About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

వావివరుసలు
సైంధవుడు కథ
   పాండవులు కొంతకాలం తృణబిందుడు అనే పేరుగల మహర్షి ఆశ్రమంలో నివసించారు. ఒకరోజు పాంచాలిని ఆశ్రమంలో ఉంచి వేటకోసం బయలుదేరారు. పురోహితుడు ధౌమ్యుడు కూడా ఆశ్రమంలో పాంచాలికి తోడుగా ఉండిపోయాడు.
   అదే సమయంలో సాళ్వరాజ కుమార్తెని పెళ్ళి చేసుకోవడం కోసం సైంధవుడు చతురంగ బల సమేతంగా గొప్ప వైభవంతో బయలుదేరి వెడుతున్నాడు. తృణబిందు ఆశ్రమం మీదుగా వెడుతుండగా అతడికి ఆశ్రమం దగ్గర తిరుగుతున్న ద్రౌపది కనిపించింది.
   వెంటనే రథాన్ని ఆపమని, తన పరివారాన్ని అక్కడే ఉండమని చెప్పి ద్రౌపది దగ్గరికి వచ్చాడు. లతాంగీ! నువ్వెవరివి? వనదేవతవా? సురేశ్వరుడితో అలిగి స్వర్గం నుంచి భూమికి వచ్చిన శచీదేవివా? నీ భర్త ఎవరు? నీ పేరేమిటి? అని అడిగాడు.
   ద్రౌపది చెప్పేది వినకుండానే నా గురించి చెప్తాను విను. నేను సింధు సౌవీరనాథుణ్ణి, జయద్రధుణ్ణి! అన్నాడు.
   ద్రౌపది అతణ్ణి చూసి నువ్వు శివవంశంలో పుట్టినవాడివి, సురధపుత్రుడివి అని నాకు తెలుసు. నేను పాంచాలరాజు ద్రుపదుడి కూతుర్ని. నా పేరు కృష్ణ. పాండుకుమారులయిన యుధిష్టిర బీమార్జున నకులసహదేవులకు ధర్మ పత్నిని.
   వాళ్ళిప్పుడు వేటకి వెళ్ళారు. తిరిగి వచ్చాక వాళ్ళిచ్చే సత్కారం తీసుకుని వెడుదురుగాని లోపలికి వచ్చి కూర్చోండి అని గౌరవంగా చెప్పింది.
   సైంధవుడు చిరునవ్వుతో లతాంగీ! రాజ్యాన్ని పోగొట్టుకుని ఈ అడవుల వెంట పడి తిరుగుతున్న వాళ్ళతో ఏం సుఖపడతావు? సింధు సౌవీర రాజ్యాలకి అధిపతిని నేను. నన్ను వరించి నాతో వచ్చి సుఖభోగాలు అనుభవించు. లే! నీ భర్తలు రాకముందే నా రథం ఎక్కు త్వరగా తీసుకుని వెడతాను! అని ఆమెని తొందర పెట్టాడు.
   అతడి మాటలు విని ద్రౌపది సైంధవా! కౌరవ పాండవులకి చెల్లెలయిన దుశ్శలకి నువ్వు భర్తవి. అంటే, నువ్వు నాకు తోబుట్టువవుతావు. ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడచ్చా? అని మందలించింది.
   అది విని సైంధవుడు పాంచాలీ! రాజ్యాలకి అధిపతులమైన మాకు స్త్రీల మీద మక్కువ కలిగితే వావి వరుసలతో పనిలేదు. నువ్వు రాకపోతే బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతాను! అన్నాడు.
  అతడి మాటలు విని ద్రౌపది మూర్ఖుడా!  నన్ను సామాన్య వనితగా భావించకు. నేను అయిదుగురు మహావీరులకి భార్యని. వాళ్ళకి నీ గురించి తెలిసిందంటే పరమేశ్వరుడు కూడా నిన్ను రక్షించలేడు. నీ బుద్ధిని మార్చుకో. పాండవ వీరులకి కోపం తెప్పించక నీ దారిన నువ్వు వెళ్ళు అని చెప్పింది.
   ఆ పాపత్ముడు ద్రౌపది మాటలు పట్టించుకోకుండా ఆమె చెయ్యి పట్టుకుని లాగి రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. ద్రౌపది ధౌమ్యుణ్ణి పిలుస్తూ ధౌమ్యా! ఈ సైంధవుడు నన్ను తీసుకుని పోతున్నాడు అని అరిచింది.
   ధౌమ్యుడు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఇటువంటి సాహసం చెయ్యకు. పాండవులు వచ్చారంటే నీ పని పడతారు. ద్రౌపదిని వదిలి పెట్టు అని ఆశ్చర్యంతోను భయంతోను చెప్తూనే ఉన్నాడు. కాని సైంధవుడు అతడి మాటలు పట్టించుకోకుండా ద్రౌపదిని తీసుకుని వెళ్ళిపోయాడు.
   కొంచెం సేపటికి పాండుకుమారులు ఆశ్రమానికి తిరిగి వచ్చారు. ధాత్రి అనే పరిచారిక ఏడుస్తూ వచ్చి సైంధవుడు చేసిన దుర్మార్గాన్ని వివరించింది. వాళ్ళు అయిదుగురు ప్రళయకాల రుద్రుల్లా ఆయుధాలు తీసుకుని రథాలెక్కి వాయువేగంతో సైంధవుడు వెళ్ళిన వైపు బయలుదేరి వెళ్ళారు.
   ద్రౌపదిని తీసుకుని పారిపోతున్న సైంధవుడి మీదకి, అతడి సైన్యం మీదకి రివ్వురివ్వుమని బాణలు వచ్చి పడుతున్నాయి. పాండవులు వస్తున్నారని తెలుసుకుని ద్రౌపది ధైర్యంగా ఉండిపోయింది.
   సైంధవుడు కూడ వస్తున్నది పాండవులే అని నిశ్చయించుకుని తను కూడా యుద్ధసన్నద్ధుడయ్యాడు. లేళ్ళ మీదకి ఉరుకుతున్న కొదమ సింహాల్లా సైంధవుడి సైన్యాన్ని చుట్టుముట్టారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు చంపేస్తున్నారు.
     భీముడు తన గదతో ఏనుగుల కుంభస్థలాలు పగులకొడుతున్నాడు. రథాల్ని పిండి చేస్తున్నాడు. గుర్రాల్ని నేల కూలుస్తున్నాడు. విజయుడు గాండీవంతో సైంధవసేన తలలు ఎగరకొడుతున్నాడు. నకులసహదేవులు దొరికినవాళ్ళని దొరికినట్టు చంపేస్తున్నారు.
   పాండవవీరుల యుద్ధకౌశలానికి కొంచెం సేపట్లోనే ఆ ప్రదేశమంతా పీనుగులతో నిండి పోయింది. చివరికి సైంధవుడు వాళ్ళకి పట్టుబడ్డాడు.
   భీముడు అతణ్ణి పట్టుకుని కొంతసేపు పిడికిళ్ళతోను, కొంతసేపు మోకాళ్ళతోను, కొంతసేపు గదతోను కొడుతూనే ఉన్నాడు. అది చూసిన అర్జునుడు చాలు చాలు! ఇంక కొడితే చచ్చిపోతాడు అని ఆపించాడు.
   ఇంకా కోపం తగ్గని భీముడు పదునైన కత్తిని తీసుకుని సైంధవుడి తలని సగం సగం చెక్కి చూసేవాళ్ళకి నవ్వొచ్చేట్టు చేశాడు.
   సైంధవుడి ఆకారాన్ని వికారంగా చేసి వృకోదరుడు (భీముడు) నిన్ను వదిలేస్తే ప్రతి సభలోను నేను పాండవులకి దాసుణ్ణి అని చెప్పుకుంటావా? అని అడిగాడు.
   సైంధవుడు భీముడిచేత దెబ్బలు తినలేక చేతులు జోడించి అలాగే చెప్పుకుంటాను విడిచిపెట్టు అన్నాడు. చివరికి కొట్టడం ఆపి అతణ్ణి ధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్ళారు.
   అతణ్ణి చూసి పాంచాలి నవ్వింది. యుధిష్ఠిరుడు ఈ రోజు నుంచి నువ్వు చెడ్డ పనులు మానేసి మంచివాడిగా బ్రతుకు అని చెప్పి అతణ్ణి విడిచి పెట్టాడు.
   పాండవులు శత్రువుల్ని జయించుకుంటూ పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నారు. తరువాత తమ అర్ధరాజ్యాన్ని తమకివ్వమని దుర్యోధనుడికి కబురు చేశారు.
   దుర్యోధనుడు ఇవ్వనన్నాడు. కనీసం అయిదు ఊళ్ళయినా ఇవ్వమని కబురు చేశారు. దుర్యోధనుడు అయిదు ఊళ్ళు కూడా ఇవ్వనన్నాడు.
   అందువల్ల మాహాభారత యుద్ధం ప్రారంభమయింది. ఆ యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, శల్యాది మహావీరులందరు మరణించారు. దుర్యోధనుడి నూరుగురు తమ్ముళ్ళని భీముడు చంపాడు. తన ప్రతిజ్ఞ ప్రకారం బీముడు దుర్యోధనుణ్ణి తొడలు పగలగొట్టి చంపాడు.
   పాడవసైన్యంలో కూడా చాలామంది చచ్చిపోయారు. ధర్మప్రవర్తన కలిగిన పాండవులు అయిదుగురు శీమన్నారాయణుడి అనుగ్రహం వల్ల విజయాన్ని సాధించారు.
   శ్రీకృష్ణుడి అనుమతి తీసుకుని ధర్మరాజు రాజ్యమంతటికి రాజుగా పట్టాభ్షిక్తుడై తన నలుగురు తమ్ముళ్లతోను, పవిత్రురాలైన పాంచాలి తోను ధర్మప్రవర్తన కలిగి సుఖంగా జీవించాడు.
   కూతుళ్ళు, కొడుకులు, అన్నదమ్ములు, అక్కచెళ్ళెళ్ళు, వదినలు, మరదళ్ళు, అత్తలు, మామయ్యలు, పిన్నులు, బాబయ్యలు, అమ్మలు, నాన్నమ్మలు, తాతయ్యలు, మనుమలు వంటి బంధుత్వంలో ఉన్న గౌరవాన్ని, తీపిదనాన్ని,ఆత్మీయతని తెలుసుకుని నడుచుకుంటే సమాజంలో ఏ ప్రయత్నం లేకుండానే సైంధవుడు పారిపోతాడు!!   


No comments:

Post a Comment