About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

లక్ష్యము
ద్రోణాచార్యుడు కథ
   అర్జునుడు చిన్నతనంలోనే ప్రపంచ ప్రఖ్యాతి పొందిన విలుకాడుగా పేరు పొందాడు. అప్పటికి అతడు చాలా చిన్నవాడు.
   ఒకరోజు సాయంత్రం అతడు భోజనం చేస్తూండగా పెద్ద గాలి వీచి దీపాలన్నీ ఆరిపోయాయి. అంతా చీకటి మయం. ఏమీ కనిపించట్లేదు...అయినా అర్జునుడు తినడం ఆపలేదు.
  అంత చీకట్లో ఏమీ కనిపించక పోయినా అతడికి అన్నం నోట్లో పెట్టుకోడానికి కష్టంగా అనిపించలేదు.
   ఆ విషయం అతడిలో ఒక అలోచనని రేకెత్తించింది. కళ్లకి ఏదీ కనిపించనంత చీకట్లో భోజనం నోట్లో పెట్టుకోగలిగినప్పుడు అదే చీకట్లో లక్ష్యం వైపు చూడకుండ బాణాల్ని వెయ్యలేనా? అనుకున్నాడు.
   ఆ ఆలోచన రాగానే సాధన మొదలు పెట్టాడు. రాత్రి పగలు కష్టపడి సాధన చేశాడు. అతి తక్కువ కాలంలోనే తన తోటి వాళ్ళల్లో గొప్ప విలుకాడుగా నిలిచాడు.
   అర్జునుడు కంటికి కనిపించనంత దూరంలో ఉన్న లక్ష్యాల్ని కూడా శబ్దం విని బాణం వేసేవాడు. చీకట్లో ఏదేనా వస్తువుల శబ్దంగాని. జంతువుల అలికిడిగాని వినిపించినప్పుడు గురి తప్పకుండా బాణాలు వేసేవాడు.
   అంతేకాదు, అర్జునుడు రెండు చేతులతోనూ ఒకేసారి బాణాలు సంధించడంలో ప్రావీణ్యత సంపాదించాడు. అందుకే అతణ్ణి సవ్యసాచి అని పిలిచేవాళ్ళు.
    గురువు ద్రోణుడు అర్జునుడి విలువిద్యా నైపుణ్యం చూసి చాలా సంతోషించేవాడు. ప్రపంచంలో అతి గొప్ప విలుకాడుగా అర్జునుడే ఉండాలని కోరుకునేవాడు.
   ద్రోణుడుకి అర్జునుడి మీద ఉన్న ప్రత్యేకమైన అభిమానానికి మిగిలిన రాజకుమారులు ఈర్ష్య పడేవాళ్ళు.
   ఒక రోజు ద్రోణుడు అర్జునుడి ప్రత్యేకత ఏమిటో మిగిలిన రాజకుమారులకి తెలియ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రాజకుమారులకి విలువిద్యలో పోటీ ఏర్పాట్లు ప్రారంభించాడు.
   కొన్ని రోజుల్లోనే పోటీ ఏర్పాటు చెయ్యబడింది. ద్రోణుడి దగ్గర విలువిద్య నేర్చుకుంటున్నశిష్యులు నూరుగురు కౌరవులు, అయిదుగురు పాండవులు ఈ పోటీలో పాల్గొన్నారు.
   ఒక పక్షిని చెట్టుకి కట్టి దాని కన్నుని లక్ష్యంగా చేశారు. ఒకళ్ళ తరువాత ఒకళ్ళు లక్ష్యాన్ని ఛేదించడానికి రావాలి. 
   వచ్చిన వాళ్ళు బాణాన్ని సంధించే ముందు  ద్రోణుడు వేసిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ద్రోణుడు అడిగిన ప్రశ్నకి సరిగ్గా జవాబు చెప్పినవాళ్ళే లక్ష్యాన్ని ఛేదిస్తారు. జవాబు సరిగా చెప్పని వాళ్ళు పక్కకి తప్పుకోవాలి.
   వరుసగా ఒక్కొక్కళ్ళే ఆ చోటికి వస్తున్నారు. ద్రోణుడు “ నీకు ఏం కనిపిస్తోంది?” అని అడుగుతున్నాడు.
   శిష్యులు నది, చెట్టు, కొమ్మలు, అకులు, పక్షి అంటూ ఎవరికి కనిపించినదాన్ని వాళ్ళు చెప్తున్నారు. అలా చెప్పిన వాళ్లని పక్కకి తప్పుకోమన్నాడు.
   చివరిగా అర్జునుడి వంతు వచ్చింది. అర్జునుణ్ణి కూడా “నీకు ఏం కనిపిస్తోంది?” అడిగాడు ద్రోణుడు.
   అర్జునుడు “ ఆచార్యా! నాకు పక్షి కన్ను కనిపిస్తోంది” అన్నాడు.
   ద్రోణుడు “వెంటనే బాణాన్ని సంధించు!” అన్నాడు.
   అర్జునుడు పక్షి కన్నుని కొట్టాడు. అదే అర్జునుడి ఏకాగ్రతలో ఉన్న గొప్పతనం.
   పాండుమహారాజు కుమారులు పాండవులు. వాళ్ళల్లో అర్జునుడు మూడవవాడు. ఆ రోజుల్లో అర్జునుడు గొప్ప విలుకాడని అందరికీ తెలుసు.
   పాండవులు ఎంత గొప్పవాళ్ళయినా విధి వాళ్ళని తన వశం చేసుకుని వాళ్ళతో ఎన్నో ఆటలు ఆడుకుంది. జీవితంలో వాళ్ళు చాలా కష్టాలు పడ్డారు.
   ఒక సమయంలో కౌరవులు, పాండవుల్ని దేశం నుంచి బయటకి పంపించి మారు వేషాల్లో జీవించవలసిన పరిస్థితిని కల్పించారు.
   పాండవులు కౌరవుల నుంచి తప్పించుకోడం కోసం బ్రాహ్మణ వేషాల్లో తిరిగారు. పాండవుల్ని, వాళ్ళ తల్లి కుంతీదేవిని తీర్థయాత్రల పేరుతో పంపించి వాళ్ళని చంపడానికి అనేక ప్రయత్నాలు చేశారు కౌరవులు.
    వాళ్ళకి చిక్కకుండా ఉండడం కోసం పాండవులు మారువేషాల్లో తిరగ వలసి వచ్చింది.
   అదే సమయంలో ద్రుపద మహారాజు తన కుమార్తె ద్రౌపదికి స్వయంవరం ప్రకటించాడు. చాలామంది రాజకుమారులు అక్కడికి చేరుకున్నారు. బ్రాహ్మణులతో కలిసి పాండవులు కూడా అక్కడికి వెళ్ళారు.
   వచ్చిన వాళ్ళల్లో విలువిద్యలో ఆరితేరిన వాళ్ళని తన కుమార్తెకి వరుడుగా ఎంచుకోవాలని అనుకున్నాడు ద్రుపదుడు. స్వయంవరానికి వచ్చిన వాళ్ళకి ఒక పరీక్ష పెట్టాడు.
   పై కప్పుకి ఒక చేపని వ్రేలాడదీశారు. దాని కింద ఒక చక్రాన్ని తిరుగుతూ ఉండేలా అమర్చారు. తిరుగుతున్న చక్రం మధ్య భాగంలోంచి చూస్తూ చేప కన్నుకి గురి పెట్టి బాణంతో కొట్టాలన్నమాట!
    దానికి కూడా ఒక షరతు పెట్టారు. పైన ఉన్న చేపని గాని, దాని కింద తిరుగుతున్న చక్రాన్నికాని చూడకూడదు. చేప యొక్క బింబాన్ని మాత్రమే చూడాలి.
   అందుకోసం వాటి కింద ఒక గిన్నెలో నూనె పోసి పెట్టారు. చేప ప్రతిబింబం గిన్నెలో ఉన్న నూనెలో కనిపించేలా దాన్ని అమర్చారు. పైన గిరగిరా తిరుగుతున్న చక్రం మధ్యంలో ఉన్న చేప ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ చేప కన్ను మీద  కొట్టాలి.
   దీన్నే మత్స్యయంత్రం పడగొట్టడం అంటారు. అలా కొట్టగలిగిన వాడికే ద్రౌపదిని ఇచ్చి పెళ్ళి చేస్తారు.  నిజంగా అది అసాధ్యమైన పనే!
  అక్కడికి వచ్చిన రాజకుమారుల్లో ఒక్కళ్ళు కూడా మత్స్యయంత్రాన్ని కొట్టలేక పోయారు. బ్రాహ్మణుల వైపు కూర్చున్న అర్జునుడు లేచి నిలబడ్డాడు. రాజకుమారులు అతడు లేవడాన్ని చూసి ఆశ్చర్యపోయారు.
  ఇంత మంది విలువిద్యలో ఆరితేరిన రాజకుమారులే చెయ్య లేని పనిని ఒక బ్రాహ్మణ కుమారుడు చెయ్యగలననే అనుకుంటున్నడా? అదీ చూద్దాం! అనుకుని నవ్వారు.
   అర్జునుడు వాళ్ళ నవ్వుని పట్టించుకోలేదు. తన సామర్ధ్యం గురించి తనకు తెలుసు కనుక, ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకి వేశాడు.
   నూనెలో కనిపిస్తున్న చేప కన్నుని ఏకాగ్రతతో చూశాడు...బాణాన్ని సంధించాడు...లక్ష్యాన్ని సాధించాడు.
    తను ఇష్టపడిన విలువిద్యని అంకిత భావంతోను, ఏకాగ్రతతోను నేర్చుకున్నాడు. విద్యని నేర్చుకోవలసిన వయస్సులో నేర్చుకుని దాన్ని లక్ష్యంగా చేసుకుని జీవితాన్ని మంచి మార్గంలో మలుచుకుంటే మిగిలిన జీవితం అనందంగా సాగిపోతుంది అని ద్రోణాచార్యుడు తన శిష్యులకి బోధించాడు..
లక్ష్యం అనేది ఉంటే అదే మార్గాన్ని సుగమమం చేస్తుంది!!

No comments:

Post a Comment