About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

9. నిజాయతీ గల రాజు
    నిజాయతీ, విధేయత గల వ్యక్తికి నిజంగా ఎవరూ హాని తలపెట్టలేరు. ఒకవేళ ఎవరేనా హాని తలపెట్టినా  దానివల్ల మొదట కొంతకాలం బాధ కలుగుతుంది కాని, చివరికి వాళ్ళ నిజాయతీయే గెలుస్తుంది.   నిజాయతీకి కట్టుబడి ఎన్నో బాధలు అనుభవించి, ఎదురైన పరీక్షలన్నింటినీ తట్టుకుని చివరికి గెలిచిన ఒక గొప్ప మహారాజు యొక్క అద్భుతమైన కథ ఇది.
   పూర్వం నుంచీ హరిశ్చంద్రుడి పేరు ప్రతి ఇంటిలోను వింటున్నదే! ఆ పేరు నిజాయతీకి, ధర్మానికి ఒక గుర్తుగా మిగిలిపోయింది. హరిశ్చంద్రుడి కథ మనస్సుని కదిలిస్తుంది. వాళ్ళ వల్ల ఏ తప్పూ జరగక పోయినా హరిశ్చంద్రుడు, అతడి భార్య, కొడుకు కొంత కాలం చాలా కష్టాలు పడ్డారు. తట్టుకోలేనన్ని బాధలు భరిస్తున్నా కొంచెం కూడా కోపాన్ని ప్రదర్శించలేదు, మనస్సులో కూడా ఎవరి మీదా అసహ్యపడలేదు. కఠినమైన పరీక్షలు పూర్తయ్యాక ఎన్నోఆశీర్వాదాలు( వరాలు) పొందారు. కలియుగంలో క్రమశిక్షణతో కూడిన నిజాయతీ ఒక్కటే భగవంతుణ్ణి చేరడానికి  ఉపయోగించే సాధనం అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస.
   నిజాయతీగల రాజు సత్యహరిశ్చంద్రుడుఅని మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఆ రాజు అతడి కాలంలో నిజాయతీపరుడిగా ఈ ప్రపంచం మొత్తంలోనే కాదు పై లోకాల్లో కూడా కీర్తించబడ్డాడు. ఒకసారి స్వర్గలోకంలో అతడి గురించి పెద్ద చర్చ జరిగింది. ఆ చర్చ చిన్నగా మొదలై చివరికి వ్యక్తిగతమైన అహంకారంగా మారింది. ’హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పిస్తే నాకేమిటి?’ అని ఒకళ్ళు పోటీగా అడిగారు. మరొకరు నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని చెప్తూనే చివరికి తన హోదాని వదిలేసుకుంటాను అన్నారు. ఆ విషయం వాళ్ళ మధ్య పందెంగా మారింది. అప్పటి నుంచి హరిశ్చంద్రుడికి భూమి మీద కష్టాలు ప్రారంభమయ్యాయి.
   హరిశ్చంద్రుడి కథ ఆ విధంగా మొదలైంది. హరిశ్చంద్రుడు గొప్ప సంపదలు, సామర్ధ్యం, నిజయతీ కలిగిన రాజు. అతడి పరిపాలనలో ప్రజలు సుఖసంతోషాలతో జీవించేవాళ్ళు. అతడి భార్య, కొడుకు కూడా అతడి మార్గంలోనే నడిచేవాళ్ళు.
   ఒకరోజు అతడి రాజ్యానికి ఒక మహర్షి వచ్చి కొండంత ఎత్తులో బంగారం తనకి దానంగా ఇమ్మని అడిగాడు. హరిశ్చంద్రుడు వెంటనే అందుకు అంగీకరించాడు.  మహర్షి తనకి ఆ దానం ఇప్పుడే అవసరం లేదని, అవసరం పడినప్పుడు వచ్చి దాన్ని తీసుకుంటానని అంతవరకు దాన్ని రాజు దగ్గరే ఉంచమని చెప్పి పెళ్ళిపోయాడు.
   హరిశ్చంద్రుడి నిజాయతీ మీద పదెం వేసుకున్నవాళ్ళల్లో ఆ మహర్షి కూడా ఒకడు. మహర్షి తపస్సు ద్వారా తను పొందిన శక్తిని  ఇప్పుడు హరిశ్చంద్రుడి నిజాయతీకి పరీక్ష పెట్టడానికి ఉపయోగించాడు.
   హరిశ్చంద్రుడికి పరీక్ష మొదలయింది. అనుకోకుండా అతడి రాజ్యంలో కరువు ఏర్పడింది. హరిశ్చంద్రుడు తన శక్తివంచన లేకుండా ప్రజలకి ఆహారం, నీరు వంటివన్నీ అందరికీ అందేలా చూశాడు. అతడి ధనాగారం ఖాళీ అవడానికి సిద్ధంగా ఉంది. తన దగ్గరున్న మొత్తాన్ని ఇంచుమించుగా ప్రజలకోసం ఖర్చుపెట్టేశాడు. అదే సమయంలో మహర్షి తనకు ఇస్తానని వాగ్దానం చేసిన కొండంత ఎత్తు బంగారాన్ని తీసుకుని రమ్మని ఒక శిష్యుణ్ణి హరిశ్చంద్రుడి దగ్గరికి పంపించాడు. రాజు వాగ్దానం చేసిన బంగారాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినవాడు హింసాస్వభావం కలవాడు.
   మహర్షి కొండంత ఎత్తులో బంగారం కావాలని అడిగాడు కాని ఆ కొండకి ఒక కొలత లేదు. రాజు అప్పుడు ఉన్న పరిస్థితుల్లో అంత బంగారం తన రాజ్యం మొత్తాన్ని అమ్మినా కుడా ఇవ్వలేడు. తను వాగ్దానం చేసినట్టుగానే అంత బంగారాన్ని ఇస్తానని చెప్పి దానికోసం తన రాజ్యాన్ని వదిలి భార్యని, కొడుకుని తీసుకుని బయటకి వచ్చేశాడు. ఆ శిష్యుడు ఇంకా రావలసిన బంగారం కోసం వాళ్ళని వెంబడిస్తూ వెళ్ళాడు. “నువ్వు వాగ్దానం చేసిన బంగారాన్ని మాకు ఇచ్చెయ్యి లేదా ..ఒక అబద్ధం చెప్తే ఈ కష్టాల నుంచి బయటపడవచ్చు...నువ్వు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందవచ్చు అని పదేపదే చెప్తూ హింసించడం మొదలెట్టాడు. కాలం కలిసి రానప్పుడు కష్టాలు కలగడం సహజం. కాని, అవి ఎక్కువ కాలం ఉండవు. అతడి నిజాయతీకి అనేక విధాలుగా పరీక్షలు మొదలయ్యాయి.
   ఉన్నట్టుండి వాళ్ళని మంటలు చుట్టుముట్టాయి. ఇదంతా పందెం వేసుకున్నవాళ్ళు తమకున్న శక్తుల్ని ఉపయోగించి ఆడుతున్న నాటకం. ఈ కష్టాల్లోంచి ఎలా బయట పడాలి. హరిశ్చంద్రుడు తన అసలు పేరుని మార్చి వేరే పేరుని చెప్పుకుని కష్టాలనుంచి బయట పడచ్చు. హరిశ్చంద్రుడు చావడానికైనా అంగీకరిస్తాడు కాని, అబద్దం చెప్పడానికి అంగీకరించడు. అతడి భార్య అగ్ని దేవుణ్ణి అగ్నిదేవుడా! నేను నిజంగా పతివ్రతనైతే నువ్వు వెంటనే శాంతించు! అని ప్రార్ధించింది. వెంటనే అగ్ని శాంతించి మంటలు ఆరిపోయాయి.
    హరిశ్చంద్రుడి వెంట వచ్చిన శిష్యుడు మాత్రం వాళ్ళని వదలకుండా ఇవ్వవలసిన బంగారాన్ని ఇవ్వమని అడుగుతూనే ఉన్నాడు. హరిశ్చంద్రుడు తన భార్యని, కొడుకుని చివరికి తనని కూడా అమ్ముకుని వచ్చిన ధనాన్ని బంగారంగా మార్చి శిష్యుడికి ఇచ్చేశాడు. మహర్షి అడిగినంత బంగారం సమకూరింది కనుక మహర్షి శిష్యుడు సంతృప్తిగా వెళ్ళిపోయాడు.
  అమ్మబడిన హరిశ్చంద్రుడి భార్య ధనవంతుల ఇంటిలో పనిమనిషిగా కుదిరింది. ఇవన్నీ కూడా పందెం వేసుకున్న వాళ్ళు హరిశ్చంద్రుడి కుటుంబానికి కలిగించిన కష్టాలు. ఆమె ఎంత కష్ట పడి పనిచేసినా వచ్చింది తినడానికికాని, కొడుకుకి పెట్టడానికి గాని సరిపోయేది కాదు. హరిశ్చంద్రుడు కూడా తనకి తానే అమ్ముడు పోయాడు. అతడు స్మశానవాటిక సొంతదారుడుకి అమ్ముడుపోయేలా చేసింది కూడా అతడి మీద పందెం కాచిన వాళ్ళే. హరిశ్చంద్రుడు స్మశానవాటికకి కాపలాగా ఉంటూ అక్కడికి చనిపోయిన బంధువుల శవాల్ని తీసుకుని వచ్చినవాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసే పని చేసేవాడు.
   అతడి యజమాని కూడా పందెం కాచిన వాళ్ళతో కలిసి హరిశ్చంద్రుడి జీవితంలో ఇంకా కష్టాలు కలిగించేందుకు ప్రయత్నించేవాడు. అయినా కూడా హరిశ్చంద్రుడు నిజాయతీకే కట్టుబడి ఉన్నాడు. తన జీవితం బాగుపడాలని తన భార్యని, కొడుకుని రక్షించుకునే శక్తిని ప్రసాదించమని భగవంతుణ్ణి ప్రార్ధిస్తూ మౌనంగా కష్టాల్ని భరించేవాడు. పందెం వల్ల హరిశ్చంద్రుడికి కష్టాలు మొదలయ్యి చాలా రోజులు గడిచి పోయాయి.
   ఒక రోజు రాత్రి ఒక స్త్రీ స్మశానవాటికలో ఎవర్నో దహనం చెయ్యడానికి ప్రయత్నించడం చూశాడు. హరిశ్చంద్రుడు ఆమె దగ్గరగా వెళ్ళి చూసి కూడా పందెం వేసుకున్న వాళ్ళ పన్నాగం వల్ల తన భార్యనే గుర్తించలేక పోయాడు. హరిశ్చంద్రుడు ఆమెకి డబ్బులు కట్టకపోతే శవాన్ని దహనం చెయ్యడానికి అనుమతించనని చెప్పాడు. అప్పుడే కాలడం మొదలుపెట్టిన శవాన్ని చితిలోంచి బయటికి లాగేశాడు. ఆమె తన దగ్గర ఒక్క కాసు కూడా లేదని, ఉండి ఉంటే తప్పకుండా ఇచ్చి ఉండేదాన్నని దీనంగా బతిమాలింది. తన కొడుకు పాము కరవడం వల్ల మరణించాడని దయతో కొడుకు శవాన్ని దహనం చెయ్యడానికి అనుమతించమని మళ్ళీ మళ్ళీ బతిమాలుకుంది.
   ఆమె కన్నీళ్ళకి అతడి మనసు కరిగినా అతడు ఏమీ చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాడు. డబ్బులు తీసుకోకుండా దహనం చేసుకోడానికి ఒక స్త్రీకి అనుమతి ఇచ్చి తన యజమానికి అబద్ధం చెప్పలేడు. ఆమె వైపు చూసి నీ దగ్గర ఒక్క డబ్బు కూడా లేదని చెప్పావు. కాని, నీ మెడలో హారం ఉంది కదా? అన్నాడు. ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె మెడలో ఉన్న హారం ఆమె భర్త హరిశ్చంద్రుడికి తప్ప మరెవరికీ కనిపించదు. అతడు తన మెడలో ఉన్న హారం గురించి చెప్పగానే అతడు తన భర్తేనని అర్ధం చేసుకుంది. తన భర్త ఒక గొప్ప మహారాజై ఉండి ఇంత నీచమైన ఉద్యోగం చేస్తున్నాడా...ఒక గొప్ప మహారాజు స్మశాన వాటికకి కాపలాదారుడుగా ఉండడమా? ఆమె ఆ విషయాన్ని జీర్ణించుకోలేక బిగ్గరగా ఏడ్చింది. ఆమె ఎవరో ఇప్పుడు హరిశ్చంద్రుడు అర్ధం చేసుకున్నాడు. తన కొడుకు మరణించాడని తెలుసుకుని బాధ పడ్డాడు.
   ఇదే అతడికి చివరి పరీక్ష. అతడు చనిపోయిన తన కొడుకుని దహనం చెయ్యడానికి తన యజమానిని మోసగించాలనుకున్నాడా? అక్కడ ఉన్నది తన భార్యే అయినా, చచ్చిపోయిన పిల్లవాడు తన కొడుకే అయినా సరే కర్తవ్యానికే తను కట్టుబడి ఉన్నాడు. ఎప్పటికీ తన యజమానికి అబద్ధం చెప్పడు. ఆమె దహనానికి కట్టవలసిన సుంకం చెల్లించకుండానే శవానికి దహనం చెయ్యడానికి ప్రయత్నించింది. అదే సమయంలో హరిశ్చంద్రుడి నిజాయతీ మీద పందెం కడుతున్న వాళ్ళల్లో ఒకడైన స్మశానవాటిక యజమాని అక్కడికి వచ్చాడు.
   ఉచితంగా స్థలాన్ని ఉపయోగించుకుని, సుంకం చెల్లించకుండా ఇంచుమించు చితిని వెలిగించిన, చెల్లించడానికి అశక్తురాలయిన ఆమెని శిక్షించమని స్మశానవాటిక యజమాని  హరిశ్చంద్రుడికి చెప్పాడు. ఆ శిక్ష కూడా ఏమిటో చెప్పాడు ఆమె తలని నరికెయ్యమన్నాడు. అతడి కింద బానిసగా జీవిస్తున్న హరిశ్చంద్రుడికి ఆ విషయం మీద ప్రశ్నించేందుకు అవకాశం లేదు. అతడికి ఇది ఒక ధర్మ పరీక్ష. అందువల్ల తనను ఏం చెయ్యమని తన యజమాని చెప్పాడో ఆ పని చెయ్యడానికి కత్తిని పైకి ఎత్తాడు.
   అతడి చేతిలో ఉన్న కత్తి ఒక అందమైన పూలమాలగా మారిపోయింది. హరిశ్చంద్రుడి కొడుకు అప్పుడే నిద్రలోంచి లేచినవాడిలా పైకి లేచాడు. అతడి భార్య అందమైన మహారాణీగా మారిపోయింది. అందరూ సంతోషంగాఒకళ్ళని ఒకళ్ళు చూసుకున్నారు. అంతవరకు తమ పందెం కోసం హరిశ్చంద్రుణ్ణి బాధ పెట్టిన వాళ్ళందరూ అక్కడికి చేరిపోయారు. అప్పటి వరకు అన్ని పరీక్షలకి తట్టుకుని, ఎన్నో కష్టాలు అనుభవించి కుడా ధర్మబద్ధంగా నడుచుకున్న ఆ కుటుంబాన్ని చూసి ఆనందబాష్పాలు కార్చారు. ధర్మ బద్ధంగాను, నిజాయతీగాను ఉండడంలో హరిశ్చంద్రుడు, అతడి కుటుంబం ప్రపంచానికే అదర్శంగా నిలబడ్డారు.
   అప్పటితో అతడి  కష్టాలన్నీ పోయి సంపద, కీర్తి, ప్రశాంతత, సంతోషం వంటి అనేక వరాలు పొందాడు. అతడి రాజ్యం అన్ని రాజ్యాలకంటే ఎక్కువ సంపదలతోను, కీర్తిప్రతిష్టలతోను తులతూగింది. ఎట్టి పరిస్థితుల్లోను హరిశ్చంద్రుడు తన నిజాయతీని వదులుకో లేదు. అతడి భార్య కొడుకు కూడా భగవంతుడి ఆశీర్వాదాలు అందుకున్నారు. హరిశ్చంద్రుడి నిజాయతీ ఈ భూమి మీద ఇప్పటికీ ఒక ఆదర్శంగా మిగిలిపోయింది. కొంతకాలం కష్టాలు అనుభవించినా హరిశ్చంద్రుడి కుటుంబంలో అంతర్గతంగా ఉన్న స్వచ్ఛత, నిజాయతీ వాళ్ళని రక్షించింది.
   హరిశ్చంద్రుడు నిజాయతీకి కట్టుబడి ఉన్నాడు. ఏ శక్తీ అతణ్ణి ధర్మమార్గం నుంచి పక్కకి తప్పించలేదు.  అందుకే అతడు నెగ్గాడు. ఏదేనా ఒక బలహీనతకి లొంగిపోయి ధర్మ మార్గాన్ని  విడిచి పెట్టేసి ఉంటే కొంతకాలం మాత్రమే సుఖాలు అనుభవించి తరువాత అతడి జీవితం బాధలు, కష్టాలు, కన్నీళ్ళతో గడిచిపోయి ఉండేది.
  నిజాయతీతో కూడిన పట్టుదల, స్వచ్ఛమైన మనస్సు,  క్రమశిక్షణ కలిగిన నడవడిక, ధర్మవర్తన మొదట  కష్టాలు కలిగించినా చివరికి శాశ్వతమైన ఆనందాన్ని కలిగిస్తాయి అన్నారు  స్వామి వివేకానంద.
 అటువంటి నడవడిక కలిగిన నలదమయంతులు ముందు కొంతకాలం బాధలు అనుభవించినా ఆ కష్టాల్నే అవకాశాలుగా మార్చుకుని చివరికి తమ జీవితాన్ని ఆనందమయం చేసుకున్నారు.         

No comments:

Post a Comment