About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

రాక్షసులతో జీవనం


రాక్షసులతో జీవనం
   తన నమ్మకాలను నిలబెట్టుకోవడం కోసం ప్రహ్లాదుడు చాలా కష్టపడ్డాడు, చివరికి సాధించాడు.
   ప్రహ్లాదుడు ఒక చక్రవర్తి కొడుకు. అతడు ప్రేమ, అంకితభావం, స్వచ్ఛత కలిగినవాడు. కాని అతడి తండ్రి ప్రహ్లాదుడికి పూర్తి వ్యతిరేక భావాలు కలవాడు.
    ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడికి తన కొడుకు భగవంతుణ్ణి స్మరించుకోడం అంటే ఇష్టముండేది కాదు. ఎందుకంటే, అతడు భగవంతుడి కంటే తనే గొప్పవాడినని అనుకుంటూ ఉండేవాడు. తన కొడుకు కూడా తనలాగే ఉండాలని కోరుకునేవాడు. ప్రహ్లాదుణ్ణి తన మార్గంలోనే నడవమని చెప్పేవాడు. తన చుట్టూ ఉన్నసేవకుల దగ్గర్నుంచి క్రూరమైన పద్ధతుల్ని నేర్చుకోమని ప్రోత్సహించేవాడు.
   హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి తను చెప్పినట్టు వినకపోతే భయపెట్టేవాడు. తను చెప్పిన మార్గంలో నడుచుకోకపోతే అతణ్ణి బాధలు పెట్టడానికి కూడ వెనకాడేవాడు కాదు.
   పుట్టుకతోనే జ్ఞాని అయిన ప్రహ్లాదుడు చిన్నవాడైనా కూడా తన తండ్రి ఆదేశాలు మంచివి కావు కనుక అతడికి వ్యతిరేకంగానే నడుచుకునేవాడు.
   హిరణ్యకశిపుడు గొప్ప బలపరాక్రమాలు కలిగిన చక్రవర్తి. భూమిమీద ఉన్నవాళ్ళని, స్వర్గంలో ఉన్న వాళ్ళనీ కూడా తన అధీనంలో పెట్టుకోగల సమర్ధుడు.
   అతడికి అసామాన్యమైన శక్తులు ఉన్నాయి. అతడు తనకు మనుషులచేతగాని, జంతువులచేతగాని, రాత్రిగాని- పగలుగాని, ఇంటి లోపలగాని- ఇంటి బయటగాని చావు లేకుండా ఉండేలా వరం పొందాడు.
   కనుక అతడు ఎవరికీ, ఎప్పుడూ భయపడక్కర్లేదు అనుకునేవాడు. కాబట్టి తనే అందరికీ దేవుడని, దేవుడికి కూడా తనే దేవుణ్ణి అని చెప్పుకునేవాడు.
  హిరణ్యకశిపుడికి  ప్రపంచంలో ఉన్న ఏ వస్తువయినా తనకే చెందాలన్న కోరికతో ఉండేవాడు. ఎవరైనా ఎక్కడైనా సంపదగాని, భూమిగాని, రాజ్యంగాని గలిగి ఉన్నాడంటే అది కూడా తనకే చెందాలనేవాడు.
  ప్రహ్లాదుడు తనకు కొడుకుగా పుట్టడం దురదృష్టంగా భావించేవాడు. ప్రహ్లాదుడు కష్టాల్లో ఉన్న ప్రజల బాధల్ని అడిగి తెలుసుకునేవాడు. నిస్సహాయులకి సహాయ పడేవాడు. భయం అనేది ప్రహ్లాదుడికి చిన్నతనం నుంచీ తెలియదు.
   తనకు తానుగా భగవంతుణ్ణి పూర్తి అంకితభావంతో  సేవించేవాడు. ఎప్పుడూ భగవన్నామం చేసుకుంటూ ఉండేవాడు. అతడికి కొన్ని నిర్దుష్టమైన భావాలు ఉండేవి. వాటినే ఎప్పుడూ అనుసరించేవాడు.
   అతడి తండ్రి దుర్మార్గంగా ప్రవర్తిస్తూ...తనని కూడా అలాగే ఉండమని ప్రోత్సహిస్తూ...తననే అనుసరించమని చెప్పినా , చిన్నవాడైన ప్రహ్లాదుడు మాత్రం వాటిని పట్టించుకోకుండా అంకిత భావంతోను, అణకువతోను, దైవభక్తి కలిగి ఉండేవాడు.
   హిరణ్యకశిపుడు కొంతమంది గురువులకి ప్రహ్లాదుణ్ణి అప్పగించి భగవంతుణ్ణి కాదు తండ్రినే పూజించాలి, భగవంతుడి కంటే హిరణ్యకశిపుడే గొప్పవాడు అని నరనరాల్లోను జీర్ణించుకునేట్టు నేర్పించమని చెప్పాడు.
    కాని గురువులు ఎంత చెప్పినా ప్రహ్లాదుడు మాత్రం మారలేదు.  హిరణ్యకశిపుడికి కోపం వచ్చింది.
   అటువంటి కొడుకు తనకు అవసరం లేదని, అతణ్ణి ఎలాగయినా చంపించాలని నిర్ణయించుకున్నాడు. అతడికి విషం ఇప్పించాడు. అది అతణ్ణి ఏమీ చెయ్యలేక పోయింది. ఎత్తైన కొండల మీద నుంచి కిందకి తోయించాడు.
   అయినా అద్భుతంగా అతడు రక్షించబడ్డాడు. ప్రహ్లదుణ్ణి ఏనుగుల కాళ్ళకింద పడేసి తొక్కించాడు. అది కూడా ఫలించలేదు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి ఎలాగయినా భూమి మీద లేకుండా చెయ్యాలని అనుకున్నాడు కాని అది అతడి వల్ల కాలేదు.
   ప్రపంచంలో ఉన్న అన్నింటినీ పొందగలిగిన హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు ఒక సవాలుగా మారాడు.
   సత్యాన్నే పలుకుతూ, పవిత్రంగా జీవిస్తూ, ప్రతిఫలాన్ని ఆశించని సేవతో జీవించేవాణ్ణి భూమి మీద ఉన్నవాళ్ళు, సూర్యుడికి పైన ఉన్నవాళ్ళు కూడా ఏమీ చెయ్యలేరు. అటువంటి వాడు ప్రపంచం మొత్తాన్ని ఒక్కడే ఎదిరించ గలడు.
   ఇందుకు కళ్ళకి ఎదురుగా కనిపించే నిదర్శనంగా నిలబడ్డాడు ప్రహ్లాదుడు. భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మితే ఆయనే తన భక్తుణ్ణి రక్షించుకుంటాడు అని ప్రహ్లాదుడు నిరూపించాడు.
   అతడి సొంత తండ్రి, శక్తివంతుడైన రాక్షసుడు, పెద్ద సైన్యం, పదునైన ఆయుధాలు, రాక్షస మాయలు, వెనుక ఉన్న గొప్ప బలం ఇవన్నీ కలిగిన రాక్షసులకి చక్రవర్తి అయిన హిరణ్యకశిపుడు చిన్న బాలుడైన ప్రహ్లాదుణ్ణి చంపించడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
   కాని ఏ ప్రయత్నమూ ఫలించలేదు. అతడికి ఏ ఒక్క అంశమూ హాని కలిగించలేదు.
   రాక్షసరాజుకి తన కొడుకు మీద కలిగిన కోపం తారస్థాయికి చేరుకుంది. తను అనుకున్న విధంగా కాకుండా తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న కొడుకు ప్రహ్లాదుణ్ణి చూసి హిరణ్యకశిపుడికి ప్రశాంతత లేకుండ పోయింది.
   రాక్షసరాజు తన కొడుకు తనపై చూపిస్తున్న తిరుగుబాటు ధోరణిని భరించలేక పోయాడు. విపరీతమయిన కోపంతో  నేను నీకు చాలాసార్లు నన్ను తప్ప వేరే ఏ దేవుణ్ణి సేవించ వద్దని చెప్పాను. కాని నువ్వు నీ మార్గంలోనే ఉన్నావు. నేను చెప్పినదాన్ని వినట్లేదు అన్నాడు.
   అప్పటికీ ప్రహ్లాదుడు తండ్రి మాటలకి బదులుగా భగవంతుడి నామమే పలుకుతున్నాడు.
    హిరణ్యకశిపుడు అడిగాడు  నీ దేవుడు నిజంగా అన్ని చోట్లా ఉన్నాడా? అని.
    ప్రహ్లాదుడు  అవును! అన్ని చోట్లా ఉన్నాడు!”  అని చెప్పాడు.
    ఒక స్తంభాన్ని చూపిస్తూ ప్రహ్లాదుడి భావన తప్పు అని నిరూపించాలన్న ధోరణితో  హిరణ్యకశిపుడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడా?” అంటూ ఆ స్తంభాన్ని గట్టిగా కొట్టాడు.
    ఆ స్తంభం రెండుగా చీలింది. అందులోంచి ఎవరూ ఊహించని విధంగా హిరణ్యకశిపుణ్ణి శిక్షించడానికి భగవంతుడు సగం మనిషి – సగం జంతువు ఆకారంతో బయటకు వచ్చాడు.
   నరసింహావతారంలో వచ్చిన భగవంతుడు సగం మనిషి,-సగం జంతువు అకారంలో , రాత్రి- పగలు కాని సంధ్యా సమయంలో , ఇంటి లోపల- బయట కాకుండా గడప మీద కూర్చుని హిరణ్యకశిపుణ్ణి చంపేశాడు.
   సత్యాన్నే పలకడం, పవిత్రమైన మనస్సు, వినయ స్వభావం, నిస్వార్ధసేవ భగవంతుడికి దగ్గరయ్యేలా చేస్తాయి అంటారు స్వామి వివేకానంద.
   ఎవరయితే తనని చంపడం ఎవరికీ సాధ్యం కాదని అనుకున్నాడో అతడు భగవంతుడితోనే చంపబడ్డాడు.   ప్రహ్లాదుడు తండ్రి మాటలకి, చేతలకి తిరిగి సమాధానం చెప్పకుండా వినయంగా ప్రవర్తించి తండ్రికి మోక్షం, రాక్షసులకి భగవంతుడి దర్శనం కలగడానికి కారకుడయ్యాడు.
   రాక్షస వంశంలో పుట్టి కూడా గుణసంపన్నుడై, రాక్షస ప్రవృత్తి కలిగిన తండ్రి తనకు ఎన్ని ఆపదలు కలిగించినా పరిస్థితుల్ని వినయభావంతో స్వీకరించి వాటినే అవకాశాలుగా చేసుకుని తండ్రికి భగద్దర్శనం కలిగేందుకు కారకుడయ్యాడు. అన్ని లోకాల్లోను కీర్తివంతుడుగా పేరు తెచ్చుకున్నాడు.

No comments:

Post a Comment