About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

నిత్య సంఘర్షణ

                                                                                     
నిత్య సంఘర్షణ
   “ పాపా ! నీలూ! ఎక్కడున్నావమ్మా! వచ్చి పాలు తాగు. నా తల్లి కదూ. నీ చిట్టి బొజ్జలో ఆకలేస్తుంది. వచ్చెయ్యాలి త్వరగా! అమ్మ పనిలో ఉంది కదా...నువ్వే వచ్చి తాగెయ్యి తల్లీ ! పిలుస్తోంది నీలూని వాసవి. ఎన్నిసార్లు పిలిచినా నీలు పలకలేదు. వాసవి మనసులో అలజడి. కాళ్ళు, చేతులు వణకడం మొదలు పెట్టాయి. వళ్ళంతా చెమటలు పట్టాయి. కాసేపు తను ఏం చేస్తోందో తెలియని స్థితి. అంతలోనే తేరుకుంది. చేతిలో పని పక్కన పడేసి నీలు గదిలోకి పరుగెత్తింది.
   వాసవి పరుగు చూసి అందరూ భయపడ్డారు. ఏం జరిగిందోనని ఆమె వెంట పడ్డారు. అంతలోనే వాసవి కళ్ళు తిరిగి పడిపోయింది. వాసవి అత్తగారు మమగారు ఆమెను మంచం మీదకు చేర్చి ఒరేయ్! వాసూ! త్వరగా రారా! వాసవి పడిపోయింది! అని అరిచారు. వాసు పరుగెత్తుకుంటూ వచ్చాడు.
   “ఏమయిందమ్మా ! అయ్యో వాసవికి ఏమయింది ? మొహం మీద నీళ్ళు చల్లాడు. కాని, వాసవి తేరుకో లేదు. వాసూ! ఆసుపత్రికి తీసికెడదాం  కారు తియ్యి. వాసు కారు తీశాడు. వాసవిని కార్లోకి చేర్చి ఆసుపత్రికి తీసికెళ్ళారు. డాక్టరు చూసి షాకు లో ఉందని ఏవో మందులు ఇచ్చి అక్కడే ఉంచమన్నారు. ఒక గంట తర్వాత తెలివి వస్తుంది...తేరుకున్నాక జరిగిందేమిటో కనుక్కుందామన్నారు.
   “ అమ్మా ! అసలు ఏమయింది ? ఎందుకిలా తెలివి లేకుండ పడిపోయింది ? అసలు ఇంత బాధ పడేందుకు ఏం జరిగింది..?” అని అడిగాడు తల్లిని.
   ఏమోరా...అదే తెలియట్లేదు. ఈ మధ్య ఎప్పుడూ ఎదో పరధ్యానంలో ఉంటోంది. నీలూని వదిలి ఒక్క క్షణం కూడ ఉండట్లేదు. పని చేసుకున్నంత సేపూ కూడా పాపా! పాపా! అంటూ తన దగ్గరే ఉంచుకుని పని చేసుకుంటోంది. నేనో, మావయ్యగారో చూస్తామే! అంటే వద్దత్తయ్య గారూ ! నా దగ్గరే ఉంటుంది ! అంటోంది. ఆ మాత్రం మేము చూడలేమా ? అంటే...అయ్యో మీరు చూడలేరని కాదు అత్తయ్యా ! చిన్న పిల్ల కదా...నా దగ్గర ఉంటుందిలెండి! అని తీసుకుని వెళ్ళిపోతోంది. అంతా అయోమయంగా ఉందిరా !” అన్నారు వాసు తల్లి కళ్యాణి గారు.
   “ సరే, నువ్వు ఇంటికి వెళ్ళు. నేను ఇక్కడే ఉంటాను. మందులు ఏమయినా కావాలంటే తెచ్చి పెట్టాలిగా ! తను ఆసుపత్రిలో ఉండి తల్లిని ఇంటికి వెళ్ళమన్నాడు వాసు.
   “ అదే మంచిదిరా ! ఇంటి నుంచి వచ్చేప్పుడు గ్యాసయినా కట్టేమో లేదో...అప్పటికి వాసవి వంట పనిలో ఉంది. నీలూ ఏమయిందో ? పక్కింటివాళ్ళకి అప్పగించి వచ్చాము. దాన్ని కూడా పట్టించుకోలేదు. ఇంటికి వెళ్ళి మిగిలిన వంట పూర్తిచేసి నీలూ పని చూసుకుని అవసరమయితే మళ్ళీ వస్తాను. ఇంక ఫరవాలేదు  ఇంటికి తీసుకెళ్ళండి అని అంటే నువ్వు ఆఫీసుకి వెళ్ళిపోవచ్చు ! నేను ఇంటికి బయలు దేరతాను. ఏదయినా అవసరం అయితే నాన్నగారికి ఫోను చెయ్యి ! ” ఇంటికి వెళ్ళి పోయారు కళ్యాణిగారు.
   వాసుకి ఏమీ అర్ధం కాలేదు. వాసవి నీర్సంగా ఉండే మనిషి కాదు. జబ్బు మనిషీ కాదు. ఇంట్లో అందరికీ కావలసినవి అందిస్తూ తిరుగుతూనే ఉంటుంది. నీలూ కూడా విసిగించి ఏడిపించే పిల్ల కాదు. హాయిగా ఆడుకుంటుంది. నాన్నమ్మ తాతయ్య దగ్గర చేరిక ఎక్కువ. నాన్న కూడ దాన్ని తీసుకుని కాసేపు తిప్పి తీసుకు వస్తారు. పక్క ఇంట్లో ఉండేవాళ్ళు కూడా మంచివాళ్ళు. పాప అక్కడ కూడా కాసేపు ఆడుకుని వస్తుంది. దాన్ని వాళ్ళు ముద్దుగానే చూస్తారు. ఇంత ఘర్షణ పడి ఆరోగ్యం పాడుచేసుకోవాల్సిన పరిస్థితులు తనకు తెలిసి ఏమీ లేవు. తనకు తెలియకుండ ఏమయినా జరిగిందేమో తెలియదు. వాసవి తెలివిలోకి వస్తే గాని అసలు విషయం తెలియదు. ఆలోచిస్తూ కూర్చున్నాడు.
   ఇంతలో డాక్టరుగారు పిలిచారు. వాసవికి తెలివి వచ్చింది. పరీక్షించి శారీరకంగా ఏ వ్యాధిలేదన్నారు. కాని, దేని గురించో బాగా ఆలోచిస్తోందన్నారు. అడిగితే ఏమీ లేదని చెప్పింది. కొన్ని మందులు రాసిచ్చారు. అవి తీసుకుని వాసవితో కలిసి ఇంటికి తిరిగి వచ్చేశాడు. దార్లో వాసు అడిగినా నాకు ఏ ఆలోచనలు లేవు అంది గాని, కార్లో కూర్చున్నంత సేపూ ఎప్పుడు ఇల్లు వస్తుందా అని
ఎదురు చూస్తూనే ఉంది.
                                                                    
                                                                      *******************
 
    కారు దిగి వాసవి లోపలికి వెళ్ళింది. అత్తగారు నీలూని ఎత్తుకుని ఎదురు వచ్చారు. ఏమయిందమ్మా ! కళ్ళు తిరిగాయా..? కాసేపు కూర్చో... అంత పని చెయ్యకే నేను కూడా సాయం చేస్తాను అంటే వినవు. మొత్తం నెత్తిన వేసుకుని చేస్తావు. కాఫీ తెస్తాను ఉండు. పొద్దున్న కూడ ఏమీ తినలేదు!” అంటూ లోపలికి వెళ్ళారు కళ్యాణి గారు.
   “ అత్తయ్యా ! నీలూ బాగానే ఉందా...అందరూ దాన్ని వదిలేసి వెళ్ళిపోయాం. పాపా ! నా పాపా ! నాన్నా ! ఎలా ఉన్నావురా ? ఈ అమ్మ నిన్ను వదిలి ఎప్పుడూ ఎక్కడికీ వెళ్ళదమ్మా ! క్షమించమ్మా! అత్తయ్యా ! ఒకవేళ నాకు మళ్ళీ ఏదయినా జరిగినా పాపని నాతోనే ఉంచండి ! “ అంటూ నీలూని గట్టిగా గుండెలకి హత్తుకుని ఆయాస పడిపోతోంది వాసవి.
   “ ఏమిటమ్మా అది ? ఇంట్లో ఇంతమంది ఉన్నాం కదా...దాన్ని ఎందుకు వదిలేస్తాం చెప్పు ? అపురూపంగా పుట్టిన ఆడపిల్ల. మన ఇంటి మహాలక్ష్మి. దాన్ని అందరం బాగానే చూసుకుంటున్నాం. అయినా నువ్వు కూడా ఆరోగ్యవంతురాలివి, చదువుకున్న దానివి. నువ్వు ఆలోచిస్తున్నది ఏమిటో నాకు అర్ధం కావట్లేదు. పిచ్చి ఆలోచనలు మానేసి హాయిగా పిల్లని ఆడించు. ఇదిగో కాఫీ తాగు. జాగ్రత్త ! కాఫీ పిల్ల మీద పడుతుంది. “ కాస్త ప్రేమగాను, కాస్త మందలింపుగాను చెప్పారు కళ్యాణిగారు.
   వాసు స్నానం చేసి వచ్చి వాసవి దగ్గర కూర్చుని కాసేపు కబుర్లు చెప్పి ఆఫీసుకి బయలుదేరాడు. “అమ్మా వాసవీ ! బజారు వెడుతున్నాను. నీకు, పాపకీ ఏమయినా తెమ్మంటావా..? “ అడిగారు వాసవి మామగారు రాఘవయ్యగారు ప్రేమగా.
 “ఏమీ వద్దు మామయ్యగారూ ! “ అంది వాసవి. నీలూ తల నిమిరి వెళ్ళిపోయారు రాఘవయ్యగారు. నీలూని కంగారుగా దగ్గరగా తీసుకుంటూ భయంగా మామగారి వైపు చూసింది. అప్పుడే లోపల్నుంచి వచ్చిన కళ్యాణమ్మగారికి ఆ చూపుకి అర్ధం ఏమిటో తెలియ లేదు. రాఘవయ్యగారు మాత్రం అదేమీ పట్టించుకోకుండ వెళ్ళిపోయారు.
   వాసవి అనారోగ్యం వల్ల వంట పని ఆగిపోయింది. కొడుక్కి మాత్రమే చేసి పెట్టి పంపించేశారు. ఇంక ఆ పని పూర్తిచెయ్యాలి...లేకపోతే పసిపిల్లకి ఆలస్యమయిపోతుంది అనుకుంటూ వంట గదిలోకి వెళ్ళిపోయారు. అంతటితో  కళ్యాణమ్మగారు కూడా వాసవి ప్రవర్తన విషయం మర్చిపోయారు.
   నీలు ఆడుకుంటూ ఉంది. వాసవి ఎటూ కదలకుండా ఆ పిల్లనే అంటుకుని కూర్చుంది. “ వాసవీ ! వచ్చి చంటిదానికి కొంచెం అన్నం తినిపించు. అది పడుక్కుంటే నువ్వు కూడా తిని మందులు వేసుకుందువుగాని! “ వంటింట్లోంచి పిలిచారు కల్యాణిగారు.       “వస్తున్నానత్తయ్యా! “ వాసవి లేచి నీలూని తీసుకుని లోపలికి వెళ్ళింది. నీలుకి అన్నం తినిపించి పడుక్కోబెట్టింది. పాప నిద్రపోయినా కదలకుండ అలోచిస్తూ అక్కడే కూర్చుని ఉంది. వాసవీ ! మామయ్యగారు కూడా భోజనం చేశారు. నువ్వు కూడా రా ! మనిద్దరం కలిసి చేసేద్దాం. ఇక్కడ పని అయిపోతుంది !” పిలిచారు కళ్యాణిగారు గట్టిగా.
   వాసవి వస్తున్నాను అంటుంది కాని, కూర్చున్న చోటు నుండి కదలదు. ఎదురు చూసి ఎంతకీ రాకపోతే కళ్యాణి గారు వచ్చి “ ఏమయిందే నీకు... ఎన్ని సార్లు పిలిచినా కదలవు. పిల్ల దగ్గర మామయ్యగారు ఉంటారులే ! నువ్వు రా ! తిని మందులు వేసుకోవా..? “కోపంగా అన్నారు. ఇంతలో రాఘవయ్యగారు వచ్చి “ వెళ్ళమ్మా ! నేనుంటాలే నీలు దగ్గర. నిద్ర పోతోందిగా ! లేస్తే నిన్ను పిలుస్తాను వద్దువుగాని. వెళ్ళి భోజనం చేసి రా ! సమయానికి తినక పోతే ఆరోగ్యం పాడయి పోతుంది. వెళ్ళు తల్లీ !” అన్నారు.
   “అమ్మో వద్దు మామయ్యగారూ ! పాప దగ్గర మీరు ఉండద్దు. అసలు ఎవరూ ఉండద్దు.  నీలు లేచాక దగ్గర కూర్చోబెట్టుకుని తింటాను. మందులు వేసుకోపోతే నాకేమీ అవదు. నా ఆరోగ్యం బాగానే ఉంది. అనవసరంగా మీరే కంగారు పడుతున్నారు. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి ! “ భయంగా పిల్లని దగ్గరగా తీసుకుంటూ అంది వాసవి.
   రాఘవయ్యగారికి ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు. అక్కడనుండి వెళ్ళిపోయారు. కళ్యాణి గారు భోజనానికి వెళ్ళిపోయారు. తన పనంతా పూర్తి చేసుకుని వచ్చి “ వాసవీ ! పాప దగ్గర నేను ఉంటాను గాని, నువ్వెళ్ళి భోజనం చేసి, పాపకి పాలు కూడా సిద్ధంగా పెట్టుకో. అది నిద్ర లేవగానే పాల కోసం ఏడుస్తుంది ! వెళ్ళు ! ” అన్నారు. ఇంక తప్పదన్నట్టు లేచి వెళ్ళింది వాసవి. మధ్య మధ్యలో వచ్చి పాపని చూసుకుని వెడుతోంది.
                                                                  
                                                       **********************
    
     పాపా ! పెద్ద కేక పెట్టి లేచింది వాసవి. ఆ అరుపుకి నీలు లేచి ఏడుపు అందుకుంది. “పాప నా దగ్గర ఉంది వాసవీ ! ఏమిటా కంగారు. నిద్రలో ఏడుస్తుంటే నా దగ్గర పడుక్కోబెట్టుకున్నాను. ప్రతి నిముషం ఎందుకలా కంగారు పడుతున్నావు ? నెమ్మదిగా అన్నాడు వాసు. వాసవికి కోపం వచ్చింది. నా మనస్సులో ఉన్న సంఘర్షణ మీకేం తెలుస్తుంది. పాపని ఎవరూ ఎత్తుకోవద్దని చెప్పానుగా...ఏడుస్తుంటె నన్ను లేపండి దాన్ని మాత్రం ఎవరూ ఎత్తుకోవద్దు. ఎన్నిసార్లు చెప్పను..? “ వేగంగా లేచి వచ్చి పాపని తీసుకుని వెళ్ళిపోయింది.
   వాసుకి అర్ధం కాలేదు. “ ఏమిటమ్మా ! వాసవికి ఏమయింది. ఎందుకింత ఘర్షణ పడుతోంది. పాప ఆరోగ్యం బాగానే ఉందిగా...దాన్ని ఎత్తుకోడానికి, ఆడించడానికి ఇంతమంది ఉన్నాం కదా...వాళ్ళిద్దరికీ ఏది కావాలంటే అది ఇస్తున్నాం... మరి హాయిగా ప్రశాంతంగా ఉండక ఎందుకు ఇలా భయపడుతూ ఆలోచిస్తూ మానసికంగా నలిగిపోతోంది ? నాకేమీ అర్ధం కావట్లేదు.
   ఏమోరా...పాపని నేను ఎత్తుకుంటే కూడా పదిసార్లు వచ్చి చూసి వెడుతోంది. మీ నాన్నగారు పాపని ఎత్తుకోడానికి వెడితే వణికి పోతోంది. ఆయన్ని అసలు ముట్టుకోనివ్వట్లేదు. ఏమయిందో చెప్పదు. మొన్నటికి మొన్న నువ్వు పాపతో ఆడుకుని బయటకు వెళ్ళాక ఎంత గొడవ చేసిందనుకున్నావు. ఇల్లంతా ఎగిరిపోయేలా ఒకటే కేకలు. ఎవర్నీ ముట్టుకోద్దని చెప్తే వినకుండ నా పాపని అందరూ ఎందుకు ఎత్తుకుంటారు? అని అరిచి గోల చేసింది. వాళ్ళ నాన్నే కదే...బయట వాళ్ళు ఎత్తుకోలేదుగా..? అంటే నా మాట వింటేనా.
   పక్కింటి వాళ్ళు పాపతో ఆడుకునేందుకు వస్తే వాళ్ళమీద కూడా అరిచి పంపించేసింది. దాని బాధ ఏమిటో...దేని గురించి ఆలోచిస్తోందో ...చివరికి ఏమయిపోతుందో తెలియట్లేదు. నిద్రపోతే పాపని ఎవరు తీసుకెళ్ళిపోతారో అనే భయంతో అసలు నిద్రే పోవట్లేదు. ఏం చెయ్యాలో ఏమో ? అంతా అయోమయంగా ఉందిరా !” అన్నారు కళ్యాణమ్మగారు. “ పోనీ ఒక పని చెయ్యరా ! వాసవి స్నేహితురాలు రూప ఉంది కద...ఆమెకి ఫోను చేసి ఒకసారి వచ్చి వెళ్ళమను. ఆ అమ్మాయికి విషయం చెప్తుందేమో. వాళ్ళు మాట్లాడుకుంటే మనకి కూడా విషయం తెలుస్తుంది ! “ అన్నారు కల్యాణమ్మగారు.
   వాసుకి ఈ ఉపాయం నచ్చింది. వాసవికి తెలియకుండ రూపకి ఫోను చేశాడు. మర్నాడు రూప వాసవికి చెప్పకుండ వచ్చేసింది. “ఏమిటే ! చెప్పాపెట్టకుండ ఊడి పడ్డావు ! “ అంటూ స్నేహితురాల్నిపలకరించింది వాసవి. ఇద్దరూ కబుర్లల్లో పడ్డారు. వాసవీ ! ఏమిటంత నీరసంగా కనిపిస్తున్నావూ? అడిగింది రూప. “ఏం లేదులే...చాలా రోజుల తర్వాత చూశావు కదా..! అందుకే నీకు అలా అనిపిస్తోంది! మాట తప్పించేసింది వాసవి.
   “సరేలేగాని నీలూ ఏది? దాన్ని చూసి చాలా రోజులయింది. ఎంత పొడుగయిందో ఏమో...దానికోసం చాక్లెట్లు తెచ్చాను పిలు! “అంది రూప. “అది లోపల ఉంది వెడదాం రా ! “ అంది వాసవి. ఇద్దరూ పడక గదిలోకి వెళ్ళారు. అక్కడ నీలు ఒక్కత్తే కూర్చుని  బొమ్మలతో ఆడుకుంటోంది. “ అదేమిటే...దీన్ని ఇలా బంధించి వదిలేశావు. ఇంట్లో ఇంత మంది ఉన్నారుగా. మీ మామగారికి ముద్దుల మనవరాలు కదా. ఎప్పుడు బయటకి వెళ్ళినా ఈ మనవరాలు తోడు లేకుండ వెళ్ళరు. మీ అత్తగారు సరేసరి. ఏవో పాటలు పద్యాలు దానితో చెప్పిస్తూనే ఉంటారు. ఇంక మీ ఆయనకి నువ్వు, నీ కూతురు రెండు ప్రాణాలు.దాన్ని హాయిగా ఇల్లంతా తిరిగి ఆడుకోనియ్యి. దామ్మా! నీలూ హాల్లో ఆడుకుందాం ! “ అని పాపకి చాక్లెట్లు అందించింది. పాప అవి పట్టుకుని బయటకి తుర్రుమంది.
   వాసవి కంగారు పడిపోయింది. పాపా ! నీలూ ! అంటూ పరుగెత్తబోయింది. రూప వాసవి చెయ్యి పట్టుకుని ఆపింది. “ఆగవే ! ఏమిటా కంగారు. ఆడుకోనియ్యి, మనం కాసేపు కబుర్లు చెప్పుకుందాం. అది ఇంట్లోనే ఉందిగా. తలుపులన్నీ వేసే ఉన్నాయి. మీ అత్తగారు కూడా హాల్లోనే ఉన్నారు. కూర్చో ! “ అని లాగి కూర్చోబెట్టింది. నీకు తెలియదు రూపా ! ఉండు పాపని తీసుకొచ్చేస్తాను ఆంటూ ఒకటే కంగారు పడుతూ ఏడ్చేస్తోంది.  ఏమయింది నీకు..? వాసవిని దగ్గరగా తీసుకుని అడిగింది రూప.
                                                               
                                                                 *********************** 

    “ నువ్వు రోజూ పేపరు చదవట్లేదా...? టి.వి. చూడట్లేదా...? ఆడపిల్లలకి ఎన్ని అనర్ధాలు జరుగుతున్నాయో..? నా పాపకి కూడా ఏమన్నా జరిగితే...నా పాపని నాకు ఎవరు తెచ్చి పెడతారు. ఎంత కష్టపడి కన్నాను నేను. ఎవరి బాధ వాళ్ళకే అర్ధమవుతుంది! “ గట్టిగా ఏడ్చేస్తూ వణికిపోతోంది వాసవి. రూప పాపని తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టి “ ఇంక ఆ ఏడుపు ఆపు. ఏమీ లేనిదానికి అంత ఘర్షణ పడుతున్నావెందుకు? ఇంట్లో ఉన్నది తండ్రి, తాతే కదా..! అంది రూప.
   అనర్ధాలు జరగడానికి  బయటవాళ్ళే కారణం కానక్కర్లేదు. తండ్రి కూడ కన్నపిల్లల మీద అత్యాచారం చెయ్యట్లేదా..? ఆత్రంగా నీలూని దగ్గరగా తీసుకుని కూర్చుంది వాసవి. “ ఆ పిల్లకి నిండా మూడేళ్ళు కూడా లేవు. ఇప్పుడే దాని గురించి బెంగ పడుతున్నావా...? “ ఆశ్చర్యపోయింది రూప. అల్లాగే అనిపిస్తుంది. నీకు ఇద్దరూ మగ పిల్లలే కదా... అర్ధం కాదులే ! “అంది వాసవి ఉక్రోషంగా. “ ప్రతి తండ్రిని, తాతని, అన్నని, తమ్ముణ్ణి కూడ అనుమానిస్తామా...? రూపకి వాసవి స్వభావం అయోమయంగా అనిపించింది.
   “ నీకు తెలియదు రూపా ! ఇప్పుడు చంటి పిల్ల, ముసలమ్మ అని కూడా లేదు ఆడపిల్ల అయితే చాలు. ఎన్ని వినట్లేదు,ఎన్ని చదవట్లేదు? తెల్లవారి లేస్తే టి.వి.లో చెప్తున్నవి ఇవే కదా...? ఇంట్లో ఉన్న ముసలివాళ్ళు, కని పెంచి పెద్ద చేసిన తండ్రులు, కలిసి ఆడుకుంటున్న పిల్లలు ఎవరు బ్రతకనిస్తున్నారు ఆడపిల్లని. నేను దీన్ని కనక పోయినా బాగుండేది. నాకు ఈ నిత్య ఘర్షణ తప్పేది. మొన్న మా పక్కింట్లో ఉన్నవాళ్ళ బంధువుల అమ్మాయి చిన్నపిల్లని వాళ్ళ తాతయ్య తీసికెళ్ళి పోయాడట. లోకం ఈ విధంగా తయారయిపోతే నేను తల్లిగా బాధపడక ఏంచెయ్యను?  దీన్ని ఎలా పెంచగలను ...రక్షించుకోవడం ఎలా..? ఈ ఆలోచన నన్ను నిద్ర పోనీయకుండా చేస్తోంది. నాకు ఏదయినా అయితే నీలూని ఎవరు చూస్తారు..? రూప చెయ్యి గట్టిగా పట్టుకుంది భయంతో.
   రూపకి అసలు విషయం అర్ధమయింది. “ చూడు వాసవీ  ! ఎక్కడో ఏదో జరిగిందని లోకమంతా అలాగే ఉందని నువ్వు అనుకోవడం పొరబాటు. ఎక్కడో సంస్కారహీనులు తప్ప అటువంటి పనులు ఎవరూ చెయ్యరు. కన్న తండ్రి ఒళ్ళో పిల్లలు పెరగద్దా ? తాతయ్యలు మనవరాళ్ళని ముద్దు చేస్తూ మంచి చెడు చెప్పి బ్రతకడం నేర్పించవద్దా? గురువులు పాఠాలు బోధించి సంస్కారవంతులుగా తీర్చి దిద్దవద్దా..? ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. నీ వంటి తల్లులు  పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటూ వాళ్ళని అన్ని విధాలా ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దాలి.
   అంతేగాని, ఇంత చిన్న పిల్లని గదిలో పెట్టి నిర్భంధించి దానికి జీవితమే లేకుండ చేస్తావా..! ఈ ఘర్షణతో నీకు ఏమయినా అయితే అది తల్లి లేని పిల్ల అవదా? ఆపద ఏ రూపంలో వస్తుందో...ఆపదలో నిలదొక్కుకోవడం ఎలాగో పిల్లలకి నేర్పాలి. అలాగే ఇతర పిల్లల్ని ఆపదల నుంచి కాపాడి అండగా ఉండడం నేర్పాలి. నువ్వు పిరికిగా ఉండి నీ పిల్లని ఇప్పట్నుంచే మతిలేని దానిగా పెంచకు. అయినా పేపర్లోను టి.విలోను ఇటువంటి విషయాలు తప్పించి నీకేమీ దొరకటం లేదా. మీ అమ్మలక్కలకి మాట్లాడుకోడానికి ఇంతకంటే మంచి మాటలు ఏవీ దొరకడం లేదా? ఎవరికయినా సమస్య వచ్చినప్పుడు అడ్డుకోండి గాని, పిల్లల్ని ఈ రకంగా హింసించకండి.
   ఎప్పుడో ఏదో జరుగుతుందేమోనని ఆలోచిస్తూ ఇప్పుడు నువ్వే దాన్ని హింస  పెడుతున్నావు. దాని బాల్యాన్ని మింగేసి అదే ప్రేమ అనుకుంటున్నావు. నువ్వు తలుపులు తియ్యగానే అది నాన్నమ్మ తాతయ్యల దగ్గరికి ఎలా పరుగెట్టిందో చూడు. నీ చదువు సంస్కారం ఉపయోగించి కొంచెం ఆలోచించు. ఒంటరిగా పెరిగిన పిల్లలకి, పెద్దవాళ్ళ మధ్య పెరిగిన పిల్లలకి ఎంతో వ్యత్యాసం కనబడుతుంది ! ఇలా తలుపులు మూసి గదిలో బంధించి ఎన్నాళ్ళు కాపాడతావు ? పిల్లలకి జీవితమంటే ఏమిటో తెలియ చెయ్యాలి. మంచి నడవడిక పద్ధతులు నేర్పించాలి. ప్రతి చిన్న విషయం తల్లితో సంప్రదించగలిగే స్వేచ్ఛని వాళ్ళకి అందించి...స్నేహితురాలిగా సలహాలు ఇవ్వాలి.     అంతేగాని ఆడపిల్లకి తండ్రిని, తాతని, పక్కింటివాళ్ళని అందర్నీ శత్రువులుగ వర్ణించి చెప్తే, ఇంకెవరితో కలిసి ఉంటుంది. సమస్యలు ఎవరికి చెప్పుకుంటుంది ? దాన్ని ఎవరు దగ్గర తీస్తారు. కొంతమంది సంస్కారం లేనివాళ్ళు ఏదో చేశారని, నీ సంస్కారం పక్కన పెట్టి పిచ్చిదానిలా ప్రవర్తించి నీ కూతుర్ని మతి లేని దానిలా పెంచకు !” కోపంగా అంది రూప.
   “అయితే నేను చెప్తున్నవన్నీ నిజం కాదంటావా...?” ఉక్రోషంగా అడిగింది వాసవి.
   “ నిజం కాదని నేను అనడం లేదు. పరిసరాల ప్రభావం, పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే స్నేహితులు, చదువు రాని తల్లితండ్రుల పెంపకం, ఇటు చదువు అటు ఉద్యోగము లేకపోవడం, మద్యపానం వంటి  అనేక కారణాలు మనిషిని సంస్కార హీనంగా మారుస్తాయి. చేస్తున్నది మంచా..? చెడా..? అనే విచక్షణా జ్ఞానం లేక చెడ్డ  పనులకు   ప్రేరేపించబడి చెడుగా ప్రవర్తిస్తున్నారు. ఎక్కడో ఒకటో అరో జరిగినదాన్ని ఉదాహరణగా తీసుకుని లోకం మొత్తం అలాగే ఉంది అనుకుంటే...నువ్వు కూడ అదే సమాజంలో ఉన్నావు కదా...? ఇప్పుడు పెద్దవాళ్ళని అనుమానించి వాళ్ళ మనసు  బాధ పెట్టి, చిన్న పిల్లని బంధించి నువ్వు చేస్తున్నది సంస్కారవంతమైన పనా...? నువ్వు సృష్టిస్తున్న సమస్యలతో ఇంట్లో అందరికీ మిగులుతున్నది నిత్య సంఘర్షణే !
   చదువుకున్న దానిగా సంస్కారవంతురాలిగా ఇటువంటి సమాజంలో బాధపడుతున్న తల్లులకి నీ వంతు సహకారం ఏమివ్వగలవో ఆలోచించి దానికోసం సంఘర్షణ పడు. నీతో పాటు ఎంతోమంది తల్లులు ప్రశాంతంగా జీవిస్తారు...! నీ కుటుంబాన్నా..నువ్వు జీవిస్తున్న సమజాన్నా... పనికిరాని నీ సంర్షణతో ఎవర్ని ఉద్ధరిస్తావు ? ముందు జాగ్రత్త అనేది మంచిదే ! కాని, దానికోసం రాబోయే కాలంలో ఆపద కలుగుతుందేమో అని ఇప్పుడే బాధ పెట్టడం ఎంతవరకు సబబో ఆలోచించు ! ”  వాసవి భుజం మీద చెయ్యేసి ధైర్యంగా ఉండమని చెప్పి ఆ కుటుంబ సభ్యులందరి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది రూప.
   వాసవి ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతత చూసి ఇంట్లో అందరూ ఊపిరి తీసుకున్నారు. రూప బయలు దేరడానికి తలుపులు తియ్యగానే ఆడుకోడానికి పక్కింటి పిల్లల దగ్గరికి పరుగెత్తి పోయింది సంఘర్షణ అంటే ఏమిటో తెలియని పసిపిల్ల నీలు.

  
  
                       

   

No comments:

Post a Comment