About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

పవిత్ర కృష్ణాపుష్కర క్షేత్రం విజయవాడ

శ్రీ కనకదుర్గ ప్రభ
కృష్ణానదీ పుష్కరాలు
పవిత్ర కృష్ణాపుష్కర క్షేత్రం విజయవాడ
   పుష్కరుడి చరిత్ర
  దక్షిణ భారతదేశంలో ఉన్న పెద్ద నదుల్లో గోదావరి నది తరువాత కృష్ణానది పెద్ద నది అని చెప్పబడుతోంది. పడమటి కనుమల్లో బ్రహ్మగిరి, వేదగిరి అనే శిఖరాలు ఉన్నాయి. ఒకసారి బ్రహ్మగిరిమీద కూర్చుని బ్రహ్మ నారాయణుడి కోసం తపస్సు చేశాడు. నారయణుడు బ్రహ్మకి శ్వేతాశ్వత్థవృక్ష రూపంలో దర్శనమిచ్చాడు.
   బ్రహ్మ మళ్ళీ శివుడి కోసం తపస్సు చేశాడు. ఈశ్వరుడు బ్రహ్మకి అమలక వృక్ష రూపంలో దర్శనమిచ్చాడు. శ్వేతాశ్వత్థవృక్షము (నారయణుడు) ’కృష్ణ’గాను, అమలక వృక్షము (ఈశ్వరుడు) ’వేణి’గాను ఒకదానితో ఒకటి పెనవేసుకుని కృష్ణవేణీ నదిగా అవతరించాయి.
   దేవతలకి గురువు, అందరికీ శుభాన్ని కలగచేసే బృహస్పతి ఏ రాశిలో సంచరిస్తాడో ఆ నదుల్లోకి పుష్కరుడు కూడా ప్రవేశిస్తాడన్నమాట! దేవగురువు మేషరాశిలో ఉన్నప్పుడు గంగానదికి, వృషభరాశిలో నర్మదానదికి, మిథునరాశిలో సరస్వతి నదికి, సింహరాశిలో గోదావరినదికి, కన్యారాశిలో కృష్ణానదికి, తులారాశిలో కావేరినదికి, వృశ్చికరాశిలో భీమనదికి, ధనూరాశిలో పుష్కరనదికి, మకరరాశిలో తుంగభద్రానదికి, కుంభరాశిలో సింధూనదికి, మీనరాశిలో ప్రణీతానదికి పుష్కరాలు జరుగుతాయి. మన్మథనామ సంవత్సరం ఆగష్టు 12వ తేదీన ఉదయం బృహస్పతి కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు కనుక అప్పటి నుంచి కృష్ణాపుష్కరాలు ప్రారంభం అవుతాయి.
      తుందిలుడు అనే బ్రాహ్మణుడు మహాదేవుణ్ణి గురించి ఘోర తపస్సు చేశాడు. మహాదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. పూర్తిగా మహాదేవుడిలో ఉండిపోవాలని కోరుకున్నాడు తుందిలుడు. అతడికి అష్టమూర్తుల్లో (పంచభూతాలు,మనస్సు, బుద్ధి, అహంకారం) ఒకటైన జలరూపంలో ఉండేట్టు వరాన్ని ప్రసాదించాడు మహాదేవుడు. తుందిలుడు భగవంతుని యొక్క జలరూపం పొందాడు కనుక, పుష్కరుడు అనే పేరుతో పిలవబడ్డాడు. అతడు మూడున్నర కోట్ల పుణ్యనదులకి అధిపతి అవడమే కాకుండా జీవరాశులన్నిటినీ పోషించగలిగే శక్తిని కూడా పొందాడు.  పోషయతి అథవా పుష్టాతీతి పుష్కరమ్... పుష్కరం అంటే పుష్టినిచ్చి పోషించేది అని అర్ధం.
   బ్రహ్మ సృష్టికార్యం పూర్తయ్యాక ప్రాణుల్ని బ్రతికించే ధర్మం నెరవేర్చడం బృహస్పతి పని. అందుకోసం ప్రాణుల జీవించడానికి అవసరమైన జలం కావాలని బ్రహ్మదేవుణ్ణి ప్రార్ధించాడు. బృహస్పతి అడగ్గానే బ్రహ్మదేవుడు పుష్కరుణ్ణి బృహస్పతి దగ్గరికి వెళ్లమని చెప్పాడు. కానీ పుష్కరుడు బ్రహ్మదేవుణ్ణి వదలి వెళ్ళలేనని చెప్పాడు.
   అప్పుడు బృహస్పతి, బ్రహ్మ, పుష్కరులు కలసి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం గ్రహరూపంలో ఉన్న బృహస్పతి మేషం మొదలు పన్నెండు రాశుల్లోకి ప్రవేశించే సమయంలో మొదటి పన్నెండు రోజులు...సంవత్సరానికి చివర పన్నెండు రోజులు, మిగిలిన కాలంలో సంవత్సరమంతా మధ్యాహ్న సమయంలో...అంటే, మధ్యాహ్నం రెండు మూహూర్తాల సమయం పుష్కరుడు బృహస్పతితో ఉండాలి. ఆ సమయంలో బృహస్పతి అధిపతిగా ఉన్న నదికి పుష్కరుడితో సహా దేవలందరూ వస్తారు. కనుక, పుష్కరకాలంలో నదీ స్నానం పుణ్యప్రదమని పురాణాలు చెప్తున్నాయి.
  ముఖ్యమైన తీర్థాలు:
 కృష్ణానదికి పధ్నాలుగు ఉపనదులు. నూట ముప్ఫై ఎనిమిది తీర్థాలు ఉన్నాయి. ఇందులో అతి ముఖ్యమైనవి... సప్త ఋషి తీర్థము, తుంగభద్ర సంగమ క్షేత్రము, లింగాల ఘట్టము, ముక్తి తీర్థము, సాలగ్రామ నారసింహ తీర్థము వేదాద్రి, అమరేశ్వర తీర్థము అమరావతి, విష్ణుతీర్థము వైకుంఠపురము, దుర్గాతీర్థము విజయవాడ, సీతహనుమ తీర్థము సీతానగరము, సుదర్శన నారసింహ తీర్థము మంగళగిరి, కోటిపల్లి తీర్థము, శుక్ల తీర్థము వెల్లటూరు, వేణీ సాగర సంగమ క్షేత్రము వ్యాఘ్రేశ్వరము, కుమార తీర్థము మోపిదేవి, మహాతీర్థము కదళీపురము, గోపాల తీర్థము, కృష్ణాసాగర సంగమ తీర్థము మొదలైనవి అతి ముఖ్యమైనవి.
    దేవతలు కూడా ఈ నదిలో ప్రతి రోజూ స్నానం చెయ్యడం కోసం మానవ జన్మ కావాలని కోరుకుంటారట. ఈ నది పుట్టిన ప్రదేశం నుంచి శ్రీశైలం వరకు ఉన్న ప్రవాహాన్ని పవిత్రమైన గంగానదీ ప్రవాహంతో సమానమని, అక్కడి నుంచి సాగరంలో కలిసే ప్రాంతం వరకు ఉన్న కృష్ణా నదీ జలాలు గంగానదీ జలాలకంటే నూరు రెట్లు అధికంగా ఫలితాన్ని ఇస్తాయని అంటారు.
    కృష్ణానది సాగరంలో కలిసేందుకు ప్రవహించే తీరంలో దానికి రెండు వైపుల ఉండే క్షేత్రాలు ముక్తిని ప్రసాదిస్తాయి కనుక, వాటిని మోక్ష క్షేత్రాలు అంటారు. గంగానది విష్ణుమూర్తి పాదాల నుంచి ఉద్భవించింది. కృష్ణానది విష్ణుమూర్తి దేహం నుంచి ఉద్భవించింది. కృష్ణవేణీనది ప్రవహించే ప్రదేశాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు.
   తల్లి కృష్ణవేణి అభయముద్రతోను  శంఖము, చక్రము, నీలోత్పలాల్ని(నల్ల కలువలు) ధరించే విష్ణురూపమైన వైష్ణవే కాదు. పద్మాలు ధరించిన రెండు భుజాలతో ప్రకాశించే శివరూపిణి కూడా. సాగరంలో కలిసేవి, జడత్వము, చైతన్యము కూడా కలిగి ఉండి, ప్రకృతిమాత యొక్క  వివిధ అంశల స్వరూపాలే ఈ మహానదులు.
   కొత్త జీవితానికి నాంది పలుకుతూ సకల జీవరాశికి భుక్తిని, ముక్తిని ప్రసాదించే దేవీస్వరూపాలు. భూతదయ, జీవకారుణ్యము. అహింస, సత్యము, కలిసిమెలిసి జీవించడము అనే పద్ధతుల్ని విశాల విశ్వంలో ఉన్న ప్రజలందరికీ నేర్పించి ప్రకృతి శక్తి మీద గొప్పదైన భక్తి భావాన్ని పెరిగేట్టు చేస్తున్న మాతృదేవీ స్వరూపాలు.
   అందువల్లే జగత్తుకి శుభాలు కలిగించే శక్తికి సిగపువ్వుగా గంగానదిని, లక్ష్మీనారాయణుడి వక్షస్థలం మీద ఉన్న కౌస్తుభంగా కృష్ణవేణీ నదిని స్తుతిస్తారు. ప్రకృతి శక్తిని, ఆధ్యాత్మిక శక్తిని తమలో విలీనం చేసుకున్న సమైక్య దేవీ స్వరూపాలు ఈ మహానదులు.
     సరైన దిక్కుని అనుసరిస్తూ నదీ ప్రవాహం ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రదేశం పండ్ల చెట్లతోను, పూల తీగలతోను నిండి భగవంతుడు కొలువై ఉంటాడు. నదీతీర ప్రాంతాలన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. కృష్ణవేణీ నది ఆ విధంగా ప్రవహిస్తూ ఉంది కనుకనే ఆ ప్రాంతమంతా జీవకళ ఉట్టిపడుతోంది.
కీలపర్వ్వత వైశిష్ట్యము 
    విజయవాడలో బంగారంతోను, మణులతోను సమానమైన కాంతితో ప్రకాశించే కీలాద్రి అనే పేరుగల పర్వతం మీద వెలిసింది కనకదుర్గమ్మ. ఇంద్రుడు మొదలైన దేవతలు కృష్ణానదిలో స్నానం చేసి కనకదుర్గమ్మని పూజించారని చెప్తారు. జగదంబ అయిన కనకదుర్గమ్మని ఇంద్రుడు మొదలైన దేవతలు పూజించడం వల్ల కీలాద్రి పర్వతం ఇంద్రకీలాద్రి పర్వతం అనే పేరుతో పిలవబడుతోంది.
    కీలుడు గొప్ప దేవీ భక్తుడు. అతడు ప్రార్ధించడం వల్ల జగదంబ అతడి హృదయ కుహరంలో స్వయంభువుగా దుర్గాదేవిగా వెలిసిందని, ఆ జగదంబే కనకదుర్గ అని పిలబడుతోందని చెప్తారు.
   దుర్గమాసురుడు పెట్టే కష్టాలు భరించలేక దేవతలు జగదంబని ప్రార్థించారు. వాళ్ళ ప్రార్ధన విని ఆ రాక్షసుణ్ణి సంహరించి, కీలాద్రి పర్వతం మీద దేవతలతో పూజలందుకుంది.
   పరదేవత దుర్గమాసురుణ్ణి సంహరించి అక్కడే ఉండిపోయిందని ఈశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపంతో తను కూడా అక్కడికే వచ్చి మల్లికార్జునుడు లేక మల్లేశ్వరుడు అనే పేరుతో వెలిశాడని పురాణాలు చెప్తున్నాయి.
   బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఈ జ్యోతిర్లింగాన్ని మల్లి, కదంబ పుష్పాలతో పూజించడం వల్ల మల్లికార్జునుడు, మల్లీశ్వరుడు అని పిలవబడ్డాడు. కీలాద్రి మీద ఉన్న మల్లికార్జునుడు జ్యోతిర్లింగంగా వెలిసాడు కాని, బ్రహ్మ ప్రతిష్టించిన లింగం కాదు.   బ్రహ్మదేవుడు ఈశ్వరుణ్ణి మల్లికలు అర్జున పుష్పాలతో పూజించాడు.
   శ్రీకాకుళంలో ’ఏకరాత్ర ప్రసన్న మల్లికార్జునుడు” అనే పేరుతో ఒక ఈశ్వర లింగం ఉంది. ఈ స్వామిని కూడా మల్లికార్జునస్వామి, మల్లీశ్వరస్వామి లేక మల్లేశ్వరస్వామి అంటారు.
   శ్రీకాకుళంలో ఉన్న ముక్తి తీర్థంలో స్నానం చేసి అగస్త్య మహర్షి మల్లికార్జున స్వామిని దర్శించాడని పురాణాలు చెప్తున్నాయి. విజయవాడ కీలాద్రి మీద ఉన్న దురామల్లేశ్వరుణ్ణి అగస్త్యమహర్షి ప్రతిష్టించలేదు.
   శుక్లతీర్థము వెల్లటూరులో అగస్త్యమహర్షి స్నానం చేసి తన పేరు మీద అగస్త్యేశ్వర లింగాన్ని ప్రతిష్టించాడు. ఆ లింగము అగస్త్యేశ్వర లింగమే కాని, మల్లికార్జునలింగం (దుర్గామల్లేశ్వర లింగం) కాదు. ఈ తీర్థానికి అగస్త్య తీర్థమని కూడా పేరు ఉంది.
   కీలాద్రిమీద వేంచేసి ఉన్న మల్లేశ్వరుడు లేక మల్లికార్జునుడు జ్యోతిర్లింగమే అని, కనకదుర్గమ్మ కూడా స్వయంభువు అని, దేవతలు, మహర్షులు, మానవులు ఎవరూ ప్రతిష్టించలేదని పురాణాలు చెప్తున్నాయి. కీలాద్రి మీద వెలసిన దుర్గాదేవి మహిషాసురుణ్ణి సంహరించి దేవతలు ప్రార్ధించడం వల్ల మహిషాసురమర్దినీ రూపురేఖా విలాసాలతో ప్రసన్న రూపంతో అలరారుతోంది.
క్షేత్రం యొక్క నామాంతరాలు
     అర్జునుడు కీలాద్రి పర్వతం మీద కూర్చుని శివుడి గురించి గొప్ప తపస్సు చేశాడు. ఈశ్వరుడు అర్జునుడికి ప్రత్యక్షమై ’పాశుపతాస్త్రం ఇచ్చాడు. శత్రువుల్ని ఓడించి విజయుడు విజయాన్ని పొందాడు కనుక, ఈ క్షేత్రానికి విజయపురి’ అనే పేరు కలిగింది.
   ఫల్గుణుడు ఈశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొంది దానితో శత్రుసంహారం చేశాడు కనుక దీన్ని ’ఫల్గుణ క్షేత్రం’గా కూడా పిలుస్తారు. అన్నీ కలిసి విజయవాడలో ఉన్న కీలాద్రి పర్వతం ’ఇంద్రకీలాద్రి” పర్వతంగా పురాణాల్లో చెప్పబడింది.
  కీల పర్వతము కనకదుర్గాదేవిని స్తుతించి ఆమె తనయందే నివాసముండేలా వరాన్ని పొందింది. దేవి కీలపర్వతాన్ని స్వర్ణమయంగా ఉండేటట్టు అనుగ్రహించి కీలాద్రి మీద విరాజమానమైంది. ఆనాటి నుంచి కీలాద్రికి ’కనకాచలము’ అనే పేరు ఏర్పడింది. కృష్ణమ్మ తీర ప్రాంతమైన కనకాచలం మీద స్వర్ణమయ కనకదుర్గ వెలిసిన కారణంగా కనకపురి’ అని పిలవబడింది.
   కనకదుర్గాదేవి శుంభ నిశుంభుల్నిపరిమార్చడం వల్ల ’జయపురి’ లేక విజయవాడ’ అని పిలవబడుతోంది. ఓషధుల్ని, బీజాల్ని కృష్ణానది తన ప్రవాహంతో తీసుకుని పోతూ అడ్డంగా ఉన్న కీలాద్రి దగ్గర ఆగిపోయింది. అలా ప్రవాహంతో కొట్టుకుపోతూ వచ్చిన బీజాలన్నీ మొలకెత్తి ఆ ప్రదేశమంతా సస్యశ్యామలంగా మారడం వల్ల ’బీజపూరి’ లేక ’బెజవాడ’ అని పిలవబడింది.
     కీలాద్రి పర్వతము మంగళగిరి నృసింహ పర్వతం వరకు విస్తరించింది. కృష్ణవేణి సహ్యాద్రి పడమటి కనుమల నుంచి ప్రవహించి సాగరంలో కలవాలన్న కోరికతో పరుగులు పెడుతూ వచ్చింది. మధ్య మార్గంలో కృష్ణమ్మకి కీలాద్రి అడ్డువచ్చింది.
   సాగరంలో కలిసే భాగ్యాన్ని ప్రసాదించమని కృష్ణమ్మ కీలాద్రిని ప్రార్ధించింది. అందుకు కీలాద్రి అంగీకరించలేదు. దేవతలు కృష్ణమ్మకి దారి ఇమ్మని కీలాద్రిని ఆజ్ఞాపించారు. అందువల్ల ఒక సొరంగమార్గం ఏర్పడింది.
   ఆ సొరంగం నుంచి హుంకారం చేస్తూ కృష్ణమ్మ బయలుదేరింది. కృష్ణమ్మ చేసిన హుంకార శబ్దానికి కీలాద్రి పర్వతం కంపించి బ్రద్దలైంది. ఆ విరిగిన పర్వత భాగం రెండు కిలోమీటర్ల దూరం వరకు ప్రవాహంలో కొట్టుకుని పోయి యనమలకుదురు అనే గ్రామంలో తేలింది. ఆ కొండకే (తేలిన కొండ) ’తేలుకొండ’ అని పేరు.
   కీల పర్వతం నుంచి తేలుకొండ వరకు గల క్షేత్రాన్న”ఫల్గుణ తీర్థం’ అంటారు. దీనికే దుర్గాతీర్థము, శివ త్రిశూల తీర్థము, శంఖ తీర్థము, ఇంద్ర తీర్థము, ఋషి తీర్థము అని కూడా పేర్లు.
   కృష్ణవేణీ నదికి సొరంగమార్గాన్ని శ్రీ కనకదుర్గాదేవి ఇవ్వలేదు. తన భర్త సాగరుడితో కలవడానికి మార్గం కావాలని కృష్ణమ్మ కనకదుర్గాదేవిని అడగలేదు. సాగరసంగమం కోసం పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణమ్మకి దారి ఇమ్మని దేవతలే కీలాద్రిని ఆదేశించారు.
నదీ ప్రాంత ప్రాముఖ్యత
    నదీ తీర భూమిని ’భద్రక’ అంటారని ఆగమాల్లో చెప్పారు. సుపద్మ, భద్రక, పూర్ణ, ధూమ్ర అని భూమి నాలుగు విధాలు. వీటిలో భద్రకఅని చెప్పబడే ప్రదేశం దేవాలయాలకి ప్రసిద్ధికెక్కింది. 
   కృష్ణవేణీ తీర ప్రాంతం సాగర సంగమ ప్రాంత పవిత్ర క్షేత్రం. ఇది ’భద్రక’ అనబడే పవిత్ర భూమి. దీన్ని సిద్ధస్థానమని కూడా అంటారు. కొండల మీద, నదీతీరంలోను, అరణ్యంలో ఉన్న భూమి దేవతలు నివసించేందుకు అనువైన ప్రదేశం.
   తూర్పు వాహినిగా ప్రవహించే కృష్ణా నది జీవనది. గంగ, గోదావరి నదుల్లా కృష్ణానది కూడా మహానది. కృష్ణవేణీ నదీతీర సాగర సంగమ పుణ్య ప్రాంతమే విజయవాడ.
   కీలాద్రి గొప్ప పేరుకలిగిన పెద్ద పర్వతం. కీలాద్రి మొత్తం అరణ్యాలతో నిండి ఉన్న ప్రాంతం. కనుకనే విజయవాడ ’భద్రక’ అని పిలవబడే గొప్ప పుణ్యభూమి. అన్ని రకాలైన సంప్రదాయాలకి నెలవైన సిద్ధస్థానం.
   ఇటువంటి పవిత్ర ప్రాంతమైన కీలాద్రి మీద శ్రీ దుర్గామల్లేశ్వరులు జ్యోతిర్మయి మూర్తులుగా స్వయంభువులుగా వెలిసి ఉండడం, కీలాద్రి మీద పశ్చిమ భాగంలో సహజసిద్ధంగా ఏర్పడిన దుర్గాకుండం ఉండడం శ్రీ కనకదుర్గామల్లేశ్వరుల మహత్యం ద్విగుణీకృతం అవడానికి కారణమయ్యాయి.
   దుర్గమాసురుడి  సంహారం జరగడం వల్ల, అర్జునుడు పాశుపతాన్ని పొందడం వల్ల, ’విజయ’ అనే పేరు దుర్గాదేవి సహస్ర నామాల్లో ఉండడం వల్ల వీటిలో దేనివల్ల జరిగినా కనకదుర్గామల్లేశ్వరులు వెలిసిన కృష్ణవేణీ సాగర సంగమ క్షేత్రానికి ’విజయవాడ’ అనే పేరు సార్ధక నామధేయంగా మిగిలిపోయింది.
   పుష్కర కాలంలో ఆడపడుచులు సుమంగళిగా జీవితాంతంగా ఉండాలని కోరుకుంటూ నదీమతల్లికి వాయినాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే విఘ్నాలు దూరమై అన్నీ శుభాలే కలుగుతాయని విశ్వసిస్తారు. చీర, రవికె, గాజులు, పసుపు, కుంకుమ, పుస్తె, మట్టెలను పూజించి నదిలోకి జారవిడుస్తారు. బ్రాహ్మణ జంటలకు, ముత్తెదువలకు వాయినాలను అందజేసి వారి ఆశీస్సులు స్వీకరిస్తారు.
శ్రీ కనకదుర్గా  మల్లేశ్వరుల  అలయ  ప్రాముఖ్యత:  
   ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరిలో దేవికి ఎనిమిది చూపులు అని వర్ణించారు. అవి 1.విశాలా-విశాలమైన కన్నులు కలది, ఉదారమైన దృష్టి కలది, 2. కళ్యాణి- మంగళప్రదమైన చూపు కలది. 3. అయోధ్య - విప్పారిన కనుపాప కలది. 4. ధార-సుందరమైన, చురుకైన చూపు కలది. 5 .మధుర - చంచలము, మధురమైన చూపు కలది. 6. భోగవతి -స్నేహభావము కలిగిన చూపు కలది. 7. అవంతి-ముద్దరాలి చూపు కలది. 8. విజయ-అడ్డముగా కనుపాపలను కొనలకు వంచునది.
   దుర్గాదేవి ఎక్కడెక్కడ ఏ చూపులతో శత్రువులకి క్షోభ కలిగించిందో ఆ చూపుల పేర్లతోనే నగరాలు ఏర్పడ్డాయి. వాటికి ఇప్పటి ఆధునిక పేర్లు... విశాలా-బదరీనాథ్; కళ్యాణి-బొంబాయి, నాసిక్ ల మధ్య కల రైల్వేస్టేషను; అయోధ్య-నేటి అయోధ్య; ధారా-ధార్; మధురా-నేటి మధురా; భోగవతి-అమరావతి; అవంతి-ఉజ్జయిని; విజయ- విజయవాడ.
     దుర్గాదేవి విజయ అనే తన చల్లని చూపుతో కృష్ణవేణీ నదీతీర ప్రాంతాన్ని,కీలాద్రి పర్వత ప్రాంతాన్ని రక్షిస్తూ... శత్రువైన దుర్గమాసురుడు వంటి రాక్షసుల్ని సంహరించి... ఈ  ప్రాంతాన్ని సస్యశ్యామలం చెయ్యడం వల్ల పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది.
   దుర్గాదేవి కుడికన్ను సూర్యుడు, ఎడమ కన్ను చంద్రుడు. శుభప్రదమైన సూర్య చంద్ర కాంతులతో నిండిన చూపే విజయ అని పిలవబడే  ఎనిమిదవ చూపు. విజయవాడ వారణాసి కంటే కూడా గొప్ప ముక్తిక్షేత్రం. కీలాద్రి పర్వతం యొక్క గొప్పతనంలో మరొక గొప్పతనం కూడా ఉంది.
   కృష్ణవేణీ నది నాదపూరితమైన చలనం కలిగిన ప్రవాహం. పంచభూత గుణాల సమ్మేళనం. కీలాద్రి పర్వతం అచలమైన బిందు స్వరూపం. బిందు రూపం పరమశివుడు మల్లికార్జునస్వామి. పర్వతాకారమైన(అచలమైన) మల్లికార్జునస్వామిని అధారంగా చేసుకుని స్వయంభువుగా నాద స్వరూపిణి అయిన దుర్గాదేవి కనకదుర్గగ అవతరించింది.
   ఆ దేవి యొక్క స్థూల, సూక్ష్మ, కారణ దేహంలో గల ప్రకాశంలో విలీనమైన మల్లికార్జునస్వామి విమర్శాంస ప్రకాశ రూపంతో బింబితుడవుతున్నాడు. పరమేశ్వరితో పరమేశ్వరుడు కూడినపుడు కదలలేడు. అందువల్లనే మల్లేశ్వరుడు పర్వత రూపం ధరించాడు. పర్వత రూపంలో ఉన్న మల్లేశ్వరుడి గుండె గుహలో అద్భుత చింతమణీ రత్న శిలాగృహంలో మల్లేశ్వరుడు అనే రత్నసహిత సదాశివుడి పర్యంకం మీద బైందవాసనగా శ్రీ కనకదుర్గాదేవి వెలిసింది.
   కీలాద్రి మీద అర్ధనారీశ్వర స్వరూపంగా వెలిసిన కనకదుర్గాదేవి కళ్యాణ కనకదుర్గ. జలదుర్గ, పర్వతదుర్గ, స్థలదుర్గ సమిష్ఠి రూపమే శ్రీ కనకదుర్గ. వనదుర్గ రూపమై విజయవాడని ఉద్ధరించిన మహావరప్రదాయిని. శ్రీ కనకదుర్గాదేవి భక్తుల మీద ఉన్న వాత్సల్యంతో ఆంధ్రదేశానికి విజయవాడ అనే పుణ్య క్షేత్రాన్ని అమూల్యమైన కానుకగా ప్రసాదించింది.
  పవిత్ర పుష్కర క్షేత్రమైన విజయవాడలో పవిత్ర కృష్ణానదిలో పుష్కర స్నానం చేసి కీలాద్రి మీద వెలిసిన శ్రీకనకదుర్గామల్లేశ్వరుల్ని దర్శించి వారి ఆశీస్సులతో అనేక సౌభాగ్యాలు పొందాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని
కోరుకుంటూ...


No comments:

Post a Comment