About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

ఉపనిషత్తు కథలు

 ఓం
ఉపనిషత్తు కథలు
1.జగత్తంతా ఈశ్వరమయం
(ఈశావాస్య మిదగ్(  సర్వమ్)
   ఉపనిషత్తు అనగానే మన మనస్సులో ఒక దృశ్యం ఏర్పడుతుంది. పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఒక ఆశ్రమం...ఆ ప్రదేశంలో ఒక రావిచెట్టు...ఆ చెట్టు మొదట్లో ఒక ఎత్తైన అరుగు... దానిమీద  ఒక పవిత్రమైన ఆసనం...దాని మీద కూర్చుని వేదాలు బోధిస్తున్న గురువు...దానికి ఎదురుగా దగ్గరలో పరిశుభ్రంగా ఉన్న నేలమీద దర్భలతో చేసిన ఆసనాల పైన కూర్చుని గురువుగారు చెప్పినదాన్ని వినయ విధేయతలతో వల్లె వేస్తున్న శిష్యులు.
   ఉపనిషత్తు అంటే మన మనస్సులో ఇలాగే ఎందుకు కనబడుతుంది అంటే ఉప- దగ్గరగా, ని- కింద, షత్ కూర్చోడం. ఉపనిషత్తు అంటే దగ్గరగా కింద కూర్చోడం అని అర్ధం. ఉపనిషత్తులు గురువుగారికి సమీపంగా కింద కూర్చుని మాత్రమే నేర్చుకోవాలి. ఇది ఎవరి ఇంట్లో వాళ్ళే ఉండి పుస్తకాలు చూస్తూ చదివే చదువు కాదు. ఉద్యోగాలకి, కాలక్షేపానికి చదివే చదువు కూడా కాదు. మనలో ఉన్న అజ్ఞానాన్ని పోగొట్టి, ముక్తి మార్గాన్ని బోధించి భగవంతుణ్ణి తెలియపరచే విద్య. గురువుకి దగ్గరగా కూర్చోవడం అంటే శరీరానికి దగ్గరగా అని కాదు. గురువుగారి మనస్సుని తెలుసుకుని శిష్యుడు తన మనస్సుని గురువుగారి మనస్సుతో అనుసంధానం చెయ్యాలి అని అర్ధం.
   అసలు వేదాలు అంటే ఏమిటి? ప్రతి జీవి పరమాత్మ స్వరూపమే. మనిషి తనలో ఉన్న పరమాత్మ స్వరూపాన్ని మర్చిపోయి జీవుడుగానే మసులుకుంటున్నాడు. మనిషికి తన అసలైన స్థితి ఏమిటి అనేది తెలిపేవి వేదాలు.
   వేదము అంటే తెలుసుకోవడం అని అర్ధం. దేన్ని గురించి తెలుసుకోవాలీ? అని ఆలోచిస్తే తెలుసుకున్నాక ఇంకా తెలుసుకోడానికి ఏదీ ఉండకూడదు. అటువంటి స్థితికి చేర్చేది ఒక్క వేదవిద్య మాత్రమే. ఆత్మదర్శనం కలిగేటట్టు చేసి నాలోనూ పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకో గలిగే బ్రహ్మజ్ఞనాన్ని వేదవిద్య బోధిస్తుంది.
   కృతయుగంలోను, త్రేతాయుగంలోను వేదం మొత్తం ఒక్కటిగానే ఉండేది. ఒక్కటిగా ఉన్నఆ వేదాన్ని అప్పటి ప్రజలు అర్ధం చేసుకునేందుకు వీలుగా ఉండేది కాదు. ఆ విషయాన్ని అర్ధం ఛేసుకున్న కృష్ణద్వైపాయనుడు ద్వాపరయుగంలో ఆ వేదాన్ని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణవేదం అని నాలుగు భాగాలుగా విభజించారు. అప్పటినుంచే వ్యాసమహర్షి వేదవ్యాసుడుగా పిలవబడ్డారు.
   నాలుగు భాగాలుగా విభజించబడిన ప్రతి వేదం మళ్ళీ నాలుగు భాగాలుగా విభజించబడింది. 1.సంహిత (మంత్రాలు),2.బ్రాహ్మణాలు (పూజలు, యజ్ఞయాగాదులు మొదలైన కర్మకాండకి సంబంధించినవి), 3. ఆరణ్యకాలు (ఉపాసనలు), 4. ఉపనిషత్తులు(పరమాత్మతత్వం).
   మానవులకి మోక్షమార్గాన్ని గురించి తెలియచేసేవి ఉపనిషత్తులు. ఇవి వేదానికి అంతం అంటే చివర ఉంటాయి కనుక వేదాంతం అని అంటారు. కొన్ని ఉపనిషత్తులు వేదానికి చివరలోనే కాదు సంహితలోను, బ్రాహ్మణాల్లోను, ఆరణ్యకాల్లోనూ కూడా ఉంటాయి. మానవ జీవితాన్ని తరింపచేసుకుని ముక్తిని పొందడానికి అవసరమయిన గొప్ప జ్ఞానాన్ని తెలియచేస్తాయి. ఈ ఉపనిషత్తులు నాలుగు వేదాల్లోను కలిపి మొత్తం 1180 ఉన్నాయి. కాని మనకి ప్రస్తుతం 108 మాత్రమే మంత్రాలతో సహా అందుబాటులో ఉన్నాయి. ఇందులో పది ఉపనిషత్తులు అత్యంత ముఖ్యమైనవని పండితులు చెప్తుంటారు. అవి ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాడూక్య, తైత్తరీయ, ఐత్తరీయ, ఛాందోగ్య, బృహదారణ్యక అని పది ఉపనిషత్తులు.
   నాలుగు భాగాలుగా విభజించిన వేదాలని నేర్పడానికి నలుగురు శిష్యుల్ని ఎంచుకున్నారు వేదవ్యాస మహర్షి. పైలవ మహర్షితో ఋగ్వేదం, వైశంపాయన మహర్షితో యజుర్వేదం, జైమిని మహర్షితో సామవేదం, సుమంత మహర్షితో అథర్వణవేదం అధ్యయనం చేయించారు. ఈ మహర్షులందరు తాము నేర్చుకున్న వేదభాగాన్ని తమ తమ శిష్యులకి నేర్పించారు. ఆ శిష్యులు తాము నేర్చుకున్న వేదాన్నిమళ్ళీ తమ శిష్యులకి నేర్పించడంతో వేదవిద్య క్రమంగా వ్యాప్తిలోకి వచ్చింది.
   వైశంపాయన మహర్షి తను నేర్చుకున్న వేద భాగాల్లో ఒకటైన యజుర్వేదాన్ని యాజ్ఞవల్క్యుడు మొదలైన శిష్యులకి నేర్పించారు. ఒకరోజు భారతదేశంలో ఉన్న మహర్షులందరు మేరుపర్వతం మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.  అందరూ తప్పకుండా ఆ సమావేశానికి హాజరవాలని, ఎవరేనా రాకపోతే వాళ్ళకి బ్రహ్మహత్యా దోషం కలుగుతుందనీ కూడా నిర్ణయించారు.
   అనుకోని కారణాల వలన వైశంపాయన మహర్షికి ఆ సమావేశానికి వెళ్ళడానికి వీలు కలగలేదు. దానివల్ల అయనకి బ్రహ్మహత్యాదోషం కలిగింది. అంతే కాకుండా పసివాడయిన ఆయన మేనల్లుడు ప్రమాదవశాత్తూ ఆయన కాళ్ళకిందే పడి చనిపోయాడు. దానితో వైశంపాయన మహర్షికి బ్రహ్మహత్యా దోషంతో పాటు బాలహత్యాదోషం కూడా సంక్రమించింది. ఆ పాపాల్ని పోగొట్టుకోవడం కోసం తన శిష్యులైన చరకాధ్వర్యుల్ని పిలిచి తపస్సు చెయ్యమన్నారు. గురువు ఆజ్ఞ ప్రకారం చరకాధ్వర్యులు తపస్సు చెయ్యడం ప్రారంభించారు.
   ఆ సమయంలో యాజ్ఞవల్క్య మహర్షి తన గురువైన వైశంపాయన మహర్షిని కలుసుకోవాలని వచ్చారు. చరకాధ్వర్యులు తపస్సు చెయ్యడం చూసి విషయం ఏమిటని గురువుగార్నిఅడిగారు. వైశంపాయనులు జరిగిన విషయం శిష్యుడికి వివరించారు.
   అది విని యాజ్ఞవల్క్య మహర్షి గురువర్యా ! వీళ్ళకి జ్ఞానం తక్కువ. అంత గొప్ప తపస్సు చెయ్యడం వీళ్ళ వలన ఏమవుతుందీ? మీకు కలిగిన పాపాలన్నీ పోయేలా నేను గొప్ప తపస్సు చేస్తాను. దయచేసి అనుగ్రహించండి! అన్నారు.
   తన తోటి శిష్యుణ్ణి అవమాన పరుస్తూ మాట్లాడిన యాజ్ఞవల్క్య మహర్షిని చూసి నీతో కలిసి చదువుకుంటున్న వాళ్ళని, తోటి బ్రాహ్మణుల్ని అమితమైన అహంకారంతో అవమానించి మాట్లాడావు. ఇంత అహంకారంతో విర్రవీగుతున్న నువ్వు నా దగ్గర విద్య నేర్చుకునేందుకు అర్హుడవు కాదు. నేను నీకు నేర్పించిన వేదవిద్యని ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపో! అన్నారు వైశంపాయన మహర్షి.
   గొప్ప శక్తిసామర్ధ్యాలు, ఆత్మాభిమానం కలిగిన యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాల్ని గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు. యాజ్ఞవల్క్య మహర్షి వదిలి వెళ్ళిన యజుర్వేద మంత్రాల్ని వైశంపాయన మహర్షి  శిష్యులు చరకాధ్వర్యులకి నేర్పించారు. యాజ్ఞవల్క్య మహర్షి వదిలి వెళ్ళిన తరువాత చరకాధ్వర్యులు ఇద్దరూ నేర్చుకున్న యజుర్వేద మంత్రాలనే కృష్ణ యజుర్వేదం అంటారు. దీని సంహిత పేరు తైత్తరీయ సంహిత’.
   యాజ్ఞవల్క్య మహర్షి తను నేర్చుకున్న యజుర్వేద మంత్రాల్ని గురువుగారి దగ్గర వదిలేసి వెళ్ళిపోయాక సూర్యుణ్ణి ఆరాధించారు. సూర్యుడి అనుగ్రహంతో యజుర్వేద మంత్రాల్ని మళ్ళీ పొందగలిగారు. యజూంష్య యాతయామాని మునయే2దాత్ప్రసాదిత: సూర్యుడి అనుగ్రహంతో యాజ్ఞవల్క్య మహర్షి నేర్చుకున్న యజుర్వేదాన్ని శుక్ల యజుర్వేదం అంటారు. యాజ్ఞవల్క్య మహర్షి  కణ్వమహర్షిని, మాధ్యందిన మహర్షిని తన శిష్యులుగా స్వీకరించి సూర్యుడు తనకు అనుగ్రహించిన శుక్ల యజుర్వేదాన్ని వాళ్ళకి నేర్పించారు. ఈ వేదభాగాన్ని వాజసనేయ సంహిత అంటారు.
   అన్నం వై వాజ: అనే వేదవాక్యం ప్రకారం వాజ:’’అంటే అన్నం అని, సనిఅంటే దానం’ అని అర్ధం. కనుక వాజసనిఅంటే అన్నదానం అని అర్ధం. యాజ్ఞవల్క్య మహర్షి తండ్రి ప్రతి రోజూ అన్నదానం చేసేవారు. అందువల్ల ఆయన్ని వాజసనిఅని పిలిచేవాళ్ళు. వాజసని కుమారుడు కనుక యాజ్ఞవల్క్య మహర్షిని వాజసనేయుడు అని పిలిచారు. వాజసనేయుడితో చెప్పబడిన మంత్రాలు కనుక వాజసనేయ సంహిత అని పిలిచారు.
   వాజసనేయ సంహితలో నలభై అధ్యాయాలు ఉంటాయి. మొదటి అధ్యాయం నుండి ముప్ఫైతొమ్మిదవ అధ్యాయం వరకు ఉన్న మంత్రాలు యజ్ఞయాగాదుల వంటి కర్మల్ని గురించి తెలియ చేస్తాయి. నలభైయవ అధ్యాయం మాత్రం జ్ఞానం గురించి తెలియ చేస్తుంది.  
   యాజ్ఞవల్క్యుడి ఆశ్రమం నదీతీరంలో వైదిక సంస్కృతికి, సంప్రదాయానికి కొలువై ఉంది. ఎటు చూసినా చల్లటి వాతావరణాన్నినింపుతూ మంచుకొండలే! కొండ చరియలు దట్టమైన అడవులతో నిండి ఉన్నాయి. అడవుల్లో  పెద్ద పెద్ద   ఫల వృక్షాలు, పూల చెట్లు, సుందరంగా అల్లుకున్న పొదలు, కొండల మధ్య నుంచి జలజలా పారుతున్న గంగానది . అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది.
   సూర్యోదయానికి ముందే లేచి స్నానం సంధ్యావందనం జపతపాలు పూర్తి చేసుకుని విద్యాభ్యాసం చెయ్యడానికి గురువు గారి రాక కోసం ఎదురు చూస్తున్నారు శిష్యులు. గురువు యాజ్ఞవల్క్య మహర్షి వచ్చి తన ఎత్తైన ఆసనం మీద కూర్చున్నారు. శిష్యులందరూ గురువు గారికి సాష్టాంగ నమస్కారం చేసి ఎదురుగా తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు.
  యాజ్ఞ్యవల్క్య మహర్షి తాను సూర్యుడి అనుగ్రహం ద్వారా పొందిన వేదమంత్రాల్ని కణ్వమహర్షికి, మధ్యందినుడికి మిగిలిన శిష్యులకి చెప్తున్నారు. శిష్యులు కూడా గురువు చెప్తున్న మంత్రాల్ని అత్యంత శ్రద్ధతో నేర్చుకుంటూ, గురువుగారి స్వరంతో తమ స్వరాన్ని కలుపుతూ వల్లె వేస్తున్నారు.
   గురువుగారు అప్పటికి వాజసనేయ సంహితలో ముప్ఫై తొమ్మిది అధ్యాయలు బోధించడం పూర్తి చేశారు. మొదటి అధ్యాయం దర్శ పూర్ణ, మాస యోగంనుండి మొదలుపెట్టి ముప్ఫైతొమ్మిదవ అధ్యాయంలో అశ్వమేధయాగ వివరణతో కూడిన కర్మ విభాగం పూర్తయింది. ఆ రోజు నలభైయవ అధ్యాయం ప్రారంభం అవుతోంది. అది వాజసనేయ సంహితలో ఆఖరు భాగం. కాబట్టి దీన్ని శృతి శిరస్సు అంటారు. ప్రతి సంహితలోను ఉండే ఇటువంటి ఉపనిషత్తులు జ్ఞానాన్ని బోధిస్తాయి. నలభైయవ అధ్యాయం ఈశావాస్య మిదగ్( సర్వం అనే మొదటి మంత్రంతో మొదలవుతుంది. కనుక, ఈ ఉపనిషత్తుని ఈశావాస్యోపనిషత్తుఅంటారు.
   ఈ ఉపనిషత్తులో ఉన్న మొదటి మంత్రం బ్రహ్మతత్త్వాన్ని, నివృత్తి ధర్మాన్ని, జ్ఞానమార్గాన్ని బోధిస్తుంది. యాజ్ఞవల్క్య మహర్షి తన శిష్యులకి ఈ విధంగా బోధిస్తున్నారు.
    ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుని ఈశ్వరుడు అన్నటువంటి భావంతోనే చూడాలి. ప్రపంచమంతా ఈశ్వరుడుతోనే నిండి ఉంది. నీకు కావలసినవన్నీ భగవంతుడే సమకూర్చాడు. వాటిని త్యాగ భావంతో అనుభవించు, ఆనందంగా బ్రతుకు, ఎవరి ధనాన్ని మాత్రం ఆశించకు  అనేది అందరూ తెలుసుకోవలసిన విషయం.
   మన కంటి ముందు కనిపిస్తున్న ప్రపంచం కదిలే స్వభావం, మార్పుచెందే స్వభావం కలిగి ఉంది. దీన్ని ఎవరు కదిలిస్తున్నారు? ఇది ఎలా కదులుతోంది? అని అలోచిస్తే ఈశ్వరుడి ఆజ్ఞ ప్రకారమే అన్ని మార్పులూ జరుగుతున్నాయి. అన్నింటిలోను వ్యాపించి ఉన్నా కూడా పైకి కనిపించకుండా వాటి లోపల ఉండి కదిలిస్తున్నాడు లేదా శాసిస్తున్నాడు.
   కనుక, మనం చూస్తున్న ప్రతి వస్తువులోను, ప్రాణికోటిలోను తనే నిండిపోయి ఒక పద్ధతి ప్రకారం నడిపిస్తున్నాడు. నామ, రూప, గుణాలు లేని పరమాత్మ- నామ, రూప, గుణాలున్న ప్రపంచంలా మనకి కనిపిస్తున్నాడు. కాబట్టి, కనిపిస్తున్న నామ, రూప, గుణాల్ని విడిచిపెట్టి వాటి వెనుక ఉన్న పరమాత్మని తెలుసుకోవాలి. మనిషి, మృగం, చెట్టు, పుట్ట, ఆడ, మగ, చిన్న, పెద్ద, పక్షి వంటి అన్ని ప్రాణుల్లోను భగవంతుడున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోగలిగిన జ్ఞానం సాధకుడికి ఉండాలి. అంత గొప్ప జ్ఞానాన్ని కలిగిన వాడే పరమాత్మని గురించి తెలుసుకోడానికి అర్హతని పొందుతాడు.
   గురువుగారు చెప్పినదాన్ని విని కణ్వమహర్షి గురువర్యా ! ఈ మంత్రంలో త్యాగంతో అన్నారు కదా... అంటే సర్వసంగ పరిత్యాగం చేసి, ధ్యానంలో కూర్చుని, ఆత్మని పరమాత్మలో లీనం చెయ్యాలి అనేగా అర్ధం? అటువంటి  సామర్ధ్యం లేని వాళ్ళకి మరేదైనా మార్గం ఉందా? అని అడిగారు.
   గురువుగారికి కణ్వ మహర్షి ప్రశ్నలో ఉన్నభావం అర్ధమయింది. ఆత్మని పరమాత్మలో లీనం చెయ్యడం అంత సులభమయిన విషయం కాదు. అది అందరివల్ల సాధ్యం కాదు. అందుకే శిష్యుడయిన కణ్వమహర్షిని చూస్తూ కణ్వ మహర్షీ!  నువ్వు చెప్పినట్టే అంతటి సామర్ధ్యం అందరికీ ఉండదు.
   కణ్వమహర్షీ ! పైన చెప్పిన విధంగా జ్ఞాన మార్గాన్ని అనుసరించడానికి సామర్ధ్యం లేనివాళ్ళు లోకానికి తగ్గట్టుగా అంటే ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా కర్మలు చేస్తూ నూరు సంవత్సరాలు జీవించాలని కోరుకోవాలి. ఇదొక్కటే మార్గం. ఇంతకంటే గత్యంతంరం లేదు. కర్మ చెయ్యడం వలన మనిషి జీవితంలో ఏ విధమైన ఆటంకాలు కలుగవు, అపకీర్తి కూడా రాదు.
   మహాత్ములు, సర్వసంగ పరిత్యాగులు, పరిపక్వమైన జ్ఞానం కలవాళ్ళు మాత్రమే ప్రతి వస్తువులోను భగవంతుణ్ణి చూడగలుగుతారు. వాళ్ళకి చెయ్యడానికి ఏ కర్మలూ ఉండవు కనుక. అంత వైరాగ్యాన్ని పొందలేని వాళ్ళు ప్రాపంచిక విషయాలకు లోబడి, పరమాత్మని చూడలేక, చూడాలన్న కోరికతో, ఎలా చూడాలో తెలియని పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు శాస్త్రాలు అంగీకరించే పుణ్య కర్మల్ని చేస్తూ భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని వెతుక్కోవాలి.
   శాస్త్రసమ్మతమైన అంటే వేదాలు, ఉపనిషత్తులు, భగద్గీత, పురాణాలు వంటివి కొన్ని ధర్మబద్ధంగా ఉండే కర్మల్ని తెలియ చేస్తున్నాయి. అగ్నిహోత్రం, సంధ్యావందనం, యాగాలు, పూజలు, వ్రతాలు, భజనలు, దానధర్మాలు, పుణ్యకార్యాలు భగవంతుణ్ణి  సేవించడం, అతిథిసేవ, భూతసేవ వంటి పవిత్రమైన కర్మలు చేసి చిత్తశుద్ధిని పొంది జ్ఞాన మార్గంలో పరమాత్మను చూడగలగాలి. అటువంటివాళ్ళు ప్రపంచంలో నూరేళ్ళూ జీవించి భగవంతుణ్ణి చేరగలుగుతారు.
   మిగిలినవాళ్ళు జీవిత గమ్యాన్ని, అత్మజ్ఞానాన్ని తెలుసుకోలేక పరమాత్మ అంటే ఏమిటో తెలియక, ప్రాపంచిక వ్యామోహాల్లో చిక్కుకుని జీవితాన్ని గడిపేస్తారు. అంత గొప్ప జ్ఞానం పొందాలంటే శరీరం, మనస్సు, బుద్ధి ఉపయోగించి తెలుసుకోవాలి.
  అలా తెలుసుకోలేని వాళ్ళు శరీరం వదిలిన తరువాత భగవంతుణ్ణి చేరలేరు కదా...ఎక్కడికి వెడతారు? మళ్ళీ అడిగారు కణ్వమహర్షి. గురువుగారు శిష్యుల సందేహాన్ని తీరుస్తున్నారు. శిష్యులు శ్రద్ధగా వింటున్నారు.
   ఎవరైతే అత్మను తెలుసుకోడానికి, ఆత్మావలోకనం చెయ్యడానికి ప్రయత్నం చెయ్యరో అటువంటి వాళ్ళు మరణించిన తరువాత కటిక చీకట్లతో నిండిన వెలుగు లేని లోకాల్ని చేరుకుంటారు.
   మోక్షానికి ద్వారం మానవ జన్మ. దాన్ని పొంది కూడా మోక్షాన్ని పొందాలనే ధ్యాస లేకుండా లౌకిక వ్యవహారాల్లో మునిగి తినడం, త్రాగడం, నిద్రపోవడం, భోగాలు అనుభవించడం, పిల్లల్ని కనడం, సంపాదించుకోవడం, దాచుకోవడం వంటి ఉపయోగించని కర్మలు చేసి కాలక్షేపం చేసేవాళ్ళు తాము పొందిన మానవ జన్మని నిరర్ధకం చేసుకున్నట్టే.
   తరువాత పొందేవి జడత్వంతో నిండిన జన్మలే. జడుడికి శరీరం మనస్సు ఉంటాయేగాని, బుద్ధి ఉండదు. పూర్వజన్మ వాసనల్ని అనుసరించి పనిచేయడం, మనస్సు ద్వారా పూర్వ జన్మ కర్మ ఫలాన్ని అనుభవించడమే కాని అత్మజ్ఞనాన్ని పొందే అవకాశం ఉండదు. కనుక, మనం మానవ జన్మనెత్తి ఎందుకొచ్చామో తెలుసుకుని, ఆత్మజ్ఞానం పొంది జన్మని సార్ధకం చేసుకోవాలి అని చెప్పారు గురువు యాజ్ఞవల్క్య మహర్షి.
   ఆచార్యా! ఆత్మ సాక్షాత్కారం గురించి తెలుసుకోకుండా మానవ జన్మను నిర్లక్ష్యం చేసేవాళ్ళు ఆత్మను హత్య చేసుకున్నవాళ్ళే అన్నారు కదా...అటువంటి అత్మను హత్య చేసుకున్న పాపం నుంచి బయట పడే విధానం ఏమయినా ఉందా? అని అడిగాడు మాధ్యందిన మహర్షి.
   మహర్షీ! ఆత్మను హత్య చేసిన దోషం పోవాలంటే ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవాలి. మీ సందేహాన్ని తీరుస్తాను వినండి! ఆత్మ ఒక్కటే చలించకుండా ఉంటుంది. అయినా దాని వేగం మనస్సుకి ఉన్న  వేగం కంటే ఎక్కువ. ఎక్కడికయినా మనస్సు కంటే ముందే వెళ్ళగలుగుతుంది. అది ఇంద్రియాలకు అందదు. ఎప్పుడూ కదలకుండానే ఉంటుంది, అయినా పరుగెట్టే వాటన్నిటికన్నా వేగంగా వెళ్ళిపోతుంది. ప్రాణులు చెయ్యవలసిన పనులన్నింటికి సరిపడిన ప్రాణశక్తిని ఆత్మే సమకూరుస్తోంది.
   మహర్షీ! ఆత్మను తెలుసుకుని, కూడా ఆత్మానుభూతిని పొందకపోతే ఆత్మహత్య చేసుకున్నట్టే! శరీరంతో పుణ్య కార్యాలు చేస్తూ మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని ఆత్మను తెలుసుకోవాలి. ఇప్పుడు ఆత్మ గురించి దాని స్వరూప స్వభావాల గురించీ చెప్తాను.
   ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. అది లేని చోటు లేదు కనుక, కదిలే అవకాశం కూడా లేదు. మనిషి ఎక్కడికేనా వెళ్ళాలి అని అనుకోగానే అతడి కంటే అతడి మనస్సే ముందు వెళ్ళిపోతుంది. మనస్సు అక్కడికి చేరేటప్పటికే ఆత్మ అక్కడ ఉంటుంది. వెళ్ళాలి అని మనస్సులో అనుకున్న చోటుకి, ఇంద్రియాలతో పని చేసే శరీరం కంటే, మనస్సు కంటే ముందే  ఆత్మ చేరిపోతుంది. అందుకే ఆత్మ ఇంద్రియాలకి అందదు! అని తన శిష్యులకి వివరించిన యాజ్ఞ్యవల్క్య మహర్షి పరమాత్మ తత్త్వాన్ని కూడా వివరిస్తున్నారు.
   శిష్యులారా! ఆత్మ చలించదు-చలిస్తుంది. దూరంగానూ ఉంది-దగ్గరగా కూడా ఉంది. అది విశ్వమంతా వ్యాపించి ఉంది. లోపలా ఉంది- బయటా ఉంది. ప్రపంచం తయారయిందే పర్మాత్మనుంచి. దాన్ని నడిపించేది కూడా పరమాత్మే. అజ్ఞానంలో ఉన్నంత కాలం ఆత్మ మనిషికి దూరంగానే ఉంటుంది. జ్ఞానవంతులకు అది దగ్గరగా కనిపిస్తుంది. పరబ్రహ్మం అంతటా వ్యాపించి ఉన్నాడు అన్న విషయం తెలుసుకో గలిగినప్పుడే తనలో ఉన్న ఆత్మని కూడా చూడగలుగుతాడు.
   ఎప్పుడూ ధ్యానంలోనే ఉండే సాధకుడు ఈ లోకంలో ఏ విధంగా జీవిస్తాడో, తన జీవితంలో ఎదురైన సంఘటనలని ఏ దృష్టితో చూస్తాడో గురువు యాజ్ఞవల్క్య మహర్షి వివరిస్తున్నారు.
   మహర్షీ! అన్ని జీవులూ తన ఆత్మ కంటే వేరైనవి కావనీ, తన ఆత్మే అన్ని జీవుల్లోనూ ఉందనీ తెలుసుకో గలిగినవాడు ఏ వస్తువునీ ద్వేషించడు.
   మోక్షాన్ని కోరుకునేవాడు అన్ని ప్రాణుల్లోను ఉన్న తనని తాను గుర్తిస్తాడు. అదే విధంగా అన్ని ప్రాణులూ తనలోనే ఉన్నాయనే విషయాన్ని కూడా తెలుసుకుంటాడు. జ్ఞాని అయిన వాడికి తను తప్ప వేరే వస్తువు కనబడదు. సమస్త వస్తువుల్లోను తనే కనిపిస్తున్నప్పుడు ఇష్టపడని వస్తువు అనేది  కూడా ఏదీ ఉండదు. పరమాత్మ అంతటా ఉన్నాడు...తను కూడా అంతటా ఉన్నాడు. కనుక, ప్రతి వస్తువులోను తనే ఉన్నాడన్న విషయం తెలుసుకున్నప్పుడు తనను తాను ద్వేషించుకోడు కదా! అదే విధంగా ప్రతి వస్తువులోను పరమాత్మనే చూడగలిగిన జ్ఞాని ఏ వస్తువునీ ద్వేష భావంతో చూడలేడు. ప్రతి విషయంలోను తనే ఉంటాడు కనుక, ఈ విషయం లేదా వస్తువు నచ్చింది, నచ్చలేదు అనే భావం ఉండదు.
   అన్ని జీవుల్లో ఉన్నదీ తన ఆత్మే అనీ, జగత్తు మొత్తంలో ఉన్నదీ ఒకే ఆత్మ అనీ ఆత్మ యొక్క ఏకత్వాన్నిగురించి తెలుసుకోగలిగిన జ్ఞానికి కోరికలు, దు:ఖాలు ఉండవు.
   పరమాత్మ తత్త్వం తెలుసుకున్న జ్ఞాని ప్రపంచమంతా తనే అయి ఉన్నాడు కనుక, అతడికి కోరికలు దు:ఖాలు ఉండవు. అన్ని జీవులకి తనే ఆత్మ అనీ, విశ్వమంతటిలోనూ ఉన్నది ఒకే ఆత్మఅనీ తెలుసుకో గలిగినవాడికి కోరికలు ఉండవు. అంతటా ఏకత్వాన్నే చూడగలిగిన వాడికి దు:ఖం మాత్రం ఎందుకు ఉంటుంది? అది కూడా ఉండదు. అని చెప్పిన గురువు యాజ్ఞవల్క్య మహర్షి జీవన్ముక్తుడి లక్షణాలు, స్వరూపం ఏ విధంగా ఉంటుందో శిష్యులకి  తెలియ చేస్తున్నారు.
   శిష్యులారా! ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది. గొప్ప తేజస్సు కలిగి ఉంటుంది. దానికి లింగశరీరం ఉండదు. కనుక, శరీరానికి సంబంధించిన బాధలు అత్మకి ఉండవు.
   స్వయంభువుడు, అంతటా వ్యాపించినవాడు, శరీరం, కండలు లేనివాడు,  పాపం, కళంకం అంటనివాడు, ప్రకాశవంతుడు, పరిపూర్ణుడు, స్వచ్ఛమైనవాడు, అన్నిటినీ చూడగలిగినవాడు, అన్నీ తెలిసినవాడు అయిన పరమాత్మ ప్రజల రక్షణకోసం శాశ్వతంగా ఉండేవాళ్ళని నియమించి వాళ్ళకి వారి వారి కర్తవ్యాల్ని పంచి ఇచ్చాడు.
   పరమేశ్వరుడు ప్రజలను రక్షించ వలసిన వాళ్ళని స్థిరంగా ఉంచి, వాళ్ళ సహాయంతో ఈ  ప్రపంచాన్ని నిర్మించి, వాటికి అవసరమయిన వ్యవస్థలకి శాశ్వతంగా ఏ ఆటంకం కలుగకుండ ఉండేటట్టు చేశాడు.
   మునులారా! ఇప్పటి వరకు జ్ఞానమార్గం వెతుక్కుంటున్న వాళ్లకి ఆత్మతత్త్వాన్ని గురించి శృతిలో వివరించిన విధంగా మీకు తెలియ చేశాను. ఇప్పుడు కర్మలు చేస్తూనే శాశ్వతంగా జీవించాలనుకునే వాళ్ళని గురించి అంటే జీవన్ముక్తుల గురించి తెలియచేస్తాను వినండి! అని శిష్యులకి తెలియ చేస్తున్నారు యాజ్ఞవల్క్య మహర్షి.
   ఎవరైతే అవిద్యను మాత్రమే ఉపాసిస్తారో, ఆరాధిస్తారో వాళ్ళు అజ్ఞానమనే అంధకారంలోకి వెళ్ళిపోతారు. ఎవరు విద్యలోనే ఆనందిస్తారో అంటే సామాన్య జ్ఞానంతోనే తృప్తి పడతారో వాళ్ళు అంతకంటే ఎక్కువైన అంధకారంలోకి కూరుకుని పోతారు.
   కర్మలు రెండు రకాలు 1. శాస్త్ర సమ్మతమైనవి, 2. శాస్త్ర విరుద్ధమైనవి. శాస్త్రానికి విరుద్ధంగా ఉండే కర్మలు చేస్తే దు:ఖాన్ని పొందాలి. మళ్ళీ నీచమైన జన్మలు పొందాలి. ఉత్తమ కర్మలు చేస్తే అంటే పుణ్యకార్యాలు, పూజలు, దానధర్మాలు, యజ్ఞయాగాలు వంటి శాస్త్ర సమ్మతమైన కర్మలు చేస్తే మంచి జన్మలు పొందచ్చు, సుఖాలు భోగాలు అనుభవించడానికి మార్గం ఏర్పడుతుంది. కాని, ఆ పుణ్యం ఖర్చయి పోగానే మళ్ళీ జన్మ, దు:ఖాలు తప్పవు. ఆంటే మళ్ళీ అంధకారంలోకి ప్రవేశించడమే జరుగుతుంది.
   కేవలం జ్ఞానమార్గంలో ప్రయాణించేవాడు, శాస్త్రాలలో ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండేవాడు తనే గొప్ప పండితుణ్ణని, తనకు చాలా శాస్త్రాలు తెలుసునని , తనతో సమానంగా వాదన చెయ్యగలిగిన వాళ్ళు ఎవరూ లేరని గర్వ పడతాడు. అప్పుడే అహంకారం మొదలవుతుంది. ఇది కొంతమందిలో పైకి కనిపిస్తుంది, కొంతమందిలో పైకి కనిపించదు. ఈ అహంకారమే అతణ్ణి అంధకారంలోకి నెట్టుతుంది.    
  కర్మ మార్గాన్ని అనుసరించినవాళ్ళు కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. జ్ఞానమార్గాన్ని అనుసరించిన వాళ్ళు కూడా అంతకంటే ఎక్కువ అంధకారంలోకి ప్రవేశిస్తారు. అయితే పై రెండు మార్గాలూ వదిలెయ్యాలా? తమ శిష్యులకు సందేహ నివృత్తి చేస్తున్నారు యాజ్ఞవల్క్య మహర్షి.
   విద్య వలన ఒక ఫలితం, అవిద్య వలన ఒక ఫలితం కలుగుతుంది. కేవలం జ్ఞాన మార్గంలో వెడితే ఆత్మ జ్ఞానాన్ని గురించి శాస్త్రాల్లో  ఏం చెప్పారో తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకోడం వలన పదాల అర్ధాన్ని తెలుసుకోగలం తప్ప అనుభూతిని పొందలేం. అటువంటి అనుభూతిని పొందగలిగిన బుద్ధి సూక్ష్మతని జ్ఞానమార్గం కలిగించదు.
   అదే విధంగా కర్మ మార్గాన్ని అనుసరిస్తే బుద్ధి సూక్ష్మత కలుగుతుంది. దానివల్ల జ్ఞనాన్ని తెలుసుకునే అర్హత కలుగుతుంది కాని. ఆత్మానుభూతి పొందగలిగేంత జ్ఞానం కలగదు.  విద్య అంటే యజ్ఞతత్త్వాన్ని గురించి తెలుసుకోడం వల్ల ఒక ఫలితం కలుగుతుంది... అవిద్య అంటే యజ్ఞకర్మను ఆచరించడం వల్ల వేరొక ఫలితం కలుగుతుంది అని చెప్తున్నారు. మరి ఈ రెండూ ఒకసారే పొందాలంటే ఏం చెయ్యాలి? ఈ విషయాన్ని గురించి యాజ్ఞ్యవల్క్యుడు శిష్యులకి బోధిస్తున్నారు.
  విద్యను, అవిద్యను రెండింటిని నేర్చుకున్నవాడు ఏ ఫలితాన్ని పొందుతాడో తెలుసుకుందాం. అవిద్య   నేర్చుకోడం వల్ల మృత్యువుని జయించ గలుగుతాడు. విద్య నేర్చుకోడం వల్ల అమరత్వాన్ని పొందుతాడు. నేర్చుకోవడం అంటే తెలుసుకుని ఆచరించడం. విద్య అంటే ఉపాసన, అవిద్య అంటే యజ్ఞయాగాదులు లేదా అగ్నిహోత్రానికి సంబంధించిన కర్మలు చెయ్యడం.
   విద్య, అవిద్య రెండింటి గురించీ తెలుసుకుని ఆచరించిన వాడు అవిద్యవలన మృత్యువుని దాటి, విద్య వలన అమరత్త్వాన్ని పొందుతాడు. అంటే, ఒకటే తెలుసుకోడం వల్ల ఒకటే ఫలితాన్ని పొందుతాడు, రెండూ తెలుసుకోడం వల్ల రెండు ఫలితాల్ని ఒకేసారి పొందుతాడు అని అర్ధం. కేవలం జ్ఞాన మార్గాన్నో, కేవలం కర్మ మర్గాన్నో ఆచరిస్తే అనుకున్న ప్రయోజం కలుగదు.
   ఇది కూడా నేను స్వయంగా చెప్తున్నది కాదు. ఆత్మజ్ఞాన సంపన్నులైన, బుద్ధిమంతులైన, బ్రహ్మనిష్ఠులైన, కరుణాస్వభావం కలిగిన పెద్దలు మాకు బోధించారు అని యాజ్ఞవల్క్య మహర్షి శిష్యులకి ఉపదేశం చేస్తూ... కేవలం ఒకే మార్గాన్ని ఎంచుకోవడం వలన ప్రయోజనం లేదని చెప్తూ పూర్తి ప్రయోజనం కలగడానికి ఏం చెయ్యాలో వివరిస్తున్నారు.
   ప్రకృతిని ఆరాధించేవాళ్ళు కటిక చీకటిలోకి ప్రవేశిస్తారు. హిరణ్యగర్భుణ్ణి ఆరాధించేవాళ్ళు అంతకంటే ఎక్కువ చీకటిలోకి  ప్రవేశిస్తారు. నిరాకారుడు, నిర్గుణుడు అయిన పరమాత్మకు వేరుగా నామ, రూప, గుణాలతో నిండి కనిపిస్తున్న ప్రపంచమే ప్రకృతి. ఇది పరమాత్మకు ప్రతిరూపం. ప్రకృతిలోను, విగ్రహాల్లోను, భగవంతుని గుణాల్లోను ఆసక్తి చూపిస్తూ ఉపాసించడం లేదా పూజించడం భక్తియోగం. దీన్నే సాకార సుగుణోపాసన అంటారు. ఈ ఉపాసన చేసేవాళ్ళు చీకటిలోకి ప్రవేశిస్తారు.
   వివిధ రూపాలతోను, గుణాలతోను ఉన్న భగవంతుడికి పూజలు చేస్తూ, వ్రతాలు, యజ్ఞాలు చేస్తూ ఉండే భక్తుడు చీకటిలోకి వ్రవేశించడం ఏమిటి?  అని మీకు కలిగిన సందేహాన్ని కూడా తీరుస్తాను. భగవంతుడికి పూజలు చేసేవాడు జ్ఞానంతో కాకుండ అందరూ చేస్తున్నారని, కోరిన కోర్కెలు తీరుతాయని చేస్తాడు. తన కోర్కె తీరనప్పుడు,  భగవంతుణ్ణి మరో ఆకారంలో కొలుస్తాడు. ఇటువంటి ఏకాగ్రత, భక్తీ లేని పూజలు చీకటిలోకి ప్రవేశింప చేస్తాయి.
   అసలు విగ్రహాలు లేకుండా చిత్తాన్ని భగవంతుడి మీద పెట్టి ధ్యాన యోగంలోకి వెడితే బాగుంటుందని అనుకుని ధ్యానం మొదలుపెడితే మనస్సు ప్రపంచ విషయాల మీదకి పోతుంది. ఒకచోట ఏకాగ్రత కలగనప్పుడు పరమాత్మలో లీనమయ్యేంత సిద్ధిని పొందలేరు. చివరికి రెండూ వదిలేసి ఇంకా గాఢమైన చీకట్లలోకి ప్రవేశిస్తాడు అని అర్ధం. అటువంటప్పుడు ఈ రెండింటినీ వదిలెయ్యాలా? యాజ్ఞవల్క్య మహర్షి తన శిష్యుల సందేహాన్ని తీరుస్తూ వివరిస్తున్నారు.
  శిష్యులారా! భగవంతుణ్ణి ఉపాసించడం వల్ల ఒక ఫలితం, ప్రకృతిని ఉపాసించడం వల్ల ఒక ఫలితం కలుగుతుందని ప్రజ్ఞావంతులు చెప్పారు. మాకు వివరించిన గురువుల నుండి మేము ఈ విధంగా విన్నాం.
   కేవలం ధ్యానయోగం వల్ల, భగవధ్యానం ఎలా చెయ్యాలో, నిరాకారుడైన పరమాత్మ యొక్క తత్త్వం శాస్త్రాల్లో ఏ విధంగా చెప్పారో, ధ్యానానికి అనుకూల పరిస్థితులేమిటో తెలుసుకుంటారు. ఎంత తెలుసుకున్నా మనస్సుకి ఏకాగ్రత కలగదు, విషయాల మీద నుంచి మళ్ళదు. కేవలం భక్తిమార్గాన్ని అనుసరిస్తే పరమాత్మ యొక్క రూపం, గుణాల మీద కొంతయినా ఏకాగ్రత కలుగుతుంది. దీనివల్ల పరమాత్మను దర్శించగల శక్తిగాని, మోక్షంగాని కలగదు. పూర్తి ప్రయోజనం కలగాలంటే ఏం చెయ్యాలి? యాజ్ఞవల్క్య మహర్షి శిష్యులకి క్రమంగా పరమాత్మ సాక్షాత్కారం ఎలా పొందాలో వివరిస్తున్నారు.
  ప్రకృతిని, పరమాత్మని కలిపి తెలుసుకున్నవాడు పరమాత్మ ద్వారా మృత్యువుని జయించి, ప్రకృతి మీద గల భక్తి ద్వారా అమరత్వాన్ని పొందుతాడు. భక్తి మార్గంలో భగవంతుని రూపం మీద మనస్సు నిలిపి, ఆయన గుణాల్ని ప్రేమతో, భక్తితో, తన్మయత్వంతో తలుచుకుంటూ, వింటున్నదీ, చూస్తున్నదీ భగవంతుడి గొప్పతనమే అనుకుంటూ, తింటున్నదాన్ని భగవంతుడిచ్చిన ప్రసాదమే అనుకుంటూ, ప్రపంచ విషయాల మీద ఆసక్తిని వదిలెయ్యడం వల్ల భగవంతుని మీద ఏకాగ్రత కుదురుతుంది. అటువంటి ఏకాగ్రతతో భగవంతుణ్ణి ధ్యానిస్తే మనస్సు తనలో ఏ విషయాలు లేకుండా ఆత్మానుభూతిని పొందుతుంది, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతుంది, అమరత్వాన్ని పొందుతుంది.
   శిష్యులారా ! ఇంతవరకు కర్మ, భక్తి,  జ్ఞాన, ధ్యాన యోగాలద్వారా పరమాత్మ సాక్షాత్కారం కలుగుతుంది అని తెలుకున్నాం. ఇప్పటికి పరమాత్మ సాక్షాత్కారానికి అర్హత కలిగింది. ఇది ఏ విధంగా అనుభవంలోకి వస్తుంది? ఇంకేమైనా ఆటంకాలు ఉన్నాయా? ఉంటే వాటిని తప్పించుకోడం ఎలా?  అనే విషయాన్ని మీకు వివరిస్తున్నాను వినండి!  అని గురువు యాజ్ఞవల్క్య మహర్షి  శిష్యులకి చెప్తూ శిష్యులతో కలిసి సూర్యుణ్ణి ఈ విధంగా ప్రార్ధించారు.
  నీలో ఉన్న సత్యం అనబడే ద్వారాన్ని మెరుస్తూ ఉన్న నీ బంగారు బింబం మూతగా కప్పింది. ఓ సూర్య దేవా! సత్యనిష్ఠుడనైన నేను ఆ సత్యాన్నిచూడ్డానికి వీలుగా ఉండేటట్టు ఆ మూతను ప్రక్కకి తియ్యి.
   మనిషిగా చెయ్య వలసిన కర్తవ్యం ఒకటి ఉంది. అదే సత్య దర్శనం, పరమాత్మ దర్శనం, ఆత్మసాక్షాత్కారం . కాని ఆయన ముఖం బంగారు పాత్రతో కప్పబడి ఉంది. పరమాత్మలో ఐక్యమవాలంటే  ఆ బంగారు పాత్రని ఆయన ముఖం మీద నుంచి తీసెయ్యాలి. అంటే, ఆకర్షణల నుంచి రక్షించాలి. ఇప్పటికే ఎంతో శ్రమపడి సాధనలో చాలా దూరం వచ్చిన సాధకుడు పరమాత్మను దర్శించుకునే భాగ్యం కలగాలని కోరుకుంటున్నాడు.
   యాజ్ఞవల్క్య మహర్షి కణ్వమహర్షీ ! పరమాత్మ తనపైన ఉన్న బంగారు పాత్రను తియ్యగానే జీవుడు జీవభావాన్ని వదిలి, కళ్ళతో చూడలేని, మనస్సుతో ఆలోచించలేని, బుద్ధితో విచారణకు అందని అద్భుతమైన దృశ్యాన్ని ఆత్మతో చూశాడు. దాన్ని వివరంగా చెప్తాను విను! అన్నాడు.
  ఓ సూర్యుడా! ప్రజాపతి పుత్రుడా! స్వర్గ వీధిలో ఒంటరి బాటసారీ! సర్వ పోషకా! సర్వ నియంతా! నీ కిరణాలని తొలగించి, నీ కాంతిని ఉపసంహరించుకో! నీ అనుగ్రహం ఉంటే అందమైన, పవిత్రమైన  నీ రూపాన్ని నేను చూడగలను. నిజంగా నీలో ఉండే ఆ పురుషుడను నేనే అని తెలుసుకున్నాను.
   ఇప్పటివరకు తను జీవుడని, పరమాత్ముణ్ణి దర్శించాలని, ఆరాధించి, సాధనలు చేసి, సమాధి నిష్ఠలో నిర్వికల్ప స్థితిలో నిలిచాడు. అతడిలో ఉన్న జీవభావం తొలిగి పోయింది.ఇప్పుడు సాధన చేసే జీవుడు, సాధన, సాధ్య వస్తువయిన పరమాత్మా ఒక్కటై పోయారు. జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మ ఒక్కటిగా అయి శుద్ధ చైతన్యం మాత్రమే మిగిలింది. దాని వలన ఇప్పటి వరకు సాధన చేసిన జీవుడిలో జీవభావం పోయి అహం బ్రహ్మస్మి అనే అనుభవం కలిగి పరమాత్మగా మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ జీవుడికి జీవభావం లేదు. కనుక, ఈ ప్రపంచంతో సంబంధం లేదు.
   శిష్యులారా! ఇప్పుడు జీవుడికి జీవభావం లేదు, మనోబుద్ధులు లేవు, కర్మఫల వాసనలు లేవు, కనుక మళ్ళీ జన్మ లేదు. దీన్నే జన్మ రాహిత్యం అంటారు. ఈ జీవన్ముక్తుడు దేహం వదిలాక దేహం లేనివాడు అవుతాడు. జీవన్ముక్తిని పొందినవాడు శరీరాన్ని ఏ విధంగా వదులుతాడో తెలియ చేస్తాను.
   నా ప్రాణవాయువు సర్వవ్యాపి, శాశ్వతమూ అయిన ప్రాణమునందు లీనమగుగాక! ఈ శరీరము బూడిద అగుగాక! ఓ మనసా! గుర్తుకు తెచ్చుకో! నీ పూర్వ జన్మ కర్మలను గుర్తుకు తెచ్చుకో! అని ప్రార్థిస్తాడు.
   సాధనలన్నీ పూర్తి చేసి ఆత్మసాక్షాత్కారంతో యోగ సిద్ధిని పొందిన జీవన్ముక్తుడు మరణించే సమయంలో ఆర్తితో చేసే ప్రార్ధనే ఈ మంత్రం.
  ఒక శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణించే జీవుడు జీవ భావాన్ని వదిలి ఆత్మతో ఐక్యమై పోయాడు. కర్మ ఫలాలు అనుభవించడానికి తెచ్చుకున్న స్థూల శరీరం నుండి గడువు తీరిపోయిన ఆత్మ దాన్ని వదిలి వెళ్ళిపోయింది. ఇప్పటి కర్మ ఫలాలు జ్ఞానాగ్నిలో పడి దగ్ధమై పోయాయి. ఇంక ఈ శరీరాన్ని వదిలే సమయంలో ఏ అనుభూతిలో ఉంటాడో దాన్నే పొందుతాడు. చివరి కాలంలో పరమాత్మానుభూతితో ఉన్నాడు కనుక పరమాత్మనే చేరుకుంటాడు.
   ఇంతవరకు పరమాత్మను తెలుసుకోవాలనుకున్న శిష్యులకి గురువు యాజ్ఞవల్క్యుడు  మోక్షప్రాప్తిని పొందే విధానాన్ని బోధించారు.  ఇప్పటికి బోధన పూర్తయింది. కాని శిష్యుల సాధన పూర్తి కాలేదు కనుక, తమను మంచి మార్గం వైపు మళ్ళించమని గురుశిష్యులు భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నారు.
  ఓ అగ్నిదేవా! మేము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మమ్మల్ని మంచి మార్గంలో నడిపించు! మేము చేసిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ దేవా! మాలో ఉన్న పాపాలన్నింటినీ తొలగించు. నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాం!
   ఈ ప్రార్ధన యజ్జ్ఞాలలో ఆహుతులను దేవతలకు చేర్చే మధ్యవర్తి అయిన అగ్నిదేవుడికి. ఇక్కడ అగ్ని అంటే అగ్రం నయతి యితి అగ్ని. అగ్రం-అగ్రస్థితికి, నయతి-చేర్చేది అని అర్ధం. అగ్ని అంటే పరమాత్మ యొక్క కనపడే స్వరూపంగా గురుశిష్యులు ఇద్దరూ అగ్నిని ప్రార్ధించారు.
   మునులారా! ఈ మంత్రంతో ఉపాసకుడు తను తిరిగి దు:ఖాలతో కూడుకున్న ఈ ప్రపంచంలోకి రాకుండా ఉండడం కోసం అగ్నిదేవుణ్ణి ప్రార్ధించాడు! అని చెప్పి ఉపనిషత్తుని పూర్తి చేశారు యాజ్ఞవల్క్య మహర్షి.
                                        (ఈశావాస్యోపనిషత్తు ఆధారంగా) 


1 comment: