About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.
Showing posts with label సాయి పథ౦. Show all posts
Showing posts with label సాయి పథ౦. Show all posts

నాటి సాయి ఒక గ్రంథం- నేటి బాబాలు గ్రంథసాంగులు

నాటి సాయి ఒక గ్రంథం- నేటి బాబాలు గ్రంథసాంగులు
   గ్రంథం రాయాలంటే కాలాన్ని ప్రేరేపించగల శక్తి, బుద్ధి , జ్ఞానం, చైతన్యం, ఆసక్తి అన్నీ ఉండాలి. వాటికి భగవంతుని ఆశీర్వాదం ఉండాలి. 
   ఆనాటి భగవంతుడు బాబానే! 
   "భక్తులతో కలిసి జీవించిన బాబాఅనే గ్రంథాన్ని చదవగలిగేను కాబట్టే, బాబా జీవిత చరిత్రని రాయగలిగాను!" అన్నారు హేమాడ్ పంత్.
   అది గ్రంథం కానే కాదు, సాయి లీలామృతం! ఈ అమృతాన్ని సేవించిన వాళ్ళకి మరుజన్మ ఉండనే ఉండదు. మోక్షాన్ని పొందుతారు. 
   విశ్వాసము, ప్రేమ, భక్తి లేనివాళ్ళు, ఆయన్ను విమర్శించేవాళ్ళు, వాదించేవాళ్ళు ఈ అమృతాన్ని సేవించేందుకు అర్హులు కానేకారు.
   మనుషులందరు పవిత్ర నదీ జలల్లో స్నానం చేసి పునీతులవుతారు. వాళ్ళ వల్ల తనకు అంటిన పాప పంకిలం పోవాలంటే ఋషులు, యోగులు, సద్గురువులు తమ జలాల్లో స్నానం చెయ్యాలని నదులు కోరుకుంటాయన్నారు. 
   ప్రశాంతమైన ప్రదేశాన్ని చూసినప్పుడు ఇటువంటి ప్రదేశంలో కూర్చుని వేదపారాయణ చేస్తే మోక్షం కలుగుతుందని బ్రాహ్మణులు...సద్గురువుని చూసినప్పుడు ఇటువంటి గురువు ఆశ్రయాన్ని పొందితే మనకు మోక్షం కలుగుతుందని భక్తులు అనుకుంటారు. 
   మా భగవంతుడు శ్రీ సాయినాథుడే! అన్నారు ఆనాటి భక్తులు.
   భగవంతుడికి దగ్గరవాలంటే ప్రాపంచిక విషయాలమీద విరక్తి పెరగాలి. కోరిక బలీయమైనదైతే దాని నుంచి  రక్షించే మార్గాన్ని  చూపించడానికి భగవంతుడు మనకొక సద్గురువుని చూపిస్తాడు.
   ఆ గురువు ఎవరో ఆయన్ను ఏ విధంగా చేరాలో తెలియనప్పుడు ఆ గురువే భక్తులని తన దగ్గరకు చేర్చుకుంటాడు.
   "మంచి  అయినా, చెడు అయినా ఏది జరగాలన్నా భగవదాజ్ఞ ఉండాలి" అన్నారు శ్రీసాయినాధుడు.
    భక్తుడికి ఉండవలసినది భగవంతుణ్ణి చేరాలన్న బలీయమయిన కోరిక !!
                                                                      ********
   ఒక గ్రంథం రాయాలంటే వంద గ్రంథాలు చదవాలి. గ్రంథం రాసే విషయం పక్కన పెడితే ముందు చదవడానికి ప్రేరణ కావాలి కదా...! 
   భగవంతుడి ప్రేరణతో చదవాలన్న కోరిక కలగాలే కానీ,  రాయడమెంతసేపు ? ఈనాటి బాబాల చరిత్ర రాయాడానికి భగవంతుడు అశీర్వదించడేమో!
   అయినా ఎవరి గ్రంధాలు వారే రాసేసుకోగల గ్రంధసాంగులుండగా గ్రంధాలెందుకు ?
   ఏ కాలంలో అయినా విమర్శించే వాళ్ళని బాబాలు దగ్గరకు చేరనివ్వరు. 
   విశ్వాసం , భక్తి , ప్రేమ కలిగి వారిచ్చే తీర్ధ  ప్రసాదాలు స్వీకరించి మోక్షానికి దగ్గరగా చేరగలిగిన వారికి బాబాలిచ్చే తీర్ధం అమృతంగా అనిపిస్తుంది. 
   అటువంటి అనుభూతి పొందగలిగిన వాళ్ళకే వారి లీలామృతపానానికి అర్హతను కలిగిస్తారు నేటి బాబాలు .
    ఈనాడు భక్తులు తమకు అంటిన పాప పంకిలాన్ని నదీ స్నానం చేసి వదిలించుకోవాలనుకున్నా నదులు మాత్రం అంగీకరించవు.
   వారి పాపం పోవడం మాట అటుంచి ఆ పాపంతో నదుల  జలరూపమే హరించిపోయే పరిస్థితి. 
   ఈనాటి బాబాలు, యోగులు, సన్యాసులు తమ జల్లాలో స్నానం చేయ్యడం వల్ల తమకు అంటిన పాపం పెరిగి జలం హరించి పోయి ఇసుక తిన్నెలే మిగులుతాయన్నది నదీమ తల్లుల ఆందోళన !
  ప్రశాంతమైన ప్రదేశం కానీ, వాతావరణం కానీ కనిపించినప్పుడు గ్రంధ పఠనం , వేద పారాయణ, భజనలు, మోక్షం వంటి వాటి సంగతి ఏమోగాని, భక్తులందరు బాబాల చుట్టూ చేరి అవసరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం దొరొకినట్టే  ! 
   తీర్థప్రసాదాలతో తమ భక్తుల్ని తృప్తి పరచగల బాబాల అండ ఉండగా వేరే భగవంతుడెందుకు ?
   ప్రాపంచిక విషయాల మీద రక్తి పెరగడం వల్లే బాబాలు పెరుగుతున్నారు. కోరిక బలీయమైనది అయినప్పుడు బాబాలే తమ కోరికలతో పాటు భక్తుల కోరికలు తీరే మార్గం కూడా చూపిస్తున్నారు. 
  బాబాలను చేరే మార్గం తెలియాలే గాని, దొరికిన భక్తుల్ని బాబాలు అసలు వదలరు. 
  ఏది జరగాలన్నా భక్తులకు  ఉండవలసింది బాబాలను చేరాలన్న బలీయమైన కోరిక !! 

సాయితో చిత్రగుప్తుడికి పనే లేదు -భగవతీ భగవంతులతో చిత్రగుప్తుడికి చేతినిండా పనే


సాయితో చిత్రగుప్తుడికి పనే లేదు -భగవతీ భగవంతులతో చిత్రగుప్తుడికి చేతినిండా పనే
 
    పంచ భూతాలతో తయారయిన దేహం శాశ్వతం కాదు. అది తిరిగి పంచ భూతాల్లోనే కలిసిపోతుంది.
   పంచేంద్రియాల్ని అదుపులో ఉంచుకుని దేహాన్ని నడిపించే ఆత్మే శాశ్వతమైనదని తెలియ చేశారు ఆనాటి బాబా.
   పూర్వ జన్మలో చేసుకున్న కర్మలకి అనుగుణంగా  భగవంతుడితో నిర్దేశించబడిన కర్మల్ని పూర్తి చెయ్యడానికే భౌతిక శరీరం. వచ్చిన పని పూర్తవగానే ఆత్మ దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని చెప్పారు అని కూడా చెప్పారు.
   మూడు రోజులు తన దేహాన్ని విడిచి వెళ్ళిన బాబా ఆత్మ, తిరిగి అదే దేహంలో ప్రవేశించడం కళ్ళారా చూశాము.
   కాబట్టే బాబా భౌతిక శరీరం లేకపోయినా భక్తులు చెప్పుకునే కష్టాలు విని వారికి మంచి జరిగేలా చేస్తారు అని నమ్మాము. తమ దేవుడికి మరణమే లేదన్నారు ఆనాటి బాబా భక్తులు.
   దేవాలయానికి వెళ్ళడం పూజలు చెయ్యడం అందరూ చూడాలని ఆర్భాటాలు చెయ్యడం వలన ప్రశాంతత చేకూరదు .. అహంకారం, కోరిక, మోహం విడిచిపెట్టినప్పుడే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది.
   ఎవరికయితే భగవంతుడి మీద భక్తి,  ప్రేమ ఉంటాయో...ఆయన్నే ధ్యానిస్తారో...ఆయన నామాన్నే జపిస్తుంటారో...వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు...ఎక్కడ కావాలనుకుంటే అక్కడ భగవంతుణ్ణి చూడ గలుగుతారు.
   అంతటి భక్తి కలిగిన భక్తులకి భగవంతుడే ఋణపడి ఉంటాడు. ఆ ఋణాన్ని మోక్షంతో తీర్చుకుంటాడు.
   ఇతర విషయాల యందు ఆసక్తిని వదిలి ఎవరయితే భగవంతుని సన్నిధానం కోసం పరితపిస్తారో...వాళ్ళని పవిత్రమైన నదుల్ని సముద్రం తనలో కలుపుకున్నట్టు తన భక్తుల్ని తనలో కలుపుకుంటాడు.
    భగవంతుణ్ణి మనస్సులో ప్రతిష్టించి, భగవంతుడూ, నేనూ వేరు కాదు...ఇద్దరమూ ఒకటే! అనుకోవడమే భక్తుడు చెయ్యవలసిన పని.
   ఏది వింటున్నా భగవన్నామమే వినిపిస్తుండాలి. ప్రతి జీవిలోనూ భగవంతుణ్ణి గుర్తించ గలగాలి. ఎవర్ని చూస్తున్నా భగవంతుణ్ణే చూస్తున్నట్టు అనిపించాలి.
   అంతటి ఏకాగ్రత భక్తి కలిగిన  భక్తుల్ని తనలో ఐక్యం చేసుకుంటాడు భగవంతుడు. అన్ని ప్రాణుల్ని ప్రేమించగలిగిన వారిని భగవంతుడే ప్రేమగా చూస్తాడు. చిత్రగుప్తుడు చిట్టా విప్పడు.
  అదే విధంగా ఏ ప్రాణిని కష్టపెట్టినా క్షమించడం ఉండదు! అన్నారు శ్రీసాయినాథుడు.
                                                                  ********
    పంచభూతాలతో తయారయిన దేహం పంచభూతాల్లోనే కలిసిపోయి ఆత్మే మిగులుతుంది.
   తనకు నిర్దేశింపబడిన పనులతో పాటు తాము కోరుకుంటున్న పనులు కూడా పూర్తి చేసుకోవాలి.
   తన పనులు పూర్తవగానే ఆత్మ దేహాన్ని విడిచి పోతుంది. తరువాత ఎటువంటి దేహం సంక్రమిస్తుందోఎవరికి ఎరుక!
   కనుక, పొందిన దేహాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈనాటి బాబా గురువులు.
   కర్మల విషయం పక్కన పెడితే కోరికలు తీర్చుకోవడానికే బాబా గురువులకు సమయం సరిపోదు.
   భౌతిక శరీరంతోనే సహాయపడలేనివాడు దేహాన్ని వదలిన తర్వాత సహాయ పడతారన్న నమ్మకం లేదన్నారు ఈనాటి బాబాగురువుల భక్తులు.
   దేవాలయాలకు వెళ్ళడం, పూజలు చెయ్యడం, హారతులివ్వడం, అయ్యదేవుడికి అమ్మదేవతకి కళ్యాణం చెయ్యడం ఈనాటి భక్తులకి తప్పనిసరి కార్యక్రమం.
  భగవంతుడు కైలాసంలో ఉంటే చూస్తాడో లేదో తెలియదు కనుక, ఎలా చేసినా ఫరవాలేదు. ఆ లెక్కలుచిత్రగుప్తుడు చూసుకుంటాడు.
  కాని, భగవంతుడు, భగవతి ఎదురుగానే ఉన్నప్పుడు జరుగ వలసిన పూజలు  జరుప వలసిన రీతిలోనే జరపాలి కదా?
   ఆర్భాటాలు, అందరికీ తెలియ చెయ్యడాలతో సరిపొతుంటే, ఇంక ప్రశాంతతకి చోటెక్కడిది?
   భక్తి, ప్రేమలు భగవంతుని మీద మాత్రమే ఉంటే చాలదు. ఆయన నామాన్ని మాత్రమే జపిస్తూ...ఆయన నామాన్ని మాత్రమే ధ్యానిస్తే ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు దండించగలదు భగవతి.
  అమ్మకు కోపం రానివ్వకుండా  చూసుకునే శిష్య బాబాల ఋణం భగవంతుడే తీర్చుకుంటాడు.
   ఇతర విషయాలు వదులుకుని ఎల్లప్పుడూ తమనే ధ్యానించి, తన చుట్టూ తిరుగుతూ కనుసన్నలలో మెలగని శిష్య బాబాల్ని... నదులు పిల్ల కాలువల్ని తమ నుంచి బయటకు పంపించిన విధంగా ఇహం నుంచి పరానికి పంపించేస్తారు.
   అటు భగవంతుడి విషయాలకు, ఇటు ప్రాపంచిక విషయాలకు కూడా కాకుండా చేస్తారు భగవతీ భగవంతులు.
   ఏది వింటున్నా వారి ఆదేశమే వినబడాలి, ఏది తింటున్నా వారికి ఇష్టమైందే తినాలి.
   ఏది చెప్పినా వారు చెప్పమన్నట్టే చెప్పాలి.
   అంతటి ఏకాగ్రత, భక్తి , ప్రేమ కలిగిన శిష్య బాబాల్ని తమ విషయాల్లోకి కలిపేసుకుంటారు భగవతీ భగవంతులు.

   భక్తులు తగ్గితే శిష్యబాబాలకు శిక్ష తప్పదు!  భగవంతుడు క్షమించడు మరి!!

సాయికి చూపులోనే ప్రేమ-బాబాలకు చూపు లేని ప్రేమ

నాడు సాయి పథం-నేడు బాబాల పథం
సాయికి చూపులోనే ప్రేమ-బాబాలకు చూపు లేని ప్రేమ
     
    నిండు జీవితాన్ని అనుభవించి ఈ లోకం నుండి వెళ్ళే ప్రతి మనిషికి తన అవసాన కాలం సమీపిస్తున్నప్పుడు స్పష్టంగా తెలుస్తుంది అన్నారు సాయి.
   భగవంతుడిచ్చిన ఆయుష్షు పూర్తయ్యేవరకు జీవించి అవసాన కాలంలో ఉన్నవారు, ఆత్మ జీవిని వదిలే సమయంలో భగవంతుణ్ణి స్మరించాలన్నారు.
   చివరి సమయంలో భగవంతుణ్ణి స్మరించుకోవాలనుకున్నా ఆ సమయంలో మనస్సు నిలకడగా ఉండదు. కాబట్టి, అటువంటి అభ్యాసం చిన్నతనం నుంచే అలవడాలన్నారు.  
   ప్రతి జీవి భగవంతుణ్ణి చేరాలి కనుక, భగవన్నామం చెయ్యాలి. ఎవరేనా అవసానకాలంలో ఉన్నారని తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర కూర్చుని పవిత్ర గ్రంథాలు చదవడం, భగవన్నామం జపించడం, భజనలు చేయడం వంటివి చేస్తే వారి మనస్సు భగవంతుని యందే నిలబడి పుణ్యలోకాలకి వెడతారు.
   ఆ విధంగా జరగనప్పుడు జీవి మనస్సు పిల్లలమీదో, పదవులమీదో, దాచిపెట్టిన సంపదల గురించో ఆలోచిస్తూ ఉంటుంది. తరువాత జన్మలో కూడా వాటి గురించే తాపత్రయ పడి మనిషి జన్మనే పోగొట్టు కుంటారు.
   ఒక ఇటుక రాయి మీద, చేయి ఆన్చుకుని కూర్చునేవారు సాయి. పడుక్కున్నప్పుడు కూడా దాని మీద చేయి ఆన్చి ఆసనం మీదకు వెళ్ళేవారు.
   చాలా కాలం తర్వాత ఆ ఇటుక రాయి విరిగి పోయింది. “దీన్నెప్పుడూ విడిచి ఉండలేదు. ఆత్మను పరమాత్మతో అనుసంధానం చేసేప్పుడు కూడా నాకు తోడుగా ఉండేది.
   దాని మీద నేను పెంచుకున్న ప్రేమ అంతా ఇంతా కాదు. ఇప్పుడు నన్ను విడిచి వెళ్ళి పోయింది” అని బాధపడ్డారు.
   జీవం లేని వస్తువు మీద కూడా అంత ప్రేమను చూపించిన సాయి ప్రేమ ఎంతో గొప్పది!” అన్నారు సాయి భక్తులు.
   నిస్సహాయులకు సహాయం చెయ్యడానికి, మూర్ఖులకి జ్ఞానం ప్రసాదించడానికి, భక్తులకి మోక్షమార్గం చూపడానికి అవతరిస్తారు యోగులు.
   ప్రాణం లేని వస్తువు చేసిన సహకారాన్ని  కూడా గుర్తించగలిగిన గొప్ప మనసు ఉండాలి. ప్రతి మనిషి తనకు సహాయపడినవారి పట్ల కృతజ్ఞులై ఉండాలి అన్నారు శ్రీ సాయినాథుడు.
   ఆ కృతజ్ఞతే ఇతరులకు సహాయపడాలి అన్న కోరిక కలిగించే విజ్ఞత!!

                                                                                             *********

  ఆనాడు మంచి మనస్సుతో ఇతరులకి సహాయ పడుతూ భగవద్భక్తి కలిగి జీవించారు కనుక అవసానకాలం గురించి తెలుసుకో గలిగారు.
   ఈనాడు స్వార్ధంతో పరుగులు పెడుతూ సంపూర్ణమైన జీవితం అనుభవించకుండా అర్ధాంతరంగా జీవితం ముగిసి పోతోంది. అప్పగింతలకే సమయం లేనప్పుడు భగవన్నామాకి సమయం ఎక్కడిది ?
   ఆత్మ జీవిని వదిలి పెట్టే సమయంలో భగవంతుడి వైపు కాకుండా దృష్టిని దాచి పెట్టినవి ఎవరు ఎత్తుకు పోతారో చూసుకుని నమ్మకం ఉన్నవాళ్ళకి అప్పగిస్తే వచ్చే జన్మలో మళ్ళీ వాటిని అనుభవించవచ్చు!
   చివరి సమయంలో భగవంతుణ్ణి తల్చుకోవాలంటే ఆభ్యాసం చిన్నతనం నుంచే అలవడాలి.
    మనకూ ఒక అవసాన కాలం ఉందనీ, ఈ జీవితం సత్యం కాదని తెలుసుకోడానికే సమయం లేనప్పుడు ఇక అభ్యాసానికి సమయం ఎక్కడిది?
   అటువంటివారు అవసాన కాలంలో భగవంతుణ్ణి స్మరించలేరు కనుక, వారి దగ్గర కూర్చొని భగవన్నామ స్మరణ చెయ్యడం, పవిత్ర గ్రంథాలు చదవడం చేసినా వారి మనస్సు భగవంతుడి వైపు మళ్ళడం మాట పక్కన పెడితే ప్రయత్నించే వారికే అవసాన కాలం వస్తోంది.
   వారి మనస్సు కుటుంబాల మీదో అనుభవించాలన్న కోరికల మీదో ఉంచి వచ్చే జన్మ ఏదయినా వాటి దగ్గరకు చేరితే చాలు! అనుకుంటున్నారు.
   “ఉపయోగించు-వదిలెయ్యి” అనేదే నినాదంగా నడుస్తున్న ఈ రోజుల్లో జీవితం నిలబెట్టిన తల్లితండ్రుల్నే వృద్ధాశ్రమాలకు తరలిస్తుంటే అప్పటి వరకు ఉపయోగించిన వస్తువుల మీద ప్రేమ ఎక్కడ ఉంటుంది ?
   ఆత్మీయతే తెలియని ఆత్మలకు పరమాత్మ గురించి, రాబోయే జన్మల గురించి ఆలోచన ఎక్కడ ఉంటుంది ?
   జీవుల మీద ప్రేమ పెంచుకోలేని వారికి కనిపించని భగవంతుడి మీద, కదలిక లేని వస్తువుల మీద కదిలించే ప్రేమ కనబడాలనుకోవడం అజ్ఞానమే!

   జ్ఞానం లేని మూర్ఖులు ఎందరో మోక్షమార్గం తెలియని యోగులుగా అవతారమెత్తి భక్తుల నుండి సాయం పొందుతుంటే... ప్రేమ అనే పదమే కనుమరుగవుతోంది!!

సాయి భక్తుల భావన – స్వామీజీ భక్తుల భావన


నాడు సాయి పథం-నేడు బాబాల పథం
సాయి భక్తుల భావన స్వామీజీ భక్తుల భావన
   సంసారమనే సముద్రాన్ని దాటడం అందరికీ కష్టమయిన విషయమే ! ఎంత ధనం కూడ బెట్టినా ఫలితం ఉండదు. సంసార సముద్రంలో జీవిత నావ ఎటు పడితే అటు నడుస్తుంది.
   ఆ సమయంలో నావను గమ్య స్థానానికి చేర్చే మార్గాన్ని చూపించగల గురువు కావాలి. అతడు కూడా సద్గురువై ఉండాలి.
   తన భక్తుల్ని ముక్తి మార్గం వైపు నడిపించి గమ్య స్థానం చేర్చగలిగిన దిక్సూచి వంటివాడు సద్గురువు శ్రీసాయి నాథుడు అన్నారు సాయి భక్తులు.
   ఆయనే స్వయంగా మా నుదిటికి విభూతిని దిద్ది తల మీద చెయ్యి పెట్టి ఆశీర్వదించినప్పుడు మనసు సంతోషంతో ఉప్పొంగి కళ్ళ వెంట ఆనందభాష్పాలు కారేవి. సాయి మీద ప్రేమ మహాసముద్రంలా పొంగేది” అన్నది అనాటి సాయి భక్తుల మనోగతం.
   గురువుగారి చేతి స్పర్శకు,  ఆయన ఆశీస్సులకి కోరికలతో నిండిన ఆత్మ అగ్నితో పునీతమైనట్టు పరిశుద్ధత పొంది జన్మజన్మల పాపం నశించి పోతుంది.
   ఆయనను దర్శించగానే ఆనందంతో గొంతు మూగబోయి మనసంతా ’అహం బ్రహ్మస్మి’ అనే భావన నిండిపోతుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
   భగవంతుణ్ణి ఏ రూపంలో దర్శించుకోవాలని అకుంటున్నామో అదే రూపాన్ని సద్గురువు సాయినాథుడిలో దర్శించగలం.
   అహంకారాన్ని పోగొట్టి మనోబలాన్ని అందించి, భక్తి మార్గాన్ని ఉపదేశించి, మనసుని మంచి మార్గం వైపు మళ్ళించి, నమ్ముకున్న వారిని ముక్తి మార్గంలోకి నడిపిస్తూ సంసార సముద్రాన్ని దాటించి ఒడ్డుకు చేర్చడమే సద్గురువు బాధ్యత.
   నమ్మిన వారిని ముళ్ళ మార్గం నుండి ముక్తి మార్గంవైపు నడిపిస్తాడు శ్రీసాయినాథుడు!
                                                        ********
      డబ్బుంటే ఏ పనయినా జరిగిపోతుంది అనుకునే రోజులివి. సంపాదన ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్పగా  జీవితం సాగిపోతుంది అనుకుంటే పొరపాటే !
   జీవితాన్ని ఎలా గడిపితే ప్రశాంతంగా ఉంటామో ఆలోచించుకోవాలి. ప్రశాంతతని,    మనశ్శాంతిని ధనంతో కొనలేము. ఎంత గొప్పవాడైనా కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. గుడికి వెళ్ళి  భగవంతుణ్ణి ఒకసారి దర్శించి పెద్ద మొత్తం హుండీలో వేస్తే చాలు చేసిన పపాలన్నీ పటాపంచలైపోతాయని అనుకుంటున్నారు ఈనాటి భక్తులు.
   ఇటువంటి ఆలోచన కలగడానికి కారణం ప్రపంచంలో జరుగుతున్న విషయాలన్నీ భగవంతుడి ప్రమేయంతోనే జరుగుతూ ఉండడం.
   ఆ విషయాన్ని గ్రహించ లేక ధనం ఉంటేనే ప్రశాంతత ఉంటుంది...అది లేకపోతే ప్రశాంతత ఉండదు అన్నది ఈనాటి స్వామీజీ భక్తుల మనోగతం.
   అసలు జీవించడమంటే ఏమిటో తెలియడానికే సద్గురువు కావాలి. ఈ నాటి స్వామీజీలు తమకి ఇష్టమైన మార్గంలో జీవిస్తూ జీవించడం ఇతరులని జీవింప చెయ్యడం సద్గురువు బాధ్యత. కాని,మార్గంలో జీవిస్తున్నారు. ఆత్మ సాక్షాత్కారానికి బదులు ధన సాక్షాత్కారానికే ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తున్నారు.
    అందువల్ల భక్తులు కూడా అదే మార్గం వైపు పయనిస్తున్నారు. సద్గురువులు ఎప్పుడూ పరిశుద్ధమైన మనస్సుతో ఆత్మ సాక్షాత్కారం పొందాలన్న తపన, ముక్తి మార్గం వైపు పయనించాలన్న కోరిక కలిగిన మంచి శిష్యుడి కోసం వెతుకుతూ ఉంటారు.
  సద్గురువుకి మంచి శిష్యుడు దొరకడం ఎంత కష్టమో...మంచి శిష్యుడికి సద్గురువు దొరకడం కూడా అంతే కష్టం.
   భూమి మీదకు వచ్చేప్పుడు ఏదీ తెచ్చుకోము... భూమిని వదిలి వెళ్ళేప్పుడు వెంట ఏదీ తీసుకుని వెళ్ళము.

   ఇది తెలుసుకున్న స్వామీజీల ఆశీర్వాదమే ఈ నాటి భక్తులకి ముక్తి మార్గం చూపించే దిక్సూచి!!   

సాయి ధుని జ్వాల – భక్తుని హృదయ జ్వాల


సాయి ధుని జ్వాల భక్తుని హృదయ జ్వాల
  
    దక్షిణ దిక్కుగా తిరిగి ధునికి ఎదురుగా కూర్చుని ఎడమ చెయ్యి ఒక కొయ్య మీద పెట్టి భగవన్నామం జపిస్తూ దర్శనమిచ్చేవారు సాయి.
   ధుని అనేది చలిమంట కాదు. అది ఒక ఆరని అగ్నిహోత్రం. ప్రతి వ్యక్తి జ్ఞానవంతుడై అగ్నిలా ప్రకాశించాలన్నదే సాయి కోరిక.
   తమలో ఉన్న క్రోధం, ఈర్ష్య, అహంకారం, కోరికలు, చెడు ఆలోచనలు వంటి చెడు గుణాల్ని అగ్నిహోత్రంలో వదిలెయ్యాలి. అలా చేసిన వ్యక్తే నిర్మలమైన మనస్సుతో ప్రకాశిస్తాడు అని చెప్పేవారు.
   ఆ విషయం భక్తులకి తెలియ చెయ్యడానికే ధునిని ఎల్లప్పుడూ జ్వలింపచేస్తూ ఉండేవారు సాయి. దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు ధునిలో వెయ్యడానికి తమతో ఒక వస్తువుని తెచ్చేవాళ్ళు.  దాన్ని ధునిలో  వేసి దని చుట్టూ ప్రదక్షిణ చేసి నమస్కరించేవారు. ఆ విధంగా భక్తులు కూడా సాయి ఆదేశాన్ని ఆచరించేవారు.
   తనతో తీసుకువచ్చిన వస్తువుని తనలో ఉన్న చెడ్డ గుణంగా భావించి నాలో ఉన్న చెడు గుణాల్ని అగ్నికి ఆహుతి చేస్తున్నాను.
    పవిత్రమైన నా మనస్సుని పువ్వుగా చేసి భగవంతుడికి అర్పిస్తున్నాను!  అనుకుని నిర్మలమైన మనస్సుతో భగవంతుణ్ణి ధ్యానించడమే ఇందులో ఉన్న పరమార్ధం !
   చెడు ఆలోచనలు, కోర్కెలు లేని హృదయమే నిష్కల్మషమైన హృదయం ! అటువంటి హృదయం కలిగిన ప్రతి వ్యక్తి అగ్నిహోత్రంలా పవిత్రుడే ! అన్నారు శ్రీసాయినథుడు.
                                                                     ********
     ఈనాడు బాబాకోసం దేవాలయాలు వీధి వీధికీ వెలిశాయి. కొలిచే భక్తులూ పెరిగారు. పెరిగిన భక్తులకు సరిపడినంత స్థలం అవసరం కనుక, ఇప్పుడు బాబా విగ్రహానికి  కొంచెం దూరంలోనే ధుని ఉంటోంది.
   బాబా దర్శనానికి వచ్చిన భక్తులు ధునిని, బాబాని ఒకేసారి చూడలేకపోయినా విడివిడిగా అయినా దర్శనం చేసుకునే వెడుతున్నారు.
   ధునిని అగ్నిహోత్రంగా భావిస్తున్నారో...చలిమంటగా భావిస్తున్నారో... తెలియదు కాని, ఒకళ్ళని చూసి ఒకళ్ళు నమస్కరిస్తూనే ఉన్నారు.
   కొంత మంది ధుని చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేస్తారు. కొంత మంది నమస్కారం చేస్తారు కాని, ప్రదక్షిణ చెయ్యరు. అది వారి భక్తిని ప్రదర్శించే విధానం కావచ్చు.
   ఒకవైపు జ్వలిస్తున్న నిత్యావసర వస్తువుల ధరలు, రాజకీయ వైషమ్యాలు, అన్నదమ్ముల పోరు, విషజ్వరాలకు బలవుతున్న చిన్న ప్రాణాలు, హత్యలు, ఆత్మహత్యలు, సీట్ల అయోమయంలో విద్యార్ధుల ఆవేశాలు, వృద్ధాశ్రమలకు తరలిపోతున్న తల్లితండ్రుల ఆక్రోశాలు, నిరుద్యోగుల నిట్టూర్పులు, ధన దాహం తీరని హైటెక్కులు వంటి అనేక అర్తనాదాలతో ఈనాటి ధుని వేడి పెరుగుతూనే ఉంటుంది, అది ఎప్పటికీ ఆరదు.
   రగిలింప చేసే భక్తులకు లోటూ లేదు. సహకరించేందుకు ఎంతోమంది స్వామీజీలు కూడా యోగా పరికరాలతో ముందుకొస్తున్నారు.
   తమలో చెడు గుణాలే ఉన్నాయో, మంచి గుణాలే ఉన్నాయో తెలుసుకోలేని భక్తులు తమ కోర్కెలు తీర్చమని కోరుతూ బాబా చుట్టూ, ధుని చుట్టూ గిరగిరా తిరుగుతూనే ఉన్నారు. మొక్కులు మొక్కుతూనే ఉన్నారు.
  ఈనాటి భక్తుల కోరికలు ఆపుకోలేని కోరికలు. అందుకే అలుపెరుగని ఆగని ప్రదక్షిణలు. తిరిగే వేగంలో అనుకున్న ప్రదక్షిణల లెక్క పూర్తయిందో లేదో అని లెక్క కోసం చేతిలో ఆధునిక పరికరం.
  దృష్టి ప్రదక్షిణల లెక్క మీదే గాని, బాబా నామం మీద నిలబడదు కదా! ఏది ఏమయినా తమ పవిత్రమైన కోర్కెలతో మనస్సుని బాబాకి అర్పిస్తూనే ఉన్నారు.
  బబల కనుసన్నలలో జీవించే ఈనాటి భక్తుని హృదయం ఆరని అగ్నిహోత్రమే !
   రగులుతున్న ధునిని ఆర్పాలో...ఇంకా రగిలించాలో ఈనాటి బాబాలకే బాగా తెలుసు!!



సాయి ప్రాణం భక్తుల ప్రాణాలకి అడ్డం - భక్తుల ప్రాణాలు బాబాల ప్రాణాలకి అడ్డం


నాడు సాయి పథం-నేడు బాబాల పథం

సాయి ప్రాణం భక్తుల ప్రాణాలకి అడ్డం - భక్తుల ప్రాణాలు బాబాల ప్రాణాలకి అడ్డం
  
    ఒక వ్యక్తి మరొక వ్యక్తితో “నువ్వు చేస్తున్నది తప్పు అలా చెయ్యకూడదు, ఇలా చెయ్యాలి!” అని చెప్పాడనుకోండి “పోవయ్యా! నీకు మహా తెలుసునని చెప్తున్నావు!” అంటాడు.
   ఇదీ విషయం అని చెప్తే ఎవరూ వినరు. అదే విషయాన్ని గురువు చెప్తే వినడమే కాదు ఆచరిస్తారుకూడా. అందుకే జ్ఞానోపదేశం గురువుద్వారానే జరగాలి అన్నారు శ్రీసాయినాథుడు.
   మనసు, శరీరం, సంపద అన్నీ నీవే...నావి కావు! అనుకుని ఆత్మతో సహా భగవంతుడికి భక్తితో అర్పించాలి.
   శిష్యుడు గురువులో భగవంతుణ్ణి చూస్తాడు. గురువు శిష్యుడిలో భగవంతుణ్ణి చూస్తాడు.
   భగవంతుడు గురు శిష్యుల్ని ప్రాణము ఆత్మలుగా చూస్తాడు. వివరంగా, మృదువుగా, నెమ్మదిగా అర్ధం అయ్యేలా చెప్ప గలిగిన సద్గురువు ఉండడం ఆనాటి భక్తుల అదృష్టమే అదృష్టం!
   సాయి చేసిన ఉపదేశం వల్ల ఆనాటి సాయి భక్తులు కష్టాల్ని కూడా సుఖాలుగా స్వీకరించగల మనోనిబ్బరాన్ని పొందారు.
   ప్రపంచంలో జరిగే ఏ విషయాలకీ భయపడకుండా “శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు” అని నమ్మారు.
   ఏ కష్టం వచ్చినా ఇది భగవంతుడు నిర్దేశించిందే..అన్నీ పూర్వ జన్మ కర్మ ఫలమే! కష్టాల్ని అనుభవించ గలిగిన మనోధైర్యాన్ని సద్గురువే ఇస్తారు! అనుకుని సద్గురువునే భగవంతుడిగా భావించి, ఆయనని పూజించి ప్రశాంతంగా జీవించారు.
   నమ్మిన భక్తుల్ని భగవంతుడే రక్షిస్తాడు అనడానికి నిదర్శనంగా... శ్రీసాయినాథుడు మనసా, వాచా, కర్మణా తననే నమ్మిన భక్తుడికి తన ప్రాణాన్ని అడ్డు పెట్టి రక్షించాడు.
   అయన దేహంతో లేకపోయినా ఆయన భక్తులు శిరిడీలోనే కాదు, తమ ఇళ్ళల్లో కూడా, భజనలు, హరికథలు, కీర్తనలు, సప్తాహాలు, భగవన్నామ స్మరణ చేస్తూనే ఉన్నారు.
   ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉండే ధునిని అరాధిస్తున్నారు. రకరకాల పువ్వులు తెచ్చి అందంగా మాలలు కట్టి శ్రీసాయినాధుణ్ణి అలంకరించి ఆయన చెప్పినట్టు అన్నదానం చేస్తూనే ఉన్నారు.
   మంచి మార్గాన్ని నిర్దేశించి, ప్రశాంత జీవితాన్ని గడిపేందుకు జ్ఞానోపదేశం చేసి, ఆత్మసాక్షత్కారం పొందే విధానం తెలియ చెప్పారు.
   “ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడని, ప్రతి జీవికి ఆకలి ఉంటుందని గుర్తుచేసారు. ప్రతి జీవిని ప్రేమించగల శక్తినిచ్చి, మనస్సులో చెడు ఆలోచనలు కలగకుండా ఎల ఉండాలో భక్తులకి తెలియ చెప్పారు.
   అన్నీ మిథ్య! భగవంతుడు ఒక్కడే సత్యం! అని తెలియ చేసిన సద్గురువు శ్రీసాయినాథుడికి కృతజ్ఞులం!” అన్నారు ఆనాటి సాయి భక్తులు.
   “చావు పుట్టుకలు లేని శ్రీసాయి ఇప్పటికీ తమ మధ్యనే ఉన్నారు” అన్నది సాయి భక్తుల నమ్మకం!
                                                                      ********
    ఒక వ్యక్తి మరొక వ్యక్తిని “నువ్వు  చేస్తున్నది తప్పు...అలా చేయకూడదు!” అని చెప్పాలంటే కొంత అర్హత ఉండాలి.
   అదే విషయాన్ని గురువు చెప్తేనే విని ఆచరిస్తారు. కనుక, జ్ఞానోపదేశం చేసే గురువు జ్ఞానవంతుడై ఉండాలి. లేకపోతే శిష్యులు కూడా అజ్ఞానులుగానే ఊండిపోతారు.
   ఈనాడు ఎవరికి వారే జ్ఞానవంతులమని అనుకుంటూ ఉండడంవల్ల జ్ఞానమంటే ఏమిటి? అనేది ప్రశ్నగానే మిగిలిపోతోంది.
   మనస్సు, సంపద అన్నీ నీవే! ఇవన్నీ నాకు సంబంధించినవి కావు! అంటున్నారు ఈనాటి భక్తులు. ఈనాటి బాబాలకి ఈనాటి భక్తులు ఆత్మతో సహా దేహాన్ని కూడా  అర్పించుకుంటున్నారు.
   శిష్య బాబాలు, బాబా గురువుల్లో తాము కోరుకుంటున్న  కోరికల్ని చూస్తున్నారు. భక్తులు శిష్య బాబాల్లో బాబా గురువుల్ని చూస్తున్నారు.
   బాబా గురువులు, భక్తుల్ని, శిష్య బాబాల్ని ఏమరుపాటు లేకుండ చూస్తూ...భక్తి తగ్గిన భక్తులకు నెమ్మదిగా, మృదువుగా, అర్ధమయ్యేలా జ్ఞానోపదేశం చేస్తున్నారు.
   కష్టాల్ని కూడా సుఖాలుగా భావించగల మనో నిబ్బరాన్ని కలిగిస్తున్నారు. బాబా గురువుల ఆజ్ఞ లేకుండా ఏ పనీ జరగదు.
    శిష్యబాబాల అండ, బాబాగురువుల ఉపదేశం ఉండగా పూర్వకర్మ ఫలాన్ని అనుభవించ వలసిన అవసరం ఎవరికి ఉంటుంది?
   కష్టాలు కూడ కష్టాలుగా అనిపించ లేనంత ప్రశాంతతని పొందుతూ తమని తాము తెలుసుకోలేనంతగా మైమరిచి జీవించ గలిగే ఏర్పాట్లు తమ భక్తులకి చేయిస్తున్నారు నేటి బాబా గురువులు.
  నమ్మిన భక్తుల్ని భగవంతుడే రక్షిస్తాడు అనే దానికి నిదర్శనంగా మనసా వాచా కర్మణా తమనే నమ్మిన భక్తుల్ని తమ ప్రాణాలకి అడ్డుపెట్టుకుని మరీ రక్షిస్తున్నారు.
   జీవుడు జీవచ్ఛవంలా మారినా భజనలు, కీర్తనలు, హరికథలు,సప్తాహాలు, భగవన్నామ స్మరణ భక్తుల ఇళ్ళల్లో కూడా జరుగుతూనే ఉన్నాయి. ధుని కూడా ఏదో ఒక రూపంలో వెలుగుతూనే ఉంటోంది.
   జీవన మార్గాన్ని నిర్దేశించి ప్రశాంతమైన జీవితాన్ని గడిపేందుకు మార్గాన్ని సుగమం చేస్తున్నారు. ఆత్మల సాక్షాత్కారాన్ని పొందగలిగే విధంగా ఉపదేశించి ప్రతి జీవిలోను ఆకలి ఉంటుందని దేహల అవసరాన్ని గురించి తెలియచేస్తున్నారు.
    ఆకలి గురించి తెలుసుకునే అవకాశం దాన్ని తీర్చుకునే అవకాశం కల్పించి మనస్సులో ఆలోచనలని ప్రేరేపించి అందర్నీ ప్రేమించగల శక్తి నిస్తున్నారు.

   ఇంతకంటే దేనికోసం కష్టపడక్కర్లేదని, నిత్యం జరుగుతున్నదే నిజమని జ్ఞానోపదేశం చేస్తున్న బాబా గురువులకి నేటి భక్తులు కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. 

బిక్ష మోక్ష సాధనం -బిక్ష జీవిత సాధనం

నాడు సాయి పథం- నేడు బాబాల పథం

బిక్ష మోక్ష సాధనం -బిక్ష జీవిత సాధనం
   బిక్షాటన చెయ్యవలసిన అవసరం సాయికి లేదు. ఎవర్నీ ఏదీ యాచించకుండా కూర్చున్న చోటుకే అన్నీ తెప్పించుకో గలిగిన శక్తి సాయికి ఉంది.
   ఒక చేతిలో డబ్బా రెండవ చేతిలో జోలె పట్టుకుని, ఘన పదార్ధాల్ని జోలెలోను, ద్రవ పదార్ధాల్ని రేకు డబ్బాలోను వేసుకునేవారు. ప్రతి రోజూ పన్నెండు గంటలకి సాయి బిక్షాటన పూర్తయ్యేది. అన్ని దానాల్లోకి అన్న దానం గొప్పది అనేవారు శ్రీసాయినాథుడు.
   తను ఉన్న చోటుకే అన్నీ తెప్పించుకో గలిగిన సాయి బిక్షాటనకి ఎందుకు వెడుతున్నారు? అనేది భక్తుల సందేహం.
    ఆకలితో ఉన్న వారికి అన్నం పెడితే జన్మ జన్మలకు ఆహారానికి లోటు ఉండదు. మనం వేసే బిక్ష ద్వారా ఇతరుల ఆకలి తీర్చడమే కాదు...పాపాలు నశించి మోక్షాన్ని పొందవచ్చు. అటువంటి మోక్ష మార్గాన్ని భక్తులకు చూపించడం కోసమే సాయి బిక్షాటన !
   బిక్షకి ఏ ఇంటికి వెళ్ళాలో ముందుగానే నిర్ణయించుకుని ఆ ఇళ్ళ వరకే వెళ్ళేవారు. బిక్ష దొరికినా...దొరక్కపోయినా వేరే ఇళ్ళకు వెళ్ళేవారు కాదు.
   దొరికిన బిక్షలో కొంతభాగం మట్టి పాత్రలో వేసి బయట పెట్టేవారు. నోరులేని పక్షులకు జంతువులకు అది ఆహారంగా ఉపయోగించేది. దాని ద్వారా భూత దయ ఉండాలని తెలియ చెప్పడమే సాయి ఉద్దేశ్యం.
   మిగిలిన దాన్ని తనతో కలిసి జీవిస్తున్న భక్తులతో కలిసి పంచుకుని తినేవారు. సాయికి రుచులు, కోరికలు లేవు. బిక్ష రూపంలో దొరికిన వాటిని అన్నిటినీ కలిపేసి తినేవారు.
   అకలి తీరడమే ముఖ్యం కాని, రుచిగా తినడం కాదు. మంచి కార్యాలు చేస్తూ మోక్ష మార్గం వైపు పయనించడానికి ఉపయోగించే శరీరమనే సాధనాన్ని పని చేయించడానికే ఆహారం అనేవారు.
   ఉన్నదంతా ఒక్కళ్ళే తినెయ్యకుండా ఆకలి అన్ని ప్రాణులకీ ఉంటుంది కనుక అందరితో కలిసి పంచుకోమనీ...సహ జీవనం మంచిదనీ చెప్పారు శ్రీసాయినాథుడు !
         
                                                           ********

   బిక్షాటన చెయ్యవలసిన అవసరం ఉందా...లేదా అనే విషయం పక్కన పెడితే అనుకున్నది మాత్రం బిక్షాటన చేసి తీరాలనే ! ద్రవ పదార్ధాల బదులు ద్రవ్యము, ఘన పదార్దాల బదులు బియ్యము.
   అన్ని దానాలకంటే అన్నదానమే గొప్పది కదా ! అన్నమయితే నేమిరా...మరి బియ్యమయితే నేమిరా ? కాలాన్ని బట్టే కొంచెం మార్పు అంటున్నారు ఈనాటి భక్తులు. ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం, ఆకలి లేని వాళ్ళకి బియ్యం !
   నెత్తి మీద పెట్టుకుని అమ్మోర్ని తెచ్చినా...పళ్ళెంలో చెంబు పెట్టుకుని వచ్చినా...గంగిరెద్దుని తోలుకొచ్చినా... బండి చుట్టూ కాషాయ గుడ్డలు కట్టి, మైకులు పెట్టి పాటలతో హోరెత్తించినా...గుడి కట్టించాలని చెప్పినా...అన్న దానమని పలికినా...బిక్షాటన మోక్షమని చాటినా... మొత్తానికి తనదైనా ఇతరులదైనా పొట్ట నింపుకోవడానికేగా. వేసిన వారికి వేసినంత మహదేవా...తిన్న వారికి తిన్నంత మహదేవా !
    తెల్లవారితే ఏ ఏ వీధులు తిరగాలో ముందుగానే నిర్ణయించుకుంటారు. ఏ దేవుణ్ణి తలిస్తే బాగా బిక్ష దొరుకుతుందో ఆ దేవుడికి తగిన విధంగా నలుపు, తెలుపు, పసుపు, కాషాయాలు ధరించి చూసే వాళ్ళకి భక్తి కలిగేలా చేస్తారు.
   ఉదయాన్నే బయలుదేరి తీసుకెళ్ళిన జోలె నింపుకునే వరకు ఇంటింటికీ, వీధి వీధికీ తిరిగి తిరిగి వచ్చినంత వరకు సేకరించి మొయ్యలేనంత బరువుతో ఇంటికి చేరతారు.
   ఏ రోజు బరువు ఆ రోజుకే ! బరువు పెంచుకోవడమే గాని, వెను తిరగ కూడదు అన్నదే మొక్కు !
తెచ్చుకున్న దాన్ని దాచుకోవడమే గాని పంచుకోవడం ఉండదు. పుచ్చుకోవడమేగాని, ఇచ్చుకోవడం రానప్పుడు భూత దయకు దారేది ? జోలె బరువు పెరిగిందంటే భక్తుల భక్తి పెరిగినట్టే ! భక్తులు పెరిగారంటే పాపభీతి పెరిగినట్టే! బిక్ష అడుక్కున్న వాడికి అడుక్కున్నంత !!
  


నాటి బిక్షాటన ధర్మాలు-నేటి బిక్షాటన ధర్మాలు

నాడు సాయి పథం - నేడు బాబాల పథం

నాటి బిక్షాటన ధర్మాలు-నేటి బిక్షాటన ధర్మాలు
  సాయి గొప్పతనాన్ని తెలుసుకుని తల్లిలా ఆదరించింది బాయజాబాయి. మధ్యాహ్నం పన్నెండు గంటలకి తల మీద గంప పెట్టుకుని అడవిలోకి వెళ్ళి అడవంతా తిరిగి సాయిని వెతికి పట్టుకుని భోజనం పెట్టేది. ఇతరుల ఆకలిని తెలుసుకోగలిగేది తల్లి మాత్రమే ! స్త్రీలందరూ సేవా భావంతోనే భగవంతుడికి దగ్గరవాలి అన్నారు శ్రీసాయినాథుడు.
   అసలు బిక్షాటన చేసే హక్కు అందరికీ ఉండదు...బిక్షాటన చేసేవారికి కొన్ని అర్హతలు ఉండాలి...ప్రతి వ్యక్తి బిక్షకు అర్హుడు కాదు ! అన్నారు సాయి.  అర్హతలేమిటో వివరించారు. బాల్యం నుండి సన్యాసి అయి ఉండాలి. సన్యాసే  ఎందుకు అర్హుడు ? వంశవృద్ధి కోరిక ఉండదు.
   భార్య పిల్లలు ఉండరు కనుక – ఇల్లు ఉండదు. ఎవరి పోషణ భారాన్ని తాను వహించడు కనుక – ధనాపేక్ష ఉండదు. ధనము ఉండదు కనుక – కీర్తి కాంక్ష ఉండదు. ఉదర పోషణకి మాత్రమే బిక్ష అడుగుతాడు కనుక – ఉదయం నుండి రాత్రి వరకు బిక్షకి తిరగడు. ఎక్కే గడప, దిగే గడప కాకుండా నిర్దుష్టంగా లెక్కకు ఇళ్ళు ఎంచుకుని బిక్ష ఆడుగుతాడు కనుక – బిక్ష దొరికినా దొరక్క పోయినా వెను తిరుగుతాడు.
    బిక్షాటన చేసే వారికి ఇల్లు, పిల్లలు, ధనాపేక్ష, కీర్తి కాంక్ష, రుచులు వంటివి ఉండకూడదు కనుక – సన్యాసి మాత్రమే బిక్షాటనకి అర్హుడు. అలాగే ఏ దిక్కూ లేని అర్భకుడు కూడా ! అన్నారు సాయి.
   అదే విధంగా బిక్ష వెయ్యడానికి అర్హులు ఎవ్వరు ? దానికి సాయి చెప్పిన సమాధానం గృహస్థు’!’ పాప విముక్తుడయ్యి మోక్షాన్ని పొందడానికి గల మార్గాల్లో అతిథి యజ్ఞం ఒకటి. అది గృహస్థు ధర్మం.
   గృహస్థుకు పాపాలు చేసేందుకు అవకాశాలు ఎక్కువ కనుక – బిక్ష వెయ్యడం వలన కొన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. ఇంటింటికి వెళ్ళి బిక్షాటన చేసి, వారి ధర్మాల్ని వారికి గుర్తు చేసి, ఆ గృహస్థు యొక్క పాపాలను ప్రక్షాళన చేసి, వారిని మోక్షానికి దగ్గర చెయ్యడం కోసమే బిక్షాటన చేస్తున్నాను! అన్నారు శ్రీసాయినాధుడు.
 
                                                                                      ********

    బిక్షాటన చెయ్యడానికి ఈనాడు అందరికీ హక్కే ! అడుక్కోడానికి అరవై విధాలు! అన్నట్టు...పిల్లల పోషణ బాధ్యత స్వీకరించాల్సిన తల్లి కూడా పిల్లల్ని బిక్షాటనకి పంపి పోషిస్తోంది.
   పిల్లల ఆకలి తెలుసుకుని అన్నం పెట్టాల్సిన కన్న తల్లే తన భోజనానికి కూడా పిల్లలు తెచ్చిన బిక్షనే ఉపయోగించుకుంటోంది. తల్లిగా పిల్లల ఆకలి గ్రహించలేని తల్లులకి సేవా భావం ఎక్కడిది ?
   బిక్షాటనకి ఏనాటి అర్హతలు ఆనాటివే ! ఈనాడు బిక్షాటన చెయ్యడం ఒక హాబీ ! కష్టపడకుండా వస్తున్న ఆదాయాన్ని ఎవరు వదులు కుంటారు ? సన్యాసి సంగతి అటుంచి అసలు ఆదాయం కోసం అడుక్కునేవాడే గృహస్థు.  
   ఉదర పోషణార్ధమే కాదు, విలాసవంతమైన జీవితం కోసం కూడా! అడుక్కునే పద్ధతుల్లో అనేక రకాలు. వీటిని ఒక్క మాటలో చెప్పాలంటే వీరముష్టి’.
  బిక్ష అడిగినట్టు వినిపించదు... బిక్ష వేసినట్టు కనిపించదు. మామూలు ముష్టికి మామూళ్ళు ఉంటాయి. ఏ సమయానికి ఏది అవసరమో  దాన్ని బిక్షలోంచి బిక్ష తీసుకుని అందించేస్తారు. ఇదే బిక్ష సేవ !
   వివిధ రకాలయిన ఈ బిక్ష సేవలోంచి కీర్తి, కనకం, కాంత అన్నీ లభిస్తూనే ఉంటాయి. పలకడంలో తేడా తప్పించి ఈనాడు బిక్షాటనకి అందరూ అర్హులే...అందరూ సుముఖులే !          
    ఇంటింటికీ వెళ్ళే బిక్షాటన చెయ్యక్కర్లేదు. రోడ్డు ప్రధాన కూడళ్ళలోనో...గుడి మెట్ల దగ్గరో...ఏ సీ గదుల్లోనో ఎక్కడయినా సరే బిక్షాటన బిక్షాటనే ! బిక్ష వేసే వాళ్ళళ్ళోనే ఉంటాయి తేడాలు.
   వారి వారి హోదాను బట్టే...అడిగేవారూ వేసేవారూ కూడా ! అడిగేవాడు ఉన్నప్పుడు ఇచ్చేవాడికి...ఇచ్చే వాడు ఉన్నప్పుడు పుచ్చుకునే వాడికి కూడా ఉండదు మొహమాటం.

   భక్తుడు కోరుకున్నది అందించడానికే అడుగు తున్నప్పుడు ఇవ్వడానికి ఎందుకు మొహమాటం ? కాకపోతే శృతి మించి మొహం మొత్తితేనే ప్రమాదం !!v