About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

తల్లి కృష్ణమ్మకు పుష్కర వందనం!

తల్లి కృష్ణమ్మకు పుష్కర వందనం!

కర్మభూమి, వేదభూమి, పుణ్య భూమి, భక్తి తత్వానికి పుట్టినిల్లు మన హిందూదేశం
జీవుల మనుగడకి అవసరమైనవి ముందే సృష్టించాడు భగవంతుడు.
ధార్మిక భావన, పవిత్రత, సేవాభావం పెంపొందిస్తూ....
కాలువలు, సరస్సులు, నదులు, సముద్రాల రూపంలో జలం జీవులకి జీవనాధారం!
సమాజ సేవని వదలకూడదని చెప్తూ...ఒడిదుడుకుల్ని పక్కకి నెడుతూ...
మిట్ట పల్లాల్ని దాటుకుంటూ...అలుపెరుగని కృష్ణమ్మ పరుగులు పెడుతూ
సముద్రంలో కలుస్తోంది...పరమాత్ముడి సాన్నిధ్యానికి చేరమని సందేశమిస్తోంది
తల్లి కృష్ణమ్మకి వందనం!
జీవనం అనిత్యమని తెలియచేస్తూ...
కొండల్లో కోనల్లో ఘనీభవించిన హిమం కరిగిన  ప్రవాహాన్ని...వాన నీటిని కలుపుకుని...
క్రిందికి దూకుతూ... తనతో జత కట్టాలని వచ్చే చిన్న చిన్నజలధారలు...
వాగులు వంకలతో కలిసి ఉధృతంగా ఉద్వేగ భరితంగా ప్రవహిస్తూ...
గిరులూ వనాలు భూములూ తాకుతూ...సిద్ధులూ, సాధువులూ, దైవాంశ సంభూతుల
స్నానాలతో పరమ పునీతమవుతూ...ఔషధీయగుణ సంభరితం, సత్సార సమ్మిళితం,
వినూత్నమైన రంగు రుచి వాసనల మిళితమై...తడబాటు లేని వడివడి నడకలతో సాగుతూ...
మురిసిపోతూ...కడలి విభుడి పరిష్వంగంలో కలిసిపోతోంది...
ఇది ఒక జీవన బ్రహ్మైక్యత...ప్రకృతీ పురుషుల జీవన యోగం.
తల్లి కృష్ణమ్మకి వందనం!
పరమ పవిత్రమైన జీవనదుల పండుగే పుష్కరం. సత్యలోకవాసి పుష్కరుడు
గ్రహాలకి పుష్టిని నింపడానికి...దేవఋషి గణాల ఆతిథ్యం స్వీకరించడానికి... పితృదేవతలకి
పిండప్రదానంతో సంతృప్తి కలిగించడానికి...ప్రాణకోటికి కర్తవ్య ప్రబోధంతో ముక్తిని ప్రసాదించడానికి
మన కృష్ణా నదిలో ప్రవేశించడం...ఆ తీరంలో మనం నివసించడం మన పురాకృత సుకృతం!
కృష్ణమ్మని స్మరిస్తే పాప హరణం... దర్శిస్తే పుణ్యదాయకం...స్నానం మోక్షదాయకం
పుష్కరుడా! మా అమ్మ కృష్ణమ్మకి పుష్టిని కలిగించు...మా బ్రతుకుల్ని పండించు...
ఎండిన మా భూముల్ని పోషించు...నీ సేవా స్ఫూర్తిని అందరికీ చాటుతాం!
తల్లి కృష్ణమ్మకి వందనం!
లయకారుడైన పరమ శివుడి తలపై గంగ...స్థితికారుడైన శ్రీమహావిష్ణువుకి సాగరమె ఇల్లు...
సృష్టికర్త బ్రహ్మకి కమండలమే జన్మస్థానం...త్రిమూర్తులకి ప్రీతికరమైనది జలం...
సృష్టిలో అన్నింటి కంటె గొప్పదైన జలం యొక్క స్థానం అంతరిక్షం, నదీ జలాల్లో అమృతముంది
అంటోంది అధర్వణ వేదం...నదులు మాతృ స్వరూపాలు, సమస్త పాపాల్ని హరిస్తాయి
చెప్తోంది మార్కండేయపురాణం... రోగ నిరోధక శక్తిని, దీర్ఘాయుష్షుని కలిగిస్తాయి
ఋగ్వేదం ప్రబోధం...దాహార్తిని తీర్చడం, శుభ్రపరచడం బయటికి కనిపించే శక్తులు...
పాపాలు నశించడం, ద్రవ్యశుద్ధి జరగడం అంతరంగిక శక్తులు...
తరంత్యనేనేతి తీర్థంతరింప చేసేది మన కృష్ణవేణీ తీర్థం
తల్లి కృష్ణమ్మకి వందనం!
పుష్కర సమయంలో ఉంటుంది నదికి దైవిక తేజస్సు...
స్నానం, దానం, జపం, అర్చించడం, ధ్యానం, హోమం, తర్పణాలకి అనువైన సమయమం
మనిషిలో కృతజ్ఞతాపూర్వక సంస్కారాన్ని పెంచడమే పుష్కర శ్రాద్ధ విధుల్లో అంతరార్ధం!
కర్మ వల్ల భక్తి, దాని వల్ల జ్ఞానం, దాని ద్వారా మోక్షం కలుగుతుందన్నది వేదాల్లోని మాట.
పోషణ చేసే స్వభావం కలది పుష్కరం! నీరు లేని చోట నిక్షేపం నిలవదని సామెత!
మనల్ని పోషిస్తున్న వస్తువుని మనమే జాగ్రత్త చేసుకోవాలి.
ప్రకృతి ఆరాధన వేదకాలం నుంచీ విధి విహితం...మానవ సంస్కృతీ వికాసం,
నాగరికత అభివృద్ధికి నదీ మూలాలే మూలస్థంభాలు!
తల్లి కృష్ణమ్మకి వందనం!
మూడు రాష్ట్రాల సంస్కృతీ సమ్మేళనమే కృష్ణవేణి.
బ్రహ్మగిరి మీద కూర్చుని తపస్సు చేసిన బ్రహ్మకి నారయణుడు శ్వేతాశ్వ వృక్షం...
శివుడి గురించి తపస్సు చేసినప్పుడు బ్రహ్మకి శివుడు అమలక వృక్షం రూపాల్లో....ఇచ్చాడు దర్శనం
కృష్ణగా నారయణుడు, వేణిగా ఈశ్వరుడు... వృక్షాలు రెండూ ఒకదానితో ఒకటి పెనవేసుకుని...
కృష్ణవేణీ నదిగా అవతరించాయి...తీర క్షేత్రాలన్నిటికీ ముక్తిని ప్రసాదిస్తూ ముక్తి క్షేత్రాలయ్యాయి
నది నీరు ప్రజలకి అందడం, నదీ తీరాల కట్టుదిట్టం, నదీ మార్గాల సుసంపన్నం, తీరక్షేత్రాల అభివృద్ధి...
సమైక్యతా సహజీవనాలకి రాచబాటలు వేయించి వెడతాడు పుష్కరుడు
ఇదే పుష్కర పండుగ!  పుష్కరుడి రాకతో మరింత పవిత్రతని సంతరించుకున్న
తల్లి కృష్ణమ్మకి పుష్కర వందనం!!

 కృష్ణాపుష్కరల సందర్భంగా జరిగిన కవిసమ్మేళనంలో వినిపించిన కవిత 2016

No comments:

Post a Comment