About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మన ఆరోగ్యం మాసపత్రికకి జూన్ నెల 2018
శ్రీకూర్మ జయంతి
ధారణ మంధనాచల హేతో, దేవాసుర పరిపాలవిభో|
కూర్మాకార శరీర నమో, భక్తం తే పరిపాలయమామ్||

   శ్రీమహావిష్ణువు అవతారాలైన దశావతారాలలో శ్రీ కూర్మావతారం నేరుగా రాక్షస సంహారం కోసం అవతరించినది కాకపోయినా, విశిష్ట ప్రయోజనాన్ని బట్టి ఉద్దేశింపబడినది.
   కూర్మావతారం శ్రీమహావిష్ణువు అవతారాలలో రెండవది. కృత యుగంలో జరిగింది. ఒకసారి దేవేంద్రుడి ప్రవర్తనకి కోపం వచ్చి దూర్వాస మహర్షి  "దేవతలు శక్తిహీనులగుదురు గాక!"  అని శపించాడు. అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం    పొందడం మొదలుపెట్టారు.
  వాళ్లందరు కలిసి వెళ్లి శ్రీమహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు. "సకల ఔషధాలకి నిలయమైన పాలకడలిని చిలికి అమృతాన్ని సాధించండి" అని విష్ణువు దేవతలకి ఉపాయం చెప్పాడు. 
   పాలసముద్రంలో రకరకాల తృణాలు, లతలు, ఓషధులు వేసి, మందరపర్వతాన్ని కవ్వంగా చేసుకుని, వాసుకి అనే మహా సర్పాన్ని తరి తాడుగా చేసుకుని, మథిస్తే సకల శుభాలు కలుగుతాయని, అమృతం లభిస్తుందని కూడా చెప్పాడు.
  
   శ్రీహరి, బ్రహ్మాది దేవతలతో  "దేవగణములారా! మీరు క్షీరసముద్రాన్ని మథించండి. అమృతాన్ని పొందడానికి, లక్ష్మీప్రాప్తి గలగడానికి మీరు అసురులతో సంధి చేసుకోండి. ఏదైనా ఒక పని నిర్వహించాలన్నా ఒక గొప్ప ప్రయోజనం పొందాలన్నా శత్రువులైనా సరే వాళ్లతో సంధి చేసికోవాలి.
   నేను మీకు  అమృతం దక్కేలా  చేస్తాను. మీరు రాక్షసరాజు బలి చక్రవర్తిని నాయకుడిగా నియమించుకొని మందరాచలాన్ని కవ్వంగాచేసి, వాసుకి అనే సర్పాన్ని కవ్వానికి త్రాడుగా చేసుకుని, నా సహాయాన్ని కూడ పొంది, క్షీరసాగరాన్ని మథించండి" అని చెప్పాడు.
   ఇంద్రుడు దానవుల్ని కలిసి సాగరమథనానికి అంగీకరింపచేసాడు. పాముకి విషం తల భాగంలో ఉంటుంది. అది మృత్యు స్వరూపం. రాక్షసులు తామసులు, తమస్సు పాప భూయిష్టం. దాన్ని అణచివేస్తే తప్ప లోకంలోనైనా, మనస్సులోనైనా ప్రశాంతత చేకూరదు. అందుకే శ్రీహరి రాక్షసుల్ని మృత్యురూపమైన వాసుకు ముఖం వద్ద నిలబెట్టాడు.
    దేవతలు, దైత్యులతో సంధి చేసికుని, క్షీర సముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. వాసుకి తోకవైపు దేవతలు నిలబడ్డారు. వాసుకి వదిలే విషవాయువులకి దానవులు బలహీనులవుతున్నారు. దేవతలు భగవానుడి కృపాదృష్టితో బలవంతులవుతున్నారు. 
   సముద్ర మథనం ప్రారంభమయింది. ఆధారం ఏదీ లేకపోవడం వల్ల మందరాచలం సముద్రంలో మునిగిపోయింది. అప్పుడు శ్రీమహావిష్ణువు కచ్ఛపరూపము (కూర్మరూపము) ధరించి మందరాచలాన్ని తన వీపుమీద ధరించాడు. మళ్లీ సముద్రాన్ని మథించడం మొదలుపెట్టారు.
   దానినుంచి హాలాహలం బయటికి వచ్చింది. దాన్ని పరమేశ్వరుడు తన కంఠంలోబంధించాడు. ఆయన కంఠం మీద నల్లని మచ్చ ఏర్పడడం వల్ల పరమేశ్వరుడు నీలకంఠుడు అనే పేరుతో పిలవబడ్డాడు. 
  తరువాత సముద్రం నుంచి వారుణీదేవి, పారిజాత వృక్షము, కౌస్తుభమణి, గోవులు, అప్సరసలు, లక్ష్మీదేవి శ్రీమహావిష్ణువుని చేరాయి. సమస్త దేవతలు వాటిని దర్శించి స్తుతించి, అందరూ లక్ష్మీ సంపన్నులయ్యారు. 
   తరువాత అయుర్వేద ప్రవర్తకుడైన ధన్వన్తరి భగవానుడు అమృత కలశంతో ప్రత్యక్షమయ్యాడు. దైత్యులు ఆ కలశాన్ని లాక్కుని దాని నుంచి సగము దేవతల కిచ్చి మిగిలినది తీసికొని  వెళ్ళిపోడానికి బయలుదేరారు.అది చూసిన విష్ణుమూర్తి  మోహినీ రూపం ధరించాడు.
  అందమైన ఆ స్త్రీని చూసిన రాక్షసులు మోహితులై  "సుముఖీ! నువ్వు మాకు భార్యగా ఉండి ఈ అమృతాన్ని మాకు త్రాగించు" అని కోరారు. మోహినీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి ఆ అమృత కలశాన్ని తీసుకుని దేవతలకి తాగిస్తున్నాడు.
   అదే సమయంలో రాహువు చంద్రుడి రూపం ధరించి అమృతాన్ని  తాగుతున్నాడు. అప్పుడు సూర్య, చంద్రులు అతడి కపట వేషం గురించి విష్ణుమూర్తికి చెప్పారు. అది చూసిన శ్రీహరి తన చక్రంతో రాహువు శిరస్సును ఖండించాడు. కాని దయతో మళ్ళీ బ్రతికించాడు. 
   అప్పుడు రాహువు, శ్రీహరితో  "ఈ సూర్యచంద్రుల్ని నేను అనేక సార్లు గ్రహణంగా పట్టుకుంటాను. ఆ గ్రహణ సమయంలో ప్రజలు  కొంచెం దానం  చేసినా కూడా, అది అక్షయమవుతుంది"  అని చెప్పాడు. అది విని శ్రీహరి "తథాస్తు" అన్నాడు. 
    శ్రీహరి ధరించిన  మోహినీ రూపాన్ని చూసి, శంకరుడు మాయతో  మోహితుడై  మోహిని వెంటపడ్డాడు. శంకరుడి  వీర్యము పడిన చోట శివలింగక్షేత్రాలు, బంగారు గనులు ఏర్పడ్డాయి.
   శ్రీహరి శంకరుడితో  "రుద్రా! నీవు నా మాయను జయించావు. నామాయను జయించిన వాడవు నీవు ఒక్కడివే. దేవతలకి అమృతం లభించనందువలన దేవతలు యుద్ధంలో రాక్షసుల్ని జయించి తిరిగి తమ స్వర్గాన్ని తాము పొందారు"  అన్నాడు.     దేవతల విజయ గాథని చదివినవాళ్లు స్వర్గలోకం చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి.
 క్షీరసాగరమథనం జరుగుతున్నప్పుడు పర్వతం బరువుగా ఉండి కింద ఆధారం లేకపోవటంతో సముద్రంలో మునిగిపోయింది. అప్పటి శ్రీహరి లీల కూర్మావతారం. బ్రహ్మాండాన్ని తలపింపజేసే పరిమాణంతో సుందర కూర్మ రూపంలో శ్రీ మహావిష్ణువు అవతరించాడు. ఏటా జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున ఈ కూర్మజయంతిని నిర్వహిస్తారు.
   శ్రీకూర్మజయంతి సందర్భంగా ఉదయం స్వామికి ప్రత్యేక అభిషేకం, విశేష అర్చనలు, అలంకారార్చన, రాత్రికి ఉత్సవ విగ్రహాలకు తిరువీధి నిర్వహిస్తారు. 
   శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మ క్షేత్రంలో కూర్మనాథుడు వెలిశాడు. అస్సాంలోని గౌహతిలోనూ కూర్మనాథాలయం ఉంది. ఇక భారత దేశములో కూర్మనాథుడి ఆలయాలు ఎన్నో ఉన్నా అవి అంతగా ప్రశిద్ధి పొందలేదు .
   ప్రతి పుణ్యతీర్థము మెనక ఒక గాధ ఉంటుంది . ఆ కథలు ఎన్ని అయినా విశేషము, అంతరార్థము , అర్థము , పరమార్థము ఒక్కటే .
   ఈ కూర్మావతార కథే శ్రీకూర్మజయంతిగా ప్రసిద్ధికెక్కింది . శ్రీహరి జంబూద్వీపంలో కూర్మరూపుడై, విశ్వరూపుడై  ప్రకాశిస్తూ ఉంటాడని బ్రహ్మపురాణం చెబుతోంది.
  ఆ కూర్మానికి వెన్నులో మేష, వృషభ రాశులు; తలలో మిథున, కర్కాటకాలు; ఆగ్నేయంలో సింహరాశి; దక్షిణ ఉదర భాగంలో కన్య, తులలు; నైరుతిలో వృశ్చికం; తోకపై ధనుస్సు; వాయవ్యాన మకరం; ఎడమ వైపు కుంభం; ఈశాన్యంలో మీనరాశి ఆక్రమించుకొని ఉంటాయంటారు. దాన్నే కాలానికి ప్రతీకగా చెబుతారు.
   జలంలో నివసించే కూర్మం తనకు గమన సంకల్పం కలిగినప్పుడు కరచరణాలు కదలిస్తుంది. సంకల్పరహితంగా ఉన్నప్పుడు నీట్లో స్తంభించి ఉంటుంది.
   అవసరం లేనప్పుడు ఇంద్రియాలను విషయ సుఖాలనుంచి మరల్చగలగడమనే స్థితప్రజ్ఞకు, బహిర్ముఖ ప్రవృత్తి నిలుపు చేసికొని అంతర్ముఖ ప్రవృత్తిలోనికి వెళ్ళగలిగే చిత్తవృత్తికి కూర్మం ప్రతీక.
    అనంతమైన పొడవు వెడల్పులు దేహం అనాదిగా అనంతంగా ఉండే వస్తువుకే ఉంటాయి తప్ప- జనన నాశనాలు కలిగిన వాటికి సంభవించదు.
   అనంతమైన దేహంతో జలమంతా నిండి క్రీడిస్తున్నట్లు సర్వాధిష్ఠాన, చైతన్యాత్మ స్వరూప నారాయణుడు జీవకోటి అంతటా నిండి ఉండి క్రీడిస్తున్నాడు. కనుక కూర్మం సర్వాధిష్ఠాన భగవత్‌ స్వరూపం.
   శ్రీకూర్మజయంతినాడు శ్రీమహావిష్ణువుని భక్తితో సేవించిన వాళ్లు తప్పకుండా సకల ఐశ్వర్యాలు పొంది సుఖశాంతులతో వర్థిల్లుతారు. శ్రీహరి భక్తులకు శ్రీకూర్మజయంతి శుభాకాంక్షలు తెలియచేస్తూ....

                                                                                                                              

No comments:

Post a Comment