About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

తిరస్కారస్వభావం కల్మాషపాదుడు కథ

తిరస్కారస్వభావం
కల్మాషపాదుడు కథ
      పూర్వం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన కల్మాషపాదుడు అయోధ్యా నగరాన్ని పాలిస్తున్నాడు.  ఒకరోజు వేట కోసం అడవికి వెళ్ళి వసిష్ఠ మహర్షి ఆశ్రమ ప్రదేశంలో తిరుగుతూ ఉన్నాడు. పర్వత ప్రాంతంలో తిరగడం వల్ల బాగా అలిసిపోయాడు. విశ్రాంతి తీసుకోడానికి వసిష్ఠ మహర్షి ఆశ్రమం వైపు నడుస్తూ వెడుతున్నాడు.
   అదే సమయంలో వసిష్ఠ మహర్షి పెద్ద కొడుకు గొప్ప తపస్సంపన్నుడు, మహాజ్ఞాని అయిన శక్తి ముని కట్టెల కోసం వెడుతున్నాడు. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు ఎదురయ్యారు. శక్తిముని తల వంచుకుని తన పనిమీద తను వెళ్ళిపోతున్నాడు.
   అలా వెళ్ళిపోతున్న శక్తి మునిని కల్మాషపాదుడు చూశాడు.“ రాజు ఎదురుగా వస్తే నమస్కారం చేసి పక్కకి తప్పుకోవాలన్న జ్ఞానం కూడా ఇతడికి లేదా? అనుకుని శక్తి ముని వైపు చూసి “పక్కకి తప్పుకో!” అన్నాడు కోపంగా.
   రాజు మాటలు విని శక్తిముని“ ఎంతటి మహారాజయినా ఉత్తమమైన బ్రాహ్మణులు ఎదురుగా వచ్చినప్పుడు భక్తిశ్రద్ధలతో నమస్కారం చేసి, మృదువుగా పలకరించి వాళ్ళకి దారి వదలడం ధర్మం. ఈ విషయం నీకు తెలియదా?” అని అడిగాడు.
   శక్తిముని మాటలు విని కల్మాషపాదుడు కోపంగా చేతిలో ఉన్న కోలాతో కొట్టాడు. శక్తిముని కోపంతో ఎర్రబడిన కళ్ళతో రాజు వైపు చురచురా చూస్తూ” అధముడవైన రాజా! నువ్వు రాజువై ఉండి రాక్షస ప్రవృత్తిని చూపించావు. ఏ కారణం లేకుండానే దారిన వెడుతున్నవాణ్ణి అవమానించావు. నువ్వు రాక్షసుడవై మాంసాహారం తింటూ జీవించు! అని శపించాడు.
 కల్మాషపాదుడికి అతడు వసిష్ఠ మహర్షి కొడుకని అర్ధమయింది. తన తప్పు తెలుసుకుని రెండు చేతులూ జోడించి “మునీంద్రా! నన్ను క్షమించి ఈ శాపం నుంచి బయటపడే ఉపాయం చెప్పండి అని ప్రార్ధించాడు.
   వసిష్ఠుడికి బద్ధ శత్రువైన విశ్వామిత్ర మహర్షి అక్కడికి వచ్చి వాళ్ళకి కనబడకుండా ఉండి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ విన్నాడు. కింకరుడు అనే పేరుగల రాక్షసుణ్ణి పిలిచి రాజు మనస్సులోకి  ప్రవేశించమన్నాడు.
  అప్పటికే శక్తిముని ఇచ్చిన శాపం వల్ల కింకరుడికి ఆ పని తేలికయింది. విశ్వామిత్రుడు చెప్పినట్టే కింకరుడు కల్మాషపాదుడి మనస్సులోకి  ప్రవేశించాడు.
   శాపగ్రస్తుడవడం, కింకరుడు అతడిలో ప్రవేశించడం ఈ రెండింటి వల్ల పూర్వం ఉన్న మృదు స్వభావాన్ని రాజు పోగొట్టుకున్నాడు. తన రాజ్యానికి వచ్చి క్రూరంగా, మతిచలించిన వాడిలా ప్రవర్తించడం మొదలెట్టాడు.
   ఒక బ్రాహ్మణుడు రాజు దగ్గరికి వచ్చి ఆకలిగా ఉందని, తనకు మాంసం లేకుండా భోజనం పెట్టమని అడిగాడు. రాజు సరే అని చెప్పి ఆ విషయం మర్చిపోయాడు. అర్ధరాత్రి గుర్తుకొచ్చి వంటవాణ్ణి పిలిచి బ్రాహ్మణుడికి భోజనం పెట్టమని పంపించాడు. అకాల భోజనం చెయ్యనని చెప్పాడు బ్రాహ్మణుడు. వంటవాడు ఆ విషయాన్ని రాజుకి చెప్పాడు. 
   బ్రాహ్మణుడు మాంసంతో భోజనం వద్దన్న సంగతి కూడా మర్చిపోయాడు రాజు. మర్నాడు నరమాంసంతో భోజనం పెట్టమని వంటవాడికి చెప్పాడు. రాజు చెప్పినట్టే నరమాంసంతో భోజనం వడ్డించాడు వంటవాడు.
   తనకు వడ్డించిన భోజనం నరమాంసంతో వండినదని దివ్యదృష్టితో తెలుసుకున్నాడు బ్రాహ్మణుడు.  కోపంతో“ తినకూడని భోజనాన్ని నాకు వడ్డించిన నువ్వు మానవుడివి కాకుండా పోతావు” అని కల్మాషపాదుణ్ణి  శపించాడు.
   కల్మాషపాదుడు తన మానవ స్వభావాన్ని, రూపాన్ని పోగొట్టుకుని రాక్షసుడిగా మారాడు.  రాక్షస రూపంతోనే శక్తి ముని దగ్గరకి వచ్చి “నువ్వు ఇచ్చిన శాపం వల్లే నాకు శాపం మీద శాపం పొందాల్సి వచ్చింది. దీని ఫలితాన్ని ముందు నువ్వే అనుభవించు!” అని చెప్పి అతణ్ణి చంపేశాడు.
   అది చూసిన విశ్వామిత్రుడు చాలా సంతోషించాడు. ఆ రాక్షసుణ్ణి ప్రేరేపించి వసిష్ఠుడి మిగిలిన కొడుకుల్ని కూడా చంపించేశాడు.
   ఒకేసారి నూర్గురు కొడుకులు రాక్షసుడి చేతిలో చంపబడ్డారని తెలిసి తపస్సంపన్నుడైన మహర్షి వసిష్ఠుడు చాలా బాధ పడ్డాడు. ఆ బాధని తట్టుకోలేక ఆత్మహత్య మహాపాపమని తెలిసి కూడా అగ్నిలో ప్రవేశించాడు.
  కాని, అతణ్ణి అగ్ని ఏమీ చెయ్యలేదు. కంఠానికి పెద్ద రాయి కట్టుకుని సముద్రంలో దూకాడు. సముద్రుడు తన అలల చేతులతో వసిష్ఠుణ్ణి అతి జాగ్రత్తగా తీసుకుని వచ్చి ఒడ్డుకి చేర్చాడు.
   తన నూర్గురు కొడుకులు మరణించిన ప్రదేశానికి తిరిగి వెళ్లలేక వసిష్ఠుడు  మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి ఒక ఎత్తైన శిఖరం మీదకి ఎక్కి కిందకి దూకాడు. తపోధనుడైన అతడి శరీరానికి కొంచెం కూడా బాధ కలగలేదు.
  వసిష్టుడు తన నిర్ణయన్ని మార్చుకోలేక చాలా వేగంగా ప్రవహించే నదిలోకి దూకాడు. ఆ నది స్థలాన్ని ఇచ్చి శత విధాలుగా అతణ్ణి రక్షించింది. అందుకే ఆ ఆ నదికి శతద్రు అనే పేరు వచ్చింది.
   శరీరాన్ని వదిలేద్దామని ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కుదరక విసిగిపోయిన వసిష్ఠుడు ఆశ్రమం వైపు బయలుదేరాడు. ఆశ్రమం దగ్గరికి చేరుతుండగా శక్తి భార్య దృశ్యంతి గర్భం నుంచి ఆరు అంగాలతో కలిసిన వేదనాదం అతి శ్రావ్యంగా వినబడింది.
   అది తన కుమారుడు శక్తిముని గొంతేనని గుర్తుపట్టాడు. వేదవేదాంగాలు గర్భంలోనే నేర్చుకున్న శక్తిముని కొడుకు, తన మనుమడు కోడలి గర్భం నుంచి బయటకు రాబోతున్నాడని తెలుసుకుని ఆనందాన్ని పొందాడు.
   అప్పటి వరకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న భావం నుంచి బయట పడ్డాడు. తన మనుమణ్ణి జగ్రత్తగా కాపాడడం తన కర్తవ్యం అనుకున్నాడు. కోడలిని, ఆమె గర్భంలో ఉన్న శిశువుని జాగ్రత్తగా కపాడుకుంటున్నాడు.
   ఒకరోజు అక్కడికి వచ్చిన కల్మాషపాదుడి రాక్షస రూపాన్ని చూసి దృశ్యంతి భయంతో గడగడ వణికి పోయింది. వసిష్ఠుడు ఆమెకి దైర్యం చెప్పి కమండలంలో ఉన్న మంత్ర జలాన్ని అతడి మీద చల్లాడు.
   వెంటనే శాప విముక్తుడైన కల్మాషపాదుడు వసిష్ఠ మహర్షి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు.

పెద్దలకి నమస్కరిస్తే ఆశీస్సులు దొరుకుతాయి, తిరస్కరిస్తే అవమానాలు కలుగుతాయి!!

No comments:

Post a Comment