About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మార్గనిరోధం కిమ్మీరుడు కథ

మార్గనిరోధం
కిమ్మీరుడు కథ
   కౌరవులు అన్యాయంగా పాండవుల దగ్గర్నుంచి తీసుకున్న రాజ్యాన్ని కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు తిరిగి పాండవులకి అప్పగించేశాడు. ధృతరాష్ట్రుడు ఆ విధంగా చెయ్యడం  చతుష్టయానికి ( కర్ణుడు,శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనులకి) నచ్చలేదు. ఆ రాజ్యాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకుని పాండవులకి అసలు రాజ్యమే లేకుండా చెయ్యాలని అనుకున్నారు.  
  దానికోసం కౌరవులు ఉపాయం ఆలోచిస్తున్నారు. ధృతరాష్ట్రుడు కూడా తమతో కలిస్తేనే ఆ పని జరుగుతుంది. తండ్రిని ఒప్పించే పని దుర్యోధనుడికి అప్పగించారు.
   దుర్యోధనుడు తండ్రి దగ్గరికి వెళ్ళి తన బాధని చెప్పుకున్నాడు.” పాండవులు పరాక్రమం కలవాళ్ళు. వాళ్ళని ఓడించగలగిన వాళ్ళు ఈ భూలోకంలో లేరు. ఎప్పటికైనా నన్ను, నా తమ్ముళ్ళని ఓడించి మా రాజ్యాన్ని కూడా తీసేసుకుంటారు. అప్పుడు మా గతి ఏమిటో కొంచెం లోచించండి. వాళ్ళ రాజ్యం కూడా మాకే దక్కాలంటే జూదంలో వాళ్ళని మేము ఓడించాలి. అందుకు మీ అనుమతి కావాలి” అని అడిగాడు.
  ధృతరాష్ట్రుడికి పెద్ద కుమారుడు దుర్యోధనుడంటే అమితమైన ప్రేమ. అందుకే అతడు అడగ్గానే పాండవుల గతి ఏమవుతుందో అని కూడా ఆలోచించకుండా వెంటనే అంగీకరించాడు.
   విధి వక్రించడం వల్లగాని, పెదతండ్రి అడగడం వల్లగాని, తనకే జూదం మీద ఉన్న వ్యామోహం వల్ల గాని ఏదయితేనేం ధర్మరాజు జూదమాడి ఓడిపోయాడు. ఆడేముందు వాళ్ళు అనుకున్న నియమం ప్రకారం ఓడిపోయినవాళ్ళు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యాలి. ఆ నియమాన్ని అనుసరించి జూదంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు.
   కట్టుబట్టలతో బయలుదేరిన పాండవులతో పాంచాలి, బ్రాహ్మణ సమూహంతో కలిసి ధౌమ్యుడు కూడా వెంట వెళ్ళారు. మూడు రోజులు రాత్రి పగలు నడిచి నాలుగో రోజుకి కామ్యక వనానికి చేరుకున్నారు. అక్కడే కొన్ని రోజులు ఉండిపోయారు.
   ఒకరోజు అర్ధరాత్రి రాక్షసులు సంచరించే సమయంలో కామ్యక వనంలో తిరుగుతున్నారు పాండవులు.   దారి మధ్యలో వాళ్ళకి రాక్షస మాయలు కనిపించాయి. ఆ ప్రాంతంలో రాక్షసులు తిరుగుతున్నారేమో అని సందేహం వచ్చింది. అలా అనుకుంటూ ఉండగానే మహా భయంకరంగా ఉన్న రాక్షసుడు ఒకడు వాళ్ళ దారికి అడ్డుగా వచ్చి నిలబడ్డాడు.
   పొడవుగా ఉన్న వాడి కోరలు బయటకి రావడం వల్ల తెరుచుకున్న నోరు...మిలమిలా మెరుస్తున్న కళ్ళ గుడ్లు...రాగి రంగులో గాలికి ఎగురుతున్న వెంట్రుకలు...భూమి మీద ఉన్న ప్రాణులన్నీ భయపడేలా గర్జిస్తూ...భూమి కంపించేలా అడుగులు వేస్తూ...దగ్గరకు వచ్చి నిలబడిన ఆ రాక్షసుణ్ణి చూసి పాండవులు ఆగిపోయారు.
   పర్వతంలా ఉన్న అతడి శరీరాన్ని, భయంకరంగా ఉన్న అతడి ఆకారాన్ని చూసి పాంచాలి పులిని చూసిన మేకలా గడగడ వణికిపోయింది. పాండవులు అమెని పట్టుకుని ధైర్యం చెప్పారు. ధౌమ్యుడు కమండలంలో ఉన్న జలాన్ని మంత్రించి అతడి మీద చల్లాడు. రాక్షసుడు అతడికి ఉన్న మాయలన్నీ పోగొట్టుకుని కదలకుండా నిలబడ్డాడు.
   తమ ఎదుట నిలబడి ఉన్న రాక్షసుణ్ణి చూసి ధర్మరాజు “ నువ్వెవరివి? ఇక్కడ ఎందుకున్నావు? మమ్మల్ని ఎందుకు అడ్డగించావు?” అని అడిగాడు.
   రాక్షసుడు ధర్మరాజు అడిగింది విని భయంకరంగా నవ్వుతూ నేను బకాసురుడి తమ్ముణ్ణి. నా పేరు కిమ్మీరుడు. కనిపించిన జంతువుల్ని తిని ఈ కామ్యక వనంలో తిరుగుతూ ఉంటాను. మనుషులు ఎవరేనా ఈ వనంలోకి వస్తే నా మాయలతో లోబరుచుకుని బ్రతికి ఉండగానే వాళ్ళని విరుచుకుని తినేస్తాను.
   యుద్ధంలో కూడా నన్ను ఓడించగల వాళ్ళు ఎవరూ లేరు. చాలాకాలంగా ఈ కామ్యక వనానికి మనుషులు ఎవరూ రావడం లేదు. దానివల్ల నాకు తినడానికి నరమాంసం దొరకట్లేదు. మీరందరు ఈ వనంలోకి రావడం వల్ల నాకు ఇష్టమయిన ఆహారం దొరికింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది” అన్నాడు.
   అతడి మాటలు విని ధర్మరాజు “కిమ్మీరా! మేం ఎవరో నీకు తెలియదు. నువ్వు బక్షిస్తానని అనగానే భయంతో నీ చేతికి చిక్కి, నీకు అహారంగా అయిపోతామని ఎలా అనుకుంటున్నావు? నువ్వు మా గురించి తెలియక మాట్లాడుతున్నావు. మా దారికి అడ్డు రాకు. నేను ధర్మరాజుని, వీళ్ళు నా తమ్ముళ్ళు భీమార్జునులు నకులసహదేవులు” అన్నాడు.
   భీముడి పేరు వినగానే కిమ్మీరుడు పళ్ళు పటపటా కొరికాడు. పెద్ద పెద్ద బొబ్బలు పెట్టాడు. పర్వత గుహలు పగిలేటంత గట్టిగా అరుస్తూ “భీముడా? మా అన్నను చంపిన భీముడా?! ఆహా ఎంత అదృష్టం! వీణ్ణి పట్టుకుని చంపెయ్యాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాను.
   నా అన్నబకాసురుణ్ణే కాకుండా, నా స్నేహితుడు హిడింబాసురుణ్ణి కూడా ఈ భీముడే చంపాడు. వాతాపిని మింగిన తాపసిలా వీణ్ణి ఇప్పుడే మింగి జీర్ణం చేసేసుకుంటాను” అంటున్నాడు.
   అప్పటికే అర్జునుడు గాండివాన్ని సర్దుకుంటున్నాడు. నకుల సహదేవులు వాళ్ళ చేతుల్లో ఉన్న ఖడ్గాల్ని అటూ ఇటూ తిప్పుతున్నారు.
   వాళ్ళని తప్పుకోమని భీముడు కొదమ సింహంలా కిమ్మీరుడి మీదకి దూకాడు.వాళ్ళిద్దరి మధ్య పోరు భీకరంగా సాగుతోంది. కొంచెం సేపు పెద్ద పెద్ద చెట్లతోను, మరి కొంత సేపు పెద్దపెద్ద బండరాళ్ళతోను యుద్ధం చేశారు.
   నెమ్మదిగా మల్లయుద్ధంలోకి దిగారు. మధ్య మధ్య ధర్మరాజు“ కిమ్మీరా! భీముడికి లొంగిపో. లేకపోతే నీ జీవితం ఈ రోజుతోనే ముగుస్తుంది” అని హెచ్చరిస్తున్నాడు.
   కిమ్మీరుడు వినలేదు. మల్లయుద్ధంలో విజృంభించి పోరాడ గలిగిన భీముడు కోపంతో కిమ్మీరుణ్ణి  నేలమీద పడేసి బకాసురుణ్ణి చంపినట్టు చంపేశాడు.

బలవంతుల మార్గానికి నిరోధకులం కాకూడదు!!

No comments:

Post a Comment