About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

సాయికి చూపులోనే ప్రేమ-బాబాలకు చూపు లేని ప్రేమ

నాడు సాయి పథం-నేడు బాబాల పథం
సాయికి చూపులోనే ప్రేమ-బాబాలకు చూపు లేని ప్రేమ
     
    నిండు జీవితాన్ని అనుభవించి ఈ లోకం నుండి వెళ్ళే ప్రతి మనిషికి తన అవసాన కాలం సమీపిస్తున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అన్నారు సాయి.
   భగవంతుడిచ్చిన ఆయుష్షు పూర్తయ్యేవరకు జీవించి అవసాన కాలంలో ఉన్నవారు, ఆత్మ జీవిని వదిలే సమయంలో భగవంతుణ్ణి స్మరించాలన్నారు.
   చివరి సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవాలనుకున్నా ఆ సమయంలో మనస్సు నిలకడగా ఉండదు. కాబట్టి, అటువంటి అభ్యాసం చిన్నతనం నుంచే అలవడాలన్నారు.  
   ప్రతి జీవి భగవంతుణ్ణి చేరాలి కనుక, భగవన్నామం చెయ్యాలి. ఎవరేనా అవసానకాలంలో ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని పవిత్ర గ్రంథాలు చదవడం, భగవన్నామం జపించడం, భజనలు చేయడం వంటివి చేస్తే వారి మనస్సు భగవంతుని యందే నిలబడి పుణ్యలోకాలకి వెడతారు.
   ఆ విధంగా జరగనప్పుడు జీవి మనస్సు పిల్లలమీదో, పదవులమీదో, దాచిపెట్టిన సంపదల గురించో ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత జన్మలో కూడా వాటి గురించే తాపత్రయ పడి మనిషి జన్మనే పోగొట్టు కుంటారు.
   ఒక ఇటుక రాయి మీద, చేయి ఆన్చుకుని కూర్చునేవారు సాయి. పడుక్కున్నప్పుడు కూడా దాని మీద చేయి ఆన్చి ఆసనం మీదకు వెళ్ళేవారు.
   చాలా కాలం తర్వాత ఆ ఇటుక రాయి విరిగి పోయింది. “దీన్నెప్పుడూ విడిచి ఉండలేదు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసేప్పుడు కూడా నాకు తోడుగా ఉండేది.
   దాని మీద నేను పెంచుకున్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళి పోయింది” అని బాధపడ్డారు.
   జీవం లేని వస్తువు మీద కూడా అంత ప్రేమను చూపించిన సాయి ప్రేమ ఎంతో గొప్పది!” అన్నారు సాయి భక్తులు.
   నిస్సహాయులకు సహాయం చెయ్యడానికి, మూర్ఖులకి జ్ఞానం ప్రసాదించడానికి, భక్తులకి మోక్షమార్గం చూపడానికి అవతరిస్తారు యోగులు.
   ప్రాణం లేని వస్తువు చేసిన సహకారాన్ని  కూడా గుర్తించగలిగిన గొప్ప మనసు ఉండాలి. ప్రతి మనిషి తనకు సహాయపడినవారి పట్ల కృతజ్ఞులై ఉండాలి అన్నారు శ్రీ సాయినాథుడు.
   ఆ కృతజ్ఞతే ఇతరులకు సహాయపడాలి అన్న కోరిక కలిగించే విజ్ఞత!!

                                                                                             *********

  ఆనాడు మంచి మనస్సుతో ఇతరులకి సహాయ పడుతూ భగవద్భక్తి కలిగి జీవించారు కనుక అవసానకాలం గురించి తెలుసుకో గలిగారు.
   ఈనాడు స్వార్ధంతో పరుగులు పెడుతూ సంపూర్ణమైన జీవితం అనుభవించకుండా అర్ధాంతరంగా జీవితం ముగిసి పోతోంది. అప్పగింతలకే సమయం లేనప్పుడు భగవన్నామాకి సమయం ఎక్కడిది ?
   ఆత్మ జీవిని వదిలి పెట్టే సమయంలో భగవంతుడి వైపు కాకుండా దృష్టిని దాచి పెట్టినవి ఎవరు ఎత్తుకు పోతారో చూసుకుని నమ్మకం ఉన్నవాళ్ళకి అప్పగిస్తే వచ్చే జన్మలో మళ్ళీ వాటిని అనుభవించవచ్చు!
   చివరి సమయంలో భగవంతుణ్ణి తల్చుకోవాలంటే ఆభ్యాసం చిన్నతనం నుంచే అలవడాలి.
    మనకూ ఒక అవసాన కాలం ఉందనీ, ఈ జీవితం సత్యం కాదని తెలుసుకోడానికే సమయం లేనప్పుడు ఇక అభ్యాసానికి సమయం ఎక్కడిది?
   అటువంటివారు అవసాన కాలంలో భగవంతుణ్ణి స్మరించలేరు కనుక, వారి దగ్గర కూర్చొని భగవన్నామ స్మరణ చెయ్యడం, పవిత్ర గ్రంథాలు చదవడం చేసినా వారి మనస్సు భగవంతుడి వైపు మళ్ళడం మాట పక్కన పెడితే ప్రయత్నించే వారికే అవసాన కాలం వస్తోంది.
   వారి మనస్సు కుటుంబాల మీదో అనుభవించాలన్న కోరికల మీదో ఉంచి వచ్చే జన్మ ఏదయినా వాటి దగ్గరకు చేరితే చాలు! అనుకుంటున్నారు.
   “ఉపయోగించు-వదిలెయ్యి” అనేదే నినాదంగా నడుస్తున్న ఈ రోజుల్లో జీవితం నిలబెట్టిన తల్లితండ్రుల్నే వృద్ధాశ్రమాలకు తరలిస్తుంటే అప్పటి వరకు ఉపయోగించిన వస్తువుల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది ?
   ఆత్మీయతే తెలియని ఆత్మలకు పరమాత్మ గురించి, రాబోయే జన్మల గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది ?
   జీవుల మీద ప్రేమ పెంచుకోలేని వారికి కనిపించని భగవంతుడి మీద, కదలిక లేని వస్తువుల మీద కదిలించే ప్రేమ కనబడాలనుకోవడం అజ్ఞానమే!

   జ్ఞానం లేని మూర్ఖులు ఎందరో మోక్షమార్గం తెలియని యోగులుగా అవతారమెత్తి భక్తుల నుండి సాయం పొందుతుంటే... ప్రేమ అనే పదమే కనుమరుగవుతోంది!!

1 comment:

  1. nice post
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete