About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మనారోగ్యం మాసపత్రిక  2018 ఆగష్టు నెలకి వ్యాసము
శ్రాణమాసము-నాగపంచమి
   
   హిందువులందరికీ అత్యంత పవిత్రమైంది శ్రావణమాసం. శ్రావణమాసము శుభఫలితాలనిచ్చే మాసం.ముత్తైదువులందరూ ఉత్సాహగా, సంబరంతో పండుగలు, పూజలు, పేరంటాలు జరుపుకునే మాసం . శ్రావణమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం.
   ఈ మాసంలో రోజూ చేసుకునే పూజలు కాకుండా నాగపంచమి, పుత్రదైకాదశి, వరలక్ష్మి వ్రతం, రాఖీపౌర్ణమి, రుషి పంచమి, గోవత్సబహుళ, సీతల సప్తమి, శ్రీకృష్ణాష్టమి, పోలాల అమావాస్య వంటి పండుగలు కూడా జరుపుకుంటారు.
నాగపంచమి విశిష్ఠత
    శ్రావణ శుద్ధ పంచమి రోజుని నాగపంచమిఅంటారు. భారతీయ సంస్కృతిలో నాగపూజకి ఒక గొప్ప విశిష్టత ఉంది. హిందువుల దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. ఈ రోజున నాగేంద్రుని భక్తితో పూజిస్తే సర్పభయం ఉండదని శాస్త్ర వచనం. సర్వప్రాణికోటిని ప్రేమతో చూడాలన్నది నాగుల పంచమి పండుగలోని అంతరార్థం. నాగపంచమి ప్రాముఖ్యతను సాక్షాత్తూ పరమశివుడే స్కాందపురాణంలో వివరించాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది.
   దాదాపు అన్ని జాతుల్లోనూ నాగపూజ ఏదో ఒక విధానంలో జరుగుతూనే ఉంది. అగ్నిపురాణంలో ఎనభై నాగజాతుల వర్ణన ఉంది. నంతం వాసుకీం శేషం, పద్మనాభంచ కంబలం / శంఖ పాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తథా / ఏతాని నవనామాని నాగానంద మహాత్మనే / సాయంకాలే పఠేన్నిత్యం, ప్రాతఃకాలే విశేషతః / తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజరూభవేత్ ఇలా తొమ్మిది కాల నాగుల్ని ప్రతీ రోజూ స్మరిస్తే, కాలనాగు విషభయం లేకుండా ఉంటుంది.  
   సర్పాలు నిధులకు కావలి కాస్తాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం- కేతువు జన్మనక్షత్రమైన ఆశ్లేషకు అధిదేవత సర్పం. రాహువు జన్మనక్షత్రం భరణికి అధిదేవత యమధర్మరాజు .రాహు-కేతు జన్మ నక్షత్రాల అధిదేవతలను కాల-సౌర్పఅంటారు. కాల సర్పయోగం వున్నవారు తప్పక ఈరోజు సర్పపూజ చేయాలని శాస్త్ర వచనం. పాము కుండలినికి సంకేతం. అందువల్లే ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానం.
   ఆదిశేషుని సేవకు మెచ్చిన విష్ణుమూర్తి ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు ఆనందంతో తాము ఉద్భ వించిన పంచమి రోజు సృష్టిలోని మానవాళి సర్ప పూజలు చేయాలనిఆదిశేషుడువరం కోరుకున్నాడు. ఆదిశేషుని కోరికని మన్నించి మహావిష్ణువు వరాన్ని ప్రసాదించాడని పెద్దలు చెప్తారు.
పూజావిధానం:
  
నాగపంచమి శ్రావణమాసం మొదలైన నాలుగవ రోజున వచ్చే పండుగ. నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా తలస్నానం చేసి, ఎరుపురంగు బట్టలు ధరించాలి. పూజామందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమతోను, గుమ్మాన్ని తోరణాలతోను అలంకరించుకోవాలి.
   పూజకు గంధము, కుంకుమ, ఎరుపు వస్త్రము, నాగేంద్ర స్వామి, పాముపడగ, తెల్లని అక్షింతలు, ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు), మందారమాలతో పాటు నైవేద్యం కోసం చలిమిడి, చిన్న చిన్న ఉండ్రాళ్లు, వడపప్పు, అరటిపండ్లనిసిద్ధం చేసుకోవాలి. రెండు ఎర్రటి మట్టి ప్రమిదల్ని తీసుకుని ఏడు వత్తులు వేసి ఆవునేతితో దీపం వెలిగించాలి. నుదుట కుంకుమని ధరించి, పడమర దిక్కుకి తిరిగి ఉదయం 9 గంటల లోపు పూజను పూర్తిచెయ్యాలి.
   ముఖ్యంగా నాగపంచమి రోజున నాగేంద్రేనికి పాలు, మిర్యాలు, పూలు పెట్టి పూజిస్తారు. పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు.
   ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే భుజించడం ఆచారం. మిగతారోజుల్లో కంటె ఈనాడు ఆహారపదార్థాలు ముతకవిగా వుండేటట్ల జాగ్రత్తపడతారు. పూజాస్థలంలో రోజంతా దీపం వుంచుతారు. పాలు, భక్ష్యాలు కూడా పెట్టి వుంచుతారు. సాయంకాలం మళ్లీ పూజ చేసి,  నైవేద్యం పెడతారు. రాత్రి అంతా దీపాలు వుంచి,  భక్తులు ఆడుకుంటూ మేలుకుని వుంటారు. ఇంటిలోఉండే స్త్రీలని, పిల్లల్ని ఒక చోట చేర్చి వారిలో పెద్దవాళ్లు పండుగ పుట్టుపూర్వోత్తరాల గురించి చెప్తారు. కథ
వింటున్నంత సేపు చేతిలో అక్షతలు పట్టుకుని తరువాత అందరికి తలమీద చల్లుకుంటారు. పెద్దవాళ్లు చిన్నవాళ్లని ఆశీర్వదిస్తారు.
నాగపంచమి కథలు
   ఈ పండుగ గురించిన కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. కశ్యపప్రజాపతి సతీమణుల్లోని వినత, కద్రువలు అక్కాచెల్లెళ్లు. ఒక రోజు దూరంగా వున్న ఒక తెల్లటి అశ్వాన్ని చూసిన కద్రువ దాని తోక నల్లగా వుందని చెప్పింది. అయితే వినత దాని తోక తెల్లగానే వుందని చెప్పింది. దీంతో వారు పందెం వేసుకుని పందెంలో ఓడిపోయినవాళ్లు గెలిచిన వారి దగ్గర దాసిగా పనిచేయాలని పందెం పెట్టుకున్నారు. ఇంతలో రాత్రి కావడంతో పొద్దున వద్దామని వెళ్లిపోయారు.
   ఆ రాత్రి కద్రువ తన సర్పకుమారులందరిని పిలిచి ఎవరైనా అశ్వం తోకకు చుట్టుకోవాలని అడుగుతుంది. నాగులు అలా చెయ్యడం పాపమని చెప్తాయి. కోపంతో కద్రువ భవిష్యత్తులో జరిగే సర్పయాగంలో నాగజాతి అంతమవుతుందని శపిస్తుంది.  కర్కోటకుడు శాపానికి భయపడి అశ్వం తోకకి చుట్టుకుంటాడు. మర్నాడు అశ్వాన్ని చూసిన వినత తాను ఓడిపోయినట్టు గ్రహించి దాసిగా వుండిపోయింది. ఆమె కుమారుడైన గరుత్మంతుడు తల్లికి శాపవిముక్తి కలిగించాడు. అందుకే గరుడ పంచమి అని కూడా పిలుస్తారు.
   ద్వాపర యుగంలో పరీక్షిత్తు మహారాజు తక్షకుడి కాటుతో మరణించాడు. తండ్రి మరణానికి నాగులే కారణమన్న కోపంతో జనమజేయుడు సర్పయాగం చేసి నాగజాతిని నాశనం చెయ్యడం మొదలుపెట్టాడు. వాసుకి సోదరి మాతా మానసాదేవి తన కుమారుడైన ఆస్తీకుణ్ని పంపించి జనమేజయుడికి చెప్పి సర్పయాగాన్ని ఆపిస్తుంది.
   మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మడికి నాగపంచమి రోజు భూమి దున్నకూడదనీ, గోతులు తవ్వకూడదనీ, పారతో మన్ను పొడిచి యెత్తకూడదనీ, మొక్కలు మొదలైనవి పీకకూడదనీ, మంట పెట్టకూడదనీ, రొట్టె మొదలయినవి కాల్చి పక్వం చేయకూడదనీ అతనికి తెలియదు. అందుచేత అతడు మామూలుగా పొలం దున్నడం ప్రారంభించాడు. అదే పొలంలో ఒక కలుగులో నాగిని (ఆడపాము) పిల్లల్ని దాచింది. నాగలి కర్రుకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. బయటికి వెళ్ళిన నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయివుండటం చూచింది. అది చూసిన నాగినికి కోపం వచ్చింది.
   తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతుకుతూ నాగిని ఆ గౌడ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చింది.  నిద్రపోతూ ఉన్న ఆ బ్రాహ్మణ్ని అతడి కుటుంబంలో వాళ్లని అందర్నీ కరిచి చంపివేసింది. పొరుగు పల్లెలో ఉన్న బ్రాహ్మడి కూతురి కుటుంబాన్ని కూడా నాశనం చెయ్యాలని వెళ్ళి అక్కడ ఆమెతో పూజలందుకుని నైవేద్యాన్ని తిని తృప్తి, సంతోషం పొందింది. తరువాత జరిగినదంత బ్రాహ్మడి కూతురికి చెప్పి వాళ్లని  బ్రతికించడం కోసం ఆమెకి ఒక విధమైన అమృతం ఇచ్చి దానిని చనిపోయిన వాళ్ల కళేబరాల మీద చల్లమంది.
 ఈ లోగా మణిపురంలో  బ్రాహ్మడు ఎంతసేపటికి లేవకపోవడానికి ఆశ్చర్యపోతూ చుట్టుపక్కలవాళ్లు తలుపు బద్దలుకొట్టి లోపల ప్రవేశించారు. అదే సమయంలో ఆ బ్రాహ్మడి కూతురు అక్కడికి వచ్చి పాము ఇచ్చిన అమృతం వాళ్ల మీద చిలికి వాళ్లని బతికించింది. తరువాత ఆమె జరిగిన వృత్తాంతమంతా చుట్టాలకు చెప్పి శ్రావణ పంచమినాడు నాగపంచమి వ్రతం చేయించింది.
      పూర్వకాలంలో ఒకానొక గ్రామంలో ఒక ధనవంతురాలు ఉండేది. ఆమె సద్గుణ సంపన్నురాలు. అమెకి చెవిలో చీము కారుతుండేది. రాత్రి నిద్రపోతున్నప్పుడు  సర్పం కలలో కనబడి కాటు వేయబోతుండేది. ఎన్ని పూజలు చేసినా ఎన్ని శాంతులు చేయించినా ఫలితం కనిపించలేదు.
   ఒకనాడు ఒక సాధువు వాళ్ళ ఊరుకి వచ్చాడు. ఆ సాధువు వద్దకు వెళ్ళి  తన బాధని చెప్పి,ఇవి తొలగే మార్గం చెప్పమని వేడుకుంది.ఆ సాధువు ఆమె బాధవిని ఇది నీకు సర్పదోషంవల్ల సంభవించిందని,నాగ పంచమి నోము నోచినట్లయితే  కలతలు తీరుతాయని ఆ వ్రత విధానము, దాని నియమాల గురించి వివరించి వెళ్ళిపోయాడు. ఆమె ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రబావం వల్ల తన భయాందోళనలు తగ్గి సంతోషంగా వుంది.
   శ్రావణమాసంలో అన్ని పూజలకి తయారు చేసుకునే నైవేద్యాలు. ఇవి ఈ మాసాన్ని బట్టి శరీరానికి ఆరోగ్యాన్ని కలుగచేస్తాయి.
  పూర్ణం బూరెలు : సెనగపప్పుతో తయారు చేసిన ఈ బూరెలు తినడం ద్వారా ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి.పులగం : బియ్యం , పెసరపప్పులను కలిపి తయారు చేస్తారు .ఇది భుజించడం ద్వారా మేధస్సు వికసిస్తుంది. గారెలు : మినపపప్పు , కొద్దిగా సెనగపప్పు వేసి తయారు చేస్తారు . ఇందులో ఎన్నో ప్రోటీన్లు ఉన్నాయి పరమాన్నము :  దీన్ని తినడం వల్ల కాల్షియం లభిస్తుంది. చెక్కెర పొంగలి :  మెదడు, ఇతర అవయవాలు చురుగ్గా పనిచేసి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.పులిహోరా : దీనిని తినడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. చిట్టి బూరెలు : చలువ చేస్తాయి. పెసర బూరెలు : పెసర పప్పుతో తయారు చేసిన ఈ బూరెల్లో ప్రోటీన్లు లభిస్తాయి. గోధుమ ప్రసాదము : ఇది బలమైన ఆహారము .
   ఈ పంచమిని తెలంగాణ, రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో, ఉత్తరభారతదేశం, కర్నాటకలో అత్యంత భక్తిశ్రద్ధలతో చేస్తారు.





No comments:

Post a Comment