About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

8.భక్తిభావము



8.భక్తిభావము
   ఈ కథ హనుమంతుడిలో ఉన్న వీరుడి లక్షణాలని తెలియ చేస్తుంది. ఎటువంటి కష్టమైన పనులు చెయ్యవలసి వచ్చినా.. కఠినమైన పరిస్థితిలో కూడా విజయాన్నే సాధించి వీరుడుగా నిరూపించుకుంటాడు.
   రాక్షసరాజు రావణుడు సీతని ఎత్తుకుని పోయి లంకలో ఉంచాడు. తన భార్య కనిపించక ఎక్కడ వెతకాలో తెలియలేదు రాముడికి. తమ్ముడు లక్ష్మణుడితో కలిసి రాత్రనక పగలనక అడవి మొత్తం తిరుగుతున్నాడు.
   కొన్ని రోజులు అలా వెతుకుతూ తిరుగుతూ ఉండగా ఒకరోజు కిష్కింధకి వెడితే తగిన సహాయం అందుతుందని ఎవరో చెప్పారు. కిష్కింధ కోతుల రాజ్యంగా పిలవబడుతోంది. పూర్వ కాలంలో కోతుల్లో కూడా గొప్ప జ్ఞానం కలిగిన కోతులు ఉండేవి.
   ఒకరోజు కోతులన్నీ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. ఒక విమానం వాళ్ళ పైనుంచి వెడుతూ కనిపించింది. దాంట్లోంచి ఒక స్త్రీ ఓ రామా ఓ రామా! నన్ను రక్షించు అని దీనంగా పిలవడం వాళ్ళకి స్పష్టంగా వినిపించింది. అందులో క్రూరంగాను, పెద్ద శరీరంతోను ఉన్న ఒక పెద్ద రాక్షసుడు విమానం నడుపుతూ కనిపించాడు. అలా ఏడుస్తూనే సీత తన నగలన్నీ తీసి ఒక గుడ్డలో మూటగా కట్టింది.  కోతులు కనిపించగానే ఆ మూటని వాళ్ళకి దగ్గర్లో పడేలా కిందకి జారవిడిచింది.
   ఇది జరిగిన కొన్ని రోజులకి రామలక్ష్మణులు కిష్కింధ రాజ్యానికి వచ్చారు. కిష్కింధ రాజైన సుగ్రీవుడు, రాముడు మంచి స్నేహితులయ్యారు. ఆ గుడ్డ మూటని సుగ్రీవుడు రాముడికి చూపించాడు. దుర్మార్గుడైన తన సోదరుడు వాలి పెడుతున్న బాధల్ని సుగ్రీవుడు రాముడికి చెప్పుకున్నాడు. వాలి సుగ్రీవులకి జరిగిన యుద్ధంలో వాలిని చంపడంలో రాముడు సుగ్రీవుడికి సహాయ పడ్డాడు. ఈ విధంగా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవడంలో సీతని వెతకడంలో రాముడికి సుగ్రీవుడు కూడా సహాయపడ్డాడు.
  సుగ్రీవుడు తన సేవకుల్లో కొంతమందిని జట్లు జట్లుగా సీతని వెతకడానికి అన్ని వైపులకి పంపించాడు. వాళ్ళల్లో ఒకడైన ఆంజనేయుడు రాముడికి బాగా సన్నిహితుడయ్యాడు. అతడు అంకిత భావంతో రాముడికి సేవ చేశాడు. హనుమంతుడి శక్తి ప్రత్యేకమైంది. అతడు ప్రపంచంలో ఎవరికీ లేనంత శక్తి, తెలివితేటలు, అంకితభావం కలిగినవాడు. అతడి జట్టు కొన్ని రోజులు నడిచి నడిచి సముద్ర తీరాన్ని చేరుకుంది.
   అక్కడికి చేరుకున్నాక సముద్రానికి అవతలి గట్టుకి దూరంగా ఉన్న లంకాద్వీపంలో సీత బందీగా ఉన్నట్టు వాళ్ళకి సమాచారం అందింది. ఆ మహా సముద్రం మొత్తాన్ని ఎవరయినా ఒక్కసారిగా దూక గలిగితే తప్ప అక్కడికి చేరడం చాలా కష్టమని కోతులకి అర్ధమయింది. హనుమంతుడే ఆ సాహసం చెయ్యగలడని అర్ధం చేసుకుని హనుమంతుణ్ణి  ప్రోత్సహించారు. హనుమంతుడు ఒక్క గంతు వేసి ఆకాశంలోకి దూకాడు.
   హనుమంతుడు వేగంగా లంకవైపు వెడుతున్నాడు. అతడు భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆ సాహసానికి పూనుకున్నాడు. దేవుడి పేరు స్మరిస్తూ దాని వల్ల పెరిగిన శక్తితో సముద్రాన్ని దాటడాన్ని ఒక సవాలుగా తీసుకున్నాడు.
   వాయుపుత్రుడైన హనుమంతుడు వాయువు కంటే ఎక్కువైన వేగంతో వెళ్ళిపోతుంటే దేవతలు అతడి శక్తుల్ని పరీక్షిద్దామనుకున్నారు. జీవితంలో ఎదురయ్యే పరీక్షలు అలాగే వస్తాయి. కష్టాలకి గాని, పరీక్షలకిగాని ఒక ప్రదేశం, ఒక సమయం అనేది ఉండదు. ఏ సమయంలో, ఏ రూపంలో వచ్చినా తన మీద తనకు నమ్మకం, ధైర్యం, భగవద్భక్తి ఉంటే వాటిని అధిగమించడం కష్టం కాదు అన్నారు స్వామి వివేకానందుడు.
     మహావీరుడు, గొప్ప వీరుడు అయిన హనుమంతుడు ఒక దైవకార్యం మీద వెడుతుంటే దారిలో ఒక భయంకరమైన అడ్డంకి ఏర్పడింది. అతణ్ణి పరీక్షించడానికి సముద్రం నుంచి ఒక రాక్షసిని పంపించారు.
   హనుమంతుడు సముద్రం మీద ఎగురుతూ వెడుతుండగా సముద్రం నుంచి ఒక రాక్షసి అతడికి అడ్డంగా వచ్చి నువ్వు నా నోట్లోకి వెళ్ళి తిరిగి బయటకి వస్తేగాని నువ్వు సముద్రాన్ని దాటలేవు. నేను నిన్ను దాటనివ్వను! అంది.
   హనుమంతుడు తను ఒక ముఖ్యమైన పని మీద వెడుతున్నానని, తనని వదిలెయ్యమని చెప్పాడు. కాని, ఆ రాక్షసి మళ్ళీ అదే మాట చెప్పి నోరు తెరిచింది. ఆంజనేయుడు కనుక నోట్లోకి వెడితే వెంటనే ఆమె నోరు మూసెయ్యాలని, అప్పుడు అతడు చచ్చిపోతాడని అనుకుంది. ఆమె మాటని ఆంజనేయుడు సవాలుగా తీసుకున్నాడు. అది తనను ఎలాగూ వదలదు అనుకుని ఒక ఉపాయం అలోచించాడు.
   హనుమ తన శరీరాన్ని పెంచడం మొదలెట్టాడు. రాక్షసి కూడా తన నోటిని వెడల్పు చెయ్యడం మొదలు పెట్టింది. ఇదే విధంగా ఒకళ్ళని మించి మరొకళ్ళు పెంచుతూనే ఉన్నారు. ఇలా కొంతసేపు గడిచింది. ఉన్నట్టుండి ఆంజనేయుడు చిన్న దోమగా మారిపోయి రాక్షసి నోట్లోకి వెళ్ళిపోయాడు. ఎంత వేగంగా రాక్షసి నోట్లోకి వెళ్ళాడో...అంతే వేగంగానూ ఆమె చెవిలోంచి బయటకి వచ్చాడు. రాక్షసి హనుమంతుడి తెలివితేటల్ని అర్ధం చేసుకుంది. అతడి తెలివి తేటలకి మెచ్చుకుని దారికి అడ్డు తప్పుకుంది. ఏ పని మీద బయలుదేరాడో ఆ పని సక్రమంగా జరగాలని అతణ్ణి ఆశీర్వదించింది. అతనికి ఉన్న శక్తికి తోడు మరికొన్ని శక్తుల్ని కూడా ఇచ్చి పంపించింది.
 

    ఒకసారి రాక్షసి నోటిలోకి ప్రవేశిస్తే తిరిగి రావడం అనేది జరగని పని. హనుమంతుడు కనుక మామూలుగా రాక్షసి నోటిలోకి ప్రవేశిస్తే బహుశా అతడి జీవితం అంతటితో ముగిసిపోయి ఉండేది. తెలివితేటలతో రాక్షసి నుంచి తప్పించుకుని తన పని తను సక్రమంగా పూర్తిచేశాడు.
  మనకి కూడా జీవితంలో కష్టాలు, పరీక్షలు వస్తూనే ఉంటాయి. మనం వెళ్ళే మార్గంలో అవి కంచెల్లాగా అడ్డుపడ్తూనే ఉంటాయి. అసలుఅదే జీవితం. అటువంటి ఆపదలు కలిగినప్పుడు వాటిని  ధైర్యంతోను, భగవంతుడి మీద భక్తిభావంతోను ఎదుర్కుని వాటినే అవకాశాలుగా మార్చుకుని విజయాల్ని సాధించవచ్చు.

No comments:

Post a Comment