About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మన ఆరోగ్యం మాసపత్రిక జనవరి 2018

మన ఆరోగ్యం మాసపత్రిక జనవరి 2018
వాగ్గేయకారుడు త్యాగరాజు ఆరాధన ఉత్సవాలు
   త్యాగరాజు కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడు. త్యాగయ్యత్యాగబ్రహ్మ అనే పేర్లతో కూడా ప్రసిద్ధుడు. నాదోపాసన ద్వారా భగవంతుని తెలుసుకోవచ్చని నిరూపించిన గొప్పవాగ్గేయకారుడు ఆయన కీర్తనలు శ్రీరాముడి మీద ఆయనకు కలిగిన విశేష భక్తిని; వేదాలు, ఉపనిషత్తుల మీద ఆయనకి ఉన్న జ్ఞానాన్ని తెలియపరుస్తాయి. ఉపనయనం తరువాత తండ్రిగారి బోధలు, 18వ ఏట రామకృష్ణానంద పరబ్రహ్మం ఉపదేశం చేసిన రామ షడక్షరీ మంత్ర ప్రభావం, తల్లి అలవర్చిన భక్తి సంగీతాలు బాల్యంలోనే బీజాంకురాలై త్యాగ రాజస్వామి వారిలో మూర్తీభవించాయి.
బాల్యము-విద్యాభ్యాసము: త్యాగరాజు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా కంభం మండలంలో కకర్ల అనే గ్రామంలో వైదిక బ్రాహ్మణ కుటుంబంలో  కాకర్ల రామబ్రహ్మం, సీతమ్మ దంపతుల మూడవ సంతానంగా 1767లో మే 4వ తేదీన జన్మించాడు. ఆయన అసలు పేరు కాకర్ల త్యాగ బ్రహ్మం. వీరు ములకనాడు  బ్రాహ్మణులు త్రిలింగ వైదీకులు.
  ఇతడి పూర్వీకులు ప్రస్తుత ప్రకాశం జిల్లా కంభం మండలంలో కాకర్ల  గ్రామం నుంచి తమిళ దేశానికి వలస వెళ్లారు. తండ్రి రామబ్రహ్మం తంజావూరు ప్రభువు శరభోజీ ఆధ్వర్యంలో ఉండేవారు. త్యాగరాజు గారి తాతగారు గిరిరాజ కవిగారు. వీరి గురించి త్యాగయ్య తన బంగాళరాగ కృతిలో "గిరిరాజసుతా తనయ" అని తన తాతగార్ని స్తుతించి పాడారు.
   త్యాగయ్య గారి విద్య కోసం రామబ్రహ్మం గారు తిరువారూర్ నుంచి తిరువయ్యూర్ కు వెళ్ళారు. త్యాగయ్య గారు అక్కడ  సంస్కృతము, వేదవేదాంగాల్ని ఆమూలాగ్రం పఠించారు. సంగీతం నేర్చుకోడానికి త్యాగయ్య గారిని శొంఠి వేంకటరమణయ్య గారికి అప్పగించారు. వేంకటరమణయ్య గారు త్యాగయ్య గారి ఉత్సహము, సంగీతంలో అయన కనబరుస్తున్న ప్రతిభల్ని గుర్తించి అతి శ్రద్ధతో సంగీతాన్ని నేర్పించారు.
జీవిత విశేషాలు: ఆయన చిన్నవయస్సులోనే తండ్రి మరణించారు. అ సమయంలో అన్నదమ్ముల మధ్య భాగాలు పరిష్కరించినప్పుడు త్యాగయ్య గారి భాగంలోకి కులప్రతిమలైన శ్రీరామలక్ష్మణుల విగ్రహాలు మాత్రం దక్కాయి. ఆ ప్రతిమల్ని అతి భక్తితో పూజిస్తూ ఉండేవారు. తమ జీవితాన్ని ఊంఛవృత్తిని అవలంబించి సామాన్యంగా జీవించారు.
   తక్కిన సమయమాన్నితన యిష్టదైవమైన "శ్రీరామచంద్రుడి" గురించి కృతులు రచించడంలోనే గడిపారు. త్యాగయ్య తొంభై ఆరు కోట్ల శ్రీరామ నామాలు జపించి దర్శించి ఆశీర్వాదం పొందారు. త్యాగరాజువారు మంచి వైణికులు కూడా.
   పద్ధెనిమిది సంవత్సరాల వయసులో త్యాగరాజుకు పార్వతి అనే యువతితో వివాహమైంది. కానీ ఆయన ఇరవై మూడు సంవత్సరాల  వయస్సులో ఉండగానే ఆమె మరణించింది. తరువాత ఆయన పార్వతి సోదరి కమలాంబను వివాహం చేసుకున్నారు. వీరికి సీతామహాలక్ష్మి అనే కూతురు కలిగింది.
   ఈమె ద్వారా త్యాగరాజుకు ఒక మనుమడు కలిగాడు కానీ యవ్వనంలోకి అడుగుపెట్టక మునుపే అతడు కూడా మరణించాడు. కాబట్టి త్యాగరాజుకు కచ్చితమైన వారసులెవరూ లేరు. కానీ ఆయన ఏర్పరచిన సాంప్రదాయం మాత్రం ఈనాటికీ కొనసాగుతూనే ఉంది.
సంగీతంలో త్యాగరాజు ప్రతిభ: త్యాగరాజు తన సంగీత శిక్షణ శొంఠి వెంకటరమణయ్య దగ్గర, చాలా చిన్న వయసులోనే ప్రారంభించాడు. పదమూడు సంవత్సరాల వయస్సులోనే త్యాగరాజు ’నమో నమో రాఘవా అనే కీర్తనని దేశికతోడి రాగంలో స్వరపరచారు. గురువు శొంఠి వేంకటరమణయ్య ఇంటిలో చేసిన కచేరీలో "ఎందరోమహానుభావులు" అనే కీర్తనను స్వరపరచి పాడారు. ఇది పంచరత్నకృతులలో ఐదవది.
  ఈ పాటకు వెంకటరమణయ్యగారు చాలా సంతోషించి, త్యాగరాజులోని బాలమేధావిని గుర్తించి తంజావూరు రాజుగారికి చెప్పారు. రాజు సంతోషించి అనేక ధన కనక వస్తు వాహనాది రాజలాంఛనాలతో త్యాగరాజును సభకు ఆహ్వానించాడు. కానీ త్యాగరాజు తనకు నిధి కన్నా రామ సన్నిధే సుఖమని ఆ కానుకల్ని నిర్మొహమాటంగా తిరస్కరించాడు.
   ఈ సందర్భంగా స్వరపరచి పాడినదే "నిధి చాల సుఖమా అనే కీర్తన. సంగీతాన్ని భగవంతుడి ప్రేమని పొందే మార్గమని త్యాగరాజు భావించాడు. సంగీతంలోని రాగ తాళాలు వాటి మీద తన ప్రావీణ్యాన్ని చూపించుకోవడం కోసం కాకుండా భగవంతుడి నామాల్ని చెప్పడానికి, భగవంతుని లీలల్ని పొగడటానికి ఓ సాధనంగా మాత్రమే ఎంచుకున్నాడు.
   తంజావూరు రాజు పంపిన కానుకల్ని తిరస్కరించినప్పుడు  అతడి అన్నయ్య జపేశుడు కోపగించాడు. త్యాగరాజు నిత్యం పూజించుకునే శ్రీరామపట్టాభిషేక విగ్రహాల్ని కవేరీ నదిలోకి విసిరేసాడు. త్యాగరాజు శ్రీరామ వియోగబాధని తట్టుకోలేక, రాముడు లేని ఊరిలో ఉండలేక దక్షిణ భారతదేశ యాత్రలకు వెళ్ళిపోయారు.
  త్యాగరాజు జీవితంలో జరిగినట్లుగా కొన్ని విశేషాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. దేవముని అయిన నారదుడే స్వయంగా ఇతనికి సంగీతంలోని రహస్యాలను చెప్పి, "స్వరార్ణవము" ఇచ్చాడనీ, ఆ సందర్భంలో త్యాగరాజు చెప్పిన కృతిగా పంచరత్న కృతులలో మూడవదిగా పాడబడుతున్న "సాధించెనే" అనే కీర్తనగా చెప్తారు.
   త్యాగయ్యవారు ఇరవైనాలుగు వేల రచనల వరకు రచించారు. "దివ్యనామ సంకీర్తనలు", "ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు" అనే బృంద కీర్తన; "ప్రహ్లాద భక్తి విజయము", నౌకా చరిత్రము అనే సంగీత నాటకాలు కూడా రచించారు.
త్యాగరాజు జీవితంలో కొన్ని సంఘటనలు: త్యాగరాజు తన రామచంద్రుని పూజా విగ్రహాలు పోగొట్టుకున్నప్పుడు ’ఎందు దాగినావో అనే పాట పాడారు.  తిరుపతి వేంకటేశ్వరుడి దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ తెరవేసి ఉంటే, ”తెరతీయగరాదా అనే పాట పాడితే తెరలు వేంకటేశ్వరుని దయచేత వాటికి అవే తొలగిపోయాయి. ఆ సమయంలో ఆయన ’వేంకటేశ నిను సేవింప అనే పాట పాడారు. త్యాగయ్య పరమపదము చేరటానికి ముందు పాడిన పాటలు గిరిపై, పరితాము.
త్యాగరాజ ఆరాధనోత్సవాలు: అసంఖ్యాకమైన కీర్తనలు రచించి, కర్ణాటక సంగీతంలోని అన్ని నియమాలను సోదాహరణంగా నిరూపించి శాశ్వతమైన కీర్తి సంపాదించిన త్యాగరాజుని కర్ణాటసంగీతానికి మూలస్తంభంగా చెపుతారు. ఈ సంగీత నిధికి నివాళిగా ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమినాడు  తిరువయ్యూరులోత్యగరజ ఆరాధనోత్సవలు నిర్వహిస్తారు.
  ఆయన భక్తులు మరియు సంగీత కళాకారులు మొదట ఉంఛవృత్తి, భజన, తరువాత ఆయన నివాస స్థలమైన తిరుమంజనవీధి నుంచి బయలుదేరి ఆయన సమాధి వరకూ కీర్తనలు గానం చేస్తూ ఊరేగింపుగా వస్తారు. వందలకొద్దీ కర్ణాటక సంగీత కళాకారులు ఆయన రచించిన పంచరత్న కృతులను కావేరీ నది ఒడ్డున గల ఆయన సమాధి వద్ద బృందగానం చేస్తారు. తిరువయ్యూరులో నిర్వహించే ఆరాధన చాలా ప్రసిద్ధికెక్కింది.
  రచనలు: ’రామేతి మధురం వాచం' అన్నట్లు 96 కోట్ల సార్లు రామనామాన్ని జపించి, స్వీయానుభవ భావనలే కృతి రూపంలో మలచి గాంధర్వగానాన్ని మధురానుభూతిగా లోకానికి అందించారు. భూలోక నారదుడు త్యాగరాజ స్వామి నారద మంత్రోపదేశంతో ’'స్వరార్ణవం' 'నారదీయం' అనే రెండు సంగీత రహస్యార్థ శాస్త్ర గ్రంథాలు రచించారు.
  పంచరత్న కృతి సందేశం : శ్రీత్యాగరాజస్వామి రచించిన కృతులను ప్రాపంచికం, తాత్వికం, కీర్తనం, నిత్యానుష్ఠానాలని వర్గీకరించవచ్చు. త్యాగరాజస్వామి కీర్తనలలో ఘనరాగ పంచరత్న కీర్తనలు ముఖ్యమైనవి. త్యాగరాజ ఆరాధనోత్సవాల్లో విశేషంగా పంచరత్న కీర్తనలు ఆలపించడం సంప్రదాయం.
కీర్తనలు: త్యాగయ్య దాదాపు 800 కీర్తనలను రచించారు. వీటిలో చాలావరకు  తెలుగులో రచించినవే. కొన్ని సంస్కృతంలో రచించబడ్డాయి. సంస్కృతంలో రచించబడిన జగదానందకారక అనే కీర్తన శ్రీరామునికున్న నూటఎనిమిది పేర్లను ప్రస్తావిస్తుంది. 'ప్రహ్లాద భక్తి విజయం', 'నౌకా చరితం' అనే నాట్యరూపకాలను కూడా రచించాడు..

త్యాగయ్య గారు క్షేత్రములకు వెళ్లినప్పుడు, ఆయా క్షేత్రము మీద, క్షేత్రములో ఉండే దేవుడి మీదను కృతులు రచించారు.   కొవ్వూరు పంచరత్నములు:  కొవ్వూరులోని శ్రీ సుందరేశ్వర స్వామి పై వ్రాసిన ఐదు కృతులు:

నమ్మివచ్చిన కళ్యాణి రాగము, రూపకతాళము; కోరిసేవింప ఖరహరప్రియరాగము ఆదితాళము; శంభోమహదేవ, పంతువరాళి రాగము, రూపకతాళము; ఈ వసుధ, శహనరాగము, ఆదితాళము; సుందరేశ్వరుని, కళ్యాణిరాగము ఆదితాళము.
తిరువత్తియూరులో శ్రీత్రిపురసుందరి మీద రచించిన కృతులు: సుందరి నన్ను, బేగడరాగము, రూపకతాళము; సుందరీ నీ దివ్య, కళ్యాణిరాగము,ఆదితాళము; దారిని తెలుసుకుంటి, శుద్ధసావేరి రాగము, ఆదితాళము; సుందరి నిన్ను వర్ణింప, ఆరభి రాగము, చాపు తాళము; కన్నతల్లి నిన్ను, సావేరి రాగము, ఆదితాళము;
పంచరత్న కృతులు: జగదానంద, నాటరాగము, ఆదితాళము; దుడుకు గల, గౌళరాగము, ఆదితాళము; సాధించెనే, ఆరభిరాగము, ఆదితాళము; ఎందరో శ్రీరాగము,ఆదితాళము; కనకనరుచిరా, వరాళి రాగము, ఆదితాళము;
  అనేక దేవాలయాల్ని, పుణ్యతీర్థాల్ని దర్శించి, ఎన్నో అద్భుత కీర్తనలు రచించాడు. చివరగా శ్రీరాముడి అనుగ్రహంతో విగ్రహాలను పొందాడు. వైకుంఠ ఏకాదశినాడు త్యాగరాజు శ్రీరామ సన్నిధిని చేరుకున్నారు.
   అమ్మభాషలో భక్తితో కూడిన అతి పవిత్రమైన స్వరాలు, రాగాలు, తాళాలతో అనేక కృతుల్ని మనకి అందించిన శ్రీరామభక్తుడు, పరమసంగీత గురువుకి నమస్కరిస్తూ ఆరాధన ఉత్సవాల్లో  భగస్వాములవుతారని ఆశిస్తూ....

No comments:

Post a Comment