About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

వాతాపిజీర్ణం
అగస్త్యమహర్షి కథ
  
   పరమేశ్వరుడి వల్ల పాశుపతాస్త్రాన్ని పొంది సంతోషంతో తిరిగి వస్తున్నాడు అర్జునుడు. ఇంద్రుడు దేవగణంతో అర్జునుడికి ప్రత్యక్షమయ్యాడు. నివాతుడు, కవచుడు అనే ఇద్దరు రాక్షసులు దేవతల్ని బాధపెడుతున్నారని వాళ్ళని సంహరించమని అడిగాడు.
   అర్జునుడు అమరావతికి వెళ్ళి దేవతల్ని బాధ పెడుతున్న రాక్షసుల్ని చంపి దేవతలిచ్చిన దివ్యాస్త్రాల్ని తీసుకుని అనందంగా భూలోకానికి తిరిగి వచ్చాడు. పాంచాలి, పాండవులు అతడు పొందిన అస్త్రాల గురించి, దేవతలకి అతడు చేసిన సహాయం గురించి తెలుసుకుని ఎంతో సంతోషంగా అతణ్ణి అభినందించారు.
   ధర్మరాజు తమ్ముళ్ళతోను, పాంచాలితోను కలిసి పుణ్యతీర్థాలు చూస్తూ తిరుగుతున్నాడు. మహర్షుల వల్ల పుణ్య కథల విశేషాలు, ధర్మ విశేషాలు వింటూ అగస్త్యమహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు రోమశుడు అనే మహర్షి అగస్త్యమహర్షి చరిత్ర చెప్తూ వాతాపిజీర్ణం అంటే ఏమిటో ఇలా చెప్పాడు.
   అగస్త్య మహర్షి బ్రహ్మచర్య దీక్ష స్వీకరించి చాలాకాలం తపస్సు చేశాడు. ఒకరోజు అడవిలో తిరుగుతున్న మహర్షికి ఒక చెట్టు కొమ్మకి తలకిందులుగా వ్రేలాడుతున్న తల్లితండ్రులు కనిపించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు ఉన్నారు? అని అడిగాడు.
   నువ్వు ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తూ గడిపేస్తున్నావు. పెళ్ళి చేసుకుని సంతానాన్ని పొందకుండా ఉండిపోయావు. అందుచేత మాకు పైలోకాల్లో స్థానం దొరకలేదు. నువ్వు సంతానం పొందేవరకు మేం ఇక్కడే, ఇలాగే  ఉండాలి” అని చెప్పారు.
   అగస్త్యమహర్షి తన తల్లితండ్రులకి విముక్తి కలిగించి వాళ్ళని పుణ్యలోకాలకి పంపించాలని అనుకున్నాడు. తను పెళ్ళి చేసుకుంటే కాని ఈ సమస్య తీరదు. తనకి ఒక కన్య కావాలి కనుక, తన తపశ్శక్తితో విదర్భరాజుకి ఒక కూతురు కలిగేలా చేశాడు.
  ఆ బాలిక లోపాముద్ర అనే పేరుతో పెరుగుతోంది. ఆమె పెరిగి పెద్దదై యుక్త వయస్సుకి వచ్చింది. అగస్త్య మహర్షికి భయపడి రాజకుమారులు ఎవరూ అమెని పెళ్ళి చేసుకోడానికి ముందుకు రాలేదు.
   ఒకరోజు అగస్త్య మహర్షి విదర్భరాజు దగ్గరికి వెళ్ళి తనకు లోపాముద్రనిచ్చి పెళ్ళి చెయ్యమని అడిగాడు. నారబట్టలు కడుతూ, కందమూలాలు తింటూ, దట్టమైన అడవుల్లో తపస్సు చేసుకుంటూ చిక్కి శల్యమై ఉన్న ఆ బ్రాహ్మణుడికి తన కుమార్తెనిచ్చి పెళ్ళి చెయ్యడానికి రాజు మనస్సు అంగీకరించలేదు.
   ఏం చెయ్యాలో తేల్చుకోలేక రాజ దంపతులు బాధపడుతున్నారు. సుగుణాలరాశి లోపాముద్ర తల్లితండ్రుల బాధని అర్ధం చేసుకుని అగస్త్య మహర్షిని తప్ప ఇంకెవరినీ పెళ్ళి చేసుకోనని తండ్రికి చెప్పింది.
   కూతురు ఇష్టం తెలుసుకుని విదర్భరాజు దంపతులు సంతోషపడ్డారు. లోపాముద్రని అగస్త్యమహర్షికి ఇచ్చి పెళ్ళి చేశారు. ఆమెకి కూడా నారబట్టలు కట్టి అగస్త్యమహర్షితో పాటు అతడి ఆశ్రమానికి పంపించారు.
   అగస్త్య మహర్షి తనతో వచ్చిన లోపాముద్రని తీసుకుని గంగాతీరం చేరుకుని తపస్సులో మునిగిపోయాడు. లోపాముద్ర భక్తిశ్రద్ధలతో భర్తకి సేవ చేస్తోంది. ఆమె చేస్తున్న సేవకి సంతోషపడి అగస్త్యమహర్షి లోపాముద్రని ఏం కావాలో కోరుకో ఇస్తానన్నాడు.
   ప్రాణేశ్వరా! మనమిద్దరం మంచి బట్టలు, ఆభరణాలు ధరించాలని కోరికగా ఉంది” అని చెప్పింది. అగస్త్యుడు ధనం కోసం తన తపశ్శక్తిని ఖర్చుపెట్టుకోడానికి ఇష్టపడలేదు.
   పురుకుత్స మహారాజు కొడుకైన త్రసదస్యుడు అనే రాజు దగ్గరికి వెళ్ళి“ రాజా! నేను ధనం కోసం నీ దగ్గరికి వచ్చాను. నీ ప్రజల పోషణకి ఆటంకం కలగకుండా ఏదైన మిగిలితే ఆ ధనాన్ని నాకియ్యి” అని అడిగాడు.
   త్రసదస్యుడు“ మహత్మా! మణిమతీ పురంలో వాతాపి ఇల్వలుడు అనే పేరుగల అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళు చాలా ధనవంతులు. మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి కావలసినంత  ధనం తెచ్చుకుని వద్దాము” అన్నాడు.
   అగస్త్యుడు రాజుతో కలిసి రాక్షసుడైన ఇల్వలుడి ఇంటికి వెళ్ళాడు. ఇల్వలుడు వాళ్ళని ఆదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్ళాడు. అతిథి సత్కారం చేసి భోజనం ఏర్పాట్లు చేస్తున్నాడు.
   అ సమయంలో రాజు మహర్షితో రహస్యంగా “ మహాత్మా! ఇల్వలుడు, వాతాపి అనేక మాయలు తెలిసిన రాక్షసులు. చాలా బలం కలవాళ్ళు. బ్రాహ్మణుల్ని చంపి తినడమంటే వాళ్లకి ఎంతో మక్కువ.
   ఇంతకు ముందు ఇల్వలుడు ఒక బ్రాహ్మణుణ్ణి భోజనానికి పిలిచి భక్తిగా పూజచేసి తనకి ఒక మంత్రాన్ని ఉపదేశించమని అడిగాడు. రాక్షసులకి మంత్రాలు ఉపదేశించ కూడదు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు మంత్రం ఉపదేశించడానికి అంగీకరించలేదు.
   ఇల్వలుడు కోపంతో  వాతాపిని మేకగా మార్చి అతణ్ణి చంపి వండి, ఆ బ్రాహ్మణుడికి భోజనంగా పెట్టాడు.   తరువాత “వాతాపీ!” అని పిలిచాడు. వాతాపి ఆ బ్రాహ్మణుడి పొట్ట చీల్చుకుని బయటకి రాగనే ఆ బ్రాహ్మణుడు మరణించాడు.
  ఈ రకంగా ఎంతోమంది బ్రాహ్మణుల్ని చంపి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి బక్షిస్తున్నారు. వీళ్ళ వల్ల ఇప్పటికే అనేక మంది మరణించారు. ఇప్పుడు  మీకు కూడా అటువంటి భోజనమే పెడతాడు”. మీ జాగ్రత్త కోసం చెప్తున్నాను అన్నాడు.
   అగస్త్య మహర్షి రాజు చెప్పింది విని చిరునవ్వుతో తల ఊపాడు. ఇంతలో ఇల్వలుడు వచ్చి అగస్త్యమహర్షిని భోజనానికి రమ్మని పిలిచాడు.
   త్రసదస్యుడి గుండె వేగంగా కొట్టుకోడం మొదలెట్టింది. మహర్షిని తనే తీసుకుని వచ్చాడు. ఆయనకి ఏదైనా జరిగితే తనకి బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది అని భయపడుతున్నాడు.
   అగస్త్యమహర్షి ఇల్వలుడి వెంట భోజనం చెయ్యడానికి లోపలికి వెళ్ళాడు. అగస్త్యమహర్షి కంఠం వరకు తృప్తిగా భోజనం చేసి త్రేన్చి వచ్చి యథాప్రకారం రాజు దగ్గర కూర్చున్నాడు.
   వెంటనే ఇల్వలుడువాతాపీ! అని పిలిచాడు. అగస్త్యుడు నవ్వుతూ చేత్తో పొట్ట మీద రాసుకుంటూ  ఓరి పశువా! ఇంకెక్కడి వాతాపి? నా పొట్టలోనే జీర్ణించిపోయాడు ఇంక నువ్వొక్కడివే మిగిలి ఉన్నావు అన్నాడు.
   ఇల్వలుడు అగస్త్యుడి తపశ్శక్తికి భయపడి వణుకుతూ వచ్చి అదేపనిగా నమస్కారాలు చేస్తూ  అయ్యా! నన్ను క్షమించండి. మీకు ఏది కావాలో అడగండి ఇస్తాను అన్నాడు.
   అగస్త్య మహర్షి తనకు ధనం కావలని అడిగాడు. ధనం, బంగారం, వస్తువులు, వాహనాలు తన దగ్గరున్నవన్నీ అగస్త్యుడికి సమర్పించుకుని ఆయన్ని సాగనంపాడు.
తపస్సు లేదా ధ్యానం వల్ల కలిగిన శక్తితో దేన్నయినా సాధించవచ్చు!!

No comments:

Post a Comment