తెరుచుకుని చూస్తున్నారు!!

No comments:

Post a Comment