వైకల్యము శరీరానిది కాదు మనసుదే!
ఒక చేత్తో కర్ర
పట్టుకుని మరొకచేత్తో పొట్ట పట్టుకుని
కుంటుకుంటూ..
పొట్టమీద ఉన్న చెయ్యి చాచి అడుక్కుంటూ
చీకటి పడ్డాక
ఇంటికెళ్ళి.. మడిచిపెట్టి కట్టిన కాలి కట్టు విప్పి
చీరకట్టు పైకి
దోపి చకచకా నడుచుకుంటూ...
పనులన్నీ చక్కబెడుతూ..
ఎత్తుగా ఉన్న పొట్టని తడుముకుంటూ
రాబోయే శిశువు
కోసం కలలుకంటున్న వేళ !
అమ్మ ప్రేమ
తెలిసినా జరుగుతున్నఅబద్ధాన్ని చూడలేని శిశువు
తన అసహనాన్ని
ప్రదర్శిస్తూ...అటు ఇటు కదిలింది.
చెప్పడానికి భాష
రాక సర్దుకుని మౌనంగా ఉండిపోయింది!
తిరిగి ఉదయాన్నే
మంచి కాలిని మడిచికట్టి అబద్ధాన్ని మోసుకుంటూ
ఎత్తు కడుపుని
తడుముకుంటూ...రైలు పెట్టెల్లో అడుక్కుంటోంది.
నెలలు నిండి
ఒడికి చేరిన తన పాపని హృదయానికి హత్తుకుని...
చేతులతో
తడుముతూ...ఆనందంతో పొంగిపోయింది!
ఒక కాలు మడిచిన అమ్మ అబద్ధానికి వాతపెట్టి...భగవంతుడు
తన రెండుకాళ్ళు
మడిచాడని అప్పుడే పుట్టిన పాప వెక్కెక్కి ఏడ్చింది.
ఇది అమ్మ చేసిన
పాపమో... పాపకి తగిలిన శాపమో...
పాపకి కాళ్ళు
లేవని అందరికీ చూపిస్తూ...ఇప్పుడు
మడతలేని కాళ్లతో రైలు
పెట్టెల్లోకి సులభంగా ఎక్కుతూ...
ముందుకంటే ఎక్కువ
సంపాదనతో అమ్మ ముందుకి నడుస్తోంది.
అమ్మ కాలుకి
మడతలేదు...పాప కాళ్ళకి ముడతలేదు!
బాల్యంలో
బుడిబుడి అడుగులకి దూరమై...అమ్మ మోస్తున్న తన బాల్యం మాయమై
మొయ్యలేక తనని
వదిలి వెళ్ళిపోతుంటే...ఆమె వెంట నడవలేని పాప,
కాళ్ళులేని బ్రతుకెలాగని కుమిలి కుమిలి ఏడిచింది...తనని
తాను తిట్టుకుంది.
బడికి వెళ్లలేని
తన అవిటితనానికి దు:ఖిస్తూ...అవమానాలెన్నో భరించింది
భవిష్యత్తు మీద
ఆలోచనలతో.. తన మెదడుకి పదును పెట్టింది
ఎవరి అండా తనకు
ఉండదని తెలుసుకుని...
లేని అవయవాల
బలాన్నిఉన్న అవయవాలకు పంచింది.
అప్పటికే కలిగిన
అనుభవాల ద్వారాలకు
రైలు పెట్టెలో
నేర్చుకున్న జీవిత పాఠాలే మార్గాలుగా మలుచుకుని
చిన్నారి చేతులకి
పని చెప్పి ప్రయత్నాలెన్నో చేసి చేసి...
తన బండి చక్రాలని
తనే తోసుకుంటూ...
రైలుబండి
పెట్టెల్లోనే తన కొత్త జీవితానికి పునాది వేసుకుంది.
చలికి, వేడికి,
ఆకలికి, దాహానికి ప్రయాణీకుల అవసరాల్ని తెలుసుకుంది
పెట్టె
ఎక్కేవాళ్ళకి, దిగేవాళ్లకి, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకి
పొత్తిళ్ళలో
పిల్లలకి, పరుగెత్తే పిల్లలకి, అవయవాలు లేని తనలాంటి వికలాంగులకి,
అవయవాలు సహకరించని
వృద్ధులకి తనే అండగా ఉండాలనుకుంది
పాప పెరిగి
అద్భుతాలెన్నో చేసింది.. తన కాళ్ళ సంగతే మరిచిపోయింది.
అవకరం అవయవానికి
ఉండదని... ఆలోచన బాగుంటే జీవితమంతా వెన్నెలని
తనకిప్పుడు
కాళ్ళు లేవన్న బాధే లేదని...
అనేక వందలకాళ్ళు
తన వెంటే నడుస్తున్నాయని ఆనందపడుతోంది.
తనకోసం స్పందించే
హృదయాలెన్నో ఉన్నాయని
మంచితనం,
మానవత్వం, సేవాభావం మూర్తీభవించిన మూర్తికి
అవకరం ఉండదని తెలియ
చెప్పింది...ఎంతోమందికి ఉపాధి కల్పించింది.
సహనంతో అవమానాల్ని
భరించింది...మరెందరినో తన మార్గం వైపు
తిప్పుకుంది.
కీర్తి కోరని పాప
ఆత్మస్థైర్యం, సేవాభావమే కాళ్ళుగా ముందుకు నడిచింది
మంచితనం శాఖోపశాఖలుగా
విస్తరించింది...
ప్రయాణీకుల
దగ్గరికే అన్నిటినీ చేరుస్తూ...అనేక సంస్థలుగా నిలిచింది
పెద్దలు చేసిన
తప్పులే పిల్లలకి శాపమని, అందుకు తన జీవితమే సాక్ష్యమని
మనిషి మనస్సు,
నడవడిక స్వచ్ఛమైతే...దేశమే స్వచ్ఛమౌతుందని
ముందు తరాలకు
అవకరమే ఉండకూడదని...అందుకు..
పెద్దల్ని
సహృదయంతో సహకరించమని అనుభవ జ్ఞానంతో
అందరి మనసుల్లోను
నిలిచిన పాప వేడుకుంది!
No comments:
Post a Comment