About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మనారోగ్యం మాసపత్రిక 2017 అక్టొబరు నెల ప్రచురించిన వ్యసము

తులాసంక్రమణం - దీపావళి
    దీపావళి ఆనందదాయకమైన పర్వదినం. దీపావళి నుంచి తులాసంక్రమణం ప్రారంభమవుతుంది. అంటే చలి, చీకటి కలిసిన కాలం అన్నమాట.
   లోకాల్ని పీడిస్తున్న నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి సంహారం చేశాడు.  ఈ యుద్ధం నరకుడి రాజధానీ నగరమైన ప్రాగ్జ్యోతిషపురం (ప్రస్తుత అసోం ప్రాంతం)లో జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రామాణిక ఇతిహాసాల ప్రకారం- శ్రీకృష్ణుడే నరకుడితో యుద్ధంచేసి అతణ్ని సంహరించాడు. అంతేకానీ- సత్యభామ నరకాసుర సంహారం చేయలేదు.
   నరకాసురుని బందీలుగా ఉన్న పదహారు వేలమంది రాచకన్యల్ని బంధవిముక్తులను చేసిన పరమాత్మ- వాళ్లని ఏం కావాలో కోరుకోమన్నాడు. వాళ్లందరూ కృష్ణుడినే ఆశ్రయించారు. భూదేవి కూడా వాళ్లని అనుగ్రహించమని అభ్యర్థించింది. ఆ స్త్రీలందరికీ రక్షణ కల్పిస్తూ, పదహారు వేలమందినీ పదహారువేల పద్ధతుల్లో పదహారు వేల రూపాలతో ఏకకాలంలో మాధవుడు వివాహమాడినట్లుగా భాగవతాదుల కథనం.
  నరకుడు దుఃఖకారకమైన స్థితికి ప్రతీక అయితే, ‘కృష్ణశబ్దం తాత్వికంగా సచ్చిదానందరూపుడుఅనే అర్థాన్ని చెబుతోంది. సమాజానికి నరకాన్ని (దుఃఖమయ పరిస్థితిని) తొలగించి, ఆనందాన్ని ప్రసాదించే పండుగగా చెప్పుకోదగినది ఈ పండుగ. దుష్టత్వాన్ని జయించే విజయానందకేళీ విలాసం-శరన్నవరాత్రుల నుంచి మొదలై, ఈ పండుగతో సంపూర్ణతను సంతరించుకుంటుంది. నరక చతుర్దశిని కాళరాత్రిగా, దీప అమావాస్యను మహారాత్రిగా శాక్తేయం చెబుతోంది. శక్తి ఆరాధనకూ ప్రాధాన్యమిచ్చిన పుణ్యకాలం.
   ప్రపంచంలో అత్యధికులు జరుపుకొనే పండుగల్లో దీపావళి ఒకటి. దీపావళిని ప్రధానంగా హిందువుల పండుగగా భావిస్తారు గాని, ఈ పండుగను జైనులు, బౌద్ధులు, సిక్కులు కూడా తమ తమ సంప్రదాయాల ప్రకారం ఘనంగా జరుపుకొంటారు. 
 ఐదురోజులవేడుక
  దీపావళి వేడుకలు ఐదు రోజులు సాగుతాయి. అమావాస్యకు రెండు రోజుల ముందు అశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి ఈ వేడుకలు మొదలవుతాయి. ఈ త్రయోదశి నాడే క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవి, ధన్వంతరి జన్మించారని, అందుకే ఇది ధనత్రయోదశిగా పేరు పొందిందని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి పద్నాలుగేళ్ల వనవాసం దీపావళి రోజునే ముగిసిందట. లంకలో రావణసంహారం తర్వాత సీతారామలక్ష్మణులు దీపావళినాడే తిరిగి అయోధ్యకు చేరుకున్నారని ప్రతీతి. పాండవుల పన్నెండేళ్ల అరణ్యవాసం, ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తిచేసుకున్నది కూడా ఈ రోజే అని పురాణాలు చెప్తున్నాయి.
   దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు వేకువ జామునే నిద్రలేచి మంగళ హారతులిచ్చి, పూజలు చేస్తారు. దీపావళి రోజున లక్ష్మీదేవితో పాటు వినాయకుడిని, సరస్వతిని, కుబేరుడిని కూడా పూజిస్తారు. సాయంత్రం ఇంటి ముందు వరుసగాదీపాలుపెట్టి,బాణసంచాకాలుస్తారు.
   మార్వాడీలకు, గుజరాతీలకు, నేపాలీలకు దీపావళితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. దీపావళి మర్నాడు... కార్తీక శుద్ధ పాడ్యమిని బలి పాడ్యమి అంటారు. బలి చక్రవర్తిని వామనావతారంలో వచ్చిన విష్ణువు పాతాళానికి అణగదొక్కినది; శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తి ఇంద్రుడి తాకిడి నుంచి గోపాలకుల్ని, గోవుల్ని కాపాడినది ఈ రోజే అని పురాణాలు చెప్తున్నయి. కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్త భోజనంగా పాటిస్తారు. రక్షాబంధనాన్ని తలపించే పండుగ ఇది.
తూర్పునకాళీపూజలు
 దీపావళి రోజున దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో లక్ష్మీదేవి పూజలు చేయడం ఆనవాయితీగా ఉంటే, తూర్పు ప్రాంతాల్లోని ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, అసోం రాష్ట్రాల్లో కాళీపూజలు చేస్తారు. కాళీపూజను ఒడిశా, బెంగాల్, అసోంలలో శ్యామాపూజగా కూడా చెప్పుకుంటారు. బిహార్‌లోని మైథిలీ ప్రజలు దీనిని మహానిశా పూజగా అంటారు. పద్ధెనిమిదో శతాబ్దిలో బెంగాల్‌లోని నవద్వీప ప్రాంతాన్ని పాలించిన రాజా కృష్ణచంద్ర హయాంలో కాళీపూజలు బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీధుల్లో కాళీమాత మంటపాలను ఏర్పాటు చేసి పూజలు చేసే పద్ధతి అప్పటి నుంచి నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇదేరోజు రామకృష్ణ పరమహంస శారదాదేవిని షోడశిగా ఆరాధించినట్లు చెప్తారు. అందుకే బెంగాల్‌లోని కాళీ మంటపాల్లో రామకృష్ణ పరమహంస, శారదాదేవి దంపతుల విగ్రహాలను కూడా ఏర్పాటు చేసి పూజలు చేయడం ఆనవాయితీగావస్తోంది. ఇతర మతాలవాళ్ళకి కూడా ఇది పవిత్రమైన రోజు.
 దేశదేశాల్లోదీపావళి
 దీపావళి వేడుకలు భారతదేశంలోనే కాకుండా హిందువులు, జైనులు, బౌద్ధులు, సిక్కుల జనాభా ఎక్కువగా ఉండే నేపాల్, భూటాన్, శ్రీలంక, మయాన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, ఫిజీ, మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, కెన్యా, సురినామ్, గుయానా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, బ్రిటన్, కెనడా, అమెరికా, ట్రినిడాడ్ అండ్ టొబాగో తదితర దేశాల్లోనూ ఘనంగా జరుగుతాయి. నేపాల్‌లో కూడా భారత్ మాదిరిగానే ఐదు రోజుల వేడుకలు జరుగుతాయి. దీపావళిని నేపాలీలు తీహార్అని, ‘స్వాంతిఅని పిలుస్తారు. దీపావళి సందర్భంగా నేపాలీలు లక్ష్మీపూజలతో పాటు పశుసంపదను కూడా పూజిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.
   ఆస్ట్రేలియాలోని బ్రిస్‌బేన్, మెల్‌బోర్న్ తదితర నగరాల్లో అక్కడ స్థిరపడ్డ భారతీయులతో పాటు స్థానిక ఆస్ట్రేలియన్లు కూడా ఉత్సాహంగా బాణసంచా కాల్చే వేడుకల్లో పాల్గొంటారు. ఇండోనేషియాలో దీపావళిని గులుంగాన్గా వ్యవహరిస్తారు. గులుంగాన్రోజున పూర్వీకుల ఆత్మలు భూమ్మీదకు వస్తాయని ఇండోనేషియన్లు విశ్వసిస్తారు. ట్రినిడాడ్ అండ్ టొబాగోలో దీపావళి వేడుకల కోసం ప్రత్యేకంగా దివాలీ నగర్అనే ప్రదేశమే ఉంది. దీపావళి రోజున దివాలీ నగర్దీపాలంకరణతో, బాణసంచా కాల్పులతో దేదీప్యమానంగా మెరుపులీనుతూ కనువిందు చేస్తుంది. నేపాల్, శ్రీలంక, ఫిజీ, మారిషస్, సింగపూర్ తదితర దేశాల్లో దీపావళిని ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తారు. పాకిస్థాన్‌లోని స్వల్పసంఖ్యాకులైన హిందువులతో పాటు అక్కడి ముస్లింలు, క్రైస్తవుల్లో కూడా కొందరు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. 
   దీపావళి పండుగ ఆశ్వయుజ బహుళ చతుర్దశి అమావాస్య నాడు వస్తుంది. త్రయోదశినాటి రాత్రి అపమృత్యు నివారణ కోసం ప్రమిదలతో దీపాలు వెలిగించి ఇంటిముందు వుంచాలి.
 నరకచతుర్దశిని ప్రేతచతుర్దశి అని కుడా అంటారు. ఎందుకంటే ఇది యమునికి కుడా ప్రీతి కలిగించేరోజు.యముడు పితృత్వం కూడా ఉన్న దేవుడు. సూర్యోదయానికి ముందు, రాత్రి తుదిజాములోనువ్వులనూనెతో తలంటు పోసుకోవాలి. ఇలా చేయడంలో చాలా విశేషం వుందిట. దీపావళి పర్వదినాలలోనువ్వుల నూనెలో లక్ష్మి దేవి ఉంటుందిట. అలాగే నదులు, చెరువులు, బావులు, కాలువలు, వంటి అన్నిజలవనరులలోకి గంగాదేవి ఆ రోజుల్లో ప్రవేశిస్తుందిట . నువ్వులనునేల్తో అభ్యంగనస్నానం చెయ్యడం వల్ల దారిద్ర్యం తొలగి, గంగాస్నాన ఫలితాన్ని పొంది. నరక బాధల నుంచి తప్పించుకుంటారని అంటారు.
   స్నానం కూడా ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యకూడదు. సూర్యోదయానికి ముందు నాలుగు ఘడియల కాలాన్ని అరుణోదయం అంటారు. ఆలోగా స్నానం చేస్తూ  ఉత్తరేణి కొమ్మను శిరస్సు మీద తిప్పుతూ ఈ శ్లోకం చెప్పుకోవాలి .
శీతలోష్ట సమాయుక్త సకంటక దలాన్విత / హరపాప మపామార్గ భ్రామ్యమానః పునః పునః||
అపామార్గం అంటే ఉత్తరేణి . ఇలాచేయటం వల్ల నరకం రాదట. ప్రకృతి సామరస్యంతో మనం జేవించాలని ఇందులో సందేశం. స్నానం తరువాత `యమాయ తర్పయుఆమి, తర్పయామి, తర్పయామి' అంటు మూడుసార్లు నువ్వులతో యమునికి తర్పణాలు ఇస్తూ ఈ శ్లోకం చదవాలి.
యమాయ ధర్మరాజాయ మృత్యువే చాంతకాయచ / వైవస్వతాయ కాలాయ సర్వభూత క్షయాయచ|
ఔదుమ్బరాయ ధర్మాయ నీలాయ పరమేష్టినే /మహొదరాయ చిత్రాయ చిత్రగుప్తాయ తే నమః||
దీపావళి రోజు మినపాకుతో చేసిన కూరతో భోజనం చేస్తే మంచిది అని అంటారు.
దీపదానం:
సాయంకాలం ప్రోదోషసమయంలో నువ్వులనూనెతో దీపాలు పెట్టాలి . విష్ణ్వాలయంలో, శివాలయాలలో, మఠాలలో , దీపాలు పెట్టడంతో పాటు నదీతీరాలు, చేనుగట్లు, తోటలు, వీధులు, పర్వతాల పైన చివరకు స్మశానల వద్ద కుడా దీపాలు పెట్టాలని పెద్దల శాసనం. దీపావళి రోజున పితృదేవతలు తమతమ సంతానాన్ని చూడాలని ఇంటికి వస్తారట.  వారికి మనం పెట్టే దీపాలే దారి చూపిస్తాయట .
దీపావళినాడు మరి ముఖ్యంగా ఐదు ప్రదేశాలలో దీపాలు పెట్టాలంటారు. అవి:
1) ఇంటిధ్వారం 2) ధాన్యపుకొట్టు ౩) బావి 4) రావిచెట్టు 5)వంటిల్లు . ఇంట్లో ఆశుచం ( మైల) పాటిస్తున్నాసారే ఈ ఐదు చోట్లా దీపం పెట్టవలసిందే.
లక్ష్మి పూజ :
దీపాలు వెలిగించి వాటిలోకి లక్ష్మి దేవిని ఆహ్వానించి లక్ష్మీపూజ చెయ్యాలి. ఆ తర్వాత బాణసంచా వెలిగించాలి. అర్ధరాత్రి స్త్రీలు అందరు కలసి చేతలు, వాయిద్యాలు మోగించాలి. దారిద్ర్యాన్ని దూరంగా తరిమికొట్టడానికి ఇలా చెయ్యడాన్ని "అలక్ష్మినిస్సరణం" అని అంటారు. మనం టపాసు పేల్చడంలోని అర్థం ఇదే.
దిబ్బు దిబ్బు దీపావళి/మళ్ళీ వచ్చే నాగులచవితి...
అంటూ చిన్న పిల్లలంతా గోగునార కట్టలకి చిన్న చిన్న గుడ్డ ముక్కల్ని కట్టి వెలిగించి దిష్టి తీయడాన్ని మనం సంప్రదాయంగా కొన్ని ప్రాంతాలల్లో చూస్తున్నాం. ఆ దీపం వెలిగించిన తరువాత కాళ్ళు కడుక్కుని ఇంటిలోపలకు వచ్చి తీపి పదార్థం తింటారు. దీపావళి రోజు శ్రీమహాలక్ష్మికి పూజ చేయాలి. శ్రీసూక్తము గాని, లక్ష్మీసహస్రనామ స్తోత్రం కానీ, అష్టోత్రంకానీ చేసుకోవటంవల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుంది.
  చీకటి, చలి కలిసిన కాలం తులాసంక్రమణంలోకి అడుగుపెడుతూ, సకల శుభాలూ కలగాలని లక్ష్మీదేవిని పూజిస్తూ, బాణసంచా కాలుస్తూ, బంధుమిత్రులతో అనందాన్ని పంచుకుంటూ, పెద్దవాళ్ళు కూడా పిల్లగాళ్ళుగా మారిపోయి కేరింతలు కొడుతూ దీపావళి పండుగ జరుపుకోవాలని ఆశిస్తూ...

శుభాకాంక్షలతో... రచయిత్రి  భమిడిపాటి బలాత్రిపురసుందరి...సెల్ నం. 9440174797.

No comments:

Post a Comment