About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుదాం!


పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందుదాం!
  కార్తీకమాసం పరమేశ్వరుణ్ణి కొలిచే మాసం. సూర్యోదయానికి పూర్వమే లేచి శివ! శివ! అంటూ చన్నీటి స్నానం చేసి భక్తితో ధ్యానించే భక్తులకి భోళాశంకరుడు పలుకుతాడు. శివమహిమ చాలా గొప్పది. దాన్నిగురించి శ్రద్ధగా తెలుసుకుంటే సకల పాపాలకి కారణమైన భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది.
   పశువు, పాశుపతుల్ని గురించి తెలుసుకోగలగడమే జ్ఞానం. వేదవేద్యులు, సర్వజ్ఞులు అయిన బ్రహ్మజ్ఞులు దీన్ని గురించి చెప్పగలుగుతారు. అజ్ఞానం వల్ల కలిగే దు:ఖం విజ్ఞానంతో నశిస్తుంది.
   ఫలితాన్ని అనుభవించే వాడిని ’ ””పశువు  అంటారు. అతడికి జరిగినవి, జరగబోయేవి కనిపించవు. భార్య, పిల్లలు, సోదరులు, స్నేహితులు, బంధువులతో కలిసి ఉంటాడు. ఆకాశంలో మేఘాలతో కప్పబడిన చంద్రుడు ఎలా కనిపిస్తాడో అలాగే శరీరంతో కప్పబడి కనిపిస్తాడు. తరువాత కూడా పొందవలసిన జన్మలు ఎన్నో ఉంటాయి. చిరిగి పోయిన బట్టని వదిలి కొత్త బట్టని కట్టినట్టు ఒక శరీరాన్ని విడిచి పెట్టి, మరొక శరీరాన్ని పొందుతూ ఉంటాడు.
   అతడు ముక్తిని పొందే వరకు పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలాన్ని అనుభవిస్తూ... కొత్త కర్మలు చేస్తూ...మళ్ళీ ఆ జన్మలో చేసిన కర్మ ఫలాన్ని అనుభవించడానికి జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఇదంతా పరమేశ్వరుడి లీలే! దీన్ని గురించి ఆగమ శాస్త్రాలన్నింటిలోను చెప్పబడింది. చీమ మొదలు బ్రహ్మ వరకూ అందరూ పశువులే.
   ఫలితాన్ని ఇచ్చేవాడు  పాశుపతుడు.  అతడే పరమశివుడు  పరబ్రహ్మ’ !
   పరమేశ్వరుడు అనుగ్రహించిన శరీరాన్ని పొంది, పూర్వజన్మ కర్మల ప్రకారం ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటారు. పవిత్రమైన మనస్సుతో ఉండి శివానుగ్రహం పొందిన వాళ్ళు సంసారమనే సముద్రానికి దూరంగా ఉండి శివుడి గురించిన శాస్త్రధర్మాలన్నీ తెలుసుకుంటారు.
   శివుడి మీద మనస్సుని ఉంచి శివాలయాలకి వెడుతూ, శివలింగార్చన చేస్తూ, విభూతి రుద్రాక్షలు ధరిస్తూ, శివ భక్తులకి సంతర్పణలు చేస్తుంటారు. పంచాక్షరీ మంత్రాన్ని వదలకుండా జపిస్తారు. అన్నిజీవుల్లోను భగవంతుడు ఉన్నాడని తెలుసుకుని వాటియందు దయ కలిగి ఉంటారు. వైరాగ్య భావంతో జీవిస్తూ, బ్రతికి ఉండగానే ముక్తిని పొందుతారు. భక్తి ఉంటే చాలు నీటితో అభిషేకించినా శివుడు మనల్ని పాపాల నుంచి విముక్తుణ్ణి చేస్తాడు.
అటువంటి జీవనాన్ని సాగించేవాళ్ళు భగవంతుడితో సమానంగా పూజింప బడతారు. వాళ్ళకి పరమేశ్వరుడు వశుడై ఉంటాడు. అటువంటి వాళ్ళని పూజిస్తే పరమేశ్వరుణ్ణి పూజించినట్టే. జ్ఞానం కలిగి ఉండడమే మోక్షానికి సాధనం. జ్ఞానికి సాధ్యం కానిది ఏదీ లేదు. శివుడికి ఇష్టమైన కొన్ని వ్రతాల గురించి తెలుసుకుందాం...
 సోమవార వ్రతం
  సోమవార వ్రతం ఎంతో గొప్పది. కార్తీక మాసంలో సోమవారం తెల్లవారు జామున లేచి  శివనామ స్మరణతో స్నాన సంధ్యాదుల్నిపూర్తి  చేసుకుని శివాలయానికి వెళ్ళి యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూర్వం వసిష్ఠమహర్షి సోమవారవ్రతం చేసి అరుంతీ దేవిని భార్యగాను; విభుడు అనే రాజు సంతానాన్ని; సోమశర్మ అష్టైశ్వర్యాల్ని పొందారు. వజ్రబాహుడు అనే రాజు శత్రువుల్ని; కీచకుడు అనే రాజు మృత్యువుని జయించారు. వేదాంగుడు అనే బ్రాహ్మణుడు భార్యతో కలిసి కైలాసానికి చేరాడు. చంద్రుడు ఈ వ్రతం చేసి సోమత్వాన్ని పొంది సోముడు అనే పేరుతో పిలవబడి, ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళ కోరికలు తీరేటట్టు అనుగ్రహించమని వేడుకున్నాడు. ఈ వ్రతం చేస్తే పాపాలు నశించి ఇహలోకంలో సుఖాలు అనుభవించి చివరికి కైలాసానికి చేరతారు
ఆర్ద్రావ్రతం
   సూర్యుడు ఆరుద్రా నక్షత్రం ధనుర్లగ్నంలో ఉన్నరోజున ఉదయాన్నే లేచి స్నాన సంధ్యాదుల్ని చేసి శుచిగా చంద్రశేఖరుణ్ణి తలుచుకుంటూ శివాలయానికి వెళ్ళి ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించాలి. పూర్వం ముంచకేశుడు, విపులుడు అనే మహర్షులు, పతంజలి అనే యోగి, కర్కోటకుడు అనే నాగేంద్రుడు, మోక్షాన్ని పొందారు. వ్యాఘ్రపాదుడు అనే మహర్షి ఉపమన్యుణ్ణి కొడుకుగా పొందాడు. సాంబశివుడు జగత్తుని రక్షించడానికి రుద్ర నివాసంలో తాండవం చేసిన రోజు కనుక ఈ వ్రతం చాలా ఉత్తమమైందిగా చెప్పబడుతోంది.
ఉమామహేశ్వర వ్రతం   
   సూర్యుడు కర్కటరాశిలో ప్రవేశించిన తరువాత వచ్చే పూర్ణిమ రోజు ఉదయం ఉదయాన్నే శుచిగా స్నానం చేసి ఈ వ్రతాన్ని యథావిధిగా చెయ్యాలి. పుట్టుకతో గుడ్డివాడైన తృణబిందుడు విశాలమైన నేత్రాల్ని; ఒక వితంతువు తన భర్తని, ఒక కొడుకుని: శ్రీకృష్ణుడు కొడుకుల్ని; బ్రహ్మదేవుడు గాయత్రి సావిత్రి అనే కూతుళ్ళని; దేవేంద్రుడు జయంతుడు అనే కుమారుణ్ణి పొందారు. అలాగే అనేకమంది ఈ వ్రతాన్ని ఆచరించి తమ అభీష్టాల్ని తీర్చుకుని చివరికి శివసాయుజ్యాన్ని పొందారు.
శివరాత్రి వ్రతం
   మహాశివరాత్రి రోజు ఉదయాన్నే శివనామాన్ని జపిస్తూ లేచి స్నానసంధ్యాదుల్ని పూర్తిచేసుకుని జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివుణ్ణి ఆరాధించాలి. రాత్రంతా నిద్రపోకుండా జాగరణ చెయ్యాలి.   ఈ శివరాత్రి వ్రతాన్ని బ్రహ్మ, ఇంద్రుడు, విష్ణువు ఆచరించి గొప్ప గొప్ప పదవుల్ని; కొంతమంది బృందారకులు గణాధిపత్యాన్ని; కుబేరుడు ధనాన్ని; వరుణుడు, వాయువులు గొప్ప బలాన్ని; బ్రాహ్మణులు అనేకమంది చావుపుట్టుకలు లేని శివసాయుజ్యాన్ని పొందారు. కల్మాషపాదుడు అనే మహారాజు  బహ్మహత్యా పాతకాన్నిపోగొట్టుకుని, మోక్షాన్ని పొందాడు. శివరాత్రి వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు అందరూ మోక్షాన్ని పొందుతారు.
కేదారేశ్వర వ్రతం
   ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ అష్టమిరోజు ఈ వ్రతాన్ని ప్రారంభించి ఇరవై ఒక్క రోజులు ఏకాగ్రతతో మనస్సులో పరమేశ్వరుణ్ణి ధ్యానించి మరుసటి రోజు సూర్యోదయాన్నే నదీప్రవాహంలో స్నానం చేసి సంధ్యానుష్ఠానం పూర్తి చేసుకుని శాస్త్రోక్తంగా కేదారేశ్వర వ్రతం చెయ్యాలి. పూర్వం ఉమాదేవి తనకు కావలసిన వరాల్ని; హృషీకేశుడు వైకుంఠానికి ఆధిపత్యాన్ని; బ్రహ్మ హంస వాహనాన్ని; దిక్పాలకులు శత్రువులమీద విజయాన్ని పొందారు.  సప్త మహా ఋషులు బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకున్నారు. పుణ్యవతి అనే ఒక వనిత శాశ్వత భోగభాగ్యాల్ని పొందింది.
కళ్యాణ సుందరీ వ్రతం
   సూర్యుడు మీనలగ్నంలో ప్రవేశించినప్పుడు శుక్ల పక్షం ఉత్తరా నక్షత్రం రోజు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పూర్వం  విష్ణుమూర్తి లక్ష్మీదేవిని; బ్రహ్మ సరస్వతిని; ఇంద్రుడు శచీదేవిని; చంద్రుడు ఇరవై ఏడుమంది భార్యల్ని; అగస్త్యుడు లోపాముద్రని పొందారు. హరి కుమార్తెలు సౌందర్యవల్లి, అమృతవల్లి వల్లి, దేవసేనలై పుట్టి జగదంబ కుమారుడైన షణ్ముఖుణ్ణి; వేదాంగుడు అనే బ్రాహ్మణుడి కుమార్తె కేశిని నందికేశ్వరుణ్ణి ; సత్యపూర్ణుడు అనే మహర్షి కళ్ళనుండి పుట్టిన పుష్కరిణి, పూర్ణ అనే కుమార్తెలు కాలభైరవుణ్ణి వివాహం చేసుకుని తమకు ఇష్టమైన వాళ్ళని భర్తలుగా పొందారు.
శూలవ్రతం
   ఆదిత్యుడు అమావాస్యనాడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఈ శూలవ్రతాన్ని ఆచరించి మోక్షాన్ని పొందవచ్చు.
  విష్ణువు కాలనేమిని; పరశురాముడు కార్తవీర్యుణ్ణి సంహరించారు. సుశర్ముడు మృత్యువుని జయించాడు. మేఘాంగుడు అనే రాజు పిల్లలు, మనుమలతో సంతోషంగా జీవించాడు.
 వృషభ వ్రతం
   భానుడు వృషభరాశిలో ప్రవేశించిన మాసంలో శుద్ధాష్టమి రోజు ఈ వ్రతం ఆచరించాలి.ఈ విధంగా వృషభ వ్రతం ఆచరించినవాళ్ళు పూర్ణాయుర్దాయాన్ని, ఐశ్వర్యాన్ని; విద్యల్లో ప్రావీణ్యాన్ని; పుత్రులు మిత్రులు కళత్రము, బంధువులతో ఆనందాన్ని పొందుతారు. ముకుందుడు గరుడవాహనాన్ని; ఇంద్రుడు ఐరావతాన్ని; అగ్ని మేషవాహనాన్ని; యముడు సైరభాన్ని; నైరృతి నరవాహనాన్ని; వరుణుడు మకర వాహనాన్ని; వాయుదేవుడు లేడిని; కుబేరుడు పుష్పకాన్ని; ఈశానుడు మహోక్షాన్ని; సూర్యుడు ఏకచక్ర సప్తాశ్వరథాన్ని; చంద్రుడు మణులతో పొదగబడిన బంగారు విమానాన్ని;   విశ్వసేనుడు అనే రాజు ఆగత అనాగత జ్ఞానశక్తిని; మహర్షులు ఎంతోమంది అష్టసిద్ధుల్ని పొందారు. విధృతుడు అనే మహారాజు సిద్ధిని పొంది బ్రహ్మ ఇంద్ర లోకాల్నిసప్తతాళాల మీద ఎక్కి విహరించాడు.
   ఇప్పటి వరకు చెప్పుకున్న శివ వ్రతాల్ని శరద్ధాభక్తులతో ఆచరిస్తే ఇహలోకంలో సుఖసంతోషాలు, చివరికి జన్మరాహిత్యాన్ని పొందుతారు. అదే రోజు చెయ్యడానికి మనకు అవకాశం లేనప్పుడు భక్తితో కార్తీక మాసంలో ఏ రోజు మనకు అనుకూలంగా ఉంటుందో అదే రోజు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే శంకరుడు మన కోరికలు తీరుస్తాడు.
   కార్తీకమాసం శివవకేశవులు ఇద్దరినీ పూజించి వారి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఏ దేవాలయం దగ్గర చూసినా పరమేశ్వరుడికి అభిషేకాలు, వేదమంత్రాలు, ఆకాశదీపాలు, ఏ స్నానఘట్టం దగ్గర చూసినా నదిలో నడిచే అవునెయ్యి దీపాలు, ఈ ఇంట చూసినా ఉపవాసాలు జాగరణలు, ఎక్కడ చూసినా దానాలు ధర్మాలు అడుగడుగునా పవిత్రత సంతరించుకు అందరి మనస్సుల్ని భక్తిపారవశ్యంలో ఓలలాడిస్తుంది ఈ కార్తీకమాసం. పుణ్యము, మోక్షము, ఆరోగ్యము ఇచ్చే ఈ కార్తీకమాసంలో అందరికీ పరమేశ్వరుడి ఆశీస్సులు లభించాలని కోరుకుంటూ...

No comments:

Post a Comment