About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

వీరత్వము-భీముడు కథ


వీరత్వము
భీముడు కథ
   పాండవ కుమారుడు భీముడు వెయ్యి ఏనుగుల బలం కలవాడని అందరికీ తెలుసు. కాని ఒకానొక సమయంలో అతడి అహంభావం దెబ్బతింది.
   మన ఆధ్యాత్మిక జీవితంలో అహంభావం చాలాసార్లు పెద్ద అడ్డంకిగా మారుతుంది. అన్నీ మనకే తెలుసుననీ, అందరికంటే ఎక్కువ శక్తి గలవాళ్ళమనీ, గొప్పవాళ్ళమనీ అనుకుంటూ ఉంటాం.
   అది మనల్ని తెలివి తక్కువ వాళ్ళని చేసి మన జీవితాలతో ఆడుకుంటుంది. వినయంగా ఉండడం అనేది ఒక మంచి పాఠంగా తరతరాలుగా మన పూర్వీకులు మనకి బోధిస్తూనే వస్తున్నారు.
   భీముడు గదాయుద్ధంలో ఆరితేరినవాడు అని మనందరికీ తెలుసు. తన గదతో కొండల్ని కూడా పిండి చెయ్యగల సమర్ధుడు. మాహాభారతంలో గొప్ప వీరుడుగా చెప్పబడ్డ భీముడు కూడా ఒకసారి కష్టాల్లో పడ్డాడు.
   ఒకరోజు పాండవులు ద్రౌపదితో కలిసి ప్రయాణం చేస్తున్నారు. చల్లటి గాలితోపాటు చక్కటి సువాస కలిగిన పువ్వుల వాసన గాల్లో తేలుతూ వచ్చింది.
   ఆ సువాసన ద్రౌపదికి చాలా ఇష్టంగా అనిపించింది. వాసనే ఇంత బాగుంది..పువ్వు ఎంత అందంగా ఉంటుందో అనుకుంది.
  పువ్వు కూడా కనిపిస్తే ఎంత బాగుంటుందో! అనుకుంది. అంతే, వెయ్యి రేకులతో ఉన్న పద్మం ఒకటి గాలిలో ఎగురుతూ ద్రౌపది దగ్గర పడింది.
   దాన్నిచూసిన ద్రౌపది అటువంటి పువ్వులు ఇంకా కావాలనుకుంది. ఆ పువ్వులు ఎక్కడ ఉన్నాయో చూసి తీసుకుని రమ్మని భీముణ్ణి అడిగింది.
   భీముడు ద్రౌపది అడిగిన వెంటనే వాటిని తీసుకుని రావడానికి అంగీకరించాడు. ఆ వాసన ఎటువైపు నుంచి వస్తోందో అటువైపు నడుస్తూ నడుస్తూ గంధనమాదన పర్వతం దాటి వెడుతున్నాడు.
   దార్లో ఒక కోతి దారికి అడ్డంగా కూర్చుని ఉంది. అది దాని పొడవైన తోకని దారికి ఒక చివర నుంచి రెండవ చివరి దాకా నిర్లక్ష్యంగా పడేసింది.
   తోకతో దారి మొత్తం ఆక్రమించేసి ఎవరూ ముందుకి వెళ్ళడానికి వీలు లేకుండా కూర్చుంది. భీముడు ముందుకి వెళ్ళాలంటే దాన్ని తొక్కిగాని, దాటిగాని వెళ్ళచ్చు.
   కాని అతడు అలా చెయ్యలేదు. ఓ కోతీ! నీ తోకని కొంచెం పక్కకి తీస్తావా? అని అడిగాడు.
   కోతి అతడితో నాయనా! నేను చాలా ముసలి కోతిని. నాకు అంత శక్తి లేదు. నా తోకని నేనే కదల్చలేనంత బలహీనంగా ఉన్నాను. నువ్వు కదల్చ గలిగితే కొంచెం పక్కకి పెట్టుకుని వెళ్ళిపో! అంది.
   భీముడు దాన్ని కొంచెం పక్కకి తోద్దామనుకున్నాడు. కాని ఆ తోక కదల్లేదు. కొంచెం పైకి తీసి పక్కకి పెడదామనుకున్నాడు. అది ఇప్పుడు కూడా కదల్లేదు.
   పర్వతాల్నే కదప గలిగిన వాణ్ణి ఒక కోతి తోకని కదపలేనా అనుకున్నాడు. ఈసరి ఇంకా బలం ఉపయోగించి తోకని పైకి ఎత్తి పక్కకి పారెయ్యలని అనుకున్నాడు.
  కాని ఈసారి కూడా అతడికి సాధ్యం కాలేదు. కోతి తోకని కదపలేకపోతున్నందుకు భీముడికి పౌరుషం వచ్చింది. తన శక్తి మొత్తం పెట్టి కదపాలని ప్రయత్నించాడు. కాని కోతి తోక కొంచెం కూడా కదల్లేదు.
   భీముడికి అవమానంగా అనిపించింది. వీరుడు ఎప్పుడూ ఓడిపోడాన్ని ఇష్టపడడు. తన శక్తినంతటినీ కూడదీసుకుని మళ్ళీ ప్రయత్నించాడు.
    దాని వల్ల ప్రయోజనం లేకపోయింది. అతడికి చెమటలు పోసేస్తున్నాయి. తన శక్తులన్నీ ఏమయిపోయాయి అనుకుంటున్నాడు.
    తన దేహబలం మీద ఉన్న నమ్మకంతో అహంకారాన్ని ప్రదర్శించాడు. అదే అతడికి ఇబ్బందుల్ని తెచ్చి పెట్టింది. అహంకారాన్ని తగ్గించుకుని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక్కడ కూర్చుని ఉన్న  కోతి సాధారణమైన కోతి అయి ఉండదు అనుకున్నాడు.
   దాని దగ్గర నిలబడి అయ్యా! నువ్వు నిజమైన కోతివి కాదని తెలుసుకున్నాను. నువ్వు ఎవరో గొప్పశక్తి గలవాడివి. దయచేసి నువ్వు ఎవరో చెప్పు! అని ప్రార్ధించాడు.
   కోతి ఆకారంలో ఉన్నవాడు రామాయణంలో ఉన్న గొప్ప వీరుడు హనుమంతుడు. అతడు చిరంజీవి, అన్నీ తెలిసినవాడు. అతడు కూడా భీముడిలా వాయుదేవుడి అంశతో పుట్టినవాడు.
    భీముడు వెడుతున్న ప్రాంతం ప్రమాదకరమైంది. వెయ్యి రేకులు కలిగిన పద్మం కోసం భీముడు వెడుతున్న ప్రాంతంలోకి సామాన్య ప్రజలు ఎవరూ వెళ్ళలేరు.
   తన శక్తిమీద తనకు ఉన్న నమ్మకంతో కలిగిన అహంభావంతో ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టబోతున్న భీముణ్ణి వారించాలనుకున్నాడు హనుమంతుడు. అందుకే భీముడికి అడ్డుపడ్డాడు.
   అతడు ఆపదలో చిక్కుకుంటాడని, అతడిలో ఉన్న అహంభావాన్ని తగ్గించడానికి కూడా అదే సమయమని అనుకున్నాడు హనుమంతుడు.
  ఆ విషయాన్ని అర్ధం చేసుకున్నబీముడు అక్కడ కూర్చుని ఉన్నది తనకంటే వీరుడైన హనుమంతుడని, తనని రక్షించడానికే అక్కడ కూర్చుని ఉన్నాడని తెలుసుకుని అతడికి పదే పదే నమస్కరించాడు.
అహంకారం వల్ల అలోచనాశక్తి నశిస్తుంది!!
   

No comments:

Post a Comment