నాన్నమ్మ చెప్పిన ఎలుగుబంటి కథ
తన చుట్టూ చేరిన పిల్లల్ని మురిపెంగా చూసుకుంది నాన్నమ్మ. “ఏమర్రా! అందరూ చేరిపోయారా?” అంది. అందరు వచ్చి
కూర్చున్నారంటే ఇంక కథ చెప్పడం తప్పదనుకుంటూ.
“వచ్చేశాం నాన్నమ్మా! ఈ రోజు
ఏం కథ చెప్తావు?” అని అడిగారు ఆత్రంగా. అందరూ వచ్చారో లేదో అని ఒకసారి అన్ని
వైపులా కలయ చూసుకుని సర్దుకుని కుర్చున్నారు.
“ఉండండర్రా! కొంచెం
ఆలోచించనియ్యండి మరి..” అంటూ కొంచెం సేపు అలోచించింది.
తరువాత “సరే! ఈ
రోజు ఎలుగుబంటి కథ!” అంది నాన్నమ్మ పిల్లల వైపు చూస్తూ.
గొడవగొడవగా
మాట్లాడుతున్న పిల్లల్లో ఒకడు ““ఒరేయ్! మాట్లాడకండిరా! నాన్నమ్మ ఎలుగుబంటి కథ చెప్తోంది”!” అన్నాడు గట్టిగా.
అందరూ మాట్లాడ్డం
మానేసి నిశ్శబ్దంగా అయిపోయారు. అందరి దృష్టి నాన్నమ్మ చెప్పే కథ కోసం ఎదురు చూస్తూ
నాన్నమ్మ మీదే ఉంది.
నాన్నమ్మ
మొదలు పెట్టింది... అనగా అనగా ఒక
ఎలుగుబంటి. అది చాలా నల్లగా ఉంది” అంది. పిల్లలందరూ ఒకేసారి అరిచారు “ఎలుగుబంటి నల్లగానే ఉంటుంది
కదు నాన్నమ్మా!” అని.
ఫరవాలేదు! అందరూ ఉత్సహంగానే వింటున్నారన్నమాట! అయితే వినండి మరి! .
అడవిలో
ఉండేదే అయినా ఆ ఎలుగుబంటి చాలా తెలివైంది. మిగిలిన అన్ని జంతువులతో కలిసి స్నేహంగా
ఉంటుంది. మిగిలిన అన్ని జంతువులు ఏ పని చేసినా దాని సలహా తీసుకుని చేసేవి.
అదే
అడవిలో ఉన్న ఒక నక్కకి మాత్రం దాన్ని చూస్తే ఈర్ష్యగా ఉండేది. అందరూ దీని సలహా తీసుకుంటున్నారు. ఎలాగేనా దీని
పని పట్టాలి! గొప్పలు పోతోంది. అసలు ఈ ఎలుగుబంటిని లేకుండా చేస్తే అందరూ నన్నే సలహా
అడుగుతారు. ఏదయినా ఉపాయం ఆలోచించి దీన్ని చంపెయ్యాలి! అనుకుంది.
వెంటనే తొందర
తొందరగా ఇంటికి వెళ్లిపోయింది. తన ఇంటికి దగ్గర్లోనే లోతుగా ఉండేలా ఒక గొయ్యి
తవ్వింది. దగ్గర్లో చెట్టుకింద ఉన్న ఆకుల్ని తీసుకొచ్చింది. వాటిని ఆ గోతిలో వేసి
ఎవరికీ కనపడకుండా కప్పేసింది.
తరువాత
ఎలుగుబంటి దగ్గరకొచ్చి “ఇవాళ మా ఇంటికి భోజనానికి వస్తావా?” అనడిగింది నక్క.
“అలాగే వస్తాలే” అంది ఎలుగుబంటి.
“అయితే
ఇప్పుడే వెడదాం పద!” అంది నక్క.
ఇద్దరూ
కలిసి నడుస్తున్నారు. నక్క ఇంటికి దగ్గరగా వచ్చేశారు. అదే సమయంలో నక్క ఇంటి
దగ్గరున్న కొబ్బరిచెట్టుమీద నుంచి ఒక కాయ రాలింది.
తన మీద
పడుతుందేమో అని నక్క పక్కకి తప్పుకుంది. కాని, పాపం! అక్కడే తను తీసిన గోతిలో తనే
పడిపోయింది.
“అయ్యో!
నన్ను రక్షించండి! గోతిలోంచి బయటికి తియ్యండి!” అని అరుస్తోంది. తన పక్కన ఉన్న ఎలుగుబంటిని చూస్తూ “నేస్తమా! నన్ను విడిచిపెట్టి
వెళ్లిపోకు!” అని ఎలుగుబంటుని
ప్రార్థించింది.
“నేనున్నాను భయపడకు! నిన్ను నేను రక్షిస్తాను!” అంటూ నెమ్మదిగా నక్కని పైకి
లాగింది ఎలుగుబంటి.
గోతిలోంచి బయటికి వచ్చిన నక్క తను చేసిన పనికి సిగ్గుపడింది. ఎలుగుబంటికి
కృతజ్ఞతలు చెప్పింది. అప్పటి నుంచి నక్క ఎప్పుడూ, ఎవరిమీద అసూయపడలేదు. ఎవరికి చెడు
తలపెట్టలేదు” అంటూ కథ ముగించింది
నాన్నమ్మ.
’అదర్రా!
ఎలుగుబంటికథ! అసూయతో ఎలుగుబంటిని చంపుదామని తను తీసిన గోతిలో తనే పడింది. చక్కగా
అందరూ కలిసి ఒకళ్లకొకళ్లు సహాయం చేసుకోవాలి కాని, అసూయపడకూడదు!
ఇప్పటివరకు
కథ చక్కగా విన్నారు కదా? ఈ కథలో ఉన్న నీతి అర్థమయింది కదా? కాబట్టి, మీరు కూడా
ఎవరిమీద అసూయపడకూడదు!” అంది నాన్నమ్మ ఆవులిస్తూ.
ఇంక కథ
రేపటికి.. మనం నిద్రలోకి.. అంటూనే నిద్రలోకి జారుకుంది నాన్నమ్మ. పిల్లలు కూడా కథ
విన్నామనే ఆనందంతో.. రేపు ఏం కథ చెప్తుందో నాన్నమ్మ అనుకుంటూ... ఎక్కడివాళ్లు అక్కడే నిద్రపోయారు.
No comments:
Post a Comment