About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

చిట్టి కథలు- “అక్క సలహా...!” http://bhamidipatibalatripurasundari.blogspot.com/


చిట్టి కథలు-
అక్క సలహా...!

   ఇంటి తలుపుకి తాళం వేసి తాళాలు చేతి సంచీలో వేసుకుని కావలసినవి అన్నీ తెచ్చుకున్నానా లేదా అని ఒకసారి ఆగి చూసుకుంది. ఏమున్నా లేకపోయినా సెల్ ఫోను, బ్యాంకు కార్డు ఉంటే చాల్లే అనుకుని పిల్లల్ని బడికి, దొరగార్ని ఆఫీసుకి పంపించి షాపింగుకి బయలుదేరింది రాగిణి. ఇదే సమయంలో ఎవరేనా ఇంటికి వస్తే ఇంతే సంగతులు...వచ్చేవాళ్ళు ఫోను చేసి వస్తే ఫరవాలేదు లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడతారు అనుకుంటూ బస్టాపు వైపు నడిచింది.
    బస్సు రాగానే ఎక్కి ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుంది. బజార్లో కొనవలసినవి గుర్తు చేసుకుంటోంది.అసలే పిల్లలు చాంతాడంత లిస్టు చెప్పారు...ఏది మర్చిపోయినా వాళ్ళతో గొడవే! ఇంతలో బస్సు ఆగడం ముగ్గురు ఆడపిల్లలు ఎక్కి రాగిణి పక్కన ఒకళ్ళు, ముందు సీట్లో ఇద్దరూ కూర్చున్నారు. పక్కన కూర్చున్న అమ్మాయి కళ్ళు తుడుచుకుంటూ మాటి మాటికి వెక్కిళ్ళు పెడుతోంది. ముందు సీట్లో కూర్చున్న ఇద్దరు పిల్లలూ ఊరుకోవే ! మనం ఏం చేస్తాం చెప్పు...ఏడవకు తలనొప్పి వస్తుంది. ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు. ఊరుకో భవితా ! ప్లీజ్ ! మాక్కూడా కాళ్ళు, చేతులూ వణికిపోతున్నాయి భయంతో...ఊరుకో ! అంటూ నచ్చచెప్తున్నారు.
   కాని, ఆ పిల్లకి ఏడుపు ఆగట్లేదు. నిశ్శబ్దంగా ఏడుస్తోంది. కళ్ళు, బుగ్గలూ తుడుచుకుంటోంది. పాపం ! ఇంకా మొహంలో పసితనం పోలేదు. తుడిచీ తుడిచీ లేత బుగ్గలు కందిపోతున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తయిందో లేదో...ఎందుకు ఏడుస్తోందో...స్టాపుల్లో బస్సు ఆగుతోంది. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతున్నారు. ఆ పాప ఏడుపు ఆగలేదు...స్నేహితులు ఓదారుస్తూనే ఉన్నారు.
   దిగవలసిన స్టాపు వచ్చిందేమో ముగ్గురూ దిగేసారు. వాళ్ళతోపాటు రాగిణి కూడా అదే స్టాపులో బస్సు దిగేసింది. ఎందుకో ఆ పిల్లల్ని చూస్తే వదలాలని అనిపించలేదు. వాళ్ళ వెనకే నడుస్తూ మాటలు కలిపింది. హలో ! నేను కూడా ఇప్పుడు మీరు చదువుతున్న కలేజీ లోనే చదివాను. అంటే,నేను మీకు అక్కనవుతాను కదా...నేను నా చెల్లెళ్ళతో కాసేపు మాట్లాడచ్చా? వాళ్ళు మాట్లాడలేదు. భయం లేదు. నాకు ఐస్క్రీం తినలని ఉంది. తోడు ఎవరూ లేరు. నాకు కొంచెం కంపెనీ ఇచ్చారంటే మాట్లాడుకుంటూ తిందాం సరేనా..? అంది.
  వాళ్ళు సందేహించారు. ఆలస్యమయితే ఇంటిదగ్గర కోప్పడతారు. వద్దక్కా ! ఏమనుకోకు అన్నారు. రాగిణికి ధైర్యం వచ్చింది. ఎక్కువ సేపు మాట్లాడను కొంచెంసేపే! ఐస్క్రీం తినేంతసేపే...కాలేజి కబుర్లు వినాలని ఉంది. చదువయిపోయాక అటువైపు చూడనేలేదు. అక్కా! అని పిలిచారు కదా...ప్లీజ్! అంది.  వాళ్ళకీ కొంచెం ధైర్యం వచ్చింది. సరే! అన్నారు.
   అందరూ వెళ్ళి కూర్చున్నారు. ఎవరికి ఇష్టమయింది వాళ్ళు ఆర్డరిచ్చుకోండి. ఒకళ్ళు బలవంతం చేసింది కాకుండా మనకి ఇష్ట మయిన పనే మనం చెయ్యాలి. కాకపోతే మనం చేసే పని మంచిదయితే చాలు. ఇప్పుడు ఐస్క్రీం కూడా ఎవరికి ఇష్టమయింది వాళ్ళు తిందాం! అంది రాగిణి. వాళ్ళ మొహాల్లో వెలుగొచ్చింది. అప్పటి వరకు ఏడుస్తున్న భవిత కూడా ఏడుపు సంగతి మర్చిపోయి ఇష్టమయిన ఫ్లావరు ఆర్డరు చేసుకుంది.
   నలుగురూ కబుర్లల్లో పడ్డారు. రాగిణి అ కాలేజీలో చదివినప్పుడు వాళ్ళ స్నేహితులతో కలిసి మేడమ్సుని ఎలా ఏడిపించేవాళ్ళో చెప్పింది. తిట్టినప్పుడు తిట్టినా మేడమ్సు కూడా ఎంత ప్రేమగా చూసుకునేవాళ్ళో చెప్పింది. ఒకళ్ళతో ఒకళ్ళు పోటీపడి చదువుకోవడం... ఆటలు ఆడుకోవడం...ఒకళ్ళ మీద ఒకళ్ళు యాసిడ్ పొయ్యడానికి పరుగులు పెట్టి చివాట్లు తినడం చెప్పి చివరికి అసలు అల్లరి చేసిన వాళ్ళు తప్పించుకుని మిగిలిన వాళ్ళు తిట్లు తిని కొరకొరా చూస్తూ ఉంటే...అంటూ రాగిణి పడీ పడీ నవ్వింది. అది విని భవిత అయితే అక్కా! నువ్వు కూడా బాగానే అల్లరి చేశావన్నమాట! అంది.
   అంతవరకు బాధగా ఉన్న వాళ్ళు నవ్వుకుంటూ కబుర్లల్లో పడ్డారు. ఇంకొక ఐస్క్రీము తెప్పించుకుందామా? అంది రాగిణి. అమ్మో.. వద్దక్కా లావయిపోతామక్కా! అంది భవిత. భవితా! నీపేరెంత బాగుందో ! బలే సెలక్టు చేశారు మీ నాన్నగారు. నువ్వెంత బాగున్నావో...నీ పేరు కూడా అంత బాగుంది. అసలు ఇప్పుడే మీకిష్టమయినవన్నీ తినెయ్యాలి. పెద్దాళ్ళమయ్యాక అసలు తినడానికే ఉండదు తెలుసా? నన్ను చూడు ఏం తీసికెళ్ళిన నా రాక్షసులు ఇద్దరూ నాకేమీ మిగల్చకుండా మొత్తం తినేస్తారు.వద్దనలేను కదా! ఇప్పుడు లావయిపోతాం అనుకుంటే ఈ వయస్సు, స్వేచ్ఛ పోయాక ఏం తింటాం చెప్పు. చదువు వేరు, జీవితం వేరు. ఈ రోజులు మళ్ళీ రావు కదా..! అందుకే అందం ఆరోగ్యం రెండూ చూసుకోవాలి.
   అందంగా కనిపించడం లావు సన్నంలో ఉండదు. ఉత్సాహంగా, ఉల్లాసంగా,ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళ ముఖంలో కనిపించే కాంతే ఆ మనిషికి అందాన్ని తెచ్చిపెడుతుంది. ఎవరికీ భయపడకుండ నిర్భయంగా మన పని మనం చేసుకుంటూ అవసరమనుకున్న వాళ్ళకి సహాయ పడుతూ మంచి మార్గంలో నడుస్తూ కవాలనుకున్నదాన్ని సాధించుకోవాలి. అదే వ్యక్తిగా ఎదగడమంటే ! ఆనందం, ఆరోగ్యం, మంచివ్యక్తిత్వం ఉన్న మనిషిలో  తేజస్సు ఉంటుంది. అదే అందమంటే ! ఆ అందాన్ని అందరూ గౌరవిస్తారు. అంతేగాని, సన్నగా పుల్లలా ఉండడం, అతిగా అలంకరించుకోవడం, చవకబారు వస్త్ర ధారణ, అతిగా మాట్లాడడం, అవసరం ఉన్నా లేకపోయినా ఒకళ్ళమీద ఒకళ్ళు పడి నవ్వడంలోను అస్సలు అందం ఉండదు. అబ్బో! అందరూ మన వైపే చూస్తున్నారు అనుకుంటాం ! మన వెనుక ఎన్ని విమర్శిస్తారో మనకు తెలియదు కదా!
   ఆరోగ్యంగా పుష్టిగా ఉండడం, మంచి వ్యక్తిత్వం, నిండైన వేషధారణ మనిషికి హుందాతనాన్ని కలిగిస్తాయి. హుందాతనంలో ఉండే అందం అందర్నీ దూరంగా నిలబెడుతుంది. మనల్ని గురించి ఎవర్నీ వెకిలిగా మాట్లాడనియ్యదు. మీరు పసితనంలోంచి బయటకు వస్తున్నారు. ఈ వయసు ఎంత అపురూపమయిందో...అంత ప్రమాదకమైంది. అన్ని విషయాలవైపు ఆకర్షింపబడతారు.. మంచి విషయాలవైపు మాత్రమే మీ మనస్సుని కేంద్రీకరించి ముందు జీవితానికి బాట వేసుకోవాలి.  బోరు కొట్టిస్తున్నానా..? అంది రాగిణి మాట్లాడడం ఆపుతూ.
   లేదకా! నువ్వు చెప్పింది నిజమే ! అసలు ఎవరు మంచివాళ్ళో...ఎవరితో మాట్లాడచ్చో...ఎవర్ని నమ్మచ్చో ఏదీ తెలియట్లేదక్కా ! రోజూ ఏదో ఒక విషయంలో మనస్సు బాధపడుతూనే ఉంటుంది! అంది భవిత.
   భవితా! ఇందాక నువ్వు ఏడ్చావు. ఇప్పుడు చూడు హాయిగా ఐస్క్రీం తింటూ నవ్వుకుంటున్నాం కదా! మన మనస్సు ఎప్పుడూ మనం చెప్పినట్టే వింటుంది. మనం నవ్వమంటే నవ్వుతుంది. బాధపడమంటే బాధ పడుతుంది. ఎంచక్కా ఎప్పుడూ నవ్వుతూనే ఉండమందాం.. .అప్పుడు మన స్నేహితులు కూడా నవ్వుతూనే ఉంటారు. ఇందాక నువ్వు ఎందుకు ఏడ్చావో చెప్పనా..? అంది రాగిణి.
   వాళ్ళు ఆశ్చర్యంగా ఒకేసారి చెప్పక్కా! అన్నారు. మీరు నలుగురు మంచి స్నేహితులు. ఒక స్నేహితురాలు చచ్చిపోయింది. ఎందుకు? మీరెవరూ అపకారం చెయ్యలేదు. భగవంతుడు కూడా ఏమీ చెయ్యలేదు. పేద పిల్ల కాదు. అయినా ఎందుకు జరిగింది? ఎనీమిక్, లో బీపి...అవునా? వీటితో చచ్చిపోవాల్సిన వయస్సా? కాదు కదా ? అన్నీ ఉండి కూడా ఎక్కడ లావుగా అయిపోతానో అని తినకుండా చేతులారా తెచ్చుకుంది. నూరేళ్ళ జీవితం బుగ్గిపాలయింది. అందం కోసం తపించిన ఆ అందం ఏమయింది? హయిగా నవ్వుతూ తుళ్ళుతూ ఉండాల్సిన పిల్లకి అసలు జీవితమే లేకుండ పోయింది కదూ! అంది రాగిణి
అవునక్కా! జీరోలా ఉండాలి, కొంచెం కూడా ఫాట్ కనిపించకూడదు అంటూ ఏమీ తినేది కాదు. ఎంత చెప్పిన వినలేదు. పాపం! అందర్నీ వదిలి వెళ్ళిపోయింది. అవును గాని అక్కా...ఇదంతా నీకు ఎలా తెలుసు? అంది భవిత.
      మీరు బస్సులో కూర్చుని ఒకళ్ళని ఒకళ్ళు ఓదార్చుకుంటుంటె విన్నానులే! మీ డైటింగు పద్ధతివల్ల ఆరోగ్యం పోయి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో జీవితమంతా బాధ పడతారు. రోజూ చస్తూ బతకడమంటే అదే! ఇవన్నీనేను కూడ చేసినవే కదా...అనుభవం మీద చెప్తున్నాను. బస్సులో కలిసిన ఈ అక్క మాట విన్నారనుకోండి సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని చూసి మీ చుట్టు ఉండే వాళ్ళు కూడా మారతారు. మీ అందరివల్లా ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుంది. ఇంతకీ రెండో ఐస్క్రీం ఎవరూ తినరా? అడిగింది రాగిణి.
   ఈ రోజు నుంచి అక్క చెప్పినట్టు డైటింగు మానేసి అన్నీ తినేస్తాను. అమ్మని కూడా బాధపెట్టను. అమ్మ ఇచ్చిన టిఫిను రోజూ తెచ్చుకుంటాను అంటూ నలుగురుకీ మరో ఐస్క్రీం ఆర్డరిచ్చింది భవిత. అక్క సెల్ నంబరు తీసుకుని అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటామని చెప్పి స్నేహితులు ముగ్గురూ వెళ్ళిపోయారు.   రాగిణికి సంతృప్తిగా ఉంది. ఆ కాలేజీలో తను చదవక పోయినా ఆ స్నేహితులకి  అక్కగా మారి వాళ్లని మంచి మార్గం వైపు నడిపించే విధంగా అలోచింప చేసినందుకు ఆనందంగా కూడా ఉంది. తన పనికి మరో రోజు రావచ్చులే అనుకుని తను కూడా ఇంటి ముఖం పట్టింది!!        

1 comment: