About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

ధర్మరక్షణ పాండవుల కథ

ధర్మరక్షణ
పాండవుల కథ
     మహాభారత యుద్ధం జరుగబోతున్న సమయంలో ఎదురుగా కనిపిస్తున్న బంధువుల్ని స్నేహితుల్ని చూసిన అర్జునుడు యుద్ధం చెయ్యడానికి ఇష్టపడలేదు. వెనక్కి తిరిగి వెళ్ళిపోదామని అనుకున్నాడు.
   శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి యుద్ధానికి ప్రోత్సహించాడు. భగవంతుడి అవతారమయి ఉండి కూడా అర్జునుడికి అలా ఎందుకు చెప్పాడు... ఎవర్నీ చంపకూడదు అని కదా బోధించాలి? శాంతిని ప్రోత్సహించ వలసినవాడు యుద్ధాన్ని ప్రోత్సహించడం వల్లనే కదా... ఎంతో మంది చచ్చిపోయారు.
   దీన్ని అర్ధం చేసుకోవాలంటే యుద్దం జరగడానికి కారణం ఏమిటి? ఈ విషయం మనం తెలుసుకోవాలి. ఇది చాలా పెద్దదైన, గొప్పదైన, మానవత్వం కలిగిన పంచమవేదంగా చెప్పబడుతున్న మహాభారతం నుంచి ఒక చిన్న కథ.
    ధృతరాష్ట్రుడి కొడుకులు నూరుగురు పెట్టిన కష్టాల వల్ల  పాండవులు అయిదుగురు, వాళ్ళ భార్య ద్రౌపది, తల్లి కుంతి అనుభవించిన బాధలతో నడిచిన పెద్ద కుటుంబ, రాచరికపు చరిత్ర.
   ధృతరాష్ట్రుడు, పాండురాజు అన్నదమ్ములు. ధృతరాష్ట్రుడికి నూరుగురు కొడుకులు, పాండురాజుకి అయిదుగురు కొడుకులు.
   పాండురాజు కొడుకుల్ని పాండవులు అని, ధృతరాష్ట్రుడి కొడుకుల్ని” ”’కౌరవులు అని అంటారు.
   పాండవులు ఉన్నతమైన వ్యక్తిత్వం కలవాళ్ళు. కౌరవుల ఆలోచనలు ఎప్పుడూ దుర్మార్గంగానే ఉండేవి. అందువల్ల పినతండ్రి పిల్లలయిన పాండవుల్ని ఎప్పుడూ బాధలు పెడుతూనే ఉండేవాళ్ళు.
   పాండవుల తల్లి కుంతీదేవి, తన పిల్లలతో పాటు రాజ్యం నుంచి బయటకి నెట్టివేయబడింది. వాళ్ళు రాజ్యానికి దూరంగా ఒక గ్రామంలో నివసిస్తున్నారు.
   అంత దూరంగా వెళ్ళిపోయినా కూడా కౌరవులు వాళ్ళని ప్రశాంతంగా బ్రతకనివ్వలేదు. ఒకసారి వాళ్ళు ఉంటున్న ఇంటిని తగలబెట్టి చంపెయ్యడానికి ప్రయత్నించారు. మరొకసారి విషంతో చంపాలని ప్రయత్నించారు.
   అలా ఎన్ని విధాలుగా పాండవుల్ని చంపాలని కౌరవులు ప్రయత్నించినా పాండవులు మాత్రం ఏదో విధంగా రక్షించబడుతూనే ఉన్నారు. అందుకు వాళ్ళ ధర్మప్రవర్తన, దైవభక్తే కారణం.
   కౌరవులు పెట్టే బాధలు అంతకంతకి పెరిగిపోతున్నాయి. పాండవులు ఏదో ఒకచోట ప్రశాంతంగా జీవిస్తూ కౌరవులతో స్నేహంగా ఉందామని అనుకున్నారు.
   కౌరవులు మాత్రం పాండవుల్ని ఎలాగయినా రాజ్యం నుంచి తరిమెయ్యాలని అనుకున్నారు. అందుకని ఒక పథకం వేసుకుని పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజుని జూదానికి ఆహ్వానించారు.
   జూదంలో ధర్మరాజు తన భార్య ద్రౌపది, తమ్ముళ్ళు నలుగురితో సహా ఓడిపోయాడు. ద్రౌపదిని నిండు సభలో అందరి ఎదురుగా అవమాంచారు కౌరవులు.
    ద్రౌపది ఏడుస్తుంటే కౌరవులు ఆనందించారు. సభలో ఉన్న పెద్దవాళ్ళు కూడా దుర్మార్గులైన కౌరవులకి భయపడి వాళ్లకి ఎదురు చెప్పలేదు.
    అందువల్ల దుర్మార్గులైన కౌరవుల నోటికి హద్దు లేకుండా పోయింది. ఎవరూ వాళ్లని ఆపలేక పోయారు. పాండవుల పరిస్థితికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు మనస్సులో బాధపడ్డారు.
   యుగయుగాలుగా భారతదేశంలో స్త్రీ ఉన్నతమైన స్థితిలో గౌరవించబడుతోంది. కౌరవులు మాత్రం తమ కౄరమైన చేతలతో స్త్రీని అగౌరవ పరిచి ప్రతి ఒక్కరు ఎవరి సమాధి వాళ్ళు తవ్వుకున్నారు.
   అయిదుగురు అన్నదమ్ములూ తమ భార్యతోను, తల్లితోను కలిసి పదమూడు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు.
   కౌరవులు పాండవుల భూముల్ని, ఆస్తుల్ని తమ కైవసం చేసుకున్నారు. పదమూడు సంవత్సరాలు గడిచాక పాండవులు కనుక బ్రతికి ఉండి తిరిగి వస్తే అప్పుడు వాటిని తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు.
   పాండవులు తమ భార్యతోను, తల్లితోను అరణ్యావాసానికి వెళ్ళిపోయాక కౌరవులందరు సంతోషంగాను, పెద్దలందరు నిశ్శబ్దంగాను ఉండిపోయారు.
   పాండవులు అడవులకి వెళ్ళి కూడా ప్రశాంతంగా జీవించలేక పోయారు. మధ్యమధ్యలో కౌరవులు వాళ్ళకి కష్టాలు కలిగిస్తూనే ఉన్నారు.
   కౌరవులు, పాండవుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం పాండవులు చివరి సంవత్సరం అజ్ఞాతంగా గడపాలి. ఒకవేళ పాండవులు అనుకోకుండా పట్టుబడిపోతే మళ్ళీ  పదమూడు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యాలి.
   పాండవులు తమ ఒప్పందం ప్రకారం తల్లితోను భార్యతోను కలిసి అరణ్యవాసం పూర్తి చేసారు. అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పాండవులు ఒక రాజ భవనంలో వంటవాళ్ళుగాను, పనివాళ్ళుగాను గడిపారు.
   కౌరవులు ఎంత ప్రయత్నించినా ఎవరికీ తమ గురించి తెలియకుండా జాగ్రత్త పడ్డారు. పదమూడు సంవత్సరాల అరణ్యవాసాన్ని పూర్తిచేసుకుని పాండవులు తిరిగి తమ రాజ్యానికి వచ్చారు. వాళ్లకి స్నేహితులు కొందరు సుఖంగా జీవించడానికి ఏర్పాట్లు చేశారు.
   పాండవుల బంధువు, శ్రేయోభిలాషి అయిన శ్రీకృష్ణుడు కౌరవుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళతో పాండవులు ఒప్పందం ప్రకారం తమ అరణ్యవాసాన్ని చాల ప్రశాంతంగా పూర్తి చేశారు. ముందు అనుకున్న ప్రకారం వాళ్ళ రాజ్యాన్ని వాళ్లకి అప్పగించండి అని కౌరవులకి చెప్పాడు.
  కౌరవులు కృష్ణుడి మాటలకి నవ్వి అతణ్ణి అవమానించారు. అతడు వాటిని పట్టించుకోలేదు. మీరు రాజ్యం ఇవ్వడానికి అంగీకరించకపోతే కనీసం ఒక్కొక్కళ్ళకి ఒక గ్రామం అయినా ఇవ్వండి. వాళ్ళు అక్కడే ప్రశాంతంగా జీవిస్తారు అని చెప్పాడు.
   దీనికి కూడా కౌరవులు నవ్వి ఊరుకున్నారు. చివరిగా అయిదు ఇళ్లైనా ఇవ్వండి, వాళ్ళు దానితోనే తృప్తి పడతారు అని కూడా చెప్పాడు.
   కృష్ణుడు ఎంతో ప్రశాంతంగా సమస్యని పరిష్కరిద్దామని అనుకున్నాడు. కాని కౌరవులు అయిదు ఇళ్ళు కాదు కదా అయిదు అంగుళాల స్థలం కూడా ఇవ్వమని చెప్పారు.
   నూరుగురు సోదరులు ఒకే మాటమీద ఉండి యుద్ధమే మాకు  కావాలి అన్నారు. వాళ్ళకి పాండవుల్ని అయిదుగుర్ని సర్వ నాశనం చెయ్యడమే ధ్యేయం. కృష్ణుడు ఎంత ప్రయత్నించినా కౌరవులు సంధికి అంగీకరించలేదు. వాళ్ళు యుద్ధమే కావాలన్నారు.
    శ్రీకృష్ణుడు రాజ్యంలో ఉన్న పెద్దవాళ్లందర్నీ వేరువేరుగా కలిశాడు. కౌరవులు యుద్ధం తప్పదని అంటున్నారని అది జరగకుండ ఆపమని చెప్పాడు. ఎవరూ పట్టించుకోలేదు.  కృష్ణుడు ఎన్నో విధాలుగా యుద్ధం ఆపడం కోసం ప్రయత్నించాడు.
   చివరగా కౌరవుల స్నేహితుడైన కర్ణుణ్ణి కలుసుకున్నాడు. కర్ణుడు అయిదుగురు పాండవులకి అన్న అని అతడి తల్లి కుంతీదేవి అని కర్ణుడికి తెలియని రహస్యాన్ని తెలియచేశాడు.
   కుంతీదేవిని కలిసి తన కుమారుల కోసం కర్ణుణ్ణి ప్రార్ధించమని చెప్పాడు. ఎన్ని విధాలుగా ప్రయత్నించినా చివరికి యుద్ధం తప్పలేదు.
    నువ్వు శాంతిని ప్రేమించు. యుద్ధాన్ని అసహ్యించుకో. నువ్వు ఎవరి మీద యుద్ధం ప్రకటించకు. ఎవరేనా నీ మీద యుద్ధం ప్రకటించినప్పుడు సైనికుడిగా నిన్ను నీ ప్రజల్ని రక్షించుకోడం నీ విధి. అలా చెయ్యకపోతే అది పిరికితనం అవుతుంది అన్నది పద్ధతి.
   కురుక్షేత్రం యుద్ధభూమిగా నిర్ణయించబడింది. కౌరవ పాండవ సైన్యం అక్కడికి చేరింది. యుద్ధం కొంచెం సేపట్లో మొదలవబోతున్న సమయంలో పాండవ సేనకి అధికారి అయిన అర్జునుడు అకస్మాత్తుగా తను యుద్ధం చెయ్యలేనన్నాడు. 
   అంతవరకు యుద్ధంలో విజయం సాధించాలని ఎదురు చూసినవాడు, తనకు తానుగా గొప్ప బాధ్యతని మోస్తున్నవాడు, ప్రపంచం మొత్తానికి గొప్ప విలుకాడుగా పేరు పొందినవాడు, కౌరవులని నాశనం చేసి తీరుతానని గట్టిగా చెప్పినవాడు ఇప్పుడు యుద్ధం చెయ్యనని చెప్పాడు.
   అతడికి అక్కడ ఉన్న వాళ్లను చూడగనే వాళ్లల్లో ఎవరూ శత్రువులుగా అనిపించ లేదు. అందరూ పెద్దలు, పూజ్యులు, గురువులు, అన్నదమ్ములు, బంధువులు, స్నేహితులే కనిపించారు. అందుకే యుద్ధం చెయ్యడానికి తడబడ్డాడు.
   అర్జునుడే వెనక్కి వెళ్లిపోతే పాండవ సైన్యం గతి ఏమవుతుంది? కౌరవులు వాళ్లని తరిమి తరిమి కొడతారు. రాజ్యం దుర్మార్గుల చేతిలోకి వెళ్ళి పోతుంది.
   దుర్మార్గుల చేతిలో అమాయకపు ప్రజలు నలిగి పోకూడదన్న ఉద్దేశ్యంతోనే శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి  దుర్మార్గుల్ని ఎదిరించు! నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించ వలసిన సమయం వచ్చింది. మిగిలిన విషయాలు భగవంతుడికి వదిలిపెట్టు అన్నాడు.
   జీవితంలో ఎలా నిలదొక్కుకోవాలి, జీవితమంటే ఏమిటి? జీవితం పూర్తయ్యాక ఏం జరుగుతుంది, ప్రతి మనిషి స్వభావం ఏ విధంగా ఉంటుంది, చెయ్యవలసినవి ఏమిటి? చెయ్యకూడనివి ఏమిటీ ఎన్నో విషయాలు శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు.
    చివరికి ఒకటే అడిగాడు నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహిస్తున్నావా లేదా? అని. కృష్ణుడు చెప్పిన విషయాలన్నీ విని జ్ఞానవంతుడైన అర్జునుడు శ్రీకృష్ణుడు చెప్పినవాటిని అర్ధం చేసుకుని ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావో చెప్పు! అన్నాడు.
   అర్జునుడి ఆలోచనలు భవిష్యత్తు వైపు పరుగులు పెడుతున్నాయి యుద్ధం వల్ల ప్రపంచంలో ఉన్న పరిస్థితులన్నీ తారుమారవుతాయి. ప్రజల జీవన స్థితిగతులు దెబ్బతింటాయి అనుకుంటున్నాడు.
   అతడి అలోచనలకి బదులుగా శ్రీకృష్ణుడు అర్జునా! పొలంలో పంట వేసినప్పుడు పంట ఏపుగా పెరగాలంటే కలుపు మొక్కల్ని ఏరి పారెయ్యాలి కదా! అటువంటిదే ఇది కూడా. ప్రజలందరు ప్రశాంతంగా జీవించాలంటే దుర్మార్గుల్ని నాశనం చెయ్యాలి కాని, వాళ్ళని దయతో చూడకూడదు అన్నాడు.
   కౌరవుల కోరిక, ఆలోచన ఒకటే! ప్రతివస్తువు వాళ్ళకే సొంతమవాలి, జీవితం మొత్తం ఆనందాన్ని అనుభవించాలి. మిగిలినవాళ్ళు ఏమయినా ఫరవాలేదు.
   పాండవుల ఆలోచన వేరు ప్రపంచంలో ఉన్న ప్రజలందరు సుఖసంతోషాలతో ప్రశాంతంగా జీవించాలి. పాండవుల ఆలోచనల్లో స్వార్ధం ఉండదు. కాబట్టి, వాళ్ళ ఆలోచనలు గొప్పవి. మంచి ఆలోచనలు చేసేవాళ్ళని భగవంతుడు రక్షిస్తాడు.
   కౌరవ సైన్యం చాలా పెద్దది. అయినా పాండవులు అయిదుగురు తమ చిన్న సైన్యంతో కౌరవుల్ని నాశనం చేశారు. ఒక్క కలుపు మొక్క కూడా లేకుండా చేశారు. చివరికి యుద్ధంలో పాండవులే విజయం సాధించారు.
ధర్మం తనని రక్షించేవాళ్ళని తప్పకుండా రక్షిస్తుంది!!


No comments:

Post a Comment