About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

అమరు డెవడు?

ఓం
అమరు డెవడు?
  
   ఇది అధర్వణ వేదానికి సంబంధించిన ప్రశ్నోపనిషత్తు ఆధారంగా నడిచిన కథ. ప్రాణులు ఎలా పుడుతున్నాయి, మనిషంటే ఎవరు, భగవంతుడు ఎవరు, భగవంతుడికీ మనిషికీ ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాల్ని తెలుసుకోవడం కోసం ఆరు ప్రదేశాలనుంచి ఆరుగురు శిష్యులు బయల్దేరి తమకు కలిగిన సందేహాల్ని పిప్పలాద మహర్షి ద్వారా  తీర్చుకుని జ్ఞానవంతులైన కథ.
   సుకేశుడి తండ్రి భరద్వాజుడు, సత్యకాముడి తండ్రి శిబి, సౌర్యాయణి తండ్రి సౌర్యుడు, కౌశల్యుడి తండ్రి అశ్వలాయనుడు, భార్గవుడి తండ్రి విదర్భఋషి, కబన్ధి తండ్రి కాత్యాయనుడు. ఈ ఆరుగురు తండ్రులు గొప్ప తపస్సంపన్నులు. వాళ్ళ కొడుకులు ఆరుగురు మంచి స్నేహితులు, బుద్ధిమంతులు, చెప్పగానే అర్ధం చేసుకోగలిగిన శక్తి ఉన్నవాళ్ళు. తండ్రులకి తగిన కొడుకులు. వాళ్ళ ముగ్గురికీ పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకోవాలనే కోరిక కలిగింది. ఆ కోరిక పెరిగి పెరిగి పెద్దదయింది. ఒక మంచి సమయం చూసుకుని ఆరుగురు కలిసి పరబ్రహ్మాన్ని గురించి చెప్పగల గురువుని వెతుక్కుంటూ ఆయన ద్వారా బయల్దేరారు.
   ఆ రోజుల్లో పిప్పలాదమహర్షి గొప్ప పండితుడు, జ్ఞానవంతుడు. శాస్త్రాల్లో గొప్ప జ్ఞానం కలిగి ఉండడమే కాకుండా మహాతపస్సంపన్నుడు కూడా. ప్రపంచ విషయాల్లో పూర్తిగా విరక్తి కలిగినవాడు. పిప్పలం అంటే రావి. రావిపళ్ళని తప్ప వేరే ఏవీ తినేవాడు కాదు. అవి తినే జీవించేవాడు. అందువల్లే అయనకి పిప్పలాదుడు అనే పేరు వచ్చింది.
   పూర్తిగా శాస్త్రాలన్నింటినీ తెలుసుకున్నవాడు, పరిపూర్ణమైన బ్రహ్మనిష్ఠ కలవాడు అయిన పిప్పలాద మహర్షిని గురించి ఆ స్నేహితులు ఇంతకు ముందే విన్నారు. ఆయన్ని కలుసుకుని తమ కోరిక  చెప్పలనుకున్నారు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నఆయన్ని చూడగానే తమకు పరబ్రహ్మాన్ని గురించి బోధించగలరని, తమకు కలిగిన సందేహాలన్నీ తీర్చగలరని నమ్మకం కుదిరింది.
   మంచి సమయం చూసుకుని సమిధలు, దర్భలు, పువ్వులు, పళ్ళు పట్టుకుని పిప్పలాద మహర్షి దగ్గరికి వెళ్ళారు. దేవుడి దగ్గరకుగాని, సాధువులు, సన్యాసులు, మహాత్ముల దగ్గరకుగాని, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లల దగ్గరకుగాని వట్టి చేతులతో ఎవరూ వెళ్ళకూడదు. ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలన్నది మన భారతీయ సంస్కృతి.
   పిప్పలాదమహర్షి ఒక చెట్టు నీడలో ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు. పరబ్రహ్మను గురించి తెలుసుకోవాలనే కోరికతో స్నేహితులు ఆరుగురూ మహర్షి దగ్గరికి వచ్చారు. చేతులు జోడించి వినయ విధేయతలతో నిలబడ్డారు. మహర్షి ధ్యానం పూర్తయ్యాక కళ్ళు తెరిచి ఎదురుగా నిలబడిన ఆరుగురు స్నేహితుల్ని చూశారు. ఆయన కళ్ళు తెరవగానే వాళ్ళు తమతో తెచ్చిన సమిధలు మొదలైనవి ఆయనకు సమర్పించి సాష్టాంగ నమస్కారాలు చేశారు. తమ తమ గోత్రనామాలు చెప్పుకుని నమస్కారం చేసి చేతులు కట్టుకుని నిలబడ్డారు. మహర్షి కొంచెంసేపు మాట్లాకుండా వాళ్ళవైపు చూశారు. తరువాత వాళ్ళని కూర్చోమని చెప్పి వచ్చిన పని ఏమిటని అడిగారు.
   సుకేశుడు, స్నేహితులు ఈ విధంగా చెప్పారు. మహాత్మా! మేము పరబ్రహ్మ స్వరూపం గురించి తెలుసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నాం. బ్రహ్మజ్ఞానం పొందాలనే కోరికతో మీ దగ్గరికి వచ్చాం. మాకు కలిగిన సందేహాలన్నిటినీ మీరు తీరుస్తారని ఆశతోఉన్నాం. మమ్మల్ని అనుగ్రహించి మాకు బ్రహ్మజ్ఞానాన్ని బోధించండి! అని అడిగారు.
   వాళ్ళ మాటలు విని పిప్పలాదమహర్షి ఆ స్నేహితులతో కుమారులారా! మీరు ఇంద్రియ నిగ్రహంతో బ్రహ్మచర్య వ్రతదీక్షని పొంది, తపస్సు చేసుకుంటూ, గురువుకి సేవ చేస్తూ ఒక సంవత్సరం ఇక్కడే ఉండండి. మీ ప్రవర్తన ఎలా ఉందో, మీ నియమ నిష్ఠలు ఎలా ఉన్నాయో చూసి నాకు తృప్తిగా అనిపిస్తే మీరు కోరినట్టే బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తాను.  మీ సందేహాలకి నాకు తెలిసిన విధంగా సమాధానాలు కూడా ఇస్తానుఅన్నారు.
   మహర్షి చెప్పిన మాటల్ని తమ తల్లితండ్రులకి తెలియచేసి మహర్షి దగ్గరే ఉండిపోయారు. ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యవ్రతం, తపస్సులతో ఒక సంవత్సర కాలాన్ని పూర్తి చేశారు. మనస్ఫుర్తిగా గురువుగారికి సేవ కూడా చేశారు. ఒకరోజు పిప్పలాద మహర్షి వాళ్ళని పిలిచి కుమారులారా! మీరు ఇప్పుడు పరబ్రహ్మాన్ని గురించి తెలుసుకునేందుకు అర్హత పొందారు. మీ సందేహాలేమిటో అడగండి. నాకు తెలిసినంత వరకు తెలియ చేస్తాను అన్నారు.
   కంటికి కనిపించేది, ఈ లోకానికి సంబంధించింది అయిన ప్రశ్నని మొదటి ప్రశ్నగా మొదలు పెట్టారు. ఆరుగురిలో ఒకడైన కబన్ధి లేచి ఓ పూజ్యుడా ! ఈ చరచర ప్రపంచంలో ఉన్న ప్రాణులన్నీ దేనివల్ల పుడుతున్నాయి అనే సందేహం నన్ను చాలాకాలంగా పీడిస్తోంది . దయతలచి నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చండి అని అడిగాడు.
   పిప్పలాదమహర్షి అతడు అడిగిన సందేహాన్ని విని కుమారా! ఈ చరాచర ప్రపంచంలో ఉండే ప్రాణికోటిని అంతటినీ సృష్టించేవాడు ప్రజాపతి. అతడికి కలిగిన సంకల్పం వల్లే ఈ సృష్టి అంతా జరిగింది. తన సంకల్పం నెరవేరడం కోసం అతడు ఏకాగ్రతతో తపస్సు చేశాడు. సృష్టి చెయ్యడంలో తనకు సహాయ పడడం కోసం అన్నాన్ని, ప్రాణాన్ని సృష్టించాడు. ఇక్కడ ప్రాణం అంటే అగ్నిఅని అర్ధం. ఈ రెండింటిలో ఉండే శక్తి యొక్క సహాయంతోనే మొత్తం సృష్టి జరిగింది.
   బ్రహ్మ సృష్టించిన అన్నం, అగ్ని అనే రెండింటిలో అన్నాన్ని బక్షించే అగ్ని సూర్యుడు. అన్నం చంద్రుడు. ప్రజాపతి నిర్మించిన ఈ ప్రపంచంలో స్థూల రూపంతోను, సూక్ష్మ రూపంతోను ఉండే పంచ భూతాల్లో భూమి, నీరు, నిప్పులు స్థూలరూపం కలిగి ఉన్నాయి. ఆకాశం, వాయువుల యొక్క రూపం సూక్ష్మరూపం.
   ప్రాణమే సూర్యుడుగా ఉదయించి, తనకు గల గొప్ప ప్రకాశంతో అన్ని దిక్కుల్లోను వ్యాపించి, ఆ ప్రదేశాల్లో ఉండే ప్రాణాలన్నింటినీ తన కిరణాలతో తన స్వరూపాలుగా చేస్తున్నాడు. అంటే, సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించి తన బంగారు రంగు కిరణాల్ని అన్ని వైపులా ప్రసరించి అన్ని దిక్కులకీ ప్రాణాన్ని అందిస్తున్నాడు. ప్రాణం అంటే శక్తి. అందరికీ శక్తినిచ్చేవాడు సూర్యుడు. ఇతడే విశ్వరూపం కలిగినవాడు అందరికీ ఆత్మగా ఉన్నవాడు. అని చెప్పారు మహర్షి.
   ఆయన చెప్పింది విని గురుదేవా ! అంతటా వ్యాపించిన సూర్యుడి స్వరూపాన్ని కూడా తెలుసు కోవాలని ఉంది. దాన్ని గురించి కూడా వివరించండి అని అడిగాడు కబన్ధి. 
   కబన్ధి సందేహానికి పిప్పలాదమహర్షి  ఈ విధంగా వివరిస్తున్నారు. సూర్యుడు విశ్వమే రూపంగా లెక్క లేనన్ని కిరణాలతో ఉన్నాడు. అందువల్లే ఈ విశాలమైన ప్రపంచం మొత్తంలో ప్రకాశవంతమైన అతడి కిరణాలు వ్యాపించి ఉన్నాయి. అతడు గొప్ప జ్ఞానవంతుడు, అన్ని ప్రాణులకి ఆశ్రయమిచ్చేవాడు, ఒకే ఒక జ్యోతిర్మయుడు. జగత్తు మొత్తానికి అతడే కన్ను. ప్రాణకోటికి ప్రాణమైన అగ్ని అతడి ప్రకాశంలో ఒక చిన్న కణం మాత్రమే.
   మహర్షి చెప్పింది విని కబన్ధి గురువర్యా! ప్రాణులు ఏ విధంగా సూర్యుణ్ణి పొందుతున్నాయి? అని అడిగాడు.
   అ ప్రశ్నకి పిప్పలాదుడు సూర్యుడి వల్ల ఏర్పడిన సంవత్సరమే ప్రజాపతి. ఆ ప్రజాపతికి రెండు మార్గాలున్నాయి. అవే ఉత్తరాయణం, దక్షిణాయణం. ఈ ప్రపంచంలో పుట్టి తను జీవించడానికి ధనాన్ని సంపాదించడం, భార్యబిడ్డల పోషణ, భోగాలు అనుభవించడం వంటి కోరికలు తీర్చుకోవడం కోసం యజ్ఞం చెయ్యడం వంటి వైదిక కర్మలు చెయ్యడం, దేవుణ్ణి పూజించడం, వైశ్వదేవం వంటివి చెయ్యడం, చెరువులు, బావులు వంటివి నిర్మించడం, అన్నదానం చెయ్యడం మొదలైన కర్మలు చేసే వాళ్ళు దక్షిణాయణ మార్గం ద్వారా చంద్రలోకాన్ని పొందుతారు. వాళ్ళు చేసిన పుణ్యం మొత్తం పూర్తవగానే మళ్ళీ పుడుతూ ఉంటారు. ఈ మార్గాన్ని మృత్యుమార్గం, పితృయాన అని అంటారు. ఈ మార్గంలో ప్రయాణించిన వాళ్ళు పుడుతూ చస్తూ ఉంటారు.
   ఈ విధంగా కాకుండా బ్రహ్మచర్యాన్ని అవలంబించి, తపస్సుచేసి, శ్రద్ధ ఆత్మ జ్ఞానాల ద్వారా ఆత్మ యొక్క స్వరూపాన్ని, ప్రాణ స్వరూపుడైన సూర్యుడి అసలైన స్వరూపాన్ని తెలుసుకున్నవాళ్ళు ఉత్తరాయణ మార్గం ద్వారా సూర్యలోకాన్ని పొందుతారు. సూర్యలోకంలో భయం, నాశనం ఉండదు. ఒకసారి సూర్యలోకాన్ని చేరిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది ఉండదు. సూర్యలోకాన్ని పొందడం చాలా గొప్ప విషయం. జ్ఞానం లేనివాళ్ళు దీన్ని పొందలేరు.
   నాయనా ! ప్రపంచం మొత్తం సూర్యుడిలోనే ఉండి రథ చక్రాలు తిరిగినట్టు ఆగకుండా ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. స్థూలరూపం, సూక్ష్మరూపం అనే రెండు రూపాలతో సృష్టి మొత్తానికి అధారమైన సూర్యరూప బ్రహ్మం ఈ చరాచర సృష్టికి ఒకే ఒక కారణంగా ఉన్నాడు. బ్రహ్మచారీ! అన్నమే ప్రజాపతి. అన్నం నుంచే రేతస్సు కలుగుతోంది. ఆ రేతస్సు నుంచే జనులు పుడుతున్నారు. ఎవరిలో తపస్సూ, బ్రహ్మచర్యం  ఉన్నాయో, ఎవరు సత్య ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు మహర్షి. 
   కబన్ధికి మహర్షి చెప్పింది విన్నాక తనకు కలిగిన సందేహాలన్నీ తీరాయన్న తృప్తితో ఆనందంతో పరవశించాడు. కృతజ్ఞతతో గురువుగారి పాదాలకి నమస్కారంచేసి పాదధూళిని తలమీద ధరించాడు.
   జరిగిన సంభాషణ మొత్తం విన్నాక ఆరుగురు స్నేహితుల్లో ఒకడైన విదర్భఋషి కొడుకు భార్గవుడు మహర్షిని వినయంగా అడిగాడు గురువర్యా! ఒక మనిషి శరీరాన్ని ఎంతమంది దేవతలు భరిస్తున్నారు? వారిలో ఈ శరీరానికి ప్రకాశాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళల్లో గొప్పవాళ్ళు ఎవరు? దయచేసి నా సందేహాన్ని తీర్చండి అని అడిగాడు.
   పిప్పలాదమహర్షి భార్గవుణ్ణి ప్రేమగా చూస్తూ భార్గవా! ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి ఈ అయిదూ మహాభూతాలు. నోరు, చెయ్యి, కాలు మొదలయిన అయిదు కర్మేంద్రియాలు. చర్మం, కన్ను, చెవి, నాలుక, ముక్కు మొదలయిన అయిదు జ్జ్ఞానేంద్రియాలు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనబడే అంత:కరణలో ఉండే ఈ నాలుగూ కలిసి పందొమ్మిది మంది దేవతలు శరీరాన్ని ధరిస్తున్నారు. వీళ్ళందరి పరస్పర సహకారంతో శరీరం ప్రకాశిస్తోంది.
   వీళ్ళల్లో ఎవరికివాళ్ళే శరీరాన్ని ధరిస్తున్నాం కనుక తామే గొప్ప అని అహంకారంతో చెప్పుకోవడం మొదలెట్టారు. వీళ్ళ అహంకారాన్ని చూసిన గొప్పదైన ప్రాణం వాళ్ళతోమీరే శరీరాన్ని ధరిస్తున్నట్టు గొప్పలు చెప్పుకోకండి. నిజం చెప్పాలంటే నేనే నా స్వరూపాన్ని ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు విధాలుగా ఈ శరీరంలో ఉంచి దీన్ని నేనే నడిపిస్తున్నాను అంది.
   ప్రాణం చెప్పిన మాటలు మిగిలినవి అంగీకరించలేదు. వాళ్ళకి ఆ విషయం తెలియ చెయ్యడం కోసం ప్రాణం శరీరాన్ని వదిలి పైకి పోతున్నట్టు నటించింది. అంతే! మిగిలిన వాటికి కూడా ఉన్నవి ఉన్నట్టే పైకి  
ఎగిరిపోతున్నట్టు అనిపించింది. రాణి ఈగ తేనెపట్టుని వదిలి వెళ్ళిపోయినప్పుడు మిగిలిన ఈగలన్నీ కూడా ఆ తేనెపట్టును వదిలి రాణి ఈగని అనుసరించి వెళ్ళిపోతాయి. అదే విధంగా శరీరం నుంచి ప్రాణం పైకి లేవగానే మిగిలిన శక్తులన్నీ కూడా శరీరాన్ని విడిచి ప్రాణం వెంట వెళ్ళిపోతాయి. ప్రాణం మళ్ళీ శరీరంలోకి   వచ్చి చేరగానే మిగిలినవన్నీ కూడా చైతన్యాన్ని నింపుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయి. శరీరంలో మళ్ళీ చైతన్యం కలుగుతుంది.
   ప్రాణం యొక్క విలువ తెలుసుకున్న పందొమ్మిది మంది దేవతలూ ప్రాణానికి నమస్కరించి ఓ ప్రాణమా! నువ్వే అగ్నివై సంతాపాన్ని, సూర్యుడివై  ప్రకాశాన్ని, వరుణుడివై వర్షాన్ని, ఇంద్రుడవై ప్రజల్ని పాలిస్తున్నావు. భూమివై భారాన్ని మోస్తున్నావు. చంద్రుడివై స్థూలరూపంగాను, సూక్ష్మ రూపంగాను ఉన్నావు. దేవతల స్థిరత్వానికి అవసరమయిన అమృతాన్నిఅందిస్తున్నావు. నువ్వే నాలుగు వేద మంత్రాలు, నువ్వే యజ్ఞం, కర్మ చెయ్యడంలో అధికారివి.
   ఓ ప్రాణమా! నువ్వే ప్రజాపతివి, అందరి హృదయంలోను, ఉదరంలోను తిరుగుతున్నావు. నీకోసమే ప్రజలు అన్నం మొదలైన వాటిని అందిస్తున్నారు. నువ్వు దేవతలకి హవిస్సుని, పితృదేవతలకి స్వధారూపంలో అన్నాన్ని అందిస్తున్నావు.  పరాక్రమంలో రుద్రుడివి. నువ్వు ఎప్పుడు వర్షాన్ని కురిపిస్తావో అప్పుడు ప్రజలు అన్నం దొరుకుతుందని ఆనందంతో ఉంటున్నారు.
    ఓ ప్రాణమా! నువ్వు స్వభావసిద్ధంగానే పరిశుద్ధుడివి. నీకు వేరే  సంస్కారం ఉందా లేదా అని ఆలోచనే అవసరం లేదు. నువ్వు మాకు తండ్రివి. ప్రపంచమంతా ప్రాణమైన నీ అధీనంలోనే నిలిచి ఉంది. కనుక తల్లి పిల్లల్ని రక్షిస్తున్నట్టు  నువ్వు కూడా మమ్మల్ని రక్షించు. మాకు సంపదని, ప్రతిభని, అపారమైన జ్ఞానాన్ని ప్రసాదించు! అని స్తోత్రం చేశారు.
    పిప్పలాద మహర్షి భార్గవుడి సందేహాన్ని తీరుస్తూప్రాణమే అన్నింటికంటే గొప్పది అని చెప్పారు.  
   తరువాత అశ్వలాయనుడి కొడుకు కౌసల్యుడు తన సందేహాన్ని అడిగాడు. ఓ పూజ్యుడా ! ప్రాణం దేనినుంచి పుడుతోంది? ఈ శరీరంలోకి ఎలా ప్రవేశిస్తోంది. ఏ స్వరూపంతో ఉంటోంది. ఏం చెయ్యాలని ఈ శరీరం విడిచి వెళ్ళిపోతోంది? బయటి ప్రపంచాన్ని ఎలా భరిస్తోంది? ఆంతరంగికంగా ఎలా ఉంటోంది? అనే విషయాల గురించి తెలియ పరచమని ప్రార్ధిస్తున్నాను! అన్నాడు.
   అతడి సందేహాన్ని విని పిప్పలాద మహర్షి కౌసల్యా! నువ్వు చాలా కఠినమైన ప్రశ్నలు వేస్తున్నావు. అయినా భగవంతుణ్ణి తెలుసుకోవాలని కోరుకుంటున్నావు కనుక నీకు అర్ధమయ్యేలా చెప్తాను విను. ఈ ప్రాణం పరమాత్మ నుంచి పుడుతోంది. కాళ్ళూ చేతులూ ఉన్న పురుషుడిలో ఉన్న ప్రతిబింబంలా ఇది ఒక పరబ్రహ్మంలో ఉంచబడింది. ఈ ప్రాణం మనస్సు చేసే పనుల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తోంది. మహారాజు తన కింద కొంతమంది అధికారుల్ని నియమించుకుని వాళ్ళద్వారా తన పనిని చేయించుకుంటున్నట్టు ఈ ప్రాణం కూడా ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు వాయువుల్ని ఉపయోగించుకుని తన పనులు జరిగేటట్టు చూసుకుంటోంది.
   వాటిలో అపానం పాయూపస్థల్లోను, ప్రాణాన్ని ముక్కురంధ్రాల ద్వారా కన్ను, చెవి, నోరుల్లోను, సమానాన్ని ప్రాణ అపానాల మధ్య నాభిలోను ఉంచింది. ఈ సమానమే మనం తిన్న అన్నాన్ని, తగిన నీటిని సమనంగా పంపిణీ చేస్తోంది. ప్రాణం నుంచి ఏడుజ్వాలలు అవుతున్నాయి.
   కౌసల్యా! అత్మ హృదయంలో ఉంది. హృదయం నుంచి నూటొక్క నాడులు బయలుదేరుతున్నాయి. ఒక్కొక్క నాడికి వంద చొప్పున శాఖలుగా నాడులు ఉన్నాయి. ఒక్కొక్క శాఖకి డబ్భై రెండు వేల ఉపశాఖా నాడులు ఉన్నాయి. వ్యానం అనే వాయువు ఈ శాఖలన్నింటిలోను సంచరిస్తూ ఉంటుంది.అన్ని నాడుల్లోకి ప్రధానమైన సుషుమ్నానాడి మార్గంలో ఉదాన వాయువు సంచరిస్తూ, పుణ్యం చేసినవాళ్ళని పుణ్య లోకంలోను, పాపం చేసిన వాళ్ళని నరక లోకంలోను, పుణ్యపాపాలను బట్టి మనుష్య లోకంలోకీ చేరుస్తుంది. 
   ఈ ప్రాణానికి బయట అధిదేవతా స్వరూపుడైన సూర్యుడుగా ఉదయించి లోపల ఉన్న నేత్ర గోళంలో నేత్రం అనే ఇంద్రియానికి తనకున్న ప్రకాశంతో చైతన్యాన్ని ఇచ్చి అన్నిటినీ చూడగలిగే శక్తిని ఇస్తోంది. శరీరంలో భూదేవత అపానవాయువుని, ఆకాశం సమాన వాయువుని, వాయువు వ్యాన వాయువుని, శారీరమంతటా ప్రసరించేట్టు చేస్తున్నాయి. తేజస్సు ఉదాన వాయువుని ఇవ్వడం వల్ల ఉదానవాయువు పోగానే శరీరంలో ఉండే తేజస్సు కూడా పోతోంది. అంటే శరీరం చైతన్యాన్ని కోల్పోయి ప్రేతంగా పిలవ బడుతోంది. ఈ తేజస్సు మనస్సులో ప్రవేశించి ఇంద్రియాలతో కలిసి మళ్ళీ పుడుతోంది. మరణించే సమయంలో ఏ కోరికతో ప్రాణాన్ని విడుస్తున్నాడో దానికి తగిన లోకాన్ని పొందుతున్నాడు.
   కౌసల్యా! ఈ విధంగా ప్రాణం గురించి తెలుసుకున్నవాడు అమృతత్త్వాన్ని పొందుతున్నాడు. వివేకవంతుడు ప్రాణం ఎలా పుడుతుందో... ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానాల్ని, సూర్యుడు మొదలైన వాళ్ళని, శరీరంలో ఉండే ఇంద్రియాల యొక్క తేడాల్ని తెలుసుకుని మోక్షాన్ని పొందుతున్నాడు అని చెప్పాడు.
   కౌసల్యుడు తన సందేహం తీరాక సౌర్యుడి కొడుకు సౌర్యాయణి పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి ఆచార్యా! ఈ ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతడిలో నిద్రపోతున్న ఇంద్రియాలు ఏవి? అతడు మేల్కొని ఉన్నప్పుడు మేల్కొని ఉండే ఇంద్రియాలు ఏవి? కలలు కంటున్న ఇంద్రియాలు ఏవి? నిద్రలో సుఖాన్ని అనుభవిస్తున్నది ఎవరు? నిద్రపోతున్న సమయంలో ఇంద్రియాలన్నీఎవరిలో కలిసి పోతున్నాయి? అని అడిగాడు.
   పిప్పలాద మహర్షి అతడివైపు వాత్సల్యంతో చూసి సౌర్యాయణీ! సూర్యుడు అస్తమించే సమయంలో సూర్యుడి కిరణాలు అన్నీ ఒక్కటిగా కలిసి సూర్యమండలంలో కలిసిపోతున్నాయి. సూర్యోదయ సమయంలో ఒక్కచోటికి చేరిన సూర్య కిరణాలు తిరిగి అన్నివైపులకి వ్యాపిస్తున్నాయి. అలాగే మనిషిలో ఉండే పది ఇంద్రియాలూ అతడు నిద్రపోయే సమయంలో ప్రధాన ఇంద్రియమైన మనస్సులో కలిసి పోతున్నాయి. ఆ సమయంలో మనిషి వినడు, మాట్లాడడు, చూడడు, కదలడు,నడవడు, వాసన చూడడు రుచి చూడడు, ముట్టుకోడు, దేన్నీ తీసుకోడు, దేన్నీ వదలడు, ఆనందాన్ని పొందడు, కాబట్టే మనిషి నిద్రపోతున్నాడు అంటారు.
   మేల్కొన్న తరువాత మనిషి యొక్క పది ఇంద్రియాలు మనస్సులోంచి బయటకు వచ్చి వాటి వాటి పనులు చెయ్యడం ప్రారంభిస్తున్నాయి. అంటే అస్తమించిన సూర్యుడిలో సూర్యకిరణాలు కలిసిపోతున్నాయి. ఉదయించిన సూర్యుడి నుంచి ఆ కిరణాలన్నీమళ్ళీ బయటికి వ్యాపించి లోకాల్ని ప్రకాశింప చేస్తున్నాయి. అదే విధంగా నిద్రపోతున్నప్పుడు మనిషి యొక్క ఇంద్రియాలు పదీ మనిషి మనస్సులో కలిసి పోయి అతడు నిద్రలేచిన తరువాత మళ్ళీ వాటి పనులు అవి చేసుకుంటున్నాయి.
   సౌర్యాయణీ! తొమ్మిది ద్వారాలు కలిగిన శరీరం అనబడే ఈ పట్టణంలో నిద్రపోతున్న సమయంలో ప్రాణం అని చెప్పడే అగ్నులు మాత్రమే మేలుకుని ఉంటాయి. శరీరంలో ఉండే అపానవాయువే గార్హపత్యాగ్ని.  వ్యానవాయువు అన్వాహార్యపచనాగ్ని. గార్హ్యపత్యాగ్ని నుంచి పొందినదే ఆహవనీయాగ్ని. దీన్నే ప్రాణం అంటారు. మనిషి నిద్రపోయేప్పుడు ఇంద్రియాలు కూడా విశ్రాంతి తీసుకుంటాయి. కాని ప్రాణశక్తులు మాత్రం విశ్రాంతి లేకుండా పనిచేస్తూనే ఉంటాయి.
   వ్యానవాయువే దక్షిణాగ్ని. ఉచ్ఛ్వాశ నిశ్వాసాలు అనబడే రెండు ఆహుతుల్ని సమానంగా జరిపిస్తూ ఉన్న ప్రాణశక్తిని సమానవాయువు అంటారు. దానికి మనస్సే యజమాని. యాగంచేస్తున్న సమయంలో ఏ  కోరికని కోరతామో అదే ఉదానం అంటారు. ఈ వాయువే యజమానిని ప్రతిరోజూ బ్రహ్మం దగ్గరికి చేరుస్తుంది. స్వర్గలోకం చేరాలనే కోరికతో యాగం చేసినవాణ్ణి మరణించిన తరువాత స్వర్గలోకానికి చేర్చినట్టు, ఏ యాగమూ చెయ్యకుండానే సుషుప్తి కాలంలో బ్రహ్మలోకం పొందడానికి ఉదానవాయువు సహకరిస్తోంది.
   స్వప్నావస్థలో ఇంద్రియాలన్నీ మనస్సులో చేరి నిద్రపోతుంటాయి. జాగ్రదావస్థలో తను చూసినదాన్నే మళ్ళీ చూస్తాడు, విన్నవే మళ్ళీ వింటాడు, వివిధ ప్రదేశాల్లోనూ, వివిధ దిక్కుల్లోనూ తను అనుభవించిన విషయాల్ని మళ్ళీ మళ్ళీ అనుభవిస్తాడు. జగ్రదావస్థలో చూసినవీ-చూడనివీ, విన్నవీ-విననివీ, అనుభవించినవీ-అనుభవించనివీ, నిజమైనవీ-నిజం కానివీ అన్నింటినీ స్వప్నావస్థలో అనుభవిస్తాడు.
   ఎప్పుడయితే చిద్రూప బ్రహ్మం యొక్క తేజస్సుతో మనస్సు శరీరమంతా వ్యాపిస్తుందో అదే సుషుప్తి సమయం. కనుక, ఆ సమయంలో కలల్ని చూడడం లేదు. కనుకనే గాఢమైన సుషుప్తి సమయంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఆహారం కోసం పగలు బయటికి వెళ్ళిన పక్షులు సాయంత్రానికి చెట్ల మీద కట్టుకున్న తమ గూళ్ళకి ఎలా చేరుకుంటాయో అదే విధంగా... భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనబడే పంచభూతాలతో చేయబడిన స్థూల శరీరానికి సంబంధించిన ఇంద్రియాలు, వాటి విషయాలు; మనస్సు , బుద్ధి, చిత్తం, అహంకారం వాటి పనులు; తేజస్సు దానియొక్క ప్రకాశం; ప్రాణం, దాని పని అయిన శరీరాన్ని ధరించడం మొదలైనవన్నీ ఆత్మను చేరుతున్నాయి.
   ఓ సౌర్యాయణీ! చూడడం, తాకడం, గుర్తుకు తెచ్చుకోవడం, వినడం, వాసన చూడడం, రుచి చూడడం, ఆలోచించడం, గ్రహించడం, వీటన్నింటికీ కర్త అయి దేహానికి సంబంధించిన ఇంద్రియాలన్నింటి గురించీ తెలుసుకునే జీవుడే పురుషుడు అని పిలవబడుతున్నాడు. అజ్ఞానం, శరీరం, గుణాలు, నాశనం లేనివాడుగా, పరిశుద్ధమైనవాడుగా పరబ్రహ్మాన్ని తెలుసుకున్నవాడే నాశనం లేని పరబ్రహ్మాన్ని పొందుతున్నాడు. అటువంటి వాడే అన్నీ తెలిసినవాడు అని వివరించాడు పిప్పలాద మహర్షి.
   తరువాత శిబి కొడుకు సత్యకాముడు లేచి పిప్పలాద మహర్షి దగ్గరికి వచ్చి పూజ్యుడవైన మహర్షీ! జీవితం చివరి వరకూ ఓంకార మంత్రాన్ని ధ్యానం చేసిన మానవుడు ఏ లోకాల్నిపొందుతున్నాడో దయచేసి తెలియచెయ్యండి! అని అడిగాడు.
   సత్యకాముడితో పిప్పలాదమహర్షి సత్యకామా! ఓం అనేది మూడక్షరాల కలయిక. ఈ ఓంకార మంత్రం ఉన్నతస్థితి, సాధారణస్థితి అని రెండు విధాలుగా ఉంటుంది. ఇది ప్రరబ్రహ్మ స్వరూపం. ఓంకారాన్ని ఏ రూపంలో అయితే సాధకుడు ఉపాసిస్తాడో దాని ప్రకారం ఆ రెండు స్థితుల్లో ఒక స్థితిని పొందుతాడు. అది ఏ విధంగా జరుగుతుందో చెప్తాను విను.
   ఓంకారన్ని ఉపాసించేవాడు ఓంకారంలో ఉన్న మూడు మాత్రల్లో మొదటిదైన అకార మాత్రను ఉపాసిస్తే జ్ఞానాన్ని పొందుతాడు. మరణించిన తరువాత ఋగ్వేద దేవతలు అతణ్ణి మానవలోకానికి తీసుకుని వస్తారు. అంటే, ఉత్తమమైన మానవజన్మని పొందుతాడు. తపస్సు, బ్రహ్మచర్యం, భగవంతుని యందు అమితమైన విశ్వాసం వంటి వాటిని అలవరుచుకుని  మోక్షాన్ని పొందుతాడు.
   రెండవ మాత్ర అయిన ఉకారమాత్రని ఉపాసిస్తే మనస్సుతో తదాత్మ్యం చెందుతాడు. మరణించిన తరువాత యజుర్వేద దేవతలు అతణ్ణి చంద్రలోకానికి తీసుకుని వెడతారు. అక్కడ సుఖాల్ని అనుభవించిన తరువాత తిరిగి భూలోకంలో జన్మిస్తాడు. అకార ఉకార మకారాలు అనబడే మూడు మాత్రలని ఏకం చేసి ఓంకారాన్నిఉపాసిస్తూ, గొప్పవాడైన భగవంతుణ్ణి కూడా ధ్యానించినవాడు తేజోవంతుడైన సూర్యుడితో ఏకమవుతాడు. పాము కుబుసం పాము నుంచి ఎలా విడిపోతుందో అదే విధంగా అతడు చేసుకున్న పాపాలు అతణ్ణి విడిచి పోతాయి. మరణించిన తరువాత అతణ్ణి సామవేద దేవతలు బ్రహ్మలోకానికి తీసుకుని వెడతారు. ఈ విధంగా బ్రహ్మ లోకాన్ని పొందినవాడు అన్ని ప్రాణుల్లోను నివసిస్తూ, అందరితో పూజింపబడే పరబ్రహ్మను అక్కడ చూస్తాడు.  
   సత్యకామా!ఓంకారంయొక్క అకార, ఉకార, మకారాలు అనబడే మూడు మాత్రలు ఎంత ఉపాసించినా మరణం నుంచి తప్పించలేవు. ఒకదాన్ని మాత్రమే తీసుకుని ఉపాసిస్తే ఉపయోగం ఏదీ ఉండదు. మళ్ళీ మళ్ళీ జన్మలు పొందాల్సి వస్తుంది. ఈ మాత్రలు మూడింటినీ ఒకదానితో మరొకదాన్ని కలిపి వాటిని విడదీయకుండా ధ్యానం చేస్తూ పరమాత్మను కూడా కలిపి ధ్యానం చేస్తే అమరుడౌతాడు. ఓంకారమాత్ర యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న సాధకుడు జాగ్రత్, స్వప్న, సుషుప్త వ్యవస్థల్లో కూడా ఏమాత్రమూ చలించడు.
   నాయనా! ఓంకారాన్ని అకారమాత్రతో ఉపాసన చేసినవాణ్ణీ ఋగ్వేద దేవత మానవలోకానికి చేరుస్తుంది. ఉకారమాత్ర ఉపాసన చేసినవాణ్ణి యజుర్వేదానికి సంబంధించిన దేవత చంద్రలోకానికి చేరుస్తుంది. మకార మాత్రని ఉపాసన చేసినవాణ్ణి సామవేద దేవత బ్రహ్మలోకానికి చేరుస్తుంది. మూడు మాత్రలు కలిసిన ఒంకారమైన ప్రణవ స్వరూపాన్ని తెలుసుకుని ఉపాసన చేసిన జ్ఞానవంతుడు అన్ని అవస్థల్లోను ప్రశాంతతని పొందుతున్నాడు. ముసలితనం, భయం లేనిది, శాశ్వతమైంది, సత్యమైంది,చావు పుట్టుకలు లేనిది అయిన పరబ్రహ్మను చేరుతున్నాడు.
   అంటే, అకార, ఉకార, మకార మాత్రల్ని విడి విడిగా ఉపాసన చెయ్యడం వల్ల అనుకున్న ఫలితాన్ని, గొప్ప ఫలితాన్ని పొందలేరు. పూజలు, ప్రార్ధనలు, భజనలు వంటివాటి ఫలితం అకార మాత్ర ఉపాసన వల్ల కలుగుతుంది. యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు వంటి వాటి వల్ల కలిగే ఫలితం ఉకార మాత్ర ఉపాసన వల్ల కలుగుతుంది. మకార మాత్రను ఉపాసించడం వల్ల జ్ఞానమార్గం దొరుకుతుంది. మూడుమాత్రల్ని కలిపిన ఓంకారాన్ని ఉపాసన చెయ్యడం వల్ల చావు పుట్టుకలు లేని జన్మరాహిత్యం కలుగుతుంది అని వివరించి అర్ధమయిందిగా అని సత్యకాముణ్ణి అడిగారు మహర్షి. తన సందేహం తీరిందని వినయంగా చెప్పాడు సత్యకాముడు.
   తరువాత భరద్వాజుడి కొడుకు సుకేశుడు పిప్పలాదమహర్షికి నమస్కరించి ఆచార్యా! పదహారు కళలు ఉన్న పురుషుడు నీకు తెలుసా  అని కోశలదేపు యువరాజు హిరణ్యనాభుడు నన్ను అడిగాడు. అందుకు నేను నాకు తెలియదు. తెలిస్తే నీకు చెప్పకుండా ఉండను కదా. అబద్ధం మాట్లాడేవాడు పూర్తిగా నాశనాన్ని పొందుతాడు. అబద్ధం చెప్పగల సామర్ధ్యం నాకు లేదు అన్నాను. నేను అలా చెప్పగానే యువరాజు మాట్లాడకుండ తన రథం ఎక్కి వెళ్ళిపోయాడు. నాకు కూడా ఆ సందేహం అలాగే ఉండి పోయింది. పదహారు కళలున్న పురుషుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియచెయ్యండి అని వినయంగా ఆడిగాడు.
   పిప్పలాదమహర్షి భరద్వాజా! నువ్వు చెప్పిన ఆ పురుషుడు ఆత్మ. ఈ శరీరం లోపలే ఆత్మ ఉంది. పదహారు కళలు దాన్నుంచే ఉద్భవించాయి. ఆ ఆత్మే హిరణ్యగర్భుడు. శరీరంలోంచి ఎవరు బయటకి వెడుతుంటే నేను బయటకి వెళ్ళిపోయినవాడిగా చెప్పబడుతున్నాను...శరీరంలో ఎవరు ఉండడం వల్ల నేను శరీరంలోనే ఉంటున్నాను అని ఆలోచించింది ఆత్మ.
   వ్యక్తి మరణించాడు అని ఎలా నిర్ణయిస్తారు? ఇంద్రియలుగాని, మనస్సుగాని పనిచెయ్యకపోతే దాన్ని మరణం అని అనరు. ఎప్పుడయితే మనిషిలోంచి ప్రాణం బయటకి పోతుందో అప్పుడే మనిషి మరణించాడు అని అంటారు. ఆ హిరణ్యగర్భుడే ప్రాణం, శ్రద్ధ,  ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి, పది ఇంద్రియాలు, మనస్సు, అన్నం, బలం, తపస్సు, వేదాలు, కర్మ, కర్మఫలాలు అనబడే స్వర్గలోకాలు, ప్రాణుల నామాలు అనే పదహారు కళల్ని సృష్టించాడు. సముద్రంనుంచి పుట్టిన నదులు గంగ, గోదావరి వంటి పేర్లతో ప్రవహించి తిరిగి సముద్రంలో కలిసిపోతున్నాయి. తరువాత అవి తమ పేర్లను పోగొట్టుకుని సముద్రంగానే పిలవబడుతున్నాయి. అదే విధంగా పరమాత్మ నుండి పుట్టిన పదహారు కళలూ పరమాత్మలోనే లీనమయ్యి పరమాత్మగానే పిలవబడుతున్నాయి.  పదహారు కళలతో ఉద్భవించిన వ్యక్తి మరణిస్తున్నాడు. అంటే ఉద్భవించే వాటికే మరణం ఉంటుంది. అవయవాలు లేని ఆత్మ మరణం లేకుండా ఎప్పటిలాగే విరాజిల్లుతుంది. ఆంటే ఆత్మానుభూతి ఆత్మకే కలుగుతుంది కాని వ్యక్తికికాదు.
  రథచక్రం ఇరుసులో ఆకులు ఎలా పెట్టబడి ఉంటాయో అదే విధంగా ఆత్మలో పదహారు కళలు నిక్షిప్తమై ఉంటాయి. అటువంటి ఆత్మస్వరూపుడైన పురుషుణ్ణి తెలుసుకుంటే ఏ వ్యక్తకీ మరణం గురించి భయం ఉండదు. దాని వల్ల జన్మరాహిత్యాన్ని పొందవచ్చు. అన్నింటికంటే ఉత్తమమైన ఆత్మ గురించి నాకు తెలిసినదాన్ని మీకు మొత్తం తెలియచేశాను. దీనికంటే మించింది ఏదీ లేనేలేదు అని పిప్పలాద మహర్షి శిష్యులతో చెప్పారు.
   సుకేశుడు మొదలైన ఆరుగురు శిష్యులు పిప్పలాద మహర్షి చెప్పినదాన్ని శ్రద్ధగా విని ఆయనతో మమ్మల్ని అవిద్యనుండి తప్పించి మోక్షమార్గంలో నడిపిస్తున్న మీరే మాకు తండ్రి. ఓ మహాపురుషా! తండ్రీ! మీకు మా నమస్కారం! తండ్రీ మీకు నమస్కారం! అని చెప్పి ఆయన అనుమతి తీసుకుని తమ తమ నివాసాలకు వెళ్ళిపోయారు.
                                                        (ప్రశ్నోపనిషత్తు ఆధారంగా )

 
  



No comments:

Post a Comment