About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మాతృభక్తి
పాండవుల కథ
 
   రెల్లు గడ్డితో కుండ ఆకారంలో కట్టిన ఇంట్లో కుంతీ దేవి ఒక్కర్తే కూర్చుని అలోచిస్తోంది. కొడుకులు అయిదుగురు ఏదో ఉత్సవం చూసొస్తామని చెప్పి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళి చాలసేపు అయింది. చీకటి పడుతున్నా ఇంకా రాలేదు.  
  అసలే క్రూరస్వభావం కలిగిన కౌరవులు పాండవులకి కీడు చెయ్యడం కోసం అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళ చేతికి చిక్కితే మళ్ళీ అన్నీ కష్టాలే. ఏదో బ్రాహ్మణ వేషంలో తిరుగుతూ ఈ మరుమూల తలదాచుకున్నాం.
   మేం బయల్దేరి వస్తుంటే దివ్యజ్ఞానం కలిగిన వేదవ్యాసుడు ఎదురొచ్చి మీకు అంతా శుభమే కలుగుతుంది అని చెప్పాడు. ఆ మహాత్ముడు చెప్పింది నిజం కాకుండా ఉంటుందా? దేవతలారా! బ్రహ్మణోత్తములారా! ఏ దిక్కూ లేని నాకు మీరే దిక్కు. పాండవకుమారుల్ని భద్రంగా ఇంటికి వచ్చేట్టు చూడండి అని ప్రార్ధిస్తూ తల వంచుకుని కూర్చుంది.
   అదే సమయంలో ధర్మరాజు నకుల సహదేవులతో వచ్చాడు. వాళ్ళ వెనకాలే అర్జునుడు భీముడు ద్రౌపదితో కలిసి వచ్చి అమ్మా! మేం ఒక భిక్ష తీసుకుని వచ్చాం! అన్నారు.
  కుంతీదేవి వాళ్ళు తీసుకుని వచ్చిన భిక్ష ఏమిటో చూడలేదు. కొడుకులు క్షేమంగా తిరిగి వచ్చారన్న సంతోషంతో ఎప్పుడూ చెప్పినట్టే మీరు తెచ్చిన భిక్షని అయిదుగురూ పంచుకోండి! అంది. అంతలోనే తలెత్తి కొడుకులవైపు చూసింది. అయిదుగురి మధ్యలో ముల్లోకాల్ని పరిపాలించే రాజ్యలక్ష్మిలా వెలిగిపోతున్న ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయింది.
   తన దగ్గర్లో నిలబడిన ధర్మరాజుని చూసి కుమారా! మీరు ప్రతిరోజూ భిక్షకోసం వెళ్ళి భిక్ష తీసుకుని రావడం, భిక్ష తెచ్చామని చెప్పడం, మీ అయిదుగురు పంచుకోండి! అని నేను చెప్పడం అలవాటుగా మారిపోయింది. అదే అలవాటులో ఇప్పుడు కూడా చెప్పాను. మీరు ఎప్పుడూ నా మాట కాదనలేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి. ఇలా జరగడం లోకంలో ఎక్కడా లేదుఅంది సందేహంగా.
   ధర్మరాజు పార్థా! మత్స్య యంత్రాన్ని కొట్టింది నువ్వే కనుక అగ్నిసాక్షిగ ఈమెని నువ్వే వివాహం చేసుకోవాలి అన్నాడు.  అది విని అర్జునుడు ధర్మరాజా! పాండవుల్లో పెద్దవాడివి. నేను మధ్యవాడిని. మొదట నేను వివాహం చేసుకోడం ధర్మం కాదు. నువ్వే ద్రౌపదిని పట్టమహిషిగా స్వీకరించు. నువ్వు ఆమెని వివాహం చేసుకోడం మా నలుగురికీ ఇష్టమే అన్నాడు.
   భగవంతుడి ఉద్దేశ్యం ప్రకారం ఆమె అయిదుగురికీ భార్య అవాలని ఉందో ఏమో పాండవులు అయిదుగురికీ ద్రౌపది మీద ఇష్టం ఏర్పడింది. అది తెలుసుకున్న ధర్మరాజు అర్జునా! మనం ఇక్కడికి వచ్చే ముందు వేదవ్యాసమహర్షి మనల్ని కలిసి మీ అయిదుగురికీ శుభం కలుగుతుంది అని చెప్పాడు. అయన చెప్పిన మాటలకి అనుకూలంగా అమ్మ నోటి వెంట కూడా అదే మాట వచ్చింది. కనుక, మనం అయిదుగురం ఈమెని వివాహం చేసుకుందాం అని చెప్పాడు.
   పాంచాలదేశంలో ద్రుపద మహారాజు అలోచనలో పడ్డాడు. స్వయంవరం చాలా బాగా జరిగింది. అనేకమంది రాజులు, బ్రాహ్మణులు వచ్చారు. వాళ్ళల్లో ఒకడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని తీసుకుని వెళ్ళాడు. మత్స్యయంత్రాన్ని అవలీలగా కొట్టాడు కాబట్టి సందేహం లేకుండ అతడు వీరుడే.
   కాని, అతడు రాజో, బ్రాహ్మణుడో, అతడి గోత్రనామాలు ఏమిటో తెలియలేదు. అతడు ఎలాంటివాడో తెలియదు. తన గారాల కూతురు అక్కడ ఎలా ఉంటుందో అన్నీ సందేహాలే.
   ద్రుపదుడు దృష్టద్యుమ్నుణ్ణి పిలిచి ద్రౌపదిని తీసుకుని వెడుతున్నవాళ్ల వెంట వెళ్ళి వివరాలు తెలుసుకుని రమ్మన్నాడు. దృష్టద్యుమ్నుడు తండ్రి చెప్పినట్టే భీమార్జునుల వెనకాలే వాళ్ళకి తెలియకుండా వెళ్ళి అంతా చూసి వచ్చాడు.
   తండ్రితో రాజా! వాళ్ళు మన ద్రౌపదిని ఒక కుండ ఆకారంలో రెల్లు గడ్డితో కట్టబడిన ఇంట్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉన్న ముసలి అవ్వకాళ్ళకి మొక్కమన్నారు. తరువాత వాళ్ళల్లో గౌర రంగులో ఉన్న ఒక బ్రాహ్మణుడు మిగిలిన నలుగుర్ని భిక్షకి వెళ్ళి రమ్మన్నాడు.
  వాళ్ళు నలుగురు బిక్ష తీసుకుని వచ్చి అవ్వకి ఇచ్చారు. ఆ బిక్షలో కొంత బలిదానం, కొంత బ్రాహ్మణులకి పెట్టించి మిగిలినదాంట్లో అయిదుగురికి మన ద్రౌపదితో పెట్టించింది. మిగిలినదాన్ని అవ్వ, ద్రౌపది తిన్నారు.
   మన ద్రౌపది కూడా కష్టమనుకోకుండా అవ్వ చెప్పినట్టు అనందంగా చేస్తోంది. వాళ్ళ పరుపులు దర్భలతో చేసినవి. ఇంత సంపదలు అనుభవించి వెళ్ళిన మన ద్రౌపది వాటిని చూసి కొంచెం కూడా అసహ్యించుకోలేదు.
   వాళ్ళు వేషంలో బ్రాహ్మణులుగా కనిపించినా, మాటలని బట్టి చూస్తే క్షత్రియుల్లా ఉన్నారు. వాళ్ళల్లో వాళ్ళు మాట్లడుకుంటున్న విద్యారహస్యాలు కూడ విన్నాను. దాన్నిబట్టి వాళ్ళు బ్రాహ్మణులో, క్షత్రియులో అయి ఉంటారు కాని ఇతర వర్ణాలవాళ్ళు మాత్రం కాదని అనిపించింది అని చెప్పాడు.
   ద్రుపదుడు కొడుకు మాటలు విని కొంచెం ప్రంశాంతంగా అనిపించినా ద్రౌపదికి అతడితో వివాహం చెయ్యాలి కనుక పురోహితుణ్ణి పిలిచి మిగిలిన వివరాలు తెలుసుకుని రమ్మన్నాడు. పురోహితుడు కొంతమంది బ్రాహ్మణుల్ని తీసుకుని పాండవుల దగ్గరికి వెళ్ళాడు. ధర్మరాజు వాళ్ళని సాదరంగా ఆహ్వానించాడు. భీముడితో ఆయనకి పూజ చేయించాడు.
   పురోహితుడు అయ్యా! ద్రుపదరాజు మీ కులగోత్ర నామాలు తెలుసుకుని రమ్మని నన్ను పంపించాడు. మత్స్యయంత్రాన్ని పడగొట్టిన వీరుణ్ణి ఒకసారి చూడాలని అనుకుంటున్నాడు అని చెప్పాడు.
  ధర్మరాజు చిరునవ్వుతో బ్రాహ్మణోత్తమా! మీ రాజు మత్స్యయంత్రాన్ని పడగొట్టినవాడే ఈ కన్యకి వరుడు అని చెప్పాడు. అయన చెప్పినట్టే ఈ వీరుడు మత్స్యయంత్రాన్ని పడగొట్టి కన్యని తెచ్చుకున్నాడు. ఇంక మీ రాజుకి మా కులగోత్రాలతో పనేముంటుంది? ఇప్పుడు తెలుసుకుని ఏం చెయ్యగలడు? వీరుడు కాకపోతే అటువంటి పనికి అసలు రాడు. కులహీనుడు అటువంటి లక్ష్యాన్ని పడగొట్టలేడు కదా? అన్నాడు. ధర్మరాజు మాటలు విని పురోహితుడు ద్రుపదుడికి చెప్పాడు.
   ద్రుపదుడు రథం పంపించి పాండవుల్ని తన రాజ్యానికి రప్పించుకున్నాడు. అయ్యా! మీరు బ్రాహ్మణులో, క్షత్రియులో, మారువేషంలో తిరుగుతున్న మంత్రసిద్ధులో, ఈ కన్యని చేసుకోవాలన్న కోరికతో స్వర్గం నుండి వచ్చిన దేవతలో నాకు తెలియదు.
   మీ వివరాలు తెలియకపోతే వివాహం ఏ  పద్ధతి ప్రకారం చెయ్యాలో అర్ధం కాలేదు. దానికోసమే మీ వివరాలు అడిగాను. నా సందేహాన్ని తీరుస్తే వివాహనికి సన్నాహాలు చేసుకుంటాను అన్నాడు.
   ధర్మరాజు మహారాజా! మేం క్షత్రియులం. పాండురాజు కుమారులం. నా పేరు ధర్మరాజు, వీళ్ళిద్దరు భీమార్జునులు, వీళ్ళిద్దరు నకులసహదేవులు, ఈమే పూజ్యనీయురాలైన మా తల్లి కుంతీదేవి అని పరిచయం చేసుకున్నాడు.
   ద్రుపదరాజుకి ఆనందంతో మాటలేకుండ ఉండిపోయాడు. లక్షాగృహంలో కాలిపోయారని మేము ఎంతో బాధపడ్డాం. ఇప్పుడు చాలా ప్రశాంతంగాను, సంతోషంగాను ఉంది అని చెప్పి సంతోషంగా వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతూ అతిథిసత్కారాలు చేశాడు.
  తరువాత ధర్మరాజా! స్వయంవరంలో గెలుచుకున్న ఈ కన్యని అర్జునుడు వివాహం చేసుకోవాలి అన్నాడు.
   అది విని ధర్మరాజు ద్రుపదరాజా! ఈ కన్యని మేము అయిదుగురం వివాహం చేసుకుంటున్నాం. ఇది మా తల్లి మాకు చెప్పిన మాట! మేం అయిదుగురం ఆమె మాట ప్రకారమే నడుచుకుంటాం! అని చెప్పాడు.
తల్లి మాటని గౌరవించే వాళ్ళకి అంతా మంచే జరుగుతుంది!!



No comments:

Post a Comment