సాయితో చిత్రగుప్తుడికి పనే లేదు
-భగవతీ భగవంతులతో చిత్రగుప్తుడికి చేతినిండా పనే
పంచ భూతాలతో తయారయిన
దేహం శాశ్వతం కాదు. అది తిరిగి పంచ భూతాల్లోనే
కలిసిపోతుంది.
పంచేంద్రియాల్ని
అదుపులో ఉంచుకుని దేహాన్ని నడిపించే ఆత్మే శాశ్వతమైనదని తెలియ చేశారు ఆనాటి బాబా.
పూర్వ జన్మలో చేసుకున్న కర్మలకి అనుగుణంగా భగవంతుడితో నిర్దేశించబడిన కర్మల్ని పూర్తి
చెయ్యడానికే భౌతిక శరీరం. వచ్చిన పని పూర్తవగానే ఆత్మ దాన్ని విడిచిపెట్టి
వెళ్ళిపోతుంది అని చెప్పారు అని కూడా చెప్పారు.
మూడు రోజులు తన
దేహాన్ని విడిచి వెళ్ళిన బాబా ఆత్మ, తిరిగి అదే దేహంలో ప్రవేశించడం కళ్ళారా
చూశాము.
కాబట్టే బాబా
భౌతిక శరీరం లేకపోయినా భక్తులు చెప్పుకునే కష్టాలు విని వారికి మంచి జరిగేలా చేస్తారు
అని నమ్మాము. తమ దేవుడికి మరణమే లేదన్నారు ఆనాటి బాబా భక్తులు.
దేవాలయానికి
వెళ్ళడం పూజలు చెయ్యడం అందరూ చూడాలని ఆర్భాటాలు చెయ్యడం వలన ప్రశాంతత చేకూరదు ..
అహంకారం, కోరిక, మోహం విడిచిపెట్టినప్పుడే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.
ఎవరికయితే భగవంతుడి
మీద భక్తి, ప్రేమ ఉంటాయో...ఆయన్నే
ధ్యానిస్తారో...ఆయన నామాన్నే జపిస్తుంటారో...వారు ఎప్పుడు కావాలంటే
అప్పుడు...ఎక్కడ కావాలనుకుంటే అక్కడ భగవంతుణ్ణి చూడ గలుగుతారు.
అంతటి భక్తి కలిగిన
భక్తులకి భగవంతుడే ఋణపడి ఉంటాడు. ఆ ఋణాన్ని మోక్షంతో తీర్చుకుంటాడు.
ఇతర విషయాల యందు
ఆసక్తిని వదిలి ఎవరయితే భగవంతుని సన్నిధానం కోసం పరితపిస్తారో...వాళ్ళని పవిత్రమైన
నదుల్ని సముద్రం తనలో కలుపుకున్నట్టు తన భక్తుల్ని తనలో కలుపుకుంటాడు.
భగవంతుణ్ణి మనస్సులో ప్రతిష్టించి, భగవంతుడూ,
నేనూ వేరు కాదు...ఇద్దరమూ ఒకటే! అనుకోవడమే భక్తుడు చెయ్యవలసిన పని.
ఏది వింటున్నా
భగవన్నామమే వినిపిస్తుండాలి. ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి గుర్తించ గలగాలి. ఎవర్ని
చూస్తున్నా భగవంతుణ్ణే చూస్తున్నట్టు అనిపించాలి.
అంతటి ఏకాగ్రత భక్తి
కలిగిన భక్తుల్ని తనలో ఐక్యం చేసుకుంటాడు
భగవంతుడు. అన్ని ప్రాణుల్ని ప్రేమించగలిగిన వారిని భగవంతుడే ప్రేమగా చూస్తాడు. చిత్రగుప్తుడు
చిట్టా విప్పడు.
అదే విధంగా ఏ
ప్రాణిని కష్టపెట్టినా క్షమించడం ఉండదు! అన్నారు శ్రీసాయినాథుడు.
********
పంచభూతాలతో తయారయిన
దేహం పంచభూతాల్లోనే కలిసిపోయి ఆత్మే మిగులుతుంది.
తనకు
నిర్దేశింపబడిన పనులతో పాటు తాము కోరుకుంటున్న పనులు కూడా పూర్తి చేసుకోవాలి.
తన పనులు
పూర్తవగానే ఆత్మ దేహాన్ని విడిచి పోతుంది. తరువాత ఎటువంటి దేహం
సంక్రమిస్తుందోఎవరికి ఎరుక!
కనుక, పొందిన
దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈనాటి బాబా గురువులు.
కర్మల విషయం పక్కన పెడితే కోరికలు
తీర్చుకోవడానికే బాబా గురువులకు సమయం సరిపోదు.
భౌతిక శరీరంతోనే
సహాయపడలేనివాడు దేహాన్ని వదలిన తర్వాత సహాయ పడతారన్న నమ్మకం లేదన్నారు ఈనాటి బాబాగురువుల
భక్తులు.
దేవాలయాలకు వెళ్ళడం,
పూజలు చెయ్యడం, హారతులివ్వడం, అయ్యదేవుడికి అమ్మదేవతకి కళ్యాణం చెయ్యడం ఈనాటి
భక్తులకి తప్పనిసరి కార్యక్రమం.
భగవంతుడు కైలాసంలో
ఉంటే చూస్తాడో లేదో తెలియదు కనుక, ఎలా చేసినా ఫరవాలేదు. ఆ లెక్కలుచిత్రగుప్తుడు
చూసుకుంటాడు.
కాని, భగవంతుడు,
భగవతి ఎదురుగానే ఉన్నప్పుడు జరుగ వలసిన పూజలు జరుప వలసిన రీతిలోనే జరపాలి కదా?
ఆర్భాటాలు,
అందరికీ తెలియ చెయ్యడాలతో సరిపొతుంటే, ఇంక ప్రశాంతతకి చోటెక్కడిది?
భక్తి, ప్రేమలు
భగవంతుని మీద మాత్రమే ఉంటే చాలదు. ఆయన నామాన్ని మాత్రమే జపిస్తూ...ఆయన నామాన్ని
మాత్రమే ధ్యానిస్తే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు
దండించగలదు భగవతి.
అమ్మకు కోపం
రానివ్వకుండా చూసుకునే శిష్య బాబాల ఋణం
భగవంతుడే తీర్చుకుంటాడు.
ఇతర విషయాలు
వదులుకుని ఎల్లప్పుడూ తమనే ధ్యానించి, తన చుట్టూ తిరుగుతూ కనుసన్నలలో మెలగని శిష్య
బాబాల్ని... నదులు పిల్ల కాలువల్ని తమ నుంచి బయటకు పంపించిన విధంగా ఇహం నుంచి
పరానికి పంపించేస్తారు.
అటు భగవంతుడి విషయాలకు, ఇటు ప్రాపంచిక విషయాలకు
కూడా కాకుండా చేస్తారు భగవతీ భగవంతులు.
ఏది వింటున్నా
వారి ఆదేశమే వినబడాలి, ఏది తింటున్నా వారికి ఇష్టమైందే తినాలి.
ఏది చెప్పినా
వారు చెప్పమన్నట్టే చెప్పాలి.
అంతటి ఏకాగ్రత, భక్తి
, ప్రేమ కలిగిన శిష్య బాబాల్ని తమ విషయాల్లోకి కలిపేసుకుంటారు భగవతీ భగవంతులు.
భక్తులు తగ్గితే శిష్యబాబాలకు
శిక్ష తప్పదు! భగవంతుడు క్షమించడు మరి!!
No comments:
Post a Comment