About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

కార్తీక పౌర్ణమి - జ్వాలా తోరణం

మనారోగ్యం మాసపత్రికకి 2017 నవంబరు నెలకి
కార్తీక పౌర్ణమి - జ్వాలా తోరణం
     కార్తీక పౌర్ణమినాడు రెండు విశేషమైన లక్షణాలు ఉంటాయి. 1. దీపము, 2. జ్వాలా తోరణము.
   జ్వాలాతోరణం ఎందుకు వెలిగిస్తారు అంటే ఇహంలో జీవుడు చేసిన పాపాల వల్ల  భైరవునియొక్క దర్శనం అవుతుంది అంటారు. భైరవ - భై అని; రవ - అరిచేది అని అర్థం. శరీరం విడిచి పెట్టగానే  నోరు తెరుచుకొని కుక్క తరుముతుందని అప్పుడు మంటలతో కూడిన తోరణం క్రింది నుంచి జీవుడు యమపురిలోకి ప్రవేశిస్తాడు అని అర్థం.
   శివకేశవులిద్దరికీ ప్రీతికరమైన పవిత్ర కార్తిక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తిక పూర్ణిమ’.ఈ రోజు చేసే స్నాన, దాన, దీపదానాలతో పాటు కేవలం చూసినంతనే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం. జ్వాలాతోరణ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కార్తికమాసంలో శుక్లపక్ష పూర్ణిమనాడు శివాలయాల్లో నిర్వహిస్తారు.
  ఈ మాసంలో ప్రతి రోజూ పవిత్రమైందే. సోమవారాలు, రెండు ఏకాదశులు, శుద్ధద్వాదశి, పౌర్ణమి రోజులు ఒకదానికంటే మరొకటి అధికంగా పవిత్రమైన రోజులుగా చెప్తారు. కార్తీక మాసంలో నెలరోజులూ చేసే పూజలూ, ఉపవాసాలు, దానాలు చెయ్యడం వల్ల పొందే ఫలితం ఒక ఎత్తు.. పౌర్ణమి నాడు చేస్తే పొందే ఫలితం ఒక్కటీ మరొక ఎత్తు.
  కార్తీక పౌర్ణమి రోజు దీపారాధనకి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. శివాలయల్లోను, విష్ణు దేవాలయాల్లోను కూడా దీపాలు వెలిగిస్తారు. విష్ణు ఆలయాల్లో గోపురం మీద, ధ్వజస్తంభం ఎదుట, తులసికోట దగ్గర, దేవుడి సన్నిధిలోనూ ప్రమిదల్లో, ఉసిరికాయలమీద దీపాలు వెలిగిస్తారు.
   శివాలయాల్లో ధ్వజస్తంభం మీద నందాదీపం పేరుతో అఖండదీపాన్ని, ఆకాశదీపం పేరుతో ఎత్త్తెన ప్రదేశాల్లో భరిణలతో (కుండలు, లోహపాత్రలతో తయారుచేసి) వేలాడదీస్తారు. అరటి దొన్నెల్లో దీపాలు వెలిగించి నదుల్లోను, కాలవల్లోను నీటి ప్రవాహంలో విడిచి పెడతారు. ఇలాచేయడం పుణ్యప్రదమని భక్తుల భావన.
  కార్తీక పౌర్ణమి రోజు ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం ఒకటి. ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుందని అంటారు. భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికీ భక్తేశ్వర వ్రతం అని పేరు. ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ ఉంది. పాండ్యుడు, కుముద్వతి దంపతులు సంతానం కోసం శివుడిని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు.
  అల్పాయుష్కుడు, అతిమేధావి అయిన కొడుకు కావాలా... పూర్ణాయుష్కురాలు, విధవ అయిన కుమార్తె కావాలా అని అడిగాడుట. అందుకు ఆ దంపతులు అల్పాయుష్కుడు, అతి మేథావి అయిన కుమారుడే కావలని కోరుకున్నారు. 
   వాళ్లకి కొంతకాలానికి ఒక కుమారుడు కలిగాడు. అలకాపురి రాజకుమార్తె గొప్ప శివభక్తురాలని తెలుసుకుని ఆమెని తమ కోడలిగా చేసుకుంటే తమ కుమారుణ్ణి పూర్ణాయుష్కుడిగా మార్చుకో గలదని అనుకుని తమ కుమారుడి వివాహం అలకాపురి రాజకుమార్తెతో జరిపించారు. ఆమె శివుడి అనుగ్రహంతో  భర్తకు పూర్ణాయుషు కలిగేలా వరం పొందిందని పురాణ కథనం.
   ఈ రోజుకు త్రిపుర పూర్ణిమ అనీ మరొకపేరు. తారకాసురుడి ముగ్గురు కుమారులూ బ్రహ్మను మెప్పించి, ఎక్కడికైనా స్వేచ్ఛగా సంచరించగలిగే మూడు పురాలను వరంగా పొందారు. ఎవరివల్లా మరణం లేకుండా వరం కోరారు. అది సాధ్యం కాదన్నాడు బ్రహ్మ.
   అలాగైతే రథంకాని రథంమీద, విల్లుకాని విల్లుతో, నారికాని నారి సారించి, బాణంకాని బాణం సంధించి, మూడు నగరాలూ ఒకే సరళరేఖలోకి వచ్చాక ఒకే బాణంతో ముగ్గురినీ ఏకకాలంలో కొడితేనే మరణం సంభవించేలా వరం పొందారు.
   ఆ వరబలంతో పట్టణాలతో సహా అన్ని లోకల్లోను సంచారంచేస్తూ  కల్లోలం సృష్టిస్తున్నారు. ఆ లోకాల్లో నివసిస్తున్న వాళ్లందరూ బ్రహ్మకు మొర పెట్టుకున్నారు. వరం ఇచ్చింది తానే కాబట్టి ఏమీ చేయలేనన్నాడు. విష్ణువు దగ్గర కెళ్ళమని ఉపాయం చెప్పాడు. విష్ణువు కూడా తనకా శక్తిలేదని, వారిని వెంటపెట్టుకుని శివుడి దగ్గరకు వెళ్లాడు.
   దేవతలందరూ సహకరిస్తేనే తానీపని చేయగలనన్నాడు శివుడు. ఆ మాటతో భూమి రథంగాను, మేరు పర్వతం విల్లుగాను, ఆదిశేషువు అల్లెతాడుగాను, శ్రీమహావిష్ణువు బాణంగాను మారారు. వీరందరి  శక్తితో శివుడు త్రిపురాసురులను (మూడు పట్టణాల యజమానులైన రాక్షసులను) సంహరించాడని, అందువల్ల ఈ పేరు వచ్చిందనీ పురాణ కథనం.
   కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానం, దీపారాధన, ఉపవాసం లాంటి అన్నింటిలోనూ ఆరోగ్య, ఆధ్యాత్మిక భావనలు అంతర్లీనంగా ఉన్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి ముందే తలమీద స్నానం చేయడం ఆ కాలపు వాతావరణపరంగా ఆరోగ్య ప్రదం.
   ఈ రోజున  స్త్రీలు పగలంతా ఉపవాసం ఉండి, రాత్రి దీపారాధన చేసి, చలిమిడిని చంద్రుడికి నివేదించి, ఫలహారంగా స్వీకరించాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల కడుపు చలవ (బిడ్డలకు రక్ష)అని పెద్దలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే- ఇలా చేయడం వల్ల గర్భాశయ సమస్యలు దరిచేరవని ఆరోగ్య కథనం.
   శివాలయాల్లో జరిపే జ్వాలాతోరణం ఈ రోజుకు మరో ప్రత్యేకత. ఇంకా ప్రాంతీయ, ఆచార వ్యవహారాల భేదంతో అనేక వ్రతాలు, పూజలు, నోములు చేస్తారీ రోజు. వాటిలో వృషవ్రతం, మహీఫలవ్రతం, నానాఫలవ్రతం, సౌభాగ్యవ్రతం, మనోరథ పూర్ణిమావ్రతం, కృత్తికావ్రతం లాంటివి ముఖ్యమైనవి. వీటితోపాటు లక్షబిల్వార్చన, లక్షప్రదక్షిణి, లక్షవత్తులు, లక్షరుద్రం లాంటి పూజలూ చేస్తారు.
   శివకేశవులకు ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసంలో అత్యంత మహిమాన్వితమైన రోజు కార్తీక పౌర్ణమి. మనకు ఆశ్వీయుజ అమావాస్య దీపావళి అయినట్టు, కార్తీక పూర్ణిమ దేవతలకు దీపావళి అని చెప్తారు. ఈ రోజు చేసే స్నాన, పాన, దాన, దీప దానములతో పాటు చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాలు ప్రసాదించే ఉత్సవం "జ్వాలతోరణం".
   కార్తీకపౌర్ణమి సాయంత్రం శివాలయాల్లో, ఆలయప్రాంగణంలో, ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి, మరొక కర్రను ఆ రెండింటిని కలుపుతూ అడ్డంగా కట్టి, ఆ కర్రను ఎండుగడ్డితో చుట్టి, ఆ గడ్డిని నిప్పుతో వెలిగిస్తారు. ఇది మండుతూ తోరణ శివలింగంగా ఉంటుంది. దీనికి జ్వాలాతోరణం అని పేరు. దీని క్రింది నుంచి పల్లకిలో శివపార్వతులను దాటిస్తారు, భక్తులు కూడా ఈ జ్వాలాతోరణం క్రింది నుంచి దాటుతారు. దీనికి సంబంధించి కూడా రెండు కధలు ఉన్నాయి.
  ఒకటి, త్రిపురాసురలనే ముగ్గురు రాక్షసుల్ని పరమశివుడు సంహరించింది ఈ రోజునే అని పురాణం చెప్తోంది. అందువల్ల దీనికి త్రిపుర పౌర్ణమి అని పేరు. దుష్టులైన రాక్షసులను సంహరించిన తరువాత కైలాసానికి వచ్చిన తన భర్తకి దృష్టి దోషం (దిష్టి) కలిగిందని భావించిన పార్వతీమాత, దృష్టిదోష పరిహారం కోసం జ్వాలాతోరణం జరిపించింది.
   రెండవ కధ అమృత మధనానికి సంబంధించినది. కృతయుగంలో అమృతంకోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసముద్రాన్ని చిలికినప్పుడు పొగలు కక్కుతూ హాలాహలం (కాలాకూట విషం) పుట్టింది. హాలాహలం లోకాన్ని నాశనం చేస్తుందన్న భయంతో దేవతలందరూ పరుగుపరుగున పరమశివుడి వద్దకు వెళ్ళి రక్షించమన్నారు.
   జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీపరమేశ్వరులు. లోకహితం కోసం పరమశివుడు హాలాహలాన్ని స్వీకరించాడు కానీ మ్రింగితే అయన కడుపులో ఉన్న లోకాలు కాలిపోతాయి, బయటకు విడిచిపెడితే, దేవతలకు ప్రమాదం. ఆ విషయం తెలిసిన పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంఠంలోనే పెట్టుకున్నాడు.
   అప్పుడు శివుడు గరళ కంఠుడు / నీల కంఠుడు అయ్యాడు. ఇది జరిగాక పరమశివుడితో కలిసి పార్వతీదేవి కుటుంబసమేతంగా మూడుసార్లు జ్వాలాతోరణం దాటింది.
   ఈ జ్వాలాతోరణంలో కాలిపోగా మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ, ధాన్యం నిలువ ఉంచే ప్రదేశంలోనూ కలుపుతారు. దీనివల్ల  పశువృద్ధి, ధాన్యవృద్ధి జరుగుతుందని నమ్మకం.
  ఈ జ్వాలాతోరణం దర్శించడం వల్ల సర్వపాపాలు హరించపబడతాయని, ఆరోగ్యం కలుగుతుందని, అపమృత్యువు నివారించబడుతుందని శాస్త్రం చెప్తోంది. జ్వాలాతోరణం క్రిందినుండి వెళ్ళడం వలన నరకద్వారం ప్రవేశించ వలసిన బాధ తప్పుతుందని  ప్రతీతి.
  శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీకం. ఈ నెలలో చంద్రుని వెన్నెలకాంతులు పౌర్ణమి రోజున నిండుగా భూమిపైకి ప్రసరిస్తాయి. స్వచ్ఛమైన పాలనురుగు లాంటి వెన్నెలను మనం పౌర్ణమి రోజున వీక్షించగలం. క్షీరసాగర మధన సమయంలో వెలువడిన హాలహలాన్ని పరమేశ్వరుడు సేవించి తన గొంతులో వుంచుకున్నాడు.
  అయితే ఆ విష ప్రభావానికి శివుడు అస్వస్థతకు గురయ్యాడు. అగ్ని స్వభావం గలిగిన ఆ విషం నుంచి మహేశ్వరుడిని కాపాడమని అమ్మవారు అగ్నిదేవుడిని ప్రార్థించింది. అనేక సపర్యల చేసిన తరువత శివుడు కోలుకున్నాడు. అందుకు కృతజ్ఞతగా పార్వతీదేవి అగ్నిస్వభావం వున్న కృత్తికానక్షత్రానికి కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం ఏర్పాటుచేసింది. అందుకనే ఈ పౌర్ణమిని అత్యంత విశిష్టమైనదిగా పేర్కొంటారు.
   ఈ రోజున మహిళలు పగలంతా ఉపవాస దీక్షలో వుండి రాత్రి దీపారాధన చేయాలి. ఇంటి ముందు వాకిట్లలో, పుణ్యతీర్థాల్లో, దేవాలయప్రాంగణాల్లో , నదీతీరాల్లో, పుష్కరిణుల్లో దీపాలను వెలిగిస్తారు.ఇదో అద్భుతఘట్టం. కార్తీక మాసం ఆధ్యాత్మికపరంగా విశిష్టమైన నెల.
  ఈ మాసంలో అత్యంత పవిత్రమైనది కార్తీకపౌర్ణమి శివకేశవుల కృపకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ రోజున తమ శక్తికొలది దానాలు చేస్తే ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. మార్కండేయ పురాణగ్రంథం దానం చేస్తే మంచిదని ధర్మగ్రంథాలు పేర్కొంటున్నాయి.
   పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజుని భక్తితో జరుపుకునే భక్తులందరికీ శివకేశవుల అనుగ్రహం కలగలని కోరుకుంటూ...







No comments:

Post a Comment