About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

అసలు...నేనెవరో తెలుసా మీకు?

నేనెవరో! అసలు తెలుసా మీకు? (ప్రపంచ కవి సమ్మేళనం అంతర్వేది 2015)
ఉదయించే సూర్యుడి నుంచి దూసుకొచ్చిన కిరణాలు
గలగలా పారే గోదావరి అలలమీద ఉయ్యాలలూగుతూ...
అటుఇటు కదులుతూ... వెండితీగల్లా మెరుస్తూ సంభ్రమం కలిగిస్తుంటే...
వాటివైపే చూస్తున్న కవి కళ్ళల్లో మెరిసే కాంతుల్లో ఉంటాను నేను!
జంట ఎద్దులు,  కొమ్ములకి కట్టిన గంటల మోతతో లయబద్ధంగా నడిచి
నాగలితో దున్నిన పంటపొలం మొదట నల్లగా నిగనిగలాడుతూ
ఆనక విత్తనాలు మొలకెత్తి తివాచీ పరిచినట్టు పచ్చదనం పరుచుకున్న
పైరుమీద నుంచి వచ్చే గాలికి శరీరం పులకరించి, మనస్సు పరవశిస్తుంటే...
అరమోడ్పు కళ్ళతో చూస్తున్న కవి మనస్సులో ఉంటాను నేను!
తెల్లవారిందని కోడి లేచి చెప్పగానే...మగువలంతా నిద్ర లేచి ముంగిట ముగ్గులు దిద్ది
దైవసేవకి సమయమని గుడిగంటలు చెప్పగానే...
రంగు రంగుల దుస్తులతో...తడి ఆరని కురులతో..నుదిటికి అద్దిన సిందూరం..
ఎర్రటి కాంతులు చిందించి ..అప్పుడే ఉదయించిన సూర్యకాంతిని మరిపిస్తూ,
గుడి చుట్టూ తిరుగుతూ..కోరికల చిట్టా చదువుతూ..భక్తి పారవశ్యంలో మునిగుంటే..
అయోమయంగా చూస్తున్న కవి భావావేశంలోఉంటాను నేను!
చాకిరేవు బండ దగ్గర... బట్టల గుట్టలు పెట్టి ..చీర మడిచి పైకి కట్టి,
నడుము చుట్టూ కొంగు తిప్పి ..వంగీ లేచీ ఉతుకుతుంటే..లయబద్ధంగా వినిపించే
చప్పుళ్ళకి.. గుండె చప్పుడు లయతప్పి.. కళ్ళతో చూస్తున్నఆ చిత్రం
మనస్సు లోతుల్లోకి చొచ్చుకుని..దృశ్య రూపంగా మారి గిలిగింతలు పెడుతుంటే...
ఆసక్తిగా చూస్తున్న కవి హృదయ పీఠం మీద చిత్రమై ఉంటాను నేను!
బడిగంట వినగానే ఉరకలేస్తూ పరుగుతీస్తూ...చదువు భారం వీపు మీద..
మనసంతా ఆట్లమీద...రాబోయే కాలాన్ని ఊహించలేని పసి మనసులు
గేటు తీసి వెళ్ళగానే..గేటు మూసి బంధించి...అన్ని భాషల్లో చదివించి..అనందాన్ని హరించి
శక్తి మొత్తం క్షీణించి ..వాడిపోయిన ముఖాలతో గేటు తోసి వస్తుంటే..
కరుణతో చుస్తున్న కవి మనస్సులో విద్యార్థినై ఉంటాను నేను!
బడి పక్కన కల్లుపాక..గుడి పక్కన కల్లుపాక..చెప్పి చెప్పి పొల్లుపోక..
కూలినాలి చేసుకొచ్చి సందెవేళ ఊరి చివరి కల్లుపాకకు చేరుతుంటే...
ఎవరికి మొర పెట్టుకోవాలో.. ముడుపు ఎవరికి కట్టుకోవాలో..
తెలియని వనితలు వెతలెన్నో అనుభవిస్తూ... సంసారం నడపలేక..
అమ్మ మనస్సు పగిలిపోయి...కన్నీళ్ళూ ఇంకిపోయి...దీనంగా గడుపుతుంటే...
అర్ధం చేసుకున్న కవి కన్నీళ్ళ పొరల్లో ఉంటాను నేను!
ఆనందంలోనూ నేనే..బాధలోనూ నేనే.. కథలో- కావ్యంలో, పద్యంలో-గద్యంలో,
మనుషుల్లో-మృగాల్లో, పక్షుల్లో-ప్రకృతిలో,ఆకాశంలో, నీటిలో భూమి మీద ఎక్కడైనా
అక్కడ ఇక్కడ అని లేక ..స్పందించే హృదయానికి విశ్వమంతా కనిపిస్తాను నేను
నేనున్న చోట కవి ఉంటాడు...కవి ఉన్నంతకాలం నేనుంటాను
తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పుణ్యప్రదేశం అంతర్వేదికి
నృసింహస్వామి పాదాలమీద పరిమళ భరిత పుష్పాన్నై...
ప్రపంచ కవి సమ్మేళనానికి అనేక రూపాలతో వచ్చాను నేను...
స్వామి ఆశీస్సులతో ...ఇప్పుడు ప్రపంచామంతా నేనే ఉంటాను!!
నేనెవరో... !  అసలు తెలుసా మీకు...?
కవి హృదయంలో ఉండే కవితా కన్యను నేనే!





No comments:

Post a Comment