About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
ఓం
౩.నచికేతుడు
(ఓం ఉశన్ హ వై వాజస్రవస: )
   ఓం సహనావవతు .......” అని శాంతి మంత్రం. 
 వాజశ్రవుడి కుమారుడు వాజశ్రవసుడు. గౌతమ వంశంలో పుట్టాడు కనుక గౌతముడని పేరు. ఆయన్ని ఔద్దాలకి, ఆరుణి అని కూడా పిలుస్తారు. వాజశ్రవసుడు విశ్వజిత్ యాగాన్ని చేశాడు.  ఆ యాగాన్ని చేసినవాళ్ళు యాగం పూర్తయ్యాక వాళ్ళకి ఉన్న సంపదలన్నీ దానం చేసెయ్యాలి.
  విశ్వజిత్ యాగాన్ని పూర్తి చేసిన వాజశ్రవసుడి ఆశ్రమం గొప్పగొప్ప పండితులతోను, మహర్షులతోను, ఋత్విక్కులతోను నిండిపోయింది. వాజశ్రవసుడు యాగం పూర్తయ్యాక తన సంపదలన్నీ దానం చేస్తున్నాడు. యాగం పూర్తి చేయించిన ఋత్విక్కులకి దక్షిణగా ఆవుల్ని ఇస్తున్నాడు. ఆ రోజుల్లో సంపద అంటే ఆవులే. ఎవరి దగ్గర ఎక్కువ ఆవులుంటాయో వాళ్ళే గొప్పవాళ్ళు. వాజశ్రవసుడి కొడుకు పేరు నచికేతుడు.
   నచికేతుడు వివేకవంతుడు, మంచి గుణాలు కలవాడు. తండ్రి ఋత్విక్కులకి ఆవుల్ని దానం చేస్తుంటే అక్కడే ఉండి చూస్తున్నాడు. తండ్రి యాగం చెయ్యడం, అది పూర్తయ్యాక దానాలు చెయ్యడం, వాటిని తీసుకునేందుకు గొప్ప గొప్పవాళ్ళు రావడం అన్నీ చూస్తున్నాడు.
  అవన్నీ చూసి వాటి గొప్పతనం తెలుసుకున్న నచికేతుడికి కూడా అటువంటి విషయాల మీద భక్తి శ్రద్ధలు పెరిగాయి. తండ్రి దానమిస్తున్న ఆవుల వైపు చూశాడు. వాటిలో చాలా వరకు ముసలివి, పళ్ళు లేనివి.  గడ్డి కూడా తినలేని స్థితిలో ఉన్నాయి. వాటికి ప్రసవించే శక్తి గాని, పాలిచ్చే శక్తిగాని లేదు. నచికేతుడికి వాటిని చూస్తే బాధ కలిగింది. తండ్రి దానమయితే చేస్తున్నాడు కాని, ఆరోగ్యవంతమయిన ఆవుల్ని దానం చెయ్యట్లేదు.
   దానం తీసుకున్న వాళ్ళు దక్షిణకి ఆశపడి తీసుకున్నా సరిగ్గా చూసుకుంటారో లేదో తెలియదు. సరయిన ఆహారం పెడతారో లేదో తెలియదు. ఒకవేళ అవి దేనికీ ఉపయోగించవు కదానని నిర్లక్ష్యం చేస్తే వాటిని దానంగా పుచ్చుకున్న వాళ్ళకి, దానం ఇచ్చిన తన తండ్రికీ కూడా పాపం కలుగుతుంది. వట్టి పోయిన, పూర్తిగా ముసలితనంతో బాధ పడుతున్న ఆవుల్ని దానం చేసినవాడు జీవితం చివరలో నరక లోకానికి పోతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇంత గొప్ప యాగం చేసి కూడా ఇటువంటి దానం చెయ్యడం వల్ల యాగ ఫలితం దక్కదు. ఇప్పుడు ఇవ్వబోయే దానమైనా యాగ ఫలితం దక్కేలా చెయ్యమని చెప్తే మంచిదేమో అనుకున్నాడు.
   తండ్రి యాగాన్ని పూర్తి చేశాక  తన దగ్గరున్నవన్నీ దానం చేసెయ్యాలన్న సంగతి నచికేతుడికి బాగా అర్ధమయింది. ఎవరెవరో వస్తున్నారు దానం తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఇంచుమించు దానాలు ఇవ్వడం పూర్తయిపోతోంది. తండ్రి తనకున్నవి అన్నీ దానం చెయ్యాలి, అంటే ఆయనకి చెందిన వస్తువులు బంగారం, పొలం, ధనం, గోవులు ఇలాంటివేనా? తనని కుడానా? తను కూడా తండ్రికి చెందినవాడేగా. తనను కూడా దానం చెయ్యాలిగా? మరి ఇప్పుడు తనని ఎవరికి దానంగా ఇస్తున్నాడో అని సందేహం కలిగింది.
   తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్నగారూ! యాగం పూర్తయిన తరువాత మీకున్నవన్నీ దానం చేసెయ్యాలి కదా? నేను కూడా మీకు చెందినవాణ్నేగా. మరి నన్ను ఎవరికి దానంగా ఇస్తున్నారు? అని ఆడిగాడు.
   చిన్నవాడు కనుక ఏదో అడుగుతున్నాడులే అనుకుని బదులు చెప్పకుండా ఊరుకున్నాడు వాజశ్రవసుడు. నచికేతుడు మాత్రం ఊరుకోలేదు మళ్ళీ అడిగాడు నన్నెవరికిస్తారు? అని. ఇప్పుడు కూడా వాజశ్రవసుడు మాట్లాడకుండా మౌనంగానే ఉన్నాడు. తన కొడుకు అడిగినదానికి ఏమని సమాధానం చెప్పాలో ఆయనకి తెలియలేదు.
   తండ్రి మాట్లాడక పోవడంతో నచికేతుడు మళ్ళీ ఆడిగాడు నాన్నగారూ! నన్ను ఎవరికి దానంగా ఇస్తున్నారు? కొడుకు అదే విషయాన్ని వదలకుండా మళ్ళీ మళ్ళీ అడగడంతో వాజశ్రవసుడికి కోపం వచ్చి నిన్ను మృత్యు దేవతయిన యముడికిస్తాను! అన్నాడు విసుగ్గా. తండ్రి చెప్పిన సమాధానం విని నచికేతుడు ఆలోచనలో పడ్డాడు.
    తండ్రికి తను పెద్ద కొడుకు. తండ్రి దగ్గర చదువుకుంటున్న శిష్యుల్లో బాగా చదువుకుంటున్న వాళ్ళల్లో తను కూడా ఉన్నాడు. అందరికంటే మొదటివాడుగా లేకపోయినా చదువులో ఆఖరువాడు మాత్రం కాదు. విషయాలన్నీ అర్ధం చేసుకోగలడు. అటువంటి తనను తండ్రి యముడికి ఇస్తాను అని ఎందుకన్నారు? యముడికి ఇవ్వడం వల్ల ఆయనకు కలిగే లాభం ఎమిటి? తనను యముడికిచ్చి ఆయన  ఏం సాధించాలని అనుకుంటున్నారు? అదంతా ఎలా ఉన్నా తను మాత్రం తండ్రి చెప్పినట్టే నడుచుకోవాలి. నేనే కాదు తండ్రి మాటని ఏ కొడుకూ జవదాట కూడదు. ఇప్పుడు తన ధర్మం కూడా అదే!  కాబట్టి, తండ్రి చెప్పినట్టే చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు.
   నచికేతుడు అడిగిన దాన్నే మళ్ళీ మళ్ళీ అడగడంతో కోపం వచ్చి యముడికి ఇస్తాను అన్నాడు. కాని, అలా అన్నందుకు వాజశ్రవసుడు తనలో తను బాధపడుతున్నాడు. కొడుకు ఎంత చెడ్డవాడైనా అతణ్ణి భరిస్తాడు కాని, చచ్చిపోవాలని ఏ తండ్రీ కోరుకోడు.  గొప్ప పండితుడై ఉండి కూడా తను మాత్రం కోపంతో వివేకాన్ని కోల్పోయి యముడికిస్తాను అన్నాడు. అలా అన్నందుకు ఇప్పుడు తనలో తను కుమిలి పోతున్నాడు.
   వివేకవంతుడైన నచికేతుడు తండ్రి పడుతున్న బాధని అర్ధం చేసుకున్నాడు. తనకు కలిగిన జ్ఞానంతో తండ్రికి నచ్చ చెపుతున్నాడు.
   తండ్రీ ఎందుకు బాధ పడుతున్నారు? ఇంతకు ముందు మన వంశంలో ఉన్న తాతల్ని, ముత్తాతల్ని గుర్తుకి తెచ్చుకోండి. వాళ్ళు అన్నమాటని నిలబెట్టుకున్నారు. ఎప్పుడూ నిజాన్నేపలికారు. ఇప్పుడున్న వాళ్ళు కూడా ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించండి. ధాన్యం మొలకలొచ్చి పెరిగి పండి రాలిపోతుంది. దానిలోంచి వచ్చిన ధాన్యం మళ్ళీ మొలకలొచ్చి ధాన్యమవుతుంది. అదే విధంగా మనిషి కూడా పుట్టి పెరిగి మరణిస్తాడు. తిరిగి మళ్ళీ పుడతాడు.
   లోకమూ శాశ్వతం కాదు, మనిషి పుట్టుకా శాశ్వతం కాదు. మాటకు కట్టుబడి ఉండడం మానేసి అబద్ధంలో జీవించడం వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి నిజాన్ని గ్రహించండి. మాటకు కట్టుబడి ఉండండి. తాత ముత్తాతల మార్గాన్ని అనుసరించండి. భగవంతుడి నిర్ణయం ప్రకారమే మనం నడుచుకుంటాం. ఇందులో మీ దోషం ఏదీ లేదు. నన్ను గురించి బాధ పడకుండా ఆనందంగా నన్ను యమలోకానికి పంపండి. అని నచ్చచెప్పి యమలోకానికి వెళ్ళాడు.
    నచికేతుడు యమపురికి వెళ్ళేటప్పటికి అక్కడ యమధర్మరాజు లేడు. మూడు రోజుల గడిచాక యమధర్మరాజు తన పట్టణానికి తిరిగి వచ్చాడు. నచికేతుడు ఆ మూడు రోజులు ఆహారం, నిద్ర లేకుండా  ఆయన కోసం ఎదురు చూస్తూ కుర్చున్నాడు. ఇంటికి రాగానే బ్రహ్మ వర్చస్సు కలిగిన బ్రాహ్మణ బాలుడు ఒకడు  తన రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడని తెలిసింది.
  యమధర్మరాజు నచికేతుణ్ణి చూశాడు. అతడి ముఖ వర్చస్సుని చూసి యమధర్మరాజుకి భయం వేసింది. ఎందుకంటే అతణ్ణి చూడగానే బ్రాహ్మణుడు అని అర్ధం అయిపోతోంది. అతడు తన కోసం మూడు రోజులుగా ఎదురు చూస్తూ నిద్రాహారాలు లేకుండా కూర్చున్నాడని ఇంట్లో వాళ్ళు చెప్పారు.
    అగ్నిస్వరూపుడైన అతిథి ఆహారం తీసుకోకుండా ఎవరి ఇంట్లో ఉంటాడో ఆ యింట్లోవాళ్ళు అప్పటి వరకు చేసుకున్న పుణ్యమంతా పోగొట్టుకుంటారు. వస్తోంది. ధర్మానికి మారు పేరయిన తన ఇంట్లో అధర్మం జరగడం మంచిది కాదు. కాని ఇప్పుడు అది తనకు తెలియకుండానే జరిగిపోయింది. దాని ఫలితం చాలా దారుణంగా ఉంటుంది. జరిగిన పొరపాటు తను లేని సమయంలో జరిగినా కూడా అది తను చేసినట్టే అవుతుంది.  నిప్పుని తెలిసి ముట్టుకున్నా, తెలియక ముట్టుకున్నా కాలకుండా ఉండదు. ఇది కూడా అటువంటిదే. తను లేని సమయంలో ఒక అతిథి ఆహారం, నిద్ర లేకుండా తన ఇంట్లో ఉన్నాడు. అపరాధం తన ఇంట్లో జరిగింది కనుక, అది తను చేసినట్టే అవుతుంది. ఇంట్లో క్రమశిక్షణ లేదనే కదా అర్ధం. ఇప్పుడే ప్రాయిశ్చిత్తం చేసుకుని ఈ దోషం నుంచి బయట పడాలి  అనుకున్నాడు.
   యమధర్మరాజు నచికేతుణ్ణి చూసి బ్రహ్మస్వరూపుడవైన నువ్వు మాకు అతిథివి. కనుక వయస్సులో చిన్నవాడివయినా నీకు నమస్కారం పెడుతున్నాను. అతిథిగా ఇంటికి వచ్చినవాడు అగ్ని దేవుడితో సమానమంటారు. నువ్వు మా ఇంటికి వచ్చి మూడు రోజులు ఉన్నావు. కాని మూడు రోజులూ నువ్వు నిద్రాహారాలు లేకుండా గడిపావు.
   నేను లేని సమయంలో కూడా నా ఇంట్లో అతిథికి మర్యాద జరిగేలా చూడడం నా ధర్మం. కాని, నా ఇంట్లో నీకు అతిథి సత్కారం జరగలేదు. ఇంటి యజమానిగా ఆ పొరపాటు నాదే అవుతుంది. నా తప్పుకి మన్నించి నన్ను క్షమించు. నాకు మంచి జరిగేటట్టు దీవించు. నేను చేసిన ఈ పాపానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తున్నాను కోరుకో! అన్నాడు.
   యమధర్మరాజు చెప్పిన మాటలు విని నచికేతుడు ఆయన కోరిక ప్రకారం మూడు వరాలు అడగడానికి అంగీకరించాడు. మొదటి వరం ఈ విధంగా కోరుకున్నాడు.  నన్ను చూసిన న తండ్రి అప్పటి వరకు ఉన్న ఆందోళన వదిలి నువ్వు పంపించగ వెళ్ళిన నన్ను చూసి సంతోషంగా నన్ను ఆదరించాలి అని మొదటి వరంగా కోరుకుంటున్నాను అన్నాడు.
   నచికేతుడు కోరుకున్న వరానికి చాలా సంతోషించిన యమధర్మరాజు నచికేతా! నీ తండ్రికి కలిగిన ఆందోళనలన్నీ పోయి సంతోషంగా ఉంటాడు. మృత్యుముఖం నుండి బయట పడి ఇంటికి వచ్చిన నిన్ను చూసి సంతోష పడతాడు. నీ మీద ఉన్న కోపాన్ని మర్చిపోయి ప్రేమతో ఆదరిస్తాడు! అన్నాడు.
   తరువాత నచికేతుడు యమధర్మరాజుతో ఇలా అన్నాడు యమధర్మరాజా!  స్వర్గలోకంలో నువ్వు ఉండవు. స్వర్గలోకంలో అసలు బాధలే ఉండవనీ... ఆకలి, దాహం, ముసలితనం, మృత్యువు కూడా ఉండవనీ, కష్టాలు లేకుండా జీవుడు అక్కడ సుఖ సంతోషాలతో హాయిగా ఉంటాడనీ విన్నాను. నాకు కూడా అక్కడికి చేరే ఉపాయం తెలుసుకోవాలని ఉంది.
   యమధర్మరాజా! స్వర్గానికి చేరడానికి సాధనం అగ్నివిద్య. స్వర్గానికి వెళ్ళాలని అనుకున్నవాళ్ళు ఆ విద్య నేర్చుకుంటున్నారు. తరువాత అమరత్వాన్ని కూడా పొందుతున్నారు. నేను ఏ విద్యనయినా శ్రద్ధగా నెర్చుకోగలను. నీకు తెలిసిన ఆ యజ్ఞ రహస్యాన్ని నాకు రెండో వరంగా ప్రసాదించు! అన్నాడు నచికేతుడు.
   అతడు కోరుకున్న రెండో వరాన్ని విని యమధర్మరాజు నచికేతా! నువ్వన్నది నిజమే. స్వర్గం చేరడానికి మార్గం చూపించే అగ్ని విద్య నాకు తెలుసు. ఆ విద్య శాశ్వతంగా స్వర్గంలో ఉండిపోడానికి ఉపయోగించే సాధనం. విశ్వమంతటికీ ఆధారమైన ఆ విద్యని పండితులు భక్తితో ఆదరిస్తున్నారు. దాన్ని అగ్నివిద్య, అగ్నిచయనం అని అంటారు. ఆ విద్యని నీకు పూర్తిగా నేర్పిస్తాను నేర్చుకో ! అన్నాడు.
    యమధర్మరాజు విశ్వమంతటికీ ఆధారమైన అగ్నివిద్య గురించి నచికేతుడికి వివరించాడు. దానికోసం ఎన్ని ఇటుకలు కావాలో, ఎటువంటివి కావాలో, వాటిని ఎలా అమర్చాలో, హోమనిథిని నిర్వహించే విధానం ఎమిటో అన్ని విషయాల్నీ కూలంకషంగా వివరించి చెప్పాడు.
   యముడు చెప్పినదంతా శ్రద్ధగా విన్నాడు నచికేతుడు. అప్పటి వరకు యముడు తనకు వివరించిన దాన్ని మళ్ళీ యముడికి వినిపించాడు. నచికేతా ! నీ ధారణాశక్తికి, ఒక్కసారి చెప్పగానే ఆర్ధం చేసుకో గలిగిన నీ బుద్ధి బలానికి నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు మరొక వరం కూడా ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను నీకు ఉపదేశించిన ఈ అగ్ని ఇప్పటి నుంచి నీ పేరుతో నచికేతాగ్నిఅని ప్రసిద్ధి చెందుతుంది. రకరకాల రంగులతో ఉన్నఈ మాలని కూడా నీకు ఇస్తున్నాను తీసుకో!  అని చెప్పి ఒక మాలని కూడా నచికేతుడికి ఇచ్చాడు.
   యమధర్మరాజు ఇంకా ఇలా చెప్పాడు. నాచికేత యజ్ఞాన్ని మూడు సార్లు చేసి, ఉపదేశం కోసం ముగ్గుర్ని ఆశ్రయించి, మూడు రకాల విధులు నిర్వర్తించిన వాడికి చావు పుట్టుకలు ఉండవు. నాచికేతయజ్ఞం మూడుసార్లు చేసినవాడు అన్ని విషయాలు తెలుసుకుని యథావిధిగా జరిపించి శరీరం పతనం అవక ముందే మరణాన్ని గెలిచి దు:ఖమనేది లేకుండా స్వర్గాన్ని చేరి ఆనందంగా ఉంటున్నాడు అని చెప్పాడు యమధర్మరాజు.
   స్వర్గానికి చేర్చగలిగిన ఈ నాచికేతాగ్ని నేను నీకు ఇచ్చిన వరం. ఇది నువ్వు కోరి తెలుసుకున్న యజ్ఞం. ప్రజలతో నీ పేరు మీద ఇది నాచికేతయజ్ఞ అని పిలవబడుతుంది. నచికేతా! ఇంక మూడవ వరాన్ని కోరుకో! అన్నాడు యమధర్మరాజు.
   మొదటి రెండు వరాలు ఆత్మకి సంబంధించినవి కాదు. కాబట్టి అవి అవిద్యను పోగొట్టలేవు. ఇప్పుడు నచికేతుడు మూడోవరంలో బ్రహ్మవిద్యకు సంబంధించిన విషయాన్ని వరంగా కోరుకుంటున్నాడు.
   నచికేతుడు యమధర్మరాజుతో యమధర్మరాజా!  మనిషి మరణించాక కలిగే సందేహం ఇది. మానవుడు చనిపోయాక ఆత్మ ఉంటుందని కొందరు, ఉండదని మరికొందరు అంటుంటారు. నీ ద్వారా నా సందేహాన్ని తీర్చుకోవాలని అనుకుంటున్నాను. ఇదే నా మూడవ వరంగా కోరుతున్నాను! అన్నాడు వినయంగా. 
   యముడు నచికేతుడితో నచికేతా! దేవతలకి కూడా మునుపు తమకు ఈ ఆత్మవిద్య అర్ధం అయిందో లేదో అన్న సందేహం కలిగింది. ఆత్మ విషయం చాలా సూక్ష్మమయింది. దాన్ని గురించి తెలుసుకోడం అంత సులభమైన విషయం కాదు. నేను ఎంత బాగా చెప్పినా కూడా తెలుసుకోడం నీకు కష్టమే అవుతుంది. కాబట్టి మరొక వరం ఏదైనా కోరుకో. ఈ వరం మాత్రం నన్ను అడుగకు. ఈ విషయంలో మాత్రం నన్ను వదిలిపెట్టు అన్నాడు.
   నచికేతుడు మాత్రం వదల్లేదు. ఆత్మవిద్య నేర్చుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. ఓ మృత్యుదేవతా! ఆత్మవిద్య విషయంలో దేవతలకి కూడా సందేహం వచ్చిందన్నావు. దానికి తోడు, ఈ విద్య సులభంగా అర్ధమయ్యేది కాదనీ నువ్వే చెప్తున్నావు. సమర్ధత కలిగిన ఆచార్యుడు నాకు దొరకడు. దీనితో సమానమైన విద్య కూడా మరేదీ లేదు. అలాగే ఈ వరంతో సమానమైన వరం కూడా మరొకటి లేదు. అందుకే నేను మూడో వరంగా ఆత్మవిద్యని నీ ద్వారా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. నాకు మూడో వరంగా ఆత్మవిద్యని బోధించు! అన్నాడు అదే పట్టుదలతో.
   యముడు కూడా వదల్లేదు. నచికేతా! అత్యంత కష్టమైన ఆత్మ తత్త్వాన్ని గురించి తెలుసుకోడానికి ఎందుకు తపన పడతావు. దాన్ని గురించి వదిలి పెట్టి వేరే ఇష్టమైనదాన్ని దేన్నైనా వరంగా కోరుకో. నిండు నూరు సంవత్సరాలు జీవించే కొడుకుల్నీ, మమతానురాగాలతో అలరించే మనుమల్నీ కోరుకో. సంపదకు ప్రతి రూపమైన ఆవుల మందల్ని వరంగా అడుగు. గుర్రాలు, ఏనుగులు ఎన్ని కావాలన్నాతీసుకో. బంగారం ఎంత కావాలో చెప్పు. నువ్వు కావాలంటే ఈ భూమండలాన్నే వరంగా ఇస్తాను ఏలుకో! నీకు ఎన్ని వేల సంవత్సరాలు బ్రతికి ఉండాలని అనిపిస్తే అంత కాలం జీవించు! అన్నాడు.
   మళ్ళీ అడుగుతూ నచికేతా! ఆత్మవిద్య తప్ప దానితో సమానమైన వరం ఏది కావాలంటే దాన్నే కోరుకో. అపారమైన ధన రాసుల్ని కోరుకుంటావా... చిరంజీవిగా భూలోకంలోనే ఉండిపోవాలని అనుకుంటుంటే చెప్పు, ఆ వరం కూడా నీకు ఇస్తాను. సువిశాలమైన సామ్రాజ్యానికి చక్రవర్తిగా ఉండాలని ఉంటే అదయినాసరే, నువ్వు ఏది కావాలంటే దాన్నేఇస్తాను! అన్నాడు యమధర్మరాజు.
   నచికేతుణ్ణి వదలకుండా వేరే వరం కోరుకోమని చెప్తూనే ఉన్నాడు యముడు. నచికేతుడు ససేమిరా వద్దంటున్నాడు. యముడు ఇంకా అడుగుతున్నాడు నచికేతా! మానవ లోకంలో అనుభవించ లేనివి ఏమున్నాయో... ఏవి అక్కడ దొరకవో అటువంటివి అడుగు ఇస్తాను. నృత్య సంగీత వాద్యాలతో విహరించేందుకు వీలుగా ఉన్న రథాలతో, మానవ లోకంలో దొరకని అరుదైన అందం కలిగిన సుందరీ మణుల్ని నీకు ఇస్తాను. వాళ్ళతో సేవ చేయించుకుంటూ హాయిగా ఆనందాన్ని అనుభవించు.అంతేకాని, మృత్యు సంబంధమైన ఆత్మ విద్యను మాత్రం కోరుకోకు! అని అనేక విధాలుగా చెప్పి, ప్రలోభ పెట్టి, ఆశ చూపించి నచికేతుడి మనస్సుని మార్చడం కోసం ప్రయత్నించాడు యమధర్మరాజు. కాని, నచికేతుడు దేనికీ ఆశ పడలేదు.
   యమధర్మరాజా! ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ ప్రాపంచిక విషయాలు. ఈ రోజు ఉంటాయి రేపు నశించి పోతాయి. ఇవన్నీ మనిషికి ఉన్న ఇంద్రియ శక్తిని ఇంకా తగ్గిస్తాయి. నువ్వు ఎంత పొడిగించినా మనిషి జీవితం కొంచెమే. కనుక, నీ గుర్రాలు, ఏనుగులు, ఆటపాటలు, సుందరీమణుల్ని కూడా నీ దగ్గరే ఉంచుకో. ఇటువంటి నశించిపోయే స్వభావం కలిగినవి మాత్రం నాకు వద్దు. మనిషిని శాశ్వతంగా ఉంచగలిగిన ఆత్మవిద్యే నాకు కావాలి.
  మనిషికి భోగభాగ్యాలు ఎన్ని ఇచ్చినా తృప్తి కలగదు. అంతేకాక నీ దర్శనం కలిగాక మాకు సంపదలకు కొరత ఏముంటుంది? ఇచ్చేందుకు ఇంకా ఏముంటాయి? నువ్వు ఎంత కాలం జీవించమంటావో అంత కాలమూ మేం జీవించాల్సిందే. అది ఎలాగూ తప్పదు. కాని మరణం తరువాత ఉండే గొప్పదైన జీవితం గురించి తెలియచేసే జ్ఞానమే నేను కోరుకుంటున్న వరం అన్నాడు నచికేతుడు.
   ఓ యమరాజా! మరణానంతరం ఉండే ఆ గొప్ప జీవితాన్ని గురించి చెప్పు. అందరికీ దాన్ని గురించే సందేహం. నువ్వు చెప్పందే తెలుసుకోలేడు ఈ నచికేతుడు. ఈ విషయం తప్ప వేరే వరం ఏదీ కోరడు ఈ నచికేతుడు! అని దృఢమైన చిత్తంతో యమధర్మరాజుని బాలుడైన నచికేతుడు ఆత్మ విద్య బోధించమని పదే పదే అడుగుతూనే ఉన్నాడు.
   ఈ విధంగా నచికేతుడు ప్రాపంచిక విషయాల మీద తనకు కలిగిన విరక్తిని తెలియచేసి, ఆత్మజ్ఞానం మీద తనకు కలిగిన అమితమైన ఆసక్తిని, కోరికని యమధర్మరాజుకి తెలిసేలా చెప్పాడు. ఎన్ని విధాలుగా ప్రలోభ పెట్టినా నచికేతుడు వాటికి లొంగలేదు. తనకు ఆత్మజ్ఞానమే కావాలని పట్టుపట్టి కూర్చున్నాడు.
   నచికేతుడికి ఆత్మ విద్య మీద ఉన్న కోరికని తెలుసుకుని, అందుకు నచికేతుడు అర్హుడే అని నిర్ణయించుకుని అతడికి ఆత్మజ్ఞనాన్ని అన్యచ్ఛ్రేయో అంటూ బోధించడం ప్రారంభించాడు యమధర్మరాజు.
   నచికేతా! నువ్వు కోరుకున్న ఆత్మ విద్యని బోధిస్తున్నాను శ్రద్ధగా విను!  శ్రేయోమార్గం, ప్రేయోమర్గం అని రెండు మార్గాలున్నాయి. వాటిలో శ్రేయోమార్గం మనిషికి శ్రేయస్సుని కలిగించి ఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది. రెండోదయిన ప్రేయోమార్గం ప్రాపంచిక సుఖాల్ని ఇస్తుంది. వేరు వేరు గమ్యాలకు తీసుకుని పోయే ఈ రెండు మార్గలూ కూడా మనిషి మీద అజమాయిషీ చెలాయిస్తూ తమ చెప్పుచేతల్లో పెట్టుకుంటాయి.  ప్రేయోమార్గంలో వెళ్ళేవాడు గమ్యానికి చేరలేడు. వివేకవంతుడుఎప్పుడూ మంచి ఫలితాన్ని ఇచ్చేది, శ్రేయస్సుని కలుగచేసేది అయిన శ్రేయో మార్గాన్ని ఎంచుకుని చేరవలసిన గమ్యానికి చేరుకుంటాడు.
   శ్రేయస్కరమైన మార్గమూ, సుఖకరమైన మార్గమూ రెండూ మనిషికి దగ్గరగానే ఉంటాయి. బుద్ధిమంతుడు రెండు మార్గాల గురించి పూర్తిగా తెలుసుకుంటాడు. పూర్తిగా అర్ధం చేసుకున్నాక ఏ మార్గంలో వెళ్ళాలో నిర్ణయించుకుంటాడు. ప్రాపంచిక సుఖాలు అనుభవించి మళ్ళీ మళ్ళీ పుట్టడం కంటే జన్మరాహిత్యాన్ని పొందాలనుకుంటాడు. దాని కోసం శ్రేయోమార్గాన్నిఅనుసరిస్తాడు. కాని, వివేకం లేనివాడు ప్రాపంచిక సుఖాల మీద ఆసక్తిని, ధనం మీద వ్యామోహాన్ని కలిగి ఉండడం వల్ల వాటిని అనుభవించాలన్న కోరిక తీరక ప్రేయోమార్గాన్ని ఎంచుకుంటాడు.
   నచికేతా! నువ్వు గొప్ప జ్ఞానంతో ఆలోచించి అమరత్వాన్ని పొందే విషయాల్ని, చూడగానే తమ వైపు ఆకర్షించుకునే ప్రాపంచిక విషయాల్నీ కూడా చక్కగా అర్ధం చేసుకున్నావు. అందువల్లే, శ్రేయో మార్గాన్ని ఎంచుకుని మళ్ళీ మళ్ళీ పుట్టుక లేకుండా ఉండే జన్మరాహిత్యాన్ని కోరుకున్నావు. ఎంతో మంది అవివేకంతో ప్రాపంచిక విషయాల కోసం పరుగులు పెట్టి  మునిగి నాశనమయ్యే  ప్రేయోమార్గంలోకి నువ్వు ప్రవేశించలేదు.
   అజ్ఞానము, జ్ఞానమూ అనబడే ఈ రెండూ మనిషిని వేరు వేరు మార్గాలవైపు తీసుకుని పోతాయి. ఈ రెండింటికీ మధ్య చాలా దూరం ఉంది. నేను ఇస్తానన్న ప్రాపంచిక సంపదలు నిన్ను కొంచెం కూడా ఆకర్షించలేదు కనుక, నచికేతుడు జ్ఞానం కోసమే వెతుకుతున్నాడు అని నేను నమ్ముతున్నాను.
   అజ్ఞానంలో కూరుకుని పోయిన అవివేకులు తామే గొప్ప జ్ఞానవంతులం, పండితులం అనుకుంటారు. గుడ్డివాళ్ళతో నడిపించ బడుతున్న గుడ్డివాళ్ళల్లా నిశ్చలంగా ఉండలేక తూలుతూ, తడబడుతూ నడుస్తూ ఉంటారు. జాగ్రత్త లేని పిల్లవాడికీ, ధనం వల్ల కలిగిన అహంకారంతో ఉన్నగుడ్డివాడికీ శ్రేయోమార్గం ఎప్పటికీ కనిపించదు. లోకమంటే ఇదే! మరో లోకం లేనేలేదు అనుకున్నవాడు మళ్ళీ మళ్ళీ నా చేతిలోనే పడుతుంటాడు.
   ఆత్మవిద్య గురించి వినడం చాలామందికి సాధ్యపడదు. విన్నాకూడా చాలామంది దాన్ని అర్ధం చేసుకోలేరు. దాన్ని గురించి ఉపదేశించే ఆచార్యుడు గొప్ప జ్ఞానం కలిగి ఉంటాడు. అలాగే నేర్చుకునే శిష్యుడు కూడా గొప్ప బుద్ధి తీక్ష్ణత కలిగి ఉంటాడు. ఆచార్యుడికి ఉపదేశించ గల సమర్ధత ఉన్నా శిష్యుడు దాన్ని అర్ధం చేసుకోగలగాలి కదా! అటువంటి శిష్యుడు ఉంటే నిజంగా ఆ శిష్యుడు గురువు కంటే గొప్పవాడే అవుతాడు.
   అసమర్ధుడైన ఆచార్యుడు బోధిస్తే ఆత్మవిద్య ఏ శిష్యుడికీ సవ్యంగా అర్ధమవదు. యోగులు కూడా ఈ ఆత్మతత్త్వాన్ని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు.  అటువంటి ఈ ఆత్మతత్త్వాన్ని ప్రతి ఆచార్యుడూ శిష్యులకి బోధించలేడు. ఎంత కష్టపడినా ఇది ఎవరికి వాళ్ళు తెలుసుకోగలిగే విద్య మాత్రం కాదు. మరొకరు బోధిస్తేనే తప్ప దాన్ని అర్ధం చేసుకోలేరు. అంతకంటే వేరే దారేదీ లేదు.
   ఆత్మతత్త్వం  సూక్ష్మాతి సూక్ష్మమైంది. ఈ జ్ఞానం తర్కం వల్ల, చర్చలవల్ల పొందకలిగేది కాదు. ప్రియమైన నచికేతా!  అది సమర్ధుడైన ఆచార్యుడు బోధిస్తేనే అర్ధమవుతుంది. నువ్వు నిజంగా సత్యనిష్ఠ కలవాడివి. మాకు కూడా నీ వంటి శిష్యులు లభించాలని కోరుకుంటున్నాను.
   శాశ్వతమైన వస్తువుని అశాశ్వతమైన వస్తువు ద్వారా పొందలేం. కనుక ఈ సంపదలన్నీ శాశ్వతం కావని నాకు తెలుసు. అయినా ఈ అశాశ్వత వస్తువులతోనే నేను నాచికేతాగ్నిని నిర్వర్తించాను. దానిద్వారా శాశ్వత వస్తువుని పొందాను. అన్ని కోరికల్ని సంపూర్ణంగా పొందాను. యజ్ఞాలు చెయ్యడం వల్ల కలిగే  శాశ్వతఫలాన్ని, ఆరాధ్యభావంలో ఉండే గొప్పతనాన్నీ, ఉన్నతమైన స్థితినీ, జీవితానికి ఆధారమైనదాన్నీ కూడా పొందాను. ఓ నచికేతుడా! నువ్వు బుద్ధిమంతుడివి కనుక, దృఢనిశ్చయంతో ప్రాపంచిక విషయాలు వద్దని వదిలేశావు.
  వివేకవంతుడు ఈ శరీరంలోను, హృదయ పద్మంలోను స్థిరంగా ఉన్న సనాతనమై, అతిసూక్ష్మ మై, అంతర్లీనంగా ఉండి గొప్పగా ప్రకాశించే ఆత్మను ధ్యానం ద్వారా సాక్షాత్కరించుకుని దు:ఖాలన్నింటికీ అతీతంగా ఉంటాడు. ధర్మానికి ప్రాణమైన ఈ సూక్ష్మతత్వాన్ని విని, మననం చేసుకుని, చక్కగా అర్ధం చేసుకున్న మనిషి  దాన్ని అందుకుంటాడు. ఆత్మానుభూతిని పొందడం చేత ఆనందంతో పరవశిస్తాడు. నచికేతుడికి ఇదంతా అర్ధమయిన విషయమే అని నేను అనుకుంటున్నాను అన్నాడు యమధర్మరాజు.
   నచికేతుడు యమధర్మరాజుని అడుగుతున్నాడు. యమధర్మరాజా! ధర్మం-అధర్మం, చేయతగింది-చేయకూడంది, జరిగిపోయింది-జరగబోయేది అయిన విషయాలకి కూడా వేరుగా ఉండేదాన్ని దేన్నయితే నువ్వు తెలుసుకున్నావో దాన్ని గురించి  దయచేసి నాకు ఉపదేశించు! అని ప్రార్ధించాడు.
   యమధర్మరాజు నచికేతుడు ప్రార్ధన విని అతడికి వివరించడం మొదలుపెట్టాడు. నచికేతా! వేదాలన్నీ ఏ మార్గాన్ని బోధిస్తున్నాయో, తపస్సులన్నీ ఏ గమ్యాన్ని సూచిస్తున్నాయో వాటి కోసం సాధువులు బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతారు. దాన్ని గురించి  నీకు వివరంగా తెలియచేస్తాను విను. అదే ఓంకారం. ఈ అక్షరమే బ్రహ్మం, ఉత్తమమైన వాటి కంటే కూడా ఉత్తమమైంది. ఈ ప్రణవాక్షరాన్ని తెలుసుకుని ఉపాసించేవాడు తను పొందాలని అనుకున్న దాన్ని సులభంగా పొందగలడు. ఈ మార్గమే అన్నింటికంటే ఉన్నతమైంది. ఋషులు ఈ ప్రణవాన్ని ఆధారం చేసుకునే  బ్రహ్మలోకంలో పూజింప బడుతున్నారు.
   జ్ఞాత అయిన ఆత్మ పుట్టదు, చావదు. దానికి మార్పులేదు. దానివల్ల మార్పు పొందేది కూడా ఏదీ లేదు. శరీరం నశిస్తున్నప్పుడు కూడా అది నశించదు. జన్మలేంది, శాశ్వతమైంది, సనాతనమైంది అయినా ఈ ఆత్మకు నాశనం అనేది లేదు. చంపేవాడు తాను చంపుతున్నానని, చస్తున్నవాడు తాను చంపబడు తున్నానని అనుకుంటే ఆ ఇద్దరికీ ఆత్మ గురించి సరిగ్గా తెలియదు అని అర్ధం. నిజానికి ఆత్మ చంపదు, చంపబడదు.
   సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుకంటె చిన్నది, బ్రహ్మాండం కంటే అతి పెద్దది అయిన ఆత్మ ప్రాణుల హృదయాల్లోనే ఉంది. కోరికలు, దు:ఖాలు లేకుండా ఇంద్రియ నిగ్రహంతోను, కోరికలు లేని మనస్సుతోను ఆత్మయొక్క  మహత్తును తెలుసుకుంటాడు. కదలకుండా కూర్చుని ఉన్నచోటే ఉండి ఎంతో దూరం ప్రయాణం చేస్తాడు. పడుకునే ఉండి కూడా అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోతాడు. అనందంతో నిండినవాడు, ఆనందం లేనివాడు అయిన ఆ ప్రకాశవంతుణ్ణి నేను తప్ప వేరే ఎవరికీ  తెలిసికోగలిగే సమర్ధతలేదు.
  వివేకవంతుడు శరీరం లేని ఆత్మ అంతటా వ్యాపించింది ఉందనీ, అశాశ్వతమైన అన్ని శరీరాల్లో కూడా ఉందనీ తెలుసుకుని దేనికోసమూ బాధపడడు. వేదాధ్యయనం, బుద్ధికుశలత, అపారమైన పాడిత్యం ఉన్నవాళ్ళు కూడా ఈ ఆత్మను తెలుసుకోలేరు. అది ఎవరికి అందాలని అనుకుంటుందో, అందుకు ఎవరిని ఎంచుకుంటుందో అతడికే ఆత్మానుభవం కలుగుతుంది. అంటే, అతడి ఆత్మే అతడికి తన యొక్క నిజ స్వరూపాన్ని వెళ్ళడిస్తుంది. చెడు మార్గం వదలనివాళ్ళూ, ఇంద్రియాలని నిగ్రహించుకోలేనివాళ్ళు, ధ్యానం చెయ్యనివాళ్ళు, ప్రశాంతత చెందిన మనస్సు లేనివాళ్ళు, జ్ఞానం చేత మాత్రమే దీన్ని పొందగలరు. అలా జరగకపోతే బ్రాహ్మణ క్షత్రియులు ఎవరికి ఆహారమో... మృత్యువు ఎవరికి నంజుకునే పచ్చడో... ఆ ఆత్మ ఎక్కడ ఉందో ఈ విధంగా ఎవరికి తెలుస్తుంది.
   తమ పుణ్య కర్మఫలాన్ని అనుభవిస్తూ, గొప్పదైన హృదయాకాశంలో ఉన్న బుద్ధిలో ప్రవేశించిన వాళ్ళు ఈ లోకంలో ఇద్దరున్నారు. బ్రహ్మవిదులు వాళ్ళని వెలుగునీడల అంటారు. నాచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేసిన గృహస్థులు కూడా వాళ్ళని అలాగే పిలుస్తారు. ఆత్మ వాటన్నిటికీ యజమాని అని తెలుసుకో. అలాగే శరీరం రథం, బుద్ధే సారథి మనస్సే కళ్ళెం అని తెలుసుకో.
   ఇంద్రియాలే గుర్రాలూ, ఇంద్రియ విషయాలే వాటి మార్గాలూ అంటారు. శరీరం, ఇంద్రియాలు, మనస్సు కలిగి ఉన్నఆత్మనే పండితులు భోక్త అని చెప్తారు. మనస్సుని దాని ఆలోచనలకి దాన్ని వదిలి ఎప్పుడూ అజ్ఞానంతోనే సంచరించే వాళ్ళ ఇంద్రియాలు, వాళ్ళ అదుపులో ఉండక వశం తప్పిపోతాయి. మనస్సుని అదుపులోనే ఉంచుకుని జ్ఞానంతో ప్రవర్తించే వాళ్ళ ఇంద్రియాలు వాళ్ళ వశంలోనే ఉంటాయి. అజ్జ్ఞానంతోను, చంచలమయిన మనస్సుతోను, ఎప్పుడూ అశుచిగాను ఉండే వాళ్ళు పరమపదాన్ని ఎప్పటికీ చేరలేరు. జనన మరణ చక్రమైన సంసారంలో పడిపోతారు. ఎవరయితే జ్ఞానంతోను  స్థిరమైన మనస్సుతోను, ఎప్పుడూ శుచిగా ఉంటారో వాళ్ళు పునర్జన్మ లేని  పరమపదాన్ని చేరుకుంటారు. బుద్ధినే సారథిగాను, మనస్సునే కళ్ళెంగాను అనుకుని వివేకంతో నడుచుకుంటే చేరవలసిన గమ్యం చేరుకుంటాడు.
   ఇంద్రియాలకంటే వాటి విషయాలు ఉన్నతమైనవి. విషయాల కంటే మనస్సు గొప్పది. మనస్సు కంటే గొప్పది బుద్ధి. దాని కంటే కూడా ప్రాధాన్యత కలిగింది మహత్తు. అవ్యక్తం కంటే మహోన్నతమైంది మహత్తు.  వీటన్నిటికంటే అధికమైన స్థానంలో ఉన్నవాడు మహిమాన్వితుడైన పురుషుడు. ఆ పురుషుణ్ణి మించింది లేదు. అదే చివరి మజిలీ. అదే పరమ గమ్యం.
   అన్ని జీవుల్లోను కనిపించకుండా ఉన్న ఈ అత్మని అందరూ తెలుసుకోలేరు. సూక్ష్మబుద్ధి, ఏకాగ్రత కలిగిన ఋషులు మాత్రమే ఆ ఆత్మను తెలుసుకోగలరు. వివేకవంతుడు వాక్కును మనస్సులోను, మనస్సును బుద్ధిలోను,  బుద్ధిని భగవంతునిలోను, భగవంతుణ్ణి పరమశాంతి అనే పరమాత్మలోను క్రమంగా ఐక్యం చెయ్యాలి.
   లేవండి!మేలుకోండి! సద్గురువులను ఆశ్రయించి ఆత్మ సాక్షాత్కారం పొందండి. ఆ మార్గం కత్తి మొనలా చాలా పదునుగా ఉంటుంది. దాన్ని అనుసరించి వెళ్ళడం ఎంతో కష్టంతో కూడుకున్నదని వివేకవంతులు చెప్తారు. శబ్ద స్పర్శ రూప రస గంధాలు లేంది, నాశనం లేంది, శాశ్వతమైంది, ఆదీ అంతు లేందీ, మహత్తుకు అతీతమైందీ, ధృవమైందీ అయిన ఆత్మను సాక్షాత్కరించుకుని మానవుడు మృత్యువు నుండి విముక్తిని పొందుతున్నాడు.
   యమధర్మరాజు చెప్పిన నాచికేతోపాఖ్యానాన్ని, సనాతనమైనదాన్ని,ఇతరులకు చెప్పి తాను విన్నవాడు బ్రహ్మలోకం పొందుతాడు. అత్యంత గోప్యమైన ఈ కథను బ్రాహ్మణ సభలోగాని, శ్రాద్ధకర్మ చేసే సమయంలో గాని పరమ భక్తితో వినిపించినవాడు అంతులేని ఫలితాల్నిపొందుతాడు.
  స్వయంభువు అయిన భగవంతుడు సృష్టించిన ఇంద్రియాలు విషయాల్ని తెలుసుకోగలవే గాని లోపల నిగూఢంగా ఉన్న ఆత్మను చూడలేవు. ఆత్మానుభూతిని పొందాలనే కోరిక ఉన్నవాడు తన కళ్ళను మనస్సు లోపలికి మరల్చ గలిగితే అంతరాత్మను తెలుసుకో గలుగుతాడు.
   చిన్నపిల్లలు కళ్ళకి ఎదురుగా కనిపించే సుఖాలకోసం పరుగులు పెడతారు.  ఆ పరుగులో వివేకాన్ని కోల్పోయి భయంకరమైన మృత్యువు వలలో పడిపోతారు. కాని, వివేకవంతులు అటువంటి శాశ్వతం కాని విషయాల మధ్య ఉండి కూడా ఎప్పూడూ ఉండేది, స్థిరంగా ఉండేది, ముక్తిని ప్రసాదించేది ఏదైతే ఉందో దాన్ని గురించి తెలుసుకుని ప్రపంచ విషయాల మీదకి దృష్టిని పోనీయకుండా ముందే జాగ్రత్త పడతారు.
   రంగు, రుచి, వాసన, శబ్దం, స్పర్శ, మైథున సంయోగాల్ని మనిషి ఏ ఆత్మద్వారా తెలుసుకో గలుగుతున్నాడో ఆ ఆత్మకు తెలియనిది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇదే నువ్వు తెలుసుకోవాలని అనుకున్న ఆ ఆత్మ!! అని
  ఇంతవరకు చెప్పిన యమధర్మరాజు నచికేతుడికి ఇంకా వివరిస్తున్నాడు. స్వప్నావస్థలోను, జాగ్రదావస్థలోను విషయాలన్నింటినీ మనిషి ఏ ఆత్మద్వారా తెలుసుకో గలుగుతున్నాడో... గొప్పవాడు, అంతటా వ్యాపించినవాడు అన్నింటికీ సాక్షిగా నిలబడినవాడు అయిన ఆ ఆత్మద్వారా దు:ఖాలనుంచి విముక్తిని పొంది ఆనందానుభూతిని పొందుతున్నాడు. జీవితాన్ని పోషిస్తున్నదీ భూత భవిష్యత్తులకు యజమాని అయిన ఆత్మను గురించి పూర్తిగా తెలుసుకున్నవాడికి ఇంక ఏ భయమూ ఉండదు. నిజంగా ఇదే ఆ ఆత్మ! 
   పూర్వం జ్ఞానానికి జన్మించినవాడు, నీటి కంటే కూడా ముందుగా జన్మించినవాడు అయిన ఆత్మ హృదయంలో ప్రవేశించి పంచభూతాలతో ఉంటోంది అని తెలుసుకున్నవాడు తప్పకుండా బ్రహ్మాన్నే దర్శిస్తాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
   ప్రాణ రూపంతో తెలుసుకోబడింది, పంచభూతాలతో సృష్టించబడింది, హృదయంలో ప్రవేశించి నివసిస్తున్నది అయిన ఆత్మని, దేవతల ఆత్మని తెలుసుకున్నవాడు నిజంగా బ్రహ్మాన్నే తెలుసుకుంటాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
   అన్నీ తెలిసిన అగ్నిదేవుడు గర్భవతులైన తల్లులు సురక్షితంగా పోషిస్తున్న గర్భంలా, గురువు బోధించడం వల్ల జ్ఞానాన్నిపొందిన వాళ్ళతోను, యజ్ఞాలు చేసేవాళ్ళతోను మండే కర్రల్లో జాగ్రత్తగా ఉంచబడి ప్రతిరోజూ ఆరాధింపబడతాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
  సూర్యుడు ఉదయించడం అస్తమించడం దేనివల్ల జరుగుతోందో దానిలోనే సకల దేవతలూ కొలువై ఉన్నారు. దాన్ని ఎవరూ కాదనలేరు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
   ఇక్కడ ఉన్నదే అక్కడ... అక్కడ ఉన్నదే ఇక్కడ ఉందని తెలియక రెండు చోట్ల ఉన్నది ఒక్కటి కాదు, ఇక్కడ ఉన్నది వేరు, అక్కడ ఉన్నది వేరు అనుకునేవాడు మళ్ళీ మళ్ళీ జన్మలు పొందుతూనే ఉంటాడు. మనస్సుతోనే  దీన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఆ ప్రయత్నం చెయ్యనివాడు ఆ భావం నుంచి బయటలేడు కనుక, అతడికి చావు పుట్టుకలు తప్పవు.
   బొటనవ్రేలి పరిమాణం గల పురుషుడు భూత భవిష్యత్తులకు యజమాని. ఆయన తన శరీరంలో నివసిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని తెలుసుకో గలిగిన మనిషి దేనికీ భయపడడు. మహోన్నతమైన ప్రకాశంతో వెలిగే ఆ జ్యోతికి పొగ ఉండదు. మార్పు లేకుండా అన్ని సమయాల్లోను ఒకేలా ఉంటాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
   ఎత్తైన శిఖరం మీద ఒకే చోట పడిన వర్షపు నీరు పర్వత ప్రాంతాల్లో పాయలుగా విడిపోయి ప్రవహిస్తుంది. అదే విధంగా ఒకే గుణం ప్రపంచంలో అనేక గుణాలుగా కనిపిస్తుంది.  కనిపిస్తున్న గుణాలన్నింటికీ కారణమైంది ఒకటే!  అనే విషయాన్ని తెలుసుకోలేక అన్నిగుణాలవెంటా  పరుగులు పెడతాడు. శుభ్రమైన నీటిని శుభ్రమైన నీటిలో పోసినప్పుడు ఆ నీరంతా శుభ్రంగానే ఉంటుంది. అలాగే ఆత్మ ఒక్కటే అని తెలుసుకున్న వివేకవంతుడు తను కూడా ఆత్మగానే మిగులుతాడు.
  ఓ నచికేతా!  జన్మలు లేనివాడు, గొప్ప జ్ఞానవంతుడు అయిన పరబ్రహ్మానికి ఈ శరీరమే పదకొండు ద్వారాలు గల పట్టణం. ఆ ఆత్మను రాగద్వేషాలు లేకుండా ధ్యానించి సంసార బంధం నుంచి విముక్తిని పొందచ్చు. మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండ అమరత్వాన్ని కూడా పొందుతాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
   స్వర్గంలో తిరిగే సూర్యుడూ అదే ఆత్మ. ఆకాశంలో సంచరిస్తున్న వాయువూ అదే ఆత్మ. యజ్ఞవేదికమీద అగ్నీ కూజాలో ఉన్న సోమరసం కూడా అదే ఆత్మ. మనుషుల్లో, దేవతల్లో, యజ్ఞంలో, ఆకాశంలో ఉన్నది కూడా అదే ఆత్మ. నీళ్ళల్లోను, భూమి పైన, యజ్ఞంలోను, పర్వతంపైన పుట్టింది కూడా అదే ఆత్మ. నిజం! అదే బృహత్తు!!
   అతడు ప్రాణాన్ని పైకి పంపిస్తాడు, అపానాన్ని కిందకి విసురుతాడు. మధ్యలో కూర్చుని ఉన్నఆ ఆత్మని గౌరవించాలి, పూజించాలి అని తెలిసిన దేవతలు ఆ ఆత్మను ఆరాధిస్తున్నారు. శరీరంలో ఉన్న ఆత్మ శరీరం నుంచి వేరు పడిన తరువాత ఇంక శరీరంలో మిగిలేది ఏదీ ఉండదు. ఇదే నిజమైన ఆ ఆత్మ.  
   మానవుడు ప్రాణంవల్ల, అపానం వల్ల జీవించడు. ఈ రెండూ అధారపడి ఉన్న దాని వల్ల మాత్రమే జీవిస్తాడు. నిజంగా ఇదే ఆ ఆత్మ!
   ఓ గౌతమా! ఇంక నీకు సనాతనమైందీ, రహస్యమైందీ అయిన బ్రహ్మాన్ని గురించి చెప్తాను. అలాగే మరణించిన తరువాత ఆత్మ ఏమవుతుందో కూడా చెప్తాను. కొన్ని జీవాత్మలు శరీరం కోసం గర్భంలోకి ప్రవేశిస్తాయి. కొన్ని జీవాత్మలు చెట్టూ చేమల్ని ఆశ్రయిస్తాయి. అంతా వాళ్ళు చేసుకున్న కర్మల్ని అనుసరించి, వాళ్ళకి  ఉన్న  జ్ఞానాన్ని అనుసరించి మాత్రమే జరుగుతుంది. మనం నిద్రపోతున్న సమయంలో కూడా తను మేలుకుని ఉండి మనకు అవసరమయిన వస్తువులన్నిటినీ సమకూరుస్తూ ఉండే ఆ పురుషుడే పరిశుద్ధమైన బ్రహ్మం. అదే  మరణం లేంది. అన్ని లోకాలు దానిలోనే ఉన్నాయి. దానిని దాటుకుని ఎవరూ ముందుకి వెళ్ళలేరు. ఇదే నిజంగా ఆత్మ!
   ప్రపంచంలో ఒకే ఒక నిప్పు, ఒకే ఒక వాయువు అనేక రూపాల్నిపొందుతుంది. అదే విధంగా అన్ని జీవుల్లోనూ ఉన్న ఒకే ఒక ఆత్మ అనేక వస్తువుల్లోకి చేరి ఆ యా వస్తువుల రూపాల్ని పొందుతుంది. వాటికంటే ఎక్కువ రూపాల్ని కూడా పొందుతుంది.
   మనిషి కళ్ళకు అంటిన మాలిన్యం  ప్రపంచానికి అంతటికీ కన్ను అయిన సూర్యుడికి అంటదు. అదే విధంగా  ప్రపంచానికే అతీతమైందీ, అందరి హృదయాల్లోను ఉన్నదీ అయిన ఆత్మక్కూడా ప్రపంచంలో ఉండే దు:ఖాలేవీ అంటవు. జగత్తుని నిలబెట్టేది, జీవులన్నిటికీ అంతరాత్మ అయినది, తనకున్నఒకే ఒక్క రూపాన్ని అనేక విధాలుగా మార్చుకోగలిగేది అయిన ఆత్మ తమ ఆత్మలోనే ఉందని తెలుసుకున్న వివేకవంతులు, జ్ఞానవంతులు శాశ్వతమైన ఆనందాన్ని పొందుతున్నారు.  అజ్ఞానులకి అది సాధ్యం కాదు.
   శాశ్వతం కాని వస్తువుల్లోను, శాశ్వతమైన వస్తువుల్లోను, చైతన్యవంతమైన వాటిల్లోను ఉన్న చైతన్యం ఒక్కటే! అయినా అది వివిధ రూపాల్లో వాళ్ళు కోరుకునే కోరికల్ని తీర్చగలదు. ఆ పరమాత్మ తమ ఆత్మలోనే  ఉంది అని ఎవరు గ్రహిస్తారో వాళ్ళదే శాశ్వతమైన శాంతి. దాన్ని గ్రహించలేని వాళ్ళకి ఆ ప్రశాంతత ఉండదు.
జ్ఞానవంతులు ఆ విషయాన్ని గ్రహించి అటువంటి అనిర్వచనీయమైన పరమానందాన్ని పొందుతున్నారు. దాన్ని ఎలా తెలుసుకోవాలి? అది తన కాంతితోనే స్వయంగా ప్రకాశస్తోందా లేక మరొక దాని కాంతి వలన మెరుస్తుందా? అని సందేహం కలిగితే దానికి సమాధానం....ఆకాశంలో ఉన్న సూర్యుడు ప్రకాశించడు. చంద్రుడు నక్షత్రాలు ప్రకాశించవు. మెరుపులు కూడా మెరవలేవు. ఇంక అగ్ని గురించి ఆలోచించడం ఎందుకు? ప్రకాశిస్తున్న ఆ ఆత్మని అనుసరించే మిగిలినవన్నీ ప్రకాశిస్తున్నాయి. దాని వెలుగుతోనే ప్రపంచమంతా ప్రకాశిస్తోంది.
     సనాతనమైన అశ్వత్థ వృక్షానికి ఉన్న వేళ్ళు పైకి వ్యాపించి ఉంటాయి. కొమ్మలు కిందకి విస్తరించి ఉంటాయి. ఇది చాల పవిత్రమైంది, పరిశుభ్రమైంది. దీన్నేబ్రహ్మం, అమరం అని కూడా అంటారు. అన్ని లోకాలూ దీనిలోనే ఉన్నాయి. ఎవరూ కూడా దీన్ని కాదనలేరు. నిజంగా ఇదే ఆత్మ.
  తనలో వ్యాపించి ఉన్న ప్రాణశక్తి వల్ల అతని నుండి మొత్తం విశ్వం బయటకు కనిపిస్తూ అతనిలోనే కంపనం చెందుతూ ఉంటుంది. ఎత్తబడిన వజ్రాయుధంలా అతడు మహా భయంకరుడు. అతడి మీద ఉన్న భయం వల్లే అగ్ని దహిస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తాడు. అతడి భయం వల్లే ఇంద్రుడూ వాయుదేవుడూ, అయిదవ మృత్యు దేవత కూడా తమ తమ పనులు చెయ్యడం కోసం పరుగులు పెడతారు. దీన్ని తెలుసుకున్న వాళ్ళే అమరులవుతారు.
   ఈ బ్రహ్మన్ని ఇక్కడే ఈ శరీరం పతనమవక ముందే తెలుసుకో గలిగినవాళ్ళు ఈ సంసార బంధం నుండి విముక్తులవుతారు. లేకపోతే సృష్టిలో ఉన్న లోకాలన్నీంటిలో మళ్ళీ మళ్ళీ పుట్టి కర్మ ఫలాన్నిఅనుభవించ వలసి వస్తుంది. ఈ పరబ్రహ్మం మనిషి ముఖం అద్దంలో కనిపించినట్టు అత్మలో స్పష్టంగా కనిపిస్తుంది. పితృలోకంలో కలలోలాగ, గంధర్వ లోకంలో నీటిలో ప్రతిఫలిస్తున్నట్టు,  బ్రహ్మ లోకంలో వెలుగు నీడల మాదిరిగాను కనిపిస్తుంది.
  ఇంద్రియాల కళ్ళకు కనిపించే స్వరూపం కాకుండా అందుకు వేరుగా ఉండే స్వరూపాన్ని, వేరుగా ఉండే ఉత్పత్తినీ, వాటి పుట్టుక నాశనాల్నీ తెలుసుకున్న వివేకవంతుడికి దు:ఖాలే ఉండవు. ఇంద్రియాల కంటే గొప్పది మనస్సు. మనస్సుకంటే లోతైందీ సూక్ష్మమైందీ బుద్ధి. దాని కంటే మహత్తు, దాని కంటే ఇంకా సూక్ష్మమైందీ లోతైందీ కంటికి కనిపించని ప్రకృతి. కనిపించని ప్రకృతి కంటే మించిందీ, అంతటా వ్యాపించిందీ, ఏ లక్షణాలూ లేందీ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్నిపొందిన మానవుడు ముక్తుడై జన్మ రాహిత్యాన్ని పొందుతున్నాడు. అతడి రూపం ఈ కళ్ళకి కనిపించదు. తమకి ఉన్న కళ్ళతో అతణ్ణి ఎవరూ చూడలేరు. హృదయంలో ఉండి మనస్సుని శాసిస్తున్నాడు. అతడికి గల ఆ శక్తి వల్లనే అతడు ఉన్నాడని మనం తెలుసుకోగలుగుతున్నాం. అతణ్ణి తెలుసుకున్నవాళ్ళు ముక్తిని పొందుతున్నారు.
   మనస్సుతో సహా పంచేంద్రియాలు ఆత్మలో ఎప్పుడు నిశ్చలంగా నిలిచి పోతాయో... బుద్ధి కూడా నిశ్చలంగా ఎప్పుడు నిలబడి పోతుందో... అప్పుడు ఉండే ఆ స్థితినే పరమపదం అని అంటారు. ఆ సుస్థిరమైన ఇంద్రియ నిగ్రహమే యోగం అంటారు. ఆ స్థితిలో ఉన్న యోగిని మనస్సులో కలిగే  చంచలత్వాన్ని వదిలి, పొరపాట్లు చెయ్యకుండా కాపాడుతుంది. ఎందుకంటే యోగాన్ని పొందినా దాన్ని నిలబెట్టుకోవాలి. పొరపాట్లు జరిగినప్పుడు దాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.
   మాటలు, కళ్ళు, మనస్సు ద్వారా కూడా ఆ ఆత్మ పొందడానికి సాధ్య పడేది కానే కాదు. ఆత్మ ఉంది అని ఖచ్చితంగా చెప్పగలిగే వాళ్ల  నుంచే దాన్నిపొందాలి. దాన్ని పొందడానికి ఇంతకంటే వేరే మార్గం ఏదీ ఉండదు.
   హృదయంలో దాగి ఉన్న కోరికలన్నింటినీ విసర్జించిన తరువాత మరణించిన వాడితో సమానమైన  మానవుడు అమరుడవుతాడు. శరీరం ఉండగానే బ్రహ్మప్రాప్తిని పొందుతాడు. ఇక్కడ ఈ శరీరంలో ఉన్న హృదయగ్రంధులన్నీ ఎప్పుడు ఛేదింపబడతాయో అప్పుడు మనిషి అమరుడవుతాడు. ఇంతవరకు చెప్పిన ఉపదేశం మొత్తం వేదాంతానికి సంబంధించింది.
  హృదయానికి నూటొక్క నాడులున్నాయి. వాటిలో ఒకటి మూర్ధం వైపు వ్యాపించి ఉంది. దాని ద్వారా పైకి వెళ్ళి మానవుడు అమరత్వాన్ని పొందుతాడు. ఇతర నాడులు ఇతర విధాలుగా ఉత్క్రమణానికి దారి తీస్తాయి. బొటన వ్రేలంత ఉండే అంతరాత్మ  ఎల్లప్పుడూ ప్రాణుల హృదయాల్లో నివసిస్తూ ఉంటాడు. గడ్డినుండి లోపలి పోచను వేరు చేసినట్టుగా శరీరం నుండి అంతరాత్మను వేరు చెయ్యాలి. అలా వేరు చెయ్యగలిగినవాడే పరిశుద్ధుడూ అమరుడూ అని తెలుసుకోవాలి. అవును నిజంగా అతడే అమరుడూ పరిశుద్ధుడే!!
   పైన చెప్పిన విధంగా యముడి దగ్గర జ్ఞానం, యోగం, దాన్ని పొందవలసిన విధానం మొదలైన వాటిని అన్నింటినీ సంపూర్ణంగా ఉపదేశం పొందాడు నచికేతుడు. అలా పొందడం వల్ల  పాపప్రక్షాళన జరిగి మరణాన్ని జయించి బ్రహ్మప్రాప్తిని పొందాడు. ఆత్మను ఇంత సంపూర్ణంగాను, విపులంగాను సద్గురువు ద్వారా తెలుసుకున్నవాళ్ళు ఎవరైనా కూడా నచికేతుడు పొందినట్టే బ్రహ్మప్రాప్తిని పొందుతారు.
                                                     (కఠోపనిషత్తు ఆధారంగా)
 
No comments:

Post a Comment