About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మహాభారతకథ-౨౪

 శకుంతల జన్మవృత్తాంతము

   కణ్వుడి ఆశ్రమంలోకి అడుగుపెట్టి అక్కడి ప్రకృతిని చూసి పరవశించాడు దుష్యంతుడు. తనకు ఆతిథ్యమిచ్చి గౌరవించిన శకుంతలని చూసి “నువ్వు ఎవరి కుమార్తెవి? ఈ ఆశ్రమంలో ఎందుకు ఉంటున్నావు? నీపేరేమిటి?” అని  అడిగాడు.

  “మహారాజా! ధర్మమే ప్రతిరూపంగా కలిగినవాడని, పూజ్యుడని ప్రజలతో ప్రశంసలందుకుంటున్న కణ్వమహర్షి నా తండ్రి. నా పేరు శకుంతల” అని చెప్పింది.

   ఆమె మాటలు విన్నాడు దుష్యంతుడు. కాని, మనస్సులో అతడికి అనేక ఆలోచనలు కలుగుతున్నాయి.   “నా మనస్సు ఎందుకో ఈమెను ఇష్టపడుతోంది. ఈమె నిజంగా కణ్వమహర్షి కుమార్తె అయితే... అలా జరగ కూడదు. ఎందుకంటే, నా మనస్సు ధర్మబద్ధమైంది, కూడని పని గురించి నా మనస్సు ఎప్పటికీ అలోచించదు. కణ్వమహర్షి ఇంద్రియాల్ని జయించినవాడని విన్నాను. శకుంతల చెప్పిన మాటల్ని నమ్మలేకుండా ఉన్నాను. నిజమేదో తెలుసుకోవాలి” అనుకున్నాడు.

   శకుంతల పుట్టుక గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు. “ శకుంతలా! నాలుగు విధాలైన ఆశ్రమాలలో ఉత్తమమైన  సన్యాసాశ్రమాన్ని నిష్ఠతో పాటించేవాడు, ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, కళంకం లేని చరిత్ర కలవాడు కణ్వమహర్షి. ఆయనకి నువ్వు కుమార్తెవు ఎలా అయ్యావో అర్థం కావడం లేదు!” అన్నాడు.

   దుష్యంతుడు అడిగినదానికి శకుంతల “రాజా! ఒకసారి మా ఆశ్రమానికి వచ్చిన ఒక మహర్షి మా తండ్రిగారిని పద్మాలవంటి కళ్లతో ఉన్న ఈ శకుంతల ఎక్కడినుంచి వచ్చింది?” అని అడిగాడు. అప్పుడు నా జన్మ వృత్తాంతాన్ని నా తండ్రి ఆ మహర్షికి చెప్తుంటే నేను విన్నాను.

   “ఒకసారి మహర్షుల్లో గొప్పవాడైన విశ్వామిత్రుడు అతి భయంకరంగా తపస్సు చేస్తున్నాడు. ఆయన చేస్తున్న తపస్సుకి భయపడిన దేవేంద్రుడు అప్సరస మేనకని పిలిచి “నువ్వు ఎలాగయినా సరే విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్లి ఆయన చేస్తున్న తపస్సుని ఆపుచెయ్యాలి. లేకపోతే స్వర్గరాజ్యానికి ఉండే గౌరవం నిలబడదు” అని చెప్పాడు.

   దేవేంద్రుడి మాటలు విన్న  మేనక భయంతో “దేవేంద్రా! బ్రహ్మకున్నంత గొప్పతనం కలిగిన వసిష్ఠుడి కుమారుల్ని చంపి వసిష్ఠుడికే బాధ కలిగించాడు విశ్వామిత్రుడు. ఆయన భయంకరమైన కోపం కలవాడు.   నీతో సహా దేవతలందరకీ విశ్వామిత్రుడంటే చాలా భయం. అంత కోపం కలిగిన విశ్వామిత్రుడి దగ్గరికి అందులోనూ తపస్సు చేసుకుంటున్న సమయంలో వెళ్లి అతడి తపస్సుకి భగం కలిగించడమంటే చిన్న విషయం కాదు. ఈ పనికి  నన్ను పంపించడం న్యాయం కూడా కాదు.

   విశ్వామిత్రుడు కోపగిస్తే కులపర్వతాలు బ్రద్దలౌతాయి. (కులపర్వతాలు: మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, గంధమాదనము, వింధ్యము, పారియాత్రము). అడుగున ఉన్న ఇసుక మాత్రమే మిగిలేటట్లు సప్త సముద్రాలు ఇంకిపోతాయి. (సప్త సముద్రాలు: లవణసముద్రము, ఇక్షుసముద్రము, సురాసముద్రము, సర్పిసముద్రము, దధిసముద్రము, క్షీరసముద్రము, జలసముద్రము). మూడు లోకాలూ చక్రం తిరిగినట్టు గిరగిరా తిరిగి పోతాయి. గాలి కదలడానికి కూడా భయపడుతుంది. భయంకరమైన కోప స్వభావం కలిగిన ఆ మహర్షి దగ్గరికి వెళ్లడానికి నాకు చాలా భయంగా ఉంది. స్వర్గరాజ్య గౌరవం కోసం అని చెప్తున్నావు కనుక, నా శక్తి కొద్దీ ప్రయత్నించి ఆ మహర్షి మనస్సుని నా వైపు తిప్పుకుంటాను” అని చెప్పింది.

   పిల్లగాలిని వెంట తీసుకుని విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటున్న తపోవనంలో ప్రవేశించింది. దక్షిణ దిక్కునుంచి వచ్చిన గాలి మేనక కొప్పులో ఉన్న పువ్వుల వాసనతోను, మేనక శరీరానికి రాసుకున్న పూతలనుంచి వచ్చే వాసనలతోను కలిసి మహర్షి విశ్వామిత్రుడి మీదుగా వీస్తోంది. తపోవనంలో తిరుగుతూ మహర్షుల్లో గొప్పవాడు, తన తపస్సువల్ల ఇంద్రుడికే భయాన్ని కలుగ చేసిన విశ్వామిత్రుణ్ని చూసింది. ఆయన దగ్గరికి వచ్చి వినయంగా నమస్కారం చేసింది.

    తరువాత తన చెలికత్తెలతో కలిసి పువ్వులు కోసుకుంటోంది. ఇంద్రుడు కోరుకున్నట్టుగ మేనక విశ్వామిత్రుణ్ని తన వైపు ఆకర్షించుకుంది. మేనకా విశ్వామిత్రులకి ఒక బిడ్డ కలిగింది. ఆ బిడ్డని అక్కడే ఉన్న ఇసుక తిన్నెల మీద వదిలి పెట్టి మేనక తన లోకానికి, విశ్వామిత్రుడు తపోవనానికి వెళ్లిపోయారు.

   పసికందు ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు విని రాక్షసులు, క్రూరమృగాలు నోటితో కరుచుకుని పట్టుకుని పోకుండా పక్షుల గుంపులు వాటి రెక్కలతో కాపాడుకుంటున్నాయి. ఆ సమయంలో మేము శిష్యగణాలతో కలిసి సమిథలు, పూలు, పండ్లు తెచ్చుకోడానికి అక్కడికి వెళ్లాము. అక్కడ పైనుంచి కిందకి దిగి వచ్చిన చంద్ర రేఖలా ఇసుక తిన్నె మీద వెలిగిపోతున్న ఒక పసిపాపని చూశాము. పాపని ఎత్తుకుని మా వెంట తీసుకుని వచ్చాము. శకుంతాల చేత రక్షించబడింది కనుక అమెకి శకుంతల అని పేరు పెట్టి పెంచుకున్నాము.

   మహర్షీ! కన్నవాడు, అన్నం పెట్టినవాడు, భయం నుంచి రక్షించినవాడు ముగ్గుర్నీ స్త్రీలకి తండ్రులుగా చెప్తారు. అదే విధంగా పురుషులకి ఈ ముగ్గురే కాకుండా ఉపనయనం చేసినవాడు, వేదాలు చెప్పినవాడు మొత్తం అయిదుగుర్ని తండ్రులుగా చెప్తారు. శాస్త్రప్రకారం భయం నుంచి రక్షించినవాళ్లం కనుక మేము శకుంతలకి తండ్రులం. పెంచి పెద్ద చేశాము  కనుక శకుంతల మా మనస్సుకి అనందాన్ని కలిగించే కూతురు. కణ్వమహర్షి వివరంగా నా జన్మ వృత్తాంతాన్ని మహర్షికి చెప్పాడు” అని తన గురించి దుష్యంతుడికి వివరంగా తెలియచేసింది శకుంతల.

శకుంతల దుష్యంతుల వివాహము

   శకుంతల మహర్షి కుమార్తేమోనని అప్పటి వరకు భయపడుతున్న దుష్యంతుడికి శకుంతల చెప్పిన ఆమె వృత్తాంతం విన్నాక సందేహం తీరిపోయింది. ఆమె రాజకుమార్తె అని తెలిసింది. అతడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. వెంటనే దుష్యంతుడు “శకుంతలా! అందమైన రూపము, శరీర కాంతి, మంచి గుణాలు కలిగిన నీకు, నార చీరలు కట్టడం, అడవిలో దొరికే పండ్లు తినడం, పర్ణశాలలో ఉండడం తగినవి కాదు. మహర్షులు నివసించే ఈ పల్లెలో ఉండడం నీకు తగినట్టుగా లేదు. నన్ను పెళ్లి చేసుకుంటే గొప్ప సంపదలతో, చెప్పలేనన్ని రాజ్యభోగాలు అనుభవిస్తూ, ఎత్తైన అందమైన మేడల్లో సంతోషంగాను, విలాసంగాను గడపవచ్చు.

   వివాహం చేసుకోడానికి ధర్మ ప్రకారం ఆచరించే ఎనిమిది విధానాలు ఉన్నాయి. అవి బ్రాహ్మణం, దైవం, ఆర్షం, ప్రాజాపత్యం, రాక్షసం, ఆసురం, గాంధర్వం,  పైశాచం. ఉత్తమ క్షత్రియ వంశాలకి చెందిన వాళ్లకి గాంధర్వం, రాక్షసం అనే విధానాల్లో జరిగే వివాహాలు ధర్మంబద్ధంగా ఉంటాయి. మనిద్దరికీ ఒకరంటే ఒకరికి అనురాగం కలిగింది కనుక, గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుందాం!” అన్నాడు దుష్యంతుడు.

   అతడి మాటలు విని శకుంతల “మహారాజా! కరుణాసముద్రులు, ధర్మపరులు నన్ను పెంచి పెద్ద చేసిన  మా తండ్రి కణ్వమహర్షి త్వరలోనే వస్తారు. ఆయన వచ్చి మీరు చెప్పినదానికి అంగీకరిస్తే నన్ను మీకు కన్యాదానం చేస్తారు. ఆయన చేతుల మీదుగానే నేను మిమ్మల్ని వివాహం చేసుకుంటాను!” అని చెప్పింది.

    అమె చెప్పినదాన్ని విని దుష్యంతుడు “తనకు తనే బంధువు, దిక్కు, కర్త అనే లక్షణాలతో ప్రసిద్ధి చెందిన గాంధర్వ వివాహం ఎంతో రహస్యంగాను, మంత్ర తంత్రాలు లేకుండాను ఉంటుంది!” అని శకుంతలకి గాంధర్వ వివాహం గురించి వివరంగా చెప్పి ఆమెని ఒప్పించాడు.

   దుష్యంతుడు చెప్పినదాన్ని విని శకుంతల “మహారాజా! నీ అనుగ్రహం వల్ల నాకు పుట్టిన కుమారుడికి నీ విశాల సామ్రాజ్యానికి యువరాజ పట్టాభిషేకం చేస్తానని మాట ఇస్తే నేను ఈ వివాహానికి అంగీకరిస్తాను!” అని చెప్పింది. శకుంతల మాటలు విని దుష్యంతుడు ఎంతో సంతోషంతో ఆమె కోరికని అంగీకరించాడు. వెంటనే గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకుని ఆమెతో సుఖాలు అనుభవించాడు. ఒకరోజు శకుంతలతో “నాకు వెంటనే చెయ్యవలసిన రాచకార్యాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నేను  రాజ్యానికి బయలుదేరుతాను. నిన్ను వెంటబెట్టుకుని రమ్మని మంత్రుల్ని నీ తండ్రి కణ్వమహర్షి దగ్గరికి పంపిస్తాను!” అని చెప్పి శకుంతలని ఒప్పించి దుష్యంతుడు తన రాజ్యానికి వెళ్లిపోయాడు.

   శకుంతల కణ్వమహర్షి వచ్చాక తను చేసిన పనికి కోపగిస్తాడేమో అని భయపడుతోంది. వెళ్లిన పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన కణ్వమహర్షి శకుంతల హావభావాల్లో కనిపిస్తున్న మార్పుని గ్రహించాడు.   జరిగినదాన్ని దివ్యదృష్టితో చూసి తెలుసుకున్నాడు. క్షత్రియులకి గాంధర్వ వివాహం శాస్త్ర సమ్మతమే అనుకుని ఊరుకున్నాడు.

 

మహాభారతకథ-23

 

ఆదిపర్వము నాలుగవ ఆశ్వాసము ప్రారంభము

పూరువంశ చరిత్ర కథలు -దుష్యంతుడి జన్మవృత్తాంతము

    శౌనకుడు మొదలైన మహర్షులకి దుష్యంతుడి పుట్టుక గురించి చెప్తున్నాడు వైశంపాయనమహర్షి.

   యయాతి కుమారుడు పూరుడు భూమండలం మొత్తాన్ని పాలిస్తూ తన మంచి నడవడికతో వంశానికి ప్రత్యేకమైన గౌరవాన్ని కలిగించాడు. పూరుడు, కౌసల్య దంపతులకి  ‘జనమేజయుడు’ జన్మించాడు. అతడు మూడు అశ్వమేధ యాగాలు చేశాడు. జనమేజయుడు, అనంత దంపతులకి  ‘ప్రాచిన్వంతుడు’ జన్మించి తూర్పుదిక్కుకి రాజుగా ప్రసిద్ధి పొందాడు.

   ప్రాచిన్వంతుడు, అశ్మకి దంపతులకి ‘సంయాతి’ పుట్టాడు. సంయాతి, వరాంగి దంపతులకి ‘అహంయాతి’ కలిగాడు. అహంయాతి, కృతవీర్యుడి కుమార్తె భానుమతి దంపతులకి ‘సార్వభౌముడు’; అతడికీ, కేకయరాజ కుమార్తె సునంద దంపతులకి ‘జయత్సేనుడు’ జన్మించాడు.  జయత్సేనుడికీ, విదర్భరాజు పుత్రిక సుశ్రవస దంపతులకి ‘అవాచీనుడు’ కలిగాడు. అవాచీనుడికి, విదర్భ రాజు కుమార్తె మర్యాదకి  ‘అరిహుడు’; అరిహుడికి ఆంగి యందు ‘మహాభౌముడు’ పుట్టాడు.

   మహాభౌముడికి ప్రసేనజిత్తుడి కుమార్తె సుపుష్ట యందు ‘అయుతానీకుడు’; అయుతానీకుడికి పృథుశ్రవసుడు కుమార్తె కామకి యందు ‘అక్రోధనుడు’ కలిగారు. అక్రోధనుడికి కళింగరాజు కుమార్తె కరంభ యందు ‘దేవాతిథి’; దేవాతిథికి విదేహరాజు కుమార్తె మర్యాద యందు  ‘ఋచీకుడు’; ఋచీకుడికి అంగరాజు కుమార్తె సుదేవ యందు ‘ఋక్షుడు’; ఋక్షుడికి తక్షకుడి కుమార్తె జ్వాల యందు ‘మతినారుడు’ పుట్టారు.

   మతినారుడు సరస్వతీ నది ఒడ్డుమీద పన్నెండు సంవత్సరాలు శాస్త్రప్రకారం శ్రద్ధాభక్తులతో సత్రయాగం చేశాడు.  సరస్వతీ నదికి మతినారుడి మీద అనురాగం కలిగింది. అందువల్ల ధర్మ మార్గంలో అతడిని తన భర్తగా చేసుకుంది. వాళ్లిద్దరికీ ‘త్రసుడు’ కుమారుడుగా జన్మించాడు. త్రసుడు, కాళింది దంపతులకి ‘ఇలునుడు’; అతడికీ రథంతరికీ ‘దుష్యంతుడు’ పుట్టాడు. దుష్యంతుడు చిన్నతనంలోనే దట్టమైన అడవుల్లో తిరిగే సింహాల్ని, పులుల్ని, ఏనుగుల్నీ, శరభమృగాల్నీ వెంటాడి పట్టుకునేవాడు. పెద్ద వృక్షాలతో పాటు పర్వతాల్ని కూడా పెకిలించి తీసి వేరే పర్వతాల మీదకి విసిరేసేవాడు.

దుష్యంతుడి వేట

    అంతులేని భుజబలంతో దిక్కుల చివర్లో ఏనుగులే సరిహద్దులుగా (భూమిని ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది ఏనుగులు మోస్తూ ఉంటాయట) ఉన్న భూమండలం మొత్తాన్ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. సూర్యకిరణాలు, గాలి కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉన్న అడవులతో నిండి ఉన్న భూమిని కూడా తన  భుజబలంతో రక్షించాడు. తన కంటే ముందు పాలించిన రాజుల కంటే ఎక్కువ భుజబలాన్ని ప్రదర్శించి, శత్రువులందర్నీ ఓడించి తనకు శత్రువులే లేకుండా చేసుకున్నాడు.

   దుష్యంతుడి పరిపాలనలో ప్రజలు రోగాలు, దు:ఖాలు, అవరోధాలు. నష్టాలు, అనుమానాలు ఏవీ లేకుండా తమ ప్రభువు నడుచుకున్నట్టే ధర్మ ప్రవర్తనతో జీవించారు. ఒకరోజు దుష్యంతుడు సూర్యుడి రథం కంటే ఎక్కువ వేగంతో పరుగెత్తే గుర్రాలు కట్టబడిన రథం మీద ఎక్కి వేటకి వెళ్లాడు. మహా వీరులు ఈటెలు, చిల్లకోలలు, బాణాలు, కత్తులు మొదలైన ఆయుధాలు ధరించి దుష్యంత మహారాజుని అనుసరించారు.

   అడవిలో తిరుగుతూ నాలుగు వైపుల నుంచి మృగాల మీద దాడి చేశారు. అటు రాజు సైన్యము, ఇటు అడవిలో ఉన్న మృగాలూ వేసే కేకలు అరణ్యమంతా ప్రతిధ్వనించాయి. ఆ శబ్దం మందర పర్వతంతో మహాసముద్రాన్ని చిలికినప్పుడు కలిగిన శబ్దంలా భయంకరంగా ఉంది.

    మహా పరాక్రమవంతుడైన దుష్యంతుడు భయంకరమైన అరణ్యంలో ఉండే శరభాలు, సింహాలు, పందులు, పెద్దపులులు, మదపుటేనుగులు మొదలైన క్రూరజంతువుల్ని వేటాడుతున్నాడు. తప్పించుకుని పారిపోతున్నవాటిని వెంటాడి, దగ్గరికి వచ్చిన వాటిని తరిమి, వాటితోపాటు కుప్పించి పరుగులు తీస్తూ వేటాడుతున్నాడు.  అనేక మృగాల్ని వేటాడుతూ తరిమి తరిమి చంపుతున్నాడు. అలా వేటాడుతూనే వేటమీద ఉన్న ఇష్టంతో చాలా దూరం వెళ్లిపోయాడు.

   అతడి వేగాన్ని అందుకోలేక; అతణ్ని అనుసరించే ఓపికలేక; ఆకలి, దాహం తట్టుకోలేక అతడి సైన్యం ఒకచోట  ఆగిపోయింది. అప్పటికే దుష్యంతుడు కొంతమంది మంత్రులతోను, పురోహితులతోను కలిసి మరో ప్రదేశానికి వెళ్లిపోయాడు.

కణ్వుడి ఆశ్రమము

    దుష్యంతుడు ‘మాలిని’ అనే పవిత్రమైన నది ఒడ్డుమీద అనేక మంచి సువాసనలతో నిండిన పూలు, ముగ్గిన పండ్ల బరువుతో వంగిన చెట్లు, తీగలు, పొదలతో అందంగా ఉన్నఉద్యానవనాన్ని చూశాడు. అది ఇంద్రుడి ఉద్యానవనమైన ‘ఖాండవ వనము’, కుబేరుడి ఉద్యానవనమైన ‘చైత్రరథం’ ఉన్నంత అందంగా ఉంది. వాటితో సమానంగా ఉండాలని బ్రహ్మే భూమి మీద కట్టించాడేమో అన్నంత మనోహరంగా ఉంది.

   దాని అందాన్ని మనస్సులోనే మెచ్చుకుంటూ ఆ ఉద్యానవనంలోకి అడుగు పెట్టాడు. లోపలికి వెడితే ఇంకా ఎన్ని అద్భుతాలు కనిపిస్తాయో అనుకుంటూ నడుస్తున్నాడు దుష్యంతుడు. అతడు అనుకున్నట్టుగానే పెద్ద వృక్షాల్ని అల్లుకున్న లతలు, ఝంకారం చేస్తూ తిరుగుతున్న తుమ్మెదలు, మెల్లగా వీస్తున్న గాలికి అక్షతలు చల్లినట్టు మీద రాలి పడుతున్న రంగు రంగుల పువ్వులు వేటాడి అలిసిపోయిన దుష్యంతుడి మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించాయి.

   నది మీద నుంచి వచ్చే చల్లటి గాలి అతడికి సేద తీరుస్తోంది. పొడవుగా పెరిగి ఎర్రగా చిగురించిన గోరంట్ల చెట్లు, గుబురుగా పూలు పూసిన అశోక చెట్లు, సురపొన్నలు, పొన్నలు, మొగలి పొదలు, తియ్యగా ముగ్గిన పండ్లతో మామిడి చెట్లు, గుబురుగా ఉన్న అరటి చెట్లు చూస్తూ... చిలుకల పలుకులు, కోయిలల మధురమైన కూతలు వింటూ నడుస్తున్నాడు.

   యజ్ఞకుండాల్లో పోసిన నేతి వాసనలు గాలిలో తేలుతూ వస్తున్నాయి. పొగచూరిన లతలతో అల్లుకున్న చెట్ల కొమ్మల మీద పువ్వులు లేకపోయినా తుమ్మెదలు గుంపులుగా అతుక్కుని ఉన్నాయి. అక్కడి వాతావరణాన్నిచూసి ఆ ప్రాంతం తపోవనమని, ఎవరో గొప్ప మహర్షి నివసిస్తూ ఉండచ్చని అనుకున్నాడు.

   దుష్యంతుడు తన హృదయానికి ఆహ్లాదం కలిగిస్తున్న ఆ వనంలో ప్రవేశించాడు. ఉత్తములైన బ్రాహ్మణులు అపకుండా చెప్తున్న వేదపఠనాలు; అగ్నిలో స్వాహా శబ్దాలతో ఆపకుండా వేస్తున్న హవిస్సులు; రకరకాల విషయాల మీద జరుగుతున్న చర్చలు; వాటి మీద తీసుకుంటున్న నిర్ణయాలతో అనేక మంది మహర్షులు నివసిస్తున్న ఉద్యానవనంలో నడుస్తున్నాడు.

  పండిత సభలనుంచి వినబడుతున్న సంభాషణల ఘోష; ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకి చిక్కు విడదీయలేని ప్రమాణాలతో వేదార్థ విచారణ చేస్తున్న మీమాంసకుల చర్చలు; వాదప్రతివాదాల వల్ల కలిగే ప్రతిధ్వనులతో అక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. యజ్ఞాలు నిర్వహించడంలో గొప్ప నైపుణ్యం కలిగిన ఋత్విక్కులకి, వేదాల్లో చెప్పబడినట్టు ప్రతి రోజూ కర్మల్ని చేసే నిష్ఠాపరులకి, గొప్ప తపస్సంపన్నులకి నివాసమైన ప్రదేశంలా కనిపించింది. గంగానదీతీరంలో ఉన్న నరనారాయణులు నివసించే ప్రదేశం ఎలా ఉంటుందో... అదే విధంగా లోకానికి పవిత్రతని  కలిగిస్తూ పుణ్యనదీ తీరంలో ప్రకాశిస్తున్న కణ్వమహర్షి ఆశ్రమాన్ని ఎంతో తన్మయత్వంతో చూశాడు దుష్యంతుడు.

   చిలుకలు సస్వరంగా పాడే సామవేదాన్ని వింటూ తన్మయత్వంతో కదలకుండా నిలబడి పోయిన ఏనుగులు; చెట్ల నీడల్లో చల్లగాలిలో హయిగా స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాలు; బ్రాహ్మణులు పెట్టే పిండాలు తినడం కోసం తొందర పడుతూ కలిసి మెలిసి తిరుగుతున్న ఎలుకల్నీ, పిల్లుల్నీ చూశాడు. సహజంగా వాటి మధ్య ఉండే శత్రుత్వాన్ని వదిలి పెట్టి స్నేహంగా కలిసి మెలిసి తిరుగుతున్న జంతువుల్ని చూసి ఆశ్చర్యపోయాడు దుష్యంతుడు.

   ఆ ప్రదేశంలో కణ్వమహర్షి తపోమహిమ వల్ల క్రూరమృగాలన్నీ కూడా శత్రుత్వం లేకుండా కలిసి మెలిసి జీవిస్తున్నాయి. కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టిన కణ్వమహర్షిని దర్శించి నమస్కారం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందాలని అనుకున్నాడు. తన వెంట వస్తున్న ముఖ్యులైన మంత్రుల్ని, అనుచరుల్ని అక్కడే ఆగమన్నాడు. తనొక్కడే ఒంటరిగా కణ్వమహర్షి ఆశ్రమంలోకి వెళ్లాడు.

   తామరపువ్వుల్లా నల్లటి పెద్ద కళ్ళు, తుమ్మెదలు ఒకే చోట గుమిగూడినట్టు నల్లగా ఒత్తుగా ఉన్న జుట్టుతో ఉన్న శకుంతలని చూశాడు. అక్కడ దుష్యంతుడికి కణ్వమహర్షి కనిపించలేదు. ఎప్పుడూ మహర్షులే తిరుగుతూ కనిపించే తమ ఆశ్రమంలో ఇంద్రుడి కుమారుడు జయంతుడికి ఉన్నంత సౌందర్యంతో వెలిగిపోతున్న మహారాజుని చూసి తొట్రుపడింది శకుంతల.

   అంతలోనే తండ్రి నుంచి నేర్చుకున్న సంస్కారంతో ఆసనం చూపించి కూర్చోమని చెప్పింది. ఆశ్రమ ధర్మ ప్రకారం ఆదరంతో అర్ఘ్యపాద్యాలిచ్చి గౌరవించింది. మహారాజు క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకుంది.   దుష్యంతుడు ఆమెను చూసి “నేను వేటకోసం అడవికి వచ్చాను. కణ్వమహర్షిని కూడ కలిసి వెడదామని ఈ ఆశ్రమానికి వచ్చాను” అన్నాడు.

   ఆ మాటలకి శకుంతల “మహారాజా! తండ్రిగారు ఇంతకు ముందే పండ్లు తీసుకుని రావడానికి అడవికి వెళ్లారు. వస్తూనే ఉంటారు, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి” అని చెప్పింది. అమితమైన సౌందర్యంతో వెలిగిపోతున్న శకుంతల వినయము, మాటల మృదుత్వము, రూపము దుష్యంతుణ్ని మొదటి చూపులోనే అకర్షించాయి. గొప్ప పరాక్రమవంతుడైన మహారాజు దుష్యంతుడు కూడా శకుంతలని ఆకర్షించాడు.

 

మహాభారతకథ-22

 శుక్రాచార్యుడు యయాతికి ఇచ్చిన శాపము – తరువాత జరిగిన విషయాలు

    యయాతి కూడా దేవయానిని ఓదారుస్తూ ఆమె వెంట వెళ్లి శుక్రాచర్యుడికి నమస్కరించాడు. దేవయాని “ ఏడుపుని దిగమింగుకుంటూ “తండ్రీ! ఈ మహారాజు అధర్మ మార్గంలో నడిచి  ధర్మాన్ని అవమానించాడు. రాక్షసుడిలా ప్రవర్తించి రాక్షసకన్య అయిన శర్మిష్ఠతో కుమారుల్ని పొంది గృహస్థ ధర్మాన్ని కించపరిచాడు.  ఆ ఇద్దరూ నాకు అవమానం చేశారు”” అని చెప్పి వెక్కి వెక్కి ఏడ్చింది. తన కుమర్తె దు:ఖాన్ని చూసి శుక్రాచార్యుడికి చాలా కోపం వచ్చింది. తన కూతురు కళ్లల్లో నీళ్లు చూడలేక పోయాడు. యయాతి వైపు చూస్తూ “యౌవన గర్వంతో నా కుమార్తెకి ఇష్టం లేని పని చేశావు. కనుక, నువ్వు ఇప్పటి నుంచే ముసలితనంతో పీడింపబడతావు!” అని శపించాడు.

   శుక్రాచార్యుడిచ్చిన శాపానికి బాధపడి  “గురువర్యా! నేను దేవయానితో జీవితాన్ని పూర్తిగా అనుభవించలేదు. భయంకరమైన ముసలితనాన్ని భరించలేను” అని వేడుకున్నాడు.

   శుక్రాచార్యుడు దేవయానితో అనే మాట విని కరుణించి “నీకు ఇంద్రియ భోగాలమీద ఆసక్తి ఉంటే నీ ముసలితనాన్ని నీ కొడుకుల్లో ఒకళ్లకి ఇచ్చి వాళ్ల యౌవనాన్ని నువ్వు తీసుకో! నువ్వు ఇంద్రియ భోగాలమీద తృప్తి పొందిన తరువాత నీ ముసలితనాన్ని నువ్వు తీసుకుని నీ కొడుకు దగ్గర తీసుకున్న యౌవనాన్ని నీ కొడుకుకి ఇచ్చెయ్యి. నీ ముసలితనాన్ని ఏ కొడుకు తీసుకుంటాడో అతడికే రాజ్యం చేసే అర్హత, నీ వంశాన్ని అభివృద్ధి చేసే అర్హత ఉంటాయి” అని చెప్పాడు.

   యయాతి దేవయానిని తీసుకుని తన పట్టణానికి వచ్చాడు. అప్పటికే అతడికి ముసలితనం ఆవహించింది. తల వణకడం మొదలుపెట్టింది. అవయవాల పటుత్వం తగ్గింది. శరీరం ముడతలు పడింది. జుట్టు నెరిసింది. తలనొప్పి, ఉబ్బసం, పొడిదగ్గు వచ్చాయి. ముసలితనాన్ని పొందిన యయాతి తన కొడుకుల్నిపిలిచి  “మీలో ఎవరేనా నా ముసలితనాన్ని తీసుకుని మీ యౌవనాన్ని నాకు ఇవ్వండి. వాళ్లకి నా రాజ్యాన్ని మొత్తాన్ని ఇచ్చి చక్రవర్తిని చేస్తాను” అన్నాడు.

   యదువు, తుర్వసుడు, ద్రుహ్వి, అనువు యయాతితో “ముసలితనం, రోగం విధి వశం వల్ల సంక్రమించి నప్పుడు ఎవరికి వాళ్లు భరించక తప్పదు కనుక భరించాలి కాని, వాటిని మరొకళ్ల నుంచి తీసుకుని ఎవరు భరిస్తారు. అంత వివేకం లేని వాళ్లు కూడా ఉంటారా? నీ ముసలితనం మాకు వద్దు” అన్నారు.

   కొడుకులు తన మాట వినలేదన్న కోపంతో “కొడుకు యదువుని... యదువంశానికి చెందినవాళ్లు రాజ్యం చెయ్యడానికి అర్హులు కాదనీ; కొడుకు తుర్వసుణ్ని... తుర్వసు వంశానికి చెందినవాళ్లు ధర్మాధర్మజ్ఞానం లేకుండా సంకర జాతులకి చెందిన అటవికులకి రాజులవుతారనీ; కొడుకు ద్రుహ్విని... ద్రుహ్వి వంశానికి చెందినవాళ్లు తెప్పలతో తిరిగే జలప్రదేశానికి రాజులవుతారనీ; ముదుసలితనాన్ని నిందించిన కొడుకు అనువుని... అతడి వంశానికి చెందినవాళ్లు ముసలివాళ్లయ్యేవరకు బ్రతికి ఉండక యౌవనంలోనే మరణిస్తారనీ” శపించాడు.

   నలుగురికంటే చిన్నవాడు కొడుకు పూరుడు తండ్రి ఇచ్చే శాపానికి భయపడి ముసలితనాన్ని తను తీసుకుని తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చేందుకు అంగీకరించాడు. యయాతి తన కొడుకు పూరుడు ఇచ్చిన నవయౌవనాన్ని పొంది వెయ్యి సంవత్సరాలు భోగాలు అనుభవించాడు. తరువాత తన ముసలితనాన్ని తీసుకున్న పూరుడికి తిరిగి అతడి యౌవనాన్ని అతడికి ఇచ్చేసి తన ముసలితనాన్ని తనే తీసుకున్నాడు.   తన ఆజ్ఞని అనుసరించి నడుచుకున్న పూరుడికి నాలుగు సముద్రాల హద్దుగా ఉన్న భూభాగంలో ఉన్న మొత్తం రాజ్యాన్ని అప్పగించాడు.

   బ్రాహ్మణులు, క్షత్రియులు, అన్ని వర్ణాల్లో ఉన్న ప్రముఖులు, మంత్రులు, పురోహితులు, సామంతరాజులు మొదలైన ప్రజలందరి ఎదుట తన కుమారుడు పూరుడికి పట్టాభిషేకం చేశాడు. పట్టణంలో ఉన్న ప్రజలు యయాతిని చూసి “మహారాజా! మీరు ఏమీ అనుకోకపోతే ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాం. అధికమైన బలపరాక్రమాలు కలిగినవాడు, మొత్తం భూభారాన్ని మొయ్యగలిగినవాడు, రాజ్యపాలనకి తగినవాడు, లోకంలో అందరికీ తెలిసిన రాక్షసగురువు శుక్రాచార్యుడికి మనుమడు, నీ పెద్ద కొడుకు యదువు ఉండగా అందరికంటే చిన్నవాడైన పూరుడికి రాజ్యాన్ని అప్పగించడం బాగుంటుందా?” అని అడిగారు.

   పట్టణ ప్రజల మాటలు విని యయాతి “తల్లితండ్రులు చెప్పినట్టు చెయ్యనివాడు, వాళ్ల మాటల్ని హృదయపూర్వకంగా అంగీకరించనివాడు కొడుకు అనిపించుకోడానికి అర్హత ఉన్నవాడు కాదు. అలాగే తండ్రి సంపదలకి తగినవాడు కూడా కాదు. పూరుడు తండ్రిగా నేను చెప్పినవన్నీ చేశాడు. వయస్సులో చిన్నవాడైనా గుణాల్లో పెద్దవాడు, యోగ్యుడు, రాజ్యపాలన చెయ్యగల సహనం ఉన్నవాడు.

   నా ముసలితనాన్ని తీసుకున్న కొడుకే రాజ్యపాలనకి తగినవాడు, వంశాన్ని వృద్ధి చేసుకునేవాడు అవుతాడని శుక్రాచార్యుడే చెప్పాడు” అని పట్టణ ప్రజలకి చెప్పి ఒప్పించాడు. పూరుణ్ని మొత్తం భూమికి చక్రవర్తిగా చేసాడు. మిగిలిన కుమారుల్ని దగ్గరలో ఉన్న ప్రదేశాలకి రాజులుగా చేశాడు. తను మాత్రం వేదవిదులైన బ్రాహ్మణులతో కలిసి తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు.

   యయాతి అడవిలో పళ్లు, దుంపలు, వేర్లు తింటూ... అడవిలో దొరికే పండ్లు, హవ్యాలతో అగ్నిదేవుణ్ని;  కవ్యలతో పితృదేవతల్ని తృప్తి పొందేలా చేశాడు. నియమనిష్ఠలతో వానప్రస్థ ఆశ్రమంలో అరిషడ్వర్గాలు జయించి వెయ్యేళ్లు తపస్సు చేశాడు. తపోబలంతో దేవతావిమానంలో స్వర్గలోకానికి వెళ్లిపోయాడు.

యయాతి పూరుడికి బోధించిన నీతులు

   యయాతి స్వర్గలోకంలో దేవర్షులతో పూజింపబడి బ్రహ్మ లోకానికి వెళ్లాడు. బ్రహ్మ లోకంలో బ్రహ్మర్షులతో పూజింపబడి ఇంద్ర లోకానికి వెళ్లాడు. ఇంద్రుడు యయాతిని పూజించి “రాజా! నాలుగు సముద్రాల్ని చుట్టుముట్టి ఉన్న భూభారాన్ని పూరుడికి అప్పగించేప్పుడు పూరుడికి ఏమని చెప్పావు?” అని అడిగాడు.

   యయాతి “ఇంద్రా! పూరుడికి నేను చెప్పకుండానే అన్నీ తెలుసు. అయినా తండ్రిగా నేను చెప్పవలసింది చెప్పాను. అడిగావు కనుక నేను పూరుడికి ఏం చెప్పానో దాన్ని నీకు చెప్తాను విను “జ్ఞానవంతుల జీవిత చరిత్రలు పఠించాలి. మంచి నడవడిక కలిగినవాళ్లు మాట్లాడుకునేప్పుడు కదలకుండా అక్కడే కూర్చుని విని, వాళ్లు చెప్తున్న ధర్మం గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్నధర్మాన్ని వదిలెయ్యకుండా ఆచరిస్తూ న్యాయమార్గంలో నడవాలి. అర్హత కలిగినవాళ్లకి అవసరమైనంత ధనమివ్వాలి.  ఏదయినా సహాయం అడగడానికి దగ్గరకు వచ్చినవాళ్లని ఆదుకోవాలి.

   సభలో మాట్లాడేటప్పుడు అందరికీ ఇష్టమైనది, ఉపయోగించేది, అందరూ వినతగినది, నిజమైనది మాత్రమే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడకుండా ధర్మంగా ఉండే మాటలు తక్కువగా మాట్లాడాలి.  ఎదుటివాళ్లని బాధ పెడుతూ కఠినంగా మాట్లాడేవాళ్ల దగ్గర ఉండకూడదు. అంటే, మాట్లాడే మాట మితంగా, హితంగా, సత్యంగా ఉండాలి. దయ, మంచి ప్రవర్తన, ఇంద్రియ నిగ్రహం, నిజాన్ని పలకడం, శుభ్రాన్ని పాటించడం తప్పకుండా ఆచరించవలసిన విషయాలు. నిర్మలమైన, ప్రశాంతమైన మనస్సుతో అరిషడ్వర్గాల్ని జయించాలి. గర్వం, కామం, కోపం, అసూయ, పిసినారి తనం, అజ్ఞానం వంటి తనలో ఉండే శత్రువుల్ని జయించాలి. వాటిని మొదట జయించ  గలిగితే... బయట ఉండే  శత్రువు ఎటువంటి వాడయినా జయించడం తేలికవుతుంది. ఇవన్నీ నా కుమారుడు పూరుడికి బోధించాను. పూరుడు ఇతరులకి తనే బోధించగల సర్వగుణాలు కలవాడు” అని చెప్పాడు యయాతి.

   “ఓ మహారాజా! నువ్వు చేసిన తపస్సు చాలా గొప్పది. వందవేల సంవత్సరాలు చేసిన తపస్సు వల్ల వచ్చిన తేజస్సు నీకు అన్ని లోకాల్లోను సర్వ సౌఖ్యాలు అనుభవించే అదృష్టాన్నికలిగించింది. అంత అసాధారణమైన తపస్సు నీది” అన్నాడు ఇంద్రుడు.

   అందుకు యయాతి “దేవతలకి రాజైన ఇంద్రుడా! దేవతలు, రాక్షసులు, యక్షులు, మానవులు, ఆకాశ సంచారులు, సిద్ధులు, మునులు చేసిన తపస్సు కంటే నేను చేసిన తపస్సే గొప్పది” అన్నాడు.

స్వర్గలోకం నుంచి బయటికి వచ్చిన యయాతి

   మహామునుల తపస్సుని తక్కువచేసి మాట్లాడిన యయాతిలో అణిగి ఉన్న గర్వాన్ని గ్రహించాడు ఇంద్రుడు. అతడికి చాలా కోపం వచ్చింది. “యయాతీ! నీకు అహంకారం తగ్గలేదు. ఇప్పటి వరకు స్వర్గలోక సుఖాలు అనుభవించావు కనుక నీ పుణ్యం తగ్గింది. నీ గర్వమే అందుకు కారణం. ఇంక నువ్వు అథోలోకాలకి వెళ్లు!” అన్నాడు ఇంద్రుడు.

   యయాతి “నేను మానవ లోకానికి వెళ్లలేను. నక్షత్ర లోకంలో నక్షత్రాలతో స్నేహంగా ఉండేలా అనుగ్రహించు!” అని ప్రార్థించాడు. యయాతిని అనుగ్రహించాడు ఇంద్రుడు. ఆకాశంలో దిక్కుల మధ్య భాగంలో తనదైన ప్రత్యేక కాంతితో ప్రకాశిస్తూ తమవైపు వస్తున్న కాంతిని చూసి నక్షత్రాలు ఆశ్చర్యపోయాయి.

   తరువాత యయాతి కూతురు కొడుకులైన అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, ఉశీనర దేశానికి సంబంధించిన శిబి మొదలైన నక్షత్ర లోకంలో నివసిస్తున్నవాళ్లు తమ వద్దకు గొప్ప తేజస్సుతోను, అంతం లేని పుణ్య రూపంతోను అభ్యాగతిగా వచ్చిన యయాతిని ప్రేమతో పూజించారు. అతడికి సంతోషాన్ని కలగ చేసి “నువ్వు ఎవరివి? ఎక్కడనుంచి వచ్చావు? ఎందుకు వచ్చావు?” అని అడిగారు.

  యయాతి “గొప్ప చరిత్ర కలిగిన నహుషుడి కుమారుణ్ని, పూరుడు అనే పేరుతో మర్త్యలోకాన్ని పాలిస్తున్న పూరుడికి తండ్రిని, నా పేరు యయాతి.  నేను చేసిన గొప్ప తపస్సు వల్ల బ్రహ్మలోకం మొదలైన దేవ లోకాలన్నీ తిరిగి వరుసగా పుణ్యఫలాల్ని అనుభవించి ఇంద్రుడి దగ్గరికి వెళ్లాను. దేవతలకి రాజైన ఇంద్రుడు నేను చేసిన తపస్సుకి ఆశ్చర్యపడి నా తపస్సు యొక్క మహత్యం చెప్పమని అడిగాడు. నేను దేవతల, సిద్ధుల, మునిశ్రేష్ఠుల చేసిన తపస్సు నా తపస్సుతో సమానం కాదు అన్నాను.

   దేవేంద్రుడు నా మాటకి కోపగించి  గర్వంతో గొప్పవాళ్లని అవమానించడం తప్పన్నాడు. అతడు అన్నది న్యాయమే. గర్వం ఎంత కొంచెం ఉన్నా కూడా చాలా కాలం కష్టపడి తపస్సు చేసి పొందిన ఫలితాన్ని కూడా నాశనం చేస్తుంది. అందువల్ల ఇంద్రుడి ఆజ్ఞ ప్రకారం ఇక్కడికి వచ్చాను” అని చెప్పాడు.

అష్టకుడు అతడి సోదరుల ప్రశ్నలకి యయాతి సమాధానము

   యయాతి కూతురు కొడుకులు యాయాతిని ధర్మం, అధర్మం, మోక్షం, నరకాల స్వభావాలు, జీవులు పిండ రూపంలో పుట్టే విధం, ఆశ్రమ ధర్మాలు, వర్ణాశ్రమ ఆచారాల గురించి చెప్పమని అడిగారు.

   యాయాతి “అన్ని జీవులయందు దయ కలిగి ఉండడం, నిజాన్ని పలకడం కంటే మించిన ధర్మం లేదు. ఇతరుల్ని బాధించడం, వాళ్లకి దుఃఖం కలగచెయ్యడం అన్నింటి కంటే అధమం. వేదాల్లో చెప్పబడిన వాటిని అనుసరించడం ఉత్తమ గతికి మార్గం. వేదంలో చెయ్యవద్దు అని చెప్పిన వాటిని చెయ్యడం అధోగతికి మార్గం అని మహర్షులు చెప్పారు. పిండము ఉండే స్త్రీ అవయవంలో, ఋతుకాలానికి సంబంధించిన రజస్సుతో, పురుషుడి వీర్యం గాలితో ప్రేరేపించబడి కలిసినప్పుడు ఆ అవయవంలో శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము అనబడే ఐదు తన్మాత్రలు రూపొందుతాయి. వాటికి క్రమంగా అవయవాలు ఏర్పడి జీవం పొంది జన్మిస్తారు.

   తరువాత చెవులతో శబ్దాన్ని, నేత్రాలతో రూపాన్ని, ముక్కుతో వాసనని, నాలుకతో రుచిని, చర్మంతో స్పర్శగుణాన్ని, మనస్సుతో అన్నింటినీ తెలుసుకుంటారు. తరువాత పూర్వజన్మల కర్మల ననుసరించి జీవిస్తారు. చెడ్డ పనులు ఎక్కువగా చెయ్యడం వల్ల పుణ్యాన్ని పోగొట్టుకుని పశు, పక్షులగా జన్మిస్తారు.

   మంచి పనులు చెయ్యడం వల్ల కలిగిన పుణ్యంతో మానవజన్మ పొంది అందుకు తగినట్టుగా నడుచుకుని దైవత్వాన్ని పొంది, నిర్మలమైన జ్ఞానంతో మోక్షాన్ని పొందుతారు. గురువుల సేవచేస్తూ, ప్రతిరోజు వేదాన్ని పఠిస్తూ, అగ్నికార్యాన్ని శాస్త్రోక్తంగా చేస్తూ, ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ, శుభ్రంగా ఉంటూ, బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ, పాపం చెయ్యకుండా ఇతరుల్ని బాధపెట్టకుండా జీవిస్తూ, ధర్మమార్గంలో సంపాదించిన ధనంతో అతిథుల్ని పూజిస్తూ, యజ్ఞాలు చేస్తూ, ఇతరుల ధనాన్ని ఆశించకుండా నిత్యకర్మానుష్ఠానంలో మునిగి  ఉండేవాళు ‘గృహస్థులు’.

   నియమంతో కూడిన ఆహారం తీసుకుంటూ అన్నిటియందు ఆసక్తిని విడిచిపెట్టి ఇంద్రియాల్ని జయించి అడవిలో నివసిస్తారు ‘వానప్రస్థులు’.  గ్రామాల్లో దొరికే వస్తువుల్ని వాడకుండా  గ్రామాల్లోనే నివసిస్తూ; దేహపోషణకోసం కొంచేమే ఆహారాన్ని తీసుకుంటూ; పట్టణాలలో ప్రవేశించకుండా; కామం, క్రోధం మొదలైన అరిషడ్వర్గాల్ని వదిలిపెట్టి; శుచిగా ఆచారాల్ని నిర్వర్తిస్తూ; చెయ్యవలసిన పనులు సక్రమంగా చేస్తూ; వేడి, చల్లతనం, దు:ఖం, సంతోషం అన్నింటినీ సమంగా అనుభవిస్తూ; ఏ విషయంలోనూ ఇష్టాన్ని పెంచుకోకుండా ఒంటరిగా తిరుగుతూ; ఇల్లే లేకుండా ఉండే సన్యాసుల్ని ‘యుక్తాచారులు’ అంటారు. వీళ్లు పుణ్యప్రదమైన ఆచారాలు పాటించడం వల్ల పదితరాల పూర్వుల్ని, పదితరాల ముందువాళ్లని, తమ వెనుక వాళ్లని కూడా ఉద్ధరిస్తారు.

   గర్వంతో చేసే అగ్నికార్యం; ఆడంబరం కోసం చేసే వేదాధ్యయనం; అహంకారంతో కలిసిన మౌనం; జ్ఞానం లేకపోయినా ఆడంబరం కోసం చేసే యజ్ఞం అనే నాలుగూ భూమి మీద యోగ్యమైనవి కాదు” అని యయాతి తన దౌహిత్రులు అడిగిన ప్రశ్నలకి సమాధానంగా చెప్పాడు.

    అష్టకుడు, అతడి సోదరులు “అన్ని ధర్మాలు తెలిసినవాడివి, అన్ని లోకాల ప్రవర్తనలు తెలిసినవాడివి, పుణ్యం చేసినవాడివి మాకు పుణ్యలోకాలు ఉన్నాయా?” చెప్పమని అడిగారు.

   “మీకు పుణ్య లోకాలు ఉన్నాయి” అని చెప్పాడు యయాతి. అది విని అష్టకుడు, ప్రతర్దనుడు, వసుమంతుడు, శిబి అనే నలుగురు సంతోషించి “మేము నీ దౌహిత్రులం...నీ కూతురి కుమారులం” అని తమని తాము పరిచయం చేసుకుని యయాతికి పుణ్యలోకాలు ఇచ్చారు. 

   సత్పురుషుల సాంగత్యం వల్ల యయాతి తన మనుమలతో కలిసి పైలోకాలకి వెళ్లాడు” అని సాటిలేని పుణ్యం కలవాడు, ఈర్ష్య లేనివాడు, పరీక్షిత్తు మహారాజు జ్యేష్ఠ కుమారుడైన జనమేజయుడికి వైశంపాయన మహర్షి అంతు లేని పుణ్యఫలం దక్కేలా ప్రేమతో వివరించి చెప్పాడు.

ఆదిపర్వంలోని మూడవ ఆశ్వాసం పూర్తి అయినది