About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

పుణ్యక్షేత్రాలు- ఆధ్యాత్మికత


WTF channai
భమిడిపాటి బాలాత్రిపురసుందరి, 9440174797
పుణ్యక్షేత్రాలు- ఆధ్యాత్మికత
ఆధ్యాత్మిక విజ్ఞానము
  ఆధ్యాత్మిక బోధనలు మాత్రమే మనుష్యులందరినీ ఏకం చేయగలవు. అన్ని స్థాయి మనుష్యుల్ని కలుపుకుంటూ ప్రపంచంలో నిజమైన ఏకత్వాన్ని తీసుకుని రాగలవు. ఆధ్యాత్మిక విజ్ఞానం ప్రతి వ్యక్తిని తమ ఆలోచనలకి, మాటలకి, చేతలకి బాధ్యత వహించేటట్లు చేస్తూ వారి జీవితంలో విజయపుస్థాయి, సమత్వం, ప్రశాంతతల్ని, నిర్ధారిస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానమంటే కొలమానం సిద్ధాంతాలూ, గ్రంథాలూ కాదు. అన్నిమతాల నమ్మకాల్నీ వ్యవస్థల్నీ పరిశీలించి, ప్రతిదానిలోని అత్యుత్తమమైన మార్గాన్ని స్వీకరిస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానంలో ధ్యానసాధన ఇమిడివుండి..  క్రమశిక్షణతో కూడిన తాత్విక జీవనవిధానం కలిగి ఉంటుంది.
   ఆధ్యాత్మిక విజ్ఞానం ఆలోచనా స్వేచ్ఛని కలిగి, మానవజాతి పరిణామం చెందేకొద్దీ జ్ఞానాన్ని పెంచుకుంటూ, ప్రాచీనకాలం నుంచీ వస్తున్న వివేకంతో మేళవించి నిరంతరం వృద్ధి పొందుతూ వుంటుంది. ప్రపంచ మతాలన్నిటి మౌలిక సిద్ధాంతాల సమత్వంతో వుండి ప్రతి వ్యక్తికి తన గమ్యానికి చేరడానికి దివ్యచైతన్యాన్ని బోధిస్తుంది. మనిషిని ఆలోచింప చేస్తుంది కానీ దేన్నిగురించి ఆలోచించాలా అనుకునేటట్లు చేయదు.
    గమ్యంగా దేన్ని నమ్మాలో బోధించదు, మనం నమ్మే విషయాల్ని ఎందుకు నమ్ముతున్నామో తెలియచేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పొందిన వాళ్ళుగా తయారవటానికి ఒక ప్రత్యేకమైన మార్గం ఏదీలేదు. మనం ఏ మార్గంలో వున్నా అది ఆత్మసాక్షాత్కారానికి, దైవాన్ని తెలుసుకోవడానికీ త్రోవచూపే మార్గమేనని గ్రహించేలా చేస్తుంది. ఆధ్యాత్మిక విజ్ఞానమంటే ఏమిటంటే... చిత్తశుద్ధి కలిగి నిజంగా విజ్ఞానం పొందాలి అని అనుకున్న వాళ్ల కోసం గొప్ప యోగులూ, అన్వేషకుల ద్వారా అందించబడి రక్షింపబడుతున్న సనాతన జ్ఞానం.
   ప్రపంచ మతాలన్నిటిలోనూ వ్యక్తీకరించబడినది విశ్వసత్యాల ఆదిభౌతిక వ్యక్తీకరణ. అన్ని మతాలూ తమ బోధనలు విలువైనవి అని అంగీకరిస్తాయి. ఆధ్యాత్మిక విజ్ఞానంలో వేదవ్యాసుడు, బుద్ధుడు, మహావీరుడు, జీసస్, మహమ్మద్, జరాదృష్ట, కన్ఫూషియస్ వంటి వారి బోధనలన్నీ వినవచ్చు. వీరేకాక డాక్టర్ బ్రియాన్ వీస్, రేమండ్ మూడీ, గారీ జుకోవ్ వంటి నవ్యయుగ ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల బోధనలనూ వినవచ్చు.
   విశ్వప్రకృతి గురించి దానితో మనకు వున్న బంధం గురించి ఆలోచించి, అనుసరించి, ఆచరించగల మార్గం. మనం విశ్వపు సృష్టి కర్తలమూ, సహసృష్టి కర్తలమూ రెండూ అన్న విషయాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మనం మనలోని అపరిమితమైన సామర్థ్యాన్ని గుర్తించగల స్థాయికి చేరుకుంటాము. అదే ఆధ్యాత్మిక జ్ఞానము.
 ఆధ్యాత్మిక మార్గము:  భారతదేశం హిందూ సంప్రదాయానికి, భక్తి శ్రద్ధలకి, దేవీ దేవతల అర్చనలకి, ప్రసిద్ధి చెందిన దేవాలయాలకి పేరెన్నిక గన్నది. హిందూ దేవాలయాలు తమ క్షేత్ర మహత్యానికి, దేవీ దేవతల మహిమాన్విత గాథలకి, అమోఘమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి.
ఆలయంలో అడుగు పెట్టగానే భక్తులు తమ మనసు ప్రశాంతతో ఎంతో తేలికగా ఉన్నట్టు భావిస్తారు. ఆలయ దర్శనానికి వెళ్లి వస్తే తప్ప మంచి నీళ్ళు కూడా ముట్టుకోనివాళ్లు ఇప్పటికీ ఉన్నారు.
   కొన్ని ప్రత్యేక సందర్భాలలో, వివాహాది వేడుకలలో, పుట్టినరోజులు, పెళ్లిరోజులు, కొత్తగా విద్యాభ్యాసం మొదలుపెట్టేవాళ్లు, కొత్త ఉద్యోగాలలో చేరేవాళ్లు, జీవితంలో జరిగే ప్రతి ప్రత్యేక సందర్భాల్లోను దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేసుకుంటారు. తాము చేసే ప్రతి పనికి తగిన బలాన్ని ప్రసాదించి తలపెట్టిన కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తారు.
   విజయం సాధించినప్పుడు దాన్ని ప్రసాదించిన భగవంతుడికి కృతఙ్ఞతలు తెలుపుకుంటారు. కష్టనష్టాల్లో ఉన్నవాళ్లు తమ కష్టాల్ని గట్టెక్కించమని వేడుకోవడానికి మొక్కుకోవడం,  దేవాలయాలకు వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఇలా ఒకటి కాదు జీవితంలో తల్లి గర్భంలోనుంచి బయటపడ్డ క్షణం నుంచీ చివరి శ్వాస విడిచేంత వరకూ భగవంతుడిని ప్రార్థించడానికి దేవాలయానికి వెడుతూనే ఉంటారు.
  పండగ రోజుల్లోను, ప్రత్యేక సందర్భాల్లోను, వివిధ ప్రాంతాల్ని ఆచారాల్ని అనుసరించి సంబరాలు, ఉత్సవాలు జరపుతూ ఊరందరూ వాటిలో పాల్గొంటారు. ధనిక పేద, చిన్న పెద్ద, ఆడ మగ, కుల, మత తారతమ్యాలు ఏవీ లేకుండా అంతా కలిసి అనేక ప్రదేశాల నుంచి వచ్చి ఈ వేడుకలలో పాల్గొంటారు.
 దేవాలయాల పవిత్రత
  అతీతశక్తుల్ని పొంది వాటి నుంచి తనకు కావలసినవి పొందడానికి ప్రాచీన మనవుడు చేసిన మొదటి ప్రయత్నం ప్రార్థన. ఇది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సమాజం కోసం, రెండవది తన కోసం. ఆనాడు మానవుడు ప్రకృతి చేసే భీభత్సం వల్ల, దుష్టశక్తుల భయం వల్ల బాధలు పడేవాడు. వీటి నుంచి తన చుట్టూ ఉన్నవాళ్ళని రక్షించమని గ్రామదేవతల్ని ప్రార్థించేవాడు. ఇది సమాజం కోసం చేసే ప్రార్థన. తను సమాజంలో గొప్ప గుర్తింపు పొందాలని, సంతోషంగా జీవించాలని తన కోసం కూడా ప్రార్థించేవాడు.
   తన కోరికల్ని అతీత శక్తులకి చెప్పుకుని కానుకలు సమర్పించేవాడు. మనిషికి అతీతశక్తులకి మధ్య పూజారి ఉండేవాడు. కలక్రమేణా మంత్ర తంత్ర శక్తులు అభివృద్ది చెంది దుష్టశక్తులకి దేవతా రూపాన్ని కల్పించారు. అందువల్ల గ్రామదేవతల పూజా విధానాల్లో కూడా ఆచారాలు, పద్ధతులు మొదలయ్యాయి. తరువాత దేవతకీ భక్తుడికీ మధ్య పూజారి వారథిగా వచ్చాడు.దేవతా ప్రతిష్ఠ గొప్ప పండితులైన వేద, స్మార్త, ఆగమశాస్త్ర పండితులతోనే జరుగుతోంది.
   నిజమైన భక్తిప్రపత్తులు, తీరిక, ఓర్పు ఉన్నవాళ్ళని అర్చకులుగా నియమించారు. అప్పటి నుంచి ఆ అర్చకుడి వంశం వాళ్ళే గుడి వ్యవహారాలు చూసుకుంటున్నారు. మంచి ముహూర్తంలో దేవతల కింద బీజాక్షరలు ఉన్న యంత్రాలు వెయ్యబడ్డాయి కనుక గ్రామదేవతలందరు శక్తి కలిగినవాళ్ళే అయ్యారు. భక్తుల కోరికలు తీర్చగలుగుతున్నారు.
   ప్రతి సంవత్సరము అలయప్రతిష్ఠ జరిగిన నెల అదే తిథిరోజు పండితుల్ని పిలిచి పవిత్రోత్సవము చేయిస్తున్నారు. దూర ప్రదేశాలకి వెళ్ళి గొప్ప గప్ప దేవాలయాల్ని దర్శించడానికి తనకున్న ఆర్థికస్తోమత, రాకపోకలకి తగిన సదుపాయాలు లేక ప్రతి గ్రామంలోను   దేవాలయాన్ని నిర్మించుకున్నారు.
   ప్రతి క్షేత్రానికీ ఒక మహత్తు ఉంటుంది. సాధారణ గృహనిర్మాణంలా కాకుండా ఆలయ శంకుస్థాపన, నిర్మాణముఎంతో శ్రద్ధాభక్తులతో ఒక ప్రత్యేకమైన శైలిని అనుసరించాలి. మూలవిగ్రహ ప్రతిష్ఠ, గర్భగుడి ప్రాంతం, ధ్వజస్తంభం, ఆలయంలో భక్తులు భగవంతుడికి తమ మొరలను తెలుపుతూ మ్రోగించే గంట, శమీవృక్షము, నాగప్రతిష్ట, నవగ్రహప్రతిష్ట అంటూ ఎన్నో విషయాల్ని దృష్టిలో పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తారు. అందువల్ల భక్తుల్లో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.
   ఆలయాల నిర్మాణం శాస్త్రబద్ధంగా జరగకపోతే పవిత్రతకు తగిన ప్రాధాన్యతను సంతరించుకోలేవు. నిర్మాణాన్ని గురించి తగిన వివరాలు చెప్పగల పండితోత్తముల్ని సంప్రదించి నిర్మాణం పనులు ప్రారంభించాలి. శాస్త్రం చెప్పిన ప్రకారం నిర్మించిన దేవాలయంలోకి వచ్చే భక్తులకి ప్రశాంతత కలగడమే కాకుండా, అక్కడ జరిపించిన అభిషేకాలు, అర్చనలు,  హోమాలు శుభ ఫలితాల్ని కలిగిస్తాయి.
  ఇంత గొప్ప మహత్తు కలిగిన దేవీదేవతల నిలయాలైన దేవాలయాల్ని ప్రతిరోజు దర్శించుకోవడం మన సంస్కృతీ సాంప్రదాయాల్లో ఒక భాగం. మన పూర్వీకులు మనకు అందించిన మార్గదర్శకాలు మన దైనందిన జీవితాల్ని ప్రశాంతత, ఆధ్యాత్మికత వైపు నడుపిస్తున్నాయి.
ఆధ్యాత్మిక కథలు:
  పూర్వం 'బృందావనం'లో గోపాలభట్టు గోస్వామి అనే కృష్ణ భక్తుడికి కృష్ణుడు ప్రత్యక్షమై .. ఒక సాలగ్రామాన్నిచ్చి పూజించమని అందువల్ల మంచి ఫలితం దక్కుతుందని చెప్పాడు. ఆ భక్తుడు నిత్యం ఆ సాలగ్రామానికి ధూప, దీప, నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవాడు. అందరు  ఆయనని వింతగా చూసేవాళ్లు.
  అది గమనించిన గోపాల భట్టు ఆ సాలగ్రామానికి స్వామి రూపం వస్తే బాగుండును అనుకునేవాడు. అంతే వైశాఖ పౌర్ణమి రోజున ఆ సాలగ్రామానికి కళ్లు .. చెవులు .. ముక్కుతో స్వామి రూపం వచ్చేసింది. ఆయన ఎంతటి భక్తుడనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పటికీ  ప్రతి ఏడాది ఆ సాలగ్రామానికి వంద లీటర్ల పాలతో అదే రోజున అభిషేకం చేస్తారట. ఆ దృశ్యం చూసినవాళ్లు ధన్యులవుతారని అక్కడివారు బలంగా నమ్ముతారు.
   హరి నామ స్మరణను ఎవరైతే చేస్తుంటారో వాళ్లని ఆ స్వామి వెన్నంటి రక్షిస్తూ ఉంటాడు అనడానికి ప్రహ్లాదుడి చరిత్రే నిదర్శనం. భక్తుడి నమ్మకాన్ని నిలబెట్టడానికి భగవంతుడు ప్రత్యేక అవతారాన్ని ధరిస్తాడు అనడానికి నిదర్శనంగా హిరణ్య కశిపుడిని సంహరించిన అనంతరం నరసింహస్వామి కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ మండలం పరిథిలో 'అహోబిలం' క్షేత్రంలో కొలువయ్యాడు.
  ఎగువ 'అహోబిలం' .. దిగువ 'అహోబిలం'గా చెప్పుకునే ఈ క్షేత్రంలో నవనారసింహ రూపాలు కనిపిస్తుంటాయి. వాటిలో జ్వాలా నారసింహస్వామి మొదటిదిగా చెప్పబడుతోంది. ఇక్కడ స్వామి సన్నిధికి చేరువలో ఒక గుండం కనిపిస్తుంది. హిరణ్య కశిపుడిని  తన పదునైన గోళ్లతో సంహరించిన తరువాత, ఈ గుండంలో స్వామి చేతులు కడిగాడట. ఈ గుండంలో నీళ్లు ఇప్పటికీ ఎరుపు రంగులో ఉండటాన్ని అందుకు నిదర్శనంగా చూపుతుంటారు.
  దక్షుడిని సంహరించడం కోసం పరమశివుడి జటాజూటం నుంచి వీరభద్రుడు జన్మించాడు. దక్షుడిని సంహరించిన అనంతరం అనేక ప్రదేశాల్లో ఆయన ఆవిర్భవించాడు. అలా వీరభద్రస్వామి ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో 'అల్లాడు పల్లె' ఒకటిగా కనిపిస్తుంది. కడప జిల్లా పరిధిలో ఈ క్షేత్రం విలసిల్లుతోంది. సువిశాలమైన ప్రదేశంలో .. భారీ నిర్మాణాలతో .. శిల్పకళతో కూడిన మంటపాలతో వందల సంవత్సరాల చరిత్ర వున్న ఈ ఆలయంలో స్వామి ప్రత్యక్షంగా వున్నాడని భక్తులు విశ్వసిస్తుంటారుప్రతిష్ఠ నాటికి .. ఇప్పటికీ స్వామి మూర్తి పెరుగుతోందని చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు వుండడం వల్ల ప్రత్యేకతను సంతరించుకుంది.
  కడప జిల్లాలో ప్రసిద్ధమైనటువంటి ప్రాచీన క్షేత్రాలలో 'ఒంటిమిట్ట' శ్రీరామచంద్రమూర్తి క్షేత్రం ఒకటి. ఎంతోమంది మహారాజులు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించినట్టు చరిత్ర చెబుతోంది. సీతారాములు నడయాడిన ఈ ప్రదేశంలో 'ఇమామ్ బేగ్' అనే పేరుతో ఒక బావి కనిపిస్తుంది.
   శ్రీ విశాలాక్షీ దేవి; శ్రీ మాంగళ్య దేవి; శ్రీ వైష్ణవీ దేవి; శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయాలు శక్తిపీఠాలు. శ్రీఆదిశంకరాచార్యులు ఈ శక్తిపీఠాలకి వచ్చి అక్కడ ఆధ్యాత్మికత, తగ్గుముఖం పట్టడానికిగల పరిస్థితుల్ని పరిశీలించారు. ఆధ్యాత్మికత విషయంలో పూర్వవైభవాన్ని తీసుకు రావడం కోసం తన శిష్యులతో కలిసి అనేక క్షేత్రాల్ని దర్శిస్తూ, అక్కడి పూజా విధానాల్లో సంస్కరణలు చేపడుతూ ధనాకర్షణ ... జనాకర్షణ యంత్రాలను స్థాపించారు.  ప్రజల్లో భక్తిభావాలను పెంపొందింపజేయడం కోసం అనేక ప్రదేశాల్లో మఠాలను స్థాపించారు.
  ఈ నేపథ్యంలోనే సాక్షాత్తు పరమశివుడినుంచి శంకరాచార్యుల వారు పొందిన అయిదు శివలింగాల్ని శృంగేరిలో 'భోగ లింగం'... నేపాల్ లో 'వరలింగం' ... కేదార్ లో 'ముక్తి లింగం' ... కాంచీపురంలో 'యోగలింగం' ... చిదంబరంలో 'మోక్షలింగం' ప్రతిష్ఠించడం జరిగింది. ఈ క్షేత్రల్లోని శివలింగాలను దర్శించడం వలన, పరమశివుడిని ప్రత్యక్షంగా సేవించిన ఫలితం దక్కుతుందని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.
   తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలు ఒకొక్క గ్రహానికి ఒక్కొక్క దేవాలయము ఉంది.  వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలని తొలగించుకొంటారు. తమిళనాడులోని తెప్పేరు మనల్లూర్ శివాలయంలో ఒక నాగుపాము బిల్వ పత్రాలతో శివుడికి పూజ చేస్తుంది. పాముని ఆ శివుడే పంపించివుంటాడని ఇప్పటికీ భక్తుల నమ్మకం.
   మహారాష్ట్రలో శని శింగనాపూర్ గ్రామంలో ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ  తాళాలు వేయరు.అంత శక్తి ఆ శనిసింగనాపూర్ శనిదేవుడిది.
   పంజాబ్ లోని మొహాలీలో ఉన్న గురుద్వార్లో మామిడిచెట్టుకి సీజన్ లతో సంబంధం లేకుండా ప్రతీరోజూ కాయలు కాస్తూనే వుంటాయి. ఆంధ్రప్రదేశ్ లో ప్రసిద్ధిచెందిన యాగంటి ఆలయం క్షేత్రంలో నంది విగ్రహం రానురాను పెరుగుతూవచ్చి ఆలయప్రాంగణాన్ని ఆక్రమించుకుందని,  యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అందరి భక్తుల నమ్మకం.
   అనంతపురం జిల్లాలో పదహరవ శతాబ్దంలో కట్టబడిన ఉన్న లేపాక్షీ ఆలయం కట్టబడిన స్తంభం క్రింద నేల ఏ ఆధారము లేకుండా ఆలయాన్ని మోస్తుంది. పూణేలోని చిన్న దర్గాలో తొంభై కేజీల రాయి ఉంది.  సరిగ్గా పదకొండు మంది కలిసి  ఆ రాయిని కేవలం ఒక వేలితో  హజరత్ కమార్ అలీదర్వేష్ అని పలుకుతూ  పైకెత్తినప్పుడు పది అడుగుల ఎత్తులోకి వెళ్లి అలా గాల్లో తేలుతూనే వుంటుంది.
   తంజావూరులోని రాజరాజచోళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించిన బృహదీశ్వరాలయం సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రంవేళ ఆ దేవాలయం నీడలు భూమిమీద పడవు.
   పూరీజగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. బంగాళాఖాతం సముద్రం సమీపంలో ఉన్న ఈ ఆలయ సింహద్వారం వరకూ వినిపించే సముద్రఘోష అలయం లోపలకి వినిపించదు.
   మహారాష్ట్రలోని షెత్పల్ అనే గ్రామంలో  ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది వుంటుంది. ప్రతి ఇంట్లో మనుష్యులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి.
  హిమాచలప్రదేశ్ లో గ్యూ అనే గ్రామంలో  సంగాతెన్జింగ్ అనే టిబెట్ కు చెందిన ఒక బౌద్ధసన్యాసి మమ్మీ 500ఏళ్ల నుంచి చెక్కుచెదరని చర్మం,  జుట్టుతో అలాగే వుంది. ఇటువంటి గొప్ప చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కథలతో అనేక పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి.
పుణ్యక్షేత్రాలు:
   భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆయా రాజ వంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి, వాటి పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది.
   అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకొని కొల్లగొట్టారు. దేవాలయాలు కాలగమనంలో జీర్ణించి పోతున్నా వాటిని పునర్నిస్తున్నారు. క్రొత్త వాటిని కడుతూనే ఉన్నారు. అన్ని ఆలయాలకు ఆదరణ బాగా ఉంది. ఆలయాల వల్ల వ్వక్తికి, సమాజానికి, దేశానికి అనేక ఉపయోగాలు ఉన్నాయి.
   పుణ్యక్షేత్రాల వలన ప్రజల్లో భక్తి భావన పెరిగి, సామాజికంగా ఐకమత్య భావన పెరిగి, తద్వారా దేశ భక్తి కలిగి, ప్రజల మానసికోల్లాసానికి ఉపయోగ పడుతుంది. ఈ భావన వలన అటు వ్వక్తులకు (ప్రజలకు), ఇటు దేశానికి (సమాజానికి) ఆరోగ్యకరమైన అభివృద్ధి కలుగుతుంది.
   భారతదేశంలో  చూడవలసిన  గొప్పవైన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇవి దర్శించడానికి దేశ విదేశాల నుంచి అనేకమంది భక్తులు ప్రతిరోజూ వస్తూనే ఉంటారు.
     అనంతపద్మనాభస్వామి దేవాలయం కేరళరాష్ట్రంలోని తిరువనంతపురం; వేంకటేశ్వరస్వామి దేవాలయం తిరుమల తిరుపతి;  షిరిడీ సాయిబాబా దేవాలయం మహారాష్ట్రలోని అహమ్మద్ జిల్లా; కాణిపాకం సిద్ధి వినాయక దేవాలయం; మహారాష్ట్రంలోని నగరంలోని ప్రభదేవి అలయం; మధుర మీనాక్షిదేవి అమ్మవారి ఆలయం తమిళనాడు మధురై; కంచిలో కామాక్షి అలయం; పూరీ జగన్నాథ దేవాలయం ఒరిస్సా రాష్ట్రంలోని బంగాళాఖాతం తీరం; జమ్మూ వైష్ణవీదేవి ఆలయం ఎత్తైన హిమాలయ పర్వతప్రాంతంలో త్రికూట పర్వతశ్రేణి;
   గోల్డెన్ టెంపుల్ పంజాబ్ నగరంలోని అమృతసర్ నగరం;. సోమనాథ్ ఆలయం గుజరాత్; భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన హిందూదేవాలయాలలో కాశీవిశ్వనాథుని దేవాలయం వారణాశిలో...  ఇలా అనేక ప్రదేశాల్లో అనేక పుణ్యక్షేత్రాలు, పుణ్య తీర్థాలు భక్తుల కోరికలు తీరుస్తూ పవిత్రమైన ఆధ్యాత్మికతో విరాజిల్లుతున్నాయి.
   మన దేశంలో ఉండే పుణ్యక్షేత్రాలు గొప్ప చరిత్ర, ఆధ్యాత్మికతతో పాటు పర్యాటక కేంద్రాలుగా కూడా విలసిల్లుతునాయి. ప్రతి రాష్ట్రంలోను అక్కడి భాషా సంస్కృతులు, భక్తుల నమ్మకాలు, వారి ఆధ్యాత్మిక పద్ధతులతో ప్రతి పుణ్యక్షేత్రం దేనికదే గొప్పతనాన్ని పవిత్రతని సంతరించుకున్నాయి.
   భారతదేశంలో ఉండే పుణ్యక్షేత్రాలు అన్నింటి గురించి ప్రస్తావించ గలగడం చాలా కష్టతరమైన పని. అందుకే ఇక్కడ కొన్ని ముఖ్యమైన పుణ్యక్షేత్రాల గురించి మాత్రమే ప్రస్తావించడం జరిగింది.
  అసలు భారతదేశమే ఒక పుణ్యక్షేత్రం.. ఆధ్యాత్మిక కేంద్రం.. కర్మభూమి.. పరమ పవిత్రమైన ఋషులు తప్పస్సు చేసిన ప్రదేశం.. భగవంతుడే మానవుడిగా జన్మించి నడయాడిన నేల!



No comments:

Post a Comment