About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

రాజధానిలో రహదారి


రాజధానిలో  రహదారి

ఒంటరిగా ప్రక్కనెవరూ లేకుండా... చెవుల్లోంచి తీగలు వ్రేలాడుతూ
ఎదురుగా, ప్రక్కగా ఎవరు వచ్చినా తెలియని అయోమయ స్థితిలో..
చేతులు తిప్పుతూ, హావభావాలు ప్రదర్శిస్తూ గట్టిగా నవ్వుతూ...
మధ్యలో అక్కడక్కడ ఆగుతూ...ఎటువైపు చూడకుండా మళ్ళీ నడుస్తూ
మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్న జనాల్ని విస్తుపోయి చూస్తోంది రహదారి!
అటు ఇటు చూడకుండా పట్టుబడకుండా పారిపోతున్న దొంగల్లా
అతి వేగంగా వెళ్ళిపోతున్న వాహనాలు.. ఇబ్బంది పడుతున్న జనాలు..
ప్రతి వాహనం వదిలి వెడుతున్న కారు మేఘాల్ని తనలో ఇముడ్చుకుంటూ
వాటి వేగానికి ఎటు ఒదిగి ఉండాలో తెలియని స్థితిలో చిరుమొక్కలు రహదారి మధ్యలో..
చూడడమే గాని, తనేమీ చెయ్యలేనని వాటి వైపు జాలిగా చూస్తోంది రహదారి!
ఉదయం సాయంత్రం పిల్లగాలి కోసం వెతుకుతూ...ప్రాణవాయువు పీలుస్తూ...
ఏ రోజుకారోజు తనను తాను తూకం వేసుకుంటూ..ముందురోజుతో పోల్చుకుంటూ
తగ్గని బరువు, చక్కెరల్ని  చూసుకుని నిట్టూరుస్తూ...అంతలోనే వేడిగా కారంగా..
మిర్చిబండిని చూస్తూనే మాయమైన నిట్టూర్పు...లాలాజలాన్ని ఆపలేక
బండి మీద దండెత్తి ఆబగా తింటున్న జనాల్ని వినోదంగా చూస్తోంది రహదారి!
ఉదయాన్నే నడుద్దామని వచ్చిన మగువలు తమదైన స్వభావాన్ని వదలలేక
గట్టు ఎక్కి కొమ్మలాగి... రేపటి పువ్వుల్ని మొగ్గలోనే తుంచి.. సంచి నింపి,
వచ్చిన పని పూర్తి చేసి... దైవ పూజకి వేళాయెనని, నేటి నడక రేపటికని...
పువ్వులతో కలిసి వచ్చిన పూజ ఖర్చుకీ .. ఎవరికీ తెలియకుండా చేసిన పనికీ
తృప్తి పడుతూ ఇంటివైపు సాగి పోతున్నఇల్లాళ్లని ప్రేమతో చూస్తోంది రహదారి!
పెద్ద, చిన్న వాహనాల చోదకులు.. బండి నిండా ఇంధనం..పొట్ట నిండా మద్యంతో....
మెదడంతా మొద్దుబారి...హద్దుమీరి... చక్రం చేతబట్టి... నలమహరాజు గుర్తుకొచ్చి
ఆకాశం వైపు చూసి నక్షత్రలోకాన్ని గుర్తుపట్టి...తిరుగులేని వేగంతో...
సూర్యకాంతిని మరిపిస్తూ వెలిగిపోతున్న దీపాలతో...ఎదురు లేదని నడిపేస్తూ...
నక్షత్రాల్ని చేరుకుని అకాశంలో కనిపిస్తున్న చోదకుణ్ణి దీనంగా చూస్తోంది రహదారి!
ఒకే రకం దుస్తులతో... వీపు మీద సంచులతో...చేతిలో బుట్టలతో...
బిలబిలమంటూ బయటకొచ్చి, గట్టిగా గాలి పీల్చి, చేరవలసిన చోటు గుర్తుకొచ్చి...
నేస్తాలకి వీడ్కోలు చెప్పి, ఎక్కవలసిన వాహనం ఎక్కడ ఆగుతుందో తెలియక...
అటు ఇటు పరుగులెడుతూ...కిందపడి పైకి లేస్తూ...జారిన సంచుల్ని సర్దుకుంటూ..
అమ్మను చేరడానికి అవస్థలు పడుతున్న చిన్నారుల్ని చిన్నబోయి చూస్తోంది రహదారి!
కొత్త బొమ్మని మొదటిరోజే వెండితెరమీద చూడాలని, విడుదలైన మొదటి రోజే కొత్త బండిని
కొనాలని...నెట్టులో అప్పుడే కనిపించిన చంపస్వరం తన చెవికే సొంతమవ్వాలని..
 తగ్గింపు ధరలకిచ్చే బట్టలు తన ఇంటికే చేరాలని...అందమంతా తన సొంతం కావాలని...
జరుగుతున్న ప్రవచనాలు ప్రతి రోజూ వినాలని...కూరలకని, సరుకులకని, ఆఫీసుకని, బంధువులు,   
స్నేహితులని గజిబిజిగా తిరిగే జనాలని ఉక్కిరిబిక్కిరవుతూ చూస్తోంది రహదారి!
ఎంత పొడుగు సాగినా.. ఎంత వెడల్పు పాకినా.. ఎన్ని సందుల్ని కలిపినా..
రక్షకభటులు ఈలలు వేసినా... వాహనాలు కూసినా...పాదచారులు పద్మవ్యూహంలో చిక్కుకున్నా..
తమని తాము తిట్టుకున్నా...పక్కవాళ్ళని తిట్టినా...అడ్డం పడి అడుక్కున్నా, అమ్ముకున్నా...
అందరికీ అదే రహదారి.. తనకు తోడుగా పైవంతెనలు వెయ్యమని అరుస్తూ చెప్తోంది రాజధాని రహదారి!!






No comments:

Post a Comment