About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

17.ఆదర్శవంతమైన మహిళ-సుందరమైన కథలు

17.ఆదర్శవంతమైన మహిళ
   భర్తకోసం తనకు తానుగ చేసిన త్యాగం, అంకితభావం కలిగిన ఒక మహిళ కథ. చాలా ప్రాచీన కాలంలోనే కాదు ప్రస్తుతపు రోజుల్లో కూడా అటువంటి మహిళలు ఉన్నారు.
   అడవంతా ప్రశాంతంగా ఉంది. అతడి విషయంలో అది ఒక గుర్తుంచుకోతగ్గ రోజు. అతడు తృప్తితో చిరునవ్వు నవ్వుకున్నాడు. చాలా సంవత్సరాలు దీక్ష, చదువు, కష్టం అన్నీ కలిసి పూర్తి చేసిన ఒక పెద్ద పని.  బ్రహ్మసూత్రాలమీద ఆదిశంకరాచార్యుడు రాసిన వ్యాఖ్యానానికి వివరణ రాయడం అతడు సాధించిన విజయం.  వివరణ రాస్తానని తన ఆధ్యాత్మిక గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి వాగ్దానం చేశాడు. దాన్నిపూర్తి చేసి తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అతడి పేరు వాచస్పతి మిశ్రా.
   వాచస్పతి మిశ్రా గొప్ప పండితుడు, సంస్కృతంలో అనేక గ్రంథాలు రాసిన రచయిత. వివాద చింతామణి, ఆచార చింతామణి మొదలయినవి ఆయన రచించిన వాటిలో కొన్ని. బ్రహ్మసూత్రాల మీద ఆదిశంకరాచార్యుడు తను రాసిన వ్యాఖ్యానానికి వివరణ రాయమని అడిగినప్పుడు ఆ పని చెయ్యడానికి అనందంగా అంగీకరించాడు. అది కూడా ఎదో వివరణ రాయడం కాకుండా దాన్ని చదివి, అనుభవించి అప్పుడు రాయాలి . యోగులు వ్యాఖ్యానాలు రాసినప్పుడు వాళ్ళ జీవితాల్లో ఉన్న నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా రాయరు. ఆ నిజంలోనే వాచస్పతి ఏకాగ్రత పెట్టాడు.
   రాయడంలో వాచస్పతి అంకితభావం చాల గొప్పది. మొదలుపెడితే రాస్తునే ఉంటాడు. తన చుట్టూ ఒక ప్రపంచం ఉందన్న సంగతి మర్చిపోతాడు. వివరణ రాసేటప్పుడు కూడా అతడు తినడం, నిద్ర, విశ్రాంతి, ఇల్లు అన్నీ మర్చిపోయాడు. అది రాత్రో పగలో కూడ తెలియని స్థితిలో గడిపాడు. తన శరీరాన్ని, ఆశ్రమాన్ని, అవసరాలని, తన జీవితాన్నే మర్చిపోయాడు. ఒంకో ముఖ్యమైన వ్యక్తిని కూడా అతడు మర్చిపోయాడు. ఆ వ్యక్తి అతడి భార్య.
   ఆ రోజు అతడు ఒక గొప్ప పని పూర్తిచేశానన్న సంతోషంలో ఉన్నాడు. చాలా సంవత్సరాల తరువాత బయట ప్రపంచాన్ని చూడాలని బయటకి చూశాడు. ఇన్ని సంవత్సరాల నుంచి సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో, ఎప్పుడు అస్తమించాడో చూడలేదు. తలుపు దగ్గర కనబడుతున్న ఒక నీడ అతణ్ణి ఆశ్చర్యపరిచింది. అక్కడెవరు?” అడిగాడు. బహుశా మాట్లాడి కూడా చాలా సంవత్సరాలు అయి ఉంటుంది.
  అక్కడ గౌరవనీయురాలైన ఒక స్త్రీ తల వంచుకుని నిలబడి ఉంది. “నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా?” అడిగాడు వాచస్పతి మళ్ళీ. ఆమె జవాబియ్యలేదు కానీ ఆమె తలని ఇంకా కిందకి వంచుకుంది.
   వాచస్పతికి ఉన్నట్టుండి విషయాలు అర్ధమవుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం జ్ఞాపకాలు ఆయనకి గుర్తుకొస్తున్నాయి. “ఇప్పుడు నాకు అర్ధమవుతోంది! ప్రతిరోజు ఎవరయితే నాకు భోజనం పెట్టారో.. ఎవరయితే
బట్టలు ఉతికి పెట్టారో.. ఎవరయితే నేను రాసేటప్పుడు నాకు ఈ పవిత్రమయిన తాళపత్రాలు అందించారో! ఆమె ఈమే అనుకున్నాడు. ఒక్క క్షణం అతడి మనస్సు మామూలుస్థితికి వచ్చింది. తన చుట్టూ ఏం జరిగిందో అర్ధమవుతోంది.
   ఆమెని పెళ్ళి చేసుకున్నట్టు అతడు పూర్తిగా మర్చిపోయాడు. నిజాన్ని అన్వేషిస్తూ, ధ్యానంలో మునిగిపోయి, వాచస్పతి ప్రపంచాన్నే మర్చిపోయాడు. ఇది నిజంగా జరిగింది. సంవత్సరాలుగా అతడి భార్య మౌనంగా భర్తకి సేవచేస్తూ అతడికి అన్ని ఏర్పాట్లు చూడడానికి చాలా కష్ట పడింది. ఒక్క క్షణం కూడా ప్రపంచం గురించి ఆలోచించకుండా భగంతుణ్ణి తెలుసుకోడంలో లీనమయి పోయి యోగిగా మారిన భర్తని గౌరవంగా చూసుకుంది.
   అతడు గుర్తించినా గుర్తించకపోయినా సంవత్సరాల తరబడి అతడికి సేవ చేసింది. భారతదేశం సేవకి, త్యాగానికి, ఆధ్యాత్మికతకి పేరు పొందింది. భార్యా భర్తలు ఇద్దరు పరస్పరం గౌరవం కలిగి ఉంటారు.
  ఆమె చేసిన సేవకి కృతజ్ఞతతో సిగ్గుపడడం ఇప్పుడు వాచస్పతి వంతయింది.
   అతడు తల వంచుకుని ఆమెని “ దయచేసి నీ పేరు చెప్పు” అన్నాడు. గడిచిన రోజుల్లో భారత దేశంలో స్త్రీలు తమ పేరు చెప్పుకునేవాళ్ళు కాదు. కాని, అతడు మళ్ళీ మళ్ళీ అడిగాడు. ఆమె చెప్పింది ’భామతి అని.
   మహర్షి ఒక కొత్త తాళపత్రాన్ని తీసుకుని దాని మీద భామతి’ అని రాశాడు. దాన్నిఅప్పుడే పూర్తి చేసిన గ్రంథం పైన పెట్టాడు. తనకు సేవ చేసిన పవిత్రురాలైన ఆ స్త్రీని గౌరవిస్తూ తను రాసిన వివరణకి ఆమె పేరు పెట్టి తన కృతజ్ఞతని చాటుకున్నాడు. భారతదేశం త్యాగానికి, ఆధ్యాత్మతకి, సేవాభావానికి, అంకితభావానికి ఆలవాలం కనుకనే విశ్వమంతా ఖ్యాతి గడించింది. దాన్ని నిలబెట్టడం ఈనాటి యువతయొక్క భాధ్యత అన్నారు స్వామి వివేకానందుడు.
   త్యాగం, పునరుద్ధరణ వల్లే జ్ఞానం పెరుగుతుందని వేదాంతం తెలియ చేస్తోంది. ఆనందించడం ద్వారా ఆధ్యాత్మికతకి సంబంధించిన జ్ఞానం కలుగుతుందని అనుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది. నిజాన్ని తెలుసుకుని అనుభవించి రాసిన పుస్తకాలు చదవడం ద్వారానే జ్ఞానాన్ని పొందగలం. అందుకే గ్రంథ పఠనం అలవాటుగా మారాలి. ప్రపంచపరంగా ఆలోచిస్తే భామతికి అన్యాయమే జరిగింది. కాని, ఎన్నో సంవత్సరాలు కష్టపడి తను రాసిన గ్రంథానికి ఆమె పేరు పెట్టి వాచస్పతి ఆమెకు న్యాయమే చేశాడు.

   ఎన్నో సంవత్సరాలు తపస్సులో లీనమయి, గ్రంథాలు చదివి, నిజాన్ని అన్వేషించి శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానానికి వివరణ రాశాడు. వాచస్పతి మిశ్రా వేందాంత గ్రంథాన్ని రాస్తే, భామతి ఆ వేదంతాన్ని అందరికీ నేర్పిస్తోంది. ఆ విధంగా ఇద్దరూ చరిత్రలో మిగిలి పోయారు. భర్తను అతడి ఆశయాలను గౌరవించడం కోసం తనకు కలిగిన ఆపదల్ని లెక్క చెయ్యకుండా వాటినే అవకాశాలుగా మార్చుకుని తన భర్త  చేసిన పవిత్ర కార్యంలో  సహాయపడిన భామతి భారతదేశంలో ఆదర్శ మహిళగా నిలిచింది. 

No comments:

Post a Comment