About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

ఉపనిషత్తు కథలు 2.మిథ్యాభిమానం

ఓం
2.మిథ్యాభిమానం
                                              (కేనేషితం పతతి ప్రేషితం మన:)
   ఓం ఆప్యాయన్తు మమాంగాని....... అని శాంతి మంత్రం.
   అది ఒక పవిత్రమైన ఆశ్రమం. ఎటువైపు చూసినా అన్ని పరిసరాలు పవిత్రంగానే కనిపిస్తున్నాయి. ఉదయాన్నేలేచి ధ్యానం, జపం, సాధన అన్నీ పూర్తి చేసుకుని అభ్యాసానికి సిద్ధంగా ఉన్నారు శిష్యులు.  గురుకులంలో గురువుగారు ఎత్తైన ఆసనం మీద ఉన్న జింకచర్మం మీద కూర్చుని ఉన్నారు. గురువుగారికి నమస్కారం చేసి తమ తమ ఆసనాల మీద కూర్చున్నారు శిష్యులు. ముందు రోజు నేర్చుకున్న పాఠాన్ని రాత్రంతా చదువుకుని, అందులో తమకు కలిగిన సందేహాలు గురువుగారిని అడిగి తెలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు. ఒక బ్రహ్మచారి లేచి తన సందేహాన్ని గురువుగారి ముందు ఉంచాడు.
   ఈ కథ కేనోపనిషత్తు ఆధారంగా నడుస్తోంది. ఈ ఉపనిషత్తు సామవేదంలో ఉన్న తలవకార బ్రాహ్మణాలలో తొమ్మిదవ అధ్యాయంలో ఉంది. దీన్ని తలవకారోపనిషత్తు అని కూడా అంటారు. కేనేషితం పతతి ప్రేషితం మన: అనే మొదటి మంత్రం మొదటి వాక్యం మొదటి పదంతో దీనికి కేనోపనిషత్తు అనే పేరు వచ్చింది. మొదటి మంత్రంలో శిష్యుడు గురువుని తన సందేహం గురించి ఈ విధంగా అడుగుతున్నాడు.
   శిష్యుడు గురువుగార్ని ఆచార్యా! మనస్సు తనకు ఇష్టమయిన విషయాల మీదకి వెళ్ళేటట్టు,  ప్రాణం తన పనుల్ని చెయ్యడానికి, మానవుడు మాట్లాడడానికి, కళ్ళకి, చెవులకి సంబంధించిన పనులకి ఏ శక్తి కారణమవుతోంది? అని తనకు కలిగిన సందేహాన్ని అడిగాడు. 
   ఈ ఉపనిషత్తులో మొదటి మంత్రం శిష్యుడి ప్రశ్నతోనే మొదలవుతుంది. సందేహం కలిగినప్పుడు అడిగి తెలుసుకోడం వల్లనే జ్ఞానం పెరుగుతుంది. అడిగే ప్రశ్నను బట్టి శిష్యుడు ఎంత జ్ఞానం కలవాడో కూడా అర్ధమవుతుంది. మనస్సు తనకు తానుగా ప్రపంచ విషయాల మీదకి వెళ్ళట్లేదు కదా... మరి దాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? అనేది ప్రశ్న.
   పంచభూతాలతో తయారయిన శరీరం జడమైంది. ఈ శరీరం కదలడానికి, పనిచేయడానికి, ఇంద్రియాలు తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తించుకోడానికి అవసరమయిన శక్తిని వాటికి ఎవరు కలిగిస్తున్నారు? అనేది ప్రశ్న. శిష్యుడు సామాన్యుడు కాదు పరమాత్మ గురించి తెలుసుకోవాలన్న కోరికతో తన ప్రశ్నని దేనితో అని మొదలుపెట్టాడు. ఈ ఉపనిషత్తు జ్ఞానవంతుడైన శిష్యుడి ప్రశ్నతో మొదలయింది. ఉపనిషత్తంతా బ్రహ్మనిష్ఠాగరిష్ఠుడైన గురువు ఇచ్చిన సమాధానంతోనే సాగుతూ చివరికి శిష్యులకి బ్రహ్మ విద్యతో పాటు బ్రహ్మంలో ఐక్యమయ్యే ఉపాయాన్ని కూడా తెలియ చేస్తుంది. 
   గురువుగారు శిష్యుడితో బ్రహ్మచారీ! మనస్సు మొదలైన ఇంద్రియాల్ని వాటి వాటి పనులు అవి చేసుకుని పోయేట్టు ఎవరు ప్రేరేపిస్తున్నారు? అన్న నీ సందేహానికి సమాధానం వివరిస్తున్నాను విను! అన్నారు.
   ఆత్మ శక్తి వల్లనే చెవి వింటుంది. కన్ను చూస్తుంది. జిహ్వ మాట్లాడుతుంది. మనస్సు గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. బుద్ధిమంతుడు ఇంద్రియాల్ని వాటి పనుల్ని పక్కకు పెట్టి ఆత్మను మాత్రమే చూస్తాడు. ఇంద్రియ బద్ధమైన జీవితాన్ని వదిలి అమరత్వాన్ని పొందుతాడు.
   మొదటి మంత్రంలో శిష్యుడు అడిగిన ప్రశ్న, రెండో మంత్రంలో గురువు చెప్పిన సమాధానం వింటుంటే ఉపనిషత్తు విద్య గురువు దగ్గర కూర్చుని నేర్చుకోవలసిందే అని అర్ధమవుతోంది.
   ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ ఆత్మ లేనివే. అంటే, జడంగా చలనం లేకుండ ఉంటాయి. ఆత్మ కారణంగానే ఇవన్నీ చలిస్తున్నాయి. చెవికి చెవిగా, వాక్కుకి వాక్కుగా, కన్నుకి కన్నుగా, మనస్సుకి మనస్సుగా, ప్రాణానికి ప్రాణంగా చైతన్యాన్ని కలిగిస్తున్నది ప్రకాశస్వరూపుడైన ఆత్మే! అని గురువు కనిపించే విషయం మీద నుంచి దానికి ఆధారమైన చైతన్యం వైపు శిష్యుడి మనస్సుని మరలించే ప్రయత్నం చేస్తున్నారు.
   శిష్యులారా! జీవుడికీ, దేవుడికీ గల తేడాని ఉపనిషత్తులో ఉన్నదాన్ని మీకు వివరిస్తున్నాను వినండి.
     పరబ్రహ్మను కంటితో చూడలేం. మన దృష్టి అక్కడి వరకు వెళ్ళలేదు. మన మాటలుగాని మనస్సుగాని అక్కడికి చేరలేవు. కాబట్టి మాకు దాన్ని గురుంచి తెలియదు. దాన్ని ఏ విధంగా నేర్పించవచ్చో ఆ పద్ధతి కూడా మాకు తెలియదు.
   ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు అన్నింటికీ ఆత్మ ఉండదు. వీటికి చైతన్యాన్ని ఇచ్చేది ఆత్మే అని చెప్పి దాని గొప్పతనాన్ని దాన్ని అందుకోవడానికి గల మార్గాల్ని తెలియచేస్తున్నారు. ఆత్మను అందుకోవడం చాలా కష్టం. కన్ను చూడలేదు, వాక్కు చెప్పలేదు, మనస్సు తెలుసుకోలేదు అంటే ఇంద్రియాలు కూడా ఆత్మను అందుకోలేవు. కనిపించేదానికి ఉండే లక్షణం కంటే, కనిపించనిదాని లక్షణం వేరే విధంగా ఉంటుంది. ఇంద్రియాలకి కనిపించకుండానే ఆత్మ వాటికి చైతన్యాన్ని ఇస్తుంది. దేనికీ అందని ఆత్మని గురువు ఉపదేశం ద్వారానే మనం చూడగలం. గురువు బోధన ద్వారానే దాన్ని చేరగలం, అనుభూతిని పొందగలం. ఆత్మానుభూతిని పొందాలంటే గురుపరంపర ద్వారానే జరుగుతుంది అని చెప్తూ తాము తమ గురువు నుంచి ఎలా తెలుసుకున్నారో చెప్తున్నారు గురువుగారు.
    నిశ్చయంగా అది మనకు తెలిసిన దానికంటే వేరైంది, అతీతమైంది. దాన్ని మా పూర్వీకుల నుంచి మేము ఈ విధంగా విన్నాం.
   ఆత్మను గురించి పూర్వం మాకు బోధించిన గురువుల ద్వారా మేము తెలుసుకుని  అనుభూతిని పొందాం! అని గురువుగారు శిష్యులకి చెప్తున్నారు. ఆత్మజ్ఞానాన్ని గురువుల ద్వారా గ్రహించాల్సిందే! వేదప్రమాణాన్ని అనుసరించి ఆత్మజ్ఞానాన్ని పొందాల్సిందే తప్ప చర్చలద్వారాగాని, తర్కాలద్వారాగాని, కంటితో చూసిగాని, చెవితో వినిగాని, మనస్సుతో గ్రహించిగాని పొందలేం. ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా పరబ్రహ్మను తెలుసుకోలేం! అని వివరించారు గురువు.
   మరి ఈ గ్రంథాలు చదవడం, పూజలు చెయ్యడం, ఉపాసన, ఉపన్యాసాలు వినడం వంటి  వాటి వల్ల మనకు ఉపయోగంలేదా? అని సందేహం వస్తుంది. ఉపయోగం ఉంటుంది కాని, వాటి ద్వారా మనం తెలుసుకునేది బ్రహ్మాన్ని కాదన్న విషయం తెలుసుకోమని చెప్తున్నారు గురువుగారు.
   మాటలు దేన్నిగురించి ప్రకటించలేవో అది బ్రహ్మం కాదు, మాటల్ని ప్రకటించడానికి ఏది శక్తిని ఇస్తోందో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఈ జనులు పూజించేది బ్రహ్మం కాదనీ తెలుసుకో.
   లోకంలో కొంతమంది గ్రంథాలు చదువుతారు, కొంతమంది పరమాత్మ తత్త్వం గురించి చెప్తుంటారు, జపం చేస్తుంటారు, తమకు ఇష్టమైన రూపంలో విగ్రహాన్ని పెట్టుకుని తన్మయత్వంతో భగవంతుడి దివ్య మంగళ రూపాన్ని చూస్తుంటారు, పరమాత్మ గురించిన తత్త్వాలని వింటూ అర్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇటువంటివి ఎన్ని చేసినా ఇవన్నీ పరమాత్మను తెలుసుకునేందుకు ఉపయోగపడే మార్గాలే కాని లక్ష్యం మాత్రం అది కాదు. ఈ మార్గాలు మాత్రం చివరికి లక్ష్యంలో కలిసి పోతాయి.
   మాటలు దేన్ని గురించి చెప్పలేవో.. ఏది మాటల్ని చెప్పిస్తోందో అది బ్రహ్మం. కాబట్టి మాటల వెనకాల దాగి ఉన్న అనంతమైన సత్యం వైపు దృష్టి పెట్టి ఈ జనాలు చేస్తున్నది పూజ కాదని తెలుసుకోమని అంటున్నారు గురువుగారు.
   మనస్సుతో తెలుసుకుని చేస్తున్న కార్యకలాపాలు బ్రహ్మం కాదు...మనస్సే తను చెయ్య వలసిన కార్యకలాపాల్ని దేనిద్వారా తెలుసుకో గలుగుతోందో లేదా వాటి చుట్టూ తిరుగుతుందో అది మాత్రమే బ్రహ్మం అనీ ఈ జనులు ఇక్కడ పూజించేది బ్రహ్మం కాదనీ తెలుసుకో!
   కొందరు భగవంతుడి ఉపాసన మనస్సు ద్వారా చేస్తారు. శాస్త్రాల్లో చదివిన విషయాల్ని మనస్సులో మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటారు. అయినా కూడా పరబ్రహ్మాన్ని తెలుసుకోలేరు. ఎందుకంటే, పరబ్రహ్మమే మనస్సుకి ఈ ఆలోచనలు కలిగేలా చేస్తుంది. తనకు శక్తిని ఇచ్చే ఆ బ్రహ్మాన్ని మనస్సు తెలుసుకోలేదు. కనుక మనస్సుతో తెలుసుకున్నవి బ్రహ్మం కాదని తెలుసుకోమంటున్నారు గురువుగారు.
   కళ్ళు దేన్ని చూడలేవో అది బ్రహ్మం కాదు... కళ్ళకు చూడగల శక్తిని ఏదైతే ఇస్తోందో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఇక్కడ పూజింపబడుతున్నది బ్రహ్మం కాదనీ తెలుసుకో!
   ఇక్కడ ఉపనిషత్తు చెప్తూ గురువుగారు స్పష్టంగా చెప్తున్నారు. విగ్రహాల ఆకారాలు చూసి అవే పరమాత్మ అని భ్రమ పడద్దు. కంటితో చూడగలిగేది ఏదీ బ్రహ్మం కాదు...కన్ను అలా చూడడానికి అవసరమయిన శక్తినీ చైతన్యాన్నీ ఏదైతే ఇస్తోందో అదే బ్రహ్మం అని తెలుసుకోమంటున్నారు.
   మానవుడు చెవి ద్వారా వినలేనిది బ్రహ్మం కాదు... వినకలిగిన శక్తి దేనివల్ల కలుగుతోందో అది మాత్రమే బ్రహ్మం అనీ, ఇక్కడ పూజింపబడుతున్నది  బ్రహ్మం కాదనీ తెలుసుకో!
   చెవితో పరమాత్మకు సంబంధించిన అనేక విషయాల్ని వింటుంటాం. చెవిద్వారా విన్నవి భగవంతుడికి సంబంధించినవే అయినా సరే అవి బ్రహ్మం కాదు. అలా వినగలగడానికి చెవికి ఏదైతే శక్తిని చైతన్యాన్ని ఇచ్చిందో అదే బ్రహ్మం! అంతేకాని చెవితో వింటున్న పురాణలు ప్రవచనాలు కాదని తెలుసుకోమని చెప్పారు గురువుగారు.
   ఏది ప్రాణం వల్ల జీవించదో అది బ్రహ్మం కాదు...  దేని వల్ల ప్రాణం శ్వాసిస్తోందో అది బ్రహ్మం అనీ, ఇక్కడ ఈ పూజింపబడుతున్నది బ్రహ్మం కాదనీ తెలుసుకోమన్నారు.
   ప్రాణంతో ఉన్నవన్నీ ఉపాసనకి ఉపయోగించేవే. ప్రాణంతో ఉన్నదేదీ బ్రహ్మం కాదు. ప్రాణానికి ఏదైతే ఆధారమవుతోందో అదే బ్రహ్మం. ఏది ప్రాణం వల్ల జీవించదో, దేనివల్ల ప్రాణం శ్వాసిస్తుందో అది బ్రహ్మం అని తెలుసుకోమంటున్నారు గురువుగారు. ఇంద్రియాలకి మనస్సుకి సంబంధించిన పనులకు కావలసిన చైతన్యాన్ని ఇస్తున్నది బ్రహ్మమే అని ఆ బ్రహ్మాన్ని గురించి ఎవరిద్వారా తెలుసుకోగలం అనే విషయం గురువుగారు వివరిస్తున్నారు.
      నేను బ్రహ్మతత్త్వాన్ని గురించి బాగానే తెలుసుకున్నాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్టయితే, నువ్వు తెలుసుకున్నది చాలా తక్కువ. ఎందుకంటే, నువ్వు చూస్తున్న ప్రాణుల్లోను, దేవతల్లోను విస్తరించి ఉన్న పరబ్రహ్మ స్వరూపం అతి తక్కువే! కాబట్టి పరబ్రహ్మను గురించి నువ్వు తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది. అన్నారు గురువుగారు.
   గురువుగారు చెప్పింది విని శిష్యుడు ( కొంచెంసేపు గురువుగారు చెప్పినదాన్ని మననం చేసుకుని పరమాత్మ సాక్షాత్కారం పొంది ) గురువుగారి దగ్గరకు వచ్చి బ్రహ్మం గురించి తెలుసుకున్నానని అనుకుంటున్నాను అన్నాడు.
   మొదట శిష్యుడు అడిగిన సందేహానికి చెవికి చెవి, కంటికి కన్ను, మనస్సుకి మనస్సు, ప్రాణానికి ప్రాణం ఉందని చెప్పి- చూసేది కాని, వినేది కాని, పలికేది కాని, ప్రాణంతో కదిలేదికాని, మనస్సుతో భావించేది కాని పరబ్రహ్మం కాదని, ఇవన్నీ జరగడానికి శక్తినిచ్చేదే పరబ్రహ్మం లేదా పరమాత్మ అని తెలియ చేశారు గురువుగారు.
   వేదాంత సారాన్ని గురువుగారు తన ఆశ్రమంలో ఉన్న గురుకులంలో శిష్యులకి బోధిస్తున్నారు. శిష్యులు అమితమైన ఆసక్తితో గురువుగారి బోధనలు వింటూ తమ సందేహాల్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు.
   గురువుగారు చెప్పినదాన్ని విని శిష్యుడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి శుద్ధమైన, నిర్మలమైన, పవిత్రమైన మనస్సుతో గురువుగారు చెప్పిన దాన్ని మనస్సులో మననం చేసుకున్నాడు. తనే పరమాత్మ అనే అనుభూతిని పొందాడు. గురువుగారి దగ్గరకు వచ్చి ఆచార్యా!  నాకు తెలిసిందనే అనుకుంటున్నాను అన్నాడు.
   నాకు బాగా తెలుసును అని నేను అనుకోను. నాకు తెలియదు అని కూడా కాదు. తెలుసు కూడా. నా తోటి విద్యార్ధులకి అది తెలియంది కాదు అనీ, తెలిసింది అనీ గ్రహించినవాడు దాన్నిగ్రహించగలడు.
   గురువు ఉపదేశించిన విషయాలన్నిటినీ చక్కగా మననం చేసుకుని గురువుగారి దగ్గరికి వచ్చి నాకు తెలుసుననే అనుకుంటున్నాను అన్నాడు. గురువుగారికి అది మమూలుగా పైకి అనుకుంటున్నదా లేక ఆత్మానుభూతిని పొందాడా? అన్న సందేహంతో శిష్యుడి వైపు చూశారు. ఆయన ముఖంలో కనిపించిన సందేహం చూసి నేను బాగా తెలుసుకున్నాను అని అనుకోవడం లేదు అన్నాడు మళ్ళీ . గురువుగారి ముఖంలో ఆశ్చర్యం. ఇంతకు ముందే కదా నాకు తెలుసుననే అనుకుంటున్నాను అన్నాడు! అనుకున్నారు.      
   గురువుగారి చూపుల్లో కనిపించిన సందేహాన్ని ఆశ్చర్యాన్ని చూసి మళ్ళీ తెలియదని కాదు మా తోటి శిష్యుల్లో కూడా తెలుసున్న వాడికీ తెలుసు, తెలియదు అన్నవాడికీ తెలుసు అన్నాడు శిష్యుడు. తనకు కలిగిన అనుభవం బుద్ధి ద్వారా కాదు, జ్ఞానం ద్వారాయేనని తెలియ చేస్తున్నాడు శిష్యుడు.
   ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలియదని భావిస్తాడో అతడు దాన్ని తెలుసుకుంటాడు. ఏ బ్రహ్మవేత్త తనకు బ్రహ్మం తెలుసునని భావిస్తాడో అతడు దాన్ని తెలుసుకోలేడు. బ్రహ్మవేత్తలు రెండు విధాలుగా ఉంటారు. బ్రహ్మం తెలిసింది అనుకునే వాళ్ళకి తెలియదు. రెండో రకం వాళ్ళు బ్రహ్మం తెలియదు అనుకుంటారు. వీళ్ళకి బ్రహ్మం తెలుస్తుంది.
   అసలు ఉన్నది బ్రహ్మం ఒక్కటే. దాన్ని ప్రపంచం అనే భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలో ఉన్నంత కాలం బ్రహ్మం అనుభూతికి రాదు. ప్రపంచం భ్రమ పోతే మిగిలేది బ్రహ్మమే. కనుక తెలుసుకునేందుకు ఏదీ ఉండదు. తెలుసుకునేవాడు కూడా మిగలడు.
   తెలుసు తెలియదు అనే మాటలు ఆత్మస్థాయిలో ఉన్న మాటలు కాదు. ఆత్మానుభవంలో ఉన్నవాడు తెలియదు అన్నా కూడా తెలిసినట్టే. అనుభవానికి రాక బుద్ధితో తెలుసు అన్నాకూడా తెలియనట్టే. అందుకే తెలియదు అన్నవాళ్లకీ అది తెలియదు. తెలుసు అన్నవాళ్ళకీ అది తెలియదు. ఆత్మను తెలుసుకుని అనుభూతి పొందిన జ్ఞాని తను కూడా ఆత్మగా మిగిలిపోతాడు.
   శిష్యుడు పరస్పర విరుద్ధమైన వాక్యాలు చెప్పి తనకు కలిగినది ఆత్మానుభూతే అని స్పష్టం చేశాడు. గురువుగారు మిగతా శిష్యులకి దానిలో ఉన్న అర్ధాన్ని విడమరిచి చెప్పి వాళ్ళు కూడా ఆత్మానుభూతిని పొందే ఉపాయాన్ని తెలియ చేస్తున్నారు.
   మనస్సు చెందే ప్రతి వికారం ద్వారా దాని స్ఫూర్తిని తెలుసుకోగలిగినవాడు అమరత్వాన్ని పొందుతాడు. ఆత్మ ద్వారా అతడు నిజమైన బలాన్ని పొందుతాడు. జ్ఞానం ద్వారా అమరత్వాన్ని పొందుతాడు.
   మనం తెలుసుకునే ప్రతి విషయ జ్ఞానంలోను ఆత్మ కనబడుతూనే ఉంటుంది. మనసు విషయ వస్తువుల మీదకి పోతున్నా కూడా ఆత్మను తెలుసుకోడం సాధ్యమే. ప్రతి విషయ జ్ఞానంలోను తెలియబడేది ఆత్మ జ్ఞానమే. మన దృష్టి విషయం మీద కాకుండ దాని ఆధారమైన చైతన్యం మీదకు మళ్ళాలి. ప్రతి విషయ జ్ఞానం ద్వారా ఆత్మ తెలియ బడుతుంది. అలా తెలుసుకున్నవాడు ఆత్మానుభూతిని పొందుతాడు.
   మన జీవితంలో ప్రతి కదలికా ఆత్మ ఇచ్చే బలం వల్లనే కలుగుతోంది. నిజమైన బలం ఆత్మ వల్లనే కలుగుతోంది. జీవితమంతా ప్రపంచంలోకి పరుగులెత్తడం కాకుండా ఆ పరుగుల వెనక ఆధారంగా ఉన్న చైతన్యం వైపు దృష్టి సాగించాలి. అదే ఆత్మజ్ఞానం. దాని వల్లనే మోక్షం. మరి మన కర్తవ్యం ఏమిటి? గురువుగారు తెలియ చేస్తున్నారు.
   ఇక్కడ ఈ ప్రపంచంలో దాన్ని సాక్షాత్కరించుకున్నట్లయితే ఆపైన నిజమైన జీవితం ఉంది. ఇక్కడ సాక్షాత్కరించుకోక పోతే సర్వమూ నాశనమే! ప్రతి జీవిలోను ఆత్మను వివక్షించుకుంటూ వెళ్ళగలిగిన ప్రజ్ఞాశాలి ఇంద్రియ జీవనాన్ని అతిక్రమించి అమరత్వాన్ని పొందుతాడు.
   ఈ లోకంలో జీవించి ఉండగానే ఆత్మానుభూతిని పొందాలి. అసలు మానవ జన్మ వచ్చిందే అందుకు కాబట్టి ఆత్మానుభూతిని పొందగలిగితే జన్మ సార్ధకమయినట్టే. అలా సాక్షాత్కరించుకోలేనివాళ్ళు జనన, మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటారు. ఎలా సాధించాలి? మనుషులు, పక్షులు, చెట్లు, క్రిమి కీటకాలు వంటి అన్ని ప్రాణుల్లోను గల ఒకే ఆత్మను చూడగలగాలి. ఆత్మగా అన్నిటిలోను ఉన్న తనను తాను చూసుకోవాలి. అజ్ఞానాన్ని వదిలి పెట్టినవాళ్ళు ప్రపంచంలో అనుభవించవలసినవి, చూడవలసినవి, అనందించ వలసినవీ ఏవీ లేవని ఇవన్నీ భ్రమే అని తెలుసుకుని ఆకర్షణల నుంచి విముక్తిని పొంది ఆత్మానుభవం పొంది అమరులవుతారు.
   ఇంద్రియాలకి వెనుక ఉండి శక్తిని ఇచ్చేవాడు పరబ్రహ్మమే అని, ఆత్మ ఆత్మవల్లనే తెలుసుకోబడుతుందనీ, అర్ధం చేసుకున్నాము. బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే కోరిక ఎందువల్ల కలుగుతుంది అనే విషయాన్ని తెలియ చేస్తున్నారు గురువుగారు.
   గురువుగారు ఒక కథ చెప్తున్నారు. బ్రహ్మం ఒకప్పుడు దేవతలకి రాక్షసులపైన విజయం సంపాదించింది పెట్టింది. విజయం సంపాదించి పెట్టింది బ్రహ్మమే అయినా దాని వల్ల దేవతలకి కీర్తి కలిగింది. నిజంగా మేమే గెలిచాం, మాదే ఈ గొప్పతనమంతా అని దేవతలు అనుకున్నారు.
   దేవతలకి రాక్షసులకి మధ్య ఎప్పుడూ శతృత్వమే. ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి పడదు. చిన్న చిన్న విషయాలకి కూడా వాదులాడుకోడం, చివరికి ఒకళ్ళనొకళ్ళు చంపుకోడం అలవాటుగా మారిపోయింది. ఒకసారి ఇలాగే వాదించుకుని చివరికి యుద్ధానికి దిగారు. ఆ యుద్ధంలో దేవతలు రాక్షసుల్ని ఓడించి విజయం పొందారు. యుద్ధంలో రాక్షసులు చాలా మంది మరణించారు. మిగిలివాళ్ళు పారిపోయారు.
   యుద్ధంలో జయించారు కనుక దేవతలని అందరూ పొగిడారు. పొగడ్తలకి ఉబ్బని వాళ్ళు ఉండరు కదా . సామాన్యుడు కూడా పొగడ్తలకి గర్వపడతాడు. దేవతలు కూడా ఈ పొగడ్తలకి ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ విజయం మేమే సాధించాం అని గర్వంతో విర్రవీగి పోయారు. తమ విజయానికి కారణం పరబ్రహ్మశక్తి అనే విషయాన్ని మర్చిపోయారు. మాకంటే గొప్పవాళ్ళు లేరు అనుకుని అహంకారంలో పడ్డారు. ఇప్పుడు వాళ్ళు పూర్తిగా పరమాత్మ విషయం వదిలేశారు. సర్వ శక్తిమంతుడైన ఈశ్వరుడికి వాళ్ళ మనస్సులో స్థానమే లేకుండ పోయింది. దేవతల అహంకారాన్ని పోగొట్టడానికి పరబ్రహ్మ ఏం చెయ్యాలనుకున్నాడో శిష్యులకి వివరిస్తున్నారు గురువుగారు.
   దేవతలకి కలిగిన గర్వాన్ని బ్రహ్మం తెలుసుకుంది. వాళ్ళ ఎదుట దివ్యమైన తేజస్సుతో ప్రకాశించింది. కాని, వాళ్ళకి తమ ముందుకి వచ్చి నిలిచిన ఆ అపురూపమైన శక్తి ఏమిటో అర్ధం కాలేదు.
   దేవతల్లో పెరిగిన అహంభావాన్ని గుర్తించాడు పరబ్రహ్మ. వాళ్ళని అహంకారంలో కూరుకుని పోకుండ రక్షించాలని అనుకున్నాడు. కొడుకు క్షేమంగా ఉండాలని తండ్రి కోరుకున్నట్టే భగవంతుడు కూడా భక్తుల క్షేమాన్నికోరుకుంటాడు. తన కళ్ళముందే తన కొడుకు చెడిపోతుంటే ఏ తండ్రీ చూస్తూ ఊరుకోలేడు కదా? అదే విధంగా తన పిల్లలయిన దేవతలు అహంకారంలో పడి నాశనమయి పోకుండ రక్షించాలనుకున్నాడు. వాళ్ళని ఉద్ధరించడం కోసం ఒక గుణపాఠాన్ని నేర్పాలని నిర్ణయించుకుని సమయం కోసం ఎదురు చూస్తున్నాడు.
   ఒకరోజు అమరావతీ పట్టణంలో ఉన్న ఉద్యానవనంలో ఇంద్రుడు ఒక సభని ఏర్పాటు చేశాడు. దేవతలందరూ హాజరయ్యారు. దేవతలకి అసలు విషయం తెలియ చెయ్యడానికి అదే మంచి సమయం అనుకున్నాడు ఆ సభలోనే ఉన్న పరబ్రహ్మ. వెంటనే వాళ్ళకి ఎదురుగా గొప్ప ప్రకాశవంతమయిన రూపంలో ప్రత్యక్షమయ్యాడు.
   ఇది కేనోపనిషత్తులో మూడో బాగం. వేదాంతాన్ని అర్ధం చేసుకోడం అంత సులభమైన విషయం కాదు. కనుక కథా రూపంలో చెప్పి అర్ధం కాని దానిని అర్ధమయ్యే విధంగా చెప్పమంది శాస్త్రం. ఈ కథను చెప్పడంలో అంతరార్ధం ఎమిటంటే, పరమాత్మ అంతటా ఉన్నాడని చెప్పడం, పరమాత్మ యొక్క  గొప్పతనాన్ని చెప్పడం, ఇంద్రియాల్ని, మనస్సుని పని చేయిస్తూ మన విజయానికి కారణమవుతున్నది పరమాత్మేనని చెప్పడం, పరమాత్మను దేవతలు కూడా తెలుసుకోలేకపోయారు అని చెప్పడం, మనిషికి కోరికలు కలిగించేది కూడ పరమాత్మేనని చెప్పడం. మనం ఈ విషయాల్ని మర్చిపోయినప్పుడు పరమాత్మ తన ఉనికి మనకు ఏదో విధంగా గుర్తుచేస్తూ ఉంటాడు. తన గురించి దేవతలకి తెలియ చెయ్యడం కోసమే గొప్ప తేజస్సుగా ప్రత్యక్షమయ్యాడు.
  అంత గొప్ప తేజస్సు ఎలా వచ్చిందో... ఎక్కడనుంచి వచ్చిందో... అసలు దాని స్వరూపం ఏమిటో దేవతలకి తెలియలేదు. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. తరువాత జరిగినదాన్ని శిష్యులకి తెలియ చేస్తున్నారు గురువుగారు.
   దేవతలు అగ్నితో ఓ జాతవేదుడా! ఈ అపురూపమైన శక్తి ఏమిటో తెలుసుకో! అన్నారు. అందుకు అగ్ని అలాగే తెలుసుకుంటాను! అన్నాడు.
   ప్రకాశవంతమైన ఆ శక్తిని చూసి దేవతలు ఆశ్చర్యంతో పాటు భయపడ్డారు. ఆ రూపం ఏమిటో తెలుసుకోవాలని అనుకున్నారు. ఆ పనిని అగ్నిదేవుడికి అప్పగిద్దామని నిశ్చయించుకుని దేవతలంతా కలిసి అగ్ని దగ్గరికి వచ్చారు. యజ్ఞాలు జరిగినప్పుడు ఆహూతుల్ని ఎవరివి వాళ్ళకి అందచేస్తాడు అగ్ని. సర్వజ్ఞుడు, శక్తిమంతుడు అయిన అగ్నిని ఓ జాతవేదా! మా బుద్ధికి అందని ఆ ప్రకాశవంతమైన శక్తి యొక్క రూపం ఏమిటో తెలుసుకుని వచ్చి మాకు చెప్పు ! అన్నారు.
   అంత గొప్పగా పిలిచి అడిగినందుకు తనే అందుకు సమర్ధుడని చెప్పినందుకు అగ్నిదేవుడు పొంగి పోయాడు. అహంకారం పెరిగింది. పొగడ్తలవల్ల వివేకాన్ని పోగొట్టుకున్నాడు. వివేకంతో ఆలోచించి అవతలి వాడి శక్తి ఎంత ఉందో గ్రహించకుండానే దేవతలు చెప్పినదాన్ని చెయ్యడానికి అంగీకరించాడు. తనలో ఉన్న శక్తి ఎవరివల్ల వచ్చిందో తెలుసుకోలేక ఎదురుగా ఉన్న దివ్య శక్తిని తెలుసుకునేందుకు బయలుదేరాడు.
   అలా బయలుదేరి వెళ్ళిన అగ్నిదేవుడికి ఏంజరిగిందో వివరిస్తున్నారు గురువుగారు.
   అగ్ని ఆ దివ్య శక్తి దగ్గరికి చాలా వేగంగా వెళ్ళాడు. నీవెవరివి? అని ఆ శక్తి  అతణ్ణి ప్రశ్నించింది. నేను అగ్నిని, సర్వజ్ఞుణ్ణి అని అగ్ని బదులిచ్చాడు.
   దేవతలు అడగ్గానే వేరే ఆలోచన లేకుండ తను అన్నీ తెలిసిన వాడిననే అహంకారంతో ఆ ప్రకాశవంతమైన శక్తి వైపు వేగంగా వెళ్ళాడు. అహంకారంతో విర్రవీగేవాడు ఎప్పుడూ అవమానం పొందుతాడు. అగ్ని విషయంలో కూడా అదే జరిగింది.
   దివ్య శక్తి దగ్గరికి వెళ్ళాడే కాని, నువ్వు ఎవరివని అడగలేదు. ఆ ప్రశ్న దివ్యశక్తే అగ్నిని అడిగింది నువ్వెవరు? అని. అహంకారంతో నేను అగ్నిని. సర్వమూ తెలిసినవాణ్ణని, జాతవేదుణ్ణని లోకంలో  ప్రఖ్యాతి పొందినవాణ్ణి అని గర్వంగా చెప్పాడు. దివ్యశక్తి అగ్నితో ఏమందో వినండి అన్నారు గురువుగారు.
  అయితే నీలో ఏం శక్తి ఉంది? అని దివ్య శక్తి అడిగింది. భూమ్మీద ఏదైతే ఉందో దాన్నంతటినీ నేను దహించివేయగలను అన్నాడు అగ్నిదేవుడు.
   అగ్ని దివ్య శక్తి దగ్గరికి చేరగానే సర్వజ్ఞుడవైన నీకు గల శక్తి ఏమిటి అని అడిగింది. అగ్ని అనుకున్నాడు తను అడుగుదామని వచ్చాడు కాని తననే ఎదురు ప్రశ్న వేసింది. అయినా ఫరవాలేదు కొంచెం గొప్పగానే చెప్పుకుందాం అనుకున్నాడు. ప్రకాశవంతుడా! ఈ ప్రపంచంలో అందరికీ నాగురించి తెలుసు.  అ విషయం నీకు తెలియదా? కనిపించే ప్రతి వస్తువుని ఒక్క క్షణంలో భస్మం చేసెయ్యగలను! అని గర్వంగా చెప్పుకున్నాడు. దివ్యశక్తి ఏం చేసిందో చెప్తున్నారు గురువుగారు.
   ఆ దివ్య శక్తి అతని ఎదుట ఒక గడ్డి పోచను ఉంచి అయితే దీన్నికాల్చు అంది. అగ్ని తన యావచ్ఛక్తితో ప్రయత్నించాడు కాని ఆ గడ్డిపోచను కాల్చలేకపోయాడు. అగ్ని దేవుడు తిరిగి దేవతల దగ్గరకి వెళ్ళిపోయి ఈ అపురూపమైన శక్తి ఏమిటో నేను తెలుసుకోలేక పోయాను అన్నాడు.
   అన్నీ తెలిసినవాణ్ణి అని అహంకారంతో పలికిన అగ్నికున్న అహంకారం వదిలించాలనుకుని దివ్య శక్తి ఒక గడ్డిపోచను ఇచ్చి దహించమంది. ఎంత కష్టపడినా నీరసం వచ్చిందే కాని ఆ గడ్డిపోచని మాత్రం కాల్చలేకపోయాడు. దైవశక్తి లేకపోతే గడ్డిపోచకి కూడా కొరగాని వాళ్ళమవుతాము అన్నట్టు అయింది అగ్ని పరిస్థితి. సిగ్గుపడి తలయెత్తకుండా వెనక్కి తిరిగి దేవతల దగ్గరికి వెళ్ళిపోయాడు.
   దేవతలారా నేను ఎంత ప్రయత్నించినా ఆ దివ్య శక్తి యొక్క శక్తిని మాత్రం తెలుసుకోలేకపోయాను. దాన్ని తెలుసుకోగలిగినంత సామర్ధ్యం నాలో లేదు అన్నాడు. అప్పుడు దేవతలు ఏం చేశారో చెప్తున్నారు గురువుగారు.
   అప్పుడు దేవతలు వాయదేవుడితో ఓ వాయుదేవా! ఈ అసాధారణమైన శక్తి ఏమిటో కనుక్కో! అన్నారు
   ఎప్పుడైతే గడ్డిపోచని దహించడం తన వల్ల కాలేదో అప్పుడు అగ్ని తిరిగి వచ్చేసి జరిగిన విషయం దేవతలకి చెప్పాడు. దేవతలు వాయుదేవుడి దగ్గరికి వెళ్ళారు. వాయుదేవా ! నువ్వు గొప్ప శక్తిమంతుడివి. నువ్వు వెళ్ళి ఆ దివ్య శక్తికి ఎటువంటి శక్తి ఉందో కనుక్కుని రా! అని చెప్పి పంపించారు. వాయుదేవుడు  మహాశక్తి దగ్గరికి వెళ్ళాక ఏం జరిగిందో గురువుగారు చెప్తున్నారు.
   వాయువు అసాధారణ శక్తి దగ్గరికి మహా వేగంగా వెళ్ళాడు. ఆ శక్తి నువ్వెవరు? అని అడిగింది. నేను వాయువుని, గాలికి ప్రభువుని అని సమాధానం చెప్పాడు. 
   అగ్ని తిరిగి వచ్చాక దేవతలు వాయువుని పంపించారు. వాయువు ఏమయినా సరే విషయం తెలుసుకునే వస్తానని చెప్పి ఉత్సాహంగా వెళ్ళాడు. ఇప్పుడు కూడా వాయువు దివ్య శక్తిని ప్రశ్నించకుండానే దివ్యశక్తే వాయువుని నువ్వెవరు? అని ప్రశ్నించింది.
   వాయువు మహా గర్వంతో నేను వాయువు అని పేరు గలవాణ్ణి. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి యొక్క జీవితం నా చేతుల్లోనే ఉంది. నన్ను మాతరిశ్వుడు అని కూడా పిలుస్తారు. నీకు తెలియదా? అన్నాడు. అప్పుడు దివ్యశక్తి ఏమని అడిగిందో గురువుగారు శిష్యులకి తెలియచేస్తున్నారు.
   అయితే నీలో ఏం శక్తి ఉంది? అని ఆ దివ్య శక్తి అడిగింది. భూమ్మీద ఉన్నదాన్ని దేనినైనా ఎగుర గొట్టగలను అని వాయుదేవుడు సమాధానమిచ్చాడు.
   అగ్నికి సర్వమూ తెలిసినవాణ్ణి అని గర్వం. అలాగే వాయుదేవుడికి తను చాలా బలవంతుణ్ణి అని అహంకారం ఎక్కువ. అందుకే దేన్నైనా సరే ఒక్క క్షణంలో ఎగరగొట్టగలను, ఈ బ్రహ్మాండాన్నే ఒక్క క్షణంలో ఊపెయ్యగలను, భూమిని ఆకాశాన్ని కూడా కలిపి ఒక్కటిగా చెయ్యగలను అని ధీమాగా చెప్పాడు. అప్పుడు శక్తి ఏం చేసిందో చెప్తున్నారు గురువుగారు.
   వాయువు ఎదుట దివ్య శక్తి ఒక గడ్డి పోచను ఉంచి దీన్ని ఎగురగొట్టు! అంది. వాయువు తన సర్వ శక్తిని ప్రయోగించాడు. కాని, గడ్డిపోచ కదల్లేదు. అందుచేత దేవతల దగ్గరికి వెళ్ళి అపురూప శక్తి ఏమిటో తెలుసుకోలేక పోయాను అన్నాడు.
   అగ్ని ఓడిపోయి వెళ్ళిపోయినా ఎందుకు ఓడిపోయాడో అని ఆలోచించలేదు వాయుదేవుడు. తను దేవతలందరిలో బలవంతుణ్ణి అనే అహంకారంతో దేవతలు అడగ్గానే పరుగెత్తుకుని వచ్చి దివ్య శక్తి ముందు నిలబడ్డాడు. తనగురించి గర్వంగా చెప్పుకున్నాడు. కాని చివరికి ఏమయింది ఒక చిన్న గడ్డిపోచని ఎగరగొట్టలేక పోయాడు. తలవంచుకుని వెనక్కి వెళ్ళి అగ్ని చెప్పినట్టే ఆపురూప శక్తి యొక్క బలం తెలుసుకోలేక పోయాను అన్నాడు. తరువాత దేవతలు ఎవర్ని పంపించారో చెప్తున్నారు గురువుగారు.
   అప్పుడు ఇంద్రుడితో ఓ దేవేంద్రా ! ఈ అపురూపమయిన శక్తి ఏమిటో తెలుసుకో! అన్నారు. ఇంద్రుడు సరే అన్నాడు. ఆ శక్తి దగ్గరికి త్వరత్వరగా వెళ్ళాడు. కాని, దివ్య శక్తి అతడి ఎదుటి నుండి వెంటనే అంతర్ధానమైంది.
    దేవతలు తమకు ఎదురుగ వచ్చి నిలిచిన అపురూపమయిన ప్రకాశాన్ని చూసి దాన్ని తెలుసుకోలేక తెలుసుకుని రమ్మని అగ్నిదేవుణ్ణి పంపించారు. ఆ శక్తికి ఎదురు నిలువలేక వెనక్కి వెళ్ళి తన వల్ల కాదని చెప్పాడు అగ్నిదేవుడు. తరువాత దేవతలు వాయుదేవుణ్ణి పంపించారు. వాయువు కూడా తిరిగి వచ్చి అదే విధంగా చెప్పాడు.
   తరువాత దేవతలు ఇంద్రుణ్ణి పంపాలనుకుని దేవేంద్రా ! ఈ పనికి నువ్వే సమర్ధుడివి. నువ్వు వెళ్ళి ఆ దివ్యశక్తి యొక్క తత్త్వం ఏమిటో తెలుసుకుని వచ్చి మా భయాన్ని, సందేహాన్ని తీర్చు! అని అడిగారు. ఇంద్రుడు వాళ్ళు అడిగినట్టుగానే తెలుసుకుని వస్తానని వెళ్ళాడు. కాని, ఇంద్రుడు వెళ్ళగానే ఆ దివ్య ప్రకాశం అంతర్ధానమైంది. ఆ శక్తిని ప్రశ్నించే సమయం వాయుదేవుడికి కలగలేదు. తరువాత ఏం జరిగిందో గురువుగారు వివరిస్తున్నారు.
   ఆకాశంలో ఇంద్రుడు అత్యంత అద్భుత సౌందర్యవతి అయిన హిమవంతుని కుమార్తెని చూశాడు. ఆమెను అడిగాడు ఈ అపురూపమైన దివ్యశక్తి ఏమిటి?
   అగ్ని, వాయువు దివ్య శక్తిని గురించి తెలుసుకోలేక పోయారు. దేవతలు తమకు అధిపతి అయిన ఇంద్రుణ్ణి కలుసుకుని, ఈ పనికి నువ్వు తప్ప మాకు ఇంకెవరూ లేరు. ప్రకాశవంతమయిన దివ్యశక్తిని గురించి ఆడిగి తెలుసుకుని రాగల సమర్ధిడివి నువ్వే కనుక ఆ సహాయం చెయ్యమన్నారు.
   దేవేంద్రుడు తను దేవతలకి అధిపతిని కనుక దేవతల్లో ఒకరైన అగ్ని, వాయువు చెయ్యలేక పోయిన పనిని తను చెయ్యగలను అనుకున్నాడు. కాని, ఇంద్రుడు వెళ్ళగానే ఆ శక్తి అంతర్ధానమయింది.
   దివ్య శక్తి ఏమయిందో తెలియక అయోమయంగా అన్నివైపులా వెతుకుతున్నాడు. నిరాశతో వెనక్కి తిరిగి వెళ్ళిపోకుండా దేవతలు తనకు అప్పగించిన పనిని తప్పకుండా పూర్తి చెయ్యాలి అని నిర్ణయించుకుని అక్కడే ఉండిపోయాడు. ఆ సమయంలో దివ్య శక్తి అదృశ్యమయిన ప్రదేశంలో ఇంద్రుడికి ఆకాశంలో గొప్ప సౌందర్యం కలిగి, శోభయమానంగా ప్రకాశిస్తూ ఉన్న హిమవంతుని కుమార్తె ఉమ ప్రత్యక్షమయింది.
   ఇంద్రుడు భక్తితోను, వినయంతోను ఆమెకి నమస్కరించి దేవీ! ఇంతవరకు దేవతలను భయపెట్టిన ఆ దివ్య శక్తి ఎవరు? అని అడిగాడు. ఇప్పుడు ఉమాదేవి బ్రహ్మం గురించి దేవతలకి చెప్తోంది వినమని గురువుగారు శిష్యులకి బోధిస్తున్నారు.
   అది బ్రహ్మం అని చెప్పి, బ్రహ్మం విజయం వల్లనే కదా మీరు గొప్పవాళ్ళుగా ప్రసిద్ధికెక్కారు అని ఉమాదేవి చెప్పింది. ఆ దివ్య శక్తి బ్రహ్మం అని ఇంద్రుడు తెలుసుకున్నాడు.
   దివ్యశక్తి అంతర్ధానమయిన అదే ప్రదేశంలో ఆకాశంలో నిలిచిన ఉమాదేవి దేవేంద్రా! అది పరబ్రహ్మం . నువ్వు అడిగిన ఆ ప్రకాశవంతమైన దివ్య శక్తి పరబ్రహ్మం అని సమాధానం చెప్పింది. అంతటా ఆవరించి ఉండే ఆ పరబ్రహ్మమే రాక్షసులతో జరిగిన యుద్ధంలో మీకు విజయం కలిగేలా చేసింది. బ్రహ్మం తను పొందిన విజయం వల్ల మీకు కీర్తి ప్రతిష్ఠలు కలిగాయి. ఆ నిజాన్ని మీరు తెలుసుకోలేక మీ బలపరాక్రమాల వల్లే మీరు రాక్షసుల్ని జయించగలిగామని గర్వపడుతున్నారు.
   మీలో లేని బలపరాక్రమాల్ని మీలో ఉన్నాయని అనుకుంటున్నారు. మీకు కలిగిన మిథ్యాభిమానం పోగొట్టడానికే బ్రహ్మం మీ ముందుకి ప్రకాశవంతమైన దివ్య శక్తిగా వచ్చి నిలిచింది. మీరు మీ బలపరాక్రమాలతో గడ్డిపోచను కూడా కదల్చలేక పోయారు.  ఎందుకంటే, ఆ సమయంలో బ్రహ్మం మీలో లేకుండా వేరుగా ఉన్నాడు. కాబట్టి, మీలో ఉన్న శక్తిసామర్ధ్యాలు పరబ్రహ్మ శక్తే అని తెలుసుకోండి! అని చెప్పి ఉమాదేవి అంతర్ధానమయింది.
   అంత వరకు గౌరీదేవి చెప్పిన మాటలు విన్న ఇంద్రుడు తమ ఎదురుగా వచ్చి నిలిచిన ప్రకాశవంతమైన దివ్య శక్తి పరబ్రహ్మ స్వరూపమని తెలుసుకున్నాడు అని చెప్పిన గురువుగారు పరబ్రహ్మాన్ని చూసిన అగ్ని, వాయువు, ఇంద్రుడు  గొప్పతనాన్ని పొందారు.
   అందుచేతనే కదా ఈ దేవతలు...అగ్ని, వాయువు, ఇంద్రుడు...ఇతర దేవతలను అధిగమించారు. వాళ్ళే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్ళారు. వచ్చిన ప్రకాశవంతమైన ఆ దివ్యశక్తిని బ్రహ్మం అని మొదట వాళ్ళే తెలుసుకున్నారు.
   అగ్ని, వాయువు, ఇంద్రుడు బ్రహ్మానికి సమీపంగా వెళ్ళారు. వాళ్ళే మొదట ఆ దివ్యశక్తిని పరబ్రహ్మగా తెలుసుకున్నారు. అందువల్లనే ఈ ముగ్గురు దేవతలు, దేవతలలో గొప్పవాళ్ళుగా చెప్పబడ్డారు. అగ్ని కర్మేంద్రియాలకు ప్రతినిధి, వాయువు జ్ఞానేంద్రియాలకు ప్రతినిధి. ఇంద్రుడు మనస్సుకు ప్రతినిధి. అగ్ని, వాయువు, ఇంద్రుడు బ్రహ్మాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించారు. బ్రహ్మానికి దగ్గరగా వెళ్ళారు, తెలుసుకున్నారు. అంటే కర్మేంద్రియాలతోను, జ్ఞానేంద్రియాలతోను, మనస్సుతోను ఎవరు పరబ్రహ్మను చూడడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళే గొప్పవాళ్ళు.
   ఇంద్రుడు దేవతలందరిలో మొదటివాడుగా ఎందుకయ్యాడో గురువుగారు తెలియచేస్తున్నారు.
   ఇంద్రుడు పరబ్రహ్మాన్ని దగ్గరనుంచి చూశాడు. అందుచేతనే ఇంద్రుడు ఇతర దేవతలని అధిగమించాడు! అతడే ఆ దివ్యశక్తిని పరబ్రహ్మం అని మొదట తెలుసుకున్నాడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.
   మొదట ఒక సద్గురువుని ఆశ్రయించి, ఆయనను సేవించి, ఆయన బోధించిన విషయాల్ని విని వాటి ద్వారా పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలి. అందుకు గురువు దగ్గరికి వెళ్ళడానికి, అయనకి నమస్కరించడానికి ఆయన చెప్పిన బోధలు వినడానికి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు కావాలి. ఆ విధంగా బ్రహ్మాన్ని గురించి తెలుసుకున్న తరువాత మననం చేసుకుని నేనే పరబ్రహ్మను అనే అనుభవాన్ని పొందాలి. ఆ విధమైన అనుభవాన్ని పొందినవాడే అధికుడు. విని తెలుసుకోడం వల్ల అగ్ని,వాయువు, ఇంద్రుడు ఆధిక్యం పొందారు, మననం వల్ల ఇంద్రుడి ఆధిక్యం తెలుస్తోంది.
   అగ్ని, వాయువు, ఇంద్రుడు ఆ దివ్య శక్తిని దగ్గరనుండి దర్శించడం, పార్వతీదేవి మాటలవల్ల అ దివ్యశక్తి బ్రహ్మస్వరూపమని మొదట ఇంద్రుడు తరువాత అగ్ని వాయువులు తెలుసుకున్నారు. దానివల్ల తమ మిథ్యాభిమానాన్ని వదులుకున్నారు. అందువల్ల అగ్ని, వాయువు, ఇంద్రుడు దేవతల్లో గొప్పవాళ్ళుగా మిగిలారు అని చెప్పి గురువుగారు శిష్యులకి తరువాత విషయాన్ని చెప్తున్నారు.
   బ్రహ్మం గురించిన వర్ణన ఇది. మిరుమిట్లు గొలిపే మెరుపుని ప్రకాశింప చేస్తున్నది ఆ బ్రహ్మమే! మనిషిని రెప్పలు ఆర్చేటట్టు చేస్తోంది ఆ బ్రహ్మమే. ప్రకృతి, శక్తులుగా ఆ బ్రహ్మం అభివ్యక్తీకరణకు సంబంధించిందిగా ఉంటోంది.
   ఎవరు ప్రేరేపిస్తే మనస్సు విషయ ప్రపంచంలోకి వెడుతోంది? ఇంద్రియాలు పనిచెయ్యడానికి కారకులు ఎవరు? ఇంద్రియాల్ని మనస్సుని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? అనే శిష్యుడి ప్రశ్నతో కేనోపనిషత్తు మొదటి భాగం నడిచింది.
   ఈ బ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే ఎవరిని ఆశ్రయించాలి అనే ప్రశ్నకు  దీన్ని ఇంద్రియాలవల్ల మనోబుద్ధుల వల్ల తెలుసుకోడం కుదరదు. బ్రహ్మాన్ని బ్రహ్మంతోనే తెలుసుకోగలం అని రెండవ భాగంలో తెలుసుకున్నాం.
   బ్రహ్మాన్ని తెలుసుకోవాలనే కోరిక గాని, ఆసక్తిగాని ఎవరి వల్ల కలుగుతుంది అనే ప్రశ్నకు మూడవభాగంలో సమాధానం తెలుసుకున్నాం.
   అన్ని విషయాలకు సమాధానం నాలుగో భాగంలో తెలుసుకుంటున్నాం. పూర్వజన్మలో చేసుకున్న మంచి కర్మలవల్ల దైవానుగ్రహం కలిగి, సద్గురువు ఆశ్రయం దొరికి, గురువు సన్నిధిలో కూర్చుని, గురువు చెప్పిన బోధలు విని, గురువు అనుగ్రహం పొంది  తెలుసుకున్నవాటిని మననం చేసుకుని సాధన చేస్తూ ఉంటే మొదట మెరుపులాగ, తరువాత కనురెప్పలు మూసి తెరిచినట్టు దైవ నిర్దేశం అందుతూ ఉంటుంది. మొదట బాహ్య సాధన తరువాత అధిదైవతం. ఇంక మిగిలిన సాధన పూర్తిగా అంతర్ముఖం. దాన్ని కూడా తెలుసుకోమని చెప్తూ వివరిస్తున్నారు గురువుగారు బ్రహ్మం వల్లనే మనస్సు ఈ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకుంటుంది. జ్ఞాపకం ఉంచుకుంటుంది, వస్తువులను ఊహించుకుంటుంది.
   ఇప్పుడు అంతర్గత సాధన మొదలవుతుంది. మనస్సు దేనివల్ల ప్రపంచ విషయాల మీదకి పరుగెడుతుందో, దేనివల్ల జరిగిపోయిన విషయాలని జ్ఞాపకం చేసుకుంటుందో, దేనివలన అనుక్షణమూ కొత్త సంకల్పాలను తయారు చేసుకుంటుందో అదే బ్రహ్మం.
   ఆలోచనలు మూడు విధాలుగా ఉంటాయి. కొన్ని ఆలోచనలు భూత కాలంలోకి, కొన్ని వర్తమానంలోకి మరికొన్ని భవిష్యత్తు కార్యక్రమాలకి సంకల్పం చేసుకుంటాయి. అలలు సముద్రంలో లేచి మళ్ళీ సముద్రంలో కలిసిపోయినట్టు, ఆత్మలో లేచిన ఆలోచనలు ఆత్మలోనే కలిసిపోతాయి. అలలు ఆగిపోయినప్పుడు సముద్రం ఒక్కటే ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా ఆలోచనలు ఆగిపోతేనే ఆత్మదర్శనం అవుతుంది. అంటే, ఆలోచనారహిత స్థితిలో ఆత్మదర్శనం కలుగుతుంది. అప్పుడే ఆత్మానుభూతి కలుగుతుంది.
   బ్రహ్మాన్ని ఎందుకు ఆరాధిస్తారు, ఎందుకు ఉపాసిస్తారు అనే విషయాన్ని తెలియ చేస్తున్నారు గురువుగారు.
   బ్రహ్మం అన్ని జీవులకూ ఆత్మగా ఆరాధింప తగిందనీ ప్రసిద్ధి చెందింది. కాబట్టి దాన్ని తద్వనంగా ధ్యానించాలి. ఈ విధంగా  తెలుసుకున్న వాళ్లని సకల జీవులూ ప్రేమిస్తాయి.
   బ్రహ్మానికి తద్వనం అని పేరు. ఇది ఆరాధించ తగ్గ గొప్పతనం కలిగి ఉంది కనుక అందరూ దీన్ని ఉపాసిస్తూ దీనికోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. కనుకనే దీన్ని తద్వనం అంటున్నారు. మనం దేహాన్ని ప్రేమిస్తున్నాం అనుకుంటాం. కాని నిజం అది కాదు. అందమైన దేహాన్ని ప్రేమిస్తున్నాం. దాని అందం తగ్గి పోగానే దాని మీద అంతవరకు ఉన్న ప్రేమ తగ్గుతుంది. దానిలో ఉన్న అత్మ చైతన్యం వెళ్ళిపోతే అదే అందమైన శరీరాన్ని ముట్టుకోడానికి చూడ్డానికి కూడా భయపడతాం. కాల్చి బూడిద చేస్తాం. కాబట్టి మనం అంతవరకు మనకు తెలియ కుండానే ఆ శరీరానికి ఆధారంగా ఆత్మనే ప్రేమిస్తున్నాం. అందువల్ల మనం ప్రేమించేది, ఆరాధించేది, ప్రేమించ తగినది కూడా ఆత్మే. ఎవరైతే ఆత్మను ఆరాధించి, ఉపాసించి ఆత్మను తెలుసుకుని, తాము కూడా ఆత్మస్వరూపమేనని తెలుసుకుని, ఆత్మానుభూతి చెంది, ఆరాధింప తగిన  ఆత్మలో ఐక్యం చెందుతారో వాళ్ళు కూడా ఆరాధింపబడతారు. లోకంలో అందరూ వాళ్లని పూజిస్తారు, గౌరవిస్తారు. అని చెప్పి గురువుగారు ఇంకా వివరంగా శిష్యులకి బోధించారు.
   శిష్యుడు ఆచారవర్యా! నాకు ఉపనిషత్తుని ఉపదేశించండి! అన్నాడు. ఆచార్యుడు నీకు ఉపనిషత్తు ఉపదేశించబడింది. నిజంగా బ్రహ్మం గురించిన  ఉపనిషత్తుని నీకు ఉపదేశించాం! అన్నారు.
   మొదట్లో శిష్యుడు అడిగినదానికి సమాధానంగా గురువుగారు నాలుగు భాగాలుగా ఉపనిషత్తు మొత్తాన్నివివరంగా కథలుగా ఉపమానాలతో సహా చెప్పడం పూర్తి చేశారు. ఇప్పుడు ఉన్నట్టుండి మరొక శిష్యుడు ఆచార్యా! మాకు ఉపనిషత్తుని బోధించండి! అని అడుగుతున్నాడు. శిష్యుడికి అర్ధం కాలేదా? అసలు అర్ధం చేసుకోలేని శిష్యుడు అంతవరకు వెళ్ళలేడు. గురువుని వెతుక్కుంటూ వెళ్ళి, ఆయనను సేవించి, ఆయన అనుగ్రహం పొంది, ఉపనిషత్తు గురించి తెలుసుకునే అపురూపమయిన అదృష్టాన్ని వదులుకుని వినకుండ కూర్చోడు. మరి ఎందుకు అడిగి ఉంటాడు?
   ఉపనిషత్తు రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి పరబ్రహ్మం గురించి మనకు అసలైన జ్ఞానాన్ని కలిగిస్తుంది. రెండోది ఆ జ్ఞానం ద్వారా పరబ్రహ్మాన్ని చేరుకోడానికి, అహం బ్రహ్మస్మిఅనే అనుభవాన్ని పొందడానికి కావలసిన సాధనలు తెలియ చేస్తుంది. ఇప్పుటి వరకు పరబ్రహ్మకు సంబంధించిన జ్ఞానాన్ని బోధించడం పూర్తయింది.
   అందుకే గురువుగారు శిష్యుడితో నాయనా ! నీకు బ్రహ్మం గురించిన ఉపనిషత్తు బోధించాను! అన్నారు. కాని, శ్రద్ధగా వింటున్న శిష్యుడు అలా ఎందుకు అడిగాడో అర్ధం చేసుకుని శిష్యుడిలో ఉన్న ఉత్సాహానికి, శ్రద్ధకి ఆనందపడి ప్రాపంచిక వ్యామోహాల్ని, జ్ఞానానికి అవరోధాలుగా నిలిచే విషయాల్నీ తప్పించుకునే ఉపాయం కూడా చెప్తాను వినమని చెప్తున్నారు గురువుగారు.
   తపస్సు, నిగ్రహం, నిష్ఠా పూర్వకమైన కర్మ ఇవి దానికి(ఉపనిషత్తులోని బ్రహ్మజ్ఞనానికి) మూలభిత్తికలు. వేదాలు దానికి సర్వాంగాలు. సత్యం దానికి నివాస స్థానం.
   ఇప్పటి వరకు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నారు. ఇప్పుడు బ్రహ్మంలో ఐక్యం చెందాలంటే చెయ్యవలసినవి తపస్సు, దమం, నిష్కామ కర్మ. శారీరకమైన తపస్సు వల్ల శరీరానికి అవసరాలు తగ్గుతాయి. ఇంద్రియ నిగ్రహం వల్ల కోరికలు నశిస్తాయి. నిష్కామ కర్మ వల్ల పూర్వ జన్మలో ప్రోగు చేసుకున్న కర్మలు నాశనమవుతాయి. బ్రహ్మాన్ని చేరుకోవాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి, శ్రద్ధతో శాస్త్రాల్ని విని మననం చెయ్యాలి, తపస్సు, దమం, నిష్కామ కర్మల్ని ఆచరించాలి! అని చెప్పి గురువుగారు ఉపనిషత్తుని ముగిస్తున్నారు.
   నిజంగా ఉపనిషత్తుని ఉపయోగించుకున్నవాడు పాపాన్ని నిర్మూలించుకుంటాడు. అనంతం, మహోన్నతం, ఆనందమయం అయిన బ్రహ్మంలో ప్రతిష్ఠితుడౌతాడు. అవును దానిలో ప్రతిష్ఠితుడౌతాడు.
  ఉపనిషత్తులు గురువు ద్వారా విని ఆచరించిన వాళ్ళు పాపాలను పోగొట్టుకుని పరబ్రహ్మను చేరతారు. పుణ్యకార్యాలు చేసినవాళ్ళు స్వర్గలోకం చేరి పుణ్య ఫలం పూర్తవగానే తిరిగి జన్మిస్తారు. కాని, బ్రహ్మానుభూతి పొంది బ్రహ్మంలో ఐక్యం చెందినవాళ్ళు జన్మరాహిత్యాన్ని పొందుతారు. ఇంక జన్మ అనేది ఉండదు. ఈ విధంగా ఉపనిషత్తుని చెప్పి ఆచరించవలసిన ఉపాయాల్ని చెప్పి దాని వల్ల వచ్చే ఫలితాన్ని వివరించి ఉపనిషత్తుని బోధించడం ముగించారు గురువుగారు. ఉపనిషత్తు పూర్తయింది అని చెప్పడానికి గుర్తుగా చివరి పదం రెండుసార్లు పలుకుతారు.
   మనస్సుతో బ్రహ్మ విషయకమైన సంకల్పం నాకు కలగాలి అని ధ్యానించే పురుషుడు బ్రహ్మం యొక్క స్వరూపాన్ని చూడగలుగుతాడు. ప్రసిద్ధమైన బ్రహ్మస్వరూపం ప్రతి ప్రాణిలోను ఉందని గ్రహించి ప్రతి ఒక్కరు ఉపాసన చెయ్యడానికి ప్రయత్నించాలి.  బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నవాడే పరబ్రహ్మని చేరగలడు!
కేనోపనిషత్తు ఆధారంగా శాంతి మంత్రం
ఓం ఆప్యాయన్తు మమాంగాని వాక్ ప్రాణశ్చక్షు: శ్రోత్రమథో బలమింద్రియాణిచ సర్వాణి!
సర్వం బ్రహ్మౌపనిషదం మా2హం బ్రహ్మనిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోదనిరాకర
ణ మస్త్వనిరాకరణం మే2స్తు ! తదాత్మని నిరతే య ఉపనిషత్సు ధర్మాస్తేమయిసన్తు
తేజమయిసన్తు!
   నా అవయవాలు శక్తి కలిగి ఉండుగాక! నా మాట, ప్రాణాలు, కళ్ళు, చెవి మరియు అన్ని ఇంద్రియాలు శక్తి కలిగి ఉండుగాక! ఈ సకల బ్రహ్మాండము వేదాంతమయమైన బ్రహ్మమే! ఎన్నడూ నేను బ్రహ్మాన్ని నిరాకరించకుండా ఉందునుగాక! బ్రహ్మం నన్ను నిరాకరించకుండా ఉండుగాక! (అనగా నేను ఆ బ్రహ్మమే కదా!) . నా నిరాకరణం బ్రహ్మంలో లేకుండా ఉండుగాక! బ్రహ్మం నిరాకరణం కనీసం నాలో లేకుండా ఉండుగాక! ఉపనిషత్తుల్లో చెప్పబడిన ఉత్తమ గుణాలు ఆత్మనిరతుడుగా ఉన్న నాలో నిలిచి ఉండుగాక! నాలో ధర్మాలన్నీ నెలకొని ఉండుగాక!
                                       (కేనోపనిషత్తు ఆధరంగా)

     


   

No comments:

Post a Comment