About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మనఆరోగ్యం మాసపత్రికకి 2018 జూలై మాసానికి
తొలిపండుగ తొలి ఏకాదశి
  
   ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో ఆషాఢంలో వచ్చే ఏకాదశి ఎంతో ప్రత్యేకమైంది. దీనినే తొలిఏకాదశి అంటారు. పద్మ పురాణం ప్రకారం ఈ రోజునుంచే శ్రీమహావిష్ణువు క్షీర సముద్రంలో యోగ నిద్రకు ఉపక్రమించి తిరిగి నాలుగు నెలల తర్వాత అంటే.. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.
   ఆషాఢ మాసంలో ప్రత్యక్షనారాయణుడు అంటే సూర్యభగవానుడు తన మార్గాన్ని ఉత్తర దిక్కు నుంచి దక్షిణ దిక్కులోకి మార్చుకుంటాడు. ఈ పండుగ దాదాపు దక్షిణాయనం ప్రారంభం అయిన తరువాత మొదటి పండుగ. విష్ణుమూర్తి తన పనులకు కొద్దిగా విశ్రాంతినిస్తూ శయనిస్తాడు.
  శయనైకాదశి
 ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు శేషసాయి మీద శయనించటానికి ప్రారంభించిన రోజు. అందుకనే ఈ రోజును తొలి ఏకాదశి అని, శయనైకాదశి అని పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఆది శేషువుపై యోగనిద్రకు ఉపక్రమించడం వలన శేషశయన ఏకాదశి అని పిలుస్తారు. దీన్నే పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు.
  ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి మునులు, యోగులు చాతుర్మాస్యదీక్ష చేస్తారు. ఈ రోజునుంచే సూర్యుడి గమనం దక్షిణం వైపు మళ్లుతుంది. అంటే ఉత్తరాయణం ముగిసి దక్షిణాయనం ఆరంభం అవుతుంది. ఈ రోజు నుంచి పగటి సమయం తగ్గి రాత్రివేళలు మరింత పెరుగుతాయి.
  కృష్ణ భక్తురాలు సతీ సక్కుబాయి ఈ తొలిఏకాదశి రోజునే వైకుంఠ ప్రాప్తి పొందినట్లు చెబుతారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర లోని పండరీపురంలో వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ పండుగను కేవలం వైష్ణవులే గాక సౌర, శైవ విధానాల వారూ జరుపుకోవటం విశేషం. 
   ఉపవాస వివరాలను గురించి భవిష్యోత్తర పురాణంలో వివరించబడింది. ఏకాదశీవ్రత ప్రాధాన్యం ఏమిటో బ్రహ్మవైవర్తన పురాణంలో చెప్పబడింది. ఏకాదశి తర్వాత వచ్చే ద్వాదశి ఘడియల్లో చేసే అన్న దానానికి అనంతకోటి పుణ్య ఫలాలు వస్తాయనిచెప్తారు.
   శ్రీకృష్ణావతారంలో తాను భక్తితో ఇచ్చే నీటినైనా సంతోషంతో స్వీకరిస్తాను అని చెప్పిన భగవానుణ్ని తలుచుకుని అత్యంత అనురాగంతో కూడిన భక్తితో శ్రీమహావిష్ణువుని శోభాయమానంగా అలంకరించి పదకొండు వత్తులతో దీపారాధన చేస్తారు. హరికథలనే చెప్పుకుంటూ హరితో నివాసం చేస్తూ ఉపవాసం చేసి శ్రీహరికి ఇష్టమైన పేలపిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా అర్పిస్తారు. ప్రతి వైష్ణవాలయంలోను స్వామికి పవళింపు సేవోత్సవం జరుపుతారు.
గోపూజ లేక పద్మవ్రతం
   గోవుకి ముఖభాగంలో వేదాలు, కొమ్మల్లో హరిహరులు, నేత్రాల్లో సూర్యచంద్రులు, జిహ్వనందు సరస్వతి, పూర్వభాగంలో యముడు, పశ్చిమంలో అగ్ని, గోమయంలో లక్ష్మి, అరుపులో ప్రజాపతి ఇలా గోదేహమంతా సర్వదేవతలు నివసిస్తారు. సర్వతీర్థాలకి సర్వదేవతలకి నివాసస్థానమైన గోవును కూడా ఈ ఏకాదశిన పూజిస్తారు.
   అధర్వణవేదం, బ్రహ్మాండపురాణం, పద్మపురాణం, మహాభారతం కూడా గోవు యొక్క గొప్పతనాన్ని గురిమ్చి వివరిస్తున్నాయి. గోశాలలను శుభ్రం చేసి ముత్యాల ముగ్గులుతీర్చి మధ్యలో ముప్పైమూడు పద్మాలముగ్గులువేసి శ్రీమహాలక్ష్మీసమేత శ్రీ మహావిష్ణువు ప్రతిమని ఆ పద్మాల మీద పెట్టి శాస్త్రోకంగా పూజచేస్తారు. పద్మానికి ఒక అప్పడం చొప్పున వాయనాలు దక్షిణతాంబూలాలు ఇస్తారు. శ్రీమహావిష్ణువుకి అత్యంత ప్రేమపాత్రమైన తులసి దగ్గర పద్మం ముగ్గువేసి దీపం వెలిగించి పండ్లని నైవేద్యంగా పెడతారు.  
   తొలిఏకాదశి వ్రతాన్ని రుక్మాంగదుడు, అంబరీషుడు కూడా పాటించారు. వాళ్లు పాటించడమే కాక వారి రాజ్యాల్లో ఉన్న ప్రజలందరితో కూడా తొలిఏకాదశి వ్రతాన్ని పాటించేలా చేశారు. తొలిఏకాదశీవ్రతం చేసేవాళ్లకి శ్రీమహావిష్ణువు ఎల్లప్పుడూ తోడునీడగా ఉంటాడు. సతీ సక్కుబాయి ఈ తొలి ఏకాదశీ వత్రం చేసి భగవానుని అనుగ్రహం పొందిందని పండరిపురంలో తొలేకాదశి నాడు మహోత్సవాలు జరుపుతారు. బంధుమిత్రులందరు కలసి సాయంకల సమయంలో విష్ణుసహస్రనామాల్ని పఠిస్తారు. హరిభజన చేస్తారు.
   చాతుర్మాస వ్రతానికి ఆరంభం ఈరోజు. దీనిని గురించి బ్రహ్మవైవర్తన పురాణం వివరిస్తుంది. ఈరోజున పిప్పల వృక్షానికి ప్రదక్షణ చేయడం కూడా మంచిదని అంటారు. చాతుర్మాస వ్రతాన్ని ఆచరించేవారు నిమ్మపండ్లు, అలసందెలు, ముల్లంగి, గుమ్మడికాయ, చెరకుగడలు విడిచిపెట్టాలని అంటారు.
 శ్రీమహావిష్ణువు నాలుగు నెలలపాటు క్షీర సముద్రంలో శేషశాయిపైన శయనిస్తాడని దేశ సంచారం చేసే యతులు ఈ నాలుగునెలలూ ఒక్కచోటనే ఉండి విష్ణుకీర్తనలు చాతుర్మాస వ్రతాన్ని చేస్తుంటారు. బౌద్ధుల్లోను చాతుర్మాస వ్రతమున్నట్టు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయదారుల పండుగగా భావిస్తారు. కొత్త పాలేర్లను పనికి పెట్టుకుంటారు. పాలేర్లందరికీ కొత్తబట్టలిచ్చి వారిని గౌరవిస్తారు.
ఆరోగ్యము
   విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు.
   సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి. తద్వారా మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. అలా ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది
   ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీక. యోగ నిద్ర అంటేభూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు రోగాలు పెరగకుండా ఉంటాయని ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని నమ్మకం.
ఏకాదశివ్రతము
   ఈ వ్రతాన్ని శైవ, వైష్ణవ, సౌర మతస్థులందరూ విష్ణుప్రీతి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించేవారు దశమినుంచే సాధనలో కొనసాగుతారు. దశమినాడు ఒక్కపూటే భుజించి, నియమాలను పాటిస్తూ మనస్సును సదా దైవస్మరణలోనే ఉంచాలి. తద్వారా ఏకాదశినాడు చేసే వ్రతాచరణకు దేహేంద్రియ మనోబుద్దులు చక్కగా సహకరిస్తాయంటారు. 
    ఏకాదశినాడు ఆచరించే వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్యభాగం. తులసితీర్థం తప్ప మరేమీ తీసుకోకూడదు. వ్రతదీక్షాపరులు దైవచింతనలోనే గడపాలి. ద్వాదశినాడు అతిథిలేకుండా భుజించకూడాదు. ద్వాదశినాడు ఉదయమే నిత్య పూజలు చేసి కేశవా! అజ్ఞానమనే అంధకారం చేత అంధుడనైన నాకు వ్రతఫలంగా జ్ఞానదృష్టిని అనుగ్రహించు అనే ప్రార్ధనాపూర్వకమైన మంత్రాన్ని పఠించాలని పురాణాలు చెప్తున్నాయి.
   ఇలా నియమాలను పాటిస్తూ, ఉపవాస దీక్షతో, ఇంద్రియ నిగ్రహంతో, శ్రద్దాభక్తులతో ఆచరించే ఏకాదశీ వ్రతంవల్ల విష్ణు సాయుజ్యం, ఇహలోకంలో సకల సంపదలు ప్రాప్తిస్తాయని.
పండుగ విశేషాలు
   తెలుగు పంచాగం ప్రకారం ఈ ఏకాదశితో మన పండుగలు మొదలవుతాయి. అప్పటికి రెండు నెలలుగా ఎలాంటి పండుగలూ లేక బోసిపోయిన ఇళ్ళకి కొత్తకళ వస్తుంది. ఈ పండుగ 4 రోజుల తర్వాత గురుపూర్ణిమ, తర్వాత శ్రావణమాసం నోములు, వ్రతాలు, ఆ పైన వినాయకచవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, శివరాత్రి పండుగలు వస్తాయి.
 ఈ పండుగను జరుపుకోవటం వెనుక పలు ఆరోగ్య, ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. ఏకాదశి అంటే 11. మనిషికున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సుతో కలిపి మొత్తం 11. వీటిని మనిషి తన అధీనంలోకి తెచ్చుకున్నప్పుడే నిగ్రహం, ఏకాగ్రత పెరుగుతాయనే సందేశం ఈ పండుగలో ఉంది.
   వర్షాకాలంలో మొదలయ్యే సమయం గనుక ప్రకృతి, పర్యావరణ మార్పుల వల్ల శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. దీనికి విరుగుడుగా ఈ రోజు చేసే ఉపవాసం వల్ల జీర్ణకోశం పరిశుద్ధమై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. 
  తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రి జాగారం చేస్తారు. ఏకాదశి ఘడియలు వెళ్లేవరకూ హరినామ సంకీర్తన, స్మరణతో గడిపి ద్వాదశి రాగానే విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తారు.
   ఇలా నియమ బద్ధంగా ఉన్నవారికి విశేష ఫలం లభిస్తుందని పెద్దల మాట. తెలుగు నాట ఈ పండుగ నాడు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేసి దేవునికి నివేదించి ప్రసాదంగా తీసుకుంటారు. తొలి ఏకాదశి భక్తితో జరుపుకుని శ్రీమహావిష్ణువు దయకి పాత్రులవుతారని ఆశిస్తూ...




1 comment:

  1. Nice post ! thanks for sharing.
    Visit our website for more news updates TrendingAndhra

    ReplyDelete