About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కుబేరుడి ధనగర్వం


కుబేరుడి ధనగర్వం
   గణపతి శివపార్వతుల కొడుకు. ఆ విషయం మనందరికీ తెలుసు కదా! పొట్టిగా ఏనుగు తలతో, పెద్ద పెద్ద చెవులతో, బొద్దుగ ముద్దుగా ఉంటాడు. ఒకరోజు గణపతి తన స్నేహితులతో కలిసి ఆడుకుంటున్నాడు. అతడికి ఉన్న రెండు దంతాల్లో ఒకటి విరిగిపోయింది. కోపం వచ్చి ఆడుకోడం మానేసి వచ్చేశాడు. మిగిలినవాళ్ళు కూడా ఆడడం అపేశారు.
   గణపతికి రుచిగా ఉండే ఆహారం తినాలనిపించింది. స్నేహితులు అతడికి రకరకాల పిండివంటలు, పళ్ళు తీసుకొచ్చి పెట్టారు. గణపతి అవి తనకి చాలవు ఇంకా కావాలని పేచీ పెట్టాడు. స్నేహితులు మాత్రం అంతకంటే ఏం చెయ్యగలరు?
   అన్నిలోకాల్లోకి పెద్ద ధనవంతుడు కుబేరుడు. అతడికి ఎంత సంపద ఉందో ఎవరికీ తెలియనంత గొప్ప ధనవంతుడు. తనతో సమానమైన ధనవంతుడు ఇంకెవరూ లేరని గర్వపడుతూ ఉండేవాడు.
    అందరూ తన దగ్గరికి వచ్చి వాళ్ళకి కావలసినవి అడిగి తీసుకుని వెళ్ళాలని అనుకునేవాడు. రాజులు, పెద్ద ధనవంతులు కూడా అప్పుడప్పుడు కుబేరుడి దగ్గరికి సహాయం కోసం వెళ్ళేవాళ్ళు. అలా వచ్చేవాళ్లకి కుబేరుడు తప్పకుండ సహాయపడేవాడు.
   కుబేరుడు తన దగ్గరున్న సంపదని దాచుకోకుండా మంచి పనులకోసం ఖర్చుపెట్టేవాడు. పెద్ద పెద్ద దేవాలయాలు భవంతులు కట్టించేవాడు. ఉత్సవాలు నిర్వహించి సంతర్పణలు చేసేవాడు. రాజులకి, గొప్పవాళ్ళకి వాళ్లకి తగిన బహుమతులు ఇచ్చేవాడు. పేదవాళ్ళకి సహాయపడేవాడు. ఎన్ని రకాలుగా ఖర్చుపెట్టినా అతడి సంపద పెరుగుతూనే ఉండేది. ఇంకా ఎలా ఖర్చుపెట్టాలా అని ఆలోచించి చివరికి దేవుళ్లని భోజనానికి పిలుద్దామనుకున్నాడు. తను చాలా గొప్ప ధనవంతుడని అందరికీ తెలియాలన్నది అతడి కోరిక.
    కుబేరుడికి ఇష్టమైన దేవుడు శివుడు. ఆయన ఇచ్చిన వరం వల్లే కుబేరుడు అంత ధనవంతుడయ్యాడు. అందుకని కుబేరుడు శివుణ్ణి అతడి కుటుంబాన్ని భోజనానికి పిలవాలని అనుకున్నాడు.
   ఒకరోజు కైలాసం వెళ్ళి శివుణ్ణి పూజించి పరమేశ్వరా! నువ్వు నాకు ఇచ్చిన సంపదలకి కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు నేను అందరికంటే ధనవంతుణ్ణి. నేను ధనవంతులకి, పేదవాళ్లకి అందరికీ సహయం చేశాను. ఇప్పుడు అందరూ నన్నే పొగుడుతున్నారు.
   కుబేరుడు చెప్పింది విని శివుడు చాలా బాగుంది’. నేను కూడా ఇదంత విన్నాను. సరే, ఇప్పుడు నువ్వు ఎందుకు వచ్చావో అది కూడా చెప్పు! అన్నాడు.
  కుబేరుడు దేవా! నేను నిన్ను నీ కుటుంబాన్ని, నీ స్నేహితుల్ని మా ఇంటికి భోజనానికి రమ్మని పిలుద్దామని వచ్చాను. నేను లోకంలో ఉన్న ముఖ్యులందర్నీ పిలుస్తున్నాను. వాళ్లందరూ నిన్ను కలుసుకుని సత్కరిద్దామని అనుకుంటున్నారు అన్నాడు.
   శివుడు చిరునవ్వు నవ్వి నాకు రావడానికి వీలుపడదు. నేను రాకుండా నా భార్య వస్తుందని నేను అనుకోను. పిల్లలు వాళ్ళ అమ్మ లేకుండా ఎక్కడికీ రారు అన్నాడు.
   కుబేరుడు చాలా నిరుత్సాహపడ్డాడు. శివుడి కాళ్ళ మీద పడ్డాడు. దేవా! నువ్వు రాకపోతే మిగిలిన వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు? నేను నిన్ను పిలవడానికి ఇక్కడికి వస్తున్నానని అందరికీ చెప్పి వచ్చాను. నేను నిన్ను ఏదడిగినా నువ్వు కాదనవని అనుకుంటున్నారు.
   శివుడు నేను నీకు వేరే మార్గం చెప్తాను. నా కొడుకు గణపతిని నీ ఇంటికి భోజనానికి పంపిస్తాను అన్నాడు.
   అందుకు కుబేరుడు ఒప్పుకున్నాడు. తన ఇంటిలో భోజనం పెట్టడానికి ఒక రోజుని నిర్ణయించుకుని గణపతికి చెప్పి ఇంటికి తిరిగి వచ్చాడు.
    కుబేరుడు ప్రపంచంలో ఎప్పుడూ ఎక్కడ జరగని విధంగా సంతర్పణ ఏర్పాటు చేశాడు. పెద్ద భోజనశాల కట్టించాడు. కొత్తగా పెద్ద వంటగదులు ఏర్పరిచాడు. వెండి గిన్నెలు, బంగారంతో కంచాలు చేయించాడు. పదార్ధాలన్నీ ప్రత్యేకంగా రుచిగా ఉండేలా వండించడం కోసం అన్ని రకాల ఆహార పదార్ధాలు తెప్పించి సమానుల గదిలో పెట్టించాడు. వందలకొద్దీ వంటవాళ్ళని, పనివాళ్లని పెట్టాడు.
   కుబేరుడు రాజుల్ని వాళ్ల కుటుంబ సభ్యుల్ని, గొప్ప ధనవంతుల్ని వాళ్ల స్నేహితుల్ని ఇంకా ప్రపంచంలో ఉన్న ముఖ్యులైన ఎంతోమందిని భోజనానికి అహ్వానించాడు.
   సంతర్పణ రోజు రానే వచ్చింది. ఆహ్వానం అందుకున్న వాళ్ళు ఒక్కక్కళ్ళే రావడం మొదలుపెట్టారు. రాజులు, రాణులు, రాజకుమారులు, రాజకుమార్తెలు రంగురంగుల దుస్తులు, విలువైన ఆభరణాలు ధరించి వచ్చారు. కుబేరుడు అందర్నీ లోపలికి అహ్వానించి వాళ్ళకోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గదులు చూపించాడు. ఆ రోజు కుబేరుడు అతడి కుటుంబ సభ్యులు కూడా విలువైన దుస్తులు, ఆభరణాలు ధరించారు. వాళ్లందరు గణపతి కోసం ఎదురు చూస్తున్నారు.
   గణపతి కూడా తనకి చెప్పిన సమయానికి వచ్చేశాడు. కుబేరుడు తన ఇంటికి భోజనానికి వచ్చిన గణపతిని గౌరవంగాను, వినయంగాను, ఆత్మీయతతోను అహ్వానించాడు. వచ్చిన అతిథుల్ని ఒక్కొక్కర్నీ గణపతికి పరిచయం చేద్దామనుకున్నాడు. కాని, గణపతి తనకి చాలా అకలిగా ఉందని మొదట భోజనం పెట్టమని చెప్పాడు.
   కుబేరుడు గణపతిని ఎక్కువ కాంతినిచ్చే చిన్నచిన్న దీపాలతో, తియ్యటి సువాసనలతో, మంద్రస్థాయిలో వినిపించే సంగీతంతో, అందంగా పరిచిన తివాచీతో, కమ్మటి నేతి వాసలతో రుచిగా వండి పెట్టిన వెండి, బంగారు పాత్రలతో, రకరకాల ముగ్గిన తాజా పళ్లతో నిండి ఉన్న అందంగా అలంకరించబడిన భోజనశాలకి తీసుకుని వచ్చాడు.
   గణపతి కింద కూర్చుని తినడం మొదలుపెట్టాడు. బాగ అకలిగా ఉన్నాడేమో... తనకోసం పెట్టిన అహారాన్ని మొత్తాన్ని తినేశాడు. పళ్ళాలన్నీ మళ్ళీ నింపారు. వెంటనే మళ్ళీ అంతా ఖాళీ చేసేశాడు. మళ్ళీ మళ్ళీ ఖాళీ గిన్నెల్ని నింపుతూనే ఉన్నారు. గణపతి ఖాళీ చేస్తూనే ఉన్నాడు. పెట్టినదాన్ని పెట్టినట్టు గణపతి తినేస్తూనే ఉన్నాడు... అంతే వేగంగా సేవకులు వడ్డిస్తూనే ఉన్నారు.
   కుబేరుడు సేవకుల్ని త్వరగా వడ్డించమన్నాడు. సేవకులు వంటగదికి భోజనశాలకి మధ్య పరుగులు పెడుతున్నారు. ఇంకా ఇంకా తెచ్చి అక్కడ పెడుతున్నారు. ఖాళీ అయిన గిన్నెల్ని అంతకంటే వేగంగా తీసేస్తున్నారు. వాళ్ళు ఎంత తెచ్చి పెట్టినా గణపతికి ఆకలి తీరలేదు. వేలమంది కోసం తయారు చేసిన ఆహారమంతా అయిపోయింది, కాని గణపతి ఇంకా పెట్టమని అడుగుతున్నాడు.
   కుబేరుడు ఇంకా వంటలు చెయ్యమని సేవకులకి ఆజ్ఞాపించాడు. గణపతి లేచి నిలబడి వండి పెట్టేదకా ఆగలేనని తనకి ఆకలిగా ఉందని చెప్పాడు. కుబేరుడు వెంటనే చేయించస్తానని, కూర్చోమని బ్రతిమాలుకున్నాడు. గణపతి అకలికి ఆగలేక వంటగదిలోకి వెళ్ళి వండనివి, వండినవి అన్నీ తినేశాడు.
   సామానుల గదిలోకి వెళ్ళి వంట కోసం దాచిపెట్టినవి కూడా తినేశాడు. బయటకి వచ్చి కుబేరుణ్ణి తనకి ఇంకా అకలి వేస్తోందని తినడానికి ఏదైనా పెట్టమని అడిగాడు. కుబేరుడు నిస్సహాయంగా నిలబడిపోయాడు.
   గణపతి కుబేరుడి భవనంలోకి వెళ్ళి కనిపించినవన్నీ తినేశాడు. అన్ని గదుల్లోకి వెళ్ళి అతడు దాచుకున్న వెండి బంగారం వంటి వస్తువుల్ని కూడా తినేశాడు. ఇంక తినడానికి ఏదీ దొరకలేదు. గణపతి కుబేరుడివైపు చూసి నాకు తినడానికి ఏదైనా పెడతావా...నిన్ను తినెయ్యమంటావా? అని అడిగాడు.
   అతడి మాటలకి కుబేరుడు భయపడి పరుగెట్టడం మొదలుపెట్టాడు. అతడి వెనక గణపతి పరుగెట్టాడు. ముందు కుబేరుడు కొంచెం దూరంలో గణపతి పరుగెడుతున్నారు. పరుగెత్తి పరుగెత్తి చాలా సేపటికి కైలాసం చేరుకున్నారు. తనని రక్షించమని ఏడుస్తూ శివుణ్ణి ప్రార్ధించాడు కుబేరుడు. శివుడు అక్కడికి వచ్చాడు. వెంటనే కుబేరుడు శివుడి పాదాల దగ్గర పడిపోయాడు.
   శివుడు కుబేరుణ్ణి చూసి ఏం జరుగుతోంది ఇక్కడ? అని అడిగాడు.
   గణపతి వెంటనే తండ్రీ! కుబేరుడు నాకు సరిపడినంత అహారం పెట్టలేదు. ఇంకా నా ఆకలి తీరలేదు అన్నాడు.
   శివుడు గణపతికి లోపలికి వెళ్ళు! మీ అమ్మ నీకు సరిపోయేలా ఆహారం పెడుతుంది అన్నాడు. గణపతి లోపలికి వెళ్ళిపోయాడు.
   తనతో సమానమైన ధనవంతులు లేరు అనే గర్వంతో తను చేసిన పనికి క్షమించమని కుబేరుడు శివుణ్ణి ప్రార్ధించాడు. శివుడు కుబేరుడి వైపు ప్రేమతో చూశాడు. కుబేరుడు తన పట్టణానికి తిరిగి వెళ్ళిపోయాడు.
                                                                                       

.  

No comments:

Post a Comment