About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

’పోషయతి అథవా పుష్టాతీతి పుష్కరమ్’    అంగీరసుడి కొడుకు బృహస్పతి. బృహ: అంటే నీరు. అతడు నీటికి పతి కనుక బృహస్పతి అని పిలవబడ్డాడు. బృహస్పతి దేవతలకి గురువు. అందరికీ శుభాన్ని కలగచేసే బృహస్పతి ఏ రాశిలో సంచరిస్తాడో ఆ నదుల్లోకి పుష్కరుడు కూడా ప్రవేశిస్తాడన్నమాట! దేవగురువు మేషరాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభరాశిలో నర్మదానదికి, మిథునరాశిలో సరస్వతి నదికి, సింహరాశిలో గోదావరినదికి, కన్యారాశిలో కృష్ణానదికి, తులారాశిలో కావేరినదికి, వృశ్చికరాశిలో భీమనదికి, ధనూరాశిలో పుష్కరనదికి, మకరరాశిలో తుంగభద్రనదికి, కుంభరాశిలో సింధూనదికి, మీనరాశిలో ప్రణీతానదికి పుష్కరాలు జరుగుతాయి. మన్మథనామ సంవత్సరం జూలై 14వ తేదీన ఉదయం బృహస్పతి సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు కనుక గోదావరి పుష్కరాలు ప్రారంభం అవుతాయి.
   తుందిలుడు అనే బ్రాహ్మణుడు మహాదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. పూర్తిగా మహాదేవుడిలో ఉండిపోవాలని కోరుకున్నాడు తుందిలుడు. అతడికి అష్టమూర్తుల్లో (పంచభూతాలు,మనస్సు, బుద్ధి, అహంకారం) ఒకటైన జలరూపంలో ఉండేట్టు వరాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. తందిలుడు భగవంతుని యొక్క జలరూపం పొందాడు కనుక, పుష్కరుడు అనే పేరుతో పిలవబడ్డాడు. అతడు మూడున్నర కోట్ల పుణ్యనదులకి అధిపతి అవడమే కాకుండా జీవరాశులన్నిటినీ పోషించగలిగే శక్తిని కూడా పొందాడు.  పోషయతి అథవా పుష్టాతీతి పుష్కరమ్... ” ”పుష్కరం అంటే పుష్టినిచ్చి పోషించేది అని అర్ధం.
   ఒకసారి బ్రహ్మదేవుడికి సృష్టి చెయ్యడానికి జలం అవసరమయింది. బ్రహ్మ కూడా మహాదేవుణ్ణి గురించి తపస్సు చేశాడు.  పుష్కరుడు బ్రహ్మ కమండలంలో ఉండేట్టు మహాదేవుడు బ్రహ్మకి వరమిచ్చాడు. 
   సమస్త సృష్టి జీవించడానికి అవసరమయిన పుష్కరుణ్ణి బ్రహ్మ తన కమండలంలో బంధించి ఉంచేస్తే ప్రాణులు ఎలా బ్రతుకుతాయి? బృహస్పతి ఏం చెయ్యాలా...అని ఆలోచించాడు. చివరికి బృహస్పతి బ్రహ్మని ప్రార్ధించాడు. బ్రహ్మ పుష్కరుణ్ణి బృహస్పతితో వెళ్ళమన్నాడు. కాని, పుష్కరుడు బ్రహ్మని వదిలి రావడానికి ఇష్టపడలేదు. బృహస్పతి కొత్త  రాశిలోకి ప్రవేశించే సమయంలో మొదటి పన్నెండు రోజులు, నిష్క్రమించే సమయంలో చివరి పన్నెండు రోజులు, మిగిలిన రోజుల్లో మధ్యాహ్న సమయంలో నాలుగు ఘడియలు పుష్కరుడు బృహస్పతితో పాటు నదిలో ఉండేట్లు బ్రహ్మ బృహస్పతికి వరం ఇచ్చాడు. ఆ విధంగా ఏ రాశిలో బృహస్పతి ప్రవేశిస్తాడో ఆ సమయంలో బ్రహ్మతో కలిసి పుష్కరుడు, బృహస్పతి, ముక్కోటి దేవతలు, పితృదేవతలు కూడా అదే నదిలో ఉంటారని .... ఆ సమయంలో ఆ నదిలో స్నానం చెయ్యడం వల్ల సమస్త పాపాలు నశిస్తాయి పురాణాలు చెప్తున్నాయి.
   అసలు గంగ లేక జలం భూలోకానికి ఎలా చేరిందంటే...గంగ విష్ణుపదం నుంచి కోట్లకొలదీ భవనాలతో ఉన్న దేవలోకం మీదుగా మేరుశిఖరం పైన ఉన్న బ్రహ్మనగరం చేరింది. అక్కడి నుంచి సీత, అలకనంద, చక్షువు, భద్ర అనే పేర్లతో నాలుగు పాయలుగా నాలుగు దిక్కులకీ ప్రవహిస్తూ నదీనదాలకి గమ్యమైన సముద్రంలో చేరుతోంది. సీత అనే పాయ బ్రహ్మనగరం నుంచి కేసరచలానికి సంబంధించిన ఎత్తైన శిఖరం మీద ప్రవహిస్తూ గంధమాదన పర్వతం మీదకి తరువాత భద్రాశ్వ దేశంలో ప్రవహిస్తూ తూర్పువైపు ఉన్న సముద్రాన్ని చేరుతుంది.
     చక్షువు అనే పాయ మాల్యవంత శిఖరం మీదకి, అక్కడనుంచి కేతుమాల ఖండంలో ప్రవహిస్తూ పడమటి దిక్కులో ఉన్న సముద్రాన్ని చేరుతుంది. భద్ర అనే పాయ మేరు పర్వత శిఖరానికి ఉత్తర దిక్కులో ప్రవహిస్తూ ఎన్నో పర్వతాలు దాటి శృంగవంత పర్వతం మీదకి దూకి అక్కడి నుంచి ఉత్తర కురు దేశం మీదుగా ఉత్తర దిశలో ఉన్న సముద్రంలో కలుస్తుంది. అలకనంద అనే పాయ బ్రహ్మపురానికి దక్షిణం వైపు ప్రవహిస్తూ అనేక శిఖరాలు దాటి హేమకూట పర్వతం చేరుతుంది. అక్కడనుంచి అమితమైన వేగంతో హిమాలయ శిఖరాల్లో ప్రవహిస్తూ భారతవర్షంలోకి ప్రవేశించి అక్కడనుంచి దక్షిణ దిక్కుగా  ప్రవహిస్తూ దక్షిణ సముద్రంలో కలుస్తోంది.  అలకనందా నదిలో స్నానం చేస్తే అశ్వమేధ, రాజసూయ యాగాలు చెయ్యడం వల్ల పొందే ఫలితాన్ని సామాన్యులు కూడా పొందగలరని యోగులు చెప్తారు.
   మేరు పర్వతం నుంచి బయలుదేరిన వందల సంఖ్యలో నదీ నదాలు అనేక దేశాల్లో ప్రవహిస్తున్నాయి. తొమ్మిది ఖండాల్లోనూ భారతదేశం ఒక్కటే కర్మభూమి. మిగిలిన ఎనిమిది ఖండాలవాళ్ళు స్వర్గాన్ని చేరిన తరువాత స్వర్గభోగాలు అనుభవించి మిగిలిన పుణ్యఫలాన్ని అనుభవించడానికి ఈ స్థానాలకి చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే  ఈ స్థానాల్ని భూలోకస్వర్గాలుఅని పిలుస్తారు. భారతదేశంలో వేల సంఖ్యలో పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాలనుంచి జాలువారే నదీనదాలు కూడా అనేకం ఉన్నాయి. చంద్రవశ, తామ్రపర్ణి, అవటోదా, కృతమాలా, వైహాయసి, కావేరి, వేణి, పయస్వినీ, శర్కరావర్త, తుంగభద్ర, కృష్న, వేణ్యా, భీమరథి, గోదావరి, నిర్వింధ్య, పయోష్ణి, తాపి, రేవ, సురస, నర్మద, చర్మణ్వతి, సింధూ, అంధము, శోణము  మొదలైన నదాలు, మహానది, వేదస్మృతి, ఋషికుల్య, త్రిసామ, కౌశికి, మందాకిని, యమున, సరస్వతి, దృషద్వతి, గోమతి, సరయు, రోధస్వతి, సప్తవతి, సుషోమ, శతద్రువు, చంద్రభాగ, మరుద్వృధ, వితస్త, అసిక్ని, విశ్వ అనే ముఖ్య నదులు కూడా మన దేశంలో ప్రవహిస్తున్నాయి.
Godavariభారతదేశంలో గంగ, సింధు తరువాత అతి పెద్ద నది ఈ పవిత్రమైన గోదావరి. మహారాష్టల్రో నాసికా త్రయంబకం అనే ప్రాంతంలో పుట్టి దక్షిణ భారతదేశం మీదుగా ప్రవహించి అదిలాబాదు, కరీంనగరు, వరంగల్లు, ఖమ్మం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్ని పాడిపంటలతో విలసిల్లేల్లా చేసి, చివరికి బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ గోదావరి ప్రాంతంలో వెలసినన్ని పుణ్యక్షేత్రాలు మరెక్కడా లేవనే చెప్పవచ్చు.
   పరవళ్ళు తొక్కుతూ అనేక ప్రాంతాల్ని పునీతం చేస్తూ వచ్చిన గోదావరి ధవిళేశ్వరం వద్ద ఏడు పాయలుగా చీలి ప్రవహిస్తుంది. ఈ ఏడు పాయలు సప్త ఋషుల పేర్లతో పిలవబడుతున్నాయి. అందులో వశిష్ఠ, వైనతేయ, గౌతమీ నదులు మాత్రం ప్రవాహనదులుగానూ, మిగిలినవి అంతర్వా హినులుగా ఉన్నాయి.  గోదావరి గొప్ప పౌరాణిక, ఐతిహాసిక చరిత్ర కలిగింది. ఈ నది ఒడ్డున వెలసిన దివ్యక్షేత్రాల్లో అత్యంత ప్రధానమైనవి నాసిక్‌, త్రయంబకేశ్వర్‌, బాసర, కోటిలింగాలు, కాళేశ్వరం, భద్రాచలం, కొవ్వూరు, రాజమండ్రి, మందపల్లి, కోటిపల్లి, ముక్తేశ్వరం, అంతర్వేది మొదలైనవి. ఇక ఈ గోదావరిలో కలిసే నదులు, పెన్‌ గంగ, వైనగంగ, వార్ధా, మంజీరా, ఇంద్రావతి, బిందుసార, శబరి, ప్రవర, పూర్ణ, ప్రాణహిత, సీలేరు, కిన్నెరసాని, మానేరు.
   రేవా తీరే తప: కుర్యాత్ మరణం జాహ్నవీ తటే! దానందద్యాత్కురు క్షేత్రే గౌతమ్యాంత్రితయం వరం!! రేవా తీరంలో తపస్సు చేస్తే ముక్తి కలుగుతుంది..గంగా తీరంలో మరణిస్తే మోక్షం కలుగుతుంది.. కురుక్షేత్రంలో దానం చేస్తే ముక్తి, మోక్షం ప్రాప్తిస్తాయి.. గోదావరి నదిలో పుష్కర స్నానం చేస్తే ఈ మూడు పుణ్యాలు ఒకేసారి లభిస్తాయి. గోఅంటే గోవు లేక జలము...దాఅంటే ఇచ్చేది...వర అంటే శ్రేష్టమైంది అని అర్ధం. గోదావరి అంటే శ్రేష్ఠమైన జలమునిచ్చేది అని అర్ధం. ఉత్తర భారతదేశంలో ఉన్న భగీరథి భగీరథుడి తపస్సు వల్ల భూమ్మీదకి  అవతరించింది. అదే విధంగా దక్షిణ బారతదేశంలో ఉన్నపవిత్ర గోదావరి గౌతమ మహర్షి తపో మహిమ వల్ల భూమ్మీదకి ప్రవహించింది.
    పుష్కర సమయంలో నదీ జలాలు గొప్ప శక్తివంతంగాను, అధికమైన తేజస్సుని కలిగి ఉంటాయి. ముక్కోటి దేవతలు, పితృదేవతలు, బ్రహ్మతో వచ్చిన పుష్కరుడు నదిలో  కొలువై ఉంటారు కనుక, ఆ నదీ జలాల్లో స్నానం చేస్తే దేవతల ఆశీస్సులు... పిండప్రదానం చెస్తే పితృదేవతల ఆశీస్సులు ఉంటాయని పెద్దలు చెప్తారు. దశదానాలు చెయ్యడం వల్ల గొప్ప ఫలితం కలుగుతుంది. పుష్కరాల సమయంలో గోవు, భూమి, బంగారం, వెండి, బట్టలు, నువ్వులు, నెయ్యి, ధాన్యము, బెల్లం, ఉప్పు మొదలైన పది దానాలు చెయ్యడం వల్ల కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది.
    ఏ రొజు దేన్ని దానంగా ఇస్తే మంచిదో పెద్దలు మనకి వివరించినా అందరూ పన్నెండు రోజులూ నది దగ్గరే ఉండిపోతే కలిగే రద్దీని కూడాదృష్టిలో పెట్టుకోవాలి. పుష్కర సమయంలో ఆ నది ప్రవహించే ప్రదేశాలన్నీ పవిత్రమయినవే కనుక దానాలు ఎక్కడ ఎప్పుడు చేసుకున్నా అదే ఫలితాన్ని పొందవచ్చు. పవిత్ర గోదావరీ నదిలో పుష్కర స్నానం చేసి ఆ యా ప్రదేశాల్లో ఉన్న పవిత్ర దేవాలయాలు కూడా దర్శించుకుని దేవతల ఆశీస్సులు పొంది  అందరూ క్షేమంగా, తృప్తిగా, సంతోషంగా తిరిగి రావాలని ఆశిస్తూ....    

                                                                                        

No comments:

Post a Comment