About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నెల పట్టడం-ధనుర్మాసం

మన ఆరోగ్యం మాసపత్రిక 2017 డిసెంబరు నెలకి
నెల పట్టడం-ధనుర్మాసం
   భారతీయ సంప్రదాయంలో మూడు అంకెకు ఓ ప్రత్యేకత ఉంది. త్రిమూర్తులు, సృష్టి స్థితి లయలు, సత్త్వరజోస్తమోగుణాలు, భూత భవిష్యద్వర్తమానాలు అంటూ మూడు అంకెకి ఎనలేని ప్రత్యేకత. అలాగే సంఅంటే చక్కని, ‘క్రాంతిఅంటే మార్పుని తెచ్చే సంక్రాంతి పండుగ కూడా మూడు రోజుల పండుగ! అయితే ఇది మూడు రోజుల పండుగే కాదు. ధనుర్మాసం మొదలైనప్పటి నుంచే పండుగ వాతావరణం తెలుగు ముంగిళ్ళ ముందు సందడి చేస్తుంటుంది.
  సూర్యుడు మేషం మొదలైన పన్నెండు రాశులలో సంచరిస్తూ ధనూరాశి నుండి మకరరాశిలోకి మారిన తరుణమే మకర సంక్రాంతి. ఇది మార్గశిర పుష్యమాసం ఉత్తరాయణం ప్రారంభంలో వస్తుంది. ఉత్తరాయణం దేవతలకు, దక్షిణాయణం పితృదేవతలకు ముఖ్యం. ఆందుకే ఉత్తరాయణం పుణ్యకాలంగా ప్రసిద్ధికెక్కింది. సంక్రాంతిని స్త్రీపురుష రూపాలలో కూడా కీర్తిస్తుంటారు.
   ఉదాహరణకు సంక్రమణ పురుషుడు ప్రతి సంవత్సరం కొన్నికొన్ని ప్రత్యేక లక్షణాలను కలిగ ఉంటాడనీ, ఏదో ఒక వాహనంపై వచ్చి శుభాలను కలిగిస్తాడని ప్రతీతి. ధనుర్మాసం మొదలైనప్పటినుంచి సూర్యకాంతి దక్షిణదిశ నుంచి జరుగుతూ వచ్చి సంక్రాంతి నాటికి సంపూర్ణంగా ఉత్తరదిశకు మారుతుంది. అందుకే ఈ నెల రోజుల కాలాన్ని నెలపట్టడంఅంటారు.
   ఏకాదశులు మొత్తం ఇరవై ఆరు. 1.ఉత్పన్న ఏకాదశి, 2.మోక్షద ఏకాదశి, 3.సపల ఏకాదశి, 4.పుత్రద ఏకాదశి, 5.షట్టిల ఏకాదశి, 6.జయ ఏకాదశి, 7.విజయ ఏకాదశి, 8.అమలకి ఏకాదశి,  9.పాపమోచనీ ఏకాదశి, 10.కామద ఏకాదశి, 11.వరూధినీ ఏకాదశి, 13.అపర ఏకాదశి, 14.నిర్జల ఏకాదశి, 15.యోగినీ ఏకాదశి, 16.శయన ఏకాదశి, 17.కామిక ఏకాదశి, 18.పవిత్ర ఏకాదశి, 19.అన్నద ఏకాదశి, 20.పార్శ్వ ఏకాదశి, 21.ఇందిర ఏకాదశి, 22.పాశాంకుశ ఏకాదశి,  23.రమ ఏకాదశి, 24.ఉత్దాన ఏకాదశి, 25.పద్మిని ఏకాదశి, 26.పరమ ఏకాదశి.    
  పంచాంగం ప్రకారం ఏడాదికి 24 ఏకాదశిలు వస్తాయి. "ఏకాదశి" పాడ్యమి నుండి వచ్చే పదకొండవ రోజు వస్తుంది. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
  సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తర్వాత మకర సంక్రమణం వరకు జరిగే  'మార్గం'  మధ్య ముక్కోటి లేక వైకుంఠ ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయి.
  వైష్ణవ ఆలయాల్లో భక్తులు తెల్లవారుజామున నుండి దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది.
  ఈ ఒక్క రోజు మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకుంది. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారని చెప్తారు. ముక్కోటి ఏకాదశి నాడు హాలాహలం, అమృతం పుట్టాయి. 
  ఈ రోజున శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధ సమయంలో భగవద్గీతను శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇదే రోజున ఉపదేశించాడు అని ప్రజల విశ్వాసం. గీతోపదేశం జరిగిన రోజు కనుక 'భగవద్గీత' పుస్తకదానం చేస్తారు.
   విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా శ్రీమహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ.. తమ కథ విని, వైకుంఠ ద్వారం నుండి వస్తున్న విష్ణు స్స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారనీ.. అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారని అంటారు.
   మామూలు రోజుల్లో దేవాలయాలలో ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజున భక్తులు ఆ ఉత్తరద్వారం నుంచి వెళ్ళి దర్శనం చేసుకొంటారు.  తిరుపతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరుతో ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. పద్మ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి ముర అనే రాక్షసుడిని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి. 
  ముర అనే రాక్షసుడి దురాగతాలు భరించలేక దేవతలు విష్ణువు శరణువేడగా ఆయన అతడితో తలపడి అతడిని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవించి తన కంటి చూపుతో మురను కాల్చి వేసింది.
 అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి వరం కోరుకోమని చెప్పాడు. ఆ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు.
  వైకుంఠ ఏకాదశి రోజు ముర బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది.
  ముర అంటే తామసిక, రాజసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుంది.  వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు కనుక మందబుద్ధిని ఇచ్చి జాగురూకతని దెబ్బతీస్తాడని అర్థం.
  దశమి నాడు రాత్రి జాగారం చేసి ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు బ్రాహ్మణుడికి భోజనం పెట్టి తనుకూడా భోజనం చేయాలి. "ధనుర్మాసం"  ఒక విశిష్టమైన మాసం. కాలాన్ని కొలిచేందుకు మనం అనేక కొలమానాల్ని వాడతాము. వాటిలో ప్రధానమైనవి చాంద్రమానం, సౌరమానం.
  చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటే దానిని బట్టి చాంద్రమానం లెక్కిస్తారు. సూర్యుడు ఒక్కో రాశిని దాటడాన్ని బట్టి సౌరమానాన్ని లెక్కిస్తారు. సూర్యుడు ధనూరాశిలో ఉన్నమాసాన్ని"ధనుర్మాసము"  అంటారు.
  ఈ నెల శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది.  సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించడాన్ని 'పండుగ నెలపట్టడం' అనికూడా అంటారు. ఈ నెల రోజులూ ఇంటి ముందు పండుగ హడావుడి ని గుర్తు చేస్తూ నాలుగు వీధుల చిహ్నంగా ముగ్గును తీర్చిదిద్దుతారు. 
  ఈ ధనుర్మాసంలో  శ్రీమహావిష్ణువుని ఉద్దేశించి చేసే చిన్నపాటి పూజాది క్రతువైనా మంచి సత్ఫలితాలని ప్రసాదిస్తుంది .ఈ మాస దివ్య ప్రభావము వల్లే గోదాదేవి సాక్షాత్ ఆ శ్రీ రంగనాయకుని పరిణయ మాడిందనే విషయం మనకు పురాణాల ద్వారా తెలుస్తోంది .
  ఆమె "తిరుప్పావై పాశురాలు" జగద్విఖ్యాతిని పొందాయి. దీనిలో తిరు అంటే మంగళకరమైన అనిపావై  అంటే మేలుకొలుపు అనే అర్ధం వస్తుంది. వేదాంత పరమైన ఎన్నో రహస్యాలు ఈ పాశురాలలో మిళితం చేసినందు వలన భాగవతానికి సమన్వయం చేస్తూ వస్తారు.
   ధనుస్సుఅనే పదానికి ..ధర్మం అని అర్ధం. అంటే ఈ ధనుర్మాసంలో ధర్మాన్ని ఎంతగా ఆచరిస్తామో అంతగా మనము ఆ  శ్రీమహావిష్ణువుకి ప్రీతిపాత్రమవుతాము. ధనుస్సు మార్గశిర మాసంలో వస్తుంది.
   ధనుర్మాసానికి ఆద్యురాలు గోదాదేవి. "గో" అనే శబ్దానికి జ్ఞానము అని, "ద" అనే శబ్దానికి ఇచ్చునదిఅని అర్ధం. గోదాదేవి చెప్పిన పాసురాలను ధనుర్మాసము లో విష్ణు ఆలయాల్లో తప్పనిసరిగా గానం చేస్తారు.
  ప్రతీ ధనుర్మాసంలోను గోదాదేవి గోపికలను లేపి శ్రీ కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించడం ఆ పాశురాల విశేషం. నెల రోజులూ హరిదాసుల కీర్తనలతో, జంగమదేవరలతోను, గంగిరెద్దులను ఆడించేవారితోనూ, సందడిగా వుంటుంది .
  ముంగిళ్ళలో కళ్లాపి జల్లి, ముత్యాలముగ్గులు, ఆవు పేడతో గొబ్బెమ్మలుతో  కనుల విందుగా వుంటుంది. ధాన్యపు రాశులను ఇళ్ళకు చేర్చిన రైతుల సంబరాలతో పల్లెలు "సంక్రాంతి" పండుగ కోసం యెదురు చూస్తూ వుంటాయి.
   నెల పట్టినది మొదలు సంక్రాంతి మూడు రోజుల పండుగ వరకు నెల రోజులు సందడిగాను, భక్తి పారవశ్యంతోను  ఉత్సాహము, శక్తి, భక్తి, ఆనందం, స్నేహం, బంధుత్వం కలబోసి సంతోషంగాను గడిచిపోతుంది.
   ఆహ్లాదంగాను, భక్తి పారవశ్యంతోను నెల పట్టిన దగ్గరనుంచి సంక్రాతి పండుగ వరకు గడిచే ఈ ధనుర్మాసంలో అందరూ శ్రీమహావిష్ణువుకి ప్రీతి పాత్రులై సకల ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ....

















No comments:

Post a Comment