About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

శరణాగతరక్షణ అర్జునుడు కథ

శరణాగతరక్షణ
 అర్జునుడు కథ
   పాండవులు పెదతండ్రి ధృతరాష్ట్రుడి ఆశీస్సులతో ఇంద్రప్రస్థ పురంలో సుఖంగా కాలం గడుపుతున్నారు. ఒకరోజు శ్రీకృష్ణుడు, అర్జునుడు కలిసి కొంచెం సేపు సరదాగా గడిపి వద్దామని ఖాండవ వనం వైపు వెళ్ళారు. నెమ్మదిగా వీస్తున్న చల్లటి గాలిని అనుభవిస్తూ వనానికి దగ్గర్లో ఉన్నఒక చంద్రశిల మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు.
   నవ్వుకుంటూ ఆనందంగా గడుపుతున్న వాళ్ళ దగ్గరికి ఒక బ్రాహ్మణుడు వచ్చి నిలబడ్డాడు. కృష్ణార్జునులు అతడి వైపు ప్రశ్నార్ధకంగా చూశారు.
   ఆ బ్రాహ్మణుడు అయ్యా! నాకు అకలి చాలా ఎక్కువ. దేన్నైనా సరే తిని అరగించుకోగల శక్తి కూడా ఉంది. ఎంత తిన్నా ఇంకా తినాలనే ఉంటోంది. నాకు ఇష్టమైన పదార్థాలు కడుపు నిండేంత వరకు పెట్టి నా ఆకలి బాధని తీర్చండి” అని ప్రార్ధించాడు.
   కృష్ణార్జునులు అతణ్ణి  గౌరవించి “ తమ దగ్గర కూర్చోపెట్టుకుని ముందు నీకు ఎటువంటి భోజనం కావాలో చెప్పు. దానితో నీ ఆకలి బాధని తీరుస్తాం!” అన్నారు.
   అది విని బ్రాహ్మణుడు“ వీరులారా! ముందు నాకు ఈ బాధ రావడానికి కారణం చెప్తాను వినండి. నేను అగ్నిదేవుణ్ణి. శ్వేతకి అనే రాజర్షి శంకరుణ్ణి గురించి తపస్సు చేసాడు. అతడికి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు.
   శ్వేతకి “శంకరా! నేను శతవార్షిక సత్రయాగం చెయ్యాలని అనుకుంటున్నాను. నాకు నువ్వే ఋత్విజుడివిగా ఉండాలి” అని ప్రార్ధించాడు.
   శంకరుడు శ్వేతకితో“ యాగాలు చేయించడం బ్రాహ్మణులు చెయ్యవలసిన పని. ఆ పనిని మిగిలినవాళ్ళు చెయ్యకూడదు. కనుక మొదట నువ్వు పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసి నెయ్యితో అగ్నిదేవుణ్ణి తృప్తిపరుచు!” అని చెప్పాడు.
   శంకరుడు చెప్పినట్టే శ్వేతకి పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్య దీక్ష తీసుకుని నెయ్యితో అగ్ని తర్పణం చేశాడు. అతడి దీక్షకి సంతోషించిన శంకరుడు దుర్వాస మహర్షిని పిలిపించి శ్వేతకి చెయ్యబోతున్న శత వార్షిక సత్ర యాగానికి ఋత్విజుడుగా ఉండు! అని దుర్వాస మహర్షికి చెప్పాడు.
   శంకరుడు చెప్పడం వల్ల యాగానికి ఋత్విజుడుగా ఉండడానికి దుర్వాస మహర్షి అంగీకరించాడు. రాజర్షి శ్వేతకి సంతోషంగా తను అనుకున్న యాగాన్ని పూర్తి చేశాడు. కాని, ధారగా పోసిన నెయ్యి వల్ల నాకు ఆకలి, తేజస్సు తగ్గిపోయి దాహం పెరిగి పోయింది.
  నేను బ్రహ్మ దగ్గరికి వెళ్ళి నా శరీర బాధ గురించి చెప్పుకున్నాను. నాకు అమితంగా నెయ్యి తాగడం వల్ల ఈ వ్యాధి వచ్చిందని చెప్పాడు.
   ఇది తగ్గడానికి ఉపాయం కూడా చెప్పమన్నాను. ఖాండవ వనాన్ని పూర్తిగా భక్షిస్తేనే గాని ఈ వ్యాధి తగ్గదని చెప్పాడు.
   అప్పటి నుంచి ఈ వనాన్ని  భక్షించి నా రోగాన్ని తగ్గించుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాను. కాని, నేను ప్రయత్నించినప్పుడల్లా ఏనుగుల గుంపు ఒకేసారి వచ్చి మీద పడ్డట్టు... మేఘాల గుంపు వచ్చి అడ్డు పడుతోంది.
   ఇదే విధంగా ఏడుసార్లు ప్రయత్నించాను కాని, ఫలితం కలగలేదు. మళ్ళీ బ్రహ్మ దగ్గరకి వెళ్ళి జరిగింది చెప్పాను. నాకు ఖాండవ వనాన్ని బక్షించే యోగం ఎప్పుడు కలుగుతుంది? నా బాధ ఎప్పుడు తీరుతుంది? అని అడిగాను. 
   బ్రహ్మకి నా మీద దయ కలిగింది. అగ్నీ!“ కొంతకాలం గడిచాక నరనారాయణులు అనే ఆదిమహర్షులు ప్రజల్ని రక్షించడం కోసం భూలోకంలో అర్జున వాసుదేవులనే పేరుతో జన్మిస్తారు. వాళ్ళు ఒక రోజు ఖాండవ వనానికి సమీపంలో విహరించడానికి వస్తారు.
   అప్పుడు నువ్వు వాళ్ళని ప్రార్ధించు. తమ దగ్గరున్న అస్త్రశస్త్రాలతో నీకు అండగా నిలబడి, ఖాండవనం బక్షించడానికి సహాయ పడతారు. నీకు త్వరలోనే ఆ అవకాశం కలుగుతుంది” అని చెప్పాడు.
   నరనారాయణులారా! అప్పటినుంచి మీ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. ఈ ఖాండవ వనంలో నివసిస్తున్న తక్షకుడు అనే పేరుగల నాగరాజు ఇంద్రుడికి ప్రాణ స్నేహితుడు. అందువల్ల ఇంద్రుడు అమృతాన్ని రక్షిస్తున్నట్టే...ఈ ఖాండవ వనాన్ని కూడా చాలా జాగ్రత్తగా రక్షిస్తున్నాడు. మీరు దయతో నన్ను కాపాడండి” అని ప్రార్ధించాడు.   
   అర్జునుడు, కృష్ణుడు అగ్నిదేవుడు చెప్పింది విని అతడి బాధని అర్ధం చేసుకున్నారు. అర్జునుడు  "అగ్నిదేవా! వర్షధారల్ని కురిపించే మేఘమండలాన్ని ఆపడానికి, దేవతలతో కలిసి యుద్ధానికి వచ్చే ఇంద్రుణ్ణి  ఎదిరించడానికి అవసరమయిన దివ్య బాణాలు మా దగ్గిర ఉన్నాయి. కాని, ఆ బాణాలకు సరిపడిన ధనస్సు, రథం, గుర్రాలు మా దగ్గిర లేవు. మేము సరదాగా గడుపుదామని ఇక్కడికి వచ్చామే కాని ఆయుధాలతో రాలేదు. ఈ స్థితిలో నీ కోరికని తీర్చగలమా లేదా అని సందేహం కలుగుతోంది” అన్నాడు.
   కృష్ణార్జునులు చెప్పింది విని అగ్నిదేవుడు వరుణ దేవుణ్ణి స్మరించుకున్నాడు. వరుణుడు రాగానే వరుణా! సోముడిచ్చిన అక్షయబాణ తూణీరాల్ని, గంధర్వుల గుర్రాలు పూన్చిన రథాన్ని తీసుకొచ్చి అర్జునుడికీ...గద, చక్రం తీసుకొచ్చి వాసుదేవుడికీ ఇయ్యి! అన్నాడు.
   వరుణుడు అగ్నిదేవుడు చెప్పినవన్నీ తీసుకుని వచ్చి కృష్ణార్జునులకి ఇచ్చాడు. అవి దివ్యాయుధాలనీ, అమోఘమైన ప్రభావం కలిగి ఉన్నాయనీ చెప్పి వాటి గురించి అగ్నిదేవుడు శ్రీకృష్ణార్జునులకి వివరించాడు.
   నరనారాయణులు ఇద్దరు దివ్యాస్త్రాలు ధరించి రథాన్ని ఎక్కి అగ్నిదేవా! ఇంద్రుడు దేవతలతో వచ్చినా, మేఘాలు ఏనుగుల తండులా వచ్చినా మేము అడ్డుకుంటాం. నువ్వు నిర్భయంగా ఖాండవ వనాన్ని బక్షించడం ప్రారంభించు!” అన్నారు.
   సర్వభక్షకుడైన అగ్ని బ్రాహ్మణ వేషం విడిచి తన నిజ స్వరూపంతో ఖాండవ వనాన్నిభక్షించడం ప్రారంభించాడు. ఆకాశాన్నంటే అగ్ని జ్వాలలు ఖాండవ వనాన్ని దహించేస్తున్నాయి. ఒక వైపు గాండీవాన్ని పట్టుకుని పాండవ మధ్యముడు అర్జునుడు, వేరొక పక్క చక్రాన్ని ధరించిన నారాయణుడు అగ్నిదేవుడికి అండగా ఉన్నారు.
   అగ్నిదేవుడు అత్యంతమైన ఉత్సాహంతో వెలుగుతూ ఖాండవ వనాన్ని భక్షిస్తూ లోకాలకి భయాన్ని పుట్టిస్తున్నాడు. అది చూసిన దేవతలు ఇంద్రుడి దగ్గరకి వెళ్ళి జరుగుతున్నదంతా వివరంగా చెప్పారు.
   తక్షకుడు ఏమయిపోతాడో అని భయపడి ఇంద్రుడు మేఘాల్ని పంపించి ఏనుగు తొండం నుంచి కారుతున్నట్టు పెద్ద పెద్ద ధారల్తో వర్షాన్ని కురిపించాడు.
   వెంటనే అర్జునుడు తన అస్త్రకళా నైపుణ్యాన్ని ఉపయోగించి బాణాలతో ఆకాశాన్ని కప్పి ఖాండవ వనంలో ఒక్క నీటి చుక్క కూడా పడకుండా చేశాడు.
   తక్షకుడు బూడిదయ్యాడని తెలుసుకుని అతడి కొడుకు అశ్వసేనుణ్ణి రక్షించాలని అనుకున్నాడు ఇంద్రుడు. అర్జునుడు అశ్వసేనుణ్ణి కూడా చంపాలని ప్రయత్నించాడు. ఇంద్రుడు మోహిని అనే విద్యని అర్జునుడి మీద ప్రయోగించి తక్షకుడి కొడుకుని రక్షించాడు.
   అగ్నిని ఆపడం కష్టమని తెలుసుకుని కృష్ణార్జునులతో యుద్ధానికి దిగాడు ఇంద్రుడు. కాని, చివరికి ఓడిపోయాడు. ఖాండవ వనంలో ఉన్న మయుడు అనే రాక్షసుడు ఆ మంటల్లోంచి బయటపడలేక అర్జునుణ్ణి శరణు కోరాడు.
   కృష్ణార్జునులు ఇద్దరు ఆదిమహర్షులైన నరనారాయణులని, అటువంటి మహాపురుషులతో శత్రుత్వం మంచిది కాదని అశరీరవాణి దేవేంద్రుణ్ణి హెచ్చరించింది.
   అది విని ఇంద్రుడు యుద్ధం చెయ్యడం అపి కేశవార్జునులతో మైత్రి చేసుకున్నాడు. అర్జునుడు శరణు కోరిన అగ్నిదేవుడి వ్యాధిని తగ్గించి, మంటల నుంచి కాపాడమని అడిగిన మయుణ్ణి కూడా రక్షించాడు.

సహాయాన్ని కోరినవాళ్ళని నిస్సహాయులుగా వదలకూడదు!!

No comments:

Post a Comment