About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

11.మరణం రకు...
   నచికేతుడు యముడి దగ్గరికి పంపబడ్డాడు. అయినా కూడా చిరంజీవిగా మిగిలిపోయాడు.
   నచికేతుడు తండ్రిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి అడగదగ్గవే! అయినా తండ్రి మహర్షికి మాత్రం కోపం వచ్చింది. కొడుకు తన విషయాల్లో జోక్యం చేసుకోవడం అతడికి ఇష్టం లేదు. తను చేస్తున్న దానం సరయిన పద్ధతిలో లేదంటాడా? దానం ఇస్తున్న ఆవుల్లో కొన్ని ఆరోగ్యంగా లేకపోతే తను సరిగా దానం చెయ్యనట్టేనా? చాలామంది అలాగే చేస్తారు. దానాలు ఇవ్వడంలో ఎంతమంది పద్ధతిగా ఉంటున్నారు? ఎంత మంది ఉపయోగించే వస్తువుల్నే దానం చేస్తున్నారు? తను ఇచ్చిన వాటిలో కొన్ని ముసలి ఆవులున్నాయి నిజమే! అయిన వాటి గురించి నచికేతుడికి ఎందుకు? కోపం తెప్పించే ప్రశ్నలు ఎందుకు వెయ్యాలి? అన్ని విషయాలు చర్చించేంత పెద్దవాడు మాత్రం కాదు, బాగా చిన్నవాడు.
   నచికేతుడు తండ్రి చేస్తున్న దానం చూశాడు. ఏదో చెయ్యాలి కదా అని చేస్తున్నట్టుంది అనుకున్నాడు. ఆ ముసలి అవుల్ని తీసుకుని వెళ్ళి బ్రాహ్మణులు ఏం చేసుకుంటారు? ఇటువంటి దానం చేస్తున్నవాడు తనని ఎవరికి దానం ఇస్తాడో? అని అనుమానం వచ్చింది. సందేహం తీర్చుకోవాలని అనుకుని “నన్ను ఎవరికి దానంగా ఇస్తున్నావు?” అని అడిగాడు.
   అలా అడిగినందుకే తండ్రికి కోపం వచ్చింది. ఆవుల్ని ఇతర వస్తువుల్ని దానంగా బ్రాహ్మణులకి ఇస్తున్నాడు. తనని ఎవరికి ఇస్తాడో అని నచికేతుడి సందేహం. తనను ఇవ్వడం వల్ల తండ్రికి ఎక్కువ ఉపయోగం. అందువల్ల చిన్నవాడైన నచికేతుడు తండ్రిని అదే ప్రశ్న మళ్ళీ మళ్ళీ అడిగాడు.
   నిన్ను కానుకగా మృత్యువుకి దేవుడయిన యమధర్మరాజుకి ఇస్తాను!” అన్నాడు నచికేతుడి తండ్రి.
   అలా అన్నాడు అంటే కచ్చితంగా ఇచ్చేసినట్టే! ఆ రోజుల్లో ఒక మాట అన్నారు అంటే దాని మీద నిలబడేవాళ్ళు. నచికేతుడు అలోచించడం మొదలుపెట్టాడు. “నా వయస్సు వాళ్లతో పోలిస్తే నేను అందరి కంటే బాగా చదువుతున్నాను . ఒకవేళ అందరి కంటే బాగా చదవకపోయినా తెలివితేటల్లో అందరితో సమానంగానే ఉన్నాను. నన్నేఎందుకు చచ్చిపొమ్మని పంపేస్తున్నారు?
   చిన్నవాడైన నచికేతుడికి తన ముందు చాలా కష్టాలు ఉన్నట్టు అనిపించింది. తన సొంత తండ్రే తనని అక్కర్లేదని అనుకుంటున్నాడు. అతడికి సహాయం చెయ్యడానికి ఇంక ఎవరుంటారు? అయినా తండ్రి అన్నమాట నిలబెట్టుకోవాలి కనుక, తను యముడి దగ్గరికి వెళ్ళాలనే నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే నచికేతుడు తన తండ్రికి సహాయ పడాలని అనుకున్నాడు.
   ఆ చిన్న బ్రాహ్మణ పిల్లవాడు యముడి ఇంటి గుమ్మం దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ యముడు లేడు. అందువల్ల అతడు యముడి ఇంటి గుమ్మం దగ్గర మూడు రోజులు యముడికోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు.  కోపంగాని, చిరాకుగాని లేకుండా ఓర్పుతో యముడి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అతడి ఓర్పు యముడికి నచ్చింది.
   ఆ రోజుల్లో గొప్ప చక్రవర్తి అయినా సరే బ్రాహ్మణులని తప్పనిసరిగా గౌరవించేవాళ్ళు. అన్ని విషయాలు తెలిసిన యముడు, అంత గొప్ప పదవిలో ఉండి కూడా పశ్చాత్తాప పడ్డాడు.
   మూడు రోజులు తన కోసం గుమ్మం దగ్గరే కూర్చుని వేచి చూస్తున్న నచికేతుడు చిన్నవాడైనా బ్రాహ్మణ బాలుడు కనుక అతడికి క్షమాపణ చెప్పాడు. అతడి ఓర్పుకి మెచ్చుకుని మూడు వరాలు ఇచ్చాడు.
   మొదటి వరంగా నచికేతుడు తను ఇంటికి తిరిగి వెళ్ళాక తండ్రి, ఇతర బంధువులు తనని ఆదరించాలని కోరుకున్నాడు. అలా ఎందుకు అడిగాడంటే మొదట తను క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలని అనుకున్నాడు. అలా వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు తనని చూసి చచ్చిపోయినవాడు తిరిగి రాలేడు కనుక వచ్చిన వాడు దెయ్యం అనుకునే ప్రమాదం కూడా ఉంది.
  రెండో కోరికగా నచికేతుడు స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలో చెప్పమన్నాడు. యముడు ఆ రహస్యం ఏమిటో నచికేతుడికి వివరించాడు. ఈ రహస్యాన్ని ప్రత్యేకమయిన అగ్నుల వల్ల పొందవచ్చు. తను చెప్పగానే మొత్తం నేర్చుకున్న నచికేతుణ్ణి గౌరవిస్తూ యముడు ఆ అగ్నికి నచికేతాగ్ని అని పేరుపెట్టాడు.
   తరువాత నచికేతుడు మరణం తరువాత మిగిలే దాన్ని గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. కొందరు మరణం తరువాత ఏమీ ఉండదని, మరి కొందరు మరణం తరువాత అత్మ మిగిలే ఉంటుందని అంటున్నారని అదేమిటో చెప్పమని యముణ్ణి అడిగాడు.
   మొదట యముడు దాన్ని గురించి చెప్పడానికి నిరాకరించాడు. నచికేతుడికి సంపదలు, ఆరోగ్యం, సంతోషం, రాజ్యం, చక్రవర్తిత్వం, ఎక్కువ కాలం ప్రపంచంలో జీవించ గలగడం వంటివి అడగమని చెప్పాడు. నచికేతుడు అందుకు అంగీకరించలేదు. అతడు చాలా తెలివితేటలు కలవాడు. యముడితో వీటన్నింటి కంటే ఆత్మను గురించి తెలుసుకోవడమే తనకి ఇష్టమన్నాడు. భగవద్భక్తి కలిగి పర్మాత్మను గురించి తెలుసుకున్నవాడు, ఆత్మ దర్శనాన్ని కోరుకుంటాడే కాని, భోగాలు కోరుకుని ఆశలు పెంచుకుని  మళ్ళీ మళ్ళీ జన్మలు పొందాలని కోరుకోడు అన్నారు స్వామి వివేకానందుడు
   యముడు నచికేతుడికి నచ్చచెప్పాలని ప్రయత్నించాడు. అతణ్ణి అనేక విధాలుగా పరీక్షించాడు. నచికేతుడిలో ఎటువంటి మార్పూ లేదు. తనకు పరమాత్మను గురించిన జ్ఞానమే కావాలని పట్టు పట్టుకుని కూర్చున్నాడు.
   నచికేతుడి పట్టుదలకి సంతోషించిన యముడు అటువంటి శిష్యుడు దొరికినందుకు అనందపడ్డాడు. నచికేతుడికి పరమాత్మను గురించిన జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఏ మార్పులూ లేని పరమాత్మే గొప్పదని, అదే నిత్యమని చెప్పాడు. మరణం శరీరానికేగాని, ఆత్మకు లేదని వివరించాడు. యముడు నచికేతుడి ద్వారా లోకానికి పరమాత్మను గురించి బోధించాడు.
   నచికేతుడు తిరిగి వెళ్ళడానికి బయలుదేరాడు. యముడికి సంతోషంగా ఉంది. నచికేతుడి వంటి శిష్యుడు దొరకడం వల్ల పరమాత్మ గురించి ప్రపంచానికి తెలియ చెయ్యడానికి వీలు కలిగింది. తన దగ్గర పొందిన జ్ఞానాన్ని తన శిష్యుల ద్వారా నచికేతుడు లోకానికి తెలియచెయ్యగలడు . నచికేతుడు అంత గొప్పవాడు.
   నచికేతుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. పరమాత్మ గురించి పూర్తిగా తెలిసిన యముడి ద్వారా తను జ్ఞానాన్ని పొందగలిగాడు. యముణ్ణే గురువుగా పొందడం తన అదృష్టంగా భావించాడు. అంతేకాదు మరణాన్ని కూడ గెలిచాడు. ఆ సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. అతడి తండ్రి, బంధువులు ఎంతో సంతోషంతో అతణ్ణి ఆహ్వానించారు.
   చిన్న బాలుడు మనుషులకి సంబంధించిన గొప్ప జ్ఞానాన్ని లోకానికి తీసుకుని వచ్చాడు. ఒకవేళ నచికేతుడు కనుక యముడు చూపించిన ప్రపంచానికి సంబంధించి ఆశలకి లోబడి ఉంటే కథ వేరొక విధంగా ఉండేది. చిన్నవాడయినా నచికేతుడు ఏ కోరికలకి లొంగకుండా అమరత్వాన్ని పొంది చిరంజీవిగా మిగిలాడు.
   అంతేకాదు, తండ్రి మాటకి ఎదురు చెప్పకుండా చచ్చిపోవడానికి కూడా వెనుకాడలేదు. తండ్రి అన్నమాట నిలబెట్టడం కోసం యముడి దగ్గరికి వెళ్ళిపోయాడు. కాని అక్కడ చచ్చిపోయినవాడుగా ఉండలేదు. యముణ్ణి గురువుగా చేసుకుని ప్రపంచానికి ఆత్మ, పరమాత్మల గురించిన జ్ఞానాన్ని తీసుకొచ్చి బోధించాడు. తనకు కలిగిన ఆపదని తల్చుకుని బాధ పడకుండా దాన్ని మంచి అవకాశంగా మలుచుకుని తనకు, తన వంశానికి, ప్రపంచానికి కూడా జ్ఞానోదయం కలిగించాడు.
  


No comments:

Post a Comment