About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

భక్తకవులు
శివభక్తుడు కవి సుందరమూర్తి
   8వ శతాబ్దం వాడయిన సుందరమూర్తి అరవై ముగ్గురు నాయనార్లలో ఒకరు, నలుగురు ఆచార్యులలో ఒకరు . అరవై రెండు మంది నాయనార్లని స్తుతించిన ఘనత కూడా ఆయనదే! ఆయన పాడిన  ఆ స్తోత్రాలే ’తిరుత్తొండత్తాగై’ అనే పేరుతో ప్రసిద్ధికెక్కాయి. ఆ పాటల్లో తను దాసానుదాసుణ్నని ఆ మహాత్ములకి చెప్పుకున్నట్లుగా పెరియపురాణం తెలియ చేస్తోంది.
   సుందరమూర్తి గొప్ప శివభక్తుడు. ఆయనకి శివుడితో ఉన్న సాన్నిహిత్యం అర్జునుడికి శ్రీకృష్ణుడితో ఉన్న స్నేహం వంటి స్నేహం. తన ఇంటి సమస్యల్ని పరిష్కరించుకునేందుకు కూడా శివుడే సహకరించేవాడట. “శివుడు నాకు స్నేహితుడే కాదు ప్రభువు కూడా! నా పరిథిని మాత్రం నేను ఎప్పుడూ దాటలేదు” అన్నారు సుందరమూర్తి.
   కైలాసంలో శివుడి అనుచరుల్లో హలాహల సుందరుడు, శివుడి సేవకి పువ్వులు కోయడం, నీళ్లు తీసుకుని రావడం చేసేవాడు. అలాగే ఆదిశక్తికి పూజ చెయ్యడానికి  కమలిని, అనిందిత అనే అనుచరులుండేవాళ్లు. సుందరుడు వాళ్లిద్దర్ని ప్రేమిస్తున్నాడని తెలిసిన శివుడు, ఈ ప్రేమ శాశ్వతమైనది కాదని తెలుసుకున్నాక, తిరిగి కైలాసం చేరుదురుగాని, భూలోకంలో పుట్టండి!” అని శపించాడు. శపించినా వదిలెయ్యకుండా వాళ్ల వెంటే ఉన్నాడు. అతడే సుందరమూర్తి.
   చోళరాజ్యానికి, తొండైమండలానికి మధ్యగల ప్రదేశాన్ని ’తిరుమువైప్పాడి అంటారు. ఆ ప్రదేశంలో ఉన్న తిరునావలూరులో ఆదిశైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి సడైయనార్, తల్లి ఇసైజ్ఞానియార్. ఆయన అసలు పేరు నంబి అరూరార్. సౌందర్యవంతుడు అవడం వల్ల అందరూ సుందరమూర్తి అని పిలిచేవారు.
   బాల్యంలో బొమ్మతో ఆడుకుంటూ ఉండగా అతడి అందం చూసి ఆ ప్రాంతపు నాయక ప్రభువు అతణ్ని దత్తత తీసుకుని మహారాజ భోగాలతో పెంచి బ్రాహ్మణ బాలుడికి నేర్పించాల్సిన విధంగా విద్య నేర్పించారని తన రచనల్లో చెప్పారు సుందరమూర్తి. యుక్తవయస్సు వచ్చిన సుందరమూర్తికి పుత్తూర్లో ఉన్న శివాచార్యుడి కుమార్తెనిచ్చి పెళ్లిచెయ్యాలని, ఆయన తండ్రి నిశ్చయించి, అందర్నీ తీసుకుని పుత్తూరు చేరుకున్నారు. అందరూ పెళ్లి హడవుడిలో మునిగి తేలుతుంటే అకస్మాత్తుగా ఒక ముసలి బ్రాహ్మణుడు వచ్చి సుందరమూర్తి ’తాత’ ఆయన్ను బానిసగా ఇచ్చాడని, తన దగ్గర ఒక పత్రం కూడా ఉంది చూడమని చూపించాడు.
   అక్కడున్న వాళ్లందరు అది విని “నీకేమన్నా పిచ్చా? ఒక బ్రాహ్మణుడికి మరొక బ్రాహ్మణుడు బానిసా?” అని అడిగారు. ఆ వృద్ధబ్రాహ్మణుడు భయపడుతూ కావాలంటే మా ఊరు వచ్చి నిజం తేల్చుకోమన్నాడు. అతడు చూపించిన పత్రం చింపేసి, అందరూ అతడి స్వగ్రామం నల్లూరు వెళ్లారు. మళ్లీ ఒక ఆకు మీద రాసిన పత్రం తీసి, నల్లూరులో అందరికీ చూపించాడు. అక్కడివాళ్లు దాన్ని చూసి అది నిజమే కాని, ఈ బ్రాహ్మణుణ్ని మెమెప్పుడూ చూడలేదు అన్నారు.
   అవునో కాదో ఋజువు కావాలంటే నాతోరండి! అని చెప్పి ’తిరువరుత్తురై’ దేవాలయంలోకి వెళ్లి, నందిని దాటాక అదృశ్యమైన ఆ ముసలి బ్రాహ్మణుణ్ని వెతుకుతూ లోపలికి వెళ్లిన సుందరమూర్తికి పార్వతీపరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. నాతో వాదనకి దిగావు కనుక, నీ పేరు ’వన్ తొండర్’ అంటేపెంకి భక్తుడు అన్నాడు శివుడు.
   నిన్నెలా పూజించాలో తెలియని నాకు అది కూడ చెప్పమని అడిగిన సుందరమూర్తికి పూజ అంటే నన్ను కీర్తించడమే కదా! నీ పేరుకి తగినట్టుగా కీర్తించు! అని శివుడు చెప్పగానే ఓ ఉన్మత్తా! చంద్రశేఖరా! అంటూ పాట అందుకున్నారు సుందరమూర్తి.
   పెళ్లి ఆగిపోయిందని బాధ పడుతున్న పెళ్లి కుమార్తెకి శివుడు మోక్షాన్ని ప్రసాదించాడు.అక్కడి నుంచి చిదంబరం బయలుదేరి దార్లో ’తిరువదిగై’ లో ఉన్న ఒక మఠంలో నిద్రపోయారు సుందరమూర్తి. తలకి ఒక ముసలి బ్రాహ్మణుడి కాళ్లు తగిలాయని అక్కడి నుంచి లేచి వేరొకచోట పడుక్కున్నాడు. అక్కడ కూడ అలాగే జరగడంతో ఆ ముసలి బ్రాహ్మణుడు గట్టిగా అరిచి “నేనెవరో తెలుసుకోలేదా? తిరువారూర్ వెళ్లు! అని అదృశ్యమయ్యాడు. సుందరమూర్తి ఆయన్ని శివుడిగా తెలుసుకుని స్తోత్రం చేశాడు.
   తిరువారూర్ చేరిన సుందరమూర్తికి సీర్ కాశీలోనే భగవద్దర్శనమయింది. తిరువారూర్లో ఉన్న స్వామి తమ ఇలవేల్పు ’నంబి అరూరార్’ పేరే తనకి పెట్టారని అనుకుంటూ గ్రామం చేరగానే సుందరమూర్తికి గ్రామ ప్రజలు స్వాగతం పలికారు. కమలిని భూలోకంలో ’పరవైయార్’ అనే పేరుతో అక్కడే ఉందని చెప్పి ఇద్దరికీ కళ్యాణం జరిపించాడు శివుడు.
   సుందరమూర్తి నివసించే ఊరికి, కండైయూర్ నుంచి ఒక భక్తుడు ధాన్యం పంపించేవాడు. కాని, కరువు కారణంగా పంపించలేక బాధపడుతుంటే శివుడే ఆ ఊరి ప్రజలకి ధాన్యం అందేలా చేశాడు. తిరువారూరులో ప్రతిసంవత్సరం జరిపినట్లు ఉత్సవాలు జరపడానికి తగినంత ధనం లేదని దారి చూపించమని శివుణ్ని ప్రార్థిస్తూ ఇటుకలు తలకింద పెట్టుకుని పడుకున్నారు. ఉదయాన్నే నిద్ర లేచిన సుందరమూర్తి తన తలకింద బంగారు ఇటుకలు ఉన్నట్లు చూశారు. భక్తులందరికీ తృప్తి కలిగేలా వైభవంగా ఉత్సవాన్ని జరిపారు.
   తిరుపాలం పోలిల్లో ఉండగా మలపాడిమర్చిపోవద్దని శివుడు హెచ్చరించడంతో మాలపాడి చేరుకుని అక్కడ కూడా శివభజన చేశారు.  తిరుపొచ్చిరంలో కూడ బంగారం అడిగి భక్తులకి ఉపయోగించారు. తిరుప్పైజ్జీలిలో భిక్షాటన చేస్తున్న శివరూపం దర్శించి నమశ్శివాయమంత్రం గురించి కీర్తనలు రచించారు. తిరుప్పేరూరులో శివతాండవరూపం దర్శించి ధన్యుణ్నయ్యానని ఆనందపడ్డారు. శివుడి ఆజ్ఞప్రకారం తిరుక్కూడలైయార్నికూడా దర్శించి తిరుమదుకున్రుచేరారు.
   శివుణ్ని ప్రార్థించి బంగారు నాణాలు అడిగితే ఒక్కటి మాత్రం ఇచ్చి మిగిలినవి తిరువారూర్లో ఉన్న మణిముత్తారు చెరువులో పోయించాడు శివుడు. చెరువులో ఉన్న బంగారం గురించి భార్యకి చెప్పి, చెరువులో అవి కనిపించక కీర్తనలు పాడి వాటిని తెచ్చుకున్నాడు. శిష్యులతో కలిసి శివభజన చేసుకుంటూ శివాలయాల్ని దర్శించుకుంటూ తిరుగుతున్నవాళ్లకి తిరుక్కురుగావూరులో స్వయంగా వచ్చి ఆకలి తీర్చాడు శివుడు.తిరుక్కచ్చూరులో కూడా శివుడు భిక్షాటన చేసి తీసుకుని వచ్చి తన భక్తులకి తినిపించారట. కంచి, కాళహస్తి దర్శించి తిరువొర్రియూరుచేరారు. కైలాసం నుండి వచ్చిన అనిందిత సంగలియారు అనే పేరుతో ఒక రైతుకి కుమార్తెగా పుట్టి శివపూజ చేస్తోంది. ఆ ఊరు వదలనని మాటిస్తేనే పెళ్లి చేసుకుంటానంటోంది అని చెప్పి మాట తీసుకుని సంగలియారుని ఇచ్చి సుందరమూర్తికి పెళ్లి జరిపించాడు శివుడు.
   కొన్నాళ్ల తరువాత తిరువారూర్ లో ఉత్సవాలు జరిపించాలని ఇచ్చిన మాట తప్పి బయలుదేరిన సుందరమూర్తికి కళ్లుపోయాయి. అందర్నీ దారి అడుగుతూ వెడుతున్న సుందరమూర్తికి తిరునాఎక్కందగ్గర ఒక చేతికర్ర, కంచికి చేరగానే ఎడమకంటికి దృష్టి, తిరుత్తురుత్తిచేరేసరికి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాడు శివుడు. తిరువారూరు చేరిన తరువాత భార్య నిరాకరించడంతో మళ్లీ ప్రార్థించాడు. ఇంక నాకు తప్పదులే అనుకున్న శివుడు సుందరమూర్తి రెండో కంటికి కూడా దృష్టి ఇచ్చి వాళ్లిద్దర్నీ కలిపి అదృశ్యమయ్యాడు. ప్రణయకలహానికి కూడా శివుణ్నే ఉపయోగించుకున్నాడని శివయోగికి కోపం వచ్చింది. అతడి కోపం తగ్గించాలని అతడికి కడుపులో నెప్పి తప్పించి సుందరమూర్తి మంచి వైద్యుడని చెప్పాడు శివుడు. అతడి వైద్యం కంటే ప్రాణాలు వదలడమే మంచిదని అనుకుని ప్రాణాలు తీసుకున్నాడు శివయోగి.
   అతడిని చూసి తను కూడా ప్రాణత్యాగం చెయ్యాలని అనుకున్న సుందరమూర్తిని వారించాడు శివుడు. శివయోగిని బతికించి సుందరమూర్తికి అతడిమీద ఉన్న ప్రేమని, భక్తిని వివరించాడు. చేర దేశాధిపతి చేరమాన్ పెరుమాళ్సుందరమూర్తి మీద ఉన్న అభిమానంతో ఆయనతో కలిసి తిరువారూర్ నుంచి రామేశ్వరం వరకు ఉన్న దివ్యక్షేత్రాల్ని దర్శించారు. తిరిగి వచ్చిన తరువాత తనతో తన రాజధానికి రమ్మని అహ్వానించాడు. కావేరీనదికి వరదలయినా సరే అవతలి ఒడ్డున ఉన్న తిరువైయూరు చూడాలని పట్టుబట్టిన రాజుకి ఒక కీర్తన పాడి వరద తగ్గించి దర్శనం చేయించారు. చేర రాజధనికొడుంకోళూరుచేరగానే ఎనుగు అంబారీ మీద ఊరేగిస్తూ తిరుదన్ చిక్కలందేవాలయంలో దర్శనం చేయించి కొన్ని రోజులు తన దగ్గర ఉంచుకుని పంపించాడు సుందరమూర్తిని.
   మధ్యలో ఒక ఇట్లోంచి ఏడుపు, పక్కనే ఉన్న ఇంట్లోంచి ఆనందహేల! విని ఆశ్చర్యంతో విషయం అడిగారు.. ఇద్దరు పిల్లలు ఆడుకుంటుంటే మొసలి వచ్చి, ఒకణ్ని వదిలి, ఒకణ్ని తీసుకుని వెళ్లిపోయిందని అక్కడివాళ్లు చెప్పగానే ఒక కీర్తన పాడారు. మొసలి వచ్చి పిల్లవాణ్ని వదిలేసి వెళ్లిందని చెప్తారు. విషయం తెలిసి రాజధాని మొత్తం సుందరమూర్తికి స్వాగతం పలకడానికి వచ్చేసింది. తెల్లటి గొడుగు పట్టుకుని చేరరాజు ఆయన్ని లోపలికి తీసుకుని వెళ్లాడు.
   రాజు స్నానానికి వెళ్లిన సమయం చూసి శివుణ్ని పిలిచి తనని కైలాసం తీసుకుని వెళ్లిపొమ్మని చెప్పగానే ఒక ఏనుగు వచ్చి ఆయన్ని కూర్చోబెట్టుకుని ఆకాశవీధిలో కైలాసం వెళ్లిపోతుంటే రాజు చూశాడు. అది చూసిన రాజు తన గుర్రాన్ని ఎక్కి దాని చెవిలో శివమంత్రం జపించాడు. వెంటనే అది కూడా అకాశంలోకి ఎగిరి ఏనుగుకి ప్రదక్షిణ చేసి ఏనుగుకంటే ముందు బయలుదేరింది. ఇదంతా చూస్తున్న చేర సైనికులు ఆత్మహత్యలు చేసుకుని సూక్ష్మశరీరాలతో వాళ్లని అనుసరించారు.. వాళ్ల వెనుక కమలిని, అనిందితలు కూడా కైలాసం చేరారు.
   సుందరమూర్తి శివుణ్ని తన సఖుడిగా అనుకుని ఎన్ని సహాయాలు అర్థించినా ఆయన భగవంతుడే అనే విషయాన్ని మర్చిపోలేదు. ఆయన్ను కీర్తిస్తూ 3,800 కీర్తనలు రాసి పాడి వినిపించారు. కైలాసపర్వతం మీద ఉపమన్యుమహర్షి తన శిష్యులతోను, ఇతరయోగులతోను కలిసి కూర్చున్నప్పుడు వాళ్లకి ఒక గొప్ప కాంతి కనబడింది. అదేమిటని అడిగితే ఉపమన్యుమహర్షి అది సుందరమూర్తి భూలోకం నుంచి తిరిగి కైలాసం చేరుతున్నాడనీ అదే ఆ కాంతి! అని అన్నారు. ఆ కథ వినాలని ఉందని అక్కడున్నవాళ్లు అడిగినప్పుడు వాళ్లకి సుందరమూర్తి గురించి ఉపమన్యుమహర్షి చెప్పిన కథనే ఇప్పుడు మనం చదువుతున్నాం.
   మోక్షంగాని, భోగంగాని,భగవంతుడి దయ ఉంటేనే సాధ్యం అవుతుందని, ప్రతి జీవి లోపల వ్యాపించి ఉన్న శివుడు అతీతుడని, శివుడి ఉజ్జ్వల మహేశ్వర తత్త్వాన్ని గురించి కీర్తనలు పాడి, కార్య, క్రియ, యోగ, జ్ఞానాలకి శివుడే మూలమని బోధించి, శివుడే తానుగా..తానే శివుడిగా ఉంటూ, నిజమైన భక్తి కలిగిన ప్రతి భక్తుడూ భగవంతుడితో కలిసే ఉండవచ్చని తెలియచేసి, మానవ శరీరంతో కైలాసం చేరిన సుందరమూర్తి ధన్యులు. ఆయనకి నమస్సులు తెలియచేస్తూ...
భమిడిపాటి బాలాత్రిపురసుందరి
                                                                         9440174797   
   

No comments:

Post a Comment